యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్

రెబెల్ స్టార్ అనగానే మనకు గుర్తొచ్చే పేరు కృష్ణం రాజు. ఆయన ఎక్కువ యాక్షన్ సినిమాలు, తిరుగుబాటు డైలాగులు చెప్పేవారు కాబట్టి ఆయనకు ఆ ట్యాగ్ లైన్ వచ్చింది. ఆ బిరుదుకు తగ్గట్లుగానే కృష్ణం రాజు తన సినిమాలను ఎంచుకునేవారు. అదే కోవలో కృష్ణం రాజుకు వారసుడు వచ్చాడు. కృష్ణం రాజు తమ్ముడి కొడుకు ప్రభాస్ టాలీవుడ్ లోకి హీరోగా 2002లో అరంగేట్రం చేసాడు. ఆరడుగులకు పైగా ఎత్తు, మంచి శరీర ధారుడ్యం కలిగిన ప్రభాస్ చాలా త్వరగానే అభిమానులను సంపాదించుకోగలిగాడు. కృష్ణం రాజు అభిమానులను కూడా తన వద్ద ఉంచుకోగలిగాడు. ఒక్కో సినిమాతో ఒక్కో మెట్టు ఎక్కుతూ ప్రభాస్ ఇప్పుడు ఏకంగా నేషనల్ హీరో అయిపోయాడు. ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న సినిమాలు అన్నీ ప్యాన్ ఇండియా చిత్రాలే. ఒక్కో సినిమాకూ దాదాపు 200-300 కోట్ల బడ్జెట్. మరి అలాంటి ప్రభాస్ గురించి పూర్తిగా తెలుసుకోకపోతే ఎలా?

బాల్యం

ఉప్పలపాటి వెంకట సూర్య నారాయణ ప్రభాస్ రాజు, షార్ట్ కట్ లో ప్రభాస్, 1979 అక్టోబర్ 23న ప్రభాస్ జన్మించాడు. ప్రభాస్ తల్లిదండ్రులు ఉప్పలపాటి సూర్య నారాయణ రాజు, శివ కుమారి. ప్రభాస్ బాల్యమంతా పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులోనే సాగింది. అక్కడే ఆయన జన్మించింది కూడా. ప్రభాస్ కు ఒక అక్క ప్రగతి, అన్నయ్య ఉన్నారు. ప్రభాస్ ముగ్గురిలోకి చిన్నవాడు. ప్రభాస్ చిన్నతనం నుండీ చాలా యాక్టివ్ గా ఉండేవారు. ప్రభాస్ కు చిన్నతనం నుండే ఫుడ్ అంటే మక్కువ ఎక్కువ. ముఖ్యంగా నాన్ వెజ్ ఐటమ్స్ అంటే చెవి కోసుకునే వాడు. ప్రభాస్ ప్రాధమిక చదువంతా భీమవరం డి.ఎన్.ఆర్ స్కూల్ లో జరిగింది. ప్రభాస్ చిన్నతనంలో కృష్ణం రాజు హీరోగా పీక్స్ ను చూసారు. ఆ సమయంలో ఆయన చెన్నైలో ఉండేవారు. అయితే సెలవులకు భీమవరం వచ్చినప్పుడు ఆయన్ను చూసి ప్రభాస్ చాలా సిగ్గుపడేవారు. చిన్నప్పటి నుండి సినిమాలంటే ప్రభాస్ కు చాలా ఇష్టం. ఒకటి తర్వాత ఒకటిగా సినిమాలు చూస్తూనే ఉండేవారు.

చిన్నప్పుడు డ్యాన్స్ అంటే కూడా ప్రభాస్ కు చాలా ఇష్టం. ఆయన డ్యాన్స్ లు వేయడాన్ని చూసి కృష్ణం రాజు తనను హీరోని చేయాలనుకున్నారు. కృష్ణం రాజుకు కొడుకులు లేకపోవడంతో ప్రభాస్ ను కొడుకు కంటే ఎక్కువగానే చూసుకునేవారు. ప్రభాస్ ను చెన్నై తీసుకెళ్ళిపోయి అక్కడి డాన్ బాస్కో స్కూల్ లో చేర్పించారు. తన స్కూలింగ్ డాన్ బాస్కో స్కూల్ లోనే ముగిసింది. ప్రభాస్ కు చాలా సిగ్గు ఎక్కువ. నలుగురిలో కలవడం అంటే మహా సిగ్గు. ఇక కృష్ణం రాజు అప్పుడప్పుడు షూటింగులకు తీసుకెళ్లేవారు. అప్పుడు కూడా ప్రభాస్ సిగ్గుతో ముడుచుకుని పోయేవారు. అలాగే హీరోయిన్స్ ను చూసి ఆమడ దూరం వెళ్ళిపోయేవాడు ప్రభాస్. ఆ సమయంలో హీరోలు, హీరోయిన్లు రోడ్లపై షూటింగ్స్ చేస్తుంటే ప్రభాస్ ఆశ్చర్యపోయేవారు. అందరిలో ఎలా నటిస్తారా అని ఆశ్చర్యపోయేవాడు ప్రభాస్. సాధారణంగా తెలుగు రాష్ట్రాల్లో కుర్రాళ్ళు అంటే క్రికెట్ అంటే ఆసక్తి చూపిస్తారు కానీ ప్రభాస్ కు వాలీ బాల్ అంటే చాలా ఇష్టం. ఇంటర్మీడియట్ రోజుల నుండీ ప్రభాస్ వాలీ బాల్ ను ఎక్కువగా తన స్నేహితులతో కలిసి ఆడేవాడు. ఆ అలవాటు ప్రభాస్ కు ఇప్పటికీ ఉంది. ఇక కృష్ణం రాజు హైదరాబాద్ వచ్చిన తర్వాత ప్రభాస్ ను కూడా హైదరాబాద్ తీసుకొచ్చి అక్కడి చైతన్య కాలేజ్ లో డిగ్రీ చదివించారు. కాలేజ్ లో ఉన్న రోజుల్లో సినిమాల్లోకి రావాలన్న నిర్ణయాన్ని తీసుకున్నాడు ప్రభాస్.

