
జెస్సిగా తన ప్రయాణాన్ని మొదలుపెట్టి రామలక్ష్మిగా ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్రవేసిన సామ్ కెరీర్ లో మర్చిపోలేని పాత్రలెన్నో తను పంచిన అనుభూతులు ఎన్నెన్నో. గ్లామర్ పాత్ర కాని, నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్ర కాని తనదైన శైలిలో చేసి తనకంటూ ఒక గుర్తింపుని ఏర్పరచుకుంది. తెరపై ఆమె పలికించే హావాభావాలు ప్రేక్షకుల్ని మంత్ర ముగ్ధుల్ని చేస్తాయి. సీరియస్ రోల్ అయినా చలాకీగా ఉండే అమ్మాయిగా అయినా తన నటనతో మెప్పించగలదు. మోడల్ గా తన కెరీర్ ను ఆరంభించింది సామ్. ఒక మోడలింగ్ వీడియోలో ఆమెను చూసిన సినిమాటోగ్రాఫర్ రవివర్మన్ తాను దర్శకత్వం వహించనున్న తోలి చిత్రానికి కథానాయికగా ఆమెను ఎంపిక చేసుకున్నాడు. సినిమా ప్రీ-ప్రొడక్షన్ లో ఉండగానే గౌతమ్ మీనన్ తెరకెక్కిస్తున్న సినిమాలో హీరోయిన్ గా చాన్స్ వచ్చింది. ఈ సినిమా ఏకకాలంలో తమిళ, తెలుగు భాషల్లో నిర్మితమైంది. తమిళంలో శింబు, త్రిషలు పోషించిన పాత్రల్ని తెలుగులో చై, సామ్ లు చేసారు. తెలుగులో సమంత పాత్రకు ఎలాంటి రెస్పాన్స్ వచ్చిందో తమిళంలో త్రిషకు అంతే రెస్పాన్స్ వచ్చింది. ఒకే పాత్రని వేర్వేరు నటులు పోషించినప్పుడు ఎవరో ఒకరి నటనలో హెచ్చు తగ్గులనేవి సహజంగా వస్తాయి. కాని జెస్సీ పాత్ర విషయంలో ఆ హెచ్చు తగ్గులు ఉండవు. తెలుగులో ఆ పాత్రతో సమంత ఎంత పాపులర్ అయ్యిందో, తమిళంలో త్రిష కూడా అంతే ప్రభంజనం సృష్టించింది. సమంతకు ఇదే మొదటి సినిమా. ఆ తర్వాత ఆమె ఎన్నో చిత్రాల్లో నటించి దేశవ్యాప్తంగా గుర్తింపు సొంతం చేసుకుంది. ఆ సినిమాతో మొదలైన చై, సామ్ ల పరిచయం ప్రేమగా మారి ఇద్దర్నీ దంపతుల్ని చేసింది. వారిద్దరూ కలిసి 4 సినిమాలు చేసారు. నేటికి సమంత తోలి చిత్రం ‘ఏమాయ చేసావే’ విడుదలై 11 ఏళ్ళు అవుతోంది. నటిగా ఆమె పుట్టి కూడా 11ఏళ్ళు అవుతోంది