మాటల మాంత్రికుడు త్రివిక్రమ్

తెలుగు డైరెక్టర్స్ లో త్రివిక్రమ్ గారిది ఒక ప్రత్యేకమైన శైలి. ఆయన సినిమాల్లో హాస్యం, సాహిత్యం, ఆయన రాసే సంభాషణలు ప్రతి వారిని మైమరిపిస్తాయి. ఆయన మాటల్లో లోతైన అర్థం ఉంటుంది. అందుకే ఆయన్ను అందరూ మాటల మాంత్రికుడు అంటారు. త్రివిక్రమ్ ఒక డైలాగు రైటర్ నుంచి ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో టాప్ డైరెక్టర్ గా ఎదిగారు. ఆయన సినిమాల్లో కుటుంబ బంధాల గురించి గొప్పగా చూపిస్తారు.

జననం

1972, నవంబర్ 7న ఆకెళ్ల ఉదయ్ భాస్కర్, ఆకెళ్ల నరసమ్మకి జన్మించారు త్రివిక్రమ్ శ్రీనివాస్. ఆయన అసలు పేరు ఆకెళ్ల నాగ శ్రీనివాస్ శర్మ. త్రివిక్రమ్ సొంత ఊరు పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరం. చిన్నప్పటి నుంచి త్రివిక్రమ్ చదువులో ఎప్పుడూ ముందుండేవాడు. ఆయన ఆంధ్రా యూనివర్సిటీ నుంచి న్యూక్లియర్ ఫిజిక్స్ లో గోల్డ్ మెడల్ సాధించారు. కొంతకాలం ఉపాధ్యాయుడిగా పనిచేసాడు. సాహిత్యంపై ఉన్న ఆసక్తితో సినిమా రంగంలోకి ప్రవేశించాడు. హైదరాబాదుకు వచ్చి పోసాని కృష్ణమురళి దగ్గర సహాయకుడిగా చేరాడు. మొదట్లో నటుడు సునీల్ తో కలిసి త్రివిక్రమ్ ఒకే గదిలో ఉండేవాడు.

సిని ప్రయాణం

1999 లో స్వయంవరం సినిమా ద్వారా మాటల రచయితగా సినీ రంగ ప్రవేశం చేసాడు. సముద్రం, నిన్నే ప్రేమిస్తా, చిరునవ్వుతో, నువ్వే కావాలి, నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి, మన్మథుడు లాంటి సినిమాలకి త్రివిక్రమ్ తన మాటలతో కొత్త అందాన్ని ఇచ్చారు. వీటిలో చాలా సినిమాలు త్రివిక్రమ్ మాటలవల్లే హిట్ అయ్యాయి అంటే అతిశయోక్తి కాదు.

ఇక ఆయన డైరెక్టర్ గా తన మొదటి సినిమా ‘నువ్వే నువ్వే’తో మంచి పేరు తెచ్చుకున్నాడు. ఈ సినిమాలోని మాటలు ఎప్పుడు చూసినా మనల్ని హాయిగా నవ్వుకునేలా చేస్తాయి. ఈ సినిమాలో తరుణ్, శ్రియ కలిసి నటించారు. మొదటి చిత్రంతోనే హిట్ అందుకున్నారు త్రివిక్రమ్. ప్రకాష్ రాజ్, చంద్ర మోహన్ ల నటనను కూడా మర్చిపోలేము.

