లోక నాయకుడు కమల్ హాసన్

నటించడం వేరు.. అది చాలా మంది చేయగలరు. నటనలో జీవించడం వేరు... అది చాలా కొద్దిమంది మాత్రమే చేయగలరు. కానీ ఏ పాత్ర అయినా కానీ అందులోనే ఒదిగిపోయి, ఆ పాత్ర తనకోసమే పుట్టిందేమో అనే తరహాలో నటించడం యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ వంటి వారికే సాధ్యం. ఒక మనిషి ఇన్ని రకాల పాత్రలు చేయగలడా అన్న తరహాలో అందరినీ ఔరా అనిపించిన కమల్ హాసన్ గురించి చెప్పడానికి అక్షరాలు కూడా సరిపోవేమో. ఎన్ని చిత్రాలు, ఎన్ని పాత్రలు.. ఒకదాన్ని మించి ఒకటి.... ఎవరెస్ట్ శిఖరం వంటి నటనాశిఖరాన్ని అధిరోహించి ధృడంగా నిలబడ్డాడు కమల్ హాసన్. అంత అద్భుతమైన సినీ కెరీర్ ఉన్న కమల్ హాసన్ బాల్యం నుండి ఆయన జీవితం ఎలా సాగింది, అసలు సినీ కెరీర్ ఎలా మొదలైంది. ఆయన చవిచూసిన ఎత్తుపల్లాలు ఏంటి అన్నది ఇప్పుడు చూద్దాం.

నవంబర్ 7, 1954న తమిళ అయ్యంగార్ కుటుంబంలో జన్మించాడు కమల్ హాసన్. ఆయన తండ్రి డి శ్రీనివాసన్, ఒక లాయర్ మరియు స్వాతంత్ర సమరయోధుడు. ఆయన తల్లి రాజలక్ష్మి హౌస్ వైఫ్. కమల్ హాసన్ కు మొదటగా పార్థసారథి అని పేరు పెట్టారు కానీ ఆయన తండ్రి తర్వాత కమల్ హాసన్ గా పేరు మార్చారు. కమల్ కుటుంబానికి అంతా కళలపై మక్కువ ఎక్కువ. కమల్ హాసన్ అన్నయ్యలు చారుహాసన్ (1930లో జన్మించారు), చంద్రహాసన్ (1936లో జన్మించారు) కూడా సినిమాల్లో నటించారు. సిస్టర్ నళిని (1946లో జన్మించారు) క్లాసికల్ డ్యాన్సర్. కమల్ హాసన్ తన ప్రాధమిక విద్యను పరమకుడిలో చదువుకున్నారు. అయితే అక్కడ నుండి తన అన్నయ్యల చదువు కారణంగా మద్రాస్ కు వెళ్లారు. కమల్ తన చదువును శాంతోమ్, మద్రాస్ లో కొనసాగించారు. అక్కడ ఆయనకు సినిమా, లలిత కళల పట్ల ఆసక్తి కలిగింది. ఆయన తండ్రి శ్రీనివాసన్ కూడా బాగా ప్రోత్సహించడంతో కమల్ ఆ వైపుగా అడుగులు వేశారు.

కమల్ తల్లి స్నేహితురాలైన ఒక డాక్టర్ ఆమెతో పాటు కమల్ ను ఏవి మెరియప్పన్ ఇంటికి ఆయన భార్యను ట్రీట్ చేయడానికి తీసుకెళ్లగా అక్కడ కమల్ ను చూసిన ఏవిఎం కొడుకు ఎం. శరవణన్ వాళ్ళ నిర్మాణంలో తెరకెక్కుతోన్న కళత్తూర్ కన్నమ్మకు రికమెండ్ చేసారు. కమల్ హాసన్ తన నాలుగో ఏటే కళత్తూర్ కన్నమ్మలో పెర్ఫార్మన్స్ కు గాను రాష్ట్రపతి అవార్డ్ ను గెలుచుకున్నాడు. అలాగే చిన్నపిల్లాడిగా మరో ఐదు సినిమాలు చేసాడు. 1962లో కణ్ణుమ్ కరళుమ్ చిత్రం ద్వారా మలయాళ సినీ ఇండస్ట్రీలో అరంగేట్రం చేసాడు. ఆ తర్వాత ట్రిప్లికేన్ లో హిందూ హయ్యర్ సెకండరీ స్కూల్ లో తన విద్యను కొనసాగించాడు.

సినీ కెరీర్

కమల్ హాసన్ 70వ దశకంలో పూర్తి స్థాయిలో సినిమాల్లోకి వచ్చాడని చెప్పొచ్చు. దాదాపుగా ఏడేళ్ల విరామం తర్వాత కమల్ హాసన్ ఇండస్ట్రీలోకి తిరిగి వచ్చాడు. డాన్స్ అసిస్టెంట్ గా, కొరియోగ్రాఫర్ తఙ్కప్పన్ వద్ద అప్రెంటిస్ గా చేసాడు. ఈ కాలంలోనే కొన్ని క్యామియో పాత్రల్లో నటించాడు. 1970 మానవన్ చిత్రంలోని ఒక సాంగ్ లో మొదటగా కనిపించాడు. ఆ తర్వాత తఙ్కప్పన్ కు అసిస్టెంట్ గా అన్నై వెలంకని (1971), కసి యథైరయ్ (1973) వంటి చిత్రాలకు పనిచేసాడు. అన్నై వెలంకని చిత్రానికి అసిస్టెంట్ డైరెక్టర్ గా కూడా వర్క్ చేయడంతో పాటు చిన్న సహాయక పాత్రలో కనిపించాడు. అయితే కె బాలచందర్ అరంగేట్రం (1973) చిత్రంలో మొదటిసారి పూర్తి స్థాయిలో నటించాడు. ఆ తర్వాత అదే ఏడాది సొల్లతాన్ నినైక్కిఱేన్ చిత్రంలో విలన్ గా తీసుకున్నాడు బాలచందర్.

ఇక ఆ తర్వాత సహాయక పాత్రల్లో కొనసాగాడు కమల్ హాసన్. 1974లో విడుదలైన గుమాస్తవిన్ మగళ్, అదే ఏడాది వేసిన అవళ్ ఓరు తొడర్ కథై, నాన్ అవనీళ్ళై చిత్రాల్లో నటించాడు. 1974లోనే మలయాళంలో తొలిసారి హీరోగా నటించాడు, కన్యాకుమారి చిత్రంలో తొలిసారి హీరోగా నటించగా దానికి ఫిల్మ్ ఫేర్ పురస్కారం సైతం లభించింది. తమిళ సినిమాల్లో బాలచందర్ దర్శకత్వంలో రూపొందిన అపూర్వ రాగంగాళ్ చిత్రం ద్వారా తొలి బ్రేక్ ను అందుకున్నాడు. ఈ పాత్ర కోసం మృదంగం వాయించడం కూడా నేర్చుకున్నాడు. ఈ సినిమాలో తన పాత్రకు రెండో ఫిల్మ్ ఫేర్ అవార్డును దక్కించుకున్నాడు. అపూర్వ రాగంగళ్ చిత్రమే సూపర్ స్టార్ రజినీకాంత్ కు తొలి చిత్రం. 1976లో బాలచందర్ దర్శకత్వంలోనే మన్మథ లీలై చిత్రంలో నటించాడు కమల్ హాసన్. ముందు ఈ సినిమా బూతు చిత్రం అంటూ కొన్ని కామెంట్స్ పడినా కానీ తర్వాతి కాలంలో కల్ట్ స్టేటస్ సంపాదించుకుంది. ఆ తర్వాత ఒరు ఊదప్పు కన్ సిమిత్తుగీరధు చేసాడు కమల్. ఎస్పీ ముత్తురామన్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం ద్వారా తన కెరీర్ లో మూడో ఫిల్మ్ ఫేర్ అవార్డును దక్కించుకున్నాడు. ఆ తర్వాత మరోసారి బాలచందర్ దర్శకత్వంలో మూండ్రు ముడిచ్చు చిత్రంలో నటించాడు. తెలుగులో సూపర్ హిట్ గా నిలిచిన ఓ సీత కథ చిత్రానికి ఇది రీమేక్ గా తెరకెక్కింది. మలయాళ వెర్షన్ లో కమల్ హాసన్ విలన్ గా నటించగా, తమిళ్ వెర్షన్ లో రజినీకాంత్ విలన్ గా కనిపించాడు. ఈ సినిమానే అందాల తార శ్రీదేవి కెరీర్ లో తొలి అడల్ట్ రోల్. అప్పటికి ఆమె వయసు 13.

