'రెబెల్'స్టార్ కృష్ణంరాజు బయోగ్రఫీ!

పరిచయం

టాలీవుడ్ చరిత్రలో ఎందరో మరపురాని హీరోలు ఉన్నారు. తెలుగు సినిమా హీరోల ప్రస్తావన వస్తే కచ్చితంగా ముందు నందమూరి తారక రామారావు, అక్కినేని నాగేశ్వర రావు, సూపర్ స్టార్ కృష్ణ పేర్లు వినిపిస్తాయి. ఆ తర్వాత ముందు వరసలో ఇండస్ట్రీను తన సినిమాలతో మరో మెట్టు ఎక్కించిన నటుడు కృష్ణంరాజు. మొత్తంగా చెప్పుకోవాలంటే ఉప్పలపాటి వేంకట కృష్ణంరాజు. సుసంపన్నమైన కుటుంబం, అడిగితే లేదనేది లేకుండా పెరిగారు కృష్ణంరాజు. యాదృచ్చికంగా సినిమాల్లోకి ఎంట్రీ జరిగింది. మొదటి సినిమా ప్లాప్ గా నిలిచింది. దీంతో ఎవరూ అవకాశాలు ఇచ్చింది లేదు.

నిజానికి సినిమాల్లో తనకు ప్రూవ్ చేసుకోవాల్సింది కూడా ఏం లేదు. వెనక్కి తిరిగి వెళ్ళిపోయినా మహారాజా జీవితమే. అయితే కృష్ణంరాజు ఓడిపోవాలని అనుకోలేదు. హీరోగా అవకాశాలు రాకపోతేనేం విలన్ గా మరో ఇన్నింగ్స్ మొదలుపెట్టారు. అక్కడ కూడా తన ప్రత్యేకత చూపించడానికి ప్రయత్నించారు. అప్పటిదాకా ఉన్న విలనిజాన్ని తోసి రాజని తనదైన శైలిలో చేసిన విలనిజం, తెలుగు సినిమాను కొత్త పుంతలు తొక్కించింది. అక్కడి నుండి కృష్ణంరాజు వెనుతిరిగి చూసింది లేదు. వరసగా విలన్ వేషాలతో ఫుల్ బిజీ అయ్యాడు. నిజానికి అలాగే తన కెరీర్ ను ముందుకు తీసుకెళ్లొచ్చు. మరి ఎందుకని మళ్ళీ హీరో వేషాలవైపు మళ్ళారు? అక్కడ తనకు ఎదురైన సవాళ్లు ఏంటి? ఎలాంటి పరిస్థితుల్లో కృష్ణంరాజు నిర్మాతగా మారాల్సి వచ్చింది. కృష్ణంరాజు జీవితంలో ఇంకా ఎలాంటి విశేషాలు ఉన్నాయి? వంటి ఆసక్తికర విషయాలు ఇప్పుడు ఈ బయోగ్రఫీలో చూద్దాం.

బాల్యం

జనవరి 20, 1940వ సంవత్సరంలో ఉన్నత కుటుంబంలో జన్మించారు కృష్ణంరాజు. తెలుగునాట విజయనగర సామ్రాజ్య వారసులు, క్షత్రియ రాజుల వంశస్తుల వారసులు కృష్ణంరాజు. మొగల్తూరులో వీర వెంకట సత్యనారాయణ రాజు, లక్ష్మి దేవి దంపతులకు జన్మించారు. మొగల్తూరులో వీరు చాలా గౌరవ మర్యాదలతో మెలిగేవారు. దాదాపు జమిందారీతనం ఉండేది. వద్దంటే డబ్బు, సకల సౌకర్యాలు, చిన్ననాటి నుండే గౌరవ మర్యాదలు, మంచీ చెడూ చెప్పేవారు లేకపోవడంతో కృష్ణంరాజు బాల్యంలో కొంత దురుసుగా ఉండేవారు. స్నేహితులు ఒరేయ్ అన్నా కూడా సహించేవారు కాదు. వెంటనే కొట్టేవాళ్ళు. అంత కోపం ఉండేది కృష్ణంరాజుకు. ఒకానొక సందర్భంగా కృష్ణంరాజు గురించి తెలుసుకున్న ప్రిన్సిపాల్ తన ఆఫీస్ కు పిలిస్తే, అవసరమైతే ఆయన్నే నా దగ్గరకు రమ్మను. నేను రాను అని చెప్పారు కృష్ణంరాజు. ఈ విషయం తెలుసుకున్న కృష్ణంరాజు నాన్నగారు తనని వాళ్ళ పిన్ని ఇంటికి పంపారు. అక్కడ కృష్ణంరాజుకు ఒక మాములు వ్యక్తిగా బ్రతకడమెలాగో తెలిసింది. స్థానబలం లేకపోవడంతో కృష్ణంరాజు చాలా సాదాసీదా వ్యక్తిగా మెలిగేవారు. జీవితమంటే ఏంటో తెలిసింది అక్కడే. కృష్ణంరాజు చదువులో ముందుండే వారు కారు. పరీక్షలు దగ్గరపడుతుంటే అప్పుడు పుస్తకం తీసే బ్యాచ్. ఇదే విషయాన్ని కృష్ణంరాజు పలు ఇంటర్వ్యూలలో చెప్పారు కూడా. నర్సాపూర్ లోనే కృష్ణంరాజు పీయూసీ చదువుకున్నారు. వైఎన్ఎం కాలేజీలో కృష్ణంరాజు చదువుకున్నారు. ఇదే కాలేజీలో మెగాస్టార్ చిరంజీవి కూడా చదువుకోవడం విశేషం. చిరంజీవి సొంత ఊరు కూడా మొగల్తూరు అన్న విషయం మనకు తెల్సిందే.