ఇక ఆయన డైరెక్టర్ గా చేసిన రెండో సినిమా ‘అతడు’. అప్పటివరకూ మహేష్ బాబు చేసిన సినిమాలు ఒకెత్తు... ఈ సినిమా ఒకెత్తు.. ఎందుకంటే అప్పటివరకు మహేష్ బాబు సినిమాలన్నీ ఓ మూస ధోరణిలోనే వెళ్తున్నాయి.. అందులోనూ మురారి సినిమా తర్వాత మళ్ళీ ఫ్యామిలీ కథలను టచ్ చేయలేదు మహేష్.. కానీ త్రివిక్రమ్ దర్శకత్వంలో చేసిన ఈ ‘అతడు’ సినిమా 2005 ఆగస్టు 10న విడుదలై అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించి మంచి విజయాన్ని అందుకుంది. అప్పటివరకూ రచయితగా ఉన్న త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సినిమాతోనే డైరెక్టర్ గా ఎంట్రీ ఇద్దామని అనుకున్నాడు. అందులో భాగంగానే ఈ కథను ముందుగా పవన్ కళ్యాణ్ కి వెళ్లి చెప్పగా అయన కథ వింటూ నిద్రపోయారట. ఆ తర్వాత ఇదే కథని మహేష్ బాబుకి చెబితే మహేశ్ కి బాగా నచ్చింది, కానీ అప్పటికే అర్జున్, నాని సినిమాలతో బిజీగా ఉన్న మహేష్ నెక్స్ట్ ఇయర్ చేద్దామని చెప్పాడట.. అప్పటిలోపు ఓ సినిమా చేయండి అని సలహా కూడా ఇచ్చాడట... దాంతో త్రివిక్రమ్ నువ్వే నువ్వే సినిమాతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత మహేష్ తో సినిమాని స్టార్ట్ చేశాడు త్రివిక్రమ్.. ముందుగా ఈ సినిమాని పద్మాలయా బ్యానర్ పైనే సినిమా తీద్దామని భావించారు హీరో కృష్ణ.. కానీ త్రివిక్రమ్ టాలెంట్ ని ముందే గుర్తించిన నటుడు, వ్యాపారవేత్త, నిర్మాత మురళీ మోహన్ తన జయభేరి ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్లో ఓ సినిమా చేయాలని అడ్వాన్స్ ఇవ్వడంతో ఈ సినిమా కృష్ణకి మిస్ అయింది. మహేష్ బాబు పెళ్లి తర్వాత విడుదలైన ఫస్ట్ సినిమా అతడు.. ఇందులో నాజర్ పాత్రకి ముందుగా శోభన్ బాబు అనుకున్నారు మురళీమోహన్, త్రివిక్రమ్. అందగాడిగా అందరు మనస్సులో ముద్ర వేసుకున్న ఆయనకు వృద్ధుడి పాత్రలో నటించడం ఇష్టం లేక ఈ సినిమాని ఒప్పుకోలేదట. ఇక ఆ పాత్రకు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం డబ్బింగ్ చెప్పి ప్రాణం పోశారు. ఇక హీరోయిన్ గా పలువురిని అనుకుని త్రిషని సెలెక్ట్ చేసుకున్నారు. అప్పటికే ఆమె ‘వర్షం’ సినిమాతో యువతలో మంచి పాపులారిటి సొంతం చేసుకుంది. ఇందులో హీరోయిన్ పేరు పూరి.. త్రివిక్రమ్ ఇంటిపక్కన ఉండే ఓ అమ్మాయి పేరు పూర్ణిమ.. ఆమెను అందరూ పూరి అని పిలిచేవారట.. అది బాగా నచ్చి ఇందులో హీరోయిన్ కి అదే పేరు పెట్టేశాడట త్రివిక్రమ్. సంగీత దర్శకుడిగా మణిశర్మను ఎంపిక చేసుకున్నారు. దాదాపు మహేష్ నటించిన చిత్రాలకి ఆయనే సంగీతం అందించేవారు. వీరి కలయికలో వచ్చిన 8వ చిత్రం కాగా, త్రివిక్రమ్ తో ఆయనకిది మొదటి చిత్రం. ఈ చిత్రానికి ఆయన ఇచ్చిన మ్యూజిక్ పెద్ద హిట్. ఎక్కడ చూసిన అవే పాటలు. మణిశర్మ ఇచ్చిన సంగీతం, బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ఈ చిత్రానికి మరో బలం. ఈ సినిమా యాక్షన్ సన్నివేశాల కోసం టైమ్-ఫ్రీజ్ ఎఫెక్ట్ షాట్లను వాడారు. అందుకోసం లండన్ నుండి ప్రత్యేకమైన కెమెరాలను తెప్పించారు. ఈ యాక్షన్ సన్నివేశాలను పీటర్ హెయిన్ పర్యవేక్షణలో తెరకెక్కించారు. అప్పట్లో ఎక్కువ డీవీడీలు అమ్ముడు పోయిన సినిమా కూడా అతడునే. అందుకు గాను ఉత్తమ డివిడి అవార్డును అందుకుంది ఈ చిత్రం. మొత్తం ఈ సినిమా 205 కేంద్రాల్లో 50 రోజులు, 38 కేంద్రాలలో 100 రోజులు ఆడింది. ఇక హైదరాబాద్ లోని సుదర్శన్ 35 మిమీలో 175 రోజులు ఆడింది. దాదాపుగా ఈ చిత్రం 30 కోట్లను కొల్లగొట్టింది. ఈ సినిమా విడుదలైన ఏడు సంవత్సరాల తర్వాత మాటీవీ అతడు సినిమా శాటిలైట్ రెన్యువల్ కోసం ఏకంగా 3.5 కోట్లు చెల్లించింది. ఇది అప్పట్లో సెన్సేషన్. ఈ సినిమా తమిళంలో నందు అనే పేరుతో, మలయాళంలో టార్గెట్ అనే పేరుతో అనువాదం అయింది. హిందీలో ఏక్ అనే పేరుతోనూ, బెంగాలీలో వాంటెడ్ పేరుతో పునర్మించారు. పోలండ్ భాషలో విడుదలైన మొదటి తెలుగు సినిమా కూడా అతడు కావడం విశేషం. ఈ సినిమాకి ఉత్తమ నటుడిగా మహేష్ బాబు, ఉత్తమ మాటల రచయితగా త్రివిక్రమ్ నంది అవార్డులను అందుకున్నారు. వెండితెర పై ఎంత సంచలనం సృష్టించిందో బుల్లితెర పై కూడా అంతే ప్రభంజనం సృష్టించింది ఈ చిత్రం.