కమల్ హాసన్, బాలచందర్ కాంబినేషన్ లో కొన్ని అద్భుతమైన చిత్రాలు వచ్చాయి. ఆ కోవలో చెందిందే అవర్గళ్ అనే చిత్రం. సుజాత, కమల్ హాసన్, రజినీకాంత్ ప్రధాన పాత్రల్లో రూపొందిన ఈ చిత్రం సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమా కోసం కమల్ హాసన్ వెంట్రిలాక్విజం నేర్చుకున్నాడు. ఇదే చిత్రం 1979లో తెలుగులో ఇది కథ కాదు పేరుతో రీమేక్ అయింది. తమిళ్ లో కమల్ పోషించిన పాత్రనే మరోసారి తెలుగులో పోషించాడు. రజినీకాంత్ పాత్రను చిరంజీవి పోషించగా కీలకమైన సుజాత పాత్రను జయసుధ పోషించింది. 1977లోనే భారతీరాజా దర్శకత్వంలో రూపొందిన 16 వయానిధీలే చిత్రంలో ఛాలెంజింగ్ రోల్ ను చేసాడు కమల్ హాసన్. ఈ చిత్రంలో తన నటనకు గాను వరసగా నాలుగో ఉత్తమ నటుడు అవార్డును సైతం గెల్చుకున్నాడు. ఈ చిత్రం తెలుగులో పదహారేళ్ళ వయసు పేరుతో రీమేక్ అయింది. 1977 సంవత్సరంలోనే కమల్ హాసన్ కన్నడ ఇండస్ట్రీలో డెబ్యూ చేసాడు. తన స్నేహితుడు, మెంటర్ బాలు మహేంద్ర దర్శకత్వంలో రూపొందిన కోకిల చిత్రంలో నటించాడు. అదే ఏడాది బెంగాలీ చిత్రం కబితలో కూడా నటించాడు కమల్. ఈ చిత్రం తమిళ సినిమా అవళ్ ఒరు తోడర్ కథై చిత్రానికి రీమేక్ గా తెరకెక్కింది.

ఆ తర్వాతి సంవత్సరం అంటే 1978లో తెలుగు చిత్రంలో తొలిసారి హీరోగా నటించాడు. తన గురువు బాలచందర్ దర్శకత్వంలో రూపొందిన మరో చరిత్ర చిత్రంలో నటించాడు కమల్ హాసన్. ఈ చిత్రం ఎంతటి కల్ట్ స్టేటస్ సంపాదించింది అన్నది తెల్సిందే. ఇప్పటికీ ప్రేమ కథ అనగానే ముందుగా మరో చరిత్ర గుర్తొస్తుంది అంటే అతిశయోక్తి కాదు. మొదటి నుండీ నెగటివ్ రోల్స్ పట్ల కూడా ఆసక్తిని కనబరిచే కమల్ హాసన్ భారతీరాజా దర్శకత్వంలో వచ్చిన సిగప్పు రోజక్కల్ చిత్రంలో సైకో కిల్లర్ పాత్రలో నటించాడు. అమ్మాయిలను ట్రాప్ చేసి వాళ్ళను చంపేసే పాత్రలో అందరినీ మెప్పించాడు. ఈ సినిమా తెలుగులో ఎర్ర గులాబీలు పేరుతో రీమేక్ అయింది. ఈ చిత్రంలో నటనకు గాను ఐదో ఫిల్మ్ ఫేర్ అవార్డును దక్కించుకున్నాడు. మలయాళ సినిమా ఈటలో నటించిన కమల్ హాసన్ ఆరో ఫిల్మ్ ఫేర్ అవార్డును దక్కించుకున్నాడు.

1979లో మరోసారి తెలుగు చిత్రంలో నటించాడు. సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో సొమ్మొకడిది సోకొకడిది చిత్రంలో కమల్ హాసన్ డ్యూయల్ రోల్స్ లో కనిపించాడు. అదే ఏడాది కమల్ హాసన్ నినైత్తలే ఇనిక్కుమ్ చిత్రంలో నటించాడు. బాలచందర్ దర్శకత్వంలోనే ఈ సినిమా రూపొందింది. మరో లీడ్ పాత్రలో రజినీకాంత్ నటించాడు. ఈ చిత్రాన్ని తెలుగులో కూడా సమాంతరంగా షూటింగ్ చేసారు. అందమైన అనుభవం పేరుతో తెలుగులో విడుదలైంది. ఇప్పటికీ యువతను ఊపేసే "కుర్రళ్లోయ్ కుర్రాళ్ళు" పాట ఈ చిత్రం లోనిదే. 1979లో కామల్ హాసన్ మరిన్ని చిత్రాలు చేసాడు. అందులో నీయా?, కల్యాణ రామన్, మంగళ వాథియం, నీల మాలార్గళ కొన్ని. వీటితో పాటు గెస్ట్ పాత్రల్లో కూడా మెరిశాడు కమల్. 70వ దశకం ముగిసేసరికి కమల్ హాసన్ తన ప్రతిభను నిరూపించుకున్నాడు. అప్పటికే ఆరు ప్రాంతీయ ఉత్తమ నటుడి ఫిల్మ్ ఫేర్ అవార్డులను సొంతం చేసుకున్నాడు. అలాగే ఉత్తమ తమిళ నటుడి అవార్డ్స్ ను వరసగా నాలుగు సొంతం చేసుకున్నాడు కమల్ హాసన్.

ఇక 80వ దశకంలో కూడా కమల్ హాసన్ నటుడిగా మరింత ఉన్నత స్థితికి చేరుకున్నాడు. 1980వ సంవత్సరంలో కమల్ హాసన్ నటించిన ఆరు సినిమాలు విడుదలయ్యాయి. ఉల్లాస పఱవైగళ్, నక్షత్రం, గురు, వరుమాయిన్ నీరం శివప్పు, మరియా, మై డార్లింగ్, శరణం అయ్యప్ప చిత్రాల్లో నటించాడు కమల్. ఇందులో వరుమాయిన్ నీరం శివప్పు కమల్ హాసన్ కెరీర్ లోనే ఉత్తమ చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. మరోసారి బాలచందర్ దర్శకత్వంలో సినిమా చేసాడు కమల్ హాసన్. ఈ చిత్రం తెలుగులో కూడా సమాంతరంగా రూపొందింది. ఆ సినిమా పేరే ఆకలి రాజ్యం. ఉద్యోగం రాని యువతగా కమల్ హాసన్ నటనకు హ్యాట్సాఫ్ చెప్పకుండా ఉండలేం. అయితే ఆకలి రాజ్యం 1981వ సంవత్సరంలో అంటే వచ్చే ఏడాది విడుదలైంది. ఈ చిత్రం ద్వారా తొలి తెలుగు ఫిల్మ్ ఫేర్ అవార్డును గెలుచుకున్నాడు.

1973లో హిందీలో సూపర్ హిట్ గా నిలిచిన జుగ్ను సినిమాను తమిళ్ లో గురు పేరుతో రీమేక్ చేసారు. ఈ సినిమాను ఐవి శశి డైరెక్ట్ చేసాడు. కమల్ కు జోడిగా శ్రీదేవి నటించింది. అప్పటికే కమల్, శ్రీదేవి జోడి హిట్ పెయిర్ అనిపించుకుంది. 1980 జులైలో విడుదలైన ఈ చిత్రం పాజిటివ్ రివ్యూలను దక్కించుకుని బాక్స్ ఆఫీస్ వద్ద 365 రోజుల పాటు ఆడింది.  1981వ సంవత్సరంలో కమల్ హాసన్ తన తొలి హిందీ చిత్రం చేసాడు. తెలుగులో ఒక ఐకానిక్ సినిమాగా నిలిచిన మరో చరిత్ర చిత్రాన్ని ఏక్ దూజే కే లియే పేరుతో రీమేక్ చేయగా అక్కడ కూడా సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది. 1981లోనే కమల్ హాసన్ తన 100వ చిత్రాన్ని చేసాడు. కమల్ హాసన్ నటించిన 100వ చిత్రం రాజ పార్వై ద్వారా కమల్ హాసన్ నిర్మాతగా కూడా అరంగేట్రం చేసాడు. ఈ సినిమా ప్లాప్ అయినా కానీ కమల్ హాసన్ పెర్ఫార్మన్స్ కు ఫిల్మ్ ఫేర్ అవార్డు వరించింది.

1982లో బాలు మహేంద్ర దర్శకత్వంలో చేసిన మూండ్రం పిఱై చిత్రం కమల్ హాసన్ కు ఏకంగా నేషనల్ అవార్డును తెచ్చిపెట్టింది. ఈ చిత్రంలో మరోసారి శ్రీదేవితో జతకట్టాడు కమల్ హాసన్. ఈ చిత్రం తెలుగులో వసంత కోకిల పేరుతో డబ్ అయింది. మళ్ళీ కమల్ హాసన్, శ్రీదేవి ఇదే చిత్రాన్ని హిందీలో సద్మా టైటిల్ గా రీమేక్ చేసారు. ఈ కాలంలో కమల్ ఎక్కువగా తన తమిళ చిత్రాలను హిందీలో రీమేక్ చేసాడు. యే తో కమాల్ హో గయా, జరా సా జిందగీ, సద్మా తర్వాత కమల్ కు వరసగా హిందీలో అవకాశాలు రావడం మొదలెట్టాయి. 1984లో ఒక్క తమిళ్ చిత్రం తప్ప మిగతావన్నీ హిందీ సినిమాలే చేసాడు. యే దేశ్, ఏక్ నయి పహేలీ, రాజ్ తిలక్, యాద్ గర్, కరిష్మా చిత్రాలు చేసాడు కమల్ హాసన్. 1983లో కమల్ హాసన్ చేసిన తెలుగు చిత్రం సాగరసంగమం బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. కె విశ్వనాథ్ దర్శకత్వంలో క్లాసికల్ డ్యాన్స్ బ్యాక్ డ్రాప్ లో రూపొందిన ఈ చిత్రం టాలీవుడ్ ఉత్తమ చిత్రాల్లో ఒకటిగా ఎప్పటికీ నిలిచే ఉంటుంది. ఈ చిత్రంలో నటనకు గాను ఉత్తమ నటుడిగా నంది పురస్కారం, ఫిల్మ్ ఫేర్ తెలుగు అవార్డు వరించాయి.

