
ఈ సంక్రాంతి బరిలో భారి అంచనాల నడుమ విడుదలైన చిత్రం 'రెడ్'. కిషోర్ తిరుమల దర్శకత్వంలో, ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని ద్విపాత్రాభినయం చేసిన ఈ చిత్రంలో అందాల తారలు మాళవిక శర్మ, అమృత అయ్యర్ లు రామ్ కు జంటగా నటించగా, నివేద పేతురాజ్ మరో ముఖ్య పాత్రలో నటించారు. సంపత్, పోసాని కృష్ణమురళి, సత్య కీలక పాత్రలు పోషించారు. అవడానికి తమిళ్ రిమేక్ అయినప్పటికీ తెలుగు నేటివిటికి తగ్గట్టుగా ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించారు. ఈ చిత్రంలో రామ్ తన నట విశ్వరూపాన్ని చూపించారు. రెండు భిన్న పాత్రల్లో ఒదిగిపోయారు. నాయికలుగా నటించిన మాళవిక, అమృత అయ్యర్ లు తమ పాత్రలకు న్యాయం చేశారు. పోలీస్ ఆఫీసర్లు గా నటించిన నివేద, సంపత్ లు అదరగొట్టేసారు.
సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని, ఎక్కడా బోర్ కొట్టకుండా చాలా జాగ్రత్తగా డీల్ చేసాడు దర్శకుడు. కథలో ట్విస్ట్ లను ముందే ప్రేక్షకులకు చూపించి, అవి ఎక్కడ రివీల్ చెయ్యాలో అక్కడ కరెక్ట్ గా రివీల్ చేశారు. అక్కడక్కడ కొన్ని అవసరం లేని డైలాగులు ఉన్నప్పటికీ, వాటి మీదకి దృష్టి పోకుండా ప్రేక్షకుడిని ఎంటర్టైన్ చేయడంలో సక్సెస్ అయ్యారు. సినిమా మొదలైన 40 నిమిషాల వరకూ సెట్ అప్ కు తగినంత టైమ్ కేటాయించి ఆ తర్వాత కథలోకి వెళ్లారు.
ఓవరాల్ గా నటీనటులందరూ తమ అత్యుత్తమ పెర్ఫార్మెన్స్ ను డెలివర్ చేశారు. మణిశర్మ నేపథ్య సంగీతం మరో ఆకర్షణ. సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫీ అదరహో అనిపించింది. ఎడిటింగ్ కూడా చాల జాగ్రత్తగా చేశారు. మొత్తానికి ఈ సంక్రాంతికి థియేటర్లలో సందడి చేస్తున్న 'రెడ్' మొదటి నుంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుని హిట్ అనిపించుకుంది.