'విశ్వనట చక్రవర్తి' ఎస్.వి.ఆర్

“సాహసం సేయరా ఢింభక” అని ఒక విధమైన రిథమ్ లో వినబడే ఈ డైలాగ్ దశాబ్ధాల తరబడి మన తెలుగు నోళ్ళలో నానుతూ ఉంది.  కాలాలు మారినా, తరాలు మారినా ఇప్పటికీ ఈ డైలాగ్  కు ఉన్న క్రేజ్ ఏ మాత్రం  తగ్గలేదు. ఇంత ప్రజాదారణ పొందిన ఈ  డైలాగ్ ఏ సినిమాలోనిదో తెలుసా? ఈ డైలాగ్ చెప్పిన నటుడు ఎవరో తెలుసా?  1951 లో వచ్చిన పాతాళ భైరవి సినిమాలోనిది. ఈ డైలాగ్ పలికింది మహానటుడు, ‘విశ్వ నట చక్రవర్తి’  ‘ఎస్.వి.ఆర్’. అంటే ఎస్.వి.రంగారావు. పూర్తి పేరు “సామర్ల వెంకట రంగారావు”.

ఇలా ఒక్క డైలాగ్ ఏమిటి! ఆయన నోటి వెంట వచ్చిన ఎన్నో అధ్భుతమైన డైలాగులు తెలుగు ప్రేక్షకులను సమ్మోహన పరిచాయి. ఎంతో కష్టతరమైన, నోరు కూడా సరిగా తిరగని ఎన్నో సంస్కృత సమాసాలు, తెలుగు పద్యాలు ఆయన అలవోకగా పలికేవారు. ఆయన నటన ఒక విద్యుత్ ప్రవాహంలా ఉంటుంది. ఏ క్యారెక్టర్లో అయినా అట్టే ఒదిగిపోయేవారు. అది పౌరాణికమైనా, సాంఘీకమైనా, యాక్షన్ సినిమా అయినా. క్యారెక్టర్ కు తగ్గట్టుగా ఆయిన బాడీ లాంగ్వేజ్, సంభాషణల ఉఛ్ఛారణ ఉండేది. ఉదాహరణకు, పాతాళ భైరవి లోని “నేపాల మాంత్రికుడు” క్యారెక్టర్ ని తీసుకుంటే అందులో ఆయిన పోషించిన ఆ పాత్ర వేరే ఏ మహా నటుడు పోషించినా ఆ స్థాయికి తీసుకెళ్ళేవారు కాదేమో. మాంత్రికుడు అంటే ఇతనే, ఇలానే ఉంటాడు. ఇలానే హావా భావాలు పలికిస్తాడు అని ప్రేక్షకుల మనో ఫలకంలో బలమైన ముద్ర వేశారు. డైలాగ్ ని ఎక్కడ ఒత్తాలో, ఎక్కడ తుంచాలో ఆయనకు తెలిసినంతగా వేరే ఎవ్వరికి తెలియక పోవచ్చు. తెలుగు జాతి గర్వించదగ్గ సినిమా మాయా బజార్ లో ఆయిన పోషించిన ‘ఘటోత్కచుడు’ పాత్రను ఏ తెలుగు వాడు మర్చిపోగలడు?. ఇలాంటి ఉదాహరణలు ఆయిన సినిమా జీవితంలో కోకొల్లలు.

పుట్టుక – బాల్యం

ఎస్.వి. రంగారావు గారు 3 జూలై 1918న క్రిష్ణా జిల్లాలోని నూజివీడు టౌన్ లో జన్మించారు. వారి నాన్న సామర్ల కోటేశ్వర రావు గారు నూజివీడులో ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ గా పని చేసేవారు. అమ్మ గారి పేరు లక్ష్మి నరసాయమ్మ. వారి తాతా గారి పేరు రంగారావు. ఎస్.వి.ఆర్ గారి అమ్మగారు వెంకటేశ్వర స్వామికి గొప్ప భక్తురాలు. అందుకుని వారి తాత గారి పేరు, వెంకటేశ్వర స్వామి గారి పేరు కలసి వచ్చేలా వెంకట రంగారావు అని పేరు పెట్టారు. ఎస్.వి.ఆర్ గారి బాల్యం అంతా నూజివీడులోనే గడిచింది. వారి తాతగారు చనిపోయిన తర్వాత వారి నాన్న గారి ఉద్యోగ రీత్యా వారి కుటుంబం మద్రాసుకి తరలి వెళ్ళింది. ఎస్.వి.ఆర్ గారి ప్రాథమిక విద్య మొత్తం మద్రాసులోనే జరిగింది. అక్కడ హిందు కాలేజ్ నుండి ఎస్.ఎస్.ఎల్.సి లో ఉత్తీర్ణుడుయ్యారు. చిన్నప్పుడు నుండే ఎస్.వి.ఆర్ గారు చాలా యాక్టివ్ గా ఉండేవారు. స్కూల్ లో జరిగే ప్రతీ పోటీల్లోనూ ఉత్సాహంగా పాల్గొనేవారు. సాంస్కృతిక, వక్తృత్వ పోటీల్లో అందిరికన్నా ముందు ఉండేవారు. లలిత కళల్లోనూ అందులోనూ నటనా సంబంధిత కార్యక్రమాలలో ఎక్కువ ఆసక్తి కనబరిచేవారు. మొట్టమొదటి సారిగా హిందు కాలేజీలో ఒక నాటకంలో ఒక పాత్ర వేశారు. అది మాంత్రికుడి అసిస్టెంట్ వేషం. నాటకం అయిపోయాక హెడ్ మాస్టర్ తో పాటు మిగిలిన టీచర్లు అతని స్నేహితులు ఆనందంతో షాక్ అయ్యారు. చాలా అధ్బుతంగా చేశావని మెచ్చుకున్నారు. అప్పుడప్పుడే ఎదుగుతున్న ఎస్వీఆర్ కి ఈ అభినందనలు, మెచ్చుకోలు చాలా వింతగా అనిపించాయి. అరె వీళ్ళు నన్ను ఎందుకు ఇంతగా పొగుడుతున్నారు. నేను వేసింది చాలా చిన్న వేషం. అది కూడా మామూలుగా నటించాను అని అనుకున్నారు. కానీ ఎస్వీఆర్ కి అప్పుడు తెలీదు తను తనకు తెలియకుండానే ఆ పాత్రలో లీనమైపోయి నటించానని. దాని తర్వాత స్కూల్లో వేసే ప్రతి నాటకంలోనూ ఎస్వీఆర్ నటించేవారు. ప్రతి నాటకానికి ప్రేక్షకుల స్పందన విపరీతంగా పెరిగిపోయేది. బహుశా వారికి అప్ప్పుడే అర్థమయ్యి ఉండచ్చు తన భవిష్యత్తు కార్యాచరణ ఏంటి అని…

ఇంటర్మీడియట్

ఎస్.వి.ఆర్ గారు మద్రాసులో ఎస్.ఎస్.ఎల్.సి కంప్లీట్ చేసిన తర్వాత వారి కుటుంబం విశాఖ పట్టణం కి వచ్చింది. ఆక్కడ ఏ.వి.ఎన్ కాలేజ్ లో ఇంటర్మీడియేట్ జాయిన్ అయ్యారు. ఈ దశలోనే ఎస్.వి.ఆర్ గారికి నాటకాల మీద, నటన మీద విపరీతమైన ఆసక్తి పెరిగిపోయింది. బహుశా ఆకాలంలో విశాఖ పట్టణంలో ఉన్న నాటక పరిషత్తులు కానీ, నాటాక మండళ్ళు కానీ దీనికి కారణం కావచ్చు. రోజూ వివిధ నాటకాల్లో నటించడం, కొత్త కొత్త పాత్రలను పోషించడం వారి అలవాటుగా మారి పోయింది. నాటకాల మీద ఆసక్తితో చదువును ఏనాడు నిర్లక్ష్యం చేసేవారు కాదు. చదువు చదువే నాటాకాలు నాటకాలే అన్నట్టు ఉండేవారు. ఏ.వి.ఎన్ కాలేజీలో మొత్తం నలభై ఐదుమంది పరీక్ష రాస్తే పాసైంది ఒకే ఒక్కరు ఆ ఒక్కరు ఎస్వీఆరే…

బ్యాచిలర్ డిగ్రీ – నాటక రంగం

విశాఖ పట్టణంలోని ఏ.వి.ఎన్ కాలేజ్ నుండి ఇంటర్మీడియేట్ పాసైన తర్వాత, వారి నాన్న గారి ట్రాన్స్ఫర్ రీత్యా వారి కుటుంబం కాకినాడికి వచ్చింది. అక్కడ పి.ఆర్ గవర్నమెంట్ కాలేజీలో బి.ఎస్.సి లో జాయిన్ అయ్యారు.  విశాఖ పట్టణంలో మాదిరి కాకినాడలో కూడా నాటకాల్లో నటించడం మొదలు పెట్టారు. ఇక్కడ నటనలో మరింత రాటుదేలారు. మిగిలిన తోటి విద్యార్థుల కన్నా ఎస్.వి.ఆర్ గారికి ఇంగ్లీష్ లో ఎక్కువ ప్రావీణ్యం ఉండేది. అందువలన ఎక్కువగా షేక్స్పియర్ నాటకాల్లో నటించడానికి ఆసక్తి చూపించేవారు. అటు తెలుగు పద్యాలు, ఇటు ఇంగ్లీషు డైలాగులు అలవోకగా పలికేవారు. అందువల్ల అటు ఇంగ్లీష్ నాటకాల్లో, ఇటు తెలుగు నాటకాల్లోనూ విరివిగా నటించేవారు. ఈ సమయంలోనే తెలుగు నాటక రంగంలో ఉధ్ధండులు, ‘బళ్ళారి రాఘవ’, ‘గోవిందరాజు సుబ్బారావు’ వంటి ప్రముఖులతో పరిచయం ఏర్పడింది. వారిని గీటు రాయిగా తీసుకుని నటనలోనూ, డైలాగ్ డిక్షన్ లోనూ ఎస్.వి.ఆర్ గారు రాటుదేలారు. కాకినాడలో ‘యంగ్ మెన్స్ హ్యాపీ క్లబ్’ అనే ఒక నాటకాల క్లబ్ లో మెంబర్ షిప్ తీసుకున్నారు. అందులోనే వారికి రేలంగి, అంజలీ దేవి, బి.ఎ. సుబ్బారావు, ఆదినారాయణరావు వంటి వారు పరిచయమయ్యారు. వారందరితో కలసి ఊర్లు తిరుగుతూ నాటకాలు వేసేవారు. ఒకే రకమైన పాత్రలను పోషించడం కన్నా వైవిద్యమైన పాత్రలను పోషించడానికి ఎక్కువ ఆసక్తి చూపించేవారు. ‘పీష్వా నారాయణరావు వధ’ అనే నాటకంలో అరవై ఏళ్ళ వృద్ధుని పాత్ర ధరించి అందరిని అబ్బురపరిచారు. అప్పటికి ఎస్వీఆర్ వయసు కేవలం ఇరవై రెండేళ్ళు మాత్రమే.

మొదటి ఉద్యోగం

నాటకాల్లో నటిస్తూ అప్పుడప్పుడే నాటకరంగంలో పేరు తెచ్చుకుంటున్న సమయంలో పి.ఆర్ కాలేజ్ నుండి బి.ఎస్. సి కంప్లీట్ అయ్యింది. ఇప్పుడు ఎస్వీఆర్ ముందర రెండు దార్లు ఒకటి నాటక రంగం, ఇంకొకటి ఉద్యోగం. తనకి ఎంతో ఇష్టమైన నాటక రంగం వైపే మనసు వెళ్ళమంది. అలాగే చేశారు కూడా. కానీ ఇది ఇంట్లో వాళ్ళకు నచ్చేది కాదు. వారి కుటుంబ సభ్యులందరూ మంచి స్థితిలో ఉన్నవాళ్ళే. వారి నాన్న కోటేశ్వర రావు గారు ఎక్సైజ్ ఆఫీసర్ గా చేశారు. తాత కోటయ్య నాయుడు నూజివీడు ఆసుపత్రిలో పేరున్న డాక్టర్. మేన మామ బడేటి వెంకట రామయ్య పొలిటికల్ లీడర్ మరియు లాయర్. ఇలాంటి కుటుంబం నుండి ఒకరు నాటకరంగంకి వెళ్ళడం వారికి ఏ మాత్రం ఇష్టం ఉండేది కాదు. కానీ ఎస్వీఆర్ ఇవేవి పట్టించుకోకుండా నాటాకాల్లో నటించేవారు.

అన్ని రోజులు ఒకేలా ఉండవు కదా ఇంటిలో పోరు ఎక్కువైపోయింది. నాటక రంగం వద్దని, ఏదన్నా ఉద్యోగం చేయమని, ఒకవేళ ఉద్యోగం ఇష్టం లేకపోతే ఎమ్మెస్సీ చేయమని బలవంతపెట్టసాగారు. ఆ సమయంలో ఎస్వీఆర్ నటనకు అభిమాని అయిన చొలెనర్ అనే ఫైర్ ఆఫీసర్ ఫైర్ డిపార్మెంట్ లో చేరండి అని సలహా ఇచ్చారు. ఎమ్మెస్సీ చదవడం కన్నా ఫైర్ డిపార్ట్మెంట్ లో పనిచేయడం ఉత్తమమని, జీతానికి జీతం వస్తుంది. ఖాలీ సమయాల్లో తనకు ఇష్టమైన నాటకాలు కూడా వేసుకోవచ్చని భావించి ఫైర్ డిపార్ట్మెంట్ లో జాయిన్ అయ్యారు. మొదట బందురులో పనిచేశారు. ఆ తర్వాత విజయనగరానికి ట్రాన్స్ఫర్ అయింది. అంతా బాగానే ఉంది. ఉద్యోగం ఉంది. నెల నెలా జీతం వస్తూ ఉంది. కానీ ఆయన అనుకున్నట్టు ఖాళీ సమయాల్లో నాటకాలు వేయడం మాత్రం కుదరలేదు. ఫైర్ ఆఫీసర్ గా రోజూ ఖాళీ సమయం ఎక్కువగానే ఉంటుంది. కానీ నాటకాలు వేయడానికి అనుమతి లేదు. చాలా రోజుల అంతర్మథనం తర్వాత ఫైర్ ఆఫీసర్ ఉద్యోగానికి రాజీనామా చేశారు.

మొదటి సినిమా

ఎస్వీఆర్ కి నటన అన్నా నాటకాలన్నా మక్కువ ఎక్కువ అని తన బంధువర్గంలో వాళ్ళకు కూడా తెలుసు. బి.వి.రామానందం అనే ఫిల్మ్ ప్రొడ్యూసర్, డైరెక్టర్ ఎస్వీఆర్ కి దూరపు బంధువు. ఆయిన తీయబోయే “వరూధిని” అనే సినిమాలో కథానాయకుడిగా నటిస్తావా అని ఎస్వీఆర్ ని అడిగారు. సినిమా వేరు, నాటక రంగం వేరు అయినా నటనకు దూరమవుతున్నాను అని ఆయన బాధపడుతున్న సమయంలో ఈ అవకాశం రాగానే వెంటనే ఒప్పుకున్నారు.

తొంభై రోజులకు గానూ ఏడు వందల యాభై రూపాయాల పారితోషకానికి షూటింగ్ తమిళనాడులోని సేలంలో మొదలైంది. అసలు కథ ఇక్కడే మొదలైంది. ఇన్నీ రోజులు స్టేజ్ మీద నటించే ఎస్వీఆర్ కి సినిమా షూటింగ్ కొత్తగా అనిపించింది. అందులోనూ ఈ సినిమాలో ఎస్వీఆర్ ది ప్రవరాఖ్యుడి పాత్ర. కథ ప్రకారం వరూధిని తనను ప్రేమించమని మీద మీద పడుతుంది. పాత్రల మధ్య రొమాన్స్ ఎక్కువగా ఉంటుంది. అలా నటించడానికి ఎస్వీఆర్ బాగా ఇబ్బంది పడిపోయారు. ఇంతవరకూ ఎస్వీఆర్ ఆడవారితో నటించింది లేదు. నాటక రంగంలో ఆ కాలంలో ఆడవారి పాత్రలు మగవారే వేసేవారు. కానీ ఇక్కడికి వచ్చేసరికి నిజంగా ఆడవారే ఉండడం అందులోనూ రొమాన్స్ సీన్స్ ఉండడంతో ఎస్వీఆర్ గారు తన నటన మీద పూర్తిగా ఏకాగ్రత చూపించలేకపోయారు. దర్శకుడి బి.వి.రామానందం ప్రోత్సాహంతో ఎలగొలోగా షూటింగ్ కంప్లీట్ చేశారు.

