త్రిష


అందం, అభినయం కలగలిసిన అతి తక్కువ మంది నటుల్లో త్రిష కూడా ఒకరు. సౌత్ లో త్రిష
టాప్ హీరోయిన్ గా చాలా ఏళ్ళు కొనసాగింది. నిజానికి సినిమాల్లోకి రాక ముందు త్రిష చాలా
అందాల పోటీల్లో పాల్గొంది. ఆమె 1999లో మిస్ సాలెంగా నిలిచింది. అదే సంవత్సరం మిస్ మద్రాస్ కిరీటాన్ని కూడా సొంతం చేసుకుంది త్రిష. అలాగే 2001లో మిస్ ఇండియా బ్యూటిఫుల్ స్మైల్ అవార్డును గెలుచుకుంది.

త్రిష గ్లామర్ ఇండస్ట్రీలో తొలి ప్రయాణం మోడల్ గా ప్రారంభించింది. 1999లో ‘జోడి’ అనే
తమిళ సినిమాతో త్రిష సినిమాల్లో అడుగుపెట్టింది. ఈ చిత్రంలో ఆమె సపోర్టింగ్ క్యారెక్టర్ చేసింది.
కానీ జోడి సినిమాతో త్రిషకు పెద్దగా గుర్తింపు రాలేదు. అయితే 2002లో ఆమె ‘మౌనం పెసియాదే’
సినిమా ద్వారా ఆమె మెయిన్ హీరోయిన్ గా తిరిగి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా తర్వాత నుండి త్రిష అసలు వెనుతిరిగి చూడలేదు. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో వరసగా సినిమాలు చేసింది.


2003లో ‘ఎనక్కు 20 ఉనక్కు 18’ చిత్రంలో నటించింది త్రిష. తరుణ్ హీరోగా రూపొందిన
ఈ చిత్రం తెలుగులో ‘నీ మనసు నాకు తెలుసు’ టైటిల్ తో విడుదలైంది. ఈ సినిమా యావరేజ్ ఫలితం అందుకున్నా కానీ త్రిషకు తగిన గుర్తింపు లభించింది. సినిమాలు, అడ్వర్టైజ్మెంట్లు మాత్రమే కాకుండా త్రిష మ్యూజిక్ వీడియోస్ లో కూడా కనిపించింది. ఫాల్గుణి పఠక్ రూపొందించిన వీడియో మేరీ చునార్ ఉద్ ఉద్ జాయే  సూపర్ హిట్ అయింది. 2000లో విడుదలైన ఈ వీడియో ద్వారా త్రిషకు మంచి గుర్తింపు వచ్చింది. ఈ వీడియోలో అయేషా టాకియాతో కలిసి నటించింది త్రిష.

దాదాపు రెండు దశాబ్దాల కెరీర్ లో త్రిష దాదాపు 65 సినిమాల్లో నటించింది. మే 4, 1983లో
జన్మించింది ఈమె. తమిళ పాలక్కాడ్ అయ్యర్ ఫ్యామిలీలో కృష్ణన్, ఉమా దంపతులకు ఒకే ఒక్క
సంతానం త్రిష. ఆమె స్కూలింగ్ అంతా సాక్రెడ్ హార్ట్ మెట్రిక్యూలేషన్ స్కూల్, చెన్నైలోనే సాగింది. ఆమెబ్యాచలర్ ఇన్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (బిబిఏ)ను ఎథిరన్ కాలేజ్ ఆఫ్ విమెన్, చెన్నై లో పూర్తి చేసింది. త్రిషకు మొదటి నుండి క్రిమినల్ సైకాలజిస్ట్ అవ్వాలని కోరిక. సినిమాలంటే పెద్దగా ఆసక్తి లేదు. అందుకే డిగ్రీ పూర్తి చేయడం మీద తొలుత దృష్టి పెట్టింది. ప్రస్తుతం త్రిష తన అమ్మ, అమ్మమ్మలతో కలిసి చెన్నైలోనే నివాసముంటోంది.

