ఎస్పీబాలసుబ్రహ్మణ్యం

పరిచయం

ఆయన గొంతు సవరిస్తే కోయిల సైతం చిన్నబోతుంది. ఆయన స్వరం వింటే కోట్లాది మంది హృదయాలలో సప్త స్వరాలు రాగాలు తీస్తాయి. ఆయనే కళా ప్రపూర్ణ, గాన గంధర్వుడు, గాన విధూషి, సుస్వర మాంత్రికుడు, గాయకుడు, సంగీత దర్శకుడు, నటుడు, నిర్మాత, బహుముఖ ప్రజ్ఞాశాలి ‘శ్రీ శ్రీపతి పండితారాధ్యుల బాల సుబ్రహ్మణ్యం’ గారు.


జననం

బాలసుబ్రహ్మణ్యంగారు 1946, జూన్ 4వ తేదీన మద్రాసు ప్రెసిడెన్సీలోని తిరువళ్ళూరు జిల్లాలోని కోనేటమ్మపేట గ్రామంలో, శ్రీపతి పండితారాధ్యుల సాంబమూర్తి, శకుంతలమ్మ దంపతులకు జన్మించారు. ఆయన తండ్రి పేరొందిన హరికథా కళాకారుడు ఆయన భక్తిరస నాటకాలు కూడా వేస్తుండేవాడు. సాంబమూర్తితో ఇంట్లో పండితులు, కవులు భాషా, సాహిత్య పరమైన చర్చలు జరుపుతూంటే వినీ వినీ బాలసుబ్రహ్మణ్యానికి బాల్యం నుంచే భాషపై ఆసక్తి పెరిగింది. తండ్రి హరికథా కళాకారుడు కావడంతో బాలుకు చిన్నప్పటి నుంచే సంగీతం మీద ఆసక్తి ఏర్పడింది.


విద్యాభ్యాసం

ఐదేళ్ళ వయసులో తండ్రితో కలిసి భక్త రామదాసు అనే నాటకంలో నటించారు. ఆయనకు సంగీతం మీద ఆసక్తి ఉన్నప్పటికీ సంగీతం మాత్రం నేర్చుకోలేదు. ప్రాథమిక విద్య, నగరిలోని మేనమామ శ్రీనివాసరావు ఇంటిలో ఉంటూనే పూర్తి చేశారు. శ్రీకాళహస్తిలోని బోర్డు పాఠశాలలో ఉన్నత విద్యను అభ్యసించారు. చదువులోనే కాక, ఆటల్లో కూడా మొదటి వాడుగా ఉండేవాడు. శ్రీకాళహస్తిలో చదివేటప్పుడే రాధాపతి అనే ఉపాధ్యాయుడు ఈ ఇల్లు అమ్మబడును, ఆత్మహత్య లాంటి నాటకాల్లో బాలుగారిని నటింపజేశారు. మద్రాసు ఆలిండియా రేడియోలో ప్రసారమయ్యే ఒక నాటికలో స్త్రీ పాత్ర ధరించాడు.

ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో బాలు స్వయంగా రాసి, స్వరపరిచి పాడిన లలిత గీతానికి బహుమతి లభించింది.

తిరుపతిలో పి.యు.సి పూర్తి చేసుకుని నెల్లూరు వెళ్ళిన బాలు అక్కడ కొంతమంది మిత్రులతో కలిసి ఒక ఆర్కెస్ట్రా ఏర్పాటు చేసి ప్రదర్శనలు ఇచ్చేవాడు. తర్వాత అనంతపురంలో ఇంజనీరింగులో సీటు వచ్చింది. కానీ ఆయనకు అక్కడి వాతావరణం నచ్చక తిరిగి వచ్చేశాడు. మద్రాసు వెళ్ళి ఇంజనీరింగుకి ప్రత్యామ్నాయమైన ఎ.ఎం.ఐ.ఇ కోర్సులో చేరాడు. ఆయన తండ్రికి తను ఇంజనీరు కావాలని కోరిక. తండ్రి కోరికననుసరించి బాలసుబ్రహ్మణ్యం కూడా చదువుకునే రోజుల్లోనూ, ఆ తర్వాత పాటలు పాడే రోజుల్లో కొన్నేళ్ళు మంచి ఇంజనీర్ కావాలని, ప్రభుత్వ శాఖల్లో ఇంజనీరుగా పనిచేయాలని కలలు కనేవారు. ఆ కాలములోనే వివిధ పాటల పోటీలలో పాల్గొని బహుమతులు గెలుచుకున్నారు.

