
అక్షరాలతో సహవాసం చేస్తూ, పదాలతో పొదరిళ్ళు నిర్మించే మాటల కూర్పరి ‘సిరివెన్నెల సీతరామశాస్త్రి’. యావత్ తెలుగు వారందరికీ సుపరిచితుడు. ప్రతీ తెలుగు వాడి గుండెలో చెరగని ముద్ర వేశారు. ఆయన భావాలు మాటలకు అందనివైతే, ఆయన మాటలు తూటాలు. ఆయన కలం నుంచి జారే అక్షరాలు జాడ్యాన్ని కడిగేసే నిప్పుకణాలు. తెలుగు సాహిత్య స్థాయి పెరగడంలో ఆయన పాత్ర కీలకం. 3వేల పై చిలుకు పాటలను రచించారు. రచించారు అనే కంటే రచయితల ఆలోచనలకు తన భావాలతో ప్రాణం పోశారు.

జనని జన్మభూమి చిత్రంతో పాటల రచయితగా తన ప్రస్థానాన్ని మొదలు పెట్టారు. ఆ తర్వాత సిరివెన్నెల చిత్రానికి పాటలు రాసి ఆ చిత్రంతో మంచి పేరుని సంపాదించుకున్నారు. సిరివెన్నెల మొదలుకుని కొన్ని వందల చిత్రాల్లో వేల పాటలు రాసారు. గాయం సినిమాలో “నిగ్గదీసి అడుగు ఈ సిగ్గు లేని జనాన్ని” అంటూ ప్రతీ పౌరుడ్ని ప్రశ్నించారు. సందర్భం ఎలాంటిది అయినా అవలీలగా పాట రాయగల ఉద్దండులు.

న్యుమోనియా కారణంగా అస్వస్థతకు గురైన ఆయన ఈ నెల 24న కిమ్స్ ఆస్పత్రిలో చేరారు. పరిస్థితి విషమించడంతో సాయంత్రం తుది శ్వాస విడిచారు. కాగా లంగ్ క్యాన్సర్ సంబంధిత కారణాల వల్ల ఆయన మరణించినట్లు డాక్టర్లు ప్రకటించారు. అంతటి మహనీయుడు మనల్ని వదిలి వెళ్ళిపోవటం నిజంగా మన దురదృష్టం. ఆయన మృతి పట్ల పలువురు తమ సంతాపం తెలియచేసారు. కళా రంగంలో ఆయన సేవకు గాను కేంద్ర ప్రభుత్వం ఆయన్ను పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది.