
విషమ పరిస్థితుల్లో ఎలా నడుచుకోవాలో మన తెలుగు ఇండస్ట్రీ వారికి బాగా తెలుసు. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ ఎలాంటి విపత్కర పరిణామాలు ఎదురైనా మనోళ్ళు ముందుండి దానిని ఎదుర్కోవడంలో సహాయపడతారు. సీనియర్ ఎన్టీఆర్ కాలం నుండి ఇది ఆనవాయితీగా వస్తూనే ఉంది. అప్పట్లో హూద్ హూద్ తుఫాన్ వచ్చినప్పుడు మేముసైతం అంటూ కొన్ని ప్రోగ్రామ్స్ చేసి వారికి చేయూతనిచ్చారు. అలాగే చాలామంది నటులు తమ అభిమానులకి ఆపరేషన్స్ చేయించిన సంఘటనలు కూడా ఎన్నో ఉన్నాయి.

ఇప్పుడు పెరుగుతున్న కరోనాపై పోరాడేందుకు పరిశ్రమ కూడా ఒక్కతాటి పైకి వచ్చింది. పోయినేడాది ఎవరూ పెద్దగా స్పందించలేదు. సోనూ సూద్ ఒక్కడే తనకు వీలైనంత సహాయాన్ని చేసాడు కాని ఇప్పుడు పరస్థితి మారింది. ఒక్కొక్కరుగా అందరూ ప్రజలకు అవగాహన కల్పించేందుకు ముందుకు వస్తున్నారు. దాదాపుగా అగ్ర హీరోలందరూ తమకు చేతనైనంత సహాయాన్ని చేస్తున్నారు. ఇటీవలే మెగాస్టార్ చిరంజీవి గారు అపోలో హాస్పిటల్స్ సహాయంతో పరిశ్రమలోని 45 ఏళ్ళు పైబడ్డ సినీ కార్మికులందరికీ ఉచితంగా టీకా వేయించనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.


ఇప్పుడు టెక్నాలజీతో సమాచారాన్ని వెంటనే ఇతరులకి చేరవేయొచ్చు. దీన్ని ఉపయోగించుకుంటూ మన వాళ్ళు ఇతరులకి సహాయపడుతున్నారు. ఇటీవలే వైజాగ్ లోని రామానాయుడు స్టూడియోస్ ని కోవిడ్ ట్రీట్మెంట్ కి వాడుకునేందుకు గవర్నమెంట్ కి ఇచ్చిన సంగతి తెలిసిందే. అలానే రెండు రాష్ట్రాల్లో హాస్పిటల్స్ గురించి, ట్రీట్మెంట్ గురించి ఇలాంటి విషయాలు తెలిసినా వారు వెంటనే సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. వీరితో పాటు గీత ఆర్ట్స్, బి.ఎ రాజు, వంశి కాకా, టీమ్ ఆర్.ఆర్.ఆర్ ఇలా హ్యూజ్ ఫాలోయింగ్ ఉన్న ట్విటర్ అకౌంట్స్ నుంచి ప్రజలకు ఎప్పటికప్పుడు సమాచారం వెళ్తూనే ఉంది.