

రెబెల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం మంచి జోరు మీదున్నాడు. బాహుబలి, సాహో సినిమాల తర్వాత ప్రభాస్ వరసగా ప్యాన్ ఇండియా సినిమాలనే చేస్తున్నాడు. రాధా కృష్ణ కుమార్ దర్శకత్వంలో ప్రభాస్ చేస్తోన్న రాధే శ్యామ్ ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉంది. ఈ చిత్రం కాకుండా మరో మూడు సినిమాలను లైన్లో పెట్టాడు ప్రభాస్. అందులో మొదటిగా కేజిఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ సినిమాను చేయనున్నాడు. ఈ చిత్రం సంక్రాంతి సందర్భంగా హైదరాబాద్ లో లాంచ్ అయింది. ఈ సినిమా ముహూర్తానికి కే.జి.ఎఫ్ స్టార్ యష్ విచ్చేయడం విశేషం. ప్రభాస్, యష్ ను ఒకే ఫ్రేమ్ లో చూసి అభిమానులు వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా వస్తే బాగుంటుంది అని ఆశించారు. ఇక సలార్ విషయానికొస్తే ఇది మాఫియా బ్యాక్ డ్రాప్ లో సాగే కథ అని దర్శకుడు స్పష్టం చేసాడు. పూర్తి స్థాయి మాస్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా ఉండనుంది. కే.జి.ఎఫ్ వంటి భారీ చిత్రాన్ని నిర్మించిన హోంబళే ఫిల్మ్స్ సలార్ ను నిర్మించనుంది. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ మొదలవుతుంది. కే.జి.ఎఫ్ కు పనిచేసిన సాంకేతిక వర్గం ఈ సినిమాకూ పనిచేస్తుండడం విశేషమే.