దర్శక ధీరుడు ‘రాజమౌళి’

ఒకప్పుడు తెలుగు సినిమాలంటే తక్కువగా చూసే చాలామందికి దర్శకధీరుడు రాజమౌళి తన సినిమాలతో గుణపాఠం చెప్పారు. ఆయన ఒక్కొక సినిమాతో ఒక్కక్క మెట్టు ఎక్కుతూ ఆయన రేంజ్ ని అలాగే తెలుగు సినిమా రేంజ్ ని పెంచుకుంటూ వెళ్తున్నారు. ప్రస్తుతం ఆయన సినిమాలంటే నిర్మాతలు ఎంత ఖర్చు అయినా కూడా వెనకడటంలేదు. తన మొత్తం కెరీర్ లో ఒక్క ఫ్లాప్ కూడా లేని దర్శకుడిగా రాజమౌళి నిలిచిపోయారు. ఇప్పుడు రాజమౌళి సినిమా అంటే మన దేశమే కాకుండా ప్రపంచం మొత్తం ఎదురుచూస్తుంది.

జననం

1973 అక్టోబర్ 10న తెలుగు కథ రచయిత కె.వి. విజయేంద్ర ప్రసాద్, నందిని గారికి రాజమౌళి జన్మించారు. రాజమౌళి అసలు పేరు కోడూరి శ్రీశైల శ్రీ రాజమౌళి. ఆయన తన చదువుని ఏలూరులో పూర్తి చేశారు. దర్శకుడు కాకముందు పలు టీ.వీ సీరియల్స్‌ కు దర్శకుడిగా పనిచేసారు రాజమౌళి. ఇక ఆయన కెరీర్ తొలినాళ్లలో దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు వద్ద పలు సీరియల్స్‌‌ తో పాటు  సినిమాలకు అసిస్టెంట్ గా పనిచేసిన రాజమౌళి...ఆయన వద్దే దర్శకత్వంలో ఎన్నో మెళకువలు నేర్చుకున్నాడు. ఆయన మొదట డైరెక్ట్ చేసిన సీరియల్ శాంతి నివాసం.

సినీ ప్రయాణం

ప్రముఖ దర్శకుడు కె రాఘవేంద్రరావు నిర్మాణ పర్యవేక్షణలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా తీసిన స్టూడెంట్ నెంబర్.1తో దర్శకుడిగా మారాడు.  తొలి సినిమాతోనే తనేంటో ప్రూవ్ చేసుకున్నాడు.  కొన్ని అనుకోని పరిస్థితులమూలంగా జైలు పాలైన హీరో లాయరైన తరువాత ఒక తప్పుడు కేసులో చిక్కుకున్న తన తండ్రిని ఎలా విడిపించడన్నదే ఈ సినిమా కథ. స్టూడెంట్ నం. 1 సినిమా ప్రి రిలీజ్ బిసినెస్  2.75 కోట్లకు అవ్వగా ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 12 కోట్ల రూపాయలు వసూలు చేసింది. జూనియర్ ఎన్.టి.ఆర్ తన కెరీర్ లో సాధించిన మొదటి విజయం ఇదే. ఈ సినిమా 73 కేంద్రాల్లో 50 రోజులకు ప్రదర్శింపబడింది.ఈ సినిమా 42 కేంద్రాల్లో 100 రోజులకు ప్రదర్శింపబడింది. ఈ సినిమాని అదే పేరుతో తమిళంలో రీమేక్ చేసారు. ఇందులో నటుడు సత్యరాజ్ తనయుడు శిబిరాజ్ హీరోగా నటించారు. మాటే త లవ్ హేలరే పేరుతో ఒరియాలో అనుభవ మెహంతి హీరోగా రీమేక్ చేసారు. ఈ సినిమా నిర్మాతలకు మంచి లాభాలు తెచ్చి పెట్టింది.