మొదటి అడుగు

సినిమాల్లోకి రావాలని ప్రభాస్ డిసైడ్ అవ్వడంతో ఇంట్లో అందరూ ఫుల్ హ్యాపీ. ఎందుకంటే కృష్ణంరాజుతో మొదలుపెట్టి కుటుంబంలో అందరూ ప్రభాస్ ను హీరో అయితే బాగుంటుందనే అనుకున్నారు. అయితే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చే ముందు ప్రభాస్ నటనలో శిక్షణ తీసుకోవాలని నిర్ణయం తీసుకుని వైజాగ్ సత్యానంద్ దగ్గర యాక్టింగ్ నేర్చుకున్నాడు.

అది జరుగుతున్న క్రమంలో ఒసేయ్ రాములమ్మ వంటి సినిమాలతో విలన్ గా ఫేమస్ అయిన కొల్లా అశోక్ కుమార్ అప్పుడే ఇండస్ట్రీలో పేరు సంపాదించుకుంటున్న తరుణ్ తో సినిమా తీయాలని అనుకున్నాడు. తరుణ్ అప్పుడు సక్సెస్ లో ఉన్నాడు. తరుణ్ తల్లి రోజా రమణి వద్దకు చాలా సార్లు తరుణ్ డేట్స్ కోసం తిరిగాడు అశోక్ కుమార్. మరోవైపు జయంత్ సి పరాన్జీని డైరెక్టర్ గా బుక్ చేసుకున్నాడు. అప్పుడు జయంత్ టక్కరి దొంగ సినిమా చేస్తున్నాడు. అయితే రోజా రమణి వద్దకు ఎన్ని సార్లు వెళ్లినా తరుణ్ డేట్స్ మాత్రం రాలేదు. ఇదిగో చేస్తాం అదిగో చేస్తాం అన్నట్లుగా వాయిదా వేశారు. దీంతో ఎవరైనా కొత్తవాళ్లతో సినిమా తీద్దామని అనుకున్నప్పుడు సూర్య నారాయణ రాజు గారబ్బాయి సినిమాల్లోకి రావాలనుకుంటున్నాడు ఒకసారి ట్రై చేయండి అని శేఖర్ బాబు చెప్పడంతో వెంటనే సూర్య నారాయణ రాజుకు ఫోన్ చేయడం ఆయన పాజిటివ్ గా రియాక్ట్ అవ్వడం జరిగాయి.

ప్రభాస్ ఫోటోలు పంపమని అడిగినప్పుడు ప్రభాస్ నే పిలుస్తాను అని సూర్యనారాయణ రాజు తన కొడుకును హైదరాబాద్ రప్పించారు. అక్కడ టెస్ట్ షూట్ కూడా జరిగాక అంతా ఓకే అనుకుంటున్న క్రమంలో ఎవరో అల్లు అరవింద్ గారి రెండో అబ్బాయి అల్లు అర్జున్ కూడా సినిమాల్లోకి రావడానికి ట్రై చేస్తున్నాడు అని చెప్పడంతో తన ఫొటోస్ ను కూడా తీసుకొచ్చి చూసారు. అయితే చివరికి ప్రభాస్ కే అందరూ ఓటు వేశారు. అలా సినిమాల్లోకి ప్రభాస్ ఎంట్రీ జరిగింది. ఆ సినిమానే ‘ఈశ్వర్’. హీరోయిన్ గా మంజుల కూతురు శ్రీదేవిని తీసుకున్నారు. 11 నవంబర్ 2002న విడుదలైంది ‘ఈశ్వర్’. ఈ సినిమా యావరేజ్ గా ఆడింది. అయితే కృష్ణం రాజు అభిమానులను ఆకట్టుకోవడంలో మాత్రం సక్సెస్ అయిందనే చెప్పాలి.

మొదటి సినిమా విషయంలో ఫ్లాప్ అనిపించుకోకుండా బయటపడిగలిగాడు ప్రభాస్. అయితే రెండో సినిమా విషయంలో ఎలాంటి సబ్జెక్ట్ ను ఎంచుకోవాలన్న మీమాంస ప్రభాస్ కు ఎదురైంది. చాలా తర్జనభర్జనలు పడ్డాడు. సరిగ్గా అప్పుడే రాజమౌళి కథ చెబుతామని ప్రభాస్ ను సంప్రదించాడు. అయితే అప్పటికి రాజమౌళి కేవలం స్టూడెంట్ నెం 1 సినిమా ఒకటే చేసాడు. తన రెండో సినిమా కోసం ప్రభాస్ ను సంప్రదించాడు. అయితే ఇక్కడ విశేషం ఏమిటంటే ప్రభాస్ కు స్టూడెంట్ నెం 1 సినిమా నచ్చలేదు. సినిమా హిట్ అయినా కూడా ఎందుకో ప్రభాస్ కు అలాంటి సినిమా ఎక్కలేదు. దీంతో రాజమౌళి కథను సరిగా వినకుండానే తిరస్కరించాడు ప్రభాస్.