సినీ రంగ ప్రవేశం

1964లో మద్రాస్ లో ‘ఆంధ్రా సోషల్ అండ్ కల్చరల్ క్లబ్’ నిర్వహించిన లలిత సంగీత పోటీల్లో బాలు గారికి ప్రథమ బహుమతి లభించింది. ఆ పోటీకి సంగీత దర్శకులు సుసర్ల దక్షిణామూర్తి, ఎస్.పి. కోదండపాణి, పెండ్యాల నాగేశ్వరరావు, ఘంటసాల వెంకటేశ్వరరావు గార్లు న్యాయనిర్ణేతలు. ఆ పోటీలో ఎస్. పి. కోదండపాణిగారు ఆయన ప్రతిభను గుర్తించి సినిమాల్లో అవకాశం కల్పిస్తానని మాట ఇచ్చారు. అలా ఎ.ఎం.ఐ.ఇ రెండో సంవత్సరంలో ఉండగా బాలసుబ్రహ్మణ్యం చలనచిత్ర రంగ ప్రవేశం చేసాడు. అలా ఆయన ఎస్.పి.కోదండపాణి గారి దగ్గర శిష్యరికం చేసారు.  1966లో నటుడు, నిర్మాత అయిన పద్మనాభం నిర్మించిన శ్రీ శ్రీ శ్రీ మర్యాద రామన్న చిత్రంతో గాయకునిగా సినీ రంగ ప్రవేశం చేసారు. ఏమి ఈ వింత మొహం అనే పాటను ఆయన పి. సుశీల, కళ్యాణం రఘురామయ్య, పి.బి.శ్రీనివాస్ లతో కలిసి పాడారు ఈ చిత్రానికి ఎస్.పి.కోదండపాణి  సంగీత దర్శకత్వము వహించారు. కోదండపాణి, బాలు పాడిన మొదటి పాటను రికార్డిస్టు స్వామినాథన్ తో చెప్పి చెరిపివేయకుండా అలాగే ఉంచి తన దగ్గరకు వచ్చిన సంగీత దర్శకులను    అది వినిపించి అవకాశాలు ఇప్పించేవారు.

అలా తనకు సినీ గాయకునిగా జీవితాన్ని ప్రసాదించిన కోదండపాణిపై భక్తితో, అభిమానంతో తాను నిర్మించిన ఆడియో ల్యాబ్ కు "కోదండపాణి ఆడియో ల్యాబ్స్" అని ఆయన  పేరే పెట్టుకున్నారు బాలు. ఘంటసాల గారిని, మొహమ్మాద్ రఫీ గారిని విపరీతంగా అభిమానించే బాలుగారు, తనకంటూ ఒక ప్రత్యేకమైన బాణి ఉండాలని ఎప్పుడూ తాపత్రయపడేవారు.

గాయకుడిగా ఆయన ప్రస్థానం  
1969 నుంచి బాలు గారికి గాయకుడిగా పుష్కలంగా అవకాశాలు రాసాగాయి. ఆయన పాటలు ముఖ్యంగా ఆ నాటి యువతను ఉర్రూతలూగించాయి. చాలామంది నటులకు వారి హావభావలను, వారి శైలిని దృష్టిలో పెట్టుకుని దానికి అనుగుణంగా ఆయన పాటలు పాడేవారు. అందుకే అమరగాయకుడు ఘంటసాల తరువాత తెలుగు సినీ పాటకు సిసలయిన వారసుడిగా నిలిచారు. పరిశ్రమలో దాదాపు ప్రతీ నటుడికి ఆయనే పాడినప్పటికీ, ఎన్.టి.ఆర్ గారికి ఏ.ఎన్.ఆర్ గారికి అప్పట్లో ఘంటసాల గారు మాత్రమే పాడేవారు. ఎవరైనా కొత్త గాయకుడితో పాడిస్తే ప్రేక్షకులు ఒప్పుకోరని ఎవరూ కొత్త వారితో పాడించే ప్రయత్నం చేసేవారు కాదు. అదే సమయంలో చలపతిరావు గారి సలహా మేరకు ఎన్.టి.ఆర్ గారికి ఏ.ఎన్.ఆర్ గారికి పాడేటప్పుడు వాళ్ళ స్టైల్ కి దగ్గరగా ఆయన స్వరాన్ని సరిచేసి పాడేవారు. అక్కడి నుంచి వాళ్ళిద్దరికీ కూడా ఆయనే పాడేవారు. అలా ప్రేక్షకుల మనసు నొచ్చుకోకుండా, స్వయంగా ఎన్.టీ.ఆర్, ఏ.ఎన్.ఆర్ గార్లే పాడుతున్నారా అనే విధంగా ఆయన పాడి తన స్వర చాతుర్యంతో ప్రేక్షకులు మైమరిచిపోయేలా చేసారు. 1966వ సంవత్సరంలో  శ్రీ శ్రీ శ్రీ మర్యాద రామన్న చిత్రంతో మొదలుపెట్టి 54 సంవత్సరాల సుధీర్గ కాలంలో, 16 భాషల్లో, 37వేల పై చిలుకు పాటలు పాడి తన జైత్రయాత్రను కొనసాగించారు.

1966-1980

1966లో శ్రీ శ్రీ శ్రీ మర్యాద రామన్న చిత్రం తర్వాత, కళా తపస్వి ‘కె. విశ్వనాథ్’ గారి దర్శకత్వంలో వచ్చిన ఆయన రెండోవ చిత్రం ‘ప్రైవేట్ మాస్టర్’ చిత్రంలో ‘పాడుకో పాడుకో’ అంటూ సాగే పాటను పాడారు. ఆ తర్వాత 1968లో సుఖ దుఃఖాలు, పాల మనసులు, మాయా మందిరం, రాజ యోగం చిత్రాల్లో ఆయన పాటలు పాడారు.1969లో శ్రీ రామ కథా, మంచి మిత్రులు, బంగారు పంజరం, మహాబలుడు, ఆత్మీయుడు, రాజ్య కాంక్ష, నిండు హృదయాలు, అర్థరాత్రి, నాటకాల రాయుడు, మనుషులు మారాలి చిత్రాలకు ఆయన పాటలు పాడారు. 1970 వ సంవత్సరంలో ‘జానపద బ్రహ్మ’ ‘విటలాచార్య’ గారి  దర్శకత్వంలో ఘంటసాల గారు సంగీతం అందించిన ‘ఆలీ బాబా 40 దొంగలు’ చిత్రంలోని పాటలు ఆయనకు మంచి పేరు తీసుకొచ్చాయి. ఆయన కేవలం తెలుగులోనే కాకుండా తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో కుడా ఆయన పాటలు పాడారు.

70వ దశకం లో బాలు గారు బడిపంతులు, పెత్తందారులు, మానవుడు-దానవుడు, తాత మనవాడు, పాపం పసివాడు, దొంగలకు దొంగ, గంగ మంగ, నేరము-శిక్ష, అల్లూరి సీతారామరాజు, నిప్పు లాంటి మనిషి, తాతమ్మ కల, అన్నదమ్ముల అనుభందం లాంటి ఎన్నో చిత్రాలకు తన గాత్రంతో సినీ ప్రేక్షకులను రంజింపచేసారు.