కాలేజీ లైఫ్
చదువు మీద పెద్ద ధ్యాస పెట్టని కృష్ణంరాజు పీ.యూ.సీ పరీక్ష తప్పాక వాళ్ళ నాన్నగారు ఒక స్నేహితుడిలా దగ్గర కూర్చోపెట్టుకుని దండించకుండా మంచి మాటలు చెప్పడంతో ఆయనలో ఆలోచన మొదలై మార్పు వచ్చింది. హైదరాబాద్ వెళ్ళి పీ.యూ.సీ చదువుకుంటానని చెప్పి హైదరాబాద్ కు తన మకాన్ని మార్చారు కృష్ణంరాజు. అక్కడ భద్రుక కాలేజ్ ఆఫ్ కామర్స్ లో పీ.యూ.సీ కోర్స్ లో జాయిన్ అయ్యారు.

జర్నలిజం
ఇక్కడ కొంచెం శ్రద్ధగా చదివి పీ.యూ.సీ పాసయ్యారు కృష్ణంరాజు. ఇక అదే కాలేజీలో బి.కామ్ జాయిన్ అయ్యారు కృష్ణంరాజు. అయితే హైదరాబాద్ లో సి.హెచ్.వి మూర్తి రాజు గారు అనే వ్యక్తి స్థాపించిన ఆంధ్రరత్న పత్రిక సంస్థలో పనిచేయడం మొదలుపెట్టారు. పగలు ప్రెస్ పనులు చూసుకుంటూ భద్రుక కాలేజ్ ఆఫ్ కామర్స్ లో నైట్ క్లాసులు అటెండ్ అయ్యేవారు కృష్ణంరాజు. ఆంధ్రరత్న పత్రిక విషయంలో ఆల్ ఇన్ ఆల్ గా అన్ని పనులు చూసుకునే వారు కృష్ణంరాజు. అక్కడ సినిమా వాళ్లతో కొన్ని పరిచయాలు ఏర్పడ్డాయి. అయితే ఆ ప్రెస్ ఎక్కువ కాలం నడవలేదు. చదువుకునే రోజుల్లో కృష్ణంరాజుకు సినిమాలంటే మహా పిచ్చి. ఎన్టీఆర్, ఏఎన్నార్ సినిమాలను పోటీ పడి చూసేవాళ్ళు. పౌరాణికాలు అయితే ఎన్టీఆర్, సోషల్ మూవీస్ అయితే ఏఎన్నార్. స్వతహాగా సామాజిక చిత్రాలు అంటే ఇష్టం ఉండడంతో అక్కినేని నాగేశ్వర రావు అంటే ఇష్టం ఏర్పడింది. కాలేజీ రోజుల్లో సినిమాలు ఎక్కువగా చూసేయడం వల్ల వాటి పట్ల ఆకర్షితుడయ్యారు కృష్ణంరాజు.

