
బాహుబలి చిత్రంతో బ్లాక్ బస్టర్ ని తన ఖాతాలో వేసుకున్న తమన్నా ఆ సినిమా తర్వాత ప్రతీ సంవత్సరం అయిదారు సినిమాలు రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేసుకుంది. తెలుగు, తమిళ భాషల్లో ఫుల్ బిజీ హీరోయిన్ అయిపోయింది. 2019లో ఏకంగా 8 సినిమాలు రిలీజ్ అయ్యాయి. అందులో చాలా వరకూ హిట్ చిత్రాలే ఉన్నాయి. 2020లో కూడా ఆమె అదే జారుని కొనసాగిస్తుందని అనుకున్నారు ఆమె అభిమానులు కాని అనుకున్నది తారుమారైంది. 2020లో కేవలం ఒకే ఒక్క చిత్రం విడుదలైంది అది కూడా ఆమె స్పెషల్ సాంగ్ చేసిన సరిలేరు నీకెవ్వరు.

ఆ తర్వాత కరోన చెలరేగడంతో లాక్డౌన్ విధించడం, థియేటర్లు మూతపడడం, ఇలాంటి ఎన్నో కారణాల వల్ల ఆమె సినిమాలు రిలీజ్ అవ్వలేదు. అయితే లాక్ డౌన్ తర్వాత ఆమెకు కరోన సోకడంతో కొన్ని రోజులు షూటింగ్ లకు బ్రేక్ ఇవ్వడం తప్పలేదు. ఆమె పూర్తిగా కోలుకున్న తర్వత షూటింగ్ లకు హాజరయ్యి వీలైంత త్వరగా షూటింగ్స్ పూర్తయ్యేలా తన వంతు పాత్ర పోషించింది. ఈ సారి ఆమె నుంచి 6 సినిమాలు, రెండు వెబ్ సిరీస్ లు రానున్నాయి.

గోపీచంద్ హీరోగా తెరకెక్కిన సీటిమార్ సినిమాలో జ్వాలా రెడ్డిగా నటిస్తోంది. ఈ చిత్రం షూటింగ్ పూర్తయ్యి విడుదలకు సిద్ధంగా ఉంది. అలాగే సత్యదేవ్ హీరోగా నటిస్తున్న గుర్తుందా శీతాకాలం చిత్రం షూటింగ్ చివరి దశకు చేరుకుంది. అలాగే బాలివుడ్ హిట్ చిత్రమైన క్వీన్ కి రీమేక్ గా తెరకెక్కిన దట్ ఈస్ మహాలక్ష్మి చిత్ర కూడా షూటింగ్ కూడా పూర్తయింది. 2019లో వచ్చిన బ్లాక్ బస్టర్ చిత్రం ఎఫ్- 2 కి కొనసాగింపుగా వస్తున్న ఎఫ్- 3 చిత్రం కూడా శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటోంది. అలాగే నితిన్ హీరోగా తెరకెక్కుతున్న అంధాదూన్ రీమేక్ లో ముఖ్యమైన పాత్రను పోషిస్తోంది.
ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కిన 11th అవర్ వెబ్ సిరీస్ విడుదలకు సిద్ధంగా ఉంది. ఆహా ఒరిజినల్ గా తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్ లో పవర్ ఫుల్ బిజినెస్ విమన్ పాత్రను పోషిస్తోంది. దీనికి సంబంధించిన టీజర్ ఇటీవలే విడుదలైంది. దాంతో పాటు నవంబర్ స్టోరీ అనే మరో వెబ్ సిరీస్ లో కూడా ఆమె నటిస్తోంది. దీనికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. పరిశ్రమలోకి వచ్చి ఇంత కాలమైనా తోటి నటీమణులకు గట్టి పోటి ఇస్తూ దూసుకెళ్తోంది మిల్కీ బ్యూటి తమన్నా.