డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్

పూరి జగన్నాథ్ కి సినిమాలంటే పిచ్చి. పూరి తీసిన నేనింతే సినిమా చూస్తే ఆయనికి సినిమా అంటే ఎంత ఇష్టమో అర్థం అవుతుంది. ముఖ్యంగా ఆయన సినిమాల్లో హీరో క్యారెక్టర్స్ చాలా కొత్తగా ఉంటాయి. ఆయన ఇంటర్వ్యూలలో కూడా దేని గురించైనా ధైర్యంగా ఉన్నది ఉన్నట్లు మాట్లాడగలడు. సినిమాల్లో ఎన్ని నష్టాలు వచ్చిన కూడా మళ్లీ వెంటనే కోలుకుని సినిమాలు తీస్తారు. ఆయనలోని ఈ స్వభావామే అందరూ ఆయన్ని అభిమానించేలా చేస్తుంది.

జననం

పూరి జగన్నాథ్ 1966, సెప్టెంబర్ 28 న తూర్పు గోదావరి జిల్లాలోని పిఠాపురంలో జన్మించారు. ఆయన జన్మించిన కొన్నాళ్ళకి వారి కుటుంబం తమ స్వగ్రామమైన కొత్తపల్లెకి తమ నివాసాన్ని మార్చారు. ఆ ఊర్లో పూరి జగన్నాథ్ ఫ్యామిలీకి పూరి టాకీస్ అనే థియేటర్ ఉండేది. అందులో పూరి జగన్నాథ్ రోజు సినిమాలు చూసేవారు. ఆయన చిన్నప్పటి నుంచి చదవుకునే పుస్తకల కన్నా కథల పుస్తకాల మీదే ఎక్కువ ఆసక్తి ఉండేది. ఇలానే డిగ్రీ వరకూ తన చదువుని తీసుకురాగలిగాడు కానీ డిగ్రీ పూర్తి చేయలేకపోయాడు. కథల పుస్తకాలు ఎక్కువగా చదవుతుండడం వల్ల చిన్నప్పటి నుంచే కథలు బాగా రాసేవారు. వాళ్ళ ఊరిలో ఒకసారి ఒక నాటకాన్ని పూరి డైరెక్ట్ చేసి అక్కడ ఉన్న అందరినీ మెప్పించారు. అది చూసి ఆయన తండ్రి సింహాచలం గారు 20 వేలు డబ్బులు ఇచ్చి హైదరాబాద్ కి పంపించారు. ఆయన హైదరాబాద్ వచ్చి డైరెక్షన్ కోర్స్ నేర్చుకున్నారు. ఆ తర్వాత పూరి అసిస్టెంట్ డైరెక్టర్ గా ఛాన్సుల కోసం తెరిగేవారు. ఆ టైంలో మురళి మోహన్ దగ్గరికి వెళ్తే ఆయన ఒక సలహా ఇచ్చారట. అదేంటి అంటే ఇప్పటికే దర్శకులు అయిన వారి దగ్గర ప్రయత్నం చేయడం కంటే అసిస్టెంట్ డైరెక్టర్స్ తో స్నేహం చేయమని సలహా ఇచ్చారు. పూరి వెంటనే అప్పటికే అసిస్టెంట్ డైరెక్టర్ గా ఉన్న కృష్ణవంశీతో స్నేహం చేయడం మొదలుపెట్టారు. దానితో ఆయనకి రామ్ గోపాల్ వర్మ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా ఛాన్స్ వచ్చింది.

సినీ ప్రయాణం

సహాయ దర్శకుడిగా రాంగోపాల్‌ వర్మ దగ్గర కొన్ని సంవత్సరాలు పనిచేసి పూరి జగన్నాథ్‌ సొంతంగా ఒక కథను తయారు చేసుకున్నారు. పవన్‌ కల్యాణ్‌తో సినిమా చేద్దామని ఆయన మేనేజర్‌ చుట్టూ తిరగడం మొదలు పెట్టారు. అయినా ఫలితం దక్కలేదు. దీంతో గతంలో దూరదర్శన్‌ ద్వారా పరిచయం ఉన్న శ్యామ్‌ కె.నాయుడిని కలిసి “పవన్‌కు కథ చెప్పే అవకాశం ఇప్పించండి” అని కోరారు. శ్యామ్ ఈ విషయాన్ని ఛోటా కె.నాయుడుకి చెప్పారు. అప్పటికే ఛోటాకు పవన్‌ మంచి స్నేహితుడు. దీంతో పూరి వెళ్లి ఛోటాను కలిస్తే “పవన్‌కు మంచి కథ చెప్పకపోతే నా పరువు పోతుంది. ముందు ఆ కథ నాకు చెప్పు” అని ఛోటా అనడంతో తన దగ్గర ఉన్న ‘ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం’ కథ చెప్పారు పూరి. అది ఛోటాకు నచ్చడంతో ఇదే కథ చిన్న పాయింట్‌గా పవన్‌కు చెప్పి పూరి కలిసేందుకు పవన్‌ను ఒప్పించారు.

