కళా పిపాసి తనికెళ్ళ భరణి

రచయితగా సినీ ప్రస్థానాన్ని ప్రారంభించి అనతి కాలంలోనే నటుడిగా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు తనికెళ్ళ భరణి గారు. కమెడియన్ గా , విలన్ గా , సహాయ నటుడుగా ఆయన చేసిన ప్రతి పాత్రలో ఒడిగిపోవడం ఆయన గొప్పతనం. ఒక పక్క నటిస్తూనే మరో పక్క ఆటగదరా శివ అంటూ శివతత్వం గురించి పరిచయం చేసిన గొప్ప వ్యక్తి తనికెళ్ళ భరణి గారు.

జననం

తనికెళ్ళ భరణి గారు 14జూలై 1956 న సికిందరాబాద్లో జన్మించారు. ఈయన తల్లిదండ్రులు శ్రీ తనికెళ్ళ రామలింగేశ్వరరావు, శ్రీమతి లక్ష్మీ నరసమ్మ దంపతులు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరం దగ్గర ఎండగండి ప్రాంతానికి చెందిన రామలింగేశ్వర రావు 1938లో హైదరాబాద్ కి వచ్చి స్థిరపడ్డారు. దైవభక్తి, దేశభక్తి, సేవానిరతి కలిగిన రామలింగేశ్వర రావు రాష్ట్రంలో తుపానులు, విపత్తులు సంభవించినపుడు బియ్యం, పప్పుదినుసులు, బట్టలు తదితరాలను సేకరించి బాధితులకు అందించేవారు. భారత, భాగతవతాలను ఔపోసన పట్టిన ఈయన యోగాసనాల్లో నిపుణులు కూడా. విశిష్ట సాహితీవేత్త, పండితులు శ్రీ దివాకర్ల వేంకటావధాని వీరికి బంధుత్వం ఉంది. తనికెళ్ల భరణికి ముగ్గురు అన్నయ్యలు, ముగ్గురు తమ్ముళ్ళు ఉన్నారు. సికిందరాబాద్ రైల్వే పాఠశాల, జూనియర్ కాలేజీల్లో చదువుకున్న భరణి  బి.కాం కామర్స్  పూర్తి చేశారు.ఆయనకి చిన్నప్పటి నుంచి నాటకాల మీద విపరితమైన ఆసక్తి.

1970లలో తనికెళ్ళ భరణి నాటకాలు ఆడే సమయంలో ప్రముఖ నటులు రాళ్ళపల్లితో పరిచయం అయ్యింది. రాళ్లపల్లి ప్రోత్సాహంతో చిన్నగా సంభాషణలు, సన్నివేశాలు రాయడం మొదలెట్టారు భరణి, తదుపరి ఉస్మానియా యూనివర్శిటీ నుండి నాటకరంగంలో డిప్లొమా సాధించారు. స్వీయ రచనలైన నాటకాలు, కవితలను పుస్తకాలుగా ముద్రించారు. ఆకాశ వాణిలో నాటికలు, పత్రికలు గాత్రధారణ, తొలినాటి దూరదర్శన్ సీరియళ్ళకు సంభాషణలు రాసారు, నటించారు.నాటకాలలో  ఎక్కువగా భరణి గారు విలన్ పాత్రలు పోషించారు.