చాలా మందికి తెలీని విషయం ఏమిటంటే యాక్టింగ్, ఫోటోగ్రఫీతో పాటు కృష్ణంరాజుకు స్పోర్ట్స్ లో కూడా ప్రవేశం ఉంది. చదువుకునే రోజుల్లో కబడ్డీ విపరీతంగా ఆడేవారు కృష్ణంరాజు. కాలేజీ డేస్ లో నేషనల్ కబడ్డీ జట్టులో సెలెక్ట్ అయ్యారు కృష్ణంరాజు. అలాగే ఇంటర్ కాలేజ్ గేట్ వాలీబాల్ కాంపిటీషన్ లో పేరు గాంచిన ప్లేయర్ గా గుర్తింపు సంపాదించుకున్నారు కృష్ణంరాజు.  ఇందాక చెప్పుకున్నట్లు కృష్ణంరాజుకు ఫోటోగ్రఫీ అంటే మక్కువ ఎక్కువ. స్కూల్ డేస్ నుండే తన వద్ద కెమెరా ఉండేది. స్కూల్ డేస్ లోనే తాను తీసిన ఫొటోకు స్టేట్ లెవెల్లో సెకండ్ బెస్ట్ ఫోటోగ్రాఫర్ అవార్డు వచ్చింది. తర్వాత వయసు పెరుగుతున్న కొద్దీ ఫోటోగ్రఫీ మీద ఆసక్తి కూడా పెరుగుతూ ఉండేది. ఇక ఏ కొత్త కెమెరా వచ్చినా అది కృష్ణంరాజు ఇంట్లో ఉండాల్సిందే. అలా తన వద్ద అరుదైన కలెక్షన్ ఉండేది.

కనువిప్పు  

కృష్ణంరాజు చాలా ఉన్నత కుటుంబం నుండి రావడంతో విలాసవంతమైన జీవితానికి అలవాటు పడ్డారు. ఒక వైట్ సూట్ ధరించి, ఖరీదైన బండిని తనకు నచ్చినట్లు రీమోడల్ చేయించుకున్నారు కృష్ణంరాజు. అయితే తన బాడీను స్టైలిష్ గా మైంటైన్ చేయడంలో, ధృడంగా ఉంచుకోవడంలో కృష్ణంరాజు ఎప్పుడూ ప్రాధాన్యత ఇచ్చేవారు. ఉదయం లేవగానే గంటన్నర వ్యాయామం చేయడం కృష్ణంరాజుకి అలవాటు. ఉదయం 10.30కి నాలుగు ఆమ్లెట్లు, నాన్ వెజ్ ఐటెం, కూరగాయలు తినేవారు. మళ్ళీ రాత్రికి భోజనం చేసేవారు. ఈలోగా ఏమీ ముట్టుకునేవారు కాదు. ఈ మధ్యలో స్నేహితులతో సరదాగా తన బైక్ పై తిరుగుతూ ఉండేవారు.

ఈ లైఫ్ స్టైల్ చూసి కృష్ణంరాజు నాన్నగారికి ఒకాయన ఉత్తరం రాసారు. దాంట్లో మీవాడు చెడిపోతున్నాడు. ఏదోకటి చేయండి అన్నది దాని సారాంశం. దానికి సమాధానంగా కృష్ణంరాజుకు ఒకాయన వచ్చి మీ నాన్న గారు ఈ ఉత్తరం ఇచ్చారు అని చెప్పారు. అందులో ఒక చిన్న కాగితంపై "నువ్వు నా కొడుకువి. నీ మీద నాకు నమ్మకం ఉంది. కానీ ఇటువంటి స్నేహితులకు మాత్రం దూరంగా ఉంచుకో... నీ తండ్రి" అని ఆ కాగితం ముక్కపై ఉంది. దాంతో పాటు ఆ వ్యక్తి రాసిన ఉత్తరాన్ని కూడా జత చేసారు. ఈ సంఘటనతో కృష్ణంరాజు కళ్ళ నుండి ధారాళంగా కన్నీళ్లు వచ్చాయి. ఆ సంఘటనతో కృష్ణంరాజులో కనువిప్పు కలిగింది. నా తండ్రి నా మీద ఇంత నమ్మకం పెట్టుకున్నప్పుడు ఏంటి ఇలా ఉంటున్నాను అని కృష్ణంరాజు తన జీవితాన్ని సీరియస్ గా తీసుకోవడం మొదలుపెట్టారు.

సినిమా అరంగేట్రం

చదువు పూర్తైన తర్వాత కృష్ణంరాజు తనకిష్టమైన ఫోటోగ్రఫీనే నమ్ముకున్నారు. అప్పట్లో ఎవరి దగ్గర లేని విధంగా విదేశాల నుండి దిగుమతి చేసుకున్న కెమెరాలను ఉపయోగించి ఫోటో స్టూడియోను నెలకొల్పారు. అందులో చవాన్ అనే సీనియర్ ఫోటోగ్రాఫర్ ను కూడా పనిలో పెట్టుకున్నారు కృష్ణంరాజు. ఆయన స్టూడియోలో పెట్టుకోవడానికి బాగుంటుందని కృష్ణంరాజు ఫోటోలను కూడా తీసి స్టూడియోలో పెట్టారు. కృష్ణంరాజుకు వరసకు మావయ్య అయ్యే ఆయన దగ్గర బిజినెస్ నిమిత్తం మద్రాసుకు తరుచూ తిరుగుతుండేవారు కృష్ణంరాజు. ఈ నేపథ్యంలో ఒకాయన చూసి మీకు సినిమాల్లో నటించే ఆసక్తి ఉందా అని అడిగారు. దానికి కృష్ణంరాజు నేనేంటి సినిమాల్లో ఏంటి అని కొట్టిపారేశారు. మళ్ళీ ఆయనే హైదరాబాద్ లో కృష్ణంరాజును కలిసి తనను నిర్మాతగా పరిచయం చేసుకుని సినిమాల్లోకి రమ్మని ఆహ్వానించారు. తీరా వెళ్ళి చూస్తే ఆయనకు సినిమాలు తీసేందుకు డబ్బులు లేదు.