రాజ్ తిలక్ అనే బాలీవుడ్ చిత్రంలో రాజ్ కుమార్, సునీల్ దత్, ధర్మేంద్ర, హేమ మాలిని వంటి టాప్ నటులతో స్క్రీన్ షేర్ చేసుకున్నాడు కమల్. ఆ తర్వాత వచ్చిన సాగర్ చిత్రంతో ఫిల్మ్ ఫేర్ ఉత్తమ నటుడి అవార్డును గెలుచుకున్నాడు. ఈ చిత్రం ఇండియా తరుపు నుండి ఆస్కార్స్ బరిలో ఉత్తమ విదేశీ భాషా చిత్రంగా నిలిచింది. గెరాఫ్టర్, దేఖా ప్యార్ హుమ్హారా చిత్రాల తర్వాత కమల్ హాసన్ బాలీవుడ్ లో సినిమాలకు దాదాపు ఫుల్ స్టాప్ పెట్టేసాడు. 1986లో విక్రమ్ చిత్రాన్ని నిర్మించిన కమల్, కోదండరామిరెడ్డి దర్శకత్వంలో ఒక రాధా ఇద్దరు కృష్ణులు చిత్రంలో నటించాడు. ఈ సినిమాలో డ్యూయల్ రోల్ ను పోషించాడు కమల్. ఇక కె విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చిన స్వాతిముత్యం సినిమా కమల్ ఎంతటి గొప్ప నటుడు అన్నది మరోసారి మనకు గుర్తుతెస్తుంది. అమాయకుడి పాత్రలో కమల్ ఇంకెవ్వరూ ఈ పాత్రను ఇంతకంటే బాగా పోషించలేరు అన్న చందంగా పోషించడం విశేషం. ఈ సినిమా ద్వారా యూనివెర్సల్ స్టార్ రెండో నందిని అందుకున్నాడు. అలాగే ఈ సినిమా కూడా ఆస్కార్స్ కు ఉత్తమ విదేశీ భాషా చిత్రం విభాగంలో పోటీ పడింది. స్వాతిముత్యం తర్వాత కమల్ హాసన్ క్రేజ్ ఆంధ్రప్రదేశ్ లో రెట్టింపైంది. తన తమిళ చిత్రాలు మిస్ కాకుండా తెలుగులో డబ్ అవ్వడం ప్రారంభించాయి.

1987లో మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన నాయకన్, కమల్ హాసన్ కెరీర్ లో మరో మైల్ స్టోన్ చిత్రంగా నిలిచింది. ఈ సినిమాలో తన పెర్ఫార్మన్స్ కు గాను రెండోసారి నేషనల్ అవార్డును అందుకున్నాడు. అలాగే ఈ చిత్రం కూడా ఆస్కార్స్ పోటీకి ఎంపికైన గౌరవాన్ని అందుకుంది. తన పాత్రలతో ఎప్పటికప్పుడు ప్రయోగాలు చేసే కమల్ హాసన్, 1987లోనే పూర్తి సైలెంట్ సినిమాను చేసాడు. పుష్పక విమానం టైటిల్ తో రూపొందిన ఈ చిత్రం వివిధ భాషల్లో విడుదలైంది. ఈ చిత్రం ద్వారా కన్నడ భాషలో తొలి ఫిల్మ్ ఫేర్ అవార్డును సొంతం చేసుకున్నాడు. ఇక 1989లో కమల్ హాసన్ చేసిన నాలుగు చిత్రాలు ఒకదాన్ని మించి మరొకటి సూపర్ డూపర్ హిట్ గా నిలవడం విశేషం. అపూర్వ సహోదరర్గళ్ చిత్రంలో మరుగుజ్జు పాత్రను పోషించాడు. ఈ సినిమా తెలుగులో అపూర్వ సహోదరులుగా డబ్ అయింది. చాణక్యన్, వెట్రి వీళ్ళ, ఇంద్రుడు చంద్రుడు చిత్రాల్లో నటించాడు. వీటిలో ప్రత్యేకంగా ఇంద్రుడు చంద్రుడు కమల్ హాసన్ స్థానాన్ని టాలీవుడ్ లో మరింత ఉన్నత స్థితికి చేరుకుంది. రెండు భిన్నమైన పాత్రల్లో కమల్ హాసన్ నటన అమోఘం. ముఖ్యంగా మేయర్ పాత్రలో సూపర్బ్. దానికి అంతే అద్భుతంగా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం డబ్బింగ్ కూడా చెప్పారు. ఈ సినిమాలో తన నటనకు మూడో నంది వరించింది. అలాగే ఫిల్మ్ ఫేర్ ఉత్తమ నటుడి పురస్కారం కూడా వచ్చింది. అప్పటికి కమల్ హాసన్ తమిళ్, తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో ఫిల్మ్ ఫేర్ అవార్డును సొంతం చేసుకున్నాడు. అలాగే రెండు నేషనల్ అవార్డులు కూడా వరించాయి.

1990లలో కమల్ నెమ్మదిగా తన సినిమాల సంఖ్యను తగ్గించాడు. 70లలో డజను చిత్రాలు చేసిన కమల్, 80లలో 6, 7 అలా చేసాడు. ఇక 90లకు వచ్చేసరికి 2 లేదా 3 సినిమాలతో సరిపెట్టుకున్నాడు. 1990లో మైఖేల్ మదన కామరాజు చిత్రంలో నాలుగు భిన్నమైన పాత్రలలో నటించి అందరినీ మెప్పించాడు. ఆ తర్వాత వరసగా గుణా, తేవర్ మగన్ చిత్రాలలో పెర్ఫార్మన్స్ కు గాను ఉత్తమ నటుడి అవార్డులను గెలుచుకున్నాడు. తేవర్ మగన్ సినిమాను స్వయంగా నిర్మించిన ఈ ఉత్తమ నటుడు, బెస్ట్ సినిమాకు గాను నేషనల్ అవార్డును గెలుచుకున్నాడు. ఆ తర్వాత కమల్ హాసన్ వరసగా సింగరవేలన్, మహారసన్, కళైజ్ఞన్, మహానది, నమ్మవర్, సతి లీలావతి వంటి చిత్రాలు చేసాడు. సతీ లీలావతి సినిమాలో మరో నటుడు రమేష్ అరవింద్ తో కలిసి పనిచేసాడు. 1995లో తెలుగులో తన ఫెవరెట్ దర్శకుడు కె విశ్వనాథ్ దర్శకత్వంలో శుభసంకల్పం చిత్రం చేసాడు. ఈ సినిమా ద్వారా కూడా తనలోని నటుడ్ని మరోసారి తట్టి లేపాడు. కురుతిపునల్ చిత్రం తెలుగులో ద్రోహి పేరుతో విడుదలైంది. ఇందులో పోలీస్ ఆఫీసర్ గా నటించాడు. ఈ సినిమా రజినీకాంత్ ముత్తుతో డైరెక్ట్ పోటీ పడినా కానీ మంచి సినిమాగా నిలిచింది. కమర్షియల్ గా సక్సెస్ అయింది.

1996లో ఇండియన్ (తెలుగులో భారతీయుడు) చిత్రం ద్వారా శంకర్ తో పనిచేసాడు. ఈ సినిమా ఎలాంటి సక్సెస్ సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అటు సేనాపతి, ఇటు చంద్రబోస్ గా కమల్ హాసన్ నటనకు హ్యాట్సాఫ్ చెప్పకుండా ఉండలేం. ఇప్పటికీ ఈ సినిమాలో పాటలు ఎవర్ గ్రీన్ గా నిలిచాయి. ఈ సినిమాలో పెర్ఫార్మన్స్ కు అవార్డుల పంట పండింది. ఉత్తమ నటుడిగా నేషనల్ అవార్డు, ఫిల్మ్ ఫేర్ అవార్డు, తమిళనాడు స్టేట్ ఫిల్మ్ అవార్డును సొంతం చేసుకున్నాడు. అలాగే ఆస్కార్స్ కు మన దేశం నుండి ఇండియన్ పోటీకి పంపబడింది. ప్రతీ సినిమాతోనూ తనను తాను ఛాలెంజ్ చేసుకునే అలవాటున్న కమల్ హాసన్ అవ్వై షణ్ముగీ చిత్రంలో లేడీ గెటప్ తో అందరినీ అలరించాడు. బామ్మ పాత్రలో దానికి తగ్గట్లుగా ఒదిగిపోయి తాను ఎంత ఉత్తమ నటుడు అన్నది మరోసారి నిరూపించాడు. ఈ చిత్రం తెలుగులో భామనే సత్యభామనేగా డబ్ అయింది. ఇదే చిత్రాన్ని హిందీలో చాచి 420 పేరుతో కమల్ రీమేక్ చేసాడు. ఈ సినిమా ద్వారా తన దర్శకత్వ అరంగేట్రం కూడా చేయడం విశేషం.

