తలైవా రజినీకాంత్

తన నటనతో స్టైల్ తో ప్రపంచవ్యాప్తంగా అభిమానులని సంపాదించుకున్నారు రజినీకాంత్. ఒక బస్ కండక్టర్ గా జీవితాన్ని ప్రారంభించి ఇండియన్ సూపర్ స్టార్ గా ఎదిగిన రజినికాంత్ గారు ఆ క్రేజ్ ని, పాపులారిటీని ఎప్పుడూ బయట చూపించుకోరు. సినిమాల్లో తన స్టైల్ తో అదరగొట్టే రజిని బయట మాత్రం ఒక సాదా సీదా మనిషిలాగా కనిపిస్తారు. తన సినిమాలతో ఇండియన్ బాక్స్ ఆఫీస్ ని ఎన్నో సార్లు బద్దలు కొట్టిన ఆయనలో ఆ గర్వం అసలు కనిపించదు.

జననం

కర్ణాటకలో మహారాష్ట్ర నుంచి వచ్చిన మరాఠీ కుటుంబంలో 1950 డిసెంబర్ 12న రామోజీ రావు గైక్వాడ్, జీజాబాయ్ దంపతులకి రజినీకాంత్ గారు జన్మించారు. ఆయన అసలు పేరు శివాజీరావు గైక్వాడ్. శివాజీరావుకి ఒక అక్క ఆస్వాత్ బాలుభాయ్ ఇద్దరు అన్నలు సత్యనారాయణ రావు, నాగేశ్వరరావు ఉన్నారు. ఆయనకి చిన్నప్పటి నుంచి సినిమాలు అంటే పిచ్చి. రజినీకాంత్ గారి పదోవ యేట ఆయన తల్లి జీజాబాయ్ మరణించింది. రజిని మొదటగా బెంగుళూరు ట్రాన్స్ పోర్టులో కండక్టర్‌గా కెరీర్‌ను స్టార్ట్ చేశాడు. ఈ పనికి ఆయన జీతం 180 రూపాయలు. ఆయన అప్పట్లోనే బస్ లో టికెట్స్ ని ఇచ్చే విధానం చాలా స్టైల్ గా ఉండేది. దాంతో పాటు అప్పుడప్పుడు స్టేజీల మీద పౌరాణిక నాటకాలు కూడా వేస్తుండేవాడు.

ఒకసారి ఆయన ఒక నాటకంలో దుర్యోధనుడి పాత్ర చేశారు. ఆ నాటకంలో ఆయన నటన చూసిన అందరూ ఆశ్చర్యపోయారు. అంతలా రజిని తన నటనతో అందరిని మైమర్చిపోయేలా చేశారు. నాటకాల్లో రజిని నటన చూసి ఆయన స్నేహితుడు రాజ్ బహదూర్ రజిని ని సినిమాల్లో ప్రయత్నం చేయమని దానికి అయ్యే ఖర్చు ఆయన చూస్కుంటా అని ప్రోత్సహించేవారు. అలా రాజ్ బహుదూర్ గారి సహాయంతో రజినికాంత్ గారు మద్రాసులో నటనలో శిక్షణ తీసుకున్నారు. అయితే అలా శిక్షణ తీసుకునే సమయంలో రజినీకాంత్ చాలా కష్టాలు అనుభవించారు. ఆయన మిత్రుడు చంద్ర శేఖర్ డైరెక్టర్ గా చేస్తుండటంతో పులిబంతు పులి అనే కన్నడ సినిమాలో ఛాన్స్ ఇప్పించారు. అయితే ఈ సినిమాలో నీకు తగ్గ వేషం లేదు అని చెప్పి రజినిని తీసేసారు. అయితే ఒకసారి రజినీకాంత్ వేసిన నాటకాన్ని దర్శక దిగ్గజం బాలచందర్ గారు చూసి రజిని నటన చాలా నచ్చి ఆయన  దర్శకత్వంలో మొదటిసారి 1975లో ‘అపూర్వ రాగంగళ్’ సినిమాలో ప్రతినాయకుడిగా అవకాశం ఇచ్చారు.ఈ సినిమాలో శివాజీ రాజా గైక్వాడ్ పేరుకి బదులుగా రజినీకాంత్ అనే పేరుని బాల చందర్ గారు సూచించారు. ఈ సినిమా తర్వాత రజినీకాంత్ గారు సరిగ్గా పనికి రావట్లేదు అని ఆర్టీసీ కండక్టర్ ఉద్యోగాన్ని తీసేసారు.