సినీ జీవితం

తనికెళ్ళ భరణి వ్రాసిన "చల్ చల్ గుర్రం" నాటకం చూసిన రామరాజు హనుమంతరావు గారు, రాళ్ళపల్లి గారి ద్వారా వంశీ గారికి పరిచయం చేస్తానని చెప్పి ఒక రోజు పొద్దున్నే వంశీ గారి  దగ్గరకు తీసుకెళ్లారు. లోపలికెళ్లేటప్పటికి  'గోపెమ్మ చేతిలో గోరుముద్ద పాట ఎడిటింగ్ చూసుకుంటున్నారు వంశీ. ఒకరికి ఒకరు పరిచయాలయ్యాక వంశీ గారు 'కామెడీ రాస్తావా' అన్నారట. భరణి గారు రాస్తానన్నారు. అప్పుడు భరణి గారికి ఒక సిట్యుయేషన్ చెప్పి ఒకవారం రోజులు టైం తీస్కాని, ఏడు సీన్స్ రాయండి అన్నారు. అలాగే అని భరణి గారు ఇంటికెళ్ళి సాయంత్రానికల్లా ఏడు సీన్లు రాసుకుని తీసుకెళ్లారు. వంశీ గారికి ఒక్కొక్క సీన్ చెప్తుంటే పగలబడి నవ్వారట. భరణి గారు చెప్పడం పూర్తయ్యాక 'మీరే నా తర్వాత సినిమా రచయిత' అని వంశీ గారు అన్నారు. అప్పటికే ప్రేమించు పెళ్లాడు షూటింగ్ పూర్తయిపోయింది. కానీ దానికి ఆయనతో ఏదైనా చేయించాలని పట్టుబట్టి టైటిల్స్ కి ముందు ఒక కామెడీ ట్రాక్ రాయించుకున్నారు. ఆ సినిమాకి రామోజీరావుగారు భరణి గారికి 2000 రూపాయలు పారితోషికం పంపించారు. ట్రాజెడీ ఏంటంటే.. ఆ డబ్బుల్ని రాళ్ళపల్లి గారి అసిస్టెంట్ కొట్టేశాడు.

ఈ సమయంలోనే తనికెళ్ళ భరణి గారు మెల్లగా సినిమాల్లో నటించడం మొదలుపెట్టారు. ఆయన నటించిన మొదటి సినిమా సుమన్ హీరోగా వచ్చిన కంచు కవచం. ఈ సినిమాలో భరణి గారు మాటలు కూడా అందించారు. తర్వాత వంశీ గారితో వరసగా సినిమాలు చేయడం మొదలుపెట్టారు. అయితే కొన్ని సార్లు వంశీ గారు " ఏంటయ్యా ఈ సీన్స్ " అని తిట్టేవారట..దానికి కొన్నిసార్లు భరణి గారు ఏడ్చేవారు.  అప్పట్లోనే ఆయనకి లేడీస్ ట్రైలర్ కథ కూడా చెప్పారు. ఇక ఆ సినిమాతో వంశీ - తనికెళ్ళ భరణి గారి కాంబినేషన్ సెన్సేషనల్ అయిపోయింది. వరస పెట్టి కనకమాలక్ష్మీ రికార్డింగ్ డాన్స్. ట్రూప్, చెట్టుకింద ప్లీడర్, లింగబాబు లవ్ సోరీ... ఇలా చాలా సినిమాలు చేశారు.లేడీస్ టైలర్ సినిమా  తీసేటప్పుడు భరణి గారు ఆర్టిస్టులకు డైలాగులు చెబుతుంటే చూసి 'మీలో మంచి ఆర్టిస్ ఉన్నాడండీ అన్నారట. వంశీ గారు.అప్పుడే భరణి గారు " నేను రంగస్థల నటుడు అండి " అని అంటే ఆయన తర్వాత సినిమా కనకమాలక్ష్మి రికార్డింగ్ డాన్స్ ట్రూప్ లో భరణి గారికి దొరబాబు అనే పాత్రని ఇచ్చారు. "సీతతో అదంతా వీజి కాదు" అనే డైలాగు కి మంచి స్పందన వచ్చింది.గుండమ్మగారి మనవుడు చిత్రంలో ఒక పాటరాసి స్వయంగా పాడారు భరణి.

అయితే ఆయనకి అప్పట్లో అత్యంత పేరు తెచ్చిన సినిమా 'శివ'. ఈ సినిమాలో భరణి ధరించిన 'నానాజీ' పాత్ర విపరీతమైన స్పందన వచ్చింది.అయితే భరణి గారికి ఈ సినిమా ఛాన్స్ రావడానికి ఒక చిన్న కథ ఉంది. అందేంటి అంటే  'రావుగారిల్లు' సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు శివనాగేశ్వరరావు ద్వారా భరణి గారికి పరిచయమయ్యాడు రాంగోపాల్ వర్మ. అప్పట్లో తను ఇంగ్లిష్ బాగా మాట్లాడేవాడు. అందుకని 'వీడు ఇంగ్లీషు మీడియం వాడు" అన్నారు. పక్కనున్నవాళ్ళు వేళాకోళంగా, పరిచయం చేసే కొద్దీ రామ్ గోపాల్ వర్మ , భరణి గారు బాగా కనెక్ట్ అయ్యారు. ఒక సారి ఆయనకి రాము దగ్గర్నుంచి కలవముని ఫోన్ వస్తే వెళ్లారు. అక్కడికి  వెళ్లేసరికి అన్నపూర్ణ స్టూడియో ఆఫీసులో డైరెక్టర్ కుర్చీలో అర్జీవి కూర్చుని ఉన్నాడు.అప్పుడు భరణి గారి  ఇదేంటన్నట్లుగా చూస్తే నేను సినిమా 'డైరెక్ట్ చేస్తున్నాను' అని అర్జీవి అన్నారు. 'అప్పుడేనా' అని భరణి గారు ఆశ్చర్య పోతే.. 'నువ్వు నా సినిమాకి రాస్తావో లేదో తెలీదుకానీ, నీ కంపెనీ నాకు బావుంటుంది' అన్నాడు రాము. తర్వాత శివ సినిమా కథ చెప్పాడు. కొద్దిరోజుల తర్వాత ఫస్టాఫ్ డైలాగులు రాసి భరణి గారు తీసుకెళ్లారు. అప్పటికి వంశీవి చాలా సినిమాలు చేసిన ప్రభావం ఆయన మీద బాగా ఉంది.శివ స్క్రిప్ట్ అంత కామెడీతో నింపేసారు భరణి. ఆ స్క్రిప్టు చూసి షాకయ్యాడు వర్మ.'ఇదేంటి కామెడీ సినిమా చేశారు. నాది సీరియస్ సినిమా, ఒక్క కామెడీ డైలాగ్ కూడా ఉండటానికి వీల్లేదు' అన్నాడు. 'అయితే ఇది ప్లాప్ ' అనుకుని భరణి గారు అర్జీవి అడిగినట్లు రాశాను.ఇక శివ సినిమా విడుదల తర్వాత ఎంత పెద్ద హిటో అందరికీ తెలిసిందే. అందులో 'నానాజి' క్యారెక్టర్ ముందు భరణి గారిని అనుకోలేదు. వేరెవరో నటుడిని అనుకున్నారు. కానీ అతను కాల్టీట్లు లేవన్నాడు. ఒకరోజు రామ్ గోపాల్ వర్మ 'భరణి, నానాజీ వేషం మీరే చేసెయ్యండి అన్నాడు. ఉన్నట్టుండి. స్క్రిప్ట్ రాయడం వల్ల.. పాత్ర ఎలా ఉండాలో భరణి గారికి ఐడియా..మనసులో ఉంది. అదొక తెలంగాణ ప్రాంతప యాదవ యువకుడి వేషం భరణి గారు కూడా అక్కడే పుట్టి పెరిగారు. అందుకని కొద్ది సేపటి తర్వాత లంచి, పైజామా వేసుకుని తాయెత్తు కట్టుకుని బుగ్గన పాన్తో రాము గారి దగ్గరికి వెళ్లారు .'పర్ఫెక్ట్స్ నాకిదే కావాలి' అని అర్జీవి ఆయన్ని ఫైనల్ చేశారు.శివ సినిమా తనికెళ్ళ భరణి గారి నట జీవితాన్నే మార్చేసింది.

శివ సినిమా వల్ల ఆయనకి వరసగా మంచి మంచి పాత్రలు వచ్చాయి.ఆ తర్వాత చేసిన చెవిలో పువ్వు, జగదేక వీరుడు అతిలోక సుందరి, అప్పుల అప్పారావు సినిమాలు సూపర్ హిట్ అవ్వడమే కాకుండా భరణి గారికి నటుడుగా మంచి పేరు తీసుకొని వచ్చాయి. 'చెవిలో పువ్వు' సినిమాలో ఆయన చేసిన పరమ శాడిస్ట్ పాత్ర వల్ల ఒకసారి భరణి గారు రైల్ లో ఎక్కడికో వెళుతూ నెల్లూరు స్టేషన్ లో దిగితే అక్కడ టిఫిన్ బండి వాడు ఆయన్ని చూసి చడమడ తిట్టారు అంట. ఆ సినిమాలో అంత ఇంపాక్ట్ ఉన్న పాత్ర చేశారు భరణి. అలాగే ఆయన నటిస్తూనే కొన్ని సినిమాలకి కథ సహకారం కూడా చేసారు. అలా వచ్చినవే మనీ మనీ , యమలీల , ఘటోత్కచుడు లాంటి సినిమాలు ఆయనకి రైటర్ గా కూడా మంచి గుర్తింపు తెచ్చాయి.