ఇక ‘స్టూడెంట్ నెం. 1’ తర్వాత రాజమౌళి, ఎన్టీఆర్ కాంబినేషన్‌లో వచ్చిన రెండో చిత్రం ‘సింహాద్రి’. ఈ చిత్రం అప్పటి వరకు ఉన్న ఎన్నో రికార్డులను తిరగ రాసింది. ఈ సినిమా సాధించిన రికార్డ్స్ చాలానే ఉన్నాయి. ముందుగా రాజమౌళి ‘సింహాద్రి’ సినిమాను బాలకృష్ణతో చేయాలనుకున్నారు. కానీ ఎందుకో అది వర్కౌట్ కాలేదు. దాంతో తన మొదటి హీరో ఎన్టీఆర్‌ తోనే ఈ సినిమాని తెరకెక్కించాడు రాజమౌళి. ఎన్టీఆర్ హీరోగా నటించిన ఏడో చిత్రం ‘సింహాద్రి’. ఈ చిత్రంలో తారక్ సరసన భూమిక, అంకిత హీరోయిన్స్‌గా నటించారు. ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ అవ్వడమే కాకుండా 191 కేంద్రాల్లో 50 రోజులు ఆడింది. అలాగే 154 కేంద్రాల్లో 100 రోజులు ఆడింది సింహాద్రి. 55 కేంద్రాల్లో ఈ సినిమా 175 రోజులు పైగా నడిచి సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. ఇప్పటి వరకూ ఈ రికార్డును ఏ సినిమా బ్రేక్ చేయలేకపోయింది. ఈ చిత్రానికి ఎం.ఎం.కీరవాణి అందించిన సంగీతం పెద్ద హైలైట్. ఈ చిత్రంలో ఎన్టీఆర్‌ చేతిలోని గొడ్డలిని రాజమౌళి స్పెషల్‌గా డిజైన్ చేయించాడు.

సింహాద్రి తర్వాత రాజమౌళి నితిన్ హీరోగా ‘సై’ సినిమాను తెరకెక్కించాడు. ఈ సినిమా బాక్సాఫీసు దగ్గర మంచి విజయాన్నే నమోదు చేసింది. ఆయన ఈ సినిమాను మన సౌత్ లో ఎక్కువగా పరిచయం లేని రబ్బీ అనే ఆట మీద తెరక్కించారు. సై సినిమా క్లైమాక్స్ కూడా సినిమాకి పెద్ద హైలైట్. ఈ సినిమాలో విలన్ గా నటించిన ప్రదీప్ రావత్ కి ఈ సినిమా తర్వాత అవకాశాలు వెల్లువెత్తాయి. ఈ చిత్రంతో నితిన్ యువతలో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకున్నారు.

