
అప్పటివరకూ సిజి వర్క్ అంటే పెద్దగా తెలియకుండానే భారతదేశంలో సినిమాలు తెరకెక్కేవి. ఎమ్మెస్ ఆర్ట్స్ మూవీస్ ఎన్నో విలక్షణమైన చిత్రాలను నిర్మించింది. తెలుగు సినిమాను ముందుకు తీసుకెళ్ళడానికి ఈ సంస్థ మరపురాని సినిమాలను నిర్మించింది. అందులో అమ్మోరు చిత్రానికి ప్రత్యేకమైన గుర్తింపు లభిస్తుంది. ఖర్చుకు వెనకాడకుండా అమ్మోరు చిత్రాన్ని అద్భుతమైన సిజి వర్క్ తో రూపొందించారు నిర్మాత శ్యామ్ ప్రసాద్ రెడ్డి. ఈ సినిమా గ్రాఫిక్స్ వర్క్ మొత్తం లండన్ లోనే జరగడం విశేషం. సౌందర్య, రమ్యకృష్ణ, రామిరెడ్డి, బేబీ సునైనా, సురేష్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ చిత్రం దేశవ్యాప్తంగా విశేషమైన పేరుని సంపాదించుకుంది. రామిరెడ్డి విలన్ గా ఈ చిత్రంతోనే సుస్థిరమైన స్థానం సంపాదించాడు. కోడి రామకృష్ణ దర్శకుడిగా తన స్థాయిని మరింత పెంచుకున్నాడు. అప్పట్లో అమ్మోరు థియేటర్లు ప్రదర్శిస్తున్న చోట్ల గుడిలు వెలిసాయి. ఇలా జరగడం బహుశా ఈ సినిమాతోనే సాధ్యమైందేమో. సత్యానంద్ ఈ చిత్రానికి మాటలు రాయగా శ్రీ కొమ్మినేని, కె చక్రవర్తి సంగీతం అందించారు. సి. విజయ్ కుమార్ సినిమాటోగ్రఫీ అందించారు. ఎమ్మెస్ ఆర్ట్స్ యూనిట్ ఈ చిత్ర కథను అందించింది. నేటితో అమ్మోరు చిత్రం విడుదలై పాతికేళ్ళు. ఈ చిత్రం అందించిన సినిమాటిక్ అనుభూతి మరపురానిది.