

విశ్వనాయకుడు కమల్ హాసన్ కూతురుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినా కానీ శృతి హాసన్ తనదైన మార్కు దక్కించుకోవడానికి ఎక్కువ సమయమేం తీసుకోలేదు. కెరీర్ టాప్ ఫామ్ లో కొనసాగుతున్న సమయంలో తన మ్యూజిక్ ప్యాషన్ ను నెరవేర్చుకోవడానికి అమ్మడు యూకే చెక్కేసింది. మళ్ళీ గతేడాది చివర్లో సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చిన శృతి హాసన్, తెలుగులో రవితేజ సరసన ‘క్రాక్’ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ ఇటీవలే పూర్తయింది. ఇక తమిళంలో ‘లాభం’ అనే చిత్రంలో విజయ్ సేతుపతి సరసన నటిస్తోంది. ఈ రెండు సినిమాలు కాకుండా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తోన్న ‘వకీల్ సాబ్’ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే తిరిగి ప్రారంభమవ్వగా వచ్చే నెల శృతి హాసన్ టీమ్ తో జాయిన్ కానున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో నటిస్తున్నందుకు శృతి చాలా ఉత్సాహంగా ఉంది. పవన్ కళ్యాణ్ తో ఆమె కలిసి నటించడం ఇది మూడో సారి. ఇదిలా ఉంటే అమ్మడు ఫోటోషూట్ల విషయంలో మాత్రం ఎక్కడా తగ్గట్లేదు. రీసెంట్ గా బెంగుళూరు టైమ్స్ వద్ద శృతి హాసన్ ఫోటోషూట్ వైరల్ అవుతోంది. దాన్ని ఆమె తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది.