విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'మిడిల్ క్లాస్ మెలోడీస్'. భవ్య క్రియేషన్స్ బ్యానర్ పై ఆనంద్ ప్రసాద్ నిర్మించాడు. వినోద్ అనంతోజు అనే నూతన దర్శకుడు ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన ‘మిడిల్ క్లాస్ మెలోడీస్’ చిత్రానికి సంబంధించిన ప్రచార చిత్రాలు ఆసక్తిని కలిగించాయి. నవంబర్ 20న అమెజాన్ ప్రైమ్ వీడియోలో డైరెక్ట్ ఓ.టీ.టీ పద్ధతిలో విడుదల అవుతున్న నేపథ్యంలో తాజాగా ఈ చిత్రం యొక్క ట్రైలర్ ని విడుదల చేశారు. సినిమా టైటిల్ కి తగ్గట్టుగానే ఇందులో మిడిల్ క్లాస్ జీవితాలను చూపిస్తున్నట్లు అర్థమౌతుంది. ఆనంద్ దేవరకొండ ఇందులో రాఘవ అనే యువకుడిగా కనిపిస్తున్నాడు. ఓ ఊర్లో తన తండ్రి నిర్వహించే టిఫిన్ సెంటర్ లో 'బాంబే చట్నీ' అనే స్పెషల్ చట్నీ చేయడంలో మంచి పేరు సంపాదిస్తాడు రాఘవ. దీంతో రాఘవ గుంటూరు కు వెళ్లి హోటల్ పెడితే సక్సెస్ అవుతుందని సొంతంగా హోటల్ పెట్టే ప్రయత్నాలు చేస్తాడు. గుంటూరులో హోటల్ ఏర్పాటు చేసిన రాఘవకు అనుకోని పరిణామాలు ఎదురైనట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. హీరోయిన్ వర్షా బొల్లమ్మ కూడా తన పాత్రకు తగ్గట్టుగా నటించినట్లు తెలుస్తోంది. నటనకు స్కోప్ ఉన్న పాత్రలో కనిపించింది. మధ్యతరగతి కుటుంబాలకు చెందిన వ్యక్తుల యొక్క జీవన విధానాన్ని ఇందులో చూపించినట్లు తెలుస్తుంది. మిడిల్ క్లాస్ యువకుడిగా ఆనంద్ దేవరకొండ నటన ఆకట్టుకునేలా ఉంది. ఈ నెల 20న అమెజాన్ ప్రైమ్ లో ఈ సినిమా విడుదల కానున్న ఈ 'మిడిల్ క్లాస్ మెలోడీస్' మూవీ అందరిని ఆకట్టుకునేలా ఉంది.