ఇక రాజమౌళి తీసిన ‘ఛత్రపతి’ బాక్సాఫీసు వద్ద బంపర్ హిట్ గా నిలిచింది. ‘ఛత్రపతి’ సక్సెస్ తో ప్రభాస్ కు మాస్ లో విపరీతమైన ఫాలోయింగ్ వచ్చింది. ఈ సినిమా ప్రభాస్ కెరీర్ లోనే బిగ్ హిట్ గా నిలిచి అతని ఇమేజ్ అమాంతం పెరిగేలా చేసింది. ఛత్రపతి సినిమా అప్పట్లో ఓ సంచలనం. రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమాకు బ్రహ్మరథం పట్టారు ఆడియన్స్. ముఖ్యంగా ఛత్రపతి ఫస్టాఫ్ లో వచ్చే ఇంట్రవెల్ సీన్స్ ఈ సినిమాకి పెద్ద హైలెట్. ఈ సినిమా అప్పట్లో 27 కోట్ల వరకు వసూలు చేసింది. ఆడి బాడీ బాక్సాఫీస్ అంటూ సినిమాలో చెప్పిన డైలాగ్ అక్షరాలా నిజమైంది. అప్పట్లో ఈ సినిమా కోసం చేసిన ప్రమోషన్ కూడా కొత్తగా అనిపించింది. ప్రభాస్, రాజమౌళి టీమ్స్ సపరేట్‌గా విడిపోయి క్రికెట్ మ్యాచ్ ఆడారు. దానికి సంబంధించిన వీడియోలు ఇప్పటికీ యూట్యూబ్ లో ఉన్నాయి. ఇక ఇంటర్వెల్‌లో “అప్పల్నాయుడు.. దాదాగిరికి వచ్చినా దౌర్జన్యానికొచ్చినా, గూండాయిజానికొచ్చినా గ్రూపులు కట్టడానికొచ్చినా, రాజకీయంతో వచ్చిన రౌడీయిజంతో వచ్చినా... పోటుకో శవం లెక్కన పోర్టుకు బలువుతాయి తీరంలో కెరటాలు ఎరుపు రంగు పూసుకుని పోటెత్తుతాయ్” అంటూ ప్రభాస్ చెప్పిన డైలాగ్ ఇప్పటికీ సంచలనమే. 30 సెప్టెంబర్‌ 2005లో విడుదలైన ఛత్రపతి ప్రభాస్‌కు మాస్ హీరోగా తిరుగులేని ఫాలోయింగ్ సంపాదించింది. హీరోయిజం ఎలివేషన్ సీన్స్‌ లో అప్పటి వరకు ఉన్న ఫార్ములాని మించి రాజమౌళి ప్రయోగం చేశారు. ఛత్రపతిగా ప్రభాస్ తిరగబడే సీన్ తెలుగు సినిమా చరిత్రలోనే వన్ ఆఫ్ ది బెస్ట్ సీన్ అని చెప్పొచ్చు. అన్నింటికి మించి అమ్మ సెంటిమెంట్ కూడా ఛత్రపతి సినిమాకు బాగా హెల్ప్ అయింది. అలాగే కీరవాణి సంగీతం సినిమాకు అస్సెట్. వేణు మాధవ్ కామెడీ కూడా సినిమాలో బాగా పండింది.

రాజమౌళి రూపొందించిన ఐదవ చిత్రం ‘విక్రమార్కుడు’. అప్పటి వరకు రొటీన్ మాస్ హీరోగా కనిపించిన రవితేజను ఈ సినిమాలో సరికొత్తగా ప్రెజెంట్ చేసి విజయాన్ని అందుకున్నాడు రాజమౌళి. రవితేజ బాడీలాంగ్వేజ్‌కు భిన్నంగా ఆయనలోని సీరియస్ నటున్ని ఆడియన్స్ కు పరిచయం చేసిన ఘనత కూడా రాజమౌళికే దక్కుతుంది. మాస్ మహారాజ్ రవితేజ కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన సినిమాల్లో విక్రమార్కుడు సినిమా కూడా ఒకటి. ఈ కమర్షియల్ మాస్ మూవీ అటు ఆడియన్స్ ని అలరించే సత్తిబాబు కామెడీ తో పాటు మాస్ కి కావాల్సిన అన్ని అంశాలు ఇందులో ఉన్నాయి. విక్రమ్ రాథోడ్ పాత్రలో రవితేజ తన మార్క్ చూపించారు. ముఖ్యంగా “పోలిసోడే కాదు ఒంటి మీద యూనిఫార్మ్ కూడా డ్యూటి చేస్తది” అనే డైలాగ్, ఆ సీన్ చిత్రానికి ప్లస్ పాయింట్. ఈ సినిమా విడుదలైన మొదటిరోజు నుంచి బ్లాక్ బస్టర్ టాక్ తో దాదాపుగా 19 కోట్ల షేర్ సాధించింది.