మొత్తానికి సినిమా రిలీజ్ అయింది. భయపడ్డట్టే సినిమా అంతగా ఆడలేదు. అటు సక్సెస్ మీద నడిచే సినిమా పరిశ్రమ కూడ ఎస్వీఆర్ ని గుర్తించలేదు. దానితో ఆయనకు మళ్ళీ అవకాశాలు రాలేదు. చాల నిరుత్సాహపడి ఇక ఇక్కడే ఉంటే తిండికి, గుడ్డకి కష్టం అవుతుంది అని మళ్ళీ ఉద్యోగం కోసం వెతుక్కుంటూ జంషెడ్ పూర్ వెళ్ళి అక్కడ టాటా కంపెనీలో బడ్జెట్ అసిస్టెంట్ గా ఉద్యోగంలో చేరారు. అలా అని ఆయన పూర్తిగా నటనకు దూరం కాలేదు. జంషెడ్ పూర్ లో ఉండే ఆంధ్రులంతా కలసి స్థాపించిన ఆంధ్రా అసోసియేషన్ అనే నాటక కళా మండలిలో నాటకాలు వేయడం మొదలు పెట్టారు. కర్ణుడు, దుర్వాసునుడుగా వేషాలు వేస్తూ అక్కడి ప్రేక్షకులను కూడా తన నటనతో అలరించేవారు.

వివాహం

టాటాలో ఉద్యోగం రాగానే తన మేనమామ బడేటి వెంకట రామయ్య కూతురు లీలావతితో  27- 12- 1947 వివాహం జరిగింది. జంషెడ్ పూర్ లో ఉద్యోగం చేస్తున్నారు. ఇష్టమైన నాటకలలోను నటిస్తున్నారు. జీవితంలో ముఖ్య ఘట్టం అయినా వివిహాం చేసుకున్నారు. ఇలా జీవితం సాఫీగా సాగిపోతూ ఉంది. కానీ లోపల ఒక బాధ, సినిమా రంగం నుండి అర్దాంతరంగా బయటికి వచ్చేశామే అని. ఒక రంగంలో అడుగుపెట్టినప్పుడు దాని తాడో పేడో తేల్చుకోకముందే బయటకు రాకూడదనేది ఎస్వీఆర్ ఫిలాసఫి. ఏదైనా మళ్ళీ సినిమా అవకాశం వస్తే ఈ సారి తప్పకుండా తనేంటో నిరూపించుకోవాలి అని అనుకుంటూ ఉండేవారు. అక్కడ మద్రాసులోని సినిమా ఇండస్ట్రీలోని తనకు తెలిసిన వ్యక్తులతో తరుచూ మాట్లాడుతూ ఉండేవారు.

మరో సినిమా – మరో అడ్డంకి

ఇలా రోజులు సాదా సీదాగా గడుస్తున్న సమయంలో  బి.ఎ. సుబ్బారావు దర్శకత్వం వహిస్తున్న ‘పల్లెటూరి పిల్ల’ అనే సినిమాలో విలన్ వేషం వెయ్యడానికి కబురు వచ్చింది. ఎస్వీఆర్ ఆనందానికి అంతులేదు. ఈ అవకాశం అయినా తనని ఇండస్ట్రీలో నిలబెడుతుందని ఆశించారు. అన్నీ రెడీ చేసుకుని మద్రాసు బయలుదేరుతున్న టైంకి ధవళేశ్వరంలో వాళ్ళ నాన్న కోటేశ్వర రావు మరణించారు అని వార్త వచ్చింది. అది వినగానే ఎస్వీఆర్ హతాశుడయ్యారు. ఉద్యోగానికి రిజైన్ చేసి వెంటనే ఊరికి వెళ్ళి అక్కడ కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకుని మద్రాసు వెళ్ళేటప్పటికి తను పోషించవలసిన విలన్ పాత్ర ఎ.వి.సుబ్బారావు అనే నటుడికి ఇచ్చేశారు. మళ్ళీ నిరాశ కానీ దర్శకుడు బి.ఎ.సుబ్బారావు ఎస్వీఆర్ పరిస్థితి గమనించి అదే సినిమాలో మరో చిన్న వేషం ఇచ్చారు. ఇక తన భవిష్యత్తు ఇక్కడే వెతుక్కోవాలని గట్టిగా నిర్ణయించుకుని అవకాశాల కోసం ముమ్మరంగా ప్రయత్నించసాగారు.

తనకు తెలిసిన ఎల్.వి.ప్రసాద్ అప్పుడు ‘ద్రోహి’ అనే సినిమా తీస్తున్నారు. ఆయన దగ్గరికి వెళ్ళి అడిగారు వేషం గురించి. మళ్ళీ నిరాశ అంతుకుముందు రోజే మిగిలిన ఒక క్యారెక్టర్ కి రాళ్ళబండి కుటుంబ రావుకు వేషం ఫిక్స్ అయింది అని చెప్పారు. తర్వాత నటి కృష్ణవేణి నిర్మిస్తున్న “మన దేశం” అనే సినిమాలో వేషం కోసం వెళ్లారు. కానీ మళ్ళీ అదే పరిస్థితి. అప్పటికే అన్ని ప్రధాన క్యారెక్టర్లకి యాక్టర్స్ ఓకే అయిపోయారు. ఈ సినిమాకు కూడా ఎల్.వి.ప్రసాద్ డైరెక్టర్. ఆయిన ఎస్వీఆర్ ని చూసి ఆ సినిమాలో ఒక చిన్న పాత్ర ఇచ్చారు. తరువాత పి.పుల్లయ్య దర్శకత్వంలో తీస్తున్న ‘తిరుగుబాటు’ సినిమాలో ఒక చిన్న వేషం దొరికింది.