కృష్ణంరాజు దగ్గర దర్పాన్ని చూసి ఆయనతో సినిమాలు తీయొచ్చని భావించారు. హైదరాబాద్ లో, తన స్వస్థలంలో అందరికీ సినిమాల్లో నటించడానికి వెళుతున్నాను అని చెప్పుకుని మద్రాసు వెళ్లారు. తీరా వెనక్కి వచ్చేసాక అందరూ హీరో గారు అని వేళాకోళం చేయడం మొదలుపెట్టారు. ఏదేమైనా సినిమా హీరో అయితే తప్ప వెనక్కి రాకూడదు అని భావించి చెన్నై వెళ్ళిపోయారు.

కెమెరామ్యాన్ ఎం.కే రాజు, కృష్ణంరాజుకు తెలుసు. ఆయన ప్రత్యగాత్మ కోటయ్య గారికి పరిచయం చేసారు. అప్పుడు ప్రత్యగాత్మ పాజిటివ్ గా రియక్ట్ అయ్యి ఒక నాటకం వేస్తె నీ టాలెంట్ ఏంటో తెలుస్తోంది. సో నాటకం వేసి కనపడమన్నారు. ఆత్రేయ గారు రాసిన పరివర్తన అనే నాటకాన్ని వేశారు కృష్ణంరాజు. అది చూసిన ప్రత్యగాత్మ తప్పకుండా అవకాశం ఇస్తానని మాట ఇచ్చి స్టేజ్ మీదనే చిలకా గోరింకా సినిమాను అనౌన్స్ చేసారు. అయితే అది మొదలవ్వడానికి ఇంకా సమయం పట్టే అవకాశాలు ఉండడంతో ఈలోగా ఆదుర్తి సుబ్బారావు గారు తేనే మనసులు సినిమాకు కొత్తవాళ్లను తీసుకుంటున్నారని తెలిసి ఇంటర్వ్యూకు వెళ్లారు. ఫైనల్ రౌండ్ కు కృష్ణంరాజు, కృష్ణ, హేమమాలిని, జయలలిత సెలెక్ట్ అవ్వగా ఫైనల్ గా కృష్ణంరాజు, హేమమాలిని, జయలలిత రిజెక్ట్ అయ్యారు. ఆదుర్తి సుబ్బారావు అసిస్టెంట్ కె. విశ్వనాధ్ ఈ ఇంటర్వ్యూలను నిర్వహించడం విశేషం. ఇక ఈలోగా ప్రత్యగాత్మ గారు చిలకా గోరింకాను మొదలుపెట్టారు. తీరా చూస్తే కృష్ణంరాజు మొదటి సినిమా ప్లాపైంది.

హీరో నుండి విలన్

చిలకా గోరింకా ప్లాప్ తర్వాత కృష్ణంరాజుకు తర్వాతి అవకాశాల కోసం ఎదురుచూడాల్సి వచ్చింది. ఈ సమయంలో డూండీగారు పిలిచి నాన్ అనే తమిళ చిత్రాన్ని చూపించి ఇందులో నటించాలని అడిగారు. అయితే కృష్ణంరాజు హీరో వేషమనుకున్నారు కానీ డూండీ గారు పిలిచింది విలన్ వేషానికి. విలన పాత్ర అనగానే కృష్ణంరాజులో నిరాశ ఎదురైంది. విలన్ అయితే నేను చేయలేను అని చెప్పి సున్నితంగా తిరస్కరించారు. ఈ విషయం తెలుసుకున్న ప్రత్యగాత్మ గారు శివాజీ గణేశన్ కూడా మొదట విలన్ గా చేసారు, సో ఇక ఏం ఆలోచించకండి అని చెప్పారు. మరోవైపు కృష్ణంరాజు మావయ్యకు బాగా తెల్సిన ఎల్వి ప్రసాద్ గారిని కూడా ఈ విషయంలో సలహా తీసుకున్నారు. దానికి ఎల్వి ప్రసాద్, ఏం ఆలోచించకుండా ఈ రోల్ ను ఎంచుకోమన్నారు. "నీ మొహం ప్రేక్షకులకు అలవాటు అవ్వాలి. ఒక్కసారి అలవాటు అయితే నువ్వు ఏం వేసినా చూస్తారు. సో మిస్ చేసుకోకు" అని అనడంతో కృష్ణంరాజు మరో మాట లేకుండా ఒప్పేసుకున్నారు. ఆ సినిమా ‘నేనంటే నేనే’. అందులో కృష్ణ హీరో.

