మెగాస్టార్ చిరంజీవి

పరిచయం

‘మెగాస్టార్ చిరంజీవి’ పరిచయం అవసరం లేని పేరు. తన అభినయంతో, డ్యాన్స్ లతో తెలుగు ప్రేక్షకుల మనస్సులో చెరగని ముద్ర వేసి, నాలుగు దశాబ్దాల పాటుగా చిత్ర పరిశ్రమను ఏలిన మకుటం లేని మారాజు మన ‘కొణిదెల శివ శంకర వర ప్రసాద్’

వ్యక్తిగత జీవితం


చిరంజీవి గారు 1955వ సంవత్సరంలో ఆగష్టు 22వ తేదీన వెంకట్రావు, అంజనా దేవి దంపతులకు పశ్చిమ గోదావరి జిల్లా, మొగల్తూరులో జన్మించాడు. ఆయన్ను పుట్టినప్పటి నుండి ఆయన తాతయ్య జే.ఆర్.కె నాయుడు గారు అల్లారుముద్దుగా పెంచారు.

నాలగవ ఏట తాతగారి ఆరోగ్యం క్షీణించడంతో చనిపోయాడు. అప్పటి నుండి అమ్మమ్మ రాధాభాయి గారే మెగాస్టార్ చిరంజీవి గారి పనులు చూసుకునేది. వృత్తి రీత్యా మొగల్తూరు నుండి వెంకట్రావు గారు బదిలీ అయ్యే సమయం నాటికి మెగాస్టార్ గారు ఒకటవ తరగతి చదువు పూర్తి చేసారు. తరువాత గురజాల, మంగళగిరి, ప్రోల్లురు పలు ప్రాంతాల్లో వెంకట్రావు గారు ఉద్యోగం చేసేవారు. మరో ప్రక్క మెగాస్టార్ గారి చదువు కొనసాగుతూ ఉండేది. చీరాల, ఒంగోలు లాంటి ప్రాంతాల్లో కూడా చిరంజీవి గారు చదువుకున్నారు. ఎన్.సి.సి క్యాంపుల్లో కూడా చురుకుగా పాల్గొన్న చిరంజీవి గారు, ఒక సారి ఢిల్లీ వెళ్ళిన సందర్భం కూడా ఉంది. ఆ విధంగా ఆయన చదువుకునే రోజుల్లో కూడా చాల చురుకైన విద్యార్ధిగా వ్యవహరించేవారు. అలా ఆయన నర్సాపుర్ లోనీ శ్రీ వై. ఎన్ కాలేజీలో డిగ్రీ పూర్తి చేసారు.

సినీ రంగ ప్రవేశం

కళారంగంలో మంచి భవిష్యత్తు ఉందని గ్రహించిన ఆయన డిగ్రీ పూర్తి చేసిన తరువాత సినిమా ఇండస్ట్రీకి వెళ్ళాలని చిరంజీవి గారు నిర్ణయించుకున్నారు. ఒక మధ్య తరగతి కుటుంబంలో పుట్టిన ప్రధమ పుత్రుడిగా కుటుంభాన్ని చూసుకోవలసిన భాద్యతను విరమించేసరికి తండ్రి వెంకట్రావు గారికి  కోపం వచ్చింది. అప్పటికే చిరంజీవి గారు చదువు కోసం అని చెప్పి 1977 జనవరి 22వ తేదీన చెన్నై వచ్చి ఒక రూమ్ లో ఉంటూ పగలు చదువుకుంటూ, సాయంత్రం వెస్టర్న్ డాన్సులు నేర్చుకుంటూ సినిమాల్లో అవకాశం కోసం ప్రయత్నాలు మొదలుపెట్టారు. వెంకట్రావు గారు నేరుగా చెన్నై వచ్చి తన స్నేహితుడైన ఏకాంబరేశ్వరరావు గారి ఇంటికి చిరంజీవి గారిని పిలిపించి క్లాసు పీకాడంటా. సినిమా ఇండస్ట్రీలో సుస్థిరమైన స్థానం సంపాదించాలంటే మామూలు విషయం కాదు. మాతో పాటు వచ్చి మన ఊళ్లోనే ఏదోక ఉద్యోగం చేసుకుంటూ భాద్యతగా కుటుంబాన్ని చూసుకోవచ్చని చెప్పిన వెంకట్రావు గారి మాటలు చిరంజీవి గారు వినలేదు. పట్టు వదలని విక్రమార్కుడిలాగా నాకొక సంవత్సరం సమయమివ్వండి, ఆ లోపల నా ప్రయత్నాలు నన్ను చేయనివ్వండని బ్రతిమాలి మరీ నాన్న గారిని ఒప్పించారు. వెంకట్రావు గారు ప్రతి నెలా ఖర్చులకి చిరంజీవి గారికి డబ్బులు పంపేవారు. అలా నాన్న గారు పంపించిన డబ్బులు జాగ్రత్తగా ఖర్చుపెట్టుకునే వారు. ఒక రోజు దక్షిణాది చలన చిత్ర పరిశ్రమకు సంబందించి చెన్నై ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో యాక్టింగ్ ట్రైనింగ్ ఇస్తున్నారని తెలిసి ఆ ఇన్స్టిట్యూట్ లో అప్లై చేసి చేరిపోయారు. అక్కడే ఆయనకు రాజేంద్ర ప్రసాద్, సుధాకర్ లాంటి నటులు పరిచయమయ్యారు.