మలుపుకి జీజం

1950లో నాగిరెడ్డి, చక్రపాణీ కలసి విజయా ప్రొడక్షన్స్ అనే సినీ నిర్మాణ సంస్థను స్థాపించారు. ఆ సంస్థ మీద తీస్తున్న మొదటి సినిమా “షావుకారు”  ఇందులో మహా మహా నటులు నటిస్తున్నారు. కథానాయికగా షావుకారు జానకి, ఈ సినిమాతోనే ఆమెకి ఈ పేరు వచ్చింది. కాథానాయకుడుగా ఎన్.టి.రామారావు ఇంకా గోవిందరాజుల సుబ్బారావు, పద్మనాభం వంటి వారు నటిస్తున్నారు. ఇందులో ఎస్వీఆర్ కి ఒక వేషం దక్కింది. ఆ పాత్ర పేరు “సున్నం రంగడు”. ఒక రౌడీ పాత్ర, చెంగయ్య అనే వడ్డీ వ్యాపారి దగ్గర పనిచేస్తూ వడ్డీ సరిగా కట్టని వారి దగ్గరికి వెళ్ళి బలవంతంగా వడ్డీలు వసూలు చేసే పాత్ర. ఈ పాత్ర దక్కడానికి కారణం ఈ సినిమా డైరెక్టర్ ఎల్.వి.ప్రసాద్. ఎస్వీఆర్ వేషాల కోసం పడుతున్న కష్టం చూసి నాగిరెడ్డి, చక్రపాణీలకు రిఫెర్ చేశారు. అలా ఆ సినిమాలో ఆ పాత్ర దక్కింది. అది చిన్న పాత్రే కానీ అదే ఎస్వీఆర్ సినిమా కెరీర్ ను మలుపు తిప్పడానికి కారణం అయింది.

మలుపు

తర్వాత  ఆకాశరాజు అనే సినిమాలో చిన్న పాత్రలో నటించారు. విజయా ప్రొడక్షన్స్ తమ రెండో సినిమాగా “పాతాళ భైరవి” నిర్మించడానికి తలపెట్టించి. అందులో ఒక మాంత్రికుడి పాత్ర చాలా ముఖ్యమైనది. ఈ సినిమాకు దర్శకుడు కె.వి.రెడ్డి. ఇందులో కథానాయకుడిగా మొదట అక్కినేని నాగేశ్వరరావును అనుకున్నారు. కానీ ఒక టెన్నిస్ మ్యాచ్ లో ఎన్టీఆర్ ని చూసిన కె.వి.రెడ్డి తన సినిమాలో జానపద కథానాయకుడిగా నాగేశ్వారరావు కన్నా ఎన్టీఆర్ బాగుంటారని అనుకుని ఆయననే కథానాయకుడిగా ఓకే చేశారు. నాగేశ్వరరావు కథానాయకుడిగా ఉన్నప్పుడు మాంత్రికుడి క్యారెక్టర్ మహా నటుడు ముక్కామలను తీసుకుందామని అనుకున్నారు. కానీ ఆ సమయానికి ఎన్టీఆర్ అప్పుడప్పుడే ఇండస్ట్రీలో స్థిరపడుతున్నారు. అంతగ పేరు రాలేదు కాబట్టి మాంత్రికుడిగా కూడా కొత్త వారిని తీసుకోవలని కె.వి.రెడ్డి గారు అనుకున్నారు. ఇదే విషయం నాగిరెడ్డి, చక్రపాణి గార్లకు తెలియజేశారు. వాళ్ళకి అంతకు ముందు వాళ్ల మొదటి సినిమా షావుకారు లో సున్నం రంగడు క్యారెక్టర్ చేసిన ఎస్వీఆర్ గుర్తుకు వచ్చి అతన్ని ఆ క్యారెక్టర్ కి ఓకే చేశారు. చాలా మంది దీనికి అభ్యంతరం చెప్పారు. చాలా ముఖ్యమైన పాత్రకు కొత్తవారిని తీసుకోవడం కరెక్ట్ కాదని. కానీ నాగిరెడ్డి, చక్రపాణిలకు వాళ్ళ నిర్ణయం మీద ప్రగాఢ విశ్వాసంతో ఉన్నారు.

షూటింగ్ పూర్తైంది. 15 మార్చి 1951 లో సినిమా రిలీజ్ అయింది. అంతే తెలుగు ప్రజలు విరగబడి సినిమా చూశారు. సినిమా పెద్ద హిట్. ఈ సినిమాతో ఇద్దరు గొప్పనటులు తెలుగు ప్రజలకు చేరువయ్యారు. ఒకరు ఎన్టీఆర్ అయితే మరో నటుడు ఎస్వీఆర్. ఎస్వీఆర్ నటన, డైలాగులు జనాలను ఉర్రూతలు ఊగించాయి. “సాహసము సేయరా డింభకా”, “మాంత్రికుని ప్రాణం పిట్టలో ఉన్నదిరా ఢింభకా”, “జై పాతాళ భైరవి”, “సాష్టాంగా నమస్కారం సేయరా”  అనే డైలాగులు చాలా మంది నోళ్ళల్లో నానాయి. అలా ఒక విలన్ క్యారెక్టర్ ని ప్రేక్షకులు అంతగా అభిమానించడం బహుశా తెలుగు సినిమా చరిత్రలో అదే మొదటిసారి కావచ్చు. పాతాళభైరవి హిట్ అవ్వడం అనేది ఎస్వీఆర్ సినీ ప్రస్థానంలో ఒక పెద్ద మలుపు. ఆ సినిమా ద్వారా ఎస్వీఆర్ ని ప్రేక్షకులు, తెలుగు ఇండస్ట్రీ ఒక గొప్ప నటుడుగా గుర్తించారు.