సరిగ్గా అదే సమయంలో సీనియర్ దర్శకుడు సురేష్ కృష్ణ ఒక పవర్ఫుల్ స్క్రిప్ట్ తో ప్రభాస్ తండ్రి సూర్యనారాయణ రాజు వద్దకు వచ్చాడు. అప్పటికి ఫామ్ లో ఉన్న స్టార్ రైటర్ పోసాని కృష్ణ మురళి ఒక బోల్డ్ స్క్రిప్ట్ ను రాసాడు. గొడవలకు సై అనే యువకుడు ఊహించని కారణాల వల్ల రాఘవేంద్ర స్వామి సన్నిధిలో ఉండిపోతాడు. దానికి ఎదురైన పరిస్థితులు ఏమిటి అనే పాయింట్ ను ఎమోషనల్ గా రాసాడు. స్క్రిప్ట్ పరంగా ఓకే అనిపించుకున్న ఈ కథకు ప్రభాస్ అండ్ కో పచ్చజెండా ఊపారు. మార్చ్ 28, 2003 నాడు రాఘవేంద్ర విడుదలైంది. అయితే సినిమా అంచనాలను అందుకోవడంలో మాత్రం విఫలమైంది. మరి దారుణమైన ఫ్లాప్ అనలేం కానీ రాఘవేంద్ర నిర్మాతలకు నష్టాలను తీసుకొచ్చింది.

రెండో సినిమా ఊహించని దెబ్బ వేయడంతో ప్రభాస్ లో మళ్ళీ అంతర్మథనం మొదలైంది. మూడో సినిమా కోసం ఒక్కడు వంటి బ్లాక్ బస్టర్ ను నిర్మించిన ఎమ్మెస్ రాజును ప్రభాస్ తండ్రి సూర్య నారాయణ రాజు అప్రోచ్ అయ్యారు. తన కొడుకుతో సినిమా తీయమని కోరారు. ఎమ్మెస్ రాజు కూడా ఇందుకు సానుకూలంగా స్పందించి తప్పకుండా మీ అబ్బాయితో బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధిస్తానని మాట ఇచ్చాడు. వెంటనే ఎమ్మెస్ రాజు తన ఆస్థాన రచయిత వీరు పోట్లను పిలిపించి ఏదైనా మంచి లవ్ స్టోరీ ఉంటే చెప్పమని అడగ్గా వీరు పోట్ల రామాయణం స్పూర్తితో తాను రాసుకున్న ఒక స్క్రిప్ట్ ను చెప్పాడు. అప్పటికే నవనీత, బాబీ వంటి ఫ్లాపులను అందుకున్న శోభన్ ఈ సినిమాకు స్క్రిప్ట్ కు సహాయం చేయడానికి వచ్చాడు. స్క్రిప్ట్ ను హ్యాండిల్ చేస్తున్న విధానం ఎమ్మెస్ రాజుకు బాగా నచ్చింది. శోభన్ స్క్రిప్ట్ కు ఇచ్చిన ఇన్పుట్స్ అందరికీ నచ్చుతున్నాయి. దీంతో ఎమ్మెస్ రాజు శోభన్ కే దర్శకత్వ బాధ్యతలను అప్పగించాడు.

హీరోయిన్ గా ఎవరిని పెడదాం అనుకుంటున్న సమయంలో అప్పుడే ‘నీ మనసు నాకు తెలుసు’ సినిమాతో తెలుగులో అరంగేట్రం చేసిన త్రిష అయితే బాగుంటుందని ఎవరో చెప్పడంతో వెంటనే ఆమెను స్క్రీన్ టెస్ట్ కు పిలిపించారు. త్రిష స్క్రీన్ ప్రెజెన్స్ నచ్చడంతో ఓకే చేసేసారు. ఇక రావణుడు స్పూర్తితో డిజైన్ చేసిన విలన్ క్యారెక్టర్ కు ఎవరైతే బాగుంటుందని చాలా తర్జనభర్జనలు జరిగాయి. పేరున్న వారిని ఈ పాత్ర కోసం పరిశీలించారు. సరిగ్గా అప్పుడే నిజం సినిమా విడుదలైంది. ఆ సినిమా ప్లాప్ అయినా విలన్ గా గోపీచంద్ ఆకట్టుకున్నాడు. అంతకు ముందు గోపీచంద్ చేసిన ‘జయం’ చిత్రంలో విలన్ పాత్ర ఎంతగా హైలైట్ అయిందో అందరికీ తెలుసు. అందుకే ఒక్కసారి గోపీచంద్ ఆలోచన రాగానే ఎవరూ సందేహించలేదు. గోపీచంద్ ను విలన్ గా ఫిక్స్ చేసారు. ఇక లీడ్ కాస్ట్ కుదరడంతో ఒకటి తర్వాత ఒకటిగా అన్నీ సెట్ అయ్యాయి. 2003లో మొదలైన ‘వర్షం’... 14 జనవరి 2004 అంటే సంక్రాంతికి ప్రేక్షకుల పై కురిసింది. సంక్రాంతి పండక్కి సరైన సినిమా అన్న టాక్ రావడంతో ‘వర్షం’ సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది. ప్రభాస్ కు మొదటి బ్లాక్ బస్టర్ మూడో సినిమాతోనే పడింది. ఒక్కసారిగా ప్రభాస్ పేరు ఇండస్ట్రీలో మార్మోగిపోయింది.