నేనంటే నేనే పెద్ద సక్సెస్ అయింది. విలన్ గా కృష్ణంరాజుకు చాలా మంచి పేరు వచ్చింది. ఆ తర్వాత వరసగా భలే అబ్బాయిలు, బంగారు తల్లి వంటి సినిమాలతో విలన్ గా సుస్థిర స్థానం సంపాదించుకున్నారు కృష్ణంరాజు. ఇక భలే మాస్టర్, బడి పంతులు, వాడే వీడు, పల్లెటూరి చిన్నోడు, బుద్దిమంతుడు, పవిత్ర బంధం, రైతు కుటుంబం, జై జవాన్, అమ్మ కోసం, మాయదారి మల్లిగాడు వంటి సినిమాలతో విలన్ గా తిరుగులేని పేరుని సంపాదించుకున్నారు కృష్ణంరాజు. విలన్ గా తీరిక లేకుండా కృష్ణంరాజు దాదాపు నాలుగైదేళ్ళలో ఏకంగా 40-45 చిత్రాలు విలన్ గా చేసారు.

విలన్ నుండి మళ్ళీ హీరో

విలన్ గా తీరిక లేకుండా కొనసాగుతున్న కృష్ణంరాజు కెరీర్ 1973లో కీలక మలుపు తిరిగింది. ప్రత్యగాత్మ తమ్ముడు హేమాంబరధరరావు గారు ఇంటి దొంగలు అనే సినిమా తీయాలని భావించి కృష్ణంరాజును ఎంచుకున్నారు. ఆ సినిమా ఓ మోస్తారు విజయం సాధించడంతో కృష్ణంరాజుకు మళ్ళీ హీరోగా అవకాశాలు వచ్చాయి. అక్కడి నుండి హీరోగా, విలన్ గా కొనసాగుతూ సినిమాలు చేసారు కృష్ణంరాజు.

నిర్మాతగా తొలి అడుగు

అప్పటిదాకా అటు హీరో, ఇటు విలన్ గా రెండు పడవలపై సాగుతున్న కృష్ణంరాజు ప్రయాణం 1974లో చేసిన కృష్ణవేణి సినిమాతో కీలక మలుపు తీసుకుంది. గోపికృష్ణా మూవీస్ సంస్థను కృష్ణవేణి అనే హీరోయిన్ ఓరియెంటెడ్ సబ్జెక్ట్ ను తీసుకుని ప్రయోగాత్మకంగా నిర్మించారు. ఈ సినిమా నిర్మాణంలో ఉన్న సమయంలో అందరూ యాంటీ సెంటిమెంట్ కథ తీస్తున్నాడు, కృష్ణంరాజు పనైపోయింది అని అనుకున్నారు. అయితే వాటిని లెక్కచేయకుండా కృష్ణంరాజు కథను నమ్మి ఈ చిత్రాన్ని నిర్మించారు. కృష్ణవేణి పెద్ద బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. ఇక అక్కడి నుండి మళ్ళీ విలన్ వేషాలు వేయాల్సిన అవసరం కృష్ణంరాజుకు రాలేదు.

ఆ తర్వాత నుండి కృష్ణంరాజు కెరీర్ దూసుకుపోయింది. నిత్య సుమంగళి, మొగుడా పెళ్ళామా, భక్త కన్నప్ప, అమర దీపం, మనవూరి పాండవులు, కటకటాల రుద్రయ్య, భలే అల్లుడు, జీవన తీరాలు, బెబ్బులి, ఆడవాళ్ళూ మీకు జోహార్లు, టాక్సీ డ్రైవర్, బొబ్బిలి బ్రహ్మన్న, సర్దార్, కొండవీటి నాగులు, ఉక్కు మనిషి, బులెట్, తాండ్ర పాపారాయుడు, బందీ, రావణ బ్రహ్మ, బ్రహ్మ నాయుడు, అంతిమ తీర్పు, రిక్షా రుద్రయ్య, తాత-మనవడు, కుటుంబ గౌరవం వంటి సినిమాలతో టాలీవుడ్ ఇండస్ట్రీలో రెబెల్ స్టార్ గా ఎదిగారు కృష్ణంరాజు. 1978లో మనవూరి పాండవులు, కటకటాల రుద్రయ్య... ఈ రెండు చిత్రాలు కూడా కేవలం పదకొండు రోజుల గ్యాప్ లో విడుదలయ్యాయి. మనవూరి పాండవులులో సాఫ్ట్ క్యారెక్టర్ వేసిన కృష్ణంరాజు, కటకటాల రుద్రయ్యలో గంభీరమైన పాత్ర వేశారు. అయితే ఈ రెండు సినిమాలు కూడా బ్లాక్ బస్టర్ విజయాలు సాధించడం విశేషం.