ఆయన మూడవ చిత్రం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో తెరకెక్కించిన ‘జల్సా’. అప్పటికే పవన్ కళ్యాణ్ వరస ప్లాపుల్లో ఉన్నాడు. ఏ సినిమా వచ్చినా కూడా పెద్దగా ఆకట్టుకోవడం లేదు. ఆ సమయంలో భారీ అంచనాల మధ్య విడుదలైంది జల్సా. ముందుగా విడుదలైన ఈ సినిమా పాటలు అదిరిపోయే హిట్. దేవీ శ్రీ ప్రసాద్ అందించిన పాటలు సినిమా మీద మంచి హైప్ ని తీసుకొచ్చాయి. అప్పటి వరకూ పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ కెరీర్‌లో ఉన్న పాత రికార్డులన్నింటినీ తిరగరాస్తూ పాటలు దూసుకుపోతున్నాయి. అదే స్థాయి అంచనాలతో సినిమా కూడా వచ్చేసింది. జల్సాకు తొలిరోజే యావరేజ్ టాక్.. సినిమాలో పెద్దగా విషయం లేదు.. కామెడీ తప్ప ఇంకేం లేదని తేల్చేసారు. కానీ ఖుషీ తర్వాత ఏడేళ్ల పాటు ఒక్క విజయం అంటూ వేచి చూసిన పవన్ అభిమానులకు మాత్రం జల్సా ఓ విందు భోజనం అయిపోయింది. చూస్తూ చూస్తూ యావరేజ్ నుండి సినిమా సూపర్ హిట్ గా మారింది. ఈ సినిమా కమర్షియల్‌గా సంచలనం. 2008 లోనే 33 కోట్లకు పైగా షేర్ వసూలు చేసింది జల్సా. పవన్, త్రివిక్రమ్ కాంబినేషన్‌కు బీజం వేసింది ఈ చిత్రం. దానికి ముందు జానీ, గుడుంబా శంకర్‌, బాలు, బంగారం, అన్నవరం లాంటి సినిమాలు పెద్దగా ఆకట్టుకోలేదు. అలాంటి సమయంలో వచ్చిన జల్సా సంచలనం సృష్టించింది. ఈ సినిమాలో కామెడీ హైలైట్. ముఖ్యంగా కొడుతున్నారమ్మా అంటూ బ్రహ్మానందం చెప్పిన డైలాగ్ ఇప్పటికీ ఫేమస్. పది రూపాయలు ఇచ్చి 1000 అని చెప్పడం, పవన్, ఇలియానా సీన్స్.. పవన్‌, బ్రహ్మానందం ఎపిసోడ్స్ ఇలా అన్నీ అదిరిపోయాయి. మరోవైపు ప్రకాష్‌ రాజ్‌ సీన్స్‌ కూడా సినిమాకు ప్లస్ పాయింట్ అయ్యాయి. మహేష్ బాబు వాయిస్ ఓవర్ మరో బలం. సినిమాలో పవన్ నక్సలిజం ఫ్లాష్‌ బ్యాక్‌ కూడా అదనపు ఆకర్షణ. అయితే దీన్ని కూడా కామెడీ చేసాడని త్రివిక్రమ్‌పై కొన్ని విమర్శలు కూడా ఉన్నాయి. అయితే సినిమా ఎలా ఉన్నా కూడా ప్రతీ సీన్‌లోనూ త్రివిక్రమ్‌ తన మ్యాజిక్‌ చూపించాడు. మాటలతో మాయ చేసాడు. కామెడీతో పాటు ఆలోచింపజేసే మాటలు, డైలాగ్‌లకు జల్సా కేరాఫ్‌ అడ్రస్‌. విలన్‌ను రక్తపు చుక్క రాకుండా.. ఒక్కసారి కూడా ఆయన్ని కొట్టకుండా అంతమొందించే క్లైమాక్స్ కూడా అద్భుతమే. యుద్ధంలో గెలవడం అంటే శత్రువును ఓడించడమే కానీ చంపడం కాదంటూ త్రివిక్రమ్ చెప్పిన ఫిలాసఫీ కూడా బాగానే వర్కవుట్ అయింది. మొత్తంగా దేవీ పాటలు దుమ్ము దులిపేసాయి. అన్నీ కలిపి అప్పటి వరకూ తెలుగు సినిమాలో ఉన్న కమర్షియల్ రికార్డుల్లో చాలా వరకు జల్సా తన పేర రాసుకుంది. పవన్ కోరుకున్న విజయాన్ని అందించింది.

