
కరోన కారణంగా గతేడాది సినీ పరిశ్రమ మొత్తం స్తంభించింది. ఎక్కడి సినిమాలు అక్కడే ఆగిపోయాయి. ఎంతోమంది సినీ కార్మికులు ఉపాధి లేక రోడ్డున పడాల్సిన పరిస్థితి వచ్చింది. సినిమాలు ఆగిపోయి ఎందఱో నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు నష్టపోయారు. థియేటర్లు డిసెంబర్ లో కాని ఓపెన్ అవలేదు. ఈ ఏడాది కూడా కరోన సెకండ్ వేవ్ రూపంలో పరిశ్రమకి కొంత నష్టాన్ని తెచ్చిపెట్టింది. అయితే గతేడాది లాగా కాకుండా ఈసారి షూటింగ్స్ మొదలైపోయాయి.

ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ లో యువ కథానాయకుడు నాగ శౌర్య, రీతువర్మ జంటగా నూతన దర్శకురాలు లక్ష్మీ సౌజన్య రూపొందిస్తున్న కుటుంబ కథా చిత్రం ‘వరుడు కావలెను‘. ఈ చిత్రం చివరి షెడ్యూల్ హైదరాబాద్ లో పునః ప్రారంభమైంది. మెయిన్ లీడ్స్ అయిన నాగ శౌర్య, రీతువర్మ’ లపై ఓ పాటని శేఖర్ మాస్టర్ నేతృత్వంలో దర్శకురాలు లక్ష్మీ సౌజన్య చిత్రీకరిస్తున్నారు. ఈ పాటతో పాటు మరికొన్ని సన్నివేశాల చిత్రీకరణతో త్వరలోనే చిత్ర షూటింగ్ పూర్తవుతుంది.

వరుడు కావలెను చిత్ర కథ, కథనం, మాటలు, పాటలు, సన్నివేశాలు, భావోద్వేగాలు, నటీ నటుల అభినయాలు అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తాయి అన్న నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు చిత్ర దర్శక నిర్మాతలు. నాగశౌర్య, రీతువర్మ నాయకా,నాయికలు కాగా నదియా, మురళీశర్మ, వెన్నెలకిషార్, ప్రవీణ్, అనంత్, కిరీటి దామరాజు, రంగస్థలం మహేష్, అర్జున్ కళ్యాణ్, వైష్ణవి చైతన్య, సిద్దిక్ష ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు