ప్రముఖ కన్నడ కథానాయకుడు దర్శన్ హీరోగా తరుణ్ సుధీర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘రాబర్ట్’. ఉమాపతి ఫిలిమ్స్ బ్యానర్ పై ఉమాపతి శ్రీనివాస్ గౌడ ఈ చిత్రాన్ని నిర్మించారు. జగపతిబాబు, రవి శంకర్, రవి కిషన్ దేవరాజ్ ముఖ్యపాత్రల్లో నటించారు. టీజర్ లో చూపించిన విజువల్స్ చాలా బాగున్నాయి. “అతను ఒర్పులో శ్రీ రాముడు, మాటిస్తే దశరథ రాముడు, ప్రేమతో వస్తే జానకిరాముడు, కాని తిరగ బడితే... చతుర్దశ, భువన భయంకర, లంకేశ్వర, దశకంఠ రావణ” అనే డైలాగ్ తో టీజర్ సాగుతుంది. కన్నడ పరిశ్రమలో స్టార్ హీరోగా ఎదిగిన దర్శన్ ఈ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమవనున్నాడు. మార్చ్ 11న ఈ చిత్రం విడుదల కానుందని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. కన్నడ నటులైన ఉపేంద్ర, యష్, రక్షిత్ శెట్టి, రిషబ్ శెట్టి లాంటి నటులు కన్నడతో పాటు ఇతర భాషల్లో కూడా తమ ప్రతిభను నిరూపించుకున్నారు. దర్శకుడిగా, నటుడిగా ఉపేంద్ర మంచి మార్క్ వేస్తూనే విపరీతమైన అభిమానుల్ని సంపాదించుకున్నారు. ఆయన తర్వాత రక్షిత్ శెట్టి, రిషబ్ శెట్టిలు కూడా తమదైన ముద్రను వేశారు. కె.జి.ఎఫ్ చిత్రంతో అప్పటి వరకూ కన్నడ పరిశ్రమలోనే స్టార్ హీరోగా కొనసాగుతున్న యష్, ఆ చిత్రంతో ఒక్కసారిగా అన్ని పరిశ్రమలను తన వైపు తిప్పుకునేలా చేసాడు. వీరి బాటలోనే ఇతర కన్నడ నటులు కూడా తెలుగులో తమ చిత్రాలను విడుదల చేస్తున్నారు. వారి కోవలోనే దర్శన్ కూడా తెలుగులో మంచి ఆదరణను సొంతం చేసుకోవాలని కోరుకుందాం.