వేషాల కోసం చిరంజీవి గారు పడ్డ కష్టాలు అన్నీ, ఇన్నీ కావు ఇలాంటి రోజుల్లోనే చిరంజీవి గారిరూమ్మేటయిన సుధాకర్ గారిని పాండిబజార్లో చుసిన దర్శకుడు గుడపాటి రాజ్ కుమార్ గారు ‘పునాదిరాళ్ళు’ సినిమా కోసం ఒక పాత్రను అనుకున్నారు, కాని అప్పుడు తమిళంలో ప్రముఖ దర్శకుడు భారతిరాజా గారు తెరకెక్కిస్తున్న ‘కిళక్కె పోగుమ్ రెయిల్’ చిత్రంలో సుధాకార్ గారిది ప్రధాన పాత్ర అవ్వడంతో, గుడపాటి రాజ్ కుమార్ గారికి చిరంజీవి గారిని పరిచయం చేసి నాకు చేయడం కుదరదు అని చివరిక్షణాల్లో ఆ పాత్రకు ఆయన్ను సిఫారసు చేసారు. దర్శకుడు అనుకున్న పాత్రకి చిరంజీవి గారు సరిపోవడంతో ఆయన్ను ఎంపిక చేసుకున్నారు. అలా ‘పునాది రాళ్ళు’ చిత్రంతో ఆయన ప్రస్థానానికి పునాది పడింది. ఈ విషయాన్ని తనకొచ్చిన ఆనందాన్ని కుటుంబ సభ్యులతో పంచుకోవాలని ఇంటికి వచ్చి పంచుకున్నాడు. ఇక స్క్రీన్ నేమ్ ఏమి పెట్టుకొవాల అని ఆలోచిస్తున్న సమయంలో ఆయనకు ఒక కల వచ్చింది అందులో వాళ్ళకు ఇలవేల్పైన ఆంజనేయస్వామి గుడి మెట్ల పై ఉన్న ఆయన్ని ఎవరో వ్యక్తి ‘చిరంజీవి’ అని పిలవడం, అలా తనకు వచ్చిన ఆ కలని వాళ్ళ అమ్మగారికి చెప్పడంతో ‘చిరంజీవి’ అనేది ఆంజనేయస్వామికి మారు పేరని, ఆ పేరే పెట్టుకోమని వాళ్ళ అమ్మగారు సలహా ఇచ్చారు. అలా ఆయన పునాది రాళ్ళు ప్రెస్ మీట్ అప్పుడు తన పేరుని చిరంజీవి అని ప్రకటించారు. అలా చిరంజీవి గారి చలనచిత్ర రంగ ప్రవేశం 1978 ఫిబ్రవరి 11 వ తేదీన జరిగింది.