గోపికృష్ణా మూవీస్
ఎక్కువగా యాక్షన్ సినిమాలు చేయడంతో కృష్ణంరాజు గారు రెబెల్ స్టార్ గా పేరు సంపాదించుకున్నారు. అయితే దీనికి భిన్నంగా సినిమాలు చేయడానికి నిర్మాతలు సాహసించకపోవడంతో తన నిర్మాణ సంస్థ గోపికృష్ణా మూవీస్ బ్యానర్ కృష్ణంరాజుకు ఉపయోగపడింది. కృష్ణవేణి చిత్రంతో ఈ బ్యానర్ ను స్థాపించిన కృష్ణంరాజు మొత్తంగా 14 సినిమాలను నిర్మించారు. ఈ 14 చిత్రాల్లో కూడా రెండో, మూడో తప్పితే మిగతావన్నీ బ్లాక్ బస్టర్ విజయాలు సాధించడమే కాదు, కృష్ణంరాజును అభిరుచి గల నిర్మాతగా నిలబెట్టాయి. ముఖ్యంగా కృష్ణవేణి, మనవూరి పాండవులు, భక్త కన్నప్ప, తాండ్ర పాపారాయుడు, శివమెత్తిన సత్యం వంటి సినిమాలతో తన బ్యానర్ స్థాయిని పెంచారు కృష్ణంరాజు.

క్యారెక్టర్ నటుడిగా

మా నాన్నకు పెళ్ళి సినిమాతో కృష్ణంరాజు తిరిగి క్యారెక్టర్ నటుడిగా మారారు. అక్కడినుండి సెలెక్టివ్ గా సినిమాలను ఎంచుకున్నారు. సుల్తాన్, వంశోద్ధారకుడు, నీకు నేను నాకు నువ్వు, రామ్, శ్రీశైలం, బిల్లా, తకిట తకిట, రెబెల్, ఎవడే సుబ్రహ్మణ్యం, రుద్రమదేవి చిత్రాల్లో నటించారు కృష్ణంరాజు.


రాజకీయ ప్రస్థానం:
చిన్నప్పటి నుండి కృష్ణంరాజుకు రాజకీయాలంటే ప్రత్యేకమైన ఆసక్తి ఉండేది. కృష్ణంరాజు బంధువుల్లో కూడా రాజకీయ నేపధ్యం ఉన్న వారు ఉండడంతో రాజకీయం బానే ఒంటబట్టింది. రాజీవ్ గాంధీ పట్ల ఆకర్షితులు అయిన కృష్ణంరాజు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకుని ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు. 1992లో నర్సాపురం నుండి పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత కొంత కాలం రాజకీయాల నుండి బ్రేక్ తీసుకున్న కృష్ణంరాజు భారతీయ జనతా పార్టీలో చేరి 1998 ఎన్నికల్లో కాకినాడ లోక్ సభ స్థానం నుండి పోటీ చేసి విజయం సాధించారు. దాదాపు 1,65,000 ఓట్ల మెజారిటీ సాధించారు. ఆంధ్రప్రదేశ్ నుండి ఒక ఎంపీ ఆ మెజారిటీతో గెలవడం అదే అత్యధికం. ఈ దెబ్బతో కేంద్ర మంత్రి పదవి కూడా కృష్ణంరాజును వరించింది. కేంద్ర మంత్రిగా దాదాపు నాలుగైదు పోర్ట్ ఫోలియోలు చేసారు కృష్ణంరాజు.

ఆ తర్వాత ఎన్నికల్లో నర్సాపూర్ టికెట్ నుండి పోటీ చేసి అక్కడా విజయం సాధించారు. అయితే భారతీయ జనతా పార్టీలో అంతర్గత కుమ్ములాటలు నచ్చక రాజకీయంగా బాగా దూరంగా ఉండిపోయారు. సరిగ్గా అప్పుడే 2009లో చిరంజీవి పార్టీ పెట్టడంతో కృష్ణంరాజు ప్రజారాజ్యంలో చేరి రాజమండ్రి నుండి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. అప్పటినుండి కృష్ణంరాజు రాజకీయంగా దూరంగా ఉండిపోయారు.

