
సంక్రాంతికి రిలీజ్ అయిన చిత్రాల్లో మాస్టర్ కూడా ఒకటి. తమిళ స్టార్ హీరో విజయ్ దళపతి, విజయ్ సేతుపతి, అర్జున్ దాస్, ఆండ్రియా, ముఖ్యపాత్రల్లో నటించారు. యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం తమిళ్ తో పాటుగా మరో 3 భాషల్లో విడుదలైంది. విజయ్ వన్ మ్యాన్ షో గా నడిచిన ఈ చిత్రంలోని ప్రతి ఫ్రేమ్ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది. కథ పరంగా పాతదే అయినా అదిరిపోయే క్రాఫ్టింగ్ తో అద్భుతంగా తెరకెక్కించారు దర్శకుడు. కథ అక్కడక్కడా పక్కదారి పట్టినా అది ప్రేక్షకునికి బోర్ కొట్టకుండా తెరకెక్కించారు. సామాజిక అంశాన్ని కథా వస్తువుగా తీసుకుని దాన్ని కమర్షియల్ హంగులతో ముస్తాబు చేసి మన ముందు ఉంచారు. అసలే 9 నెలల లక్డౌన్ ను భరించి మాంచి ఆకలి మీద ఉన్న ప్రేక్షకులకు మాస్టర్ ఒక ఫుల్ మీల్స్ లా అనిపించి దాన్ని ఆవురావురు మనిపించారు. తమిళ్ లో స్టార్ హీరో గా ఎదిగిన విజయ్ సేతుపతి ఈ చిత్రానికి ప్రధానాకర్షణ. తెరపై కనిపించేది తక్కువ సమయమే అయినా తన నటనా చాతుర్యంతో ప్రేక్షకులను తన వైపు తిప్పేసుకుంటారు. ముఖ్యంగా విజయ్ తో వచ్చే సన్నివేశాల్లో అయితే నువ్వా నేనా అన్నట్టుగా విజయ్ ను ఢీ కొన్నారు.
ఇక ఈ చిత్ర విజయంలో సాంకేతిక నిపుణుల పాత్ర ముఖ్యమైంది. అనిరుద్ తన మ్యూజిక్ తో మరో సారి మాయ చేసాడు. సినిమాటోగ్రఫర్ సత్యన్ సూర్యన్ ఈ చిత్రానికి తన పనితనంతో ప్రాణం పోశారు ప్రతి ఫ్రేమ్ ని ఒక పెయింటింగ్ లా మలిచారు. ఎడిటర్ ఫీలోమీన్ రాజ్ తన టాలెంట్ ను ప్రూవ్ చేసుకున్నాడు. మొత్తానికి సంక్రాంతికి రిలీజ్ అయ్యి మాస్టర్ కూడా హిట్ అనిపించుకుంది. మీరు కూడా ఒకసారి ఈ మాస్టర్ ని కలిసి రండి.