ఇక భరణి గారు నటించిన  అమ్మో ఒకటో తారుకు లాంటి సినిమాల్లో కామెడీ ని పండిస్తూనే, నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలు చేశారు. ముఖ్యంగా ఈ సినిమాలో చార్మినార్ ని బ్రహ్మానందం గారికి అమ్మడం లాంటి సన్నివేశాలు బాగా నవ్వు తెప్పిస్తాయి.అలాగే ఆయన నటించిన ఆమె సినిమాలో విలన్ పాత్రలో కూడా మెప్పించారు.తనికెళ్ళ భరణి గారు విలన్ పాత్ర చేస్తే మాత్రం దానికి వంద శాతం న్యాయం చేయడానికి ప్రయత్నం చేస్తారు.

ఇక 1994 లో వచ్చిన బ్లాక్ బస్టర్ హిట్ సినిమా యమలీల సినిమా తనికెళ్ళ భరణి గారిని పెన్ను పట్టుకోకుండా వరసగా సినిమాలు నటించేలా చేసింది.ఎస్ వి కృష్ణారెడ్డి గారి డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమాలో తనికెళ్ళ భరణి గారు చేసిన తోట రాముడు పాత్రకి జనాలలో భారీ స్పందన వచ్చింది. ఈ సినిమా తర్వాత భరణి గారికి దాదాపుగా 27 సినిమా అవకాశాలు వచ్చాయి.ఈ సినిమాలో "ని చెల్లి పెళ్లి...జరగాలి మళ్ళీ మళ్ళీ" లాంటి డైలాగ్స్ జనాలని కడుపుబ్బా నవ్విస్తాయి.

అలానే  'మైనే తేరే ప్యార్ మే పాగల్' అనే హిందీ చిత్రంలో ప్రధాన పాత్ర లో నటించారు భరణి. ఇక 'సముద్రం' సినిమాలో 'చేపల కృష్ణ' గా భరణి ప్రదర్శించిన నటన చూసిన వారికి భయాన్ని కలిగిస్తుంది.సముద్రం సినిమా కథ పూర్తి అయ్యాక భరణి గారికి కృష్ణ వంశీ నుంచి ఫోన్ వచ్చిందట. ఆయన కథ చెప్పి ఇందులో చేపల కృష్ణ పాత్ర మిరే చెయ్యాలి అన్న అని అన్నారట. శివ సినిమా బాగా తెలిసిన కృష్ణ వంశీ మాట విని ఈ పాత్రని ఒప్పుకున్నారు భరణి. అయితే ఈ సినిమా షూటింగ్ జరిగేటప్పుడు భరణి గారి నటన చూసి ప్రకాష్ రాజ్ షూటింగ్ లో గాప్ తీసుకొని తన పాత్ర గురించి బాగా తెలుసుకొని వచ్చి నటించారట.

ఆ తర్వాత భరణి గారికి మంచి పాత్రలు ఇచ్చిన దర్శకుల్లో తేజ ఒకరు. 'శివ' సినిమా చేసేటప్పుడే తేజతో భరణి గారికి  పరిచయం ఉంది. ఆ సినిమాకి తేజ అసిస్టెంట్ కెమెరామెన్ . అయితే  1999లో ఒకరోజు ఉత్తేజ్ భరణి గారికి ఫోన్ చేసి "తేజ మీకొక కథ చెబుదా మనుకుంటున్నాడు అందులో మీకొక వేషం ఉంది. మీరు డబ్బులెక్కువ అడుగుతారేమో అని సంశయిస్తున్నాడు" అన్నాడు. సరే, అతని నెంబరివ్వు' అని అడిగి భరణి గారే తేజకు ఫోన్ చేసి కథ చెప్పమన్నాను. తను చెప్పాడు. 'నీ కథ నాకు బాగా నచ్చింది. నేను చేస్తున్నాను. సినిమా విడుదలై వండ రోజులు ఆడిన తర్వాత నువ్వు నాక రూపాయి ఇవ్వు చాలు' అని భరణి గారు అన్నారు. అదే ఉషాకిరణ్ మూవీస్ వారి 'చిత్రం'. ఆ తర్వాత  'నువ్వు నేను' లో భరణి గారు చేసిన క్యారెక్టర్ మంచి పేరుతో పాటు అవార్డును తెచ్చిపెట్టింది. నువ్వు నేను సినిమాకి ఇంకొక విశేషం ఏంటి అంటే ఆ సినిమా తర్వాత భరణి గారు వేరే సినిమా షూటింగ్ కి వైజాగ్ కి వెళ్లారు. కార్లో వెళ్తుంటే ఊరంతా 'నువ్వు నేను' వంద రోజుల పోస్టర్లే. ఆ పోస్టర్లో తనికెళ్ళ భరణి గారు ఒక్కరే  ఉన్నారు. సాధారణంగా హీరోహీరోయిన పోస్టర్లు వేస్తారు. ఆయన వెంటనే తేజకి ఫోన్ చేసి అడిగితే 'మీరే సార్, మాకు హీరో అన్నారు. ఆ మాటకి భరణి గారి కళ్లల్లో నీళ్లు తిరిగాయి. ఆ పోస్టర్ని ఫ్రేమ్ చేయించి ఆయన ఇంట్లో పెట్టుకున్నారు..

అనేక చిత్రాల్లో విభిన్న రకాల పాత్రలు ధరించిన తరువాత మన్మధుడు, ఒకరికొకరు, సాంబ, మల్లేశ్వరి, మొదలైన చిత్రాల్లో కూడ భరణి గారికి మంచి పేరు వచ్చింది.ముఖ్యంగా త్రివిక్రమ్ గారు రచించిన మరియు డైరెక్ట్ చేసిన సినిమాల్లో భరణి గారికి ప్రత్యేక పాత్రలు ఇచ్చేవారు. అలా తనికెళ్ళ భరణి గారు నటించిన అతడు సినిమాలోని నాయుడు పాత్ర ఆయనని బాగా ఫేమస్ చేసింది . ఈ పాత్రలో ఆయన చెప్పే ఒక్కక్క డైలాగ్ ఇప్పటికి సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. "వాడు మగాడ్రా బుజ్జి " అనే డైలాగ్ ఎంత పాపులర్ అయింది అంటే ఈ పేరు మీద సినిమా కూడా వచ్చింది.త్రివిక్రమ్ దర్శకత్వంలో చేసిన ఈ అతడు సినిమా 2005ఆగస్టు 10 న విడుదలై అని వర్గాల ప్రేక్షకులను మెప్పించి మంచి విజయాన్ని అందుకుంది..ఆ తర్వాత చేసిన గోదావరి సినిమాలో బోట్ కెప్టెన్ గా , త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో వచ్చిన జల్సా లో బుల్ రెడ్డి పాత్రలకు మంచి గుర్తింపు వచ్చింది. బృందావనం, జులాయి సినిమాల్లో ఒక నెగిటివ్ తండ్రి పాత్ర ఒక మంచి తండ్రి పాత్రలో నటించి మెప్పించారు.