ఇక సూపర్ స్టార్ మహేశ్ బాబులోని కామెడీ యాంగిల్‌ను చూపించిన సినిమా ‘ఖలేజా’. దేవుడు ఎక్కడో లేడు, నిస్వార్థంగా సహాయం చేయాలనుకునే మనిషిలోనే ఉంటాడనే యూనిక్ స్టోరీ లైన్‌తో దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కించిన ఈ మూవీ.. ఫుల్ లెంగ్త్ ఎంటర్‌టైన్మెంట్‌తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించింది. ఫ్రేమ్ ఫ్రేమ్‌కు.. సీన్ సీన్‌కు కామెడీని యాడ్ చేసిన ప్రిన్స్ తన కామెడీ టైమింగ్‌కు ఫిదా అయ్యేలా చేశాడు. ఫస్ట్ టైమ్ కామెడీ బేస్ సినిమా చేసిన మహేశ్‌ను ఆడియన్స్ యాక్సెప్ట్ చేయలేకపోయారు.. సినిమా డిజాస్టర్ అని టాక్ వచ్చినా సరే.. బాక్సాఫీస్ కలెక్షన్లు మాత్రం పర్వాలేదనిపించాయి. ఆయన కామెడీని ఆస్వాదిస్తూ థియేటర్లన్నీ నవ్వులతో నిండిపోయాయి. ఓ చిన్న మారుమూల పల్లె దేవుడి కోసం ఎదురుచూస్తుండటం.. ఆ దేవుడు మహేశ్ బాబు అని నిర్ధారించుకోవడం.. తమ కష్టాల నుంచి కాపాడే దేవుడు తనే అని గ్రామస్తులంతా చెప్తూ.. “నువ్వు మా దేవుడివి అని నువ్వు నమ్మే పనిలేదు.. మాకు నమ్మించే అక్కరా లేదు.. ఇది నీ దర్శనం.. ఇది నిదర్శనం” లాంటి ఎమోషనల్ సీన్స్ సినిమాకు హైలెట్ కాగా.. అక్కడ కూడా మహేశ్ కామెడీని సూపర్‌గా ఎంజాయ్ చేశారు, చేస్తూనే ఉన్నారు ప్రేక్షకులు. డిజాస్టర్ టాక్‌తో థియేటర్స్‌లో సినిమా చూడని ప్రేక్షకులు.. టీవీల్లో సినిమా చూసి అదిరిపోయే ఎంటర్‌టైన్మెంట్ అందుకున్నారు.

ఇక ఖలేజాతో డీలా పడిన త్రివిక్రమ్ కి మళ్ళీ జులాయి ఊపుని ఇచ్చింది. ముఖ్యంగా బన్నీ క్యారెక్టరైజేషన్.. సోనూ సూద్ విలనిజం.. త్రివిక్రమ్ పంచ్ డైలాగ్స్ జులాయి సినిమాకు ప్రాణం పోశాయి. ఇలియానా గ్లామర్ కూడా ఈ సినిమాకు ప్రధానాకర్షణ. అప్పటి వరకు తనని ఊరిస్తున్న 40 కోట్ల మార్క్ ను జులాయి సినిమాతో అందుకున్నాడు బన్నీ. హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై చినబాబు ఈ సినిమాను నిర్మించాడు. ఎమ్మెస్ నారాయణ, రాజేంద్ర ప్రసాద్ కామెడీ ట్రాక్ సినిమాకు మెయిన్ హైలైట్. బ్యాంక్ రాబరీ చుట్టూ అల్లుకున్న కథలో జులాయిని అద్భుతంగా తెరకెక్కించాడు త్రివిక్రమ్.