సినిమాలు – సినిమాలు – సినిమాలు

సినిమా అవకాశాలకోసం ప్రయత్నించి భంగపడి, నిరాశచెంది అలుపెరగక, మళ్ళీ నిలదొక్కుగొని మళ్ళీ ప్రయత్నించి ఆఖరికి పాతాళభైరవి తో సక్సెస్ కొట్టిన ఎస్వీఆర్ ఆ తర్వాత వెను తిరిగి చూసోకోవాలసిన అవసరం రాలేదు. వరుసబెట్టి అవకాశాలు రావడం మొదలయ్యాయి. పాతాళభైరవి సినిమాను తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి తీశారు విజయా ప్రొడక్షన్స్ వారు. తమిళంలో కూడా రిలీజ్ అయ్యి అక్కడ కూడా ప్రజాదారణ పొందింది. ఆ విధంగా ఎస్వీఆర్ తమిళ సినిమాల్లోకి ఘన విజయంతో అడుగుపెట్టారు. అదే విధంగా ఈ సినిమాను జెమినీ అధినేత వాసన్ హిందీలో రీమేక్ చేశారు. అందులోనూ ఎస్వీఆర్ నేపాళీ మాంత్రికుడి వేషం వేశారు. హిందీ భాషలో తనకు ఉన్న ప్రావిణ్యంతో ఆ పాత్రకు తనే హిందీలో డబ్బింగ్ చెప్పారు. తర్వాత కాలంలో సంవత్సరానికి యావరేజ్ గా ఐదు సినిమాలకు తగ్గకుండా చేసేవారు. 1952 లో విజాయావారు నిర్మించిన పెళ్ళిచేసి చూడు, పల్లెటూరు వంటి సినిమాల్లో నటించారు. పెళ్ళిచేసి చూడు సినిమా తమిళంలో కళ్యాణం పణ్ణిపార్ అనే పేరుతో రీమేక్ చేశారు. అందులోను తెలుగులో చేసిన పాత్రలో ఎస్వీఆరే నటించారు. ఆ సినిమా కూడా అక్కడా పెద్ద హిట్ అయింది. 1953 లో చండీరాణి, బ్రతుకు తెరువు, తెలుగు ఇండస్ట్రీ ఆల్ టైమ్ లవ్ క్లాసిక్ దేవదాస్, పరదేశి, 1954లో అంతా మనవాళ్ళే, రాజు-పేద, సంఘం, చంద్రహారం, రోహిణీ వంటి హిట్ సినిమాల్లో నటించారు. ఇందులో చండీరాణీ, దేవదాస్, రోహిణీ తమిళంలో కూడా తీశారు

ఇక 1955 లో బి.ఎన్.రెడ్డి దర్శకత్వంలో వచ్చిన “బంగారు పాప” అనే సినిమా ఎస్వీఆర్ కెరీర్లో మరో మైలురాయి. ఇది ప్రముఖ ఇంగ్లీష్ రచయిత ‘జార్జ్ ఇలియట్’ రాసిన 'సైలాస్ మర్నర్' అనే నవలలోని కథాంశం ఆధారంగా తీశారు. సినిమా ఆర్థికంగా విజయం సాధించకపోయినా ఎస్వీఆర్ నటనా పటిమను పూర్తి స్థాయిలో చూపించింది. ఈ చిత్రాన్ని లండన్ లో చూసిన చార్లీ చాప్లిన్, ఎస్వీఆర్ నటన గురించి ప్రస్తావిస్తూ “ఇలియట్ బ్రతికి ఉంటే చాలా సంతోషించి ఉండేవాడని అన్నారట”. తర్వాత అనార్కలి, మిస్సమ్మ, జయసింహ లాంటి హిట్ సినిమాల్లో నటించారు.

అటు పౌరాణికాలు, ఇటు సాంఘీకాలు రెండు రకాల జానర్ సినిమాల్లోనూ విరివిగా నటించేవారు. 1957లో వచ్చిన క్లాసిక్ ‘మాయాబజార్’ లో ‘ఘటోత్కచుడు’ పాత్ర ఎస్వీఆర్ ని నటుడుగా మరో మెట్టుపై నిలబెట్టింది. అటు పౌరాణిక సినిమాలయిన పాండవ వనవాసంలో దుర్యోధనుడిగా, సతీ సావిత్రిలో యముడుగా, నర్తనశాల లో కీచకుడిగా, హరిశ్చంద్రలో హరిశ్చంద్రుడిగా, దీపావళిలో నరకాసురిడిగా, శ్రీ కృష్ణాంజనేయ యుద్ధంలో బలరాముడిగా, మహాకవి కాళిదాసులో భోజరాజుగా, భట్టి విక్రమార్కలో మాంత్రికుడిగా, భక్తప్రహ్లాద సినిమాలో హిరణ్యకశిపునిగా, యశోదాకృష్ణ, శ్రీ కృష్ణ లీలలు చిత్రాలలో కంసునిగా, సంపూర్ణ రామాయణంలో రావుణునిగా, అనార్కలీలో అక్బర్ లా, ఇటు సాంఘీక సినిమాలయిన పెళ్ళిచేసి చూడులో ధూపాటి వియ్యన్నగా, సంతానంలో గుడ్డివాడిగా, బంగారుపాపలో కోటయ్యగా అదేవిధంగా దేవాంతకుడు, వెలుగునీడలు, కలసివుంటే కలదు సుఖం, పెళ్ళి తాంబూలం, పండంటి కాపురం, సంబరాల రాంబాబు, బస్తీ కిలాడీలు, రౌడీ రంగడు, ప్రేమ్ నగర్, దసరాబుల్లోడు, దేవదాదు, ఆత్మబంధువు, అప్పుచేసి పప్పుకూడు, దేవుడు చేసిన మనుషులు ఇలా చెప్పుకుంటే పోతే ఎన్నో అధ్భుతమైన సినిమాల్లో తన నటనతో ఆ సినిమాల విజయంలో తమ వంతు పాత్ర పోషించారు.