విక్రమార్కుడు లాంటి భారీ బ్లాక్ బస్టర్ తర్వాత వచ్చిన సినిమా యమదొంగ. రాజమౌళి చాలా లావుగా కనిపించే ఎన్టీఆర్‌ను ఈ సినిమాతో సన్నబడేలా చేసాడు. అంతే కాకుండా తారక్‌ను తెరపై సరికొత్తగా ప్రెజెంట్ చేయడంలో సక్సెస్ సాధించాడు రాజమౌళి. జూనియర్ ఎన్టీఆర్‌, ప్రియ‌మ‌ణి జంట‌గా న‌టించిన య‌మ‌దొంగ‌ సినిమా ఆగష్టు 15వ తేదీన రిలీజయ్యింది. ఎస్‌.ఎస్‌. రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వం వచించిన ఈ సినిమా అప్పట్లో రికార్డులు సృష్టించింది. సోషియో ఫాంటసీ సబ్జెక్ట్ గా తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫిస్ వ‌ద్ద రికార్డులు సృష్టించి 30.1 కోట్ల షేర్‌ను ద‌క్కించుకుంది. యమదొంగ సినిమాలో ఎన్టీఆర్ మరీ ఒక్కసారిగా బక్కచిక్కిపోయి కనిపించాడు. అప్పట్లో యమదొంగ కథ చెప్పడానికి వెళ్ళిన రాజమౌళి, ఇలా చూడలేకపోతున్నామండీ. ఇంత లావుగా ఉంటే అమ్మాయిలు థియేటర్లకి రారన్నాడట, దాంతో లైపోసెక్షన్ చేయించుకుని మరీ బరువు తగ్గాడు జూనియర్ ఎన్టీఆర్.

ఇక దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి, మెగాపవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ కాంబినేషన్‌లో రికార్డు తిరగరాసిన చిత్రం మగధీర. గీతా ఆర్ట్స్‌ నిర్మాణంలో అల్లు అరవింద్‌, బీ.వీ.ఎస్‌.ఎన్‌ ప్రసాద్‌ నిర్మాతలుగా భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించడమే కాకుండా తెలుగు సినిమా సత్తాను చాటింది. రామ్‌చరణ్‌తో పాటు ఈ చిత్రంలో నటించిన కాజల్‌ అగర్వాల్‌, శ్రీహరి, దేవ్‌ గిల్‌, రావు రమేష్‌ లు తమ నటనతో మెప్పించారు. ముఖ్యంగా రామ్‌చరణ్‌ హార్స్‌ రైడింగ్‌, కాజల్‌ గ్లామర్‌, శ్రీహరి-రామ్‌చరణ్‌ మధ్య డైలాగ్‌ వార్‌ ఈ చిత్రంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. రాజమౌళి రూపొందించిన ఏడవ చిత్రం ‘మగధీర’. ఈ సినిమా తెలుగు సినిమా ఇండస్ట్రీలో అప్పటి వరకు ఉన్న అన్ని రికార్డులను  క్రాస్ చేయగలిగింది. ‘మగధీర’ విజయంతో మెగా పవర్ స్టార్‌గా రామ్ చరణ్ ఇమేజ్ అమాంతం పెరగడంలో దర్శకుడిగా రాజమౌళి కృషి ఎంతో దాగి ఉంది. 2009 జులై 31 మ‌గ‌ధీర సినిమా విడుద‌లైంది. ఈ సినిమాకు 40 కోట్లు బ‌డ్జెట్ అప్పట్లో టాక్ ఆఫ్ ది టౌన్ అయింది. అప్ప‌టి వ‌ర‌కూ వ‌చ్చిన ఆరు సినిమాలు ఒకెత్తైతే ఏడో అద్భుతంగా మ‌గ‌ధీర‌ను సృష్టించాడు రాజ‌మౌళి. ఈ చిత్రం 2009లోనే 80 కోట్ల‌కు పైగా షేర్ వ‌సూలు చేసి రాజ‌మౌళి రేంజ్ ఏంటో చూపించింది. తెలుగు సినిమా రేంజ్ కూడా మగధీర మార్చేసింది. అప్పటికి ఇండస్ట్రీలో ఉన్న ప్రతీ రికార్డును త‌న పేర రాసుకుంది మ‌గ‌ధీర. రామ్ చ‌ర‌ణ్ రెండో సినిమాతోనే స్టార్ అయిపోయాడు. ఇప్ప‌టికీ మ‌గ‌ధీర సృష్టించిన కొన్ని రికార్డులు అలాగే ప‌దిలంగా ఉన్నాయి. అప్ప‌ట్లో ఉన్న త‌క్కువ టికెట్ రేట్ల‌తోనే ఈ సినిమా ఇంత కలెక్ట్ చేయడం నిజంగానే అద్భుతం. 223 కేంద్రాల‌లో 100 రోజ‌లు, 299 కేంద్రాల‌లో 50 రోజులు పూర్తి చేసుకుంది ఈ చిత్రం. రామ్ చరణ్ కేరీర్ లోనే కాదు మగధీర తెలుగు సినిమా చరిత్రలో కూడా ప్రత్యేక స్థానం సంపాదించుకుంది.