సినీ జీవితం

ఆయన మొదటి సినిమా అపూర్వ రాగంగళ్ సినిమా సూపర్ హిట్ అయినా కూడా ఆయనికి వెంటనే అవకాశాలు రాలేదు కొన్ని రోజులు రజినీకాంత్ కి సినిమా కష్టాలు తప్పలేదు. అయితే రజినీకాంత్ స్నేహితుడు అయిన నాగ భూషణం డైరెక్టర్ గా చేస్తున్న బాలు జాను అనే కన్నడ సినిమాలో నెగిటివ్ పాత్రలో నటించారు. ఈ సినిమాలో ఆయన అసలు పేరు శివాజీ రాజా గైక్వాడ్ అని ఉంటది. అలాగే  కన్నడలో ఆయనికి కథ సంగమ సినిమాలో ఇంకొక అవకాశం వచ్చింది. ఆ తర్వాత రజినీకాంత్ కి మళ్ళీ బాల చందర్ గారు తెలుగు సినిమా అంతులేని కథలో తాగుబోతు వేషం ఇచ్చారు. ఈ పాత్రకి అప్పట్లో మంచి స్పందన వచ్చింది. ఈ పాత్రలో ఒక సన్నివేశం సరిగ్గా చేయట్లేదు అని బాలు చందర్ గారు రజినిని కొట్టారంట. ఈ చిత్రం 1976లో విడుదలయ్యింది. ఈ సినిమా రజిని నటించిన మొదటి తెలుగు సినిమా. వెంటనే బాలు చందర్ గారి దర్శకత్వంలో వచ్చిన మూన్రు ముడిచు సినిమాలో కమల్ హాసన్ స్నేహితుడిగా నెగటివ్ పాత్రలో నటించారు.

ఇక 1977 లో రజిని 15 సినిమాల్లో దాదాపుగా అన్ని నెగిటివ్ పాత్రల్లోనే నటించారు. 1978 సంవత్సరంలో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 20కు పైగా చిత్రాల్లో నటించాడు. ఆ సమయంలోనే హీరోగా నటించిన భైరవి చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్అయ్యింది. అప్పుడే ఆయనకు సూపర్ స్టార్ అనే బిరుదు దక్కింది. ఇలా వరసగా సినిమాలు చేసుకుంటూ 4 సంవత్సరాలలో రజిని 50 సినిమాలని పూర్తి చేశాడు. అలా 1980లో వచ్చిన హిందీ రీమేక్ సినిమా బిల్లాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి రజినీకాంత్ సూపర్ స్టార్ గా సౌత్ లో ఎదిగారు. 1983 లో రజినీకాంత్ బాలీవుడ్ లోకి ‘ఆంధా కానూన్’ అనే సినిమాతో అడుగుపెట్టారు. ఈ సినిమాలో రజిని, అమితాబ్ బచ్చన్ తో కలిసి నటించారు. ఈ సినిమా అప్పట్లో హైయెస్ట్ కలెక్షన్స్ సంపాదించిన సినిమాగా నిలిచింది. ఇక 1985 సమయానికి రజిని తన 100వ సినిమాగా శ్రీ రాఘవేంద్ర సినిమాలో ఆయన ఆరాధ్య దైవం అయిన రాఘవేంద్ర స్వామి పాత్రలో నటించి మెప్పించారు.

బాలీవుడ్ లో రజినికి బిగ్గెస్ట్ హిట్ ఇచ్చిన చిత్రం బేవాఫై. ఈ సినిమాలో రాజేష్ ఖన్నా హీరోగా నటిస్తే రజిని విలన్ గా నటించారు. 1985లో వచ్చిన ఈ సినిమా అప్పటి రికార్డ్స్ అన్ని తుడిచిపెట్టింది. దాదాపుగా 11 కోట్ల కలెక్షన్స్ తో ఆ సంవత్సరం లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. అలాగే 1988 లో రజినీకాంత్ ‘బ్లడ్ స్టోన్’ అనే హాలీవుడ్ సినిమాలో కూడా నటించారు.

1990 వచ్చిన ‘పనక్కరన్’ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాక అప్పటికి డైరెక్టర్ గా పెద్ద పేరు ఉన్న మణిరత్నంతో 1991 దళపతి సినిమాలో నటించారు రజిని. ఈ సినిమాలో రజినితో పాటు మలయాళం సూపర్ స్టార్ మమ్మూట్టి కూడా నటించారు. మహా భారతం లోని కర్ణుడి కథని తీసుకొని మణిరత్నం ఈ సినిమాని తెరఎక్కించారు. ఈ సినిమా సూపర్ హిట్ అవ్వడమే కాకుండా రజినికాంత్ నటనకి మంచి పేరు తెచ్చింది. ఆ తర్వాత వచ్చిన అన్నామలై కూడా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.