1980-1999

ఎనభైలలో  “శివమెత్తిన సత్యం” చిత్రం తో మొదలు పెట్టి, తరువాత  కె విశ్వనాథ్ గారి దర్శకత్వంలో వచ్చిన శంకరాభరణం చిత్రానికి జే.వి. సోమయాజులు గారి పైన తీసిన అన్ని పాటలను తానే స్వయంగా పాడి ఆంధ్రదేశాన్ని ఉర్రూతలూగించారు. ఈ చిత్రం ద్వార విశేషమైన ఆదరాభిమానాలను చూరగొన్నారు ఎస్.పి.బి గారు అదే సంవత్సరం రామ్ రాబర్ట్ రహీం చిత్రం తో మంచి మాస్ పాటలు కూడా పాడారు.  ప్రేమాభిషేకం లో “నా కళ్ళు చెప్తున్నాయి” పాట ఇప్పటికీ శ్రోతలకు పరిచయమే. వారసుడోచ్చాడు, దేవత, సాగర సంగమం, సితార, మయూరి , మంచు పల్లకి, అభిలాష, రుద్రవీణ, అన్వేషణ,  ఆలాపన, నిరీక్షణ, ఆరాధన, సంకీర్తన, స్వయంకృషి, శృతి లయలు, గీతాంజలి, ప్రేమ, మౌన పోరాటం, విచిత్ర సోదరులు, స్టేట్ రౌడీ, శివ, మౌనరాగం, ఘర్షణ లాంటి హిట్ చిత్రాలలో ఆయన పాటలను పాడాడు.

తొంభైలలో జగదేక వీరుడు- అతిలోక సుందరి, బొబ్బిలి రాజా, కోకిల, కొండవీటి దొంగ, కొదమ సింహం, క్షణ క్షణం, సీతారామయ్య గారి మనుమరాలు, ఆదిత్య 369, ఏప్రిల్ 1 విడుదల, ఆ ఒక్కటి అడక్కు, చంటి , అంతం, చినరాయుడు, కిల్లర్, క్షత్రియ పుత్రుడు, దళపతి, స్వాతి కిరణం, మాతృ దేవోభవ, అల్లరి ప్రియుడు, మేజర్ చంద్రకాంత్,  జెంటిల్ మాన్ , గాయం, కొండపల్లి రాజ,నిప్పురవ్వ , మాయలోడు, భైరవ ద్వీపం, ముఠా మేస్త్రి, మనీ, నిప్పు రవ్వ, హలో బ్రదర్, శుభలగ్నం, ప్రేమికుడు, సిసింద్రి, శుభమస్తు, శుభ సంకల్పం, భారతీయుడు, దొంగాట, సింధూరం, శుభాకాంక్షలు, అన్నమయ్య, సుస్వాగతం, ఆవిడా మా ఆవిడే, ఖైది గారు, మావిడాకులు, సూర్య వంశం , బావగారు బాగున్నారా.., చూడాలని ఉంది, ప్రేమంటే ఇదేరా, తొలిప్రేమ, స్నేహం కోసం,సీతారామ రాజు, సమరసింహా రెడ్డి, దేవి, నరసింహ, శీను, ప్రేమికుల రోజు, తమ్ముడు, ఒకే ఒక్కడు, జోడి లాంటి ఎన్నో చిత్రాలకు పాడారు.

హిందీ చిత్ర పరిశ్రమలో

‘ఏక్ దూజేకే లియే’ చిత్రంతో బాలివుడ్ లో అడుగుపెట్టి పలు విజయవంతమైన చిత్రాల్లో పాటలు పాడారు. సాగర్, సాజన్, హమ్ ఆప్కే హై కౌన్, మైనే ప్యార్ కియా, హమ్ సే హై ముక్కాబులా, తూ హై మేరా దిల్, అందాజ్ అప్నా అప్నా, లవ్ బర్డ్స్, హిందుస్తానీ, దునియా దిల్ వాలోంకీ, దౌడ్, లాంటి మరెన్నో చిత్రాల్లోని పాటలకు ఆయన ప్రాణం పోశారు. ఆయన హిందీలో పాడిన మొట్టమొదటి పాట ‘తేరే మేరే బీచ్ మె’కు ఉత్తమ గాయకుడి నేషనల్ అవార్డ్ అందుకున్నారు.