ఇక మగధీర సినిమా తర్వాత రాజమౌళి రేంజ్ మారిపోయింది అనుకున్న వాళ్ళని ఆశ్చర్యపరిచింది ఆయన తర్వాత సినిమా. రాజమౌళి శైలికి పూర్తి భిన్నంగా తీసిన ‘మర్యాద రామన్న’ సినిమా కూడా నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది. ఈ సినిమాతో తాను పెద్ద హీరోలతోనే కాదు ఎవరితోనైనా హిట్ కొట్టగలనని నిరూపించుకున్నాడు. ఇక రాజమౌళి తెరకెక్కించిన చాలా చిత్రాలు వివిధ భాషల్లో రీమేక్ కావడం విశేషం. మగధీర వంటి ఇండస్ట్రీ హిట్ తీసిన తరువాత రాజమౌళితో అవకాశం కోసం ఎందరో పెద్ద హీరోలు ఎదురుచూశారు. అభిమానులు కూడా రాజమౌళి తరువాతి సినిమాలో మన హీరోనే ఉంటాడు అన్నట్టుగా భావించారు. అందరి అంచనాలు తలకిందులు చేస్తూ రాజమౌళి మళ్ళీ సూపర్ హిట్ ఇచ్చారు. అయితే, అందులో హీరో మాత్రం అప్పటివరకూ తెలుగు తెరపై తన నటనతో నవ్వులు పూయిస్తున్న సునీల్. 1923లో విడుదలైన ఆంగ్ల మూకీ చిత్రం 'అవర్ హాస్పిటాల్టీ' చిత్రకథ నుంచి ప్రేరణ పొందిన రాజమౌళి దానిని 'మర్యాద రామన్న'గా తనదైన శైలిలో తెరకెక్కించారు. ఈ సినిమాకి మొత్తం నాలుగు నంది అవార్డులు వచ్చాయి. ఇక ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ₹ 30.58 కోట్లను వసూలు చేసింది. అంతేకాకుండా 2010 సంవత్సరంలో అత్యధిక వసూళ్లు చేసిన టాప్ టెన్ మూవీస్ లో మర్యాద రామన్న ఒకటి అలాగే ఇందులో సునీల్ వాడే సైకిల్ కి రవితేజ చేత డబ్బింగ్ చెప్పించి రాజమౌళి నవ్వులు కురిపించారు.

