స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి

మాములు కథల్ని స్టైలిష్ గా తెర మీద చూపించడంలో దర్శకుడు సురేందర్ రెడ్డి దిట్ట. ఆయన మొదటి సినిమా నుంచి ఇప్పటిదాకా అన్ని సినిమాల్లో ఏదో ఒక కొత్తదనం చూపిస్తూ వస్తున్నారు. ఆయన సినిమాల్లో హీరోల క్యారెక్టర్స్ కూడా చాలా విభిన్నంగా ఉంటాయి. తెలుగులో టాప్ డైరెక్టర్స్ లో ఒకరైన సురేందర్ రెడ్డి సినిమాలకి హిట్స్ ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా అభిమానులు ఉన్నారు.

జననం

1975 డిసెంబర్ 7 న కరీంనగర్ లోని జమ్మికుంట గ్రామంలో జన్మించారు సురేందర్ రెడ్డి. చిన్నప్పటి నుంచి సినిమాల మీద ఉన్న ఆసక్తి తో సురేందర్ రెడ్డి డిగ్రీ చదువుని మధ్యలోనే ఆపేసి హైదరాబాద్ కి వచ్చారు. సురేందర్ రెడ్డి దాదాపుగా 9 సంవత్సరాలు టి ప్రభాకర్ రెడ్డి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసారు. దాని తర్వాత ప్రొడ్యూసర్ మరియు డైరెక్టర్ అయిన క్రాంతి కుమార్ దగ్గర కొన్ని సినిమాలకి అసిస్టెంట్ డైరెక్టర్ గా చేశారు.

సినీ ప్రయాణం

2004లో సురేందర్ రెడ్డి ‘అతనొక్కడే’ కథతో ప్రొడ్యూసర్స్ చుట్టూ తిరగటం మొదలుపెట్టారు. ఆయన దర్శకుడిగా పరిచయం అయిన అతనొక్కడే కథను ముందుగా ఎన్టీఆర్‌కు చెప్పాడు.. అయితే అది అనుకోకుండా కళ్యాణ్ రామ్ దగ్గరికి వచ్చి అతన్ని హీరోగా, నిర్మాతగా నిలబెట్టింది. ఈ సినిమా దాదాపుగా 10 కోట్ల బడ్జెట్ తో నిర్మించాడు కళ్యాణ్ రామ్. అతనొక్కడే విడుదలైన మొదటి రోజు నుంచి సూపర్ హిట్ టాక్ తో బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఈ సినిమా అప్పట్లోనే 20 కోట్ల వరకు కలెక్ట్ చేసింది. ఈ సినిమాని తమిళంలో విజయ్ రీమేక్ చేసి సూపర్ హిట్ కొట్టారు.

అతనొక్కడే సినిమా సూపర్ హిట్ అవ్వడంతో సురేందర్ రెడ్డికి ఎన్టీఆర్ ని డైరెక్ట్ చేసే అవకాశం వచ్చింది. వీరి కాంబినేషన్ లో వచ్చిన సినిమా ‘అశోక్’. ఈ సినిమా భారీ అంచనాలతో విడుదలైంది. విడుదలైన మొదటి వారంలోనే 10 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది ఈ సినిమా. అప్పట్లో 10 కోట్లు అంటే పెద్ద విషయమే. కానీ ఈ సినిమా తర్వాత కలెక్షన్స్ ని రాబట్టడంలో విఫలం అయింది. అశోక్ సినిమా చివరికి ఒక యావరేజ్ హిట్ గా నిలిచింది.

ఇక పోకిరి తర్వాత మహేష్ బాబు క్రేజ్ ఆకాశాన్ని అంటింది. ఆ తర్వాత వచ్చిన సైనికుడు సినిమా సరిగ్గా అడకపోయినా కూడా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ‘అతిధి’ సినిమా మీద విడుదలకి ముందు భారీ అంచనాలు ఉన్నాయి. బాలీవుడ్ సంస్థ యమ్ టీవీ నిర్మించిన ఈ సినిమాలో బాలివుడ్ పాపులర్ హీరోయిన్ అమృత రావు హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా పాటలకు అప్పట్లో ఉన్న బజ్ అంత ఇంత కాదు. ఈ సినిమా భారీ ఎత్తున 2007 లో విడుదలైంది. అప్పటికి తెలుగులో అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మించబడిన ఈ సినిమా విడుదల తర్వాత దారుణమైన ఫ్లాప్ అయింది.