అనంతరం సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో కాథల కాథల చిత్రం రూపొందింది. ఈ చిత్రాన్ని తెలుగులో నవ్వండి లవ్వండి టైటిల్ తో డబ్ చేసారు. కమల్ హాసన్ తో పాటు ఈ చిత్రంలో ప్రభుదేవా, రంభ, సౌందర్య కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా అటు తెలుగులో ఇటు తమిళ్ లో మంచి విజయం సాధించింది. దీన్నే హిందీలో మిర్చి మసాలాగా డబ్ చేసారు కానీ ఎందుకో విడుదల కాలేదు. అనంతరం ఎప్పుడో 2010లో హౌస్ ఫుల్ చిత్రంలో దాదాపు ఇదే స్టోరీ సెటప్ కనిపిస్తుంది. 1998 తర్వాత కమల్ హాసన్ రెండేళ్ల విరామం తీసుకున్నాడు. ఇక 2000లో కమల్ హాసన్ హే రామ్ చిత్రంతో డేరింగ్ అటెంప్ట్ చేసాడు. గాంధీ కథను ఆయన్ను చంపిన నాథురాం గాడ్సే యాంగిల్ లో చెప్పే ప్రయత్నం చేసాడు. ఈ సినిమాను తమిళ్ తో పాటు హిందీలో కూడా రూపొందించాడు. తానే స్వీయ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో షారుఖ్ ఖాన్ సపోర్టింగ్ రోల్ చేసాడు. హిందీ, తమిళ్, మలయాళంలో విడుదలైన ఈ చిత్రం తెలుగులో మాత్రం విడుదల కాలేదు. విడుదల తర్వాత హే రామ్ ఒక సంచలనం. దీనికి వివాదాలు ఉన్నా కానీ ఏకంగా మూడు నేషనల్ అవార్డులను సాధించింది. అదే సంవత్సరం కమల్ హాసన్, కెఎస్ రవికుమార్ దర్శకత్వంలో చేసిన తెనాలి చిత్రం మంచి విజయం సాధించింది.

2001లో కమల్ హాసన్ చేసిన ఆళవందాన్, తెలుగులో అభయ్ అనుకున్న రేంజ్ లో సక్సెస్ కాలేదు. దీని తర్వాత కమల్ హాసన్ కామెడీ సినిమాలకు ఓటు వేసాడు. పమ్మళ్ కె సంబంధం, పంచతంత్రం చిత్రాలతో విజయాలు కూడా సాధించాడు. కమల్ హాసన్ దర్శకత్వంలో వచ్చిన విరుమాండీ చిత్రం సక్సెస్ అయింది. 2004లో కమల్ హాసన్ వసూల్ రాజా ఎంబిబిఎస్ సినిమా చేసాడు. హిందీలో సూపర్ హిట్ సాధించిన మున్నాభాయ్ ఎంబిబిఎస్ కు రీమేక్ ఇది. తెలుగులో చిరంజీవి శంకర్ దాదా ఎంబిబిఎస్ టైటిల్ తో రీమేక్ చేసి సూపర్ హిట్ సాధించిన విషయం తెల్సిందే. ఆ తర్వాతి ఏడాది కమల్ హాసన్ రచించి నటించిన ముంబై ఎక్స్ ప్రెస్ విడుదలైంది. అయితే ఆ సినిమా అనుకున్న రేంజ్ లో సక్సెస్ సాధించలేదు. కన్నడ చిత్రం రమ షామ భామలో నటించాడు కమల్ హాసన్. 2006లో కమల్ హాసన్ నటించిన వేట్టైయాడు విళైయాడు విడుదలైంది. గౌతమ్ మీనన్ దర్శకత్వంలో ఈ స్టైలిష్ పోలీస్ డ్రామా తెరకెక్కింది. రాఘవన్ గా తెలుగులో విడుదలైన ఈ చిత్రం మంచి సక్సెస్ సాధించింది.

కమల్ హాసన్ దశావతారం ప్రాధమిక కథను పట్టుకుని చాలా మంది దర్శకులను అప్రోచ్ అయ్యాడు. వారిలో గౌతమ్ మీనన్ కూడా ఒకడు. అయితే వివిధ కారణాల వల్ల వారెవరూ ఈ సినిమా చేయడానికి ముందుకు రాలేదు. కానీ కెఎస్ రవి కుమార్ దశావతారంను డైరెక్ట్ చేయడానికి ముందుకు వచ్చాడు. అప్పటికే కమల్ హాసన్, కెఎస్ రవి కుమార్ కాంబినేషన్ లో హ్యాట్రిక్ హిట్స్ వచ్చాయి. ఈ నేపథ్యంలో దశావతారం చిత్రం అంచనాలను రేకెత్తించింది. ముఖ్యంగా కమల్ హాసన్ పది పాత్రల్లో నటించడం అనేది ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇచ్చింది. అంతకు ముందు శివాజీ గణేశన్, ఏఎన్నార్ 9 పాత్రలతో సినిమాలు చేయగా ఆ రికార్డ్ ను బీట్ చేసాడు కమల్. మొత్తం 10 పాత్రల్లో దేనికదే వైవిధ్యం చూపించి అదరగొట్టాడు. దశావతారం ప్రేక్షకులచే నీరాజనాలు అందుకుంది. ఈ సినిమా తీయడానికి మూడేళ్ళ సమయం పట్టినా కమల్ కు క్రాఫ్ట్ పట్ల ఉన్న ప్యాషన్ ను ఈ చిత్రం తెలియజేస్తుంది.

హిందీలో ఎలాంటి అంచనాలు లేకుండా లో బడ్జెట్ లో విడుదలైన ది వెడ్నెస్డే చిత్రాన్ని తమిళ్ లో రీమేక్ చేయాలని నిర్ణయించుకున్నారు. తమిళ్ లో కమల్ హాసన్, మోహన్ లాల్ ప్రధాన పాత్రల్లో నటించగా, తెలుగులో మోహన్ లాల్ పోషించిన పాత్రను విక్టరీ వెంకటేష్ పోషించాడు. తమిళ్ లో ఈ ప్రాజెక్ట్ కు ఉన్నైపోల్ ఒరువన్, అదే తెలుగులో ఈనాడుగా టైటిల్స్ ను ఫిక్స్ చేసారు. ఒక కామన్ మ్యాన్ తలుచుకుంటే ఎలాంటి రిస్క్ అయినా చేయగలడు అన్న బేస్ పాయింట్ మీద ఈ సినిమా తెరకెక్కింది. చక్రి తోలేటి ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయగా విడుదల తర్వాత పాజిటివ్ రివ్యూలను సొంతం చేసుకుంది. ఈ సినిమాలో ఒక పాట ద్వారా శృతి హాసన్ స్పెషల్ అప్పీరెన్స్ ఇవ్వడం విశేషం. కెఎస్ రవికుమార్ కాంబినేషన్ లో మరో సినిమా చేయాలని డిసైడ్ అయ్యాడు కమల్ హాసన్. త్రిష హీరోయిన్ గా మాధవన్ ప్రధాన పాత్రలో ఉదయనిధి స్టాలిన్ నిర్మాతగా మన్మథన్ అంబు తెరకెక్కింది. ఈ చిత్రాన్ని తెలుగులో మన్మథ బాణంగా విడుదల చేసారు. అయితే ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద యావరేజ్ గానే ఆడింది.

2010లో మన్మథన్ అంబు విడుదల తర్వాత కమల్ హాసన్ ఒక భారీ ప్రాజెక్ట్ ను చేపట్టనున్నట్లు తెలిపాడు. ఈ భారీ ప్రాజెక్ట్ ను డైరెక్ట్ చేయడానికి ముందుగా సెల్వరాఘవన్ ను దర్శకుడిగా ఎంపిక చేసారు. అయితే సెల్వరాఘవన్ తన తమ్ముడు ధనుష్ చిత్రంతో బిజీగా ఉన్న నేపథ్యంలో కమల్ హాసన్ ఆయన్ను తప్పించి తనే డైరెక్ట్ చేసుకోవాలని నిర్ణయించాడు. ఇది ఒక స్పై థ్రిల్లర్ అని తెలిపాడు కమల్ హాసన్. మొదట హీరోయిన్ గా సోనాక్షి సిన్హాను అనుకున్నా కానీ ప్రాజెక్ట్ డిలే అవుతూ వస్తుండడంతో సోనాక్షి చిత్రం నుండి తప్పుకున్నారు. ఆ తర్వాత కత్రినా కైఫ్, దీపికా పదుకోన్, విద్యా బాలన్, సోనమ్ కపూర్ వంటి వారిని పరిశీలించినా చివరికి ఆ అవకాశం న్యూయార్క్ నటి పూజ కుమార్ కు దక్కింది. ముస్లిం కమ్యూనిటీల నుండి వచ్చిన అభ్యంతరాలతో విశ్వరూపం విడుదల వాయిదా పడింది. ముందు అనుకున్న తేదికి విడుదల కాకున్నా చివరికి 2013 జనవరి 25న ఆంధ్రప్రదేశ్ లో, ఫిబ్రవరి 7న తమిళనాడులో విడుదలైంది. దాదాపు 90 కోట్లతో తెరకెక్కిన ఈ చిత్రం ఏకంగా 220 కోట్లు వసూలు చేసింది. విశ్వరూపం సినిమా దర్శకుడిగా కమల్ స్థాయిని మరింత పెంచింది.

