
ప్రతి సంవత్సరం సంక్రాంతి రేస్ లో చాలా సినిమాలు ఉండేవి. కానీ ఈ 2021 సంక్రాంతికి మాత్రం కేవలం మూడు తెలుగు సినిమాలు మాత్రమే విడుదలకి సిద్ధం అయ్యాయి. వాటిలో రవితేజ క్రాక్ , రామ్ రెడ్ , బెల్లంకొండ శ్రీనివాస్ అల్లుడు అదుర్స్ సినిమాలు ఉన్నాయి. కాకపోతే కొన్ని సినిమాలు సంక్రాంతి కి విడుదల చేస్తాం అని ప్రకటించి ఆ తర్వాత తప్పుకున్నాయి. అందులో అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్, రానా అరణ్య, అల్లరి నరేష్ బంగారు బుల్లోడు, జాంబీ రెడ్డి లాంటి సినిమాలు ఉన్నాయి. ఈ సినిమాల్లో కొన్ని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఆలస్యం అవ్వడం వల్ల సంక్రాంతి భరి నుంచి తప్పుకున్నాయి. కాకపోతే చాలా సినిమాలు మాత్రం ప్రస్తుతం థియేటర్స్ లో 50 శాతం సీటింగ్ వల్ల, ప్రజలు థియేటర్స్ కి వస్తారో రారో, తాము పెట్టిన బడ్జెట్ ని సినిమా ఈ టైంలో రికవర్ చేస్తుందో లేదో అని సందేహంతో వెనక్కి తగ్గుతున్నారు. అందుకే టాలీవుడ్ కి ఈ సంవత్సరం సంక్రాంతి చాలా ముఖ్యమైనది. ఇప్పుడు విడుదలయ్యే సినిమాల ఫలితం మీదనే చాలా సినిమాల విడుదల తేదీలు ఆధారపడి ఉన్నాయి. ఇక ధైర్యం చేసి విడుదల చేస్తున్న సినిమాల మీద మాత్రం జనాలతో భారీ అంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా రవితేజ క్రాక్, రామ్ రెడ్ సినిమాల కోసం అభిమానులు, సాధారణ జనాలు ఎదురుచూస్తున్నారు.