ఎన్టీఆర్, ఏఎన్నార్ లు తెలుగు తెరను ఏలుతున్న సమయంలో ఎస్వీఆర్ తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు. అప్పట్లో వచ్చే ప్రతి ముఖ్యమైన సినిమాలో ఎస్వీఆర్ ఉండాలి అన్నంతగా ఉండేది పరిస్థితి. దానిలో ఎన్టీఆర్ ఉన్నా సరే, ఏఎన్నార్ ఉన్నా సరే. చాలా సార్లు కథానాయకుడిగా సినిమా అవకాశాలు వచ్చినా వేరే సినిమాలో ఉన్న మంచి పాత్ర కోసం వాటిని వదులుకొనేవారు. అలా తన నటనతో చాలా సినిమాలకు, పాత్రలకు ప్రాణం పోశారు.

తెలుగు ప్రేక్షకులనే కాకుండా తమిళ ప్రేక్షకులను కూడా ఎస్వీఆర్ తన నటనతో అలరించారు. తమిళం కూడా ఎస్వీఆర్ చాలా బాగా మాట్లాడేవారు. తమిళంలో తన పాత్రకు తనే డబ్బింగ్ చెప్పుకునే వారు. దీనితో తమిళులు చాలామంది ఎస్వీఆర్ ని తమిళ వాడిగా అనుకునేవారు. భానుమతి దర్శకత్వంలో వచ్చిన ‘నాది ఆడజన్మే’ ఆధారంగా హిందీలో తీసిన ‘మై భీ లడ్కీ హూ’ లాంటి హిందీ చిత్రాల్లో నటించారు. భూకైలాస్, మాయాబజార్ కన్నడా చిత్రాలలోనూ, విదయాగలే ఎతిలే ఎతిలే, కవిత వంటి మలయాళ చిత్రాలలో కూడా నటించారు.

దర్శకత్వం

ఎస్వీఆర్ బహుముఖ ప్రజ్ఞాశాలి. నటనతో పాటు ఎస్వీఆర్ సినిమాలకు దర్శకత్వం కూడా వహించారు. 1967లో ‘చదరంగం’ అనే సినిమాకు, 1968 లో ‘బాంధవ్యాలు’ అనే సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ రెండు సినిమాలను స్వయంగా నిర్మించారు. ఇందులో చదరంగం సినిమాకు గాను రెండో ఉత్తమ చిత్రంగా నంది అవార్డు వచ్చింది. బాంధవ్యాలు సినిమా ఉత్తమ చిత్రంగా నంది పురస్కారం అందుకుంది.

రచయితగా

ఎస్వీఆర్ నటుడు, నిర్మాత, దర్శకుడు మాత్రమే కాదు. వారిలో ఒక రచయిత కూడా ఉన్నారు. ఆయన కథలు రాసేవారు. మనభూమి, యువ, ఆంధ్రపత్రిక వంటి పత్రికలలో వారి కథలు ప్రచురించబడ్డాయి.

వ్యక్తిగత జీవితం

ఎస్వీఆర్ అతని మేనమామ బడేటి వెంకటరామయ్య, కోటేశ్వరమ్మ దంపతుల కుమార్తె లీలావతిని పెళ్ళి చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు వారి పేర్లు విజయ, ప్రమీల. ఒక కొడుకు, పేరు కోటేశ్వరరావు. తన కొడుకుని సినిమాల్లోకి తీసుకురావడానికి ఎస్వీఆర్ ప్రయత్నించారు. తన కొడుకు హీరోగా ఒక సినిమా కూడా మొదలైంది. కానీ కొన్ని అనివార్య కారాణాలవల్ల ఆ సినిమా పూర్తవలేదు.

ఎస్వీఆర్ సినిమా షూటింగ్స్ లో అంతగా మాట్లాడేవారు కాదు. తన పని తనది అన్నట్టు ఉండేవారు. ఒక్క సారి డైరెక్టర్ యాక్షన్ చెబితే తన నటనా విశ్వరూపం చూపించేవారు అంతే తప్పితే ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడేవారు కాదు. ఎస్వీఆర్ వివేకనందను ఎక్కువగా ఇష్టపడేవారు. ఆయనకు సంబంధించిన పుస్తాకాలు ఎక్కువగా చదివేవారు. ఎస్వీఆర్ శివ భక్తుడు. ప్రతిరోజూ ఉదయం శివుని పూజ చేసి కానీ పని ప్రారంభించరు. వేట అంటే సరదా. కానీ ఒకసారి వేటకి వెళ్ళినప్పుడు తను రైఫిల్ గురిపెట్టిన పులి కళ్ళల్లో దైన్యం చూశాక వేట మానేశాను అని అన్నారు.

ఎస్వీఆర్ సహృదయుడు. దాన గుణం కలవారు. ఎక్కువగా దానాలు చేసేవారు. ఎన్నో సంఘాలకు లెక్కలేనన్ని విరాళాలు ఇచ్చారు. పాకిస్తాన్ తోనూ, చైనాతోనూ యుద్ధం సమయంలో తోటి కళాకారులతో కలసి ఊరూరు తిరిగి, ప్రదర్శనలు చేసి విరాళాలు సేకరించి ప్రభుత్వానికి అందజేశారు. ఎస్వీఆర్ భోజన ప్రియుడు వంట కూడా బాగా చేసేవారు. పిల్లలతో కలసి పిక్నిక్స్ వెళ్ళినప్పుడు సాంబారు, చికెన్ కర్రీ ఇష్టంగా, ఎంతో రుచిగా చేసేవారు. ఎస్వీఆర్ కి ఇంగ్లీష్ సినిమాలంటే చాలా ఇష్టం. ఆయన తన జీవితంలో తెలుగు సినిమాలకంటే ఇంగ్లీష్ సినిమాలు ఎక్కువగా చూశారు. ఎవరికీ దొరకని వరల్డ్ సినిమాలను అతి కష్టం మీద సేకరించి వీక్షించేవారు. అందుకనే కొన్ని క్యారెక్టర్స్ ని ఎస్వీఆర్ లా ఎవరూ పోషించలేరు.