ఆయన నటించిన మొదటి సినిమా ‘పునాదిరాళ్ళు’ అయినప్పటికీ ఆ చిత్రం తర్వాత నటించిన ‘ప్రాణం ఖరీదు’ చిత్రం ముందుగా విడుదలైంది. ఈ చిత్రం 1978 సెప్టెంబర్ 22వతారీకున విడుదలైంది. రావు గోపాల్ రావు, జయసుధ, చిరంజీవి, నూతన ప్రసాద్, చంద్ర మోహన్ ప్రధాన పాత్రల్లో కె.వాసు గారి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం పేదవారి పై భూస్వాములు చేసే దౌర్జన్యాన్ని క్షుణ్ణంగా వివరించింది. భూస్వామైన కనకయ్య తన కూతురి వయస్కురాలైన సీతని పెళ్ళి చేస్కుని ఆమెను ఒక వంటింటి కుందేలును చేస్తాడు. అతని బావమరిదైన ఒక  వ్యక్తి అతని దగ్గర పని చేసే దేవుడు చెల్లెల్ని మానభంగం చేయడంతో ఇదేంటి అని ప్రశ్నించిన దేవుడ్ని అతనికి సహకరించిన తన భార్య సీతను చంపేస్తాడు. దీంతో తిరగబడిన జనం కనకయ్య ను అంతమొందిస్తారు. నరసింహ పాత్రలో చిరంజావి గారు అద్భుతంగా నటించారు.

ఆ తర్వాత వచ్చిన ‘మన వూరి పాండవులు’ ఆయన కెరీర్ లో చిరస్థాయిగా నిలిచిపోయిన చిత్రం. రెబల్ స్టార్ కృష్ణంరాజు, చిరంజీవి, రావుగోపాల్ రావు, మురళీమోహన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం 1978వ సంవత్సరంలో విడుదలై మంచి విజయం సాధించింది.. మహాభారతాని ఒక పల్లెకు ఆపాదించి, అక్కడ ఉండే పరిస్థితులకి తగ్గట్టుగా పాత్రలను మలిచి ఒక గొప్ప దృశ్య కావ్యంగా ఆ చిత్రాన్ని తెరకెక్కించారు దర్శకుడు బాపు. ఊరిని తన గుప్పిట్లో ఉంచుకుని అమాయక ప్రజలని పీడించే దొర పాత్రలో రావు గోపాలరావు గారు అద్భుతంగా నటించారు. ఆయన తమ్ముడి పాత్రలో కృష్ణంరాజు, పార్థు పాత్రలో చిరంజీవి తమ పాత్రల్లో జీవించారు. ఊరిని పట్టి పీడిస్తున్న దొరకు వ్యతిరేకంగా జనాల్లో తిరిగుబాటు తీసుకురావాలని అనుకునే కృష్ణ, తన మేనల్లుడైన పార్థు, ఊరి కారణం కొడుకైన రాము లతో కలిసి జనాల్లో చైతన్యం తీసుకురావడానికి ప్రయత్నిస్తాడు. దొర చేసిన


మోసాలకు భాదితులైన ఇంకో ముగ్గురు వీరితో కలుస్తారు.అలా వీళ్ళతో మొదలైన తిరుగుబాటు మెల్లగా జనాల్లో కూడా మొదలవుతూ ఉంటుంది. ఊరి జనాలని ఫ్యాక్టరీ పేరుతో మోసం చేయాలనుకుని పట్టణం నుండి వచ్చి జనాల సొమ్మును దోచ్కోవాలనుకుంటాడు దొర కొడుకైన సారథి. ఆ డబ్బుని వాళ్ళ దగ్గర నుండి తస్కరించి క్షేమంగా ఉంచుతారు. చివర్న వూరి జనాలకి వాళ్ళ నిజ స్వరూపాన్ని తెలియజేసి వారి ఆట కట్టిస్తారు. ఈ చిత్రం కన్నడ చిత్రమైన ‘పడువారళి పాండవరు’కి రీమేక్ అయినప్పటికీ మన సంస్కృతిని కళ్ళకద్దినట్టు చూపించారు దర్శకుడు బాపు. ఈ చిత్రం గడించిన ఖ్యాతిలో నటులకు ముఖ్యమైన స్థానం ఉంటుంది.

ఆ తర్వాత వచ్చిన తాయారమ్మ బంగారయ్య,  కుక్క కాటుకు చెప్పు దెబ్బ, కొత్త అల్లుడు చిత్రాల్లో ఆయన నటించారు. ఆ తరవాత ఆయన మొదటి చిత్రం అయినటువంటి ‘పునాది రాళ్ళు’ చిత్రం 21 జూన్ 1979వ సంవత్సరంలో విడుదలైంది. మంచి కథ, కథనంతో తెరకెక్కిన ఈ చిత్రం చక్కటి విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ చిత్రంలో సీనియర్ నటి సావిత్రి ఒక ముఖ్యమైన పాత్రలో నటించారు. ఈ చిత్రంలో చిరంజీవి గారితో పాటు పట్టణం నుంచి పల్లెకు వచ్చే యువకుల పాత్రల్లో నటించిన వారందరూ కూడా ఈ చిత్రంతోనే తెరంగేట్రం చేసారు. మొదటి చిత్రమే అయినప్పటికీ నటీనటులందరూ ఎంతో పరిణితి చెందిన నటుల మాదిరిగా చక్కగా నటించారు. ఇందులో చిరంజీవి గారి పాత్రకు, ఆయన నటనకు మంచి మార్కులు పడ్డాయి.