వర్షం షూటింగ్ జరుగుతున్న సమయంలోనే ఒక విచిత్రం జరిగింది. ఎన్టీఆర్ సింహాద్రి సినిమా ఆ సమయంలో విడుదలైంది. ప్రభాస్ కు ఈ సినిమా స్పెషల్ స్క్రీనింగ్ వేసాడు ఎన్టీఆర్. సింహాద్రి ప్రభాస్ కు పిచ్చిగా నచ్చేసింది. దర్శకుడేమో రాజమౌళి. ఆ దర్శకుడే తనకు కథ చెబితే నచ్చలేదని చెప్పి పంపేశాడు. మళ్ళీ ఎలా రాజమౌళితో మాట్లాడడం అని అనుకుంటున్న సమయంలో ఒక ఫంక్షన్ లో ఇద్దరూ కలిశారు. ఏది అయితే అది అయిందని ప్రభాస్, రాజమౌళి వద్దకు వెళ్లి మీ సింహాద్రి చూసాను. చాలా బాగా నచ్చింది, కంగ్రాట్స్ అని చెప్పాడు. వెంటనే రాజమౌళి థాంక్స్ చెప్పి తనను కలవాలని, ఎక్కడైనా మీట్ అవుదామని చెప్పాడు. ఆ నెక్స్ట్ డేనే స్టోరీ నెరేషన్ జరిగింది. రాజమౌళి ఛత్రపతి కథను చెప్పాడు. ప్రభాస్ మైండ్ బ్లాక్ అయింది. ఎప్పుడు డార్లింగ్ ఈ సినిమా చేద్దాం అని అడిగాడు. దానికి ముందు తనకు నితిన్ తో ఒక కమిట్మెంట్ ఉందని చెప్పాడు. ఆ సినిమా అయ్యాక మనం కలిసి పనిచేద్దాం ఈలోగా నువ్వు కూడా నీ కమిట్మెంట్స్ ను పూర్తి చేయి అని అన్నాడు.

వర్షం సినిమా విడుదలయ్యేలోపే ప్రభాస్ సీనియర్ దర్శకుడు బి. గోపాల్ తో సినిమాను ఓకే చేసాడు. నిజానికి వర్షం కంటే ముందే ప్రభాస్ బి. గోపాల్ తో కలిసి పనిచేయాలి. అయితే ఎమ్మెస్ రాజు వంటి వ్యక్తి అడిగేసరికి బి. గోపాల్, ప్రభాస్ తో తన సినిమాను వాయిదా వేసుకున్నాడు. వర్షం సినిమా తర్వాత 'అడవి రాముడు' సినిమా పట్టాలెక్కింది. ఆ సినిమా దురదృష్టవశాత్తూ ప్లాప్ గా నిలిచింది. ఇక దాని తర్వాత ప్రభాస్ చేసిన ఎమోషనల్ స్టోరీ ‘చక్రం’ కూడా సరైన ఫలితాన్ని అందివ్వలేదు. అయితే చక్రం నటుడిగా ప్రభాస్ కు బాగా ఉపయోగపడింది. ఇంత బరువైన పాత్రను ప్రభాస్ పోషించిన విధానానికి విమర్శకుల ప్రశంసలు దక్కాయి.

వర్షం తర్వాత రాజమౌళి మళ్ళీ కలిసాడు. ఛత్రపతి స్క్రిప్ట్ కు మరిన్ని మార్పులు చేసుకుని వచ్చిన రాజమౌళి, ప్రభాస్ ను మరింత ఇంప్రెస్ చేసాడు. ఛత్రపతిలో ఫుల్ మాస్ యాంగిల్ లో కనిపించాడు ప్రభాస్. బాడీని ఫుల్ గా బిల్డ్ చేసి ప్రభాస్ ఫ్యాన్స్ ను ఉర్రూతలూగించాడు. అసలు ఛత్రపతి ఫస్ట్ హాఫ్ అయ్యేసరికే బ్లాక్ బస్టర్ టాక్ ను సంపాదించుకుంది. ఛత్రపతి ఇంటర్వెల్ బ్లాక్ అప్పట్లో ఒక సెన్సేషన్ అనే చెప్పాలి. వర్షం తర్వాత ప్రభాస్ ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ పడింది. అలాగే ఈ సినిమాతో ప్రభాస్ స్టార్ హీరోల రేంజ్ కు చేరిపోయాడు. 8 కోట్లతో నిర్మితమైన ఛత్రపతి దానికి మూడింతల కలెక్షన్స్ ను సాధించింది. ఛత్రపతి షూటింగ్ లో ఉన్న సమయంలోనే ఎమ్మెస్ రాజు తనతో సినిమా చేయమని కోరారు. ప్రభుదేవా దర్శకుడిగా పౌర్ణమి సినిమా కన్ఫర్మ్ అయింది.

పౌర్ణమి 21 ఏప్రిల్ 2006న విడుదలైంది. ఎమ్మెస్ రాజు - ప్రభాస్ - త్రిష - దేవి శ్రీ ప్రసాద్, ఇలా వర్షం కాంబినేషన్ మళ్ళీ రిపీట్ అవుతుండడంతో అంచనాలు భారీ రేంజ్ కు చేరుకున్నాయి. అలాగే ఛత్రపతి వంటి మాస్ బ్లాక్ బస్టర్ తర్వాత ప్రభాస్ చేసిన సినిమా కావడంతో అంచనాలు తారా స్థాయికి చేరుకున్నాయి. డ్యాన్స్ నేపథ్యంలో ప్రభాస్ మొత్తం అండర్ ప్లే చేసిన పౌర్ణమి సినిమా కంటెంట్ పరంగా బాగానే ఉన్నా అంచనాలను అందుకోవడంలో మాత్రం విఫలమైంది. అయితే పౌర్ణమి పాటలు మాత్రం సూపర్ డూపర్ హిట్ గా నిలిచాయి.