జల్సా తర్వాత మళ్ళీ పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా ‘అత్తారింటికి దారేది’. గబ్బర్ సింగ్‌తో ఇండస్ట్రీ హిట్ కొట్టిన పవన్ మళ్ళీ మరుసటి సంవత్సరంలోనే దాన్ని మరొక సినిమాతో బ్రేక్ చేసాడు. గబ్బర్ సింగ్ రికార్డ్స్‌ని తిరగరాసింది అత్తారింటికి దారేది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ఒక పక్క పవన్ ఇమేజ్‌ని పడిపోకుండా మరోపక్క అదిరిపోయే ఎమోషన్స్‌ని మిక్స్ చేసి ఈ సినిమాని తీర్చిదిద్దాడు. అయితే ఆ సినిమా నిర్మాణం పూర్తయింది. కానీ అప్పుడు తెలుగు రాష్ట్రాల్లో నడుస్తున్న కొన్ని వివాదాల కారణంగా ఆ సినిమా విడుదల కూడా వాయిదా పడింది. ఒక పక్క ఆ సినిమాకి మంచి బజ్ ఉంది. సరిగ్గా అలాంటి టైమ్ లో ఆ సినిమా పైరసీ బైటకి వచ్చింది. 55 కోట్ల ఖర్చుతో నిర్మించిన భారీ సినిమా థియేటర్‌లో ఒక్క షో కూడా పడకుండా ముందే సి.డి ల్లో బయటకి వస్తే ఆ సినిమాని తీసిన నిర్మాత ధైర్యంగా సినిమాని రిలీజ్ చేసేసారు. మార్నింగ్ షో పడగానే అర్ధమైపోయింది బొమ్మ బ్లాక్ బస్టర్ అని. అప్పట్లో ప్రేక్షకులు చాలామంది చాలా మెచ్యూర్డ్‌గా ఆలోచించారు. ఆ సినిమాని థియేటర్స్‌లోనే చూస్తాం అని పైరసీని పక్కనబెట్టారు. 2013 సెప్టెంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయిన అత్తారింటికి దారేది సంచలన విజయం అందుకుంది. 175 నిమిషాల నిడివితో తెరకెక్కిన ఈ సినిమా టాలీవుడ్‌లో అప్పటివరకు ఉన్న రికార్డ్స్ బ్రేక్ చేసింది అనేకంటే కూడా కొత్త రికార్డ్స్ క్రియేట్ చేసింది అంటే బావుంటుంది. ఆ సినిమాలో త్రివిక్రమ్ ట్రై చేసిన ప్రతి ఒక్క ఎలిమెంట్ కూడా వర్క్ అవుట్ అయ్యింది. ఇక క్లైమాక్స్‌లో వచ్చే రైల్వే స్టేషన్ సీన్‌తో సినిమా చూస్తున్నవాళ్లందరినీ కంటతడి పెట్టించేసారు పవన్ కళ్యాణ్. ఆ సీన్ ఇప్పటికి, ఎప్పటికి కూడా ఎవర్ గ్రీన్ అని చెప్పుకోవాలి. అత్త అంటే అమ్మ తరువాత మళ్ళీ అమ్మ అని ఆ సినిమాలో ఇచ్చిన మెసేజ్ అందరికి బాగా కనెక్ట్ అయ్యింది. ఆ సినిమా హిట్‌ మిగిలిన సినిమాలకు కూడా జోష్ ఇచ్చింది. ఫుల్ రన్‌తో పాటు అన్ని హక్కులు కలుపుకుని 100 కోట్లపైగా కలెక్షన్స్ రాబట్టింది. బహుబలి సినిమా వచ్చేవరకు కూడా అత్యధిక కలెక్షన్స్ రికార్డ్ ఆ సినిమా పేరుతోనే ఉండేది.