2013లో వచ్చిన విశ్వరూపం చిత్రానికి సీక్వెల్ ప్లాన్ చేసాడు కమల్ హాసన్. విశ్వరూపం 2 టైటిల్ తో ఈ సినిమా 2018లో విడుదలైంది. 2013లోనే కమల్ సీక్వెల్ పనులు మొదలుపెట్టినా కానీ వివిధ కారణాల వల్ల డిలే అవుతూ వచ్చి చివరికి 2018లో విడుదలైంది. అయితే మొదటి భాగానికి మంచి రెస్పాన్స్ రాగా దాని సీక్వెల్ అనుకున్న విధంగా సక్సెస్ అవ్వలేకపోయింది. ప్రస్తుతం కమల్ హాసన్ రెండు సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఒకటి లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రానున్న విక్రమ్ చిత్రం. ఇందులో విజయ్ సేతుపతి, ఫహద్ ఫాజిల్ కూడా నటిస్తుండడంతో చాలా అంచనాలే ఉన్నాయి. ఇక కమల్ హాసన్, శంకర్ మరోసారి చేతులు కలిపారు. తమ సూపర్ హిట్ ఇండియన్ చిత్రానికి సీక్వెల్ చేస్తున్నారు. ఇండియన్ 2 టైటిల్ తో ప్రొడక్షన్ లోకి వచ్చిన ఈ చిత్రం వివిధ కారణాల వల్ల జాప్యమవుతూ వస్తోంది. ఈ లోగా దర్శకుడు శంకర్ కు, నిర్మాతలు లైకా ప్రొడక్షన్స్ కు మధ్య లీగల్ సమస్యలు తలెత్తాయి.

రాజకీయ జీవితం

మక్కల్ నీది మయ్యమ్ అనే రాజకీయ పార్టీని స్థాపించాడు కమల్ హాసన్. 21 ఫిబ్రవరి 2018న కమల్ హాసన్ తాను పార్టీని మొదలుపెడుతున్నట్లు అధికారికంగా వెల్లడించాడు. మధురై వేదికగా ఈ ప్రకటన జరిగింది. మక్కల్ నీది మయ్యమ్ పార్టీ జెండా చాలా ఆసక్తికరంగా ఉంటుంది. బ్లాక్ కలర్ బ్యాక్ గ్రౌండ్ లో ఆరు కలిసిన చేతులు, ఒకదానికి ఒకటి ఆల్టర్నేట్ గా ఎరుపు మరియు తెలుపు రంగులలో ఉంటుంది. మధ్యలో తెల్లని నక్షత్రం ఉంటుంది. కమల్ హాసన్ తన రాజకీయ జీవితాన్ని మన మాజీ ప్రెసిడెంట్ ఏపిజె అబ్దుల్ కలాం నివాసం, మరియు స్మారక చిహ్నం నుండి మొదలుపెట్టాడు. 2019 సాధారణ ఎన్నికలలో తన పార్టీ మొత్తం 37 సీట్లలో పోటీ చేయగా అన్ని స్థానాలలో ఓటమి చవి చూసింది. కేవలం 3.72 శాతం ఓటు షేర్ మాత్రమే తన పార్టీకి వచ్చింది. ఇక 2021 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలలో కోయంబత్తూర్ సౌత్ నుండి పోటీ చేసాడు కమల్ హాసన్. అయితే బిజెపి మహిళా మోర్చా ప్రెసిడెంట్ వనతి శ్రీనివాసన్ చేతిలో కమల్ హాసన్ ఓటమి పాలయ్యారు. అయితే రాజకీయంగా తాను యాక్టివ్ గానే ఉంటానని ప్రకటించాడు కమల్ హాసన్.

వ్యక్తిగత జీవితం

సినిమా కెరీర్ లానే కమల్ హాసన్ వ్యక్తిగత జీవితంలో కూడా ఎన్నో మలుపులు ఉన్నాయి. ముఖ్యంగా ఆయన జీవితం తెరిచిన పుస్తకం వంటిది. 1978లో అంటే కమల్ కు 28 ఏళ్ల వయసులో డాన్సర్ వాణి గణపతిని వివాహం చేసుకున్నాడు. ఆమె కమల్ తో 1975లో మెలినట్టు మరుమగళ్ చిత్రంలో నటించింది. పెళ్ళైన తర్వాత వాణి గణపతి, కమల్ హాసన్ నటించిన చాలా సినిమాలకు కాస్ట్యూమ్ డిజైనర్ గా పనిచేసింది. సరిగ్గా పది సంవత్సరాల తర్వాత వీరిద్దరూ విడిపోయారు.

కమల్ హాసన్, నటి సారికతో 1988 నుండి కలిసి జీవించాడు. అయితే వీరిద్దరి తొలి సంతానం శృతి హాసన్ 1986లో జన్మించింది. ఆ తర్వాత ఇద్దరూ వివాహం చేసుకున్నారు. శృతి హాసన్ ప్రముఖ దక్షిణాది నటి మాత్రమే కాకుండా సింగర్, మ్యూజిక్ కంపోజర్ కూడా. వీరిద్దరికి రెండో సంతానం అక్షర హాసన్ 1991లో జన్మించింది. ఆమె 2013లో కమల్ హాసన్ డైరెక్ట్ చేస్తూ నటించిన విశ్వరూపం సినిమాకు అసిస్టెంట్ గా పనిచేసింది. 2019లో కాదరం కొండన్ చిత్రంలో నటించింది అక్షర.

కమల్ తో పెళ్ళైన తర్వాత సారిక నటనకు దూరమైంది. కమల్ నటించే సినిమాలకు కాస్ట్యూమ్ డిజైనర్ గా పనిచేసింది సారిక. హే రామ్ చిత్రానికి గాను సారికకు ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్ గా జాతీయ అవార్డు కూడా వరించింది. 2002లో ఈ జంట డివోర్స్ కు అప్లై చేసుకోగా 2004లో అది ఫైనల్ అయింది. కమల్ నుండి విడిపోయాక సారిక నటనను కొనసాగించింది. 2005లో విడుదలైన ప్రజానియా చిత్రానికి గాను ఆమెకు ఉత్తమ నటిగా జాతీయ అవార్డు సైతం వరించింది.

సారిక నుండి విడిపోయాక కమల్ హాసన్ నటి గౌతమితో రిలేషన్ లో ఉన్నాడు. వీరిద్దరూ 1980, 90ల కాలంలో పలు సినిమాల్లో కలిసి నటించారు. 2005 నుండి 2016 వరకూ వీరిద్దరూ కలిసి జీవించారు. 2016లో గౌతమి తన బ్లాగ్ లో కమల్ నుండి విడిపోయినట్లు ప్రకటించింది. 13 ఏళ్ల తర్వాత కమల్ నుండి విడిపోయాను. ఇది నేను తీసుకున్న అతి కష్టమైన నిర్ణయాల్లో ఒకటి. నా గుండె ఈ నిర్ణయాన్ని చెబుతున్నప్పుడు బరువెక్కింది అని గౌతమి తన బ్లాగ్ లో రాసింది. కమల్ తన కెరీర్ తొలినాళ్లలో నటి శ్రీవిద్యతో రిలేషన్ లో ఉన్నట్లు ఎన్నో వార్తలు వచ్చాయి. 70ల కాలంలో కమల్ హాసన్, శ్రీవిద్య మధ్య రిలేషన్ నడిచినట్లు రూమర్స్ ఉన్నాయి. 2006లో శ్రీవిద్య చావుబతుకుల మధ్య ఉన్నప్పుడు కమల్ ఆమెను చూడటానికి వెళ్ళాడు. 2008 మలయాళ చిత్రం తిరక్కతాలో వీరిద్దరి రిలేషన్ గురించి ప్రస్తావించారు. అందులో అనూప్ మీనన్ ది కమల్ హాసన్ పాత్ర కాగా శ్రీవిద్య పాత్రను ప్రియమణి పోషించింది.