పౌర్ణమి ఫ్లాప్ తర్వాత ప్రభాస్ మళ్ళీ ఆలోచనల్లో పడ్డాడు. సరిగ్గా అప్పుడే వి.వి వినాయక్ కన్నడ సూపర్ హిట్ సినిమా జోగి సినిమా సిడి ఇచ్చి ఒకసారి చూడమని చెప్పాడు. ప్రభాస్ కు కథ నచ్చింది. మదర్ సెంటిమెంట్ తో పాటు యాక్షన్ అంశాలు కూడా ఉండడంతో ఆ సినిమాను ఓకే చేసాడు. ఇదే ప్రభాస్ కెరీర్ లో మొదటి రీమేక్. అయితే యోగి పౌర్ణమి కంటే పెద్ద ప్లాప్ అయింది. యోగి జరుగుతుండగానే అప్పటికే నిర్మాతగా మంచి పేరు సంపాదించిన దిల్ రాజు కొత్త దర్శకుడు వంశీ పైడిపల్లిని తీసుకెళ్లి మున్నా కథ చెప్పాడు. ప్రభాస్ దిల్ రాజు మీద ఉన్న నమ్మకంతో స్టోరీకి ఓకే చెప్పేసాడు. అయితే మున్నా ఫలితం కూడా తారుమారైంది. ప్రభాస్ ఆ తర్వాత చేసిన బుజ్జిగాడు, బిల్లా, ఏక్ నిరంజన్ సినిమాలు నటుడిగా సంతృప్తినిచ్చినా ఫలితం పరంగా మళ్ళీ నిరాశే మిగిలింది. ప్రభాస్ కు హిట్ వచ్చి దాదాపు ఐదేళ్లు అయింది.

ఫ్యాన్స్ నిరాశపడుతుండడంతో ప్రభాస్ ఒత్తిడికి లోనయ్యాడు. సరిగ్గా అదే సమయంలో ప్రేమకథలను బాగా హ్యాండిల్ చేస్తాడన్న పేరున్న కరుణాకరన్ చెప్పిన ‘డార్లింగ్’ కథ ప్రభాస్ కు బాగా నచ్చింది. 23 ఏప్రిల్ 2010న విడుదలైన డార్లింగ్ మంచి సక్సెస్ ను సాధించింది. ప్రభాస్ కు సక్సెస్ కరువును తీర్చింది. ఈ చిత్రంలో కొత్త ప్రభాస్ ను చూపించాడు కరుణాకరన్. ఇందులో ఆయన నటన, హావాభావాలు, డైలాగ్ డెలివరీ కొత్తగా ఉంటాయి. కాజల్ నటన ఈ చిత్రానికి మరో ఆకర్షణ. పాటలైతే సూపర్ హిట్. ఎక్కడ విన్నా అవే వినిపించేవి. ప్రభాస్ ఈ సినిమాను ఎంతో ఈజ్ తో చేసాడు. మున్నాతో దిల్ రాజు ప్రభాస్ కు హిట్ ఇవ్వలేకపోయాడు. సో మరోసారి ప్రభాస్ తో సినిమా చేసి లెక్క సరిచేయాలనుకున్నాడు దిల్ రాజు. దశరధ్ ను దర్శకుడిగా ఎంపిక చేసి mr. పెర్ఫెక్ట్ కథను సానబెట్టించాడు. ఈ సినిమా స్టోరీ చాలా మార్పులు చేర్పులకు గురై చివరకు ప్రభాస్ వద్దకు వెళ్ళింది. డార్లింగ్ ను మించి ఈ సినిమా సక్సెస్ అయింది. రెండు బ్యాక్ టు బ్యాక్ సక్సెస్ లతో ప్రభాస్ మళ్ళీ గాడిలో పడ్డాడు.

అయితే మాస్ సినిమాతో హిట్ కొట్టాలన్న ప్రభాస్ కోరిక అలానే ఉండిపోయింది. సరిగ్గా అదే సమయంలో లారెన్స్ ‘రెబల్’ కథ చెప్పడం ప్రభాస్ ఓకే చేయడంతో ఆ సినిమా పట్టాలెక్కింది. అయితే రైటింగ్ దశలోనే రెబల్ తేడా కొట్టిందని ప్రభాస్ గ్రహించాడు. కానీ అప్పటికే చాలా ఆలస్యమైంది. రెబల్ ను పూర్తి చేసారు. ఆ సినిమా విమర్శల పాలైంది. ప్రభాస్ కెరీర్ లోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఫెయిల్యూర్స్ గా నిలిచింది. రెబల్ తర్వాత నిరాశలో ఉన్న ప్రభాస్ కు ఎస్ ఎస్ రాజమౌళి చెప్పిన బాహుబలి కథ వెంట్రుకలు నిక్కబొడుచుకునేలా చేసింది. రాజమౌళి ఈసారి ఏదో భారీ ప్రయత్నమే చేస్తున్నాడు అనిపించింది. ప్రభాస్ కు కథ నచ్చింది. అయితే రాజమౌళి వైపు నుండి ఉన్నది ఒకటే కండిషన్. ఈ సినిమాకు రెండేళ్లు డేట్స్ ఇవ్వమని. అంటే రెండేళ్ల పాటు ప్రభాస్ వేరే ఏ సినిమా చేయకూడదన్నమాట.