ఆ తర్వాత ఆయన పలు చిత్రాల్లో ప్రతినాయక పాత్రల్లో కూడా నటించించారు. దిగ్గజ దర్శకుడు కె. బాలచందర్ గారు తెరకెక్కించిన ‘ఇది కథ కాదు’ చిత్రంలో ప్రతినాయక పాత్రను పోషించారు. అందులో జయసుధ భర్త పాత్రలో అద్భుతమైన నటనను కనబరిచారు. కేవలం హీరో పాత్రలే కాకుండా వివిధ రకాల పాత్రలను ఆయన ప్రధమాంకంలోనే పోషించారు. అప్పటి వరకు ఆయన పోషించిన పాత్రలు ఒక ఎత్తైతే ‘పున్నమి నాగు’ చిత్రంలోని ఆయన పాత్ర మరో ఎత్తు. ఈ చిత్రం 1980వ సంవత్సరం జూన్ 13న విడుదలైంది. ఈ చిత్రంలో ఆయన నాగులు అనే పాత్రను పోషించారు. నాగులు పాములు పట్టి జీవనం సాగిస్తూ ఉంటాడు. చిన్నతనంలో వాళ్ళ నాన్న అతని నరాలలోకి విషాన్ని ఎక్కిస్తాడు దాంతో అతని ఒళ్లంతా విషంతో నిండిపోతుంది. అతను ప్రేమించిన అమ్మాయి పూర్ణిమ అతని వల్లే మరణించడంతో, పూర్ణిమ అన్న అయినటువంటి రాజు ఆమె ఎలా చనిపోయిందనే విషయమై దర్యాప్తు చేస్తూ ఉంటాడు. ప్రతీ పున్నమికి నాగులు ఒక అమ్మాయిని చంపేస్తూ ఉంటాడు. అతని శరీరం నుండి కుబుసం విడుస్తూ మెల్లగా విష సర్పంలా మారుతూ ఉంటాడు. అలా అతని గురించి తెలుసుకున్న ఊరి జనం అతన్ని హతమార్చాలని అతని వెంటపడే సమయంలో అతనే కొండ మీద నుండి దూకి ఆత్మహత్య చేసుకుంటాడు. మంచి కథనంతో ఈ చిత్రం అనుక్షణం ఉత్కంఠభరితంగా సాగుతుంది. ఈ చిత్రంతో ఆయన నటుడిగా మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఆ పాత్రలో అద్భుతంగా నటించి ఆ పాత్రకు ప్రాణం పోశారు. అలా ఆయన ఇండస్ట్రీకి వచ్చిన 3 ఏళ్ళలో 24 చిత్రాల్లో నటించారు.

