
సాహో చిత్రం తర్వాత యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం రాధేశ్యామ్. భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని యు.వి.క్రియేషన్స్, టి-సిరీస్ ల బ్యానెర్ల పై వంశి కృష్ణ రెడ్డి, ప్రశీద ఉప్పలపాటి, ప్రమోద్ ఉప్పలపాటి, భూషణ్ కుమార్లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ‘జిల్’ చిత్రంతో దర్శకుడిగా పరిచయమైన ‘రాధా కృష్ణ’ ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. ఈ చిత్రంలో ప్రభాస్ కు జోడిగా పూజా హెగ్డే నటిస్తున్నారు.
పీరియాడిక్ డ్రామా గా రూపొందుతున్న ఈ చిత్రం 1970లో ఇటలీ బ్యాక్ డ్రాప్ లో జరిగే కథాంశంతో తెరకెక్కుతోంది. లాక్ డౌన్ తర్వాత విదేశాల్లో షూటింగ్ జరుపుకుంటున్న భారీ తెలుగు చిత్రం ఇదే. కాగా ఇంతకు మునుపే ఈ చిత్ర షూటింగ్ కోసం ప్రభాస్ ఇతర ముఖ్య నటులు ఇటలీ చేరుకుని షూటింగ్ మొదలుపెట్టారు. తాజాగా పూజ హెగ్డే కూడా ఇటలీలో జరుగుతున్న షూటింగ్ లో అడుగుపెట్టారు. ప్రభాస్, పూజాల కెమిస్ట్రీ ఈ చిత్రానికి ప్రధానాకర్షణగా ఉంటుందని దర్శకుడు రాధా కృష్ణ తెలిపారు. ఈ చిత్రంలో రెబెల్ స్టార్ కృష్ణంరాజు, ప్రియదర్శి, భాగ్యశ్రీ ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రం తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఏకకాలంలో నిర్మితమౌతోంది.