ఇది విని ప్రభాస్ నవ్వాడు. డార్లింగ్ నువ్వు తీసే సినిమా రేంజ్ ఏంటో నీకు తెలీట్లేదు. రెండేళ్లు ఎక్కడ సరిపోతాయి. కనీసం ఐదేళ్లు అయినా కావాలి. నువ్వేం కంగారు పడకు. నీ సినిమా అయ్యేదాకా మరో సినిమా చేయను అని మాట ఇచ్చాడు. అయితే తానొకటి తలిస్తే దైవమొకటి తలిచింది అన్నట్లుగా అయింది ప్రభాస్ పరిస్థితి. సింహా, బృందావనం వంటి సినిమాలకు రచయితగా పనిచేసిన కొరటాల శివ మిర్చి కథను సిద్ధం చేసుకున్నాడు. నిజానికి ఈ కథను ముందు అమ్ముదామనే తయారుచేసుకున్నాడు. అయితే అప్పటికే రచయితగా ఎదుర్కొన్న కొన్ని అవమానాలు శివలో దర్శకుడు కావాలన్న తపనను రగిలించాయి. దీంతో ఇక అమ్మడం అన్న మాటను పక్కనపెట్టి దర్శకుడిగా ప్రయత్నాలను మొదలుపెట్టాడు. ఈ చిత్రాన్ని ప్రభాస్ తో తీస్తే బాగుంటుందని శివ భావించాడు.

వెంటనే తనకు అత్యంత సన్నిహితుడైన గుంటూర్ డిస్ట్రిబ్యూటర్ వంశీని కలిసి మిర్చి కథ చెప్పాడు. సరిగ్గా అప్పుడే వంశీ కూడా నిర్మాత అవ్వాలనుకుంటున్నాడు. ప్రభాస్ కజిన్ ప్రమోద్ తో కలిసి వంశీ యూవీ క్రియేషన్స్ అనే బ్యానర్ ను కూడా స్థాపించారు. మిర్చి కథను విన్న వంశీ తాము నిర్మాతలుగా లాంచ్ అవ్వడానికి ఇదే సరైన కథ అని భావించారు. తమకు ప్రభాస్ అత్యంత క్లోజ్ కాబట్టి కచ్చితంగా డేట్స్ ఇస్తాడని ఆశించారు. అయితే ప్రభాస్ అప్పటికే బాహుబలి సినిమాకు కమిట్ అయ్యి ఉన్నాడు.

అయినా కూడా ప్రమోద్, వంశీ బలవంతం మీద కొరటాల శివను కలవడానికి రమ్మని మిర్చి కథ చెప్పమన్నాడు. అయితే కథ వినడానికి ముందే ప్రభాస్ చాల ఓపెన్ గా నేను రాజమౌళి గారి బాహుబలి సినిమాకు కమిటయ్యను. అది పూర్తవ్వడానికి చాలా ఏళ్ళు పడుతుంది. ఇప్పుడు మరో సినిమాను ఒప్పుకోలేను. కావాలంటే బాహుబలి అయ్యాక ఈ సినిమా చేస్తాను అని అన్నారు. ఇది విని ఆశ్చర్యపోయిన శివ సరే ఏదైతే అది అయ్యిందని ముందు కథ వినండి అని ఒప్పించి మిర్చి స్క్రిప్ట్ చెప్పాడు.

కథ వినగానే ప్రభాస్ ఎగిరిగంతేసాడు. సూపర్ గా ఉంది. ఇరకాటంలో పెట్టేసావు డార్లింగ్, అందుకే కథ వినను అన్నాను అని చెప్పాడు. ఇది జరిగిన రెండు రోజుల తర్వాత కూడా ప్రభాస్ కు మిర్చి కథ బుర్రలో ఉంది. ఈ సినిమాను వదులుకోలేకపోతున్నాడు. ఇక ఉండబట్టలేక రాజమౌళి ఇంటికి వెళ్లి జరిగినదంతా చెప్పాడు. ఇది విన్న రాజమౌళి, ఎందుకు మంచి కథ వస్తే కాదనుకుంటావు. బాహుబలి ప్రీ ప్రొడక్షన్ కు అనుకున్నదానికంటే ఎక్కువ సమయం పట్టేలా ఉంది. కనీసం 7-8 నెలల సమయం ఉంది. నువ్వు చక్కగా ఆ సినిమా చేసుకో అన్నాడు.

ఆ రోజు రాత్రే ప్రభాస్, శివకు ఫోన్ చేసి తన గెస్ట్ హౌజ్ కు పిలిచి అక్కడ తన స్నేహితులైన నిర్మాతలతో, సన్నిహితులతో పెద్ద పార్టీ చేసాడు. అంతలా ఎగ్జైట్ అయి చేసిన మిర్చి బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. అటు క్లాస్, ఇటు మాస్ గా కొరటాల శివ తెరకెక్కించిన మిర్చి కథ అందరికీ తెగ నచ్చేసింది. మిర్చి సినిమా ఇచ్చిన ఉత్సాహంతో ప్రభాస్ చాలా హ్యాపీగా బాహుబలి సినిమా పనుల్లో నిమగ్నమైపోయాడు.