కథ చెప్పేందుకు పవన్‌కల్యాణ్‌ నుంచి పూరి జగన్నాథ్‌కు పిలుపు వచ్చింది. అదీ తెల్లవారుజామున 4 గంటలకు రమ్మన్నారు. అంతేకాదు, కేవలం అరగంట సమయం మాత్రమే ఇచ్చారు. తెల్లవారుజామున పవన్‌ ఇంటికి వెళ్లిన పూరి కథ చెప్పడం మొదలు పెట్టారు. అరగంట గడిచిపోయి గంట అయింది. గంట కాస్తా నాలుగు గంటలైంది. పవన్‌ కథ వింటూనే ఉన్నారు. పవన్‌కు చాలా నచ్చింది. కానీ, క్లైమాక్స్‌ మార్చమని సలహా ఇచ్చారు. ‘హమ్మయ్యా.. ఎలాగో కథ అయితే ఒకే అయింది. క్లైమాక్స్‌ సంగతి చూద్దాం’ అంటూ పవన్‌కు ఒకే చెప్పి బయటకు వచ్చేశారు. క్లైమాక్స్‌ మార్చమని పవన్‌ కల్యాణ్‌ సూచించడంతో దానిపై కసరత్తు మొదలుపెట్టారు. ఒకరోజు.. రెండు రోజులు.. అలా వారం అయింది. అయినా క్లైమాక్స్‌ మాత్రం తనకు నచ్చినట్లు రావడంతో లేదు. వారం తర్వాత మళ్లీ వెళ్లి పవన్‌ను కలిశారు. “ఏమైంది క్లైమాక్స్‌ మార్చావా” అని పవన్‌ అడిగారు. “ప్రత్నించాను. కానీ, కొత్త వెర్షన్‌ నాకే నచ్చలేదు” అని పూరి సమాధానం ఇచ్చారు. “నా గురించి నువ్వు క్లైమాక్స్‌ మారుస్తావా? లేదా చూద్దామని అలా అడిగాను. ఇదే బాగుంది” అని పవన్‌ అనడంతో పూరికి ఎక్కడలేని సంతోషం. అప్పుడే పవన్‌ ఓ బాంబు పేల్చారు. “అన్నట్లు ఛోటాకు ఈ కథ కాదు కదా నువ్వు చెప్పింది. ఇప్పుడు నువ్వు చెప్పిన కథ పూర్తి భిన్నంగా ఉంది” అంటూ ప్రశ్నించడంతో  “అవకాశం పోతుందని ఆయనకు ఆ కథ చెప్పా” అని పూరి నిజం చెప్పేశారు.

పవన్ ఒకే అనడంతో సినిమా మొదలైంది. ఈ సినిమాలో పవన్‌, అమీషా పటేల్‌, రేణు దేశాయ్‌, ప్రకాష్‌రాజ్‌... పాత్రలే కీలకం. బద్రిగా పవన్‌ నటన, స్టైల్‌, ఫైట్స్‌ అన్నీ మెప్పిస్తాయి. ముఖ్యంగా ప్రకాష్‌రాజ్‌ తన ఆఫీస్‌కు వచ్చి వార్నింగ్‌ ఇచ్చే సన్నివేశంలో తిరిగి పవన్‌ చెప్పే ‘బద్రి.. బద్రీనాథ్‌’ డైలాగ్‌ ఎవర్‌గ్రీన్‌. ఇక కథానాయికలుగా అమీషా పటేల్‌, రేణుదేశాయ్‌ నటించారు. అమీషా పటేల్‌కు ఇదే తొలి తెలుగు చిత్రం. ఇక చిత్రంతోనే పరిచయమైన రేణు దేశాయ్‌ను ఆ తర్వాత పవన్‌ వివాహం చేసుకున్నారు. తొలి సినిమాతోనే దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు పూరి జగన్నాథ్‌. పవన్‌ను చూపించిన విధానం అభిమానులకు బాగా నచ్చింది. ఆ తర్వాత పూరికి వరుస అవకాశాలు వచ్చాయి.

బద్రి తర్వత వచ్చిందే జగపతి బాబు నటించిన ‘బాచి’. ఈ సినిమా ఇక్కడ ఫ్లాప్ అయింది. కానీ కర్ణాటకలో బాగా ఆడింది. కన్నడ సూపర్ స్టార్ రాజ్‌కుమార్ ఫ్యామిలీలో ఎవరో ఈ సినిమా చూసి, డెరైక్టర్ బాగా తీశాడని ఇంట్లో వాళ్లందరికీ చెప్పాడు అంట. దానితో కన్నడ రాజ్‌కుమార్ పెద్దబ్బాయ్ శివరాజ్‌కుమార్‌తో ‘యువరాజా’ సినిమాని పూరి డైరెక్ట్ చేసే ఛాన్స్ వచ్చింది. అదే టైమ్‌లో ఆయన రవితేజతో తెలుగులో ‘ఇట్లు శ్రావణీ సుబ్రమణ్యం’ చేస్తున్నాడు. విశేషం ఏంటి అంటే కన్నడ యువరాజ, తెలుగులో చేస్తున్న ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం రెండు సూపర్ హిట్ అయ్యాయి.

