తప్పుడు ఆరోపణలు నమ్మొద్దు.. సునీత బోయ తప్పుడు ఆరోపణలపై నిర్మాత బన్నీ వాస్ అధికారిక వివరణ..

గౌరవనీయమైన నిర్మాత బన్నీ వాస్‌ గారిపై.. మిస్ సునీత బోయ అనే అమ్మాయి తప్పుడు ఆరోపణలు చేస్తున్న విషయంపై కొన్ని విషయాలు మీ దృష్టికి తీసుకురావడం జరుగుతుంది. గత కొన్ని సంవత్సరాల నుంచి.. అంటే 2019 నుంచి ఇప్పటి వరకు సునీత బోయ.. గీతా ఆర్ట్స్ సంస్థ.. అలాగే నిర్మాత బన్నీ వాస్ గారిపై నిరాధారమైన ఆరోపణలు చేస్తుంది. ఆమె సమాజంలో ప్రముఖులను లక్ష్యంగా చేసుకునేది. అంతేకాకుండా ఎప్పటికప్పుడు హెడ్ లైన్స్‌లో ఉండటానికి.. కావాలనే వివాదాస్పద విషయాల్లో వేలు పెట్టడం.. వాటికి సంబంధించిన డిబేట్స్‌లో పాలు పంచుకోవడం చేస్తుంది. ఈమెకు ముందు నుంచి కూడా అలవాటు ఇది. దీనికి ఆధారాలు కావాలంటే 2019 నుంచి ఇప్పటి వరకు ఆమె పోస్ట్‌లు, యూట్యూబ్ లింక్‌లను చూడవచ్చు. వాటిని చూస్తే ఎవరికైనా ఇట్టే అర్థమవుతుంది సునీత బోయ మనస్తత్వం ఏంటనేది.

ఇలాంటి పనులు ముందు నుంచే చేస్తున్న సునీత.. దాదాపు అన్నింట్లోనూ విజయం సాధించింది. ఒక్క గీతా ఆర్ట్స్ సంస్థ, బన్నీ వాస్ గారి విషయంలో తప్ప. వాళ్లు ఈమె బెదిరింపులకు, అబద్ధపు ఆరోపణలకు లొంగలేదు.. బెదరలేదు. ఈమె జీవితంలో ఏదో బాధలో ఉండుంటుందని భావించి.. సునీత ఆరోపణలపై బన్నీ వాస్ గారు ఏ మాత్రం స్పందించలేదు. సినిమా ఇండస్ట్రీలోనూ అవకాశాల కోసం ప్రయత్నించి విఫలమై ఉంటుందేమో అనే జాలితో వదిలేసారు. అయితే ఆమెకు పరిస్థితులను జీర్ణించుకోవడం కష్టంగా మారింది. దాంతో మళ్లీ గీతా ఆర్ట్స్ సంస్థతో పాటు.. నిర్మాత బన్నీ వాస్ గారిని టార్గెట్ చేయడం మొదలు పెట్టింది. అప్పటి నుంచి కేవలం బన్నీ వాస్ గారిని మాత్రమే కాకుండా.. ఆయన కుటుంబ సభ్యులు, స్నేహితుడు, బంధువులను కూడా రాతల్లో చెప్పలేని విధంగా అసభ్య పదజాలంతో దూషిస్తూ కావాలనే రెచ్చగొడుతుంది సునీత బోయ. అక్కడితో ఆగకుండా సోషల్ మీడియా వేదికలైన ఇన్‌స్టాగ్రామ్, యూ ట్యూబ్, ఫేస్ బుక్ లాంటి చోట్ల అసభ్యకరమైన పదజాలంతో ఆమె ఆరోపణలు చేస్తుంది. అలాగే బన్నీ వాస్ గారి 4 సంవత్సరాల కుమార్తెను చంపాలనే ఆలోచనలు తనకు వస్తున్నాయని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో ఆమె ఒక వీడియోను పోస్ట్ చేసింది. ఆమె ఇంతకి దిగజారిన తర్వాత.. మరో దారి లేక బన్నీ వాస్ గారు న్యాయబద్ధంగా పోరాడాలని.. పోలీసులతో పాటు గౌరవ న్యాయస్థానం వైపు అడుగులు వేసారు.