ఇక  సురేశ్‌ కృష్ణ దర్శకత్వంలో 1995లో విడుదలైన ‘బాషా’ చాలా పెద్ద విజయం సాధించి రజినీకాంత్ ని ఇండియాలో టాప్ స్టార్ గా నిలబెట్టింది. ఒక రకంగా రజనీకాంత్‌ కెరీర్‌ని ఇంకో ఇరవై ఏళ్లు పొడిగించిన సినిమా ఇది. రజనీకాంత్‌ ఇమేజ్‌ భారీగా పెరడగానికి ఈ సినిమా ముఖ్యకారణం. దీని తర్వాత రజనీకాంత్‌ మల్టీ స్టారర్‌ హిందీ సినిమాలు మానుకొని సంవత్సరంలో రెండు మూడు సినిమాలు చేయడం మానుకొని ఒక్కసారికి ఒక్క సినిమా పద్ధతిలోకి వెళ్లి తన మార్కెట్‌ బాగా పెంచుకోగలిగాడు. 1991లో వచ్చిన ‘హమ్‌’ సినిమాలో నటించడం రజనీకాంత్‌కు లాభించింది. ఆ సినిమాలో అమితాబ్‌ ఇలాగే పెద్ద డాన్‌గా ఉండి అన్నీ మానేసి కుటుంబం కోసం అజ్ఞాతవాసంలోకి వెళ్లిపోతాడు. ఆ పాయింట్‌ను ‘బాషా’ కోసం కొత్తగా డెవలప్‌ చేసుకున్నాడు రజనీకాంత్‌. మంచి వయసు, ఆరోగ్యం ఉన్న రోజులలో వచ్చిన సినిమా కాబట్టి ఇందులో రజనీ పూర్తి ఎనర్జిటిక్‌గా కనిపిస్తాడు. ‘ప్రేమికుడు’తో తెర మీదకు వచ్చిన నగ్మా ఈ సినిమాతో రజనీ పక్కన నటించే చాన్స్‌ కొట్టేసింది. దేవా పాటలు, బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ చాలా ప్లస్‌ అయ్యాయి. ఇక ‘నేను ఒక్కసారి చెప్తే వందసార్లు చెప్పినట్టే’ డైలాగ్‌ ఎన్ని సినిమాలలో ఎన్ని స్పూఫులుగా వచ్చిందో తెలుసు. ‘బాషా ఫార్ములా’ ధోరణి ‘సమరసింహారెడ్డి’, ‘నరసింహనాయుడు’, ‘ఇంద్ర’ సినిమాల్లో మనం చూస్తాం. బాషా డిజిటల్లీ ఇంప్రూవ్డ్‌ ప్రింట్‌ను 2017లో విడుదల చేశారు. 20 ఏళ్ల తర్వాత కూడా ఒక సినిమా రీరిలీజ్‌ అయ్యిందంటే అది బాషాకు మాత్రమే దక్కిన ఘనత.

ఇదే సంవత్సరంలో మోహన్ బాబు రెండు పాత్రల్లో, సూపర్ స్టార్ రజినీకాంత్ అతిథి పాత్రలో నటించిన ‘పెదరాయుడు’ సినిమా తెలుగు సినిమా చరిత్రలో ఓ సంచలనం. అప్పటి వరకు ఉన్న అన్ని ఇండస్ట్రీ రికార్డులను ‘పెదరాయుడు’ సినిమా తిరగరాసింది. అంతేకాదు చాలా కేంద్రాల్లో ఈ సినిమా సిల్వర్ జూబ్లీ పూర్తి చేసుకుంది. హైదరాబాద్ శాంతి థియేటర్‌లో ఈ సినిమా ఏకధాటిగా 250 పైగా రోజులు నడిచింది. దాదాపు 200 రోజుల వరకు అన్ని షోస్ హౌస్‌ఫుల్‌తో రన్ అవ్వడం ఒక చరిత్ర. తమిళంలో తెరకెక్కిన ‘నాటామై’ సినిమాకు రీమేక్‌గా తెరకెక్కింది పెదరాయడు. తమిళంలో శరత్ కుమార్, విజయ్ కుమార్ ముఖ్యపాత్రల్లో నటించారు. పెదరాయుడు సినిమా ముహూర్తపు సన్నివేశానికి ఎన్టీఆర్ పూజ చేసి క్లాప్ కొట్టారు. మొదటి సన్నివేశం మోహన్ బాబు, రజినీకాంత్‌లపై పిక్చరైజ్ చేసారు. పెదరాయుడు సినిమాలో మోహన్ బాబు పెదరాయుడుగా ఆయన తమ్ముడు రాజాగా రెండు విభిన్న పాత్రల్లో ఎంతో హుందాగా ఒదిగిపోయారు. ముఖ్యంగా భార్య భర్తల బంధం, అన్నదమ్ముల అనుబంధం, తల్లి తండ్రులతో కొడుకల అనుబంధాన్ని ఈ సినిమాలో చక్కగా ఆవిష్కరించారు.తమిళంలో విజయ్ కుమార్ వంటి సాధారణ నటుడు చేసిన పాత్రను తెలుగులో సూపర్ స్టార్ రజినీకాంత్.. మోహన్ బాబుతో ఉన్న స్నేహం కారణంగా నటించారు. అంతేకాదు తమిళంలో హిట్టైన ఈ చిత్రాన్ని తెలుగులో తీయమని మోహన్ బాబుకు సలహా ఇచ్చింది కూడా రజనీకాంత్ కావడం విశేషