తన నటనతో, హావాభావాలతో ప్రేక్షకుల మనసులు కొల్లగొట్టే సాయి పల్లవి నటిగానే గాక నృత్యకారిణిగా కూడా అందరికీ పరిచయస్థురాలే. ఆమె డ్యాన్స్ కి ఫ్యాన్స్ ‘ఫిదా’ అవుతారు. ఎలాంటి మూవ్మెంట్ అయిన యిట్టె చేసేసి మాస్టర్ ల చేత శభాష్ అనిపించుకుంటుంది. ప్రభుదేవ సైతం ఆమెకు డ్యాన్స్ మూవ్మెంట్స్ కంపోజ్ చేసేటప్పుడు చాలా ఆశ్చర్యానికి గురయ్యానని చెప్పడం తెలిసిందే. ఇక ఆమె నటిస్తున్న ‘లవ్ స్టోరి’, ‘విరాటపర్వం’ చిత్రాలు విడుదలకు సిద్ధమౌతున్నాయి. లవ్ స్టోరి ఏప్రిల్ 16న విడుదలవుతుండగా విరాటపర్వం ఏప్రిల్ 30న విడుదలవనుంది. ఈ రెండు చిత్రాల టీజర్ లు విడుదలయ్యి మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. ఫిబ్రవరి 25న విరాటపర్వం నుండి విడుదలైన కోలు కోలు పాటకు మంచి స్పందన వచ్చింది. ఈ పాట 4.1 మిలియన్ వ్యూస్ ను సాధించింది. ఈ పాటలో ఆమె నటన వీక్షకులను చూపు తిప్పుకోకుండా చేస్తోంది. మ్యూజిక్, లిరిక్స్ ఈ పాటకు కొత్తదనాన్ని అందించాయి. ఇక ఫిబ్రవరి 28న విడుదలైన లవ్ స్టోరి లోనీ ‘సారంగ దరియా’ పాటైతే రికార్డ్లు సృష్టిస్తోంది. పవన్ సి.హెచ్ అందించిన సంగీతానికి సుద్దాల అశోక్ తేజ గారు లిరిక్స్ సమకూర్చారు. జానపద పాటైన సారంగ దరియాకు తనదైన బాణిలో కొత్త రంగులు అద్దారు సుద్ధాల గారు. ఇక శేఖర్ మాస్టర్ నృత్య పర్యవేక్షణలో ఆయన కంపోజ్ చేసిన స్టెప్స్ ని బ్రహ్మాండంగా చేసింది సాయి పల్లవి. ఆమె ఎక్స్ప్రెషన్స్ కి ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. ఇది వరకు వీరి కాంబినేషన్లో వచ్చిన ‘వచ్చిండే పిల్ల మెల్లగ వచ్చిండే’ పాటను మరిపించేలా ఈ పాట ఉంది. ఈ పాట 10 మిలియన్ వ్యూస్ తో ట్రెండింగ్ లో ఉంది.