అవార్డ్స్

నర్తనశాల  సినిమాలో కీచకుడిగా నటించినందుకుగానూ 1963లో జకర్తలో జరిగిన ‘ఆఫ్రో-ఆసియన్ ఫిల్మ్ ఫేస్టివల్’ లో బెస్ట్ యాక్టర్ అవార్డ్ వచ్చింది. అంతార్జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మక అవార్డు అందుకున్న తొలి తెలుగు నటుడు ఎస్వీఆరే. ఆన్నై, శారద, నానుమ్ ఓరు పెన్, కర్పగమ్, నర్తనశాల సినిమాలకు ‘రాష్ట్రపతి అవార్డ్ ఫర్ బెస్ట్ యాక్టింగ్’ అవార్డ్ ని అందుకున్నారు. బాంధవ్యాలు సినిమాకు గాను ఉత్తమ నటుడుగా నంది అవార్డు అందుకున్నారు. ప్రముఖ నటుడు గుమ్మడి ఎస్వీఆర్ నటనా పటిమ గురించి మాట్లాడుతూ “రంగారావు మన దేశంలో పుట్టడం మన అదృష్టం. కానీ ఆయనకు దురదృష్టం. ఆయన ఏ వెస్టర్న్ కంట్రీస్ లో పుట్టిఉంటే ప్రపంచంలోని ఐదుగురు ఉత్తమ నటుల్లో ఒకడయ్యుండే వారు”. అని అన్నారు. అభిమానులు, తెలుగు సినీఇండస్ట్రీ ఎస్వీఆర్ మీద ఉన్న అభిమానంతో ఆయనకు విశ్వనటచక్రవర్తి, నటసార్వభౌమ, నటసింహ, నటశేఖర వంటి బిరుదులు ఇచ్చారు.

మరణం

1974లో హైదరాబాదులో ఉన్నప్పుడు ఎస్వీఆర్ కి మొదట సారి హార్ట్ ఎటాక్ వచ్చింది. ఉస్మానియా హాస్పిటల్ లో అడ్మిట్ చేశారు. అక్కడ ట్రీట్మెంట్ తీసుకుని కోలుకున్నారు. ఆ సమయంలో తమిళంలో ‘శివకామ్యిన్ సెల్వన్’ తెలుగులో ‘యశోదకృష్ణ’ సినిమాలను పూర్తి చేశారు. త్వరలో అమెరికా వెళ్ళి బైపాస్ సర్జరీ చేయించుకుందామని అనుకున్నారు. ఇంతలోనే 1974 జూలై 18న మద్రాసులో మళ్ళీ హార్ట్ ఎటాక్ వచ్చింది. హాస్పిటల్ లో అడ్మిట్ చేయించేలోపలే కన్నుమూశారు.

స్మరణం

ఎస్వీఆర్ శతజయంతి ఉత్సవాలు 2018 జూలై 3న ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారి చేతులు మీదగా హైదరాబాద్ లో జరిగాయి. ఈ ఉత్సవాలను హైదరబాద్ ఫిల్మ్ క్లబ్, సారథి స్టూడియోస్ కలిపి సంయుక్తంగా నిర్వహించాయి. అదే రోజు, అంటే 2018 జూలై 3న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏలూరులో పన్నెండున్నర అడుగుల ఎత్తైన ఎస్వీఆర్ కంచు విగ్రహాన్ని ఆవిష్కరించారు. 2013లో భారత సినీ పరిశ్రమ వందేళ్ళ సందర్భంగా భారతీయ తపాలశాఖ ఎస్వీఆర్ మీద ఒక స్టాంపు విడుదల చేసింది. ఆ స్టాంప్ భారతీయ సినీ పరిశ్రమ గర్వించదగ్గ సినిమా ‘మాయాబజార్’ లో ఎస్వీఆర్ పోషించిన ‘ఘటోత్కచుడు’ వేషంతో ఉన్న ఫోటో, ఇంకొకటి ఎస్వీఆర్ ఫోటో కలిగి ఉంటుంది.

ముగింపు

1950 నుండి 1974 వరకూ తన నటనతో మనల్ని సమ్మోహన పరిచిన నటుడు 56ఏళ్ళ వయసులోనే మరణించడం తెలుగు సినీ ప్రపంచానికి తీరనీ లోటు. ఎన్నో అధ్బుతమైన పాత్రలు మనం చూడలేకపోయాం. ఒక పాత్రను పండించడానికి ఆయిన కఠినమైన హోంవర్క్ చేసేవారు. గుమ్మడి అంతటి వారు ఎస్వీఆర్ ఇక్కడ కాకుండా పశ్చాత్య దేశాల్లో పుట్టి ఉంటే ఆయనకు ఆస్కార్ వచ్చి ఉండేది. అని అన్నారంటే మనం మన గొప్ప గొప్ప కళాకారులను సరిగా గుర్తించుకోవట్లేదని అర్థం. అంతర్జాతీయ అవార్డు పొందిన మొదటి తెలుగు నటుడు మన ఎస్వీఆర్. ఆయనకు మనం ఇచ్చింది కేవలం నంది అవార్డు మాత్రమే. దేశం కళాకారులకు ఇచ్చే పద్మ అవార్డులు మనం ఎస్వీఆర్ కి ఇచ్చి గౌరవించుకోకపోవటం మన దురదృష్టం.

- Advertisement -

You've successfully subscribed to Tollywood Latest News | Celebrities Profiles | Media9 Tollywood
Great! Next, complete checkout to get full access to all premium content.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.