ఆరుపదుల వయసులో కూడా నూతన దంపతుల్లా కాలం గడిపే జంట ఎలా ఉంటుందో చూపించారు మిథునం అనే దృశ్యకావ్యంలో భరణి గారు.  శ్రీరమణ అందించిన కథతో... తనికెళ్ల భరణి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో ఎస్‌.పి.బాలసుబ్రహ్మణ్యం, లక్ష్మి ప్రధాన పాత్రలు పోషించారు.   వృద్ధ జంటగా వారి నటన మెప్పిస్తుంది. వీరి ప్రేమాభిమానాల్లో జీవన వేదాతం ఇమిడిఉంటుంది.  నటీనటులు ఈ పాత్రలకు జీవం పోశారు. కన్యాశుల్కం వంటి నాటకాలు ఎప్పుడో కానీ రావు. శ్రీశ్రీ వంటి కవులు ఎప్పుడో కానీ పుట్టరు. బాలసుబ్రమణ్యం లాంటి బహుముఖ ప్రజ్ఞాశాలి ఉండటం అరుదే.  మిథునం సినిమాలో తనలోని అద్భుత నటనా పటిమను ప్రదర్శించారు బాలు. ఈ చిత్రంలో కాఫీమీద ఓ చక్కని దండకముంది. ఆవకాయమీద సరదాపాట ఉంది.  బాలసుబ్రమణ్యం ఈ రెండు పాటలకూ జీవం పోశారు.రేడియోలో వస్తున్న మృదంగనాదానికి అనుగుణంగా- అప్పదాసు పాత్రలో బాలు పనసపొట్టు కొట్టడమూ, బుచ్చిలక్ష్మి తిరగలి విసరడమూ అద్భుతం. సినిమాలో అప్పదాసు పాత్రలో బాలు సకలకళా ప్రావీణ్యాన్ని చూపించారు. అప్పదాసు గోమాతతో సంభాషించిన సన్నివేశం హత్తుకుంటుంది.ఈ చిత్రానికి ఆనంద్‌ ముయిదా రావు నిర్మాత. శ్రీకాకుళం జిల్లా వావిలవలస గ్రామంలో సన్నివేశాల్ని తెరకెక్కించారు.భరణి గారు ఇంతకుముందు లఘు చిత్రాలు రూపొందించి పురస్కారాలు అందుకొన్నారు. 'మిథునం' పూర్తిస్థాయి చలనచిత్రం. ఈ చిత్రం వృద్ధ జంట చుట్టూ తిరుగుతుంది. వీరి ప్రేమాభిమానాలు ప్రధానాంశంగా జీవన వేదాతం ఇమిడి కథ నడుస్తుంది. ఇదే కథలో గతంలో మళయాళంలో ఓ చిత్రం నిర్మించారు. కానీ అది పెద్దగా ప్రేక్షకాదరణ నోచుకోలేదు. అయితే భరిణిగారు ఈ కథని ఇప్పటి తరానికి అర్దమయ్యేటట్లుగా స్క్రీన్ ప్లే సమకూర్చుకుని,అందరూ చూసేటట్లుగా రూపొందించారు.

ఇక ఈ సినిమా తర్వాత ఆయన మళ్ళీ ఇంకొక చిత్రాన్ని దర్శకత్వం వహించకుండా మళ్ళీ ఆర్టిస్ట్ గా బిజీ అయిపోయారు. అలా ఆయన విలన్ గా నటించిన పవన్ కళ్యాణ్  గబ్బర్ సింగ్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అలాగే సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో కొండల్ రావు పాత్ర కూడా ఆయనకి బాగా సెట్ అయింది.ఆ తర్వాత వచ్చిన టెంపర్ సినిమాలో తనికెళ్ళ భరణి గారి పాత్ర ఆ సినిమాలో హైలెట్ అని చెప్పొచ్చు. క్లైమాక్స్ లో వచ్చే ఎన్టీఆర్, భరణి గారి మధ్య సన్నివేశం చూసిన వారికి కన్నీరు తెప్పించకుండా మానదు.

అలనాటి గొప్ప దర్శకుల నుంచి ఇప్పటి కొత్తగా వచ్చిన దర్శకుల వరకు తనికెళ్ళ భరణి గారు అందరి సినిమాల్లో అదే ఉత్సాహంతో నటిస్తారు.ఈ విషయం ఆయన కొత్త దర్శకుల సినిమాలో చేసిన పాత్రలు చూస్తే మనకు అర్థం అవుతుంది.ఆయన నటుడుగా  ఇప్పటిదాకా 500 లకి పైగా సినిమాలు చేశారు.అలాగే 50 కి పైగా చిత్రాలకి రచయిత గా కూడా పని చేసారు.

మరో పక్క సాహితీ ప్రపంచంలో అవిరళ కృషి చేస్తున్న భరణిని 'పుంభావ సరస్వతి'గా అభి వర్ణిస్తారు. పరికిణీ, నక్షత్ర దర్శనం, మాత్రలు తదితర రచనలు చేసారు భరణి, మరుగున వద్ద మహానుభావుల జీవిత విశేషాలను స్ఫూర్తిదాయకంగా వివరిస్తూ అనేక వ్యాసాలు రాసారు. వీటిని 'ఎందరో మహానుభావులు' పేరిట పుస్తకంగా తెచ్చారు.

ఆధ్యాత్మిక పరుడైన భరణి గారు అందరికి అర్థమయ్యేలా శివతత్త్వాలను రచించి స్వయంగా గానం చేస్తూ పలు సి.డి ఆల్బంలను వెలువరించారు. వీటిలో కొన్నింటిని సుప్రసిద్ధ గాయకులు యస్.పి.బాలసుబ్రహ్మణ్యం, గాయనీమణులు జానకి, నిత్య సంతోషిణి, నీహాల్ తదితరులు పాడారు. 'ఆట కదరా శివా', 'సెబ్బాష్ రా శివా', 'శివ చిలుకలు' వంటి పుస్తకాలు రచించారు.