రాజమౌళి సినిమాలు ఒక సినిమాతో ఒకటి అస్సలు పొంతన ఉండదు. ప్రతి సినిమాతో తనలోని క్రియేటర్ ని బయట పెడుతూ ఉంటాడు. ఇండియాలో ఎవరు టచ్ చేయని కాన్సెప్ట్ ని పట్టుకొని దాదాపుగా 20 కోట్ల బడ్జెట్ తో తీసిన సినిమా ‘ఈగ’. ఒక ఈగని హీరో గా పెట్టి దానితో సాహసాలు చేయించడం అంటే మాములు విషయమా.. ఈ సినిమాలో నాని ఒక చిన్న పాత్రలో నటించారు. నాని పాత్ర చిన్నది అయినప్పటికీ సినిమా అంత ఆయన అల్లరి మనకు కనిపిస్తుంది. గ్రాఫిక్స్ ప్రధానంగా తెరకెక్కిన ఈ సినిమాతో టాలీవుడ్ లోనే కాక భారత దేశం మొత్తాన్ని తనవైపు చూసేలా చేసాడు రాజమౌళి. ఈ సినిమాలో సమంత హీరోయిన్ గా నటించగా, కన్నడ స్టార్ హీరో కిచ్చ సుదీప్ ప్రతినాయకుడి పాత్రలో నటించారు. ఆర్కా సురేష్ ప్రొడక్షన్స్ ఈ సినిమాని నిర్మించింది. ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇదొక అద్భుతమైన ప్రయోగం.

ఇక టాలీవుడ్ సినిమా స్థాయిని పెంచిన సినిమా ‘బాహుబలి’ అనడంలో ఎలాంటి సందేహం అక్కరలేదు. నిజం చెప్పాలంటే తెలుగు ఇండస్ట్రీ అంటే బాహుబలి ముందు బాహుబలి తరవాత అని చెప్పుకోవచ్చు. టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా రెండు భాగాలుగా వచ్చిన సంగతి తెలిసిందే.. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమాలో ప్రభాస్, రానా దగ్గుబాటి, అనుష్క, తమన్నా, రమ్యకృష్ణ, సత్యరాజ్, నాజర్ లు కీలక పాత్రలు పోషించారు. జానపద కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమాలో నటించిన నటుల పాత్రల‌తో కూడిన పోస్టర్స్ ను ఒక్కొక్కటిగా రిలీజ్ చేస్తూ సినిమాపై భారీ అంచ‌నాలు పెంచాడు రాజ‌మౌళి.. ఈ సినిమాలోని ప్రతి ఫ్రేంని హాలీవుడ్ తరహాలో తెరకెక్కించాడు రాజమౌళి.. ఇక సినిమా క్లైమాక్స్ లో అయితే కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అన్న ప్రశ్నను అందరిలో మదిలో ఉంచుతూ రెండో పార్ట్ కోసం అందరిని ఎదురు చూసేలా చేశాడు రాజమౌళి. 2013 జులై 6న బాహుబలి షూటింగ్ చాలా గ్రాండ్ గా మొదలైంది. ఈ సినిమా కోసం తమిళ రచయిత మదన్ కార్కి ‘కిలికిలి’ అనే పేరుతో ఓ కొత్త భాషను రూపొందించారు. ఒక సినిమా కోసం ఓ భాషను రూపొందించడం భారతదేశంలో ఇదే మొదటిసారి కావడం మరో విశేషం.

శివగామి పాత్ర కోసం ముందుగా శ్రీదేవితో సంప్రదింపులు జరిపారు. కానీ శ్రీదేవి అధిక పారితోషికం కోరడంతో ఆ పాత్ర రమ్యకృష్ణకు దక్కింది. ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు ఏడాది పాటు జరిగాయి. 15,000 స్టొరీ బోర్డు స్కెచ్చులు రూపొందించారు. ఓ భారతీయ సినిమాకు ఇంతటి ప్రీ ప్రొడక్షన్ పనులు చేయడం ఈ సినిమాకే మొదటిసారి. ఈ సినిమాలోని తమ పాత్రలకు అనుగుణంగా ప్రభాస్, అనుష్క, రానాలు కత్తిసాము, కర్రసాము, గుర్రపుస్వారీలు లాంటి మొదలగు యుద్ధ విద్యలు నేర్చుకోవడం జరిగింది. మొత్తం 15 విభాగాలలో ఈ సినిమాకి నంది అవార్డులు లభించాయి. ఈ సినిమా మొదటి పార్ట్ ని 2015 జులై 10న విడుదల చేయగా , సినిమాకి భారీ రెస్పాన్స్ వచ్చింది. బాక్స్ ఆఫీస్ వద్ద సినిమా కలెక్షన్ల వర్షం కురిపించింది. దాదాపుగా ఫస్ట్ పార్ట్ 600 కోట్లను కొల్లగొట్టింది. ఈ సినిమాకి రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ కథను అందించగా, రాజమౌళి సోదరుడు ఎం.ఎం.కీరవాణి సంగీతం అందిచాడు.