17 జులై, 1981వ సంవత్సరంలో విడుదలైన ‘47రోజులు’ చిత్రం ఆయన్ను నటుడిగా మరో మెట్టు పైకి ఎక్కించింది. కె.బాలచందర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో జయప్రద కథానాయికగా నటించారు. ఈ చిత్రంలో వైశాలిగా జయప్రద, ఆమె భర్త కుమార్ గా చిరంజీవి నటించారు. విదేశాల్లో ఉండే కుమార్ వైశాలిని పెళ్ళి చేసుకుని ఆమెను తనతో పాటు తీసుకు వెళతాడు, అక్కడ అతను ఉండే ఇంటి పైన మరో అమ్మాయి ఉంటుంది. ఆమె కుమార్ మొదటి భార్య, ఆమెకు వైశాలి తన చెల్లెలని, వైశాలికి ఆమె తన ఫ్రెండ్ అని చెప్పి నమ్మిస్తాడు. ఈ విషయం తెలుసుకున్న వైశాలి అసలు విషయాన్ని లూసికి చెప్పాలనుకుంటుంది. కానీ ఆమెకు తన భాష అర్ధం కాకపోవడంతో తన భాష తెలిసిన వారి సహాయం కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఈ విషయం తెలుసుకున్న కుమార్ ఆమెను హింసించడం మొదలు పెడతాడు. బయట జనాలందరికీ ఆమె పిచ్చిది అని చెప్పి వాళ్ళను నమ్మిస్తాడు. ఆమె దుస్తితిని గమనించిన రమప్రభ డాక్టర్ అయిన శంకర్ కు ఈ విషయాన్ని తెలియజేస్తుంది. ఇదంతా తెలుసుకున్న శంకర్ అసలు విషయాన్ని లూసి కి తెలియజేసి వైశాలిని తీసుకుని ఇండియా తిరిగివెళ్ళిపోతాడు. చెడ్డవాడిని పెళ్ళి చేసుకోవటం కంటే  ఒంటరిగా ఉండటమే ఉత్తమం అని ఈ చిత్రం చక్కగా వివరించింది. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో విడుదలైన ఈ చిత్రం తమిళంలో 47 నాటక్కళ్ గా తెరకెక్కింది. ఎటువంటి పాత్రనైనా సవాలు చేసే స్థాయికి చిరంజీవి గారు ఎదిగేలా చేసింది. అలా ఆయన ప్రతినాయక పాత్రలు చేస్తూనే హీరోగా నిలదొక్కుకునే ప్రయత్నాలు చేసారు. విశ్వ సుందరి శ్రీదేవి, నూతన ప్రసాద్ లు ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ‘రాణి కాసుల రంగమ్మ’, రజినీకాంత్ కథానాయకుడిగా తెరకెక్కిన ‘రణువ వీరన్’ తదితర చిత్రాల్లో ఆయన ప్రతినాయక పాత్రలు పోషించారు. ఆ

సంవత్సరంలో విడుదలైన ‘చట్టానికి కళ్ళు లేవు’ చిత్రంతో ఆయన హీరోగా నిలదొక్కుకునేందుకు ఉపయోగ పడింది. ఆ తర్వాత 1982 లో వచ్చిన ‘శుభలేఖ’ చిత్రం ఆయనకు మరింత మందికి చేరువయ్యేలా చేసింది. ఈ చిత్రంలో నటించిన సుధాకర్ గారు ‘శుభలేఖ సుధాకర్’ గా స్థిరపడిపోయిన విషయం తెలిసిందే. మోహన్ బాబుతో కలిసి నటించిన బిల్లా-రంగా, యమకింకరుడు చిత్రాలు మంచి విజయాలు సాధిస్తే, వంశి గారి దర్శకత్వంలో ఆయన నటించిన ‘మంచు పల్లకి’ చిత్రం నటుడిగా ఆయన్ను మరో మెట్టు పైకి ఎక్కించింది.

1983వ సంవత్సరంలో విడుదలైన అభిలాష, గూఢచారి నెం.1, మగమహారాజు చిత్రాలు ప్రేక్షకాధరణను చూరగొన్నాయి. అదే సంవత్సరంలో విడుదలైన ‘ఖైదీ’ చిత్రం ప్రభంజనాన్ని సృష్టించింది. ఆయనకు ఎనలేని స్టార్ డమ్ ను తీసుకొచ్చింది ఈ చిత్రం. ఆ ఒక్క చిత్రంతో ఆయన తన సత్తా ఏంటో నిరూపించుకున్నారు. 1982వ సంవత్సరంలో విడుదలైన హాలివుడ్ చిత్రం ‘ఫస్ట్ బ్లడ్’ ఆధారంగా ఖైది తెరకెక్కింది. హాలివుడ్ రాంబో సిల్వెస్టర్ స్టాలోన్ ఆ చిత్రంలో కథానాయకుడిగా నటించారు. ‘ఫస్ట్ బ్లడ్’ చిత్రాన్ని ఇన్స్పిరేషన్ గా తీసుకుని కోదండ రామిరెడ్డి గారు చిరంజీవి గారికి ఒక లైన్ వినిపించారు. ఆ లైన్ నచ్చడంతో పరుచూరి బ్రదర్స్ ఒక అద్భుతమైన కథను సిద్ధం చేసి దర్శకుడి చేతిలో పెట్టారు. ఇక అనుకునట్టుగా చిత్రం మొదలై దాదాపుగా 3 షెడ్యూల్స్ లో పూర్తయింది. ఒక్క క్లైమక్స్ తప్పించి మిగితా కథ మొత్తం నెల్లూరు లోనే చిత్రీకరించబడింది. ఇక విడుదలైన అన్ని సెంటర్లలో ఈ చిత్రం ఘన విజయం సాధించింది. ఈ చిత్రంతో దీనికి పని చేసిన వారందరూ

