యంగ్ హీరో నితిన్ ఇప్పుడు కెరీర్ లో బ్రైట్ ఫేజ్ లో ఉన్నాడు. ఈ ఏడాది భీష్మ చిత్రం ద్వారా సూపర్ డూపర్ హిట్ ను సాధించాడు. పెళ్ళి చేసుకుని కొత్త జీవితాన్ని ఆరంభించాడు. వరసగా సినిమాలను లైనప్ చేస్తున్నాడు నితిన్. వెంకీ అట్లూరి దర్శకత్వంలో రంగ్ దే చిత్రాన్ని చేస్తోన్న విషయం తెల్సిందే. ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. మరోవైపు చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో చెక్ అనే విభిన్నమైన సినిమాను కూడా చేస్తున్నాడు. రకుల్ ప్రీత్ ఈ సినిమాలో హీరోయిన్. ఇది కాకుండా నితిన్ ఇప్పుడు మరో సినిమాను కూడా సెట్స్ పైకి తీసుకొచ్చాడు. తన 30వ సినిమా షూటింగ్ మొదలైనట్లు అధికారికంగా వెల్లడించాడు. బాలీవుడ్ సూపర్ హిట్ చిత్రం అంధధూన్ కు ఇది రీమేక్ గా తెరకెక్కుతోంది. మేర్లపాక గాంధీ ఈ సినిమాకు దర్శకుడు. నభ నటేష్ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ చిత్రంలో తమన్నా నెగటివ్ షేడ్స్ ఉన్న భిన్నమైన పాత్రను చేయనుంది. మహతి సాగర్ ఈ సినిమాకు సంగీతం అందించనున్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే బయటకు వచ్చే అవకాశముంది.