ఇక పూరికి కన్నడలో ఇంకొక ఆఫర్ కూడా వచ్చింది. కన్నడ రాజ్‌కుమార్ మూడో కొడుకు పునీత్ రాజ్‌కుమార్ ని హీరోగా లాంచ్ చేయాలి. పూరి జగన్నాథ్ కి పునీత్‌ని లాంచ్ చేసే ప్రపోజల్ పెట్టారు. అప్పటికే తన దగ్గర రెడిగా ఉన్న బౌండ్ స్క్రిప్ట్ ని చెప్పాలి అనుకున్నాడు పూరి. కమిషనర్ కూతురితో కానిస్టేబుల్ కొడుకు ప్రేమాయణం. ఈ కథలో హీరో పాత్రకి బీజం విజయవాడలో శ్రీను అనే ఫ్రెండ్ ఉండేవాడు. అతనేం మాట్లాడినా తన పేరు చెప్పుకుని మాట్లాడుతుంటాడు. ఆ రోజు అతని బర్త్‌ డే అనుకోండి. ‘ఈరోజు శ్రీనుగాడి బర్త్‌ డే. మీకు తెలుసా?’ అనడిగేవాడు. దాన్ని బేస్ చేసుకునే పూరి ఈ క్యారెక్టర్ డిజైన్ చేశాడు. కథ చెప్పడానికి పూరి బెంగళూరు వెళ్లాడు. ఓ గదిలో కూర్చోబెట్టారు పూరిని. అక్కడ ఫుల్ క్రౌడ్. ఏదైనా ఫంక్షన్ జరుగుతుందేమోననుకున్నాడు పూరి. కాస్సేపటికి కన్నడ రాజ్‌కుమార్ వచ్చి కూర్చున్నారు. పార్వతమ్మ, శివరాజ్‌కుమార్, పునీత్... అంతా అక్కడే ఉన్నారు. రాజ్‌కుమార్ చేయి పైకెత్తగానే రూమ్‌లో పిన్‌డ్రాప్ సెలైన్స్. ‘‘ఊ... కథ చెప్పండి’’ అన్నారు రాజ్‌కుమార్. పూరి కంగారుగా ‘‘వీళ్లందరూ ఎవరు సార్?’’ అనడిగాడు. ‘‘వీళ్లంతా నా ఫ్యామిలీ మెంబర్స్. కొడుకులూ కూతుళ్లూ అల్లుళ్లూ మనవళ్లూ మనవరాళ్లూ పనివాళ్లూ అందరూ ఉన్నారు. మా పునీత్‌ని లాంచ్ చేసే ప్రాజెక్ట్ మా ఫ్యామిలీకి ప్రెస్టేజ్ ఇష్యూ. అందుకే వీళ్లందరి అభిప్రాయం కావాలి’’ అని చెప్పారాయన. పూరీకి టెన్షన్ స్టార్ట్ అయ్యింది. ప్రపంచ సినీ చరిత్రలోనే ఇంత పెద్ద స్టోరీ సిట్టింగ్ ఎప్పుడూ జరిగి ఉండదనిపించింది. ఒక వ్యక్తికి కాదు... ఓ పెద్ద ఆడిటోరియమ్‌కి కథ చెప్పి ఒప్పించాలి. కథ చెప్పడం స్టార్ట్ చేశాడు. రెండు గంటలు పిన్‌డ్రాప్ సెలైన్స్. కథ పూర్తయింది. ఎవ్వరూ మాట్లాడటం లేదు. ఒకళ్లకొకళ్లు సైగలు మాత్రం చేసుకుంటున్నారు. కాస్సేపటికి రాజ్‌కుమార్ లేచి పూరీని హగ్ చేసుకుని, ‘‘వెరీగుడ్... చాలా బాగుంది... మా పునీత్‌ని మీరే హీరోగా లాంచ్ చేయాలి’’ అన్నారు. అప్పుడు పూరి రిలాక్స్ అయ్యాడు. దీన్ని రవితేజతో తెలుగులో చేద్దామని పూరి అప్పటికే ప్రిపేర్ అయ్యాడు. కానీ పునీత్ కోసం ముందే చేసేయాల్సి వచ్చింది. పునీత్ హీరోగా ‘అప్పు’ స్టార్ట్ అయ్యింది. ఇంకోపక్క తెలుగులో చేయడానికి కూడా ఏర్పాట్లు షురూ. ‘ఇట్లు శ్రావణీ సుబ్రమణ్యం’ హిట్ కావడంతో ప్రొడ్యూసర్లు చాలామంది వస్తున్నారు. కానీ పూరీకి మాత్రం సొంతంగా చేసుకోవాలనిపించింది. ‘వైష్ణో అకాడమీ’ పేరుతో బ్యానర్ స్టార్ట్ చేశాడు. పొలిటీషియన్ చింతకాయల అయ్యన్నపాత్రుడు ఈ ప్రాజెక్టులో పార్ట్‌నర్. సీహెచ్ పద్మావతి అని ఆయన శ్రీమతి పేరుంటుంది. ఆయన తరఫున ప్రొడక్షన్ అంతా ఎం.ఎల్.కుమార్ చౌదరి చూసుకుంటాడు. కన్నడంలో ‘అప్పు’ సూపర్‌హిట్ అయింది. రాజ్‌కుమార్ ఖుష్ అయిపోయారు. ‘‘నువ్వు నాకు నాలుగో కొడుకువయ్యా అయామ్ ప్రౌడ్ ఆఫ్ యూ’’ అని పూరీని మెచ్చుకున్నారు. హండ్రెడ్ డేస్ ఫంక్షన్‌ని బెంగళూరులో చాలా గ్రాండ్‌గా చేశారు. సూపర్‌స్టార్ రజనీకాంత్ ఫస్ట్ టైమ్ పాల్గొన్న కన్నడ సినిమా హండ్రెడ్ డేస్ ఫంక్షన్ అదే. సినిమా చూసి పూరీకి హ్యాట్సాఫ్ చెప్పారు రజనీకాంత్.

తెలుగులోకి రవితేజ హీరోగా ‘ఇడియట్’సినిమాని తియ్యడం మొదలుపెట్టారు. తిట్టుని టైటిల్‌గా పెట్టడమేంటని నెగటివ్ కామెంట్లు.  ఈ టైటిల్‌కి క్యాప్షన్ - ‘ఓ శ్రీనుగాడి ప్రేమకథ’. రవితేజకు చంటిగాడు పేరంటే ఇష్టం. ‘సిందూరం’లో అతని పేరు అదే. రవితేజ కోరిక మేరకు హీరో పేరుని చంటిగాడుగా చేసేశారు. ‘అప్పు’లో చేసిన రక్షితనే తెలుగు వెర్షన్‌కు తీసుకున్నాడు. రక్షిత వాళ్ల నాన్నగారు గౌరీశంకర్ ఫేమస్ సినిమాటోగ్రాఫర్. రక్షిత తల్లి మమతా రావ్ కన్నడంలో హీరోయిన్. ప్రకాశ్‌రాజ్, కోట శ్రీనివాసరావు, కైకాల సత్యనారాయణ తదితరులకు ఇంపార్టెంట్ రోల్స్. చక్రికి మ్యూజిక్ డెరైక్టర్‌గా మళ్లీ చాన్స్ ఇచ్చారు. 2002 మార్చి 24న షూటింగ్ మొదలెట్టారు. హైదరాబాద్ దాటి వెళ్లకుండానే షూటింగ్ చేసేశారు. ఇందులో కీలకమైన మూడు ఫైట్స్ ఉన్నాయి. రవితేజ - టాస్క్‌ ఫోర్స్ పోలీసులను కొట్టే ఫైట్, హెడ్ ఫైట్, మరో ఫైట్. ఈ మూడింటినీ సారథి స్టూడియోలోనే తీసేశారు. రెండు పాటల కోసం మాత్రం బ్యాంకాక్ వెళ్లారు. పూరీకి బ్యాంకాక్‌తో అటాచ్‌మెంట్ ఏర్పడటానికి బీజం ఇక్కడే పడింది. 2002లో చిరంజీవి పుట్టినరోజునాడు ‘ఇడియట్’ రిలీజైంది. సూపర్ డూపర్ హిట్ టాక్. రవితేజ క్యారెక్టరైజేషన్ అందరికీ పిచ్చపిచ్చగా నచ్చేసింది. మనసులో ఏదనుకుంటే అది చేసేయడం, ఎవరో ఏదో అనుకుంటారని సంకోచించకుండా ఉండటం... హీరో పాత్ర చిత్రణ చాలా కొత్తగా అనిపించింది. హీరో అంటే స్ట్రాంగ్ మెంటాలిటీ ఉండాలని, స్ట్రెయిట్ ఫార్వార్డ్‌ గా బిహేవ్ చేయాలని, వే ఆఫ్ థింకింగ్ డిఫరెంట్‌గా ఉండాలని, చాదస్తం - చేతకానితనం ఉండకూడదని పూరీ తనదైన శైలిలో హీరోయిజానికి కొత్త డెఫినిషన్ సెట్ చేసి పెట్టాడు. దీనికి రవితేజ బాడీ లాంగ్వేజ్ బ్రహ్మాండంగా సెట్ అయ్యింది. పెట్టుబడి 2.20 కోట్లు. రాబడి 20 కోట్లు.  45 ప్రింట్లతో రిలీజైన సినిమా వంద ప్రింట్లకు చేరుకుంది. 36 కేంద్రాల్లో హండ్రెడ్ డేస్ ఆడింది. ‘కమిషనర్లు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. చంటిగాడు లోకల్’, ‘కమిషనర్ కూతుళ్లకు మొగుళ్లు రారా?’, ‘రోజూ ఈ టైమ్‌లో ఇక్కడికొచ్చి సైటు కొడతానని తెలుసు కదా. వచ్చి నిలబడాలని తెలీదా?’ లాంటి డైలాగ్స్ విజిల్స్ వేయించాయి. ‘చూపుల్తో గుచ్చిగుచ్చి చంపకే’ లాంటి పాటలు కూడా మార్మోగాయి. ‘ఇడియట్’ క్యారెక్టరైజేషన్ ఓ ట్రెండ్ సెట్ చేసేసింది. ఇదే తరహాలో చాలా మంది స్క్రిప్టులు చేసేసుకున్నారు. ఇప్పటికీ బోర్ కొట్టని కాన్సెప్ట్ ఇది. హిందీలో దీన్ని వివేక్ ఒబెరాయ్‌తో రీమేక్ చేయాలని సీనియర్ నిర్మాత అట్లూరి పూర్ణచంద్రరావు ట్రై చేశారు. కుదర్లేదు. తమిళంలో హీరో శింబు ‘ధమ్’ (2003) పేరుతో రీమేక్ చేశాడు. ఇందులోనూ రక్షితే కథానాయిక. 2008లో బెంగాలీలో ‘ప్రియ అమర్ ప్రియ’ పేరుతో రూపొందింది.