కృష్ణంరాజు కుటుంబం
కృష్ణంరాజు మొదట భార్య యాక్సిడెంట్ లో చనిపోయారు. వీరికి ఒక కుమార్తె. తనకు పెళ్లి చేసారు. ఈ అమ్మాయి ద్వారా కృష్ణంరాజుకు ఇద్దరు మనవరాళ్లు కూడా ఉన్నారు. మొదటి భార్య చనిపోయాక 1996లో శ్యామలా దేవిని వివాహం చేసుకున్నారు కృష్ణంరాజు. వీరికి ముగ్గురు కుమార్తెలు సాయి ప్రశీద, సాయి ప్రకీర్తి, సాయి ప్రదీప్తి. కృష్ణంరాజు గారు చిన్నతనం నుండే పరమ సాయి భక్తులు. అందుకే తన ముగ్గురు కుమార్తెలకు సాయి పేరు ఉండేలా చూసుకున్నారు. వీరే కాకుండా ఓకే అమ్మాయిని దత్తత తీసుకున్నారు కృష్ణంరాజు. ఆ అమ్మాయి పేరు సాయి ప్రశాంతి.

కృష్ణంరాజుకు కొడుకులు లేకపోయినా తమ్ముడు సూర్యనారాయణ రాజు కొడుకు ప్రభాస్ ఉప్పలపాటిని తన వారసుడిగా పరిచయం చేసాడు. ఈశ్వర్ సినిమాతో ప్రభాస్ ఇండస్ట్రీకి పరిచయమైన ప్రభాస్ అంచలెంచులుగా ఎదుగుతూ నేడు నేషనల్ స్టార్ అయ్యాడు. దేశవ్యాప్తంగా ప్రభాస్ నటించిన సినిమాలకు క్రేజ్ వచ్చింది. ఈశ్వర్ సినిమా మొదలుకుని సాహో వరకు అంచలంచెలుగా ఎదుగుతూ యావత్ భారతదేశం అంతా అభిమానుల్ని సొంతం చేసుకున్నారు. ఆయన నటించిన భాహుబలి చిత్రంతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు సొంతం చేసుకున్నారు.

కృష్ణంరాజు దాదాపు తన సుదీర్ఘమైన కెరీర్ లో 183 సినిమాలకు పైగా చేస్తే సహజనటి జయసుధతో దాదాపు 70 సినిమాలకు పైగా పనిచేసారు. అంతలా వారి కాంబినేషన్ వర్కౌట్ అయింది. ఇక తనకు జయసుధ, శ్రీదేవి ఇష్టమైన నటీమణులుగా కృష్ణంరాజు పలు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.

కృష్ణంరాజు అందుకున్న అవార్డులు, పురస్కారాలు

* నంది అవార్డులు ప్రవేశ పెట్టాక అందుకున్న తొలి తెలుగు హీరో కృష్ణంరాజు.

* 1977లో అమరదీపం చిత్రానికి ఉత్తమ నటుడిగా నంది పురస్కారం వరించింది.

* మళ్ళీ 1984లో బొబ్బిలి బ్రహ్మన్న చిత్రానికి రెండో సారి నంది అవార్డును అందుకున్నారు కృష్ణంరాజు.

* ఇక 1994లో జైలర్ గారి అబ్బాయి చిత్రానికి గాను ఉత్తమ సహాయ నటుడి అవార్డును అందుకున్నారు.

* కృష్ణంరాజు తన కెరీర్ లో మొత్తం నాలుగు ఫిల్మ్ ఫేర్ సౌత్ అవార్డులను కైవసం చేసుకున్నారు. తాను తొలి నంది అవార్డు అందుకున్న అమరదీపం చిత్రానికే ఫిల్మ్ ఫేర్ అవార్డును సైతం సొంతం చేసుకున్నారు.

* కృష్ణంరాజు కెరీర్ లో మరో మరుపురాని చిత్రం బొబ్బిలి బ్రహ్మన్న. ఈ సినిమాకు రెండోసారి ఫిల్మ్ ఫేర్ అవార్డును సొంతం చేసుకున్నారు.

* ఇక మూడోసారి భారీ ఖర్చుతో కృష్ణంరాజు నిర్మించిన తాండ్ర పాపారాయుడు చిత్రానికి ఫిల్మ్ ఫేర్ గౌరవం దక్కింది.

* 1988లో అంతిమ తీర్పు చిత్రానికి గాను కృష్ణంరాజు నాలుగోసారి ఫిల్మ్ ఫేర్ గౌరవం దక్కించుకున్నారు.