అతిధి సినిమా తర్వాత సురేందర్ రెడ్డి 2 సంవత్సరాలు గాప్ తీసుకొని మళ్ళీ ఒక బ్లాక్ బస్టర్ తో వచ్చాడు. అది రవితేజ కెరీర్‌లో ఈ రోజుకు కూడా లాభాల పరంగా కానీ.. మార్కెట్ పరంగా కానీ చూసుకుంటే అతడి టాప్ సినిమాల్లో ఒకటి. సురేందర్ రెడ్డి తెరకెక్కించిన ఈ చిత్రం సంచలన విజయం సాధించింది. అప్పట్లోనే 30 కోట్ల వరకు వసూలు చేసి రవితేజ రేంజ్ ఏంటో చూపించింది ఈ చిత్రం. ఆ సినిమానే రవితేజను నటుడిగా మరో మెట్టు పైకి ఎక్కించిన ‘కిక్’. 2009 మే 8 న విడుదలయ్యింది ఈ సినిమా. అప్పటికే అతిథి, అశోక్ లాంటి ఫ్లాపులతో వెనకబడిపోయిన సురేందర్ రెడ్డి కిక్ కథ సిద్ధం చేసుకున్నాడు. దీన్ని ఒప్పించడానికి చాలా మంది హీరోలను కలిసాడు. కానీ చాలా మంది దీన్ని రిజెక్ట్ చేసారు కూడా. వక్కంతం వంశీ రాసిన ఈ కథ ముందు రవితేజ కోసం మాత్రం సిద్ధం చేయలేదు.. ఆయన్ని దృష్టిలో పెట్టుకుని చేసిన కథ కూడా కాదు. ప్రభాస్‌తో పాటు యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కు ముందుగా ఈ కథను వినిపించాడు సురేందర్ రెడ్డి. ఎక్కడో లెక్క తప్పి ఈ చిత్రానికి వాళ్లు నో చెప్పారు. ఆ తర్వాత రవితేజ లైన్‌లోకి వచ్చాడు. మాస్ రాజా ఎంట్రీతో కిక్ స్వరూపమే మారిపోయింది. ఆయనతో పాటు బ్రహ్మానందం కామెడీ టైమింగ్ సినిమాను మరో స్థాయిలో నిలబెట్టింది. చివర్లో పాప ఎమోషనల్ ఎపిసోడ్.. ఇలియానా గ్లామర్.. కొత్త నటుడు శ్యామ్ నటన.. అన్నీ కలిపి అప్పటి వరకు 10 కోట్లున్న రవితేజ మార్కెట్‌ను ఏకంగా 25 కోట్లకు పెంచేసింది. ఇప్పటికీ టీవీలో వచ్చిన ప్రతీసారి కూడా కిక్ మంచి రేటింగ్స్ తీసుకొస్తుంటుంది. అంత పెద్ద బ్లాక్‌బస్టర్ ఈ చిత్రం. కిక్ కోసం ఏదైనా చేసే పాత్రలో చెలరేగిపోయాడు రవితేజ. ఎన్టీఆర్, ప్రభాస్ రిజెక్ట్ చేసినా కూడా సరైన హీరోకే ఈ చిత్రం పడిందని తర్వాత అభిమానులు కూడా సంతోషపడ్డారు.

కిక్ సినిమా ఇచ్చిన కిక్ తో సురేందర్ రెడ్డి ఎన్టీఆర్ హీరోగా ఊసరవెల్లి సినిమాని డైరెక్ట్ చేశారు.ఈ సినిమాలో టోనీ గా ఎన్టీఆర్ నటన సూపర్ అని చెప్పాలి. అయితే ఈ సినిమా మాత్రం అనుకున్నంత రేంజ్ లో ఆడలేదు. కానీ ఊసరవెల్లి సినిమా మొదటిరోజు 16 కోట్ల కలెక్షన్స్ కొల్లగొట్టి అప్పట్లో రికార్డ్ సృష్టించింది.

సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శకుడిగా ఇంకొక మెట్టు ఎక్కిన సినిమా అల్లు అర్జున్ క‌థానాయ‌కుడిగా న‌టించిన  `రేసుగుర్రం`. . అన్నాద‌మ్ముల అనుబంధానికి మంచి క‌మ‌ర్షియ‌ల్ పాయింట్స్ జోడించి – మాస్‌కి న‌చ్చేలా తీర్చిదిద్దారు. బ‌న్నీ కెరీర్‌లో మ‌ర్చిపోలేని సినిమా ఇది. సినిమా అంతా ఒక ఎత్తు.. చివ‌ర్నో కిల్ బిల్ పాండే గా బ్ర‌హ్మానందం విజృంభ‌ణ మ‌రో ఎత్తు. ఈ సినిమా మొదటి ఆట నుంచి సూపర్ హిట్ టాక్ తో దూసుకెళ్లింది. తెలుగులో వచ్చిన భారీ బ్లాక్ బస్టర్స్ లో అల్లు అర్జున్ రేసుగుర్రం ఒకటి. ఈ సినిమాలో వచ్చే ఇంట్రవెల్ ఫైట్ ఈ సినిమాకే పెద్ద హైలైట్. దాదాపుగా 60 కోట్ల షేర్ సంపాదించిన ఈ సినిమా అల్లు అర్జున్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటి.

ఇక రవితేజ నటించిన కిక్ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో అందరికి తెలిసిందే. ఆ సినిమాలానే సురేందర్ రెడ్డి తీసిన కిక్ 2 కూడా విజయం సాధిస్తుంది అని అందరూ అనుకున్నారు. హీరో కళ్యాణ్ రామ్ నిర్మాతగా రవితేజ, రకుల్ ప్రీత్ జంటగా నటించిన ఈ కిక్ 2 బాక్స్ ఆఫీస్ దగ్గర దారుణమైన పరాజయం అందుకుంది. అలాగే ఈ సినిమాలో రవితేజ లుక్ మీద కామెంట్స్ కూడా వచ్చాయి.

సురేందర్ రెడ్డి కిక్ 2 తర్వాత తీసిన సినిమా ధ్రువ. మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ కెరీర్లో ‘ధృవ’ సినిమా ప్రత్యేకంగా నిలుస్తుంది. యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమాతో ఆయన ఇమేజ్ భారీగా పెరిగింది. తమిళంలో జయం రవి నటించి... అతని సోదరుడు మోహన్‌ రాజ్‌ తెరకెక్కించిన ‘తని ఒరువన్‌’ సూపర్‌హిట్‌గా నిలిచింది. దీనికి డైరెక్టర్ సురేందర్‌రెడ్డి కొన్ని మార్పులు చేసి తెలుగులో తెరకెక్కించారు. రామ్‌చరణ్ స్టైల్, యాక్షన్‌కు తోడు అరవిందస్వామి విలనిజంతో ఈ సినిమా తెలుగులోనూ భారీ విజయం సాధించింది. ఈ సినిమాలో అరవింద స్వామి పోషించిన స్టైలిష్ విలన్ పాత్రను తెలుగులో రాజశేఖర్‌తో చేయిద్దామని దాదాపు ఖరారు అయిందట. లాస్ట్ మినిట్‌లో ఆ పాత్రను అరవింద్ స్వామి చేసాడు. ఇక తమిళంలో అరవింద్ స్వామి ఒక్కడే ఉన్న చాలా సీన్స్‌ ‌ను తెలుగులో యాజిటీజ్‌గా వాడేసుకున్నారు. ఈ రకంగా తెలుగు నిర్మాతలకు బడ్జెట్ కలిసి రావడంతో రాజశేఖర్‌కు విలన్‌గా నటించే ఛాన్స్ మిస్ అయింది.