జులాయి లాంటి సూపర్ హిట్ తర్వాత త్రివిక్రమ్, అల్లు అర్జున్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా ‘సన్ ఆఫ్ సత్యమూర్తి’. చనిపోయిన తర్వాత కూడా నాన్న గౌరవాన్ని కాపాడే కొడుకు కథ ఇది. నువ్వు చనిపోయి అయినా మరొకరిని కాపాడాలనుకునే ఉన్నత విలువలున్న తండ్రి కథ ఇది. సన్నాఫ్ సత్యమూర్తి 2015లో విడుదలైంది. ఈ సినిమాలో అల్లు అర్జున్, సమంత జంటగా నటించారు. తండ్రిగా ప్రకాశ్ రాజ్ కనిపించాడు. ఆయన పాత్ర సినిమాలో మహా అయితే ఉండేది 10 నిమిషాలే.. కానీ అదే సినిమా అంతా నడిపిస్తుంది. ఆయన చెప్పిన విలువలే కొడుకు పాటిస్తుంటాడు. తండ్రి కోసం కొడుకు పడే ఆరాటాన్ని ఈ చిత్రంలో చాలా బాగా చూపించాడు త్రివిక్రమ్. అలాగే సినిమాలో నాన్న గురించి మాటలు కూడా చాలా అద్బుతంగా ఉంటాయి. నాన్న అంటే మరిచిపోలేని ఓ జ్ఞాపకం అంటూ మంచి మాటలు రాసాడు మాటల మాంత్రికుడు. ఈ చిత్రం విజయంతో పాటు విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది. తెలుగు ఇండస్ట్రీలో ఈ మధ్య కాలంలో వచ్చిన ది బెస్ట్ ఫాదర్ సెంటిమెంట్ సినిమాల్లో సన్నాఫ్ సత్యమూర్తి కూడా తప్పకుండా ఉంటుంది. ఈ సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంది. దాదాపుగా 50 కోట్ల కలెక్షన్స్ ని ఈ సినిమా కొల్లగొట్టింది.

ఇక  త్రివిక్రమ్ శ్రీనివాస్, యంగ్ హీరో నితిన్, సమంత కాంబోలో వచ్చిన అందమైన చిత్రం ‘అ..ఆ’. అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘనవిజయంగా నిలిచింది. నితిన్, సమంత కెరీర్ లో ఈ చిత్రం ఒక మెమొరబుల్ మూవీ. ఈ సినిమాలో సమంత క్యారెక్టర్ ని త్రివిక్రమ్ చాలా బాగా డిజైన్ చేశారు.ఈ సినిమా కథ మీద చాలా విమర్శలు వచ్చినప్పటికీ సూపర్ హిట్ టాక్ ని అపలేకపోయాయి.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో త్రివిక్రమ్ చేసిన మూడో చిత్రం  ‘అజ్ఞాతవాసి’. అందరి అంచనాలను తలకిందలు చేస్తూ ఈ సినిమా అట్టర్ ఫ్లాపైంది. త్రివిక్రమ్ కెరీర్ లో ఒక చెడు జ్ఞాపకంగా మిగిలిపోయింది.

ఇక యంగ్ టైగర్‌ ఎన్టీఆర్‌ హీరోగా ఆయన తెరకెక్కించిన సూపర్‌ హిట్ సినిమా ‘అరవింద సమేత వీర రాఘవ’. ఎన్టీఆర్‌ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాను హారికా హాసిని క్రియేషన్స్‌ బ్యానర్‌పై రాధాకృష్ణ నిర్మించారు. ఎన్టీఆర్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్స్‌లో ఒకటిగా నిలిచిన ఈ సినిమా నటుడిగా ఎన్టీఆర్‌ను సరికొత్తగా ఆవిష్కరించింది. ఈ సినిమా కోసం రాయలసీమ యాసలో మాట్లాడిన తారక్‌ సూపర్బ్ అనిపించాడు. తన శైలికి భిన్నంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు త్రివిక్రమ్ గారు. సాధారణంగా అయన చిత్రాల్లో హీరో కామెడి చేస్తుంటాడు కాని ఈ చిత్రంలో ఎన్టీఆర్ క్యారెక్టర్ ఎక్కడా కామెడి చెయ్యదు. చాలా వరకు సినిమా సీరియస్ గానే సాగుతుంది. వీరరాఘవ రెడ్డిగా ఆయన నటన ఈ చిత్రాన్ని మరో మెట్టు ఎక్కించింది. ఈ చిత్రంలో నటించిన ప్రతీ ఒక్కరూ తమ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ను డెలివర్ చేసారు. జగపతి బాబు గారు ఈ సినిమాకి మరో బలం. ముఖ్యంగా ఎన్టీఆర్, జగపతి బాబుల మధ్య వచ్చే సీన్స్ రోమాంచితమైనవి. క్లైమాక్స్ లో ఇద్దరి నటన అమోఘం.