ఆయన అందుకున్న పురస్కారాలు

భారతీయ భాషల్లో ఆయన సుమారు 38 వేలకు పైగా పాటలు పాడారు. అత్యధిక పాటలు రికార్డు చేసిన గాయకుడిగా ఆయన పేరిట గిన్నిస్ రికార్డు ఉంది. ఆయన సుదీర్ఘ ప్రస్థానంలో 6 జాతీయ పురస్కారాలు, 6 ఫిల్మ్ ఫేర్ దక్షిణాది పురస్కారాలు, ఒక ఫిల్మ్ ఫేర్ పురస్కారం  అందుకున్నారు. 1979 లో వచ్చిన సంగీత ప్రధానమైన ‘శంకరాభరణం’ చిత్రానికి ఆయనకు మొదటి జాతీయ పురస్కారం లభించింది. రెండు సంవత్సరాల తర్వాత ఆయనకు 1981 లో హిందీ చిత్రం ‘ఏక్ దూజేకే లియే’ చిత్రానికి గాను రెండోసారి పురస్కారాన్ని అందుకున్నారు. తర్వాత సాగర సంగమం(1983), రుద్రవీణ(1988), సంగీత సాగర గానయోగి పంచాక్షర గవాయి(1995), మిన్సార కనవు(1966), చిత్రాలకు జాతీయ పురస్కారాలు అందుకున్నారు. 25 సార్లు ఉత్తమ గాయకుడిగా, ఉత్తమ సంగీత దర్శకుడిగా, ఉత్తమ డబ్బింగ్ ఆర్టిస్టుగా, ఉత్తమ సహాయ నటుడిగా నంది పురస్కారాలు అందుకున్నారు. తమిళనాడు, కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వాల నుంచి కూడా పలు పురస్కారాలు అందుకున్నారు. కళా ప్రపూర్ణ, గాన విదూషి, లాంటి బిరుదులూ పొందిన ఆయన, ఆంధ్రా విశ్వవిద్యాలయం, లాంటి మొదలగు విశ్వవిద్యాలయాల నుండి గౌరవ డాక్టరేట్ లను అందుకున్నారు. కళా రంగంలో ఆయన విశిష్టతకు భారత ప్రభుత్వం 2001వ సంవత్సరంలో ఆయన్ను పద్మశ్రీతో సత్కరించగా, 2011వ సంవసత్సరంలో పద్మభూషణ్ తో సత్కరించింది.

నటుడిగా

బాల సుబ్రహ్మణ్యం గారు నటుడిగా కూడా తన ప్రత్యేకతను చాటుకున్నారు.  1990 లో తమిళంలో వచ్చిన ‘కేలడి కన్మణి’ అనే చిత్రంలో బాలుగారు కథానాయకుడిగా నటించారు. ఇందులో రాధిక కథానాయిక. ఈ సినిమా తెలుగులో ఓ పాప లాలి అనే పేరుతో అనువాదం అయింది.  ప్రేమ (1989), ప్రేమికుడు (1994), పవిత్రబంధం (1996), ఆరో ప్రాణం (1997), రక్షకుడు (1997), దీర్ఘ సుమంగళీ భవ (1998) వంటి సినిమాల్లో ప్రాధాన్యత కలిగిన పాత్రల్లో ఆయన నటించారు. 2012 లో విలక్షణ నటుడు తనికెళ్ళ భరణి దర్శకత్వంలో వచ్చిన మిథునం  సినిమాలో ప్రధాన పాత్రలో ఆయన నటించారు.