మంచి స్థాయికి చేరుకున్నారు. ఇక ఆ తర్వాత సంవత్సరంలో వచ్చిన హీరో, మహానగరంలో మాయగాడు, చాలెంజ్ చిత్రాలతో తిరుగులేని హీరోగా తెలుగు చిత్రసీమలో ప్రభంజనాలు సృష్టించారు. ఆ తర్వాత చట్టంతో పోరాటం, దొంగ, రక్త సింధూరం, విజేత, కిరాతకుడు, కొండవీటి రాజా, వేట, చంటబ్బాయి, రాక్షసుడు, ఆరాధన, త్రిమూర్తులు, పసివాడి ప్రాణం, స్వయం కృషి, రుద్రవీణ, యముడికి మొగుడు, స్టేట్ రౌడీ, రుద్రనేత్ర, కొండవీటి దొంగ, జగదేక వేరుడు అతిలోక సుందరి, కొదమ సింహం, రాజా విక్రమార్క, గ్యాంగ్ లీడర్, రౌడి అల్లుడూ, ఘరానా మొగుడూ, ఆపద్భాందవుడు, ముఠా మేస్త్రీ, మాస్టర్, చూడాలని ఉంది, శ్రీ మంజునాథ, ఇంద్ర, ఠాగూర్, శంకర్ దాదా ఎమ్.బి.బి.ఎస్, స్టాలిన్, శంకర్ దాదా జిందాబాద్చిత్రాల్లో నటించిన ఆయన సినిమాలకి బ్రేక్ ఇచ్చి రాజకీయాల్లోకి వెళ్ళారు. ఆ ఆ తర్వాత ‘ఖైది నెం 150’ చిత్రంతో రీ ఎంట్రీ ఇచ్చి సైరా ‘నరసినంహ రెడ్డి’  చిత్రంలో నటించారు. మొదటి చిత్రం నుండి నేటి సైరా నరసింహా రెడ్డి వరకూ 150 సినిమాలకు పైగా ఎన్నో పాత్రలతో చాలా మంది అభిమానులను ఆయన సొంతం చేసుకున్నాడనే చెప్పాలి. ముఖ్యంగా చెప్పాలంటే 65 హిట్స్ ఉన్నాయి. చలన చిత్ర పరిశ్రమలో ఇంత ఘనత ప్రత్యేకమే అని చెప్పాలి

హిందీ పరిశ్రమలో

తన నటనతో దక్షిణాదిన పాగా వేసిన మెగాస్టార్, యావత్ భారత దేశం తన వైపు చూసేలా చేసిన చిత్రం ‘ప్రతిబంధ్’. యాంగ్రీ యంగ్ మ్యాన్ రాజశేఖర్, జీవిత, రామిరెడ్డి ప్రధాన పాత్రల్లో దర్శక దిగ్గజం కోడి రామకృష్ణ గారి దర్శకత్వంలో  ఎం. శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు నిర్మించిన ఈ చిత్రం అప్పట్లో ప్రభంజనం సృష్టించింది. విడుదలైన అన్ని సెంటర్లలో ఊహించని విధంగా కలెక్షన్స్ రాబట్టింది. అవినీతిపరులనీ, దుర్మార్గులనీ శిక్షించడానికి చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకున్న ఒక నిజాయితీపరుడైన పోలీస్ పాత్రలో  రాజశేఖర్ గారు జీవించారు. ఈ చిత్రం ఆయనకు ఎనలేని కీర్తి ప్రతిష్టలని తెచ్చిపెట్టింది. చిరంజీవి గారి బాలివుడ్ ఎంట్రీ ఎప్పుడా అని అందరూ ఎదురు చూస్తున్న సమయం. ఆయన ఏ సినిమాతో బాలివుడ్ లో అడుగు పెడతారో అని అనుకుంటున్న టైమ్ లో ‘ప్రతిబంధ్’ చిత్రాన్ని అనౌన్స్ చేసారు. రవిరాజా పినిశెట్టి గారి దర్శకత్వంలో చిరంజీవి కథానాయకుడిగా 28సెప్టెంబర్ 1990లో విడుదలైన ఈ చిత్రం సంచలం సృష్టించింది. అందరి చూపు ఒక్కసారిగా మెగాస్టార్ వైపు తిరిగేలా చేసింది. బాలివుడ్ లోని హేమాహేమీలందరూ ఆయన్ను చూసి ఆశ్చర్య పోయేలా చేసింది. ఈ చిత్రంతో ఆయనకు బాలివుడ్ లో గట్టి పునాది పడింది. ఆ చిత్రం తర్వాత వరసగా ఆజ్ కా గుండా రాజ్, ది జెంటిల్ మెన్ చిత్రాలు ఆయన చేసారు. రెండు సినిమాలు కూడా రీమేక్ చిత్రాలే, ‘ఆజ్ కా గూండా రాజ్’, విజయ బాపినీడు గారి దర్శకత్వంలో, మాగంటి రవీంద్రనాధ్ గారు నిర్మించిన గ్యాంగ్ లీడర్ చిత్రానికి రీమేక్ కాగా, క్రియేటివ్ డైరెక్టర్ శంకర్ గారి దర్శకత్వంలో ‘యాక్షన్ కింగ్ అర్జున్’ నటించిన ‘జెంటిల్ మెన్’ చిత్రానికి రీమేక్ ‘ది జెంటిల్ మెన్’. ఆ రెండు చిత్రాలు కూడా రికార్డ్లు తిరగరాసిన చిత్రాలే. ఆయన నటవిశ్వరూపంతో ఒక్క సారిగా బాలివుడ్లోని ఉద్దండ నటులని కూడా ఉలిక్కిపడేలా చేసారు. దక్షిణాది కథకుల సత్తాను ఆయన బాలివుడ్ కి తెలిసేలా చేసారు. ఆ తర్వాత ఎన్నో తెలుగు చిత్రాలు బాలివుడ్ లో రీమేక్ అయ్యాయి. ఇక ఆయన బాలివుడ్ ని ఏలడం ఖాయమని అందరూ అనుకున్నా తెలుగు చిత్రాల్లో బిజీ అవ్వడం వల్ల అది సాధ్యపడలేదు.

