
కరోన వల్ల పరిశ్రమ పరిస్థితి రోజురోజుకి మరింత క్లిష్టంగా తయారవుతోంది. సినిమాలన్నీ వాయిదా పడుతున్నాయి. గతేడాది జరిగిన నష్టం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న పరిశ్రమని కరోన సెకండ్ వేవ్ మళ్ళీ ఇరకాటంలో పడేస్తోంది. షూటింగ్స్ కూడా ఆపేస్తున్నారు. దీనికి తోడు మే2 నుంచి మళ్ళీ లాక్ డౌన్ పెడతారు అనే వార్తలు వస్తుండటంతో కొంతమంది కార్మికులు తమ స్వగ్రామాలకు వెళ్ళిపోతున్నారు. ఇది ఇలానే కొనసాగితే ఈసారి వచ్చే నష్టాన్ని తట్టుకోవడం కష్టమే.



ఇక ఈ నెల విడుదల కావల్సిన సినిమాలు దాదాపుగా అన్ని వాయిదా పడ్డాయి. కొన్ని సినిమాలు ఓ.టి.టిల్లో విడుదలయ్యాయి. వేణు ఉడుగుల, రానా కాంబోలో రోపుదిద్దుకున్న విరాటపర్వం సైతం 30న విడుదలవ్వాల్సి వాయిదా పడింది. అనసూయ ప్రధానపాత్రలో నటిస్తున్న థాంక్ యు బ్రదర్ డైరెక్ట్ గా ఓ.టి.టిలో విడుదలవనుంది. ఇక సంతోష్ శోభన్ హీరోగా నటిస్తున్న ఏక్ మినీ కథ సైతం ఓ.టి.టిలో విడుదలవనుంది. వీటితో పాటు ఇంకొన్ని చిత్రాలు కూడా ఓ.టి.టిల్లో విడుదల కానున్నాయి.

మెగాస్టార్ చిరంజీవి టైటిల్ పాత్రధారిగా కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ పతాకాలపై స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో నిరంజన్ రెడ్డి నిర్మిస్తోన్న భారీ చిత్రం ‘ఆచార్య’. ఈ చిత్రాన్ని మే 13న విడుదల చేస్తున్నట్లు నిర్మాతలు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా దేశంలో నెలకొన్న కొవిడ్ సెకండ్ వేవ్ పరిస్థితుల కారణంగా సినిమా విడుదలను వాయిదా చేస్తున్నట్లు, పరిస్థితులు చక్కబడగానే సినిమా విడుదల తేదీకి సంబంధించిన ప్రకటనను వెలువరిస్తామని నిర్మాతలు నిరంజన్ రెడ్డి, రామ్ చరణ్ ప్రకటించారు.