ఇక 28 ఏప్రిల్ 2017లో విడుదలైన బాహుబలి-2 చిత్రం ఎన్నో సంచలన విజయాలకు వేదికగా నిలిచింది. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడనే ప్రశ్న బాహుబలి-2 పై అంచనాలు పెరిగేలా చేసింది. బాహుబలి-2 సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. తెలుగు సినిమాగా ప్రారంభమైన ఈ చిత్రం ఆ తర్వాత ఇండియన్ సినిమాగా టర్న్ తీసుకొంది. ఈ చిత్రం తెలుగులోనే కాదు.. అప్పటి వరకూ మన దేశంలో ఎక్కువ బాక్సాఫీస్ కలెక్షన్లు వసూళు చేసిన చిత్రంగా రికార్డులకు ఎక్కింది. డిజిటల్ యుగంలో మన దేశంలోనే ఎక్కువ మంది ప్రేక్షకులు చూసిన చిత్రంగా బాహుబలి-2 రికార్డులకు ఎక్కింది. మొత్తంగా మాములు మహాభారత కథను పోలిని బాహుబలి 2 అనేది ఇండియన్ సినిమాలో ఒక ఎపిక్‌గా మిగిలిపోయింది. ‘బాహుబలి 2’ సినిమా మొత్తంగా ప్రపంచ వ్యాప్తంగా రూ. 1,800 కోట్ల వరకు కలెక్ట్ చేసింది. హిందీ వెర్షన్ మాత్రమే రూ. 800 కోట్ల వరకు కలెక్ట్ చేయడం విశేషం. మన దేశంలో హిందీ వెర్షన్‌లో రూ. 500 కోట్ల వరకు కలెక్ట్ చేయడం విశేషం. ‘బాహుబలి 2’ తెలుగు రాష్ట్రాల్లో రూ. 200 కోట్ల షేర్ వసూళు చేసింది. ఇటు ఓవర్సీస్‌లో కూడా తెలుగు వెర్షన్ దాదాపు రూ. 100 కోట్ల వరకు కలెక్ట్ చేయడం విశేషం. తమిళ్ వెర్షన్ 150 కోట్ల వరకూ వసూల్ చేసింది. బాహుబలి సిరీస్‌తో హీరోగా ప్రభాస్ క్రేజ్ దేశ వ్యాప్తంగా పెరిగింది.

బాహుబలి లాంటి సంచలనం తర్వాత రాజమౌళి ఇంకొక సంచలనానికి తెర తీశారు. తెలుగులో టాప్ హీరోస్ అయిన ఎన్టీఆర్, రామ్ చరణ్ ని కలిపి ఆర్.ఆర్.ఆర్ అనే సినిమాని మొదలుపెట్టారు. అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్ స్వతంత్రం ముందు కలిసి ఉంటే ఎలా ఉంటుందో అనే కథతో వస్తున్న ఈ ఆర్.ఆర్.ఆర్ సినిమా హిస్టారికల్ ఫిక్షన్ గా తెరకెక్కుతోంది. 300 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మితమవుతున్న ఈ సినిమా మీద అంచనాలు మాములుగా లేవు. ఈ సినిమాలో ప్రత్యేక పాత్రల్లో బాలీవుడ్ టాప్ హీరో అజయ్ దేవగన్, శ్రియ, తమిళ నటుడు సముద్రఖని మరియు హాలీవుడ్ నటులు కూడా నటిస్తున్నారు. ఇక ఈ సినిమాతో రాజమౌళి ఇంకెన్ని సంచలనలు సృష్టిస్తాడో వేచి చూడాలి.