2018 అక్టోబర్ 11న విడుదలైన అరవింద సమేత వీర రాఘవ ఘనవిజయం సాధించింది. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే 110 కోట్ల గ్రాస్‌ సాధించిన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 150 కోట్లకు పైగా వసూళ్లు సాధించి సత్తా చాటింది. విడుదలైన అన్ని ప్రాంతాలోనూ బ్రేక్‌ ఈవెన్‌ సాధించి ఎన్టీఆర్‌తో పాటు త్రివిక్రమ్‌కు కూడా మెమరబుల్‌ హిట్ అందించింది. రాయలసీమ ఫ్యాక్షన్‌ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో జగపతి బాబు ప్రతినాయకుడిగా నటించాడు. చాలా కాలం తరువాత సునీల్ ఈ సినిమాతో కమెడియనగా రీఎంట్రీ ఇచ్చాడు. యంగ్ హీరో నవీన్‌ చంద్ర కీలక పాత్రలో నటించిన ఈ సినిమాలో ఈషారెబ్బా, శుభలేఖ సుధాకర్‌, రావూ రమేష్‌, నరేష్‌, నాగబాబు ఇతర పాత్రల్లో నటించారు. దాదాపు 90 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన అరవింద సమేత 150 కోట్లకు పైగా వసూళ్లు సాధించి ఎన్టీఆర్‌ మార్కెట్ స్టామినాను ప్రూవ్‌ చేసింది.

అజ్ఞాతవాసి సినిమా ఫ్లాప్‌తో కెరీర్‌ను కష్టాల్లో పడేసుకున్న త్రివిక్రమ్‌ శ్రీనివాస్.. అరవింద సమేత తో తిరిగి తన రేంజ్‌ ఏంటో ప్రూవ్ చేసుకున్నాడు. త్రివిక్రమ్‌ మార్క్‌ ఎమోషనల్‌ కంటెంట్‌తో రూపొందిన అరవింద సమేత వీర రాఘవ మరోసారి మాటల మాంత్రికుడి పెన్‌ పవర్‌ను చూపించింది. తమన్ మ్యూజిక్ ఈ సినిమాకు మరింత ప్లస్ అయ్యింది. ఎన్టీఆర్‌ కూడా ఈ సినిమా కోసం ఎంతో డెడికేషన్‌తో పనిచేశాడు. ఈ సినిమా చిత్రీకరణ జరుగుతుండగానే ఎన్టీఆర్‌ తండ్రి నందమూరి హరికృష్ణ రోడ్డు ప్రమాదంలో మరణించారు. తన వ్యక్తిగత విషయాల కారణంగా నిర్మాతకు నష్టం రాకూడదని, తండ్రి అంత్యక్రియలు పూర్తయిన వెంటనే ఏ మాత్రం గ్యాప్‌ తీసుకోకుండా తిరిగి షూటింగ్‌లో పాల్గొన్నాడు తారక్‌. ఇంత డెడికేషన్‌తో వర్క్‌ చేశారు కాబట్టే సినిమా అంతటి విజయాన్ని సాధించింది.

అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వచ్చిన ‘అల వైకుంఠపురములో’ సినిమా ఎంత పెద్ద హిట్టయిందో తెలిసిందే. ముఖ్యంగా ఈ సినిమాలోని పాటలు సంచలనం సృష్టించాయి. ఈ సినిమా బాహుబలి తర్వాత తెలుగులో భారీ కలెక్షన్స్ సంపాదించి రికార్డ్ సృష్టించింది. 200 కోట్లకి పైగా కలెక్షన్స్ తో ఈ సినిమా సంచలనంగా మారింది. ఇక థమన్ అందించిన ఈ సినిమా పాటలు ఇంకొక సంచలనం. ముఖ్యంగా బుట్టబొమ్మ సాంగ్ పూటకో రికార్డును మటాష్ చేస్తూ సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తోంది. ఈ పాట 546 మిలియన్ వ్యూస్ క్రాస్ చేసింది. మరోవైపు రాములో రాములో పాట 307 మిలియన్ వ్యూస్ సాధించింది. ఇక సామజవరగమన ఫుల్ వీడియో సాంగ్ కూడా 166 మిలియన్ వ్యూస్ రాబట్టింది. ప్రపంచ వ్యాప్తంగా అత్యంత పాపులర్ అయిన 100 వీడియో సాంగ్స్‌లో బుట్టబొమ్మ 15వ స్థానంలో నిలిచింది.