సామాజిక సేవ

కమల్ హాసన్ తన ఫ్యాన్ క్లబ్స్ అన్నిటినీ సంక్షేమ సంస్థలుగా మార్చేశాడు. ఇలా చేసిన మొదటి తమిళ నటుడిగా కమల్ హాసన్ నిలిచాడు. కమల్ నర్పని ఇయక్కం పేరిట సామాజిక సంక్షేమ కార్యక్రమాలలో తరుచూ పాలు పంచుకుంటుంటాడు కమల్ హాసన్. ఈ సంస్థ తరుచుగా బ్లడ్, ఐ డొనేషన్ డ్రైవ్స్ ను ఏర్పాటు చేస్తుంటుంది. అంతే కాకుండా విద్యార్థులకు స్టడీ మెటీరియల్ ను సప్లై చేయడం కూడా ఈ సంస్థ చూసుకుంటుంది.

కమల్ హాసన్ తన మానవతావాది కార్యకలాపాలు, లౌకిక వాదానికి 2004లో మొదటి అబ్రహం కోవూర్ జాతీయ అవార్డును గెలుచుకున్నాడు. 2010లో హృదయరాగం అనే ప్రాజెక్ట్ కు అంబాసిడర్ గా ఎంపికయ్యాడు కమల్ హాసన్. ఈ ప్రాజెక్ట్ ఎయిడ్స్ ఎఫెక్ట్ అయిన చిన్నారుల సంక్షేమార్థం ఫండ్స్ ను వసూలు చేస్తుంది. సెప్టెంబర్ 2010లో చిన్నారుల క్యాన్సర్ రిలీఫ్ ఫండ్ ను లాంచ్ చేసాడు. శ్రీరామ చంద్ర యూనివర్సిటీ, పోరూర్, చెన్నైలో క్యాన్సర్ విద్యార్థులకు రోజా పువ్వులను అందించాడు. అలాగే బ్రాండ్లను ప్రచారం చేయడం ద్వారా వచ్చిన మొత్తాన్ని సామాజిక కార్యక్రమాలకు వెచ్చిస్తానని కమల్ హాసన్ ఎప్పుడో ప్రకటించాడు.

మార్చ్ 2013లో నీంగళుమ్ వెళ్ళలం ఒరు కోడి కార్యక్రమంలో గెలుచుకున్న 5 మిలియన్ ను పెట్రల్ తాన్ పిల్లయ సంస్థ కోసం డొనేట్ చేసాడు. ఈ సంస్థ హెచ్ఐవితో బాధపడుతోన్న చిన్నారుల సంక్షేమాన్ని చూసుకుంటుంది. స్వచ్ఛ్ భారత్ క్యాంపైన్ కోసం భారతదేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేత కమల్ హాసన్ నామినేట్ అయ్యాడు. చెన్నైలోని మడంబాక్కం కాలువను 2014 నవంబర్ 7న అరుణ్ కృష్ణమూర్తితో కలిసి బాగుచేయించాలని సంకల్పించాడు కమల్ హాసన్. 2015లో పోతీస్ కు తొలిసారి ప్రచారకర్తగా వ్యవహరించాడు కమల్ హాసన్. అంతకు ముందు తన కూతురు శృతి హాసన్ ఈ బ్రాండ్ ను ప్రచారం చేసేది.

టెలివిజన్ రంగం

2016లో జయ టివిలో ప్రసారమయ్యే పట్టిమంద్రం షో కు హోస్ట్ గా వ్యవహరించాడు కమల్ హాసన్. స్టార్ విజయ్ టివిలో 2017 నుండి మొదలుపెట్టి ఇప్పటివరకూ బిగ్ బాస్ తమిళ్ వెర్షన్ కు హోస్ట్ గా వ్యవహరించాడు. ఈ షో నాలుగు సీజన్లను విజయవంతంగా నిర్వహించబడింది. ఐదో సీజన్ ను ఈ ఏడాది నిర్వహిస్తారు.

ఆగిపోయిన కమల్ హాసన్ ప్రాజెక్ట్స్

కమల్ హాసన్ తన ఐదు దశాబ్దాల సినీ కెరీర్ లో ఎన్నో ప్రాజెక్ట్స్ ను సెట్ చేసాడు. స్వతహాగా రైటర్ కూడా అయిన కమల్ హాసన్ ఆలోచనల్లోంచి ఎన్నో కథలు పుట్టుకొచ్చాయి. కానీ పుట్టిన ప్రతీ ఐడియా  సినిమా అవ్వాలని లేదుగా. కమల్ హాసన్ మొదలుపెట్టిన ప్రాజెక్ట్స్ లో కొన్ని కార్యరూపం దాల్చలేదు. అవేమిటో ఒకసారి చూద్దాం.

* కమల్ హాసన్ చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన మంగళ మంగై అనే చిత్రం విడుదలకు నోచుకోలేదు. ఆ సినిమా దాదాపుగా పూర్తై వివిధ కారణాల వల్ల ముందుకు వెళ్లలేదని సమాచారం. 1981లో సత్యన్ అంతికాడ్ దర్శకత్వంలో జాన్ పాల్ పుథుసేరీ కథ అందించిన చిత్రంలో కమల్ హాసన్, అంబికా కలిసి నటించాలి. అయితే నిర్మాత మజెంద్రన్ చనిపోవడంతో ఈ ప్రాజెక్ట్ ముందుకు కదల్లేదు. ఈ ప్రాజెక్ట్ కు చమయం అనే టైటిల్ ను కూడా ఫిక్స్ చేసారు.

* 1982లో సి. రుద్రయ్య దర్శకత్వంలో రాజా ఎన్నై మన్నితువిడు ప్రాజెక్ట్ లో కమల్ హాసన్ నటించాడు. అతని సోదరుడు చంద్ర హాసన్, కమల్ హీరోలుగా సుజాత, సుమలత హీరోయిన్లుగా ఈ ప్రాజెక్ట్ మొదలైంది. తెలుగులో కూడా తెరకెక్కించాలనుకున్న ఈ సినిమా 15 రోజుల పాటు షూటింగ్ కూడా చేసుకుంది. అయితే వివిధ కారణాల వల్ల ముందుకు సాగలేదు. ఈ చిత్రం కోసం ఇళయరాజా రికార్డ్ చేసిన ఒక సాంగ్ తర్వాత అంబిన్ మూగవారి చిత్రంలో వాడుకున్నారు.

* తాతినేని రామారావు 1984లో ఖబర్దార్ అనే ప్రాజెక్ట్ ను మొదలుపెట్టారు. కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ హీరోలుగా ఈ ప్రాజెక్ట్ మొదలైంది. చాలా భాగం షూటింగ్ కూడా జరిగింది. కమల్ హాసన్ అయితే దాదాపు 25 రోజుల పాటు ఈ చిత్రం కోసం షూటింగ్ చేసాడు. దాంతో తన పార్ట్ దాదాపు పూర్తయిందని తర్వాత ఒక ఇంటర్వ్యూలో తెలిపాడు. అయితే నిర్మాతలు ఔట్పుట్ విషయంలో సంతృప్తిగా లేకపోవడంతో పరస్పర అంగీకారం మేరకు ప్రాజెక్ట్ ను నిలిపివేశారు. 1996లో మరోసారి ఈ ప్రాజెక్ట్ చేయడానికి నిర్మాతలు ముందుకురాగా కమల్ హాసన్ సముఖంగా లేరు. 2020లో కె భాగ్యరాజ్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నిజానికి ఈ ప్రాజెక్ట్ ఆగిపోవడానికి అమితాబ్ కారణమని తెలిపాడు. తన పాత్ర కంటే కమల్ పాత్ర ఎక్కువగా హైలైట్ అవుతుందన్న కారణంగా నిర్మాతలతో మాట్లాడి ప్రాజెక్ట్ ను ఆపించాడట.

* ప్రముఖ దర్శకుడు భారతీరాజా, కమల్ హాసన్, రాధ ప్రధాన పాత్రల్లో టాప్ టక్కర్ చిత్రాన్ని మొదలుపెట్టాడు. అయితే మెజారిటీ భాగం (దాదాపు 5,000 అడుగులు) షూట్ చేసిన తర్వాత భారతీరాజా ఈ ప్రాజెక్ట్ ను నిలిపివేశాడు. తమ కాంబినేషన్ లోనే తెరకెక్కిన సిగప్పు రోజక్కల్ కు ఇది బాగా దగ్గరగా ఉండడమే ప్రధాన కారణమని తెలుస్తోంది. తర్వాత టాప్ టక్కర్ స్థానంలో ఓరు ఖైధీయిన్ డైరీను చేసారు. 1980ల కాలంలోనే ముక్త శ్రీనివాసన్, అమెరికన్ సినిమా ది గాడ్ ఫాదర్ ను రీమేక్ చేయాలనుకున్నాడు. శివాజీ గణేశన్, కమల్ హాసన్, అమలలకు అడ్వాన్స్ లు ఇచ్చి వాళ్ళ డేట్స్ ను బ్లాక్ చేసాడు కూడా. అయితే కమల్ హాసన్ మెంటర్ గా ఉండే అనంతు ఈ ప్రాజెక్టు శివాజీ గణేశన్ సెంట్రిక్ గా ఉంటుందని చెప్పడంతో కమల్ వెనకడుగు వేసాడు. దీంతో ఈ ప్రాజెక్ట్ ను క్యాన్సిల్ చేయక తప్పలేదు.