అయితే ప్రీ ప్రొడక్షన్ కోసం రాజమౌళి చాలా పెద్ద ప్లానే వేసాడు. స్టోరీ డిస్కషన్ లలో కూడా ప్రభాస్ పాల్గొన్నాడు అంటే చూసుకోండి ఎంతలా బాహుబలి చిత్రానికి కనెక్ట్ అయ్యాడో. అయితే ప్రీ ప్రొడక్షన్ పనుల్లో భాగంగా సీన్ల డివిజన్ వేసుకుంటున్నప్పుడు రాజమౌళి అండ్ టీమ్ కు ఒక్క విషయం అర్ధమైంది. బాహుబలి చిత్రాన్ని ఒక్క పార్ట్ లో తీయలేం. తీసి కథకు పూర్తిగా న్యాయం చేయలేము అని. కాస్ట్ అండ్ క్రూను కూర్చోబెట్టి ఇదే విషయాన్ని చెప్పారు. అందరి దగ్గరనుండి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. రాజమౌళి ఈ విషయంపై ప్రభాస్ తో ప్రత్యేకంగా చర్చించాడు. ఇలా రెండు భాగాలుగా విడుదల చేయాలంటే కచ్చితంగా నువ్వు అన్నట్లు నాలుగేళ్లు పైనే పట్టేటట్లు ఉంది డార్లింగ్ ఏం చేద్దాం అంటే ప్రభాస్ నవ్వుతూ నాలుగేళ్లు కాకపోతే ఐదేళ్లు అది కూడా కుదరకపోతే ఆరేళ్ళు తీసుకో డార్లింగ్. టైమ్ గురించి అసలు ఆలోచించవద్దు. నువ్వు ఏం అటెంప్ట్ చేస్తున్నావో నీకు అర్ధం కావట్లేదేమో కానీ నాకు తెలుస్తోంది. ఇది ఒక గొప్ప ప్రయత్నం అని మేజర్ బూస్టప్ ఇచ్చాడు.

ఇక హీరోనే నాకేం పర్లేదు అంటే జక్కన్న ఊరుకుంటాడా, అదే ఉత్సాహంతో బాహుబలి-1 స్క్రిప్ట్ ను పూర్తి చేసాడు. ఈ సినిమా విడుదల కావడానికి రెండున్నరేళ్లు పట్టింది. బాహుబలి 1ను తెలుగుతో పాటు తమిళ్, హిందీ, మలయాళ భాషల్లోకి కూడా విడుదల చేసారు. ముందు 150 కోట్లు అనుకున్న బడ్జెట్ కాస్తా క్రమంగా 400 కోట్లకు చేరింది. ఇండియాస్ బిగ్గెస్ట్ మోషన్ పిక్చర్ అని టీమ్ ప్రమోట్ చేసింది. సినిమాను ఎంత బాగా తెరకెక్కిస్తాడో రాజమౌళి అంతే బాగా ప్రమోట్ చేస్తాడు కూడా. బాహుబలి సందర్భంగా చేపట్టిన క్యారెక్టర్ ఇంట్రడక్షన్ పోస్టర్లు భారీ పబ్లిసిటీని తీసుకొచ్చాయి. బాహుబలి 1ని మొదట నేషనల్ మీడియా లైట్ తీసుకుంది. అయితే విడుదల తర్వాత మొదట పాజిటివ్ రెస్పాన్స్ నార్త్ నుండే వచ్చింది.

ఈ తరహా ఎండింగ్ ను తెలుగు ప్రేక్షకులు మొదట జీర్ణించుకోలేదు. సగంలో ఆపేసినట్లు ఉంది అని అభిప్రాయపడ్డారు. అయితే రెండు రోజులకు బాహుబలి 1 తెలుగుతో పాటు అన్ని భాషల్లో పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమాకు వచ్చిన వసూళ్లు నభూతో అనే చెప్పాలి. బాహుబలి 1 తర్వాత వై కట్టప్ప కిల్డ్ బాహుబలి అనేది హుక్ లైన్ గా మారిపోయింది. ఎక్కడికి వెళ్లినా ఇదే ట్యాగ్ లైన్ ను ఉపయోగించడం మొదలుపెట్టారు ప్రేక్షకులు. బాహుబలి 1 సెన్సేషనల్ హిట్. ఇండియన్ సినిమాను ఒక్కసారిగా టాలీవుడ్ వైపు తిప్పిన సినిమా బాహుబలి 1. ఈ సినిమా తర్వాత ఆకాశాన్ని అంటే అంచనాలతో తెరకెక్కిన బాహుబలి 2ను సక్సెస్ చేయడం అంటే మాటలు కాదు. అయితే ఇక్కడే రాజమౌళి పనితనం కనిపిస్తుంది. బాహుబలి 2 మొదటి భాగం కంటే మూడింతల వసూళ్లను సాధించింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా దాదాపు 2000 కోట్లు సంపాదించింది అంటే అర్ధం చేసుకోవచ్చు దీని స్థాయి ఏంటో.

రాజమౌళి, ప్రభాస్, రానా ఇలా అందరూ ఒక్కసారిగా నేషనల్ స్టార్స్ అయిపోయారు. బాహుబలి జరిగిన 5 సంవత్సరాలు మిగతా నటీనటులు వేరే సినిమాలు చేసుకున్నారు కానీ ఒక్క ప్రభాస్ మాత్రమే బాహుబలి అయ్యేవరకూ దానికే కమిటై ఉన్నాడు. బాహుబలి 1 తర్వాత నిజానికి ఆరు నెలలు గ్యాప్ వచ్చింది ప్రభాస్ కు. తలుచుకుంటే ఈ గ్యాప్ లో ఒక సినిమా చేయవచ్చు కానీ ప్రభాస్ కు అది ఇష్టం లేదు. బాహుబలి అయ్యాకే వేరే సినిమాకు అని ఇచ్చిన మాట మీద నిలబడ్డాడు. అందుకే ప్రభాస్ త్యాగం, కష్టం ఎక్కడా వేస్ట్ అవ్వలేదు. ఎవరూ ఊహించని రేంజ్ కు ప్రభాస్ వెళ్ళిపోయాడు. బాహుబలి సిరీస్ తర్వాత ప్రభాస్ ఎంత మాత్రం రీజినల్ స్టార్ కాదు. ప్రపంచ పటంలో తెలుగు సినిమాను నిలిపిన ఖ్యాతి ప్రభాస్, రాజమౌళిలకు దక్కింది.