తాజాగా 2020లో విడుదలైన టాప్ సాంగ్స్‌లో ‘అల వైకుంఠపురములో’ సాంగ్స్ యూట్యూబ్‌లో సెన్సెషన్ క్రియేట్ చేసిన టాప్ 10లో చోటు దక్కించుకుంది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తమన్ స్వరపరిచిన పాటలకు అల్లు అర్జున్, పూజా హెగ్డే  డ్యాన్స్ మూమెంట్స్ ఈ సినిమాకు హైలెట్‌గా నిలిచాయి. ఈ సినిమాలో ‘బుట్ట బొమ్మ’ సాంగ్ దేశ వ్యాప్తంగా మూడో స్థానంలో నిలిచింది. మరోవైపు ఇదే సినిమాలోని ‘రాములో రాములో’ పాట ఎనిమిదవ స్థానాన్ని సంపాదించుకుంది. అంతేకాదు 2020లో ఇండియా టాప్ 10 సాంగ్స్ లిస్టులో ఉన్న ఏకైక తెలుగు చిత్రం కూడా అల్లు అర్జున్, త్రివిక్రమ్ ‘అల వైకుంఠపురములో’ కావడం విశేషం.ప్రస్తుతం త్రివిక్రమ్ ఎన్టీఆర్ తో ఇంకో సినిమా దర్శకత్వం వహిస్తున్నారు. దానితో పాటు పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి కలిసి నటిస్తున్న మలయాళ సినిమా అయ్యప్పనుమ్ కోషియుమ్ తెలుగు రీమేక్ కి త్రివిక్రమ్ మాటలు మరియు స్క్రీన్ ప్లే అందిస్తున్నారు.

వ్యక్తిగత జీవితం

త్రివిక్రమ్, సౌజన్యల వివాహం 2002లో జరిగింది. సౌజన్య గారు ప్రముఖ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి సోదరుడి కుమార్తె. అయితే నిజానికి త్రివిక్రమ్ సౌజన్య అక్కని చూడడానికి పెళ్లి చూపులకు వెళ్లారట.. కానీ అక్కడ త్రివిక్రమ్ కు సౌజన్య నచ్చారట. ఇదే విషయాన్ని వాళ్ళకి చెప్పడంతో వాళ్ళు ముందుగా ఆశ్చర్యపోయినా.. ఆ తరవాత సీతారామశాస్త్రికి నచ్చిన అబ్బాయి, ఎలాంటి చెడు అలవాట్లు లేనివాడు కావడంతో ఒప్పెసుకున్నారట. కానీ పెద్ద అమ్మాయి పెళ్లి తర్వాతే చిన్నమ్మాయికి పెళ్లి చేస్తామని కండిషన్ పెట్టారట..

ఆలా ఓ సంవత్సరం తరవాత మూడుముళ్ల బంధంతో త్రివిక్రమ్, సౌజన్య ఒకటయ్యారు. ప్రస్తుతం వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. త్రివిక్రమ్ భార్య సౌజన్య మంచి క్లాసికల్ డ్యాన్సర్. పలు వేదికలపై ఆమె డ్యాన్స్ షోలు కూడా చేశారు.

ఇక సునీల్ తో త్రివిక్రమ్ కి ప్రత్యేకమైన అనుబంధం ఉంది. వీరి ఇద్దరి స్నేహం కాలేజ్ సమయంలో మొదలయ్యింది. సునీల్, త్రివిక్రమ్ కలిసి హైదరాబాద్ లో రూమ్ తీసుకొని సినిమాల్లో ఛాన్సుల కోసం తిరిగేవారు. ఇక త్రివిక్రమ్ కి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో కూడా మంచి స్నేహం ఉంది.

అవార్డ్స్

త్రివిక్రమ్ కి బెస్ట్ డైలాగ్ రైటర్ గా చిరునవ్వుతో, నువ్వు నాకు నచ్చావ్, నువ్వే నువ్వే, మల్లీశ్వరి, అతడు, అత్తారింటికి దారేది సినిమాలకి నంది అవార్డ్స్ వచ్చాయి.

అలాగే ఉత్తమ దర్శకుడిగా అతడు, అత్తారింటికి దారేది సినిమాలకి ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ లభించాయి.

- Advertisement -

You've successfully subscribed to Tollywood Latest News | Celebrities Profiles | Media9 Tollywood
Great! Next, complete checkout to get full access to all premium content.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.