
లాక్ డౌన్ ఎత్తివేసిన తర్వాత థియేటర్లు తెరవచ్చు అని ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చినప్పటికీ పరిస్థితులకి భయపడి ఎవరూ ముందుకి రాలేదు. అయితే కొందరు నిర్మాతలు ధైర్యం చేసి గత వారం తమ సినిమాలను రిలీజ్ చేసారు. అయితే ఇప్పటి వరకు రిలీజ్ అయిన సినిమాలేవీ సక్సస్ అవ్వలేదు. ఫలితాలు ఎలా ఉన్నా అది మాత్రం డేరింగ్ స్టెప్ అన్న విషయం తెలిసిందే. ఇప్పుడు పెద్ద నిర్మాతలు కూడా ధైర్యం చేసి తమ సినిమాలను రిలీజ్ చేసేందుకు ముందుకు వస్తున్నారు.

తన స్టైల్ తో, యాటిట్యూడ్ తో తనకంటూ సొంత గుర్తింపుని సొంతం చేసుకున్న యంగ్ హీరో, విశ్వక్ సేన్. ఆయన నటించిన పాగల్ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ప్రమిఖ నిర్మాత దిల్ రాజు సమర్పణలో బెక్కం వేణుగోపాల్ ఈ చిత్రాన్ని నిర్మించారు. డెబ్యూ డైరెక్టర్ నరేష్ కుప్పిలి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.

ప్రామిసింగ్ హీరోగా సొంత ఫాలోయింగ్ ని ఏర్పరచుకుని సక్సస్ ట్రాక్ లో పయనిస్తున్నాడు విశ్వక్. టాలివుడ్ లో సూపర్ సక్సస్ రికార్డ్ ఉన్న నిర్మాత దిల్ రాజు. ఆయన బ్యానర్ లో విశ్వక్ సినిమా చేస్తుండటంతో మొదటి నుంచి ఈ సినిమాకి మంచి హైప్ క్రియేట్ అయ్యింది. గత ఏడాదే ఈ చిత్రం ప్రారంభమైనప్పటికీ కరోన లాక్ డౌన్ వల్ల షూటింగ్ లేట్ గా పూర్తవగా, సెకండ్ వేవ్ వల్ల రిలీజ్ వాయిదా పడింది.

ఈ నేపథ్యంలో విశ్వక్ హీరోగా నటించిన పాగల్ చిత్రాన్ని ఈ నెల 14న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. విశ్వక్ సేన్, నివేథ పేతురాజ్, సిమ్రాన్ చౌదరి, రాహుల్ రామకృష్ణ తదితరులు ఈ చిత్రంలో నటించారు. లాక్ డౌన్ తర్వాత రిలీజ్ అవుతున్న పెద్ద సినిమా ఇదే అవడం వల్ల ప్రేక్షకులు తప్పకుండా థియేటర్లకు వస్తారని విశ్లేషకులు చెబుతున్నారు. అదే నిజమై పాగల్ హిట్ అయ్యి ఇండస్ట్రీకి పూర్వ వైభవం రావాలని కోరుకుందాం.