ఇక రాజమౌళి నిర్మాతగా కూడా అందాల రాక్షసి సినిమాలో ఒక భాగం అయ్యారు. ఈ సినిమా యావరేజ్ గా నిలిచింది. అలాగే స్టంట్ మాస్టర్ గా తన నాన్న గారు విజయేంద్ర ప్రసాద్ డైరెక్షన్ లో వచ్చిన రాజన్న సినిమా కోసం పని చేసారు. రాజమౌళిలో నటుడు కూడా ఉన్నాడు. ఆయన సై, రైన్ బో, బాహుబలి-1, మజ్ను లాంటి సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు వేశారు.

వ్యక్తిగత జీవితం

రాజమౌళి 2001 లో రమ గారిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఆమె రాజమౌళి అన్ని సినిమాల్లో కాస్ట్యూమ్స్ డిజైనర్ గా పని చేసింది. రమ రాజమౌళి మొదటి భర్త కొడుకు కార్తికేయని రాజమౌళి తన సొంత కొడుకుగా పెంచుకున్నారు. అలాగే వీరు తమ కూతురు మయూఖని దత్తత తీసుకున్నారు. రాజమౌళి పెద్దన్న ప్రముఖ సంగీత దర్శకుడు ఎమ్.ఎమ్ కీరవాణి గారు ఆయన అన్ని సినిమాలకి సంగీతం అందించారు. అలాగే రాజమౌళికి కళ్యణ్ కోడూరి కూడా అన్నయ్య వరస అవుతారు.

రాజమౌళి సినిమాల్లో వారి కుటుంబసభ్యులు వివిధ శాఖల్లో పనిచేస్తుంటారు. తన తండ్రి కథ, అన్న సంగీతం, భార్య కాస్ట్యూమ్స్ ఇలా ఆయన సినిమాల్లో ముఖ్యమైన వాటిలో కుటుంబసభ్యుల సహాయం తీసుకుంటుంటారు.

ఇక రాజమౌళికి ఆయన చేసిన అందరి హీరోస్ తో మంచి చనువు ఉంది. ముఖ్యంగా ఆయనకి జూనియర్ ఎన్టీఆర్ తో ప్రత్యేక అనుబంధం. అందుకేనేమో ఆయన ఇప్పటికి ఎన్టీఆర్ తో మూడు సినిమాలు చేశారు. వీరి కాంబినేషన్ లో వస్తున్న నాలుగో సినిమా ఆర్.ఆర్.ఆర్. అలాగే ఎనర్జిటిక్ హీరో రవితేజ, ప్రభాస్, రామ్ చరణ్ లాంటి స్టార్ హీరోస్ తో కూడా రాజమౌళికి మంచి సాన్నిహిత్యం ఉంది.

అవార్డ్స్

  1. రాజమౌళి కి మగధీర, ఈగ బాహుబలి సినిమాలకి బెస్ట్ డైరెక్టర్ గా ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ మరియు నంది అవార్డ్స్ వచ్చాయి.
  2. ఆయన డైరెక్ట్ చేసిన ఈగ సినిమా బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ తెలుగు గా నేషనల్ అవార్డ్ వచ్చింది.
  3. అలాగే బాహుబలి బిగినింగ్ సినిమాకి బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ గా నేషనల్ అవార్డ్ వచ్చింది. బాహుబలి 2 కి పాపులర్ సినిమాగా నేషనల్ అవార్డ్స్ రావడం విశేషం.
  4. కేంద్ర ప్రభుత్వం నుంచి పద్మశ్రీ పురస్కారాన్ని కూడా అందుకున్నారు రాజమౌళి .
- Advertisement -

You've successfully subscribed to Tollywood Latest News | Celebrities Profiles | Media9 Tollywood
Great! Next, complete checkout to get full access to all premium content.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.