
ఛలో సినిమాతో నాగ శౌర్య తన రేంజ్ ని మరియు మార్కెట్ ని పెంచుకున్నాడు. ఆ సినిమా తర్వాత ఆయన సినిమాల ఎంపికలో చాలా మార్పు వచ్చింది. కొత్త దర్శకులతో, కొత్త కథలతో నాగ శౌర్య వరసగా సినిమాలు చేస్తూ దూసుకెళ్తున్నాడు. ఈ విషయం ఆయన మూవీ లైనప్ చూస్తేనే అర్థం అవుతుంది. ‘ఇప్పటికే వరుడు కావలెను’ సినిమా షూటింగ్ పూర్తి అవ్వడానికి వచ్చింది. ఈ సినిమాతో పాటు ఆయన ‘లక్ష్య’ సినిమాని కూడా పూర్తి చేస్తున్నాడు. ఈ మద్యనే జరిగిన నాగ శౌర్య పుట్టినరోజు నాడు ఇంకో రెండు సినిమాలని కూడా ప్రకటించారు. అందులో ‘పోలీస్ వారి హెచ్చరిక’ ఒకటైతే ఇంకొక సినిమాకి ఇంకా పేరు పెట్టలేదు. ఇక ‘పోలీస్ వారి హెచ్చరిక’ సినిమాని కొత్త దర్శకుడు రాజేంద్ర దర్శకత్వం వహిస్తుండగా, ఇంకొక చిత్రాన్ని శ్రీమాన్ డైరెక్ట్ చేస్తున్నారు. ఇలా నాగ శౌర్య ఒకటేసారి 4 సినిమాలలో హీరోగా నటిస్తూ బిజీ బిజీగా ఉన్నాడు. ఈ సినిమాలన్నీ ఈ సంవత్సరం లోనే తెరకెక్కేలా ఆయన ప్రయత్నిస్తున్నారు. అలాగే నాగ శౌర్య పుట్టినరోజున విడుదలైన లక్ష్య సినిమా టీజర్ కి మరియు వరుడు కావలెను సినిమా టీజర్ కి మంచి స్పందన వచ్చింది. ముఖ్యంగా లక్ష్య సినిమాలోని నాగ శౌర్య లుక్ అందరిని ఆశ్చర్యపరుస్తుంది. ఇప్పటిదాకా లవర్ బాయ్ లుక్ లో కనిపించిన నాగ శౌర్య ఒక్కసారిగా బాడీ బిల్డఅప్ చేసి లక్ష్య లో కనిపించారు. ఈ చిత్రాలు ఈ సంవత్సరమే తెర మీదకు వస్తాయా లేక వచ్చే సంవత్సరానికా అనేది వేచి చూడాలి.