ఇందులో సీనియర్ నటి లక్ష్మి ఆయనకు జంటగా నటించారు. ఈ సినిమాకు నంది ప్రత్యేక పురస్కారం లభించింది. నటునిగా ఆయన పోషించింది సహాయ పాత్రలే అయినా అవి ఎప్పటికీ ప్రేక్షకులకు గుర్తుండిపోతాయి.

డబ్బింగ్ ఆర్టిస్ట్ గా

గాయకుడిగా నటుడిగా ఎంత గొప్ప ఖ్యాతిని గడించారో డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కూడా అంతే పేరును సొంతం చేసుకున్నారు.  కె. బాలచందర్ దర్శకత్వంలో వచ్చిన తమిళ అనువాద చిత్రం మన్మధ లీలతో బాలు అనుకోకుండా డబ్బింగ్ ఆర్టిస్టుగా మారాడు. అందులో కమల్ హాసన్ కు తెలుగులో డబ్బింగ్ చెప్పారు. కమల్ హాసన్, రజినికాంత్, జెమిని గణేశన్, గిరీష్ కర్నాడ్, భాగ్యరాజా, సల్మాన్ ఖాన్, మోహన్, విష్ణువర్ధన్, అర్జున్, కార్తీక్, నగేష్, రఘువరన్ లాంటి వారికి పలు భాషల్లో గాత్రదానం చేశారు. తమిళం నుంచి తెలుగులోకి అనువాదమయ్యే కమల్ హాసన్ చిత్రాలన్నింటికి ఆయనే డబ్బింగ్ చెబుతుండేవారు. 2010లో కమల్ హాసన్ కథానాయకుడిగా వచ్చిన దశావతారం చిత్రంలో కమల్ పోషించిన పది పాత్రల్లో 7 పాత్రలకు బాలు గారే డబ్బింగ్ చెప్పడం విశేషం. ఇందులో కమల్ పోషించిన ముసలావిడ పాత్ర కూడా ఉంది. అన్నమయ్య చిత్రంలో సుమన్ పోషించిన వేంకటేశ్వర స్వామి పాత్రకు బాలుగారు డబ్బింగ్ చెప్పారు. ఈ చిత్రానికి ఆయనకు ఉత్తమ డబ్బింగ్ కళాకారుడిగా నంది పురస్కారం లభించింది. అటెన్ బరో దర్శకత్వంలో వచ్చిన ‘గాంధీ’ చిత్రంలో గాంధీ పాత్రధారియైన ‘కింగ్ బెన్‌స్లే’ కు ఆయనే డబ్బింగ్ చెప్పారు.

టెలివిజన్ రంగంలో

సినీ రంగంలోనే కాకుండా టి.వి. రంగంలో కూడా ఆయన విశిష్టతను చాటుకున్నారు. 1996వ సంవత్సరంలో పాడుతా తీయగా ప్రోగ్రాం ద్వారా బుల్లితెర ప్రవేశం చేసి ఎంతో మంది నూతన గాయకులను ఆయన ప్రోత్సహించారు. స్వరాభిషేకం కార్యక్రమం ద్వారా ఆయన అనుభవాలను ప్రేక్షకులతో పంచుకున్నారు.

అంతటి గొప్ప వ్యక్తి, గొప్ప కళాకారుడు, గాయకుడు అయిన ఎస్ పీ బి గారి మరణం కేవలం దక్షిణాదివారికే కాకుండా యావత్ భారతీయ సినీ ప్రేక్షకులకు సంగీతాభిమానులకు జీర్ణించుకోలేని విషయం. ఎంతో మందికి దిశా నిర్దేశం చేసిన స్పూర్తిప్రధాతకు ఘన నివాళి అర్పిస్తున్నాము.


- Advertisement -

You've successfully subscribed to Tollywood Latest News | Celebrities Profiles | Media9 Tollywood
Great! Next, complete checkout to get full access to all premium content.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.