ఆయన వివాహ జీవితానికి వెళితే మన వూరి పాండవులు సినిమా చేసే సమయంలో అల్లు రామ లింగయ్య గారితో పరిచయం ఏర్పడడం, తరువాత కొంత కాలానికి చిరంజీవి గారిని సురేఖ గారికిచ్చి, 1980 ఫిబ్రవరి 20వ తేదీన వివాహం చేయడం  జరిగిపోయింది. వీరికి కుమారుడు రామ్ చరణ్, కుమార్తెలు శ్రీజ, సుష్మితలు సంతానం. వీరి కుమారుడు రామ్ చరణ్ తెలుగు చిత్రసీమలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్నారు. చిరంజీవి గారితో పని చేసేవాళ్ళలో ప్రతిభ కనపడి ప్రత్యేకంగా ఉంటే వారిని ప్రోత్సహించి మరిన్ని అవకాశాలు ఇప్పించిన వ్యక్తులు చాలా మంది ఉన్నారు. యండమూరి వీరేంద్రనాథ్ గారు, బ్రహ్మానందంగారు, లారెన్స్ గారి లాంటి వ్యక్తులకు కూడా వెన్ను తట్టారనే చెప్పాలి. ప్రస్తుతం హాస్య నటుడిగా బ్రహ్మానందం, కొరియోగ్రాఫర్, డైరెక్టర్ గా రాఘవ లారెన్స్   ఎంత మంచి స్థాయిలో ఉన్నారో మనందరికీ తెలిసిందే. కేవలం ఒక వ్యక్తిగా వచ్చి కళారంగంలో ఒక శక్తి గా ఎదిగారు మన మెగాస్టార్ చిరంజీవి.