* గంగై అమరన్, కమల్ హాసన్, ఐశ్వర్య హీరో హీరోయిన్లుగా జల్లికట్టు ప్రధానాంశంగా అతి వీరపాండ్యన్ చిత్రాన్ని మొదలుపెట్టారు. అయితే కమల్ హాసన్ ఈ చిత్రం స్థానంలో తేవర్ మగన్ చిత్రాన్ని చేసాడు, అయితే 2016లో గంగై అమరన్ ఈ ప్రాజెక్ట్ విషయంలో ఓపెన్ అయ్యాడు. ఇది ఆగిపోవడానికి ప్రధాన కారణం తన సోదరుడు ఇళయరాజా అని చెప్పుకొచ్చాడు. వీళ్ళిద్దరికీ ఇగో సమస్యలు ఉన్నాయి. అందుకని ఇళయరాజా వెళ్లి కమల్ తో ఈ ప్రాజెక్ట్ చెయ్యొద్దు అని చెప్పాడని గంగై ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.

* మణిరత్నం డ్రీం ప్రాజెక్ట్ పొన్నియిన్ సెల్వన్ చేయాలని 1994లోనే భావించాడు. కల్కి కృష్ణమూర్తి నవల ఆధారంగా ఈ ప్రాజెక్ట్ ను రూపొందించాలని అనుకుని కమల్ హాసన్ తో కలిసి ఈ స్క్రిప్ట్ పై వర్క్ చేసాడు కూడా. అయితే ఆ సమయంలో ఈ ప్రాజెక్ట్ చేయడం ఫైనాన్షియల్ గా కరెక్ట్ కాదని భావించి ఇద్దరూ ఐడియాను వదిలేసారు. అయితే కమల్ హాసన్ మాత్రం ఈ ప్రాజెక్ట్ ను 40 భాగాల టెలివిజన్ సిరీస్ గా చేద్దామని అనుకున్నాడు. రా. కి. రంగరాజన్ తో స్క్రీన్ ప్లేను వర్కౌట్ చేసాడు కూడా. కానీ దాన్ని కూడా ఆపేయాల్సి వచ్చింది. మొత్తానికి మణిరత్నం ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ ను వేరే కాస్ట్ తో చేస్తున్నాడు.

* తన మలయాళ చిత్రం అమ్మయనే సత్యం చిత్రాన్ని తమిళంలో రీమేక్ చేయాలని భావించాడు బాలచంద్ర మీనన్. నిర్మాత రవీంద్రన్ కమల్ హాసన్ ను ఈ చిత్రం కోసం తీసుకున్నాడు. అలాగే ఎస్పీ సుబ్రహ్మణ్యంను కూడా అప్రోచ్ అయ్యారు. జయసంధ్య అనే హీరోయిన్ ను కూడా ఈ ప్రాజెక్ట్ లోకి తీసుకున్నారు. అయితే క్రియేటివ్ డిఫరెన్సెస్ కారణంగా ఈ సినిమా ఆగిపోయింది. కమల్ హాసన్ ఒరిజినల్ లో కంటే తన పాత్రకు ప్రాధాన్యత ఉండాలని కోరుకోవడంతోనే సమస్య మొదలైందని తెల్సింది.

*  తమిళ చిత్రం మగలీర్ మట్టుకు రీమేక్ గా తెరకెక్కిన లేడీస్ ఓన్లీ సినిమా వివిధ కారణాల వల్ల ఇంకా విడుదల కాలేదు. ఈ చిత్రానికి కమల్ హాసన్ నిర్మాత. ఈ సినిమాలో కమల్ హాసన్ స్పెషల్ అప్పీయరెన్స్ ఇచ్చాడు. 1990లో అమర కావ్యం అనే స్క్రిప్ట్ పై వర్క్ చేసాడు. సారిక ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయాల్సి ఉంది. నగ్మా, శిల్పా శెట్టిలను హీరోయిన్లుగా తీసుకున్నారు. అయితే కమల్ హాసన్ ఫిల్మ్ మేకింగ్ టెక్నాలజీ నేర్చుకోవడానికి యూఎస్ వెళ్లడంతో ఈ ప్రాజెక్ట్ అలా సైడ్ అయిపోయింది.

* మరుదనాయగం: బహుశా కమల్ హాసన్ అత్యంత ఇష్టంగా, ఎక్కువగా ఫోకస్ పెట్టిన ప్రాజెక్ట్ మరుదనాయగం. ఈ ప్రాజెక్ట్ పై దాదాపు నాలుగైదేళ్లు వర్క్ చేసాడు కమల్ హాసన్. రైటర్ సుజాత చెప్పిన ఐడియా విని ఏకంగా 8 కోట్ల రూపాయలను ఈ చిత్రంలో ఇన్వెస్ట్ చేసాడు. ఎంజీఆర్ ఫిల్మ్ సిటీలో అక్టోబర్ 16, 1997న ఈ చిత్రం అధికారికంగా లాంచ్ అయింది. ఈ లాంచ్ కార్యక్రమానికి క్వీన్ ఎలిజిబెత్ 2 హాజరు కావడం విశేషం. అయితే పెట్టుబడి పెట్టే బ్రిటిష్ కంపెనీ ఈ ప్రాజెక్ట్ నుండి వెనుతిరగడంతో మరుదనాయగం మరుగునపడింది. తర్వాతి కాలంలో కమల్ హాసన్ ఈ ప్రాజెక్ట్ ఉంటుందని చెప్పినా వర్కౌట్ అవ్వలేదు.

* కమల్ హాసన్ లండనిల్ కామేశ్వరన్ స్క్రిప్ట్ ను రాసుకుని తానే హీరోగా చేద్దామని అనుకున్నాడు. అయితే అది కాస్ట్ ఎఫెక్టివ్ కాదు అని భావించిన కమల్ హాసన్ దాన్ని పోస్ట్ పోన్ చేసుకుంటూ వచ్చాడు. 1999లో మరుదనాయగం ఆగిపోయిన తర్వాత చేద్దామనుకున్నా కానీ వర్కౌట్ అవ్వలేదు. చివరికి 2002లో పమ్మళ్ కె సంబంధం సూపర్ హిట్ అయ్యాక మౌళి, కమల్ హాసన్ ను ఈ ప్రాజెక్ట్ కోసం అడిగాడు కానీ కమల్ ఆసక్తి చూపించలేదు. చివరికి అంబే శివన్ లో తనతో నటించిన మాధవన్ ను ఈ ప్రాజెక్ట్ కోసం తీసుకోవాలని హాసన్ భావించాడు. ఆ తర్వాత నల దమయంతి పేరుతో మాధవన్ హీరోగా రాజ్ కమల్ పతాకంపై ఈ ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చింది.

* నాయక్ చిత్రాన్ని హిందీలో తెరకెక్కించిన శంకర్, తన తర్వాతి ప్రాజెక్ట్ కమల్ హాసన్ తో ఉంటుందని తెలిపాడు. కమల్ హాసన్, ప్రీతి జింటా ప్రధాన పాత్రల్లో టెక్నాలజీ థ్రిల్లర్ జోనర్ లో రోబోట్ చిత్రాన్ని చేస్తానని తెలియజేసాడు. కానీ ఈ ప్రాజెక్ట్ కొన్ని రోజులకే వర్కౌట్ కాదని తేలిపోయింది. అప్పుడున్న మార్కెట్ కు, శంకర్ అనుకున్న బడ్జెట్ కు సరితూగకపోవడంతో కార్యరూపం దాల్చలేదు. అదే ప్రాజెక్ట్ తర్వాత 2010లో రజినీకాంత్, ఐశ్వర్య రాయ్ ప్రధాన పాత్రల్లో రోబోగా తెరకెక్కి సూపర్ డూపర్ హిట్ సాధించింది. 2002లో పమ్మళ్ కె సంబంధం సూపర్ డూపర్ హిట్ అయ్యాక కమల్ హాసన్ హీరోగా కెఎస్ రవికుమార్ దర్శకత్వంలో నరన్ అనే ప్రాజెక్ట్ ను అనౌన్స్ చేసారు. ఆ ప్రాజెక్ట్ కు ముహూర్తం కూడా జరిగింది. అమితాబ్ బచ్చన్ ను ప్రధాన పాత్రలోకి తీసుకుని తమిళ్ తో పాటుగా తెలుగు, హిందీల్లో కూడా రిలీజ్ చేయాలని భావించారు. అయితే బడ్జెట్ కారణాల దృష్ట్యా ఈ ప్రాజెక్ట్ కుదర్లేదు కానీ దాని స్థానంలో కమల్, రవికుమార్ కలిసి పంచతంత్రం చేసారు.

* ఫిబ్రవరి 2004 లో కమల్ హాసన్, సింగీతం శ్రీనివాస రావు కలిసి కృష్ణలీల అనే ప్రాజెక్ట్ ను ప్రకటించారు. హీరోయిన్లుగా అభిరామి, గౌతమి, రోహిణి, వినోదినిలను తీసుకున్నారు. కమెడియన్లుగా గౌండమని, వడివేలు, సెంథిల్, వివేక్ తదితరులు కూడా ప్రాజెక్ట్ లోకి వచ్చారు. ఇక కమల్ హాసన్ అయితే లండన్ వెళ్లి మరీ ఇద్దరు నటీనటులను ఎంపిక చేయడానికి కసరత్తులు చేసాడు. అయితే ఇంతా చేసాక ఈ ప్రాజెక్ట్ వివిధ కారణాల రీత్యా వర్కౌట్ కాక, కమల్, సింగీతం కలిసి ముంబై ఎక్స్ ప్రెస్ చేసారు.

