
తన బౌలింగ్ తో ప్రత్యర్ధులను బోల్తా కొట్టిచ్చే ఇండియన్ టీమ్ ఫాస్ట్ బౌలర్ స్ప్రీత్ బుమ్రా, తన చూపులతో కుర్రకారుని క్లీన్ బౌల్డ్ చేసే వాలు కనుల సుందరి అనుపమ పరమేశ్వరన్ ప్రేమలో మునిగిపోయారని, వార్తలు చక్కర్లు కొడుతున్న సంగతి అందరికి తెలిసిందే. ఇదిలా ఉండగా బుమ్రా ఇంగ్లండ్ తో జరుగుతున్న నాలుగో టెస్టు నుండి పక్కకు తప్పుకున్నాడనే ప్రచారం జోరుగా సాగుతుంది. దీంతో వీళ్లిద్దరు త్వరలో పెళ్లి పీటలెక్కబోతున్నారని సోషల్ మీడియాలో కోడై కూస్తోంది. దానికి తోడు అనుపమ ద్వారక వెళ్తున్నానంటూ తాను పెట్టిన పోస్టు కూడా ఈ పెళ్లి వార్తలకు బలం చేకూర్చింది. దీంతో నిప్పు లేనిదే పొగ రాదు అని నెటిజన్లు చెవులు కొరుక్కుంటున్నారు.

ఈ నేపథ్యంలో అనుపమ తల్లి సునీత పరమేశ్వరన్ స్పందించారు. మీడియాతో ఆమె మాట్లాడుతూ వారిద్దరూ ప్రేమలో ఉన్నారనేది అవాస్తవమని తెలియజేసారు. ఇవన్నీ వట్టి పుకార్లేనని, ఈ వార్తల్లో నిజం లేదని తేల్చేశారు. ఇదిలా ఉండగా క్రికెట్‌కు అనుపమ తండ్రి వీరాభిమాని అని, ఎదో ఒక సందర్భంలో బుమ్రాను కలిశారు తప్ప అందులో ఏ ఉద్దేశమూ లేదని తెలిపారు. ఆ సమయంలో అనుపమ షూటింగ్ కోసం బుమ్రా ఉన్న హోటల్లోనే అనుకోకుండా బస చేయాల్సి రావడంతో ఈ పుకార్లు పుట్టుకొచ్చాయి. అంత సీరియస్‌గా ఈ పుకార్లను తమ కుటుంబం తీసుకోవట్లేదని అనుపమ తల్లి సునీత పరమేశ్వరన్ తెలిపారు.

బుమ్రా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న చివరి టెస్ట్ మ్యాచ్ నుంచి తప్పుకోవడంతో ఈ పెళ్లి వదంతులు సోషల్ మీడియాలో మొదలయ్యాయి. మొత్తానికి ఆమె తల్లి అనుపమ విషయంలో పూర్తి స్పష్టతనిచ్చింది. మరోవైపు స్టార్ స్పోర్ట్స్ యాంకర్ అయిన సంజన గణేశన్, బుమ్రాతో ఏడడుగులు వేయబోతుందని మరొక ప్రచారం చక్కెర్లు కొడుతోంది. ఈ వార్తలలో ఏది నిజమో ఏది అబద్ధమో తెలియాలి అంటే అనుపమ కానీ, బుమ్రా కానీ స్పందించాల్సి ఉంది.


వాస్తవానికి ఈ పుకారు ఇప్పటిది కాదు. 2019 జరిగిన వరల్డ్ కప్‌లో తన ప్రత్యర్థులను పదునైన బంతులతో చుక్కలు చూపించి క్లీన్ బౌల్డ్ చేసిన బూమ్రా... ఈ మలయాళీ ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్ చూపులకు క్లీన్ బౌల్డ్ అంటూ వచ్చిన పుకారు. ఈ విషయమై ఇద్దరూ స్పందించక పోయేసరికి మనోళ్ళు తెగ వైరల్ చేసారు. అదీ కాక అనుపమ ఇన్‌స్టాగ్రామ్‌ని ఈ క్రికెటర్ ఫాలో కావడంతో పాటు, వీళ్లిద్దరు ఒకరి పోస్ట్ లను మరొకరు షేర్ చేసుకుంటుండడం వీళ్ళ ఇద్దరి మధ్య ఎదో నడుస్తుందనే ప్రచారానికి తెర తీసింది.