దేశ విదేశాల్లో జరిగిన పలు సాహితీ కార్యక్రమాల్లో స్వీయ కవితా పఠనం చేసారాయన. 'ఆట కదరా శివా' పేరిట శివతత్వాలను దుబాయ్, అమెరికా వంటి పలు ప్రపంచ వేదికలపై అన్ని వర్గాల వారినీ తన్మయపరిచేలా గానం చేస్తూ వస్తున్నారు తనికెళ్ళ భరణి. 'సిరా', 'బ్లూక్రాస్', 'ది లాస్ట్ ఫార్మర్' వంటి ప్రయోజనాత్మక లఘు చిత్రాలను తన సృజనాత్మ దర్శకత్వ ప్రతిభతో తెరకెక్కించి పలు జాతీయ, అంతర్జాతీయ అవార్డులను గెలుచుకున్నారు తనికెళ్ళ భరణి.

తెలుగు సంస్కృతీ సంప్రదాయాలు, కుటుంబ విలువలు, మానవీయ విలువలకు భరణి గారు ప్రాధాన్యత ఎక్కువగా ఇస్తారు. పుస్తక పఠనం, పచ్చటి ప్రకృతి, ఆవకాయ పచ్చడి ఆయనకి చాలా ఇష్టం రైతుల కష్టాల పట్ల ఆయనకున్న బాధని 'ది లాస్ట్ ఫార్మర్' చిత్రం తెలియజెప్తుంది. పర్యావరణ పరిరక్షణకై తపిస్తారాయన. ఇలా సినిమాలతో పాటు విభిన్న రంగాల్లో రాణిస్తూ కోట్లాది మంది తెలుగువారి ఆదరాభి మానాలు పొందుతున్నారు తనికెళ్ళ భరణి. స్నేహశీలిగా పేరొందిన భరణి తన వ్యక్తిత్వంతో ఎందరో ఆత్మీయుల్ని సంపాదించుకున్నారు.

వ్యక్తిగత జీవితం

తనికెళ్ళ భరణి గారు 1988 లో దుర్గ భవాని గారిని పెళ్లి చేసుకున్నారు. ఈ దంపతులకి తేజ మరియు సౌందర్య లహరి అని ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆయన కొడుకు తేజ హీరోగా 2012 లో లవంగం అనే సినిమా చేశారు. కానీ ఆ సినిమా అంతా పెద్దగా ఆడలేదు. తేజ ఇప్పుడు సినిమాలని పక్కన పెట్టి వ్యాపారులు చూసుకుంటున్నారు.

అవార్డ్స్

తనికెళ్ళ భరణి గారికి సముద్రం సినిమాలో నటనకి  ఉత్తమ విలన్ గా 'నంది అవార్డు వచ్చింది. అలాగే 'నువ్వు-నేను' చిత్రంలో హీరోయిన్ తండ్రి గా ఆయన చేసిన నటనకి గాను బెస్ట్ కేరెక్టర్ ఆర్టిస్టుగా మరొక 'నంది అవార్డు' అందుకున్నారు భరణి.

ఇక ఆయన దర్శకత్వంలో వచ్చిన మిథునం సినిమాకి గాను ఉత్తమ మాటల రచయితగా భరణి గారికి నంది అవార్డ్ వచ్చింది. అలాగే ఇదే సినిమా కి బెస్ట్ డైరెక్టర్ గా స్పెషల్ జ్యూరీ కేటగిరి లో సిని మా అవార్డ్ అందుకున్నారు. వీటితో పాటు ఆయన రచించిన రచనలకు , నాటకాలకు కూడా ఎన్నో అవార్డ్స్ వరించాయి.

భరణి గారి డైరెక్షన్ లో వచ్చిన షార్ట్ ఫిల్మ్ సిరా కి ఇంటర్నేషనల్ గా చాలా అవార్డ్స్ సంపాదించింది. ఈ షార్ట్ ఫిల్మ్ ఆయన జీవితంలోనే బెస్ట్ వర్క్ గా ఆయన భావిస్తారు.

- Advertisement -

You've successfully subscribed to Tollywood Latest News | Celebrities Profiles | Media9 Tollywood
Great! Next, complete checkout to get full access to all premium content.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.