
సంక్రాంతి సినిమాల బరిలో ముందుగా వచ్చిన సినిమా మాస్ మహారాజా రవితేజ నటించిన ‘క్రాక్’. ఈ సినిమా జనవరి 9న థియేటర్లలో విడుదలైంది. కాకపోతే విడుదలకి ముందు నిర్మాత ‘ఠాగూర్’ మధు ఆర్థిక వివాదంలో ఇరుకున్న కారణంగా ఆ రోజు ఉదయం నుండి ఎక్కడా థియేటర్లలో షోలు పడలేదు. దీంతో రవితేజ ఫ్యాన్స్, ప్రేక్షకులు అసహనానికి గురయ్యారు. మార్నింగ్, మ్యాట్నీ షోలు క్యాన్సిల్ అవగా సాయంత్రం ఫస్ట్ షో నుండి షోలు పడ్డాయి. అయితే ఆలస్యంగా విడుదలైనా సరే ఈ సినిమాకి మాత్రం ఒక రేంజ్ లో రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా చూసిన వాళ్ళు పక్కా మాస్ ఎంటర్టైనర్ అంటున్నారు. అలాగే చాలా మంది రివ్యూ రాసేవాళ్ళు కూడా ఈ సినిమాకి మంచి రేటింగ్ ఇచ్చారు. ఈ సంక్రాంతికి రవితేజ సూపర్ హిట్ కొట్టబోతున్నాడు అని అందరూ ఫిక్స్ అయిపోయారు. అందుకు తగ్గట్టు గానే థియేటర్స్ దగ్గర జనాల కోలాహలం మనం చూడొచ్చు. ఈ మధ్య సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్న రవితేజ అభిమానులకి ఈ సినిమా మంచి ఆనందాన్ని ఇచ్చింది. అలాగే ఇప్పటి దాకా రవితేజ పోలీస్ గా నటించిన సినిమాల్లో హిట్స్ ఎక్కువగా ఉన్నాయి. ఆ సెంటిమెంట్ ని ఈ సినిమా నిజం చేస్తూ సూపర్ హిట్ టాక్ తో దూసుకెళ్తుంది. ఈ సినిమాలో థమన్ బాక్ గ్రౌండ్ మ్యూజిక్ పెద్ద హైలైట్ అని చూసిన అందరూ అంటున్నారు. మీరు కూడా ఒకసారి చుసేయండి.