ఇడియట్ తర్వాత వచ్చిన ‘అమ్మ.. నాన్న.. ఓ తమిళ అమ్మాయి’ సినిమా కూడా బంపర్ హిట్ అయింది. ఈ సినిమాలో తండ్రి మీద కోపంతో ఉండే కొడుకుగా రవితేజ నటన సూపర్ అనే చెప్పాలి. ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ నటనకి నంది అవార్డ్ కూడా వచ్చింది. అలాగే తెలుగులో ఆసిన్ కి ఒక మంచి సూపర్ హిట్ ని ఇచ్చింది ఈ సినిమా. అలాగే చక్రి పాటలు అప్పట్లో సూపర్ డూపర్ హిట్. అమ్మ మీద ఉండే ఒక పాట ఈ సినిమాకే హైలైట్.

ఇక వరసగా అన్ని హిట్స్ తో ఉన్న పూరికి ప్లాప్ సినిమాలు రావడం మొదలయ్యాయి. ఆయన ఎన్టీఆర్ తో ఆంధ్రవాలా డిజాస్టర్ అయింది. ఆ తర్వాత తన తమ్ముడు హీరోగా తీసిన 143, నాగార్జున గారితో తీసిన సూపర్, శివమణి సినిమాలు యావరేజ్ టాక్ లతో సరిపెట్టుకున్నాయి.

ఇక ఈ ఫ్లాప్స్ అన్నిటికి పూరి ఒక్క సినిమాతో చెక్ పెట్టారు. సూపర్ స్టార్ మహేష్ బాబు, ఇలియానా జంటగా నటించిన చిత్రం ‘పోకిరి’. ఈ చిత్రం అప్పటి వరకూ తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న అన్ని రికార్డులను తిరగరాసింది. 14 ఏళ్ల క్రితం 2006 ఏప్రిల్ 28న ఈ సినిమా విడుదలైంది. ఈ చిత్రంలో మహేష్ బాబులోని కొత్త యాంగిల్‌ను పూరీ జగన్నాథ్‌ ఆవిష్కరించాడు. మహేష్ బాబు చెప్పే “ఎవడు కొడితే దిమ్మ దిరిగి మైండ్ బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు”. లాంటి డైలాగులు ప్రేక్షకుల మదిలో ఇప్పటికీ అలాగే ఉన్నాయి. ఈ చిత్రం ప్రిన్స్ మహేష్ బాబును సూపర్ స్టార్‌గా మార్చింది. మొత్తంగా మహేష్ బాబు కెరీర్‌లో ‘పోకిరి’ చిత్రానికి ప్రత్యేక స్థానం ఉంది. ఈ చిత్రాన్ని పూరీ జగన్నాథ్ వైష్టో అకాడమీ బ్యానర్‌తో పాటు మంజుల గారి ఇందిరా ప్రొడక్షన్స్‌ లో సంయుక్తంగా తెరకెక్కించారు. దాదాపు రూ.12 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం దాదాపు రూ. 40 కోట్లకు పైగా షేర్ సాధించింది. ఇంత షేర్ సాధించిన తొలి తెలుగు చిత్రంగా పోకిరి రికార్డులకు ఎక్కింది. ‘పోకిరి’ చిత్రం 200 కేంద్రాల్లో 100 రోజులు పైగా నడిచి ఆల్ టైమ్ ఇండస్ట్రీ రికార్డు క్రియేట్ చేసింది. అప్పటి వరకు ఒకే మూసలో ఉన్న మహేష్ బాబులోని కొత్త కోణాన్ని ఆవిష్కరించింది పోకిరి చిత్రం. ఈ సినిమాలో మహేష్ బాబు చెప్పిన డైలాగులు, ఇలియానా గ్లామర్, బ్రహ్మానందం కామెడీ, యాక్షన్ సీక్వెన్స్ ఈ చిత్ర విజయంలో కీలక పాత్ర పోషించాయి. ఈ చిత్రంలో మహేష్ బాబు పక్కా హైదరాబాదీ పోకిరిగా తనదైన శైలిలో నటించి మెప్పించాడు. చాలా చోట్ల ‘పోకిరి’ చిత్రం సంవత్సరానికి పైగా నడిచి కొత్త రికార్డులు క్రియేట్ చేసింది. ఈ చిత్రం తమిళంతో పాటు హిందీ, బెంగాలీ, కన్నడ వంటి పలు భాషల్లో రీమేక్ అయింది. అంతేకాదు ఆయా భాషల్లో ఈ చిత్రం సంచలన విజయాలు నమోదు చేయడం మరో విశేషం. ‘పోకిరి’ చిత్రంతో తొలిసారి ఓవర్సీస్ మార్కెట్‌లో తెలుగు చిత్రాల ప్రభంజం మొదలైంది.