త్రిష తన కెరీర్ ను మోడల్ గా మొదలుపెట్టింది. 1999లో జోడి సినిమాతో సినిమాల్లో
అడుగుపెట్టింది. ఫాల్గుణి పఠక్ వీడియో సాంగ్ చేసిన తర్వాత దర్శకుడు ప్రియదర్శన్ త్రిషను
హీరోయిన్ గా పరిచయం చేయాలనుకున్నాడు. తమిళ చిత్రం లెస్స లెస్సను రూపొందించాడు.
అయితే ఆ సినిమా విడుదల ఆలస్యమై 2002లో ‘మౌనం పెసియాదే’ చిత్రం ద్వారా హీరోయిన్ గా
ఎంట్రీ ఇచ్చింది. అమీర్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయగా సూర్య శివకుమార్ హీరోగా నటించాడు. సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద యావరేజ్ రిజల్ట్ ను అందుకున్నా కానీ త్రిషకు విమర్శకుల నుండి మంచి పేరే వచ్చింది. త్రిషకు 2004లో ‘వర్షం’ సినిమా ద్వారా టాలీవుడ్ ఎంట్రీ దొరికింది. ఎమ్మెస్ రాజు నిర్మాణంలో రూపొందిన ఈ చిత్రం చాలా పెద్ద సక్సెస్. త్రిష పేరు టాలీవుడ్ లో మార్మోగిపోయింది.

దీంతో త్రిష అటు తమిళం, ఇటు తెలుగు అన్న తేడా లేకుండా వరసగా నటిస్తూ వెళ్ళింది.
విజయ్, సూర్య, మాధవన్, సిద్ధార్థ్, మహేష్ బాబు వంటి హీరోలతో ఆమె దాదాపు 13 సినిమాలు
చేసింది. వర్షం సినిమా తర్వాత టాలీవుడ్ లో త్రిష చేసిన రెండో చిత్రం నువ్వొస్తానంటే నేనొద్దంటానా.ఈ చిత్రం కూడా బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్. ఈ సినిమాను కూడా ఎమ్మెస్ రాజు నిర్మించగా ప్రభుదేవా డైరెక్ట్ చేసాడు. దీని తర్వాత ఆమె తెలుగులో చేసిన మూడో చిత్రం ‘అతడు’. మహేష్ బాబుతో త్రిష చేసిన మొదటి సినిమా ఇది. అతడు కూడా మంచి విజయాన్ని సాధించింది. త్రిష తెలుగులో చేసిన మొదటి మూడు చిత్రాలు సక్సెస్ అవ్వడంతో ఆమె హ్యాట్రిక్ సాధించింది.


ఎమ్మెస్ రాజు నిర్మాణంలో త్రిష నటించిన మూడో చిత్రం ‘పౌర్ణమి’. ఈ సినిమాను కూడా
ప్రభుదేవే డైరెక్ట్ చేయడం విశేషం. ఆ తర్వాత స్టాలిన్ లో చిరంజీవితో, సైనికుడులో మహేష్ తో కలిసి నటించింది. ఆమె తెలుగు, తమిళంలో ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే, కిరీడం, భీమ, కురువి, కృష్ణ, బుజ్జిగాడు, అభినయుమ్ నానుమ్, కింగ్, సర్వం, శంఖం చిత్రాల్లో నటించింది. 2010లో త్రిషకు పెద్ద బ్రేక్ వచ్చిందని చెప్పొచ్చు. గౌతమ్ మీనన్ దర్శకత్వంలో త్రిష నటించిన ‘విన్నైతాండి వరువాయ’ రొమాంటిక్ డ్రామా సెన్సేషనల్ సక్సెస్ సాధించింది. సిరియన్ మలయాళీ క్రిస్టియన్ జెస్సి పాత్రలో త్రిష నటనకు బోలెడన్ని ప్రశంసలు దక్కాయి. అలాగే సినిమా కూడా తమిళ నాట సెన్సేషన్ అయింది. ప్రతీ అబ్బాయికి కలల అమ్మాయిగా నిలిచింది జెస్సి. ఆ దశాబ్దపు టాప్ హీరోయిన్ గా నిలిచింది త్రిష.

అలాగే 2010లో కట్టా మీఠా చిత్రంతో హిందీలోకి కూడా అడుగుపెట్టింది ఈ భామ. దాని
తర్వాత చాలా సూపర్ హిట్ సినిమాల్లో నటించింది కానీ ‘96’ ఆమె కెరీర్ లో మరో టర్నింగ్ పాయింట్ అని చెప్పవచ్చు. ఈ సినిమాలో తన పెర్ఫార్మన్స్ ద్వారా విమర్శకుల నుండి ప్రేక్షకుల నుండి అదే స్థాయిలో ప్రశంసలను అందుకుంది.  2019లో రజినీకాంత్ హీరోగా రూపొందిన ‘పెట్టా’లో త్రిష హీరోయిన్.