* 2006లో ఫిల్మ్ ఫేర్ జీవితకాల సాఫల్య పురస్కారంతో రెబెల్ స్టార్ కృష్ణంరాజు గౌరవించింది.

* అమరదీపం చిత్రానికి గాను రాష్ట్రపతి అవార్డును సైతం అందుకున్నారు.

* తర్వాతి ఏడాది విడుదలైన మనవూరి పాండవులు చిత్రంలో పోషించిన కృష్ణ పాత్రకు గాను కృష్ణంరాజుకు ఈ అరుదైన గౌరవం మరోసారి దక్కింది.

* తెలుగు సినిమాకు ఇచ్చే అత్యంత ప్రతిష్టాత్మక అవార్డు రఘుపతి వెంకయ్య పురస్కారాన్ని 2014లో అందుకున్నారు కృష్ణంరాజు.

* ప్రతీ ఏటా టిఎస్సార్ టీవీ9 భాగస్వామ్యంతో ఇచ్చే పురస్కారాలను మూడు సార్లు అందుకున్నారు కృష్ణంరాజు. 2012లో జీవితకాల సాఫల్య పురస్కారం, 2015లో సిల్వర్ స్క్రీన్ లెజెండరీ అవార్డు, 2016లో 5 దశాబ్దాల స్టార్ అవార్డును అందుకున్నారు కృష్ణంరాజు.

* 2015 సంవత్సరంలో జీ తెలుగు అవార్డ్స్ వారి జీవిత కాల సాఫల్య పురస్కారాన్ని అందుకున్నారు కృష్ణంరాజు.

* అదే ఏడాది గామా (గల్ఫ్ ఆంధ్రా మ్యూజికల్ అవార్డ్స్) వారు జీవిత కాల సాఫల్య పురస్కారంతో కృష్ణంరాజును సత్కరించారు.

మొగల్తూరు నుండి వచ్చిన కృష్ణంరాజు ఎంత ఎత్తుకి ఎదిగినా సొంత ఊరుని ఏనాడూ మర్చిపోలేదు. పుట్టిన గడ్డకు ఎన్నో సంక్షేమ పథకాలు అమలయ్యేలా చేసారు కృష్ణంరాజు. తన నియోజిక వర్గం అభివృద్ధి కోసం ఎన్నో కార్యక్రమాలు చేసారు. ముఖ్యంగా సినీ పరిశ్రమ అభివృద్ధి కోసం కృష్ణంరాజు నెల్లూరు, ఏలూరు విజయవాడ ప్రాంతాల్లో ఓపెన్ ఎయిర్ థియేటర్లను స్థాపించారు. కృష్ణంరాజు గారికి ఒక అరుదైన రికార్డు ఉంది. భారతీయ చలన చిత్ర పరిశ్రమ నుండి వచ్చి కేంద్ర మంత్రి అయిన మొట్ట మొదటి నటుడు కృష్ణంరాజు గారే.  

తెలుగు సినిమాలో ఎంతో మంది హీరోలు రావొచ్చు కానీ రెబెల్ అనగానే మనకు గుర్తొచ్చే పేరు కృష్ణంరాజు. గంభీరమైన డైలాగులు, ఆవేశపూరిత సంభాషణలకు కృష్ణంరాజు పెట్టింది పేరైనా కానీ తాను అంతకు మించి మంచి నటుడ్ని అని చాలా సినిమాలతో ప్రూవ్ చేసుకున్నారు. తన తర్వాత ఇండస్ట్రీకి తన తమ్ముడు కొడుకు ప్రభాస్ ను ఇండస్ట్రీకి పరిచయం చేసారు. ప్రభాస్ నటించిన బిల్లా, రెబెల్ సినిమాల్లో కృష్ణంరాజు కీలక పాత్రల్లో కనిపించిన విషయం తెల్సిందే. తనను మించి ఎదిగిన ప్రభాస్ ఇప్పుడు రీజినల్ స్టార్ నుండి నేషనల్ స్టార్ రేంజ్ కు ఎదిగారు. ప్రస్తుతం ప్రభాస్ నటిస్తోన్న రాధే శ్యామ్ చిత్రాన్ని తన సంస్థ గోపికృష్ణ మూవీస్ బ్యానర్ పై సమర్పిస్తున్నారు రెబెల్ స్టార్. మొత్తంగా ఆరు దశాబ్దాలకు పైగా తెలుగు సినీ కళామతల్లికి సేవలు చేసిన, చేస్తున్న కృష్ణంరాజుకు హ్యాట్సాఫ్ చెప్పకుండా ఉండలేం.

- Advertisement -

You've successfully subscribed to Tollywood Latest News | Celebrities Profiles | Media9 Tollywood
Great! Next, complete checkout to get full access to all premium content.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.