
భారతీయ సినీ పరిశ్రమపై చెరగని ముద్ర వేసి తనకంటూ ఒక శైలిని ఏర్పరచుకుని తన సినిమాలతో ప్రేక్షకులను అలరించిన కళాబిపాసి, దర్శకుడిగా, నటుడిగా, రచయితగా ఉన్నతమైన స్థానాన్ని అధిరోహించారు కె. విశ్వనాథ్ గారు. 1930వ సంవత్సరం ఫిబ్రవరి 19న గుంటూరు జిల్లాలో కాశినాధుని సుబ్రహ్మణ్యం, సరస్వతి దంపతులకు జన్మించారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం నుండి బి.ఎస్సిలో డిగ్రీ పట్టా పొందారు. మద్రాస్ లోని వాహిని స్టూడియోస్ లో సౌండ్ రికార్దిస్ట్ గా చేరారు. అలా అక్కడ నుండి ఆదుర్తి సుబ్బారావు గారితో పనిచేసారు. ఆదుర్తి గారు తీసిన కొన్ని సినిమాలకు ఆయన కథా కథనాలను అందించారు. 1965లో మెగా ఫోన్ చేతబట్టి ‘ఆత్మగౌరవం’ సినిమాతో దర్శకుడిగా తొలి అడుగు వేశారు. ఆ తర్వాత ప్రైవేట్ మాస్టర్, సుడిగుండాలు, నిండు హృదయాలు, చెల్లెలి కాపురం, నేరము శిక్ష, ఓ సీత కథ, జీవన జ్యోతి, సిరిసిరిమువ్వ, శంకరాభరణం, సప్తపది, శుభలేఖ, సాగర సంగమం, స్వాతిముత్యం, సిరివెన్నెల, శృతిలయలు, స్వయంకృషి, స్వర్ణకమలం, ఆపద్భాంధవుడు, స్వాతి కిరణం, శుభ సంకల్పం లాంటి గొప్ప చిత్రాలను తెరకెక్కించారు. దర్శకుడిగానే కాకుండా నటుడిగా కూడా ఆయన తన మార్క్ ను వేశారు. ప్రముఖ ఛాయాగ్రాహకుడు పి.సి శ్రీ రామ్ తెరకెక్కించిన ‘ద్రోహి’ చిత్రంలో ఆయన వేసిన పాత్ర ప్రత్యేకమైంది. భాషతో సంబంధం లేకుండా ఆయన సినిమాలు చేసారు. దక్షిణాదినే కాకుండా హిందీలో కూడా ఆయన సినిమాలు తెరకెక్కించారు. సర్గం, కాంచోర్, శుభ్ కామ్నా, జాగ్ ఉతా ఇన్సాన్, సంజోగ్, ఈశ్వర్, సంగీత్, ధన్వాన్, ఔరత్ ఔరత్ ఔరత్ తదితర చిత్రాలను తెరకెక్కించారు. ఆయన్ను కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీతో గౌరవించింది. ఆడియోగ్రాఫర్ గా మొదలై దర్శకుడిగా, నటుడిగా ఆయన ప్రయాణం నేటి తరానికి ఆదర్శప్రాయం. ఆయన ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని కోరుకుంటూ జన్మదిన సుభాకాంక్షలు తెలియజేస్తోంది మీడియా9.