ఇక పూరి తర్వాత చేసిన సినిమా అల్లు అర్జున్‌కు సూపర్ మాస్ ఫాలోయింగ్ తీసుకొచ్చిన సినిమా ‘దేశముదురు’. ఈ చిత్రం అప్పట్లో సంచలన విజయం సాధించింది. ప్రభాస్ యోగితో పాటే సంక్రాంతికి విడుదలైన ఈ చిత్రం 2007లో బిగ్గెస్ట్ హిట్స్‌లో ఒకటిగా నిలిచింది. సినిమా పక్కా మాస్‌గా ఉండటంతో ప్రేక్షకులు కూడా బాగానే రిసీవ్ చేసుకున్నారు. దానికి తోడు పూరీ డైలాగులు.. హన్సిక అందాలు.. అల్లు అర్జున్ డైనమిక్ యాక్షన్.. అలీ కామెడీ ట్రాక్ అన్నీ కలిపి అదరగొట్టింది దేశముదురు. అప్పటికి అల్లు అర్జున్ కెరీర్‌లో అదే పెద్ద హిట్.

ఇక మెగాస్టార్ చిరంజవి తనయుడు రామ్ చరణ్ ను ‘చిరుత’ సినిమాతో పూరీ జగన్నాథ్‌ గారే లాంచ్ చేశారు. సినిమా వంద రోజుల పాటు ఆడి బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఇందులో నేహా శర్మ కథానాయికగా నటించారు. మణిశర్మ సంగీతం అందించారు. చిరంజీవి కొడుకు కావడంతో సినిమా ఓ రేంజ్‌లో దూసుకెళ్లింది. రామ్ చరణ్ కెరీర్‌ విజయవంతంగా సాగేలా చేసింది. చిరు ఫ్యామిలీ నుంచి ఎవరైనా ఇండస్ట్రీలోకి వచ్చారంటే వారిపై ఏ రేంజ్‌లో అంచనాలు ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక చిరు కుమారుడే ఎంట్రీ ఇస్తున్నాడంటే హైప్ ఎంతుంటుందో ఆలోచించండి. అందుకే సినిమా ఆడకపోయినా ఫర్వాలేదు కానీ తన తండ్రి స్థాయికి మాత్రం ఎలాంటి చెడ్డ పేరు తీసుకురాకూడదని చరణ్ చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు. మొత్తానికి తొలి చిత్రంతోనే చిరు కొడుకా మజాకా అనిపించాడు. చిరుత సినిమాకు వైజయంతి మూవీస్ బ్యానర్‌ పై అశ్వినీ దత్ నిర్మాతగా వ్యవహరించారు. రూ.18 కోట్ల బడ్జెట్‌తో సినిమాను తెరకెక్కిస్తే బాక్సాఫీస్ వద్ద రూ.22.5 కోట్ల కలెక్షన్స్ వచ్చాయి. ప్రకాశ్ రాజ్, ఆశిష్ విద్యార్థి, బ్రహ్మానందం, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, అలీ సహాయ పాత్రలు పోషించారు. ఈ సినిమాకు వచ్చిన సక్సెస్ రేట్‌ను చూసి బెంగాలీలో ‘రంగ్‌బాజ్’ అనే టైటిల్‌తో రీమేక్ చేశారు. ఆ తర్వాత ఇదే టైటిల్‌తో హిందీలో డబ్బింగ్ కూడా చేశారు. సినిమా కాన్సెప్ట్ ఒక ఎత్తైతే... ఇందులో పాటలు మరో ఎత్తు. పాటలకు చాలా మంది స్పందన వచ్చింది. పాటలకు సంబంధించిన క్యాసెట్లు, సీడీలు హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి.

చిరుత సినిమా తర్వాత రెబల్ స్టార్ ప్రభాస్ తో ఒక సినిమా బుజ్జిగాడు సినిమా తీసాడు. ఈ చిత్రం అంతగా ఆకట్టుకోలేదు. కాని ప్రభాస్ ఇందులో డిఫరెంట్ గా ఉంటాడు. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఈ చిత్రంలో ఒక ముఖ్యపాత్ర పోషించారు.

పూరి జగన్నాథ్ కి ఆయన సినిమాల్లో బాగా నచ్చిన చిత్రం 2008లో విడుదలైన ‘నేనింతే’. ఇందులో రవితేజ, శియా గౌతం ముఖ్యపాత్రల్లో నటించారు. ఈ సినిమాకు చక్రి సంగీతం అందించాడు. సినీ పరిశ్రమలో ప్రవేశించాలనుకునే వారికి, అక్కడ పనిచేసే వ్యక్తులు ఎదుర్కొనే పరిస్థితుల మధ్య ఈ కథ నడుస్తుంది. ఈ సినిమాలో చాలా సన్నివేశాలు పూరి జీవితంలో జరిగినవే. నేనింతే సినిమాలో రవితేజ నటనకి నంది అవార్డ్ కూడా వచ్చింది.

ఈ చిత్రం తర్వాత వెంటనే మళ్ళీ డార్లింగ్ తో సినిమా తీసాడు ఆ చిత్రమే ఏక్ నిరంజన్. ఈ చిత్రంలో ఇప్పటి బాలివుడ్ మోస్ట్ వాంటెడ్ హీరొయిన్ కంగనా రనౌత్ కథానాయికగా నటించింది. ఆమె ఇప్పటి వరకు మళ్ళీ తెలుగు పరిశ్రమలో సినిమా చేయలేదు.