అవార్డ్స్

ఈయన కృషికి భారత ప్రభుత్వం 2006వ సంవత్సరంలో ప్రెసిడెంట్ ఏ.పి.జే అబ్దుల్ కలాం గారి చేతుల మీదుగా పద్మభూషణ్ అవార్డుతో సన్మానించి సత్కరించింది. రుద్రవీణ సినిమాకు అయితే జాతీయ సమగ్రతా అవార్డు కూడా అందుకున్నారు. మన రాష్ట్ర ప్రభుత్వం మూడు నంది అవార్డులను కూడా ఇచ్చింది. ఫిల్మ్ ఫేర్ అవార్డుల గురించైతే పదికి పైగానే ఉన్నాయి. ముఖ్యమైనది లైఫ్ టైం ఆచీవ్మెంట్ అవార్డు. ఇది 2007 సం..లో ఇచ్చి భారి ఎత్తున కార్యక్రమం కూడా నిర్వర్తించారు. మరిన్ని సినిమా అవార్డ్స్ కూడా ఇచ్చారు. సైమా వాళ్ళైతే 2014వ సంవత్సరంలో అంబాసిడర్ ఆఫ్ ఇండియన్ సినిమా అని చెప్పి, హానరరి అవార్డు కూడా ఇచ్చారు. అవార్డులు మరియు రివార్డులు, ముఖ్యంగా పారితోషకం విషయంలో  అంచెలంచలుగా ఎదిగిన సినీ మహారాజు మన మెగాస్టార్. ఒకానొక సమయంలో దేశంలోనే ఎక్కువ పారితోషికం తీసుకునే అమితాబ్ గారి కంటే ఎక్కువ పారితోషికం తీసుకున్నారు చిరంజీవి గారు. ప్రఖ్యాత టైమ్స్ పత్రిక ‘బిగ్గర్ దెన్ బచ్చన్’ అని సంభోదిస్తూ ఆయన గురించి రాయడం విశేషం.

చిరంజీవి గారు ఒక రోజు పేపర్లో ఆర్టికల్ చదివి రక్తం కొరతను గమనించి 1998లో బ్లడ్ బ్యాంకు ను స్థాపించి, అభిమానులకు పిలుపునిచ్చి రక్తదానం చేయండని, సామజిక కార్యక్రమానికి శ్రీకారం చుట్టండి అని చెప్పిన మొట్ట మొదటి హీరో కూడా ఆయనే అనడంలో అతిశయోక్తి లేదనే చెప్పాలి. తరువాత రాజకీయ ఆరంగేట్రం గురించి చెప్పాలంటే 2008లో తిరుపతిలో భారి బహిరంగ సభ పెట్టి మరీ ప్రజారాజ్యం అనే రాజకీయ పార్టిని స్థాపించి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మేలు చేకుర్చాలనే ఉద్దేశంతో 2009 అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేసారు. 18 సీట్లు మాత్రమే సంపాదించినా, ఆత్మ విశ్వాసం చెక్కుచెదరకుండా మూడు సంవత్సరాలపాటు ప్రజారాజ్యం నడిపి తరువాత జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ లో కలిపేసిన సంగతి మనందరికీ తెలిసిందే. 2012 సంవత్సరం  అక్టోబర్ 27 నుండి మే 15 2014 సంవత్సరం వరకు పర్యాటక శాఖా మంత్రిగా భాద్యతలు కూడా నిర్వహించారు. ఇలా చిరంజీవి గారు తన చెరిష్మాతో రాజకీయాల్లో కూడా ఒక ఊపు ఊపారు. కొన్ని యాడ్ల ద్వారా ఆయా వ్యాపారాల్ని మరింత బలోపేతం చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అభిమానులు తన సినిమాలు మిస్ అవుతున్నారని అభిమానుల ఉద్దేశం తెలుసుకుని తిరిగి సినిమాల్లోకి వచ్చి చిరంజీవి గారు 2017 సంవత్సరంలో ఖైదీ నెంబర్ 150 సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి వసూళ్ళ పరంగా, నటనా, డాన్సుల పరంగా ఆయన ఎక్కడా తగ్గలేదని నిరూపించారు కూడా. తరువాత ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితాన్ని ఆధారంగా తీసుకుని, సైరా నరసింహారెడ్డి సినిమా తీసి చారిత్రాత్మక పాత్రల్లో కూడా ఆయన మనల్ని మెప్పించారంటే మామూలు విషయం కాదు. ప్రస్తుతం కొరటాల శివ గారి దర్శకత్వంలో నటిస్తున్న సినిమా ‘ఆచార్య’ కూడా ఫస్ట్ లుక్ రిలీజ్ చేసి అభిమానులను ఎంత గానో అలరించి, ఆసక్తిగా ఎదురు చూసేలా చేసింది. అభిమానులు టీజర్ మరియు ట్రైలర్ కోసం ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా సూపర్ హిట్ అయ్యి, మెగా స్టార్ చిరంజీవి గారు అనుకున్న సినిమాల ద్వారా మనల్ని అలరించాలని ఆకాంక్షిద్దాం.
- Advertisement -

You've successfully subscribed to Tollywood Latest News | Celebrities Profiles | Media9 Tollywood
Great! Next, complete checkout to get full access to all premium content.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.