
పక్కింటి అబ్బాయిలాగా కనిపిస్తూ హీరోగా మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్న నాచ్యులర్ స్టార్ నాని వరస కొత్త సినిమాలతో దూసుకెళ్తున్నారు. ఇప్పటికే నాని ‘టక్ జగదీష్’ సినిమా, ‘శ్యామ్ సింగరాయ్’ సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఆయన ఇంకో క్రేజీ సినిమాకి శ్రీకారం చుట్టారు. అది వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో, మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ‘అంటే సుందరానికి’ అనే సినిమా. ఈ సినిమా టైటిల్ ని ప్రకటిస్తూ ఈరోజు మూవీ టీమ్ చిన్న టీజర్ ని విడుదల చేసారు. ఈ సినిమాలో ఇంకో విశేషం ఏంటి అంటే మలయాళ నటి నజ్రియా నజీమ్ నటిస్తున్న తొలి తెలుగు సినిమా ఇదే. ఇప్పటి వరకూ నజ్రియా తెలుగులో నటించకపోయినప్పటికీ ఆమెకు తెలుగు అభిమానులు చాలా మంది ఉన్నారు. ఈ సినిమాతో డైరెక్ట్‌గా తెలుగులో నటిస్తుండటంతో ఆమె అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు. ఈ సినిమాకి నికేత్ బొమ్మి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఇప్పటికే ‘బ్రోచేవారేవరురా’, ‘మెంటల్ మదిలో’ వంటి హిట్ సినిమాలతో మంచి పేరు తెచ్చుకున్న వివేక్ ఆత్రేయ నానితో చేయడం ఈ సినిమా మీద అంచనాలు పెంచాయి. నవీన్ ఎర్నేని, రవి శంకర్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తుండగా, వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా త్వరలోనే షూటింగ్ మొదలుకాబోతుంది.