ఇక పూరి జగన్నాధ్, గోపిచంద్, కలయికలో బెల్లంకొండ సురేష్ నిర్మించిన పవర్‌ఫుల్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘గోలీమార్’. 2010 మే 27న విడుదలైన ఈ చిత్రం పూరి ఫార్మాట్‌లో సాగుతుంది. ఈ కథలో గోపిని గంగూభాయ్‌గా సరికొత్త క్యారెక్టర్లో ఆకట్టుకునేలా చూపించాడు పూరి. తన మార్క్ డైలాగ్స్ డైనమైట్స్‌లా పేలాయి. చక్రి సంగీతం, నేపథ్య సంగీతం, శ్యామ్ కె. నాయుడు సినిమాటోగ్రఫీ సినిమాకు ప్లస్ అయ్యాయి. రోజా, నాజర్, కెల్లీ డోర్జీ, షవార్ అలీ తదితరులు తమ పాత్రల ద్వారా ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. పూరి స్టైల్ పోలీస్ సినిమాల్లో అలాగే గోపి కెరీర్లో స్పెషల్ ఫిల్మ్‌గా ‘గోలీమార్’ గుర్తుండిపోతుంది.

గోలీమార్ తర్వాత రానాతో నేను నా రాక్షసి అనే సినిమా తీశారు. లీడర్ లో క్లాస్ గా కనిపించిన ఆయన ఇందులో మాస్ క్యారెక్టర్ లో కనిపిస్తారు. ఈ చిత్రం భారి అంచనాల నడుమ విడుదలై అంచనాలను అందుకోలేకపోయింది.

ఇక 2012 సంక్రాంతికి విడుదలైన బిజినెస్మేన్ సినిమాతో మహేష్ బాబు ఇంకో సూపర్ హిట్ సినిమాని తన ఖాతాలో వేసుకున్నారు. పూరి జగన్నాథ్, మహేష్ బాబు కాంబినేషన్ లో వచ్చిన పోకిరి సినిమాని ఈ సినిమా మించి కలెక్షన్స్ సాధించింది . మహేష్ బాబు వన్ మాన్ షో , పూరి డైలాగ్స్ ఈ సినిమాకి పెద్ద హైలైట్. ఈ సినిమా దాదాపుగా 40 కోట్ల కలెక్షన్స్ కొల్లగొట్టింది.

ఇక ఆ తర్వాత చేసిన దేవుడు చేసిన మనుషులు , కెమరామెన్ గంగతో రాంబాబు , ఇద్దరమ్మాయిలతో , హార్ట్ ఎటాక్ లాంటి సినిమాల్లో కొన్ని ఆవేరేజ్ హిట్ అయ్యాయి, కొన్ని ప్లాప్ అయ్యాయి.

అయితే  పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన ‘టెంపర్’ సినిమా ఎన్టీఆర్ కెరీర్‌లోనే డిఫరెంట్‌గా నిలిచింది. తారక్‌ నటనలోని మరో కోణాన్ని ఈ సినిమాతో వెలికితీసాడు దర్శకుడు పూరీ జగన్నాథ్. అంతేకాదు ఎన్టీఆర్‌లోని నెగిటివ్ షేడ్స్‌ ని ఈ చిత్రం ఆవిష్కరిచింది. కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది. ‘ఆంధ్రావాలా’ తర్వాత పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో చేసిన ఈ సినిమా ఎన్టీఆర్ కెరీర్‌లోనే బెస్ట్ మూవీగా నిలిచిపోయింది. ‘టెంపర్’ మూవీలో ఎన్టీఆర్ ఇన్‌స్పెక్టర్ దయా పాత్రలో అద్భుతంగా ఒదిగిపోయాడు. ఎన్టీఆర్ కు కథ చెప్పడానికి వెళ్ళిన పూరికి ఎన్టీఆర్ వక్కంతం వంశీ రాసిన కథను ఇచ్చి ఇది ఎలా ఉందో చెప్పు అని అడిగాడు. కథ చదివిన పూరి చాలా బాగుందని చెప్పడంతో ఎన్టీఆర్ మీకు ఒకే అయితే ఈ కథను మీరు డైరెక్ట్ చెయ్యండని అడిగాడు. ఇంత మంచి కథ ముందుంటే ఎందుకు చేయను ఆయన కూడా ఈ ప్రాజెక్ట్ చేయడానికి ఒప్పుకున్నారు. దాంతో ఈ చిత్రం ప్రారంభం అయ్యింది. వక్కంతం వంశి రాసిన కథని తన స్టైల్లో తెరకెక్కించారు పూరి. అప్పటివరకూ ఎన్టీఆర్ ఫ్లాప్స్ లో ఉన్నాడు. అందుకే ఊపిరి సినిమాలో శీను రోల్ చేయమని నాగార్జున గారు అడిగితే మీ సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుంది. కానీ నాకు ఇప్పుడు సోలోగా హిట్ కొట్టాల్సిన టైమ్ వచ్చిందని ఆ ఆఫర్ ను సున్నితంగా తిరస్కరించారని అప్పట్లో సినిమా లోకం కోడై కూసింది. సో మొత్తానికి ఆయన అనుకున్నట్లు టెంపర్ తో సాలిడ్ హిట్ అందుకున్నారు. ఆ క్రెడిట్ మాత్రం పూరి గారిదే.