బాహుబలి తర్వాత ఎలాంటి సినిమా చేయాలన్న సంశయం ఎదురుకాకుండా ప్రభాస్ ముందుగానే ఒక సినిమాకు కమిటయ్యాడు. తన మిత్రులు యూవీ క్రియేషన్స్ కు డేట్స్ ఇచ్చాడు. రన్ రాజా రన్ తో సూపర్ హిట్ అందుకున్న యువ దర్శకుడు సుజీత్ కు ప్రభాస్ ను డైరెక్ట్ చేసే అద్భుత అవకాశం దక్కింది. ఆ సినిమానే సాహో. టేకింగ్ పరంగా స్టైలిష్ అనిపించిన సాహో కమర్షియల్ గా తెలుగు రాష్ట్రాల్లో వర్కౌట్ అవ్వలేదు. అయితే నార్త్ ఆడియన్స్ కు మాత్రం సాహో నచ్చేసింది. ఒక్క హిందీ నుండే ఈ సినిమాకు 150 కోట్ల నెట్ కలెక్షన్స్ వచ్చాయంటే ఈ సినిమాను ఎంతలా ఆదరించారో అర్ధం చేసుకోవచ్చు.

సాహో తర్వాత జిల్ దర్శకుడు రాధా కృష్ణ కుమార్ తెరకెక్కిస్తున్న రాధే శ్యామ్ లో నటిస్తున్నాడు ప్రభాస్. యూరోపియన్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతోన్న పీరియాడిక్ లవ్ స్టోరీ ఈ చిత్రం. జులై 16న ఈ సినిమా విడుదల కానుంది. ఇక నేషనల్ స్టార్ గా మారిన ప్రభాస్ వరసగా ప్యాన్ ఇండియన్ సినిమాలనే ఎంపిక చేసుకుంటున్నాడు.

ప్రస్తుతం ఇండియాలోకే బిజీ స్టార్ గా ప్రభాస్ మారిపోయాడు. రాధే శ్యామ్ తర్వాత మూడు సినిమాలను ప్రభాస్ లైన్ లో పెట్టాడు. అందులో ఒక చిత్రం ఆది పురుష్. బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో ప్రభాస్ రాముడిగా నటిస్తున్నాడు. మరోవైపు కే.జి.ఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ ను కూడా చేస్తున్నాడు. ఇక మరోవైపు మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఫ్యూచర్ బేస్ గా తెరకెక్కనున్న సైన్స్ ఫిక్షన్ చిత్రంలో ప్రభాస్ నటించనున్నాడు. ఈ సినిమాలు కాకుండా మరిన్ని ఎగ్జైటింగ్ ప్రాజెక్టులు లైన్లో ఉన్నాయి.

అవార్డులు

* తన తొలి సక్సెస్ వర్షం చిత్రానికి సంతోషం ఫిల్మ్ అవార్డ్ ఫర్ బెస్ట్ యంగ్ పెర్ఫార్మర్ గా అవార్డును అందుకున్నాడు.

* డార్లింగ్ సినిమాకు గాను క్రిటిక్స్ చాయిస్ సినీమా అవార్డును సొంతం చేసుకున్నాడు ప్రభాస్.

* మిర్చి సినిమాకు తన కెరీర్ లో తొలి నంది పురస్కారాన్ని అందుకున్నాడు.

* బాహుబలి 1 చిత్రానికి గాను సంతోషం బెస్ట్ యాక్టర్ అవార్డును అందుకున్న ప్రభాస్ బాహుబలి 2 సినిమాకు సైమా పురస్కారాన్ని సొంతం చేసుకున్నాడు.

* ఇక తన తొలి డైరెక్ట్ హిందీ సినిమా సాహోకు ఈటిసి బాలీవుడ్ బిజినెస్ అవార్డును కైవసం చేసుకున్నాడు.

బ్యాక్ గ్రౌండ్ తో ఇండస్ట్రీలోకి చాలా మందే వస్తారు. అయితే తనకంటూ ఒక శైలిని ఏర్పరుచుకుని మనం ఎవరివల్లనైతే ఇండస్ట్రీకి వచ్చామో వాళ్ళను దాటేలా ఫేమ్ సంపాదించుకోవడం అంటే మాటలు కాదు. అందులోనూ ప్రభాస్ నేషనల్ వైడ్ గా ఇప్పుడు ఒక సెన్సేషన్. ప్రభాస్ లైనప్ లో ఉన్న చిత్రాలు కచ్చితంగా ఎలాంటి హీరోకైనా ఈర్ష్య కలిగించేవే. డిఫరెంట్ జోనర్లకు చెందిన సినిమాలను ఎంపిక చేసుకుంటూ ప్రభాస్ ముందుకు వెళుతున్నాడు. రీజినల్ సినిమా నుండి మొదలుపెట్టి ప్రభాస్ ఈరోజు అందుకున్న ఎత్తు తెలుగు వారికి గర్వకారణం. ప్రభాస్ ఇలాగే మరిన్ని మంచి చిత్రాలు చేసి మరింత ఎత్తుకి ఎదగాలని కోరుకుందాం.

- Advertisement -

You've successfully subscribed to Tollywood Latest News | Celebrities Profiles | Media9 Tollywood
Great! Next, complete checkout to get full access to all premium content.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.