మరో రికార్డ్ క్రియేట్ చేసిన సాయి పల్లవి

యూత్ లో సాయి పల్లవికి ఉన్న క్రేజ్ అంత ఇంత కాదు. తన నటనతో, హావాభావాలతో ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేస్తుంది. ఆమె నటించే సినిమా ఎలాంటిదైనా విపరీతమైన హైప్ క్రియేట్ అవుతుంది. ప్రేమమ్ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సాయి పల్లవి దాదాపు అన్నీ దక్షిణాది భాషలలోను నటించింది. ఫిదా సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇస్తూనే బ్లాక్ బస్టర్ ను తన ఖాతాలో వేసుకుంది. మొదటి సినిమాతోనే నటిగా విమర్శకుల ప్రశంసలు అందుకుని అగ్రపథంలో దూసుకుపోతోంది.

నాగ చైతన్య సరసన నటిస్తున్న లవ్ స్టోరి, రానా సరసన నటిస్తున్న విరాటపర్వం రెండూ విడుదలకు సిద్ధమయ్యి కరోన కారణంగా విడుదలను వాయిదా వేసుకున్నాయి. రెండూ క్రేజీ ప్రాజెక్ట్స్ అవడం విశేషం. నటిగానే కాకుండా డ్యాన్సర్ గా కూడా సాయి పల్లవి తన ప్రతిభను చూపిస్తుంటారు. ఎలాంటి మూవ్మెంట్ అయినా అలవోకగా చేసి కొరియోగ్రఫర్స్ చేత శభాష్ అనిపించుకుంటుంది. ఆమె డ్యాన్స్ కోసం వీడియో సాంగ్స్ చూసే వాళ్ళు చాలామంది ఉన్నారు. గాడ్ ఆఫ్ ఇండియన్ డ్యాన్స్ గా కొలవబడే ప్రభుదేవా సైతం ఆమె స్పీడ్ ని ఆమె గ్రేస్ ని పొగడ్తలతో ముంచేత్తారు.

ఇటీవల విడుదలైన లవ్ స్టోరిలోని సారంగ దరియా సాంగ్ యూట్యూబ్ లో 150 మిలియన్ వ్యూస్ మార్క్ ను చేరుకొని రికార్డ్ నెలకొల్పింది. సాయి పల్లవి, శేఖర్ మాస్టర్, శేఖర్ కమ్ముల వీరి కలయికలో ఇదివరకు వచ్చిన ఫిదా సినిమాలోని వచ్చిండే పిల్లా మెల్లగ వచ్చిండే పాట దాదాపు 300 మిలియన్ వ్యూస్ కి చేరువలో ఉంది. అలాగే ప్రభుదేవా సారధ్యంలో తెరకెక్కిన రౌడి బేబీ పాట 1.1 బిలియన్ యూస్ తో రికార్డ్ లను తిరిగారాసిన విషయం తెలిసిందే. ఇక మున్ముందు సాయిపల్లవి ఇంకెన్ని రికార్డ్స్ బ్రేక్ చేస్తుందో చూడాలి మరి.

- Advertisement -

You've successfully subscribed to Tollywood Latest News | Celebrities Profiles | Media9 Tollywood
Great! Next, complete checkout to get full access to all premium content.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.