టెంపర్ సినిమా తర్వాత పూరికి వరుస ప్లాప్స్ వచ్చాయి. ఇక పూరి సినిమాలు ఆడవు అనుకున్న వాళ్లందరికీ ఇస్మార్ట్ శంకర్ సినిమా తో మంచి సమాధానం చెప్పారు. ఈ సినిమా దాదాపుగా 45 కోట్ల భారీ కలెక్షన్స్ ని బాక్స్ ఆఫీస్ దగ్గర కొల్లగొట్టింది. ఈ సినిమాలో రామ్ క్యారెక్టర్ చాలా కొత్తగా ఉంటుంది. నిధి అగర్వాల్, నభ నటాష్ అందాలు ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణ.

ప్రస్తుతం తన సొంత బ్యానర్ లో హీరొయిన్ చార్మీతో కలిసి రౌడి బోయ్ విజయ్ దేవరకొండ హీరోగా లైగర్ అనే సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం తెలుగుతో పాటు ఇతర భాషల్లో కూడా విడుదల కానుంది. విజయ్ చేస్తున్న ప్యాన్ ఇండియా మూవీ ఇదే. ఇటీవలే విడుదలైన పోస్టర్లకు విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది మరి చిత్రం ఎలా ఉంటుందో వేచి చూడాలి.

ఇక పూరి జగన్నాథ్ దర్శకత్వంతో పాటు నిర్మాతగా మారి పోకిరి, పూరి టాకీస్ బ్యానర్ మీద హార్ట్ ఎటాక్ అనే చిత్రాన్ని నిర్మించాడు. ఆయన తెలుగు చిత్రాలతో పాటు హిందీ సూపర్ స్టార్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ తో కలసి బుడ్డా హోగ తేరా బాప్ సినిమా తీసి మంచి హిట్ కొట్టాడు. ఈ సినిమా స్టోరీ ని ఆస్కార్ లైబ్రరీ లో పెట్టడం విశేషం.

పూరి జగన్నాథ్ లాక్డౌన్ లో కొత్తగా పోడ్ కాస్ట్ చేయడం మొదలు పెట్టారు. ప్రస్తుతం ట్రెండ్ అవుతున్న పోడ్ కాస్ట్ ఆడియోలతో ఈ డేరింగ్‌ అండ్‌ డ్యాషింగ్‌ డైరెక్టర్‌ సంచలనం సృష్టిస్తున్నారు. సమాజంలోని ప్రతి అంశాన్ని టచ్ చేస్తూ తనదైన స్టైల్‌లో వివరణ ఇస్తున్నారు. అందుకే ఆయ‌న మాట్లాడుతుంటే ఆవేశంతో కూడిన వేదాంతం వినిపిస్తూ ఉంటుంది. అలాగే టాపిక్ ఏదైనా క్లియ‌ర్ క‌ట్‌గా మాట్లాడ‌తాడు. ఆయ‌న అన్ని పోడ్ కాస్ట్ లలో జీవితానికి ఉపయోగప‌డే అంశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ కారణాల వల్లే పూరి ఆడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అయితే ఇప్పుడు పూరి జగన్నాథ్ ఈ పోడ్ కాస్ట్ లతో స్పార్టిఫై మ్యూజిక్ అప్ లో  కొత్త రికార్డ్ సృష్టించాడు. అది ఏంటి అంటే 2020 సంవత్సరంలో టాప్ పోడ్ కాస్ట్ లిస్ట్ లో మన పూరి పోడ్ కాస్ట్ ఒకటిగా నిలిచింది. దాదాపు 60 వేల మంది పూరి జగన్నాథ్ పోడ్ కాస్ట్ లని విన్నారు అని స్పార్టిఫై విడుదల చేసిన లిస్ట్ లో పేర్కొన్నారు.

వ్యక్తిగత జీవితం

పూరి జగన్నాథ్ 1996 సెప్టెంబర్ 6న లావణ్య గారిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరి పిల్లలు ఆకాష్ పూరి, పవిత్ర జగన్నాథ్. వీళ్ళ ఇద్దరిని మనం చాలా పూరి సినిమాల్లో హీరో, హీరోయిన్ చిన్నప్పటి క్యారెక్టర్స్ చేశారు. ఇక ఆయన కొడుకు ఆకాష్ పూరి హీరోగా ఆంధ్ర పోరి, మెహబూబా లాంటి సినిమాలు కూడా చేసారు. పూరి జగన్నాథ్ అన్న పేట్ల ఉమా శంకర గణేష్ వైస్సార్ పార్టీ నుంచి ఎమ్మెల్యే గా ఎంపికయ్యారు. ఆయన తమ్ముడు సాయిరామ్ శంకర్ ప్రస్తుతం సినిమాల్లో హీరోగా నటిస్తున్నారు.

అవార్డ్స్

2003లో ఉత్తమ మాటల రచయితగా అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి సినిమాకి పూరి కి నంది అవార్డ్ వచ్చింది. అలాగే 2009వ సంవత్సరంలో పూరి జగన్నాథ్ కు ఉత్తమ మాటల రచయితగా నేనింతే చిత్రానికి గాను నంది అవార్డ్ లభించింది.

- Advertisement -

You've successfully subscribed to Tollywood Latest News | Celebrities Profiles | Media9 Tollywood
Great! Next, complete checkout to get full access to all premium content.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.