కమల్ హాసన్ కెరీర్ లో ఆగిపోయిన చిత్రాలు ఇంకా మరెన్నో ఉన్నాయి. ఫుల్ డిమాండ్ లో ఉండే కమల్ కు పలు ప్రాజెక్ట్స్ రావడం, వివిధ కారణాల వల్ల కొన్ని వర్కౌట్ కాకపోవడం జరుగుతూ వచ్చాయి. ఈ క్రమంలోనే కేజీ, మర్మయోగి, తైలవన్ ఇరుక్కిఱాన్, 19 స్టెప్స్, బుద్ధం శరణం, తిప్పువుమ్ ఉన్నిఆర్చయుమ్, మూ, వామమార్గం, అమ్మ అప్ప విలయట్టు, శభాష్ నాయుడు వంటి చిత్రాలు కూడా ఆగిపోయాయి.

అవార్డులు

* కమల్ హాసన్ తన సుదీర్ఘమైన కెరీర్ లో ఎన్నో అవార్డులు, అంతకు మించి రివార్డులను గెలుచుకున్నాడు. ఆరేళ్ళ వయసులోనే ఉత్తమ బాల నటుడిగా రాష్ట్రపతి బంగారు పతాకాన్ని గెలుచుకున్నాడు కమల్ హాసన్. కళత్తూర్ కన్నమ్మ చిత్రం ద్వారా కమల్ కు ఆ గౌరవం దక్కింది. తన కెరీర్ లో మొత్తం మూడు జాతీయ అవార్డులను గెలుచుకున్నాడు కమల్. మొదటగా ఉత్తమ తమిళ చిత్రం విభాగంలో తేవర్ మగన్ చిత్రానికి గాను జాతీయ అవార్డును గెలుచుకున్నాడు. ఈ చిత్రాన్ని కమల్ హాసన్ స్వయంగా నిర్మించాడు. 1990వ సంవత్సరంలో కమల్ హాసన్ కు పద్మశ్రీ పురస్కారంతో గౌరవించింది భారత ప్రభుత్వం. అలాగే 2014వ సంవత్సరంలో పద్మభూషణ్ పురస్కారం ఆయన్ను వరించింది. కమల్ హాసన్ మొత్తం ఐదు భాషల్లో 19 ఫిల్మ్ ఫేర్ అవార్డులను గెలుచుకున్నాడు. 2000వ సంవత్సరంలో ఆఖరుగా అవార్డు అందుకున్నాక ఇక తనకు అవార్డులు ఇవ్వవద్దని ఆర్గనైజేషన్ కు రిక్వెస్ట్ చేసాడు. 2003లో కమల్ హాసన్ సినిమాలు రామ్, పుష్పక్, నాయకన్, కురుతిపునల్ చిత్రాలు డైరెక్టర్ ఇన్ ఫోకస్ విభాగంలో రోటర్ డామ్ ఫిల్మ్ ఫెస్టివల్ కు ఎంపికయ్యాయి. పుచోన్ ఇంటర్నేషనల్ ఫెంటాస్టిక్ ఫిల్మ్ ఫెస్టివల్ లో 2004లో విడుదలైన విరుమాండీ చిత్రానికి గాను ఉత్తమ ఏషియన్ ఫిల్మ్ అవార్డును గెలుచుకున్నాడు. 2005లో సత్యభామ డీమ్డ్ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ తో కమల్ హాసన్ ను గౌరవించింది. ఫిక్కీ 2007వ సంవత్సరంలో కమల్ హాసన్ కు లివింగ్ లెజెండ్ అన్న బిరుదును ఇచ్చి గౌరవించింది.

* 1979 సంవత్సరంలో తమిళనాడు ప్రభుత్వం నుండి కళైమామణి అవార్డును అందుకున్నాడు కమల్ హాసన్. అలాగే తన కెరీర్ లో తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వ అవార్డులు, నంది, స్క్రీన్ మరియు విజయ్ అవార్డులను గెలుచుకున్నాడు కమల్. 2009వ సంవత్సరంలో ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ చాంబర్స్ అఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఫిక్కీ) చైర్మన్ గా నియమించబడ్డాడు. ఆనంద వికటన్ వారిచే జీవితకాల సాఫల్య పురస్కారంగా ఎస్ ఎస్ వాసన్ అవార్డు గౌరవాన్ని అందుకున్నాడు కమల్ హాసన్. మొత్తంగా తన కెరీర్ లో 116 అవార్డులను గెలుచుకుని ఎవరికీ అందనంత ఎత్తులో నిలబడ్డాడు యూనివర్సల్ స్టార్.

తెర వెనుక కమల్ హాసన్

నటన మాత్రమే కాకుండా చిన్నప్పటి నుండి కమల్ హాసన్ వివిధ శాఖల్లో పనిచేసిన అనుభవం పెద్దయ్యాక ఉపయోగపడింది. రాజ పార్వై, అపూర్వ సహోదరర్గళ్, మైఖేల్ మదన కామరాజు, తేవర్ మగన్, మహానది, హే రామ్, ఆళవదన్, అంబే శివన్, నల దమయంతి, విరుమాండీ, దశావతారం, మన్మధన్ అంబు, విశ్వరూపం సినిమాలకు రచన కూడా అందించాడు కమల్. అలాగే కమల్ హాసన్ తన బ్యానర్ రాజ్ కమల్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ బ్యానర్ ద్వారా బోలెడన్ని చిత్రాలను నిర్మించాడు. ఈ బ్యానర్ లో రాజా పార్వై, అమావాస్య చంద్రుడు, విక్రమ్, కడమై కన్నియమ్ కట్టుపాడు, సత్య, అపూర్వ సహోదరర్గళ్, తేవార్ మగన్. మగళిర్ మట్టుమ్, సతీ లీలావతి, కురుతిపునల్, ద్రోహి, చాచి 420, హే రామ్, నల దమయంతి, విరుమాండీ, ముంబై ఎక్స్ ప్రెస్, ఈనాడు, ఉన్నైపోల్ ఒరువన్, విశ్వరూపం, ఉత్తమవిలన్, తూంగావనం, చీకటి రాజ్యం, విశ్వరూపం 2, కదరం కొండన్, విక్రమ్ సినిమాలను నిర్మించాడు.

అలాగే చాచి 420, హే రామ్, విరుమాండీ, విశ్వరూపం సినిమాలను స్వయంగా డైరెక్ట్ చేసాడు కమల్ హాసన్. పూర్తి స్థాయిలో దర్శకుడు అవ్వాలని అనుకున్నా కానీ హే రామ్ ప్లాప్ అవ్వడంతో కేవలం కొన్ని సినిమాలకు మాత్రమే దర్శకత్వం వహించాడు. అంతటితోనే కాక కమల్ హాసన్ పాటల రచయితగా కూడా పనిచేసాడు. హే రామ్, విరుమాండీ, ఉన్నైపోల్ ఒరువన్, మన్మధన్ అంబు చిత్రాలలో కొన్ని పాటలకు సాహిత్యం అందించాడు. అలాగే తమిళ, తెలుగు, హిందీ, మలయాళం, ఇంగ్లీష్ భాషలలో కూడా పాటలను ఆలపించాడు.

లెజెండ్ అన్న పదానికి సరైన నిర్వచనం కమల్ హాసన్. ఊహ తెలీక ముందు నుండీ కూడా సినిమాలకే తన జీవితాన్ని అంకితం చేసిన కమల్ హాసన్ తన కెరీర్ లో ఎన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించాడు. నటనకు నిర్వచనంగా మారాడు. సినిమాలకు సంబంధించి ఎన్సైక్లోపీడియాగా పేరు గాంచాడు. అయితే కమల్ హాసన్ కెరీర్ కేవలం పూలపాన్పు మాత్రమే కాదు. ఎన్నో విమర్శలను ఎదుర్కున్నాడు. ఎత్తుపల్లాలు చూసాడు. అయినా వాటి నుండి బయటపడి నిలబడ్డాడు. కేవలం తమిళ్ ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా తెలుగు వారికి కూడా అత్యంత ప్రీతిపాత్రుడయ్యాడు. కమల్ హాసన్ ఇప్పటికే ఎన్నో విజయాలు సాధించాడు. ఇంకా నటించాలన్న ఆసక్తిని చూపిస్తోన్న ఈ యూనివర్సల్ స్టార్ మున్ముందు ఇంకా ఎన్నెన్నో సాధించాలని ఆకాంక్షిద్దాం.

- Advertisement -

You've successfully subscribed to Tollywood Latest News | Celebrities Profiles | Media9 Tollywood
Great! Next, complete checkout to get full access to all premium content.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.