మెగాస్టార్ చిరంజీవి  గారిని దర్శకత్వం వహించే ఛాన్స్ కొట్టేసిన సురేందర్ రెడ్డి సైరా నరసింహ రెడ్డి సినిమాని ఒక రేంజ్ లో తీశారు. ఈ సినిమాలో బాలీవుడ్ దిగ్గజం అమితాబ్ బచ్చన్, కోలీవుడ్ సంచలనం విజయ్ సేతుపతి, కన్నడ టాప్ హీరో కిఛ్చ సుదీప్ లాంటి భారీ తారాగణంతో ఈ సినిమాని తెరెక్కించారు. అక్టోబర్ 2న హిందీ, తమిళం, మలయాళ భాషల్లో విడుదలైన సైరా నరసింహారెడ్డి సినిమా తెలుగు రాష్ట్రాల్లో 106 కోట్ల మార్క్ షేర్‌ను అందుకుంది. పెరిగిన దసరా సెలవులు నైజాంలో ఈ సినిమాకు బాగానే ఉపయోగపడ్డాయి. మొత్తంగా 240 కోట్ల గ్రాస్.. రూ. 143కోట్లు షేర్ ప్రపంచ వ్యాప్తంగా వసూలు చేసింది సైరా. కానీ ఈ సినిమాకి వచ్చిన సూపర్ హిట్ టాక్ ఎక్కువ రోజులు నిలబడలేదు. ఓవరాల్‌గా చూసుకుంటే సైరా చిరంజీవికి నిరాశనే మిగిల్చింది. ఈ చిత్రాన్ని దాదాపు 188 కోట్లకు పైగానే నిర్మాతలు అమ్మినట్లు తెలుస్తుంది. తెలుగులో మాత్రమే సైరా మంచి వసూళ్లు సాధించింది. ఇక్కడ 106 కోట్ల వరకు షేర్ తీసుకొచ్చింది. ఇక్కడా కూడా కొన్ని ఏరియాల్లో స్వల్ప నష్టాలను తీసుకొచ్చాడు చిరంజీవి. నైజాంలో 32 కోట్లు.. సీడెడ్‌లో 18 కోట్లు.. ఆంధ్రలో 54 కోట్లు వసూలు చేసింది ఈ చిత్రం. ఒకట్రెండు చోట్ల మాత్రమే సైరా బ్రేక్ ఈవెన్ అయి లాభాలు తీసుకొచ్చింది. మిగిలిన చోట్ల నష్టాలు తప్పలేదు. ఇక మిగిలిన భాషల్లో అయితే ‘సైరా నరసింహారెడ్డి’ దారుణంగా నిరాశ పరిచింది. ఓవర్సీస్‌లో అయితే పరిస్థితి మరీ దారుణం. అక్కడ 2.5 మిలియన్ దగ్గరే ఆగిపోయింది ఈ చిత్రం. కానీ ఈ సినిమా చిరంజీవి గారి కెరీర్ లో చాలా ప్రత్యేకమైన సినిమాగా చెప్పుకోవచ్చు. 60 ఏళ్ల వయసులో కూడా చిరంజీవి గారు ఈ సినిమాలో చేసిన స్టంట్స్ అభిమానులని బాగా ఆకట్టుకున్నాయి.

ఇక సురేందర్ రెడ్డి ప్రస్తుతం అక్కినేని అఖిల్ తో ఒక సినిమా చేస్తున్నారు. ఈ చిత్రానికి ఏజెంట్ అనే టైటిల్ ను ఖరారు చేసారు. ఇటీవలే విడుదల చేసిన పోస్టర్ కి విపరీతమైన స్పందన లభించింది.

వ్యక్తిగత జీవితం

సురేందర్ రెడ్డి వివాహం 2010 లో దీప రెడ్డితో ఘనంగా జరిగింది. ఈ పెళ్లికి ఇండస్ట్రీలో ఉన్న పెద్దలు అందరూ హాజరయ్యారు. సురేందర్ రెడ్డి, దీప రెడ్డి దంపతులకు ఆరిక్, ఆయాన్ష్ అని ఇద్దరు పిల్లలు ఉన్నారు.

దీప రెడ్డి ని మొదటిసారి సురేందర్ రెడ్డి ఒక ఫ్యామిలీ ఫంక్షన్ లో కలిసారట. అక్కడ మొదలైన వీరి పరిచయం మెల్లగా ప్రేమగా మారడంతో ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. ఇక దీప రెడ్డి బిసినెస్ మనేజ్మెంట్ లో గ్రాడ్యుయేషన్ చేసింది. ఆమె గచ్చిబౌలి లో ఉలవచారు రెస్టారెంట్ ని స్థాపించారు.

అవార్డ్స్

సురేందర్ రెడ్డికి బెస్ట్ డెబ్యూ డైరెక్టర్  గా అతనొక్కడే సినిమాకి నంది అవార్డ్ వచ్చింది. అలాగే రేసుగుర్రం సినిమాకి బెస్ట్ డైరెక్టర్ గా ఫిలింఫేర్ అవార్డ్ సురేందర్ రెడ్డి కి లభించింది.

- Advertisement -

You've successfully subscribed to Tollywood Latest News | Celebrities Profiles | Media9 Tollywood
Great! Next, complete checkout to get full access to all premium content.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.