వర్షం సినిమాలో ఆమె నటనకు గాను ఫిల్మ్ ఫేర్, సంతోషం అవార్డులను ఉత్తమ డెబ్యూ
కేటగిరీలో గెలుచుకుంది. అలాగే నువ్వొస్తానంటే నేనొద్దంటానా చిత్రం ద్వారా మూడు ఉత్తమ నటి
అవార్డులు త్రిష వశమయ్యాయి. అందులో నంది, ఫిల్మ్ ఫేర్ అవార్డులు ఉన్నాయి. నువ్వొస్తానంటే
నేనొద్దంటానా ఆమెకు తొలి నంది అవార్డ్. తన కెరీర్ లో మొత్తం 11 ఫిల్మ్ ఫేర్ అవార్డులకు నామినేట్ అయిన త్రిష, 5 అవార్డులను గెలుచుకుంది. ‘96’ చిత్రానికి ఆమె గెలుచుకుంది చివరి పురస్కారం. ఈ సినిమాలో విజయ్ సేతుపతితో కలిసి నటించింది.
2015లో విమెన్ అఛీవర్ అవార్డును గెలుచుకుంది త్రిష. అలాగే సైమా నుండి ఆమెకు చాలా
పురస్కారాలు లభించాయి. త్రిషతో వరసగా మూడు సినిమాలు నిర్మించిన ఎమ్మెస్ రాజు త్రిషను
ఇప్పటిదాకా తను పనిచేసిన హీరోయిన్స్ లో చాలా అందమైన, టాలెంటెడ్ నటిగా కొనియాడారు.
నర్గిస్, సావిత్రి వంటి లెజండరీ నటీమణులతో త్రిషను పోల్చారు. అలాగే 2019 ఆసియా విజన్ మూవీ అవార్డ్స్, దుబాయ్ లో బాలీవుడ్ నటుడు రణ్వీర్ సింగ్ త్రిషను ఇండస్ట్రీలో మోస్ట్ అమేజింగ్ ఆర్టిస్ట్ అని పొగిడారు. అలాగే ఆమెను తాను చాలా ఆరాధిస్తాను అని తెలిపారు.


నువ్వొస్తానంటే నేనొద్దంటానా చిత్రం మొత్తంగా ఎనిమిది ఫిల్మ్ ఫేర్ సౌత్ అవార్డులను
గెలుచుకుంది. ఇది ఇప్పటికే హయ్యస్ట్ అవార్డుల రికార్డ్. హాలీవుడ్ లో త్రిష ఫెవరెట్ మూవీస్ అంటే ఇంగ్లీష్ పేషెంట్, ది సైలెన్స్ ఆఫ్ ది లాంబ్స్ అని ఒక సందర్భంలో చెప్పింది. తమిళంలో వళ్ళు, జిల్లా ఆమె ఫెవరెట్ సినిమాలని తెలిపింది. అలాగే ఫుడ్ విషయంలో బ్రౌన్ రైస్, చికెన్ కర్రీ ఆమె ఫెవరెట్ ఫుడ్ అని రివీల్ చేసింది.  త్రిషకు మొదటి నుండి జంతువులు అంటే చాలా ఇష్టం. పెటా సంస్థకు గుడ్ విల్ అంబాసడర్ గా వ్యవహరిస్తోంది త్రిష. ఫాంటా పానీయ సంస్థకు బ్రాండ్ అంబాసడర్ గా వ్యవహరించింది. అలాగే స్కూటీ పెప్ ప్లస్, వివెల్, డి-విల్స్ బ్రాండ్స్ కు ప్రచారకర్తగా పనిచేసింది త్రిష. అలాగే ఇప్పటివరకూ బోలెడన్ని జ్యువలరీ, సారీ సంస్థలకు ఎంబాజిడర్ గా చేసారు త్రిష.

- Advertisement -

You've successfully subscribed to Tollywood Latest News | Celebrities Profiles | Media9 Tollywood
Great! Next, complete checkout to get full access to all premium content.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.