పోలీసులను ఆశ్రయించిన తర్వాత బన్నీ వాస్ గారిపై మరింత పగ పెంచుకున్న సునీత బోయ.. తన వేధింపులను తారాస్థాయికి తీసుకెళ్లింది. బన్నీ వాస్ గారితో పాటు ఆయన కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులపై తీవ్రస్థాయిలో వేధింపులు పెంచేసింది. అక్కడితో ఆగకుండా తనను లైంగిక వేధింపులకు గురి చేసాడని కొత్త కట్టుకథతో ముందుకొచ్చింది. ఇదంతా పూర్తిగా అబద్ధమని బన్నీ వాస్ గారు తెలియజేసారు. అసలు విచిత్రం ఏంటంటే ఏ రోజు కూడా సునీత బోయ అనే అమ్మాయిని బన్నీ వాస్ గారు కలవలేదు. అసలు పరిచయమే లేని వాస్ గారిపై.. ఇలాంటి నిరాధారమైన ఆరోపణలు చేస్తుంది సునీత. గీతా ఆర్ట్స్ సంస్థ, బన్నీ వాస్ గారి కదలికలను ఎప్పటికప్పుడు నిఘా పెట్టిన సునీత బోయ.. చాలాసార్లు అతడిపై దాడులకు కూడా ప్రయత్నం చేసింది. అందుకే బన్నీ వాస్ గారి ఫిర్యాదు మేరకు ఆమెను 3 నెలల పాటు విజయవాడ సబ్ జైలులో శిక్ష వేసారు. ఆ కోపంతో మరింత తీవ్రస్థాయిలో వేధిస్తుంది సునీత. అయినా కూడా ఓపిగ్గా భరిస్తున్న బన్నీ వాస్ గారు.. ఈ విషయాన్ని కేవలం చట్ట ప్రకారం మాత్రమే పరిష్కరించుకోవాలని చూస్తున్నారు. అందుకే న్యాయపరమైన ప్రక్రియను అనుసరిస్తున్నారు.

సునీత బోయ చేసిన ఏ ఆరోపణ తీసుకున్నా కూడా నిరాధారంగా.. అలాగే ఒకదానితో మరోటి సంబంధం లేకుండా ఉంటాయి. రాజకీయాలు, సినిమాలు, ప్రముఖులు, గీతా ఆర్ట్స్ సంస్థ, బన్నీ వాస్‌ గారికి సంబంధించిన ఏ ఇష్యూ తీసుకున్నా కూడా సంబంధం లేకుండా.. తనకు నచ్చినట్లు మాటలు మారుస్తుంటుంది సునీత. యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌లో ఆమె పోస్ట్ చేసిన అన్ని వీడియోలను చూస్తే ఈ విషయం మీకే అర్థమైపోతుంది. పరిస్థితులకు తగ్గట్లు.. తను ముందు అన్న మాటనే మళ్లీ మార్చి చెప్పడం సునీత బోయకు అలవాటు. ఆమె తప్పుడు స్టేట్‌మెంట్ ఇస్తూ కూడా ప్రజలను నమ్మించడానికి ప్రయత్నిస్తుంది. అయినా కూడా ఆమె మాటలు వింటే ఎంత వరకు నిజాలు చెప్తుందో తెలిసిపోతుంది.

కాబట్టి అందరికీ తెలిపేదేమనగా .. దయచేసి ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేసే వ్యక్తులను ప్రోత్సహించొద్దని మనవి. లైమ్ లైట్‌లో ఉండటానికి ఈమె చేసే తప్పుడు ఆరోపణలను మీడియా ఎలాంటి కథనాలను కూడా ప్రచురించవద్దని హృదయపూర్వక విన్నపం. బన్నీ వాస్ గారిపై ఎలాంటి ఆరోపణలు చేయొద్దని.. HRCతో పాటు సంబంధిత గౌరవ విచారణ, జిల్లా హైకోర్టులలో ఈమెకు వార్నింగ్స్ వచ్చాయి. అయినా కూడా పట్టించుకోకుండా అలాగే ఆరోపణలు చేస్తుంది. సమస్యలు పరిష్కారం అయ్యేవరకు ఆరోపణలు చెప్పినా అలాగే చేయడం అనేది కోర్టు ధిక్కరణే. తీర్పు వచ్చిన తర్వాత కచ్చితంగా మీడియా ముందుకు వచ్చి జరిగిన వాస్తవాలన్నింటిని వివరిస్తాము. అంతేకాదు దీని వెనుక ఉన్న వ్యక్తులపై తప్పనిసరిగా చట్టపరమైన చర్యలు తీసుకుంటాం.

- Advertisement -

You might also like

You've successfully subscribed to Tollywood Latest News | Celebrities Profiles | Media9 Tollywood
Great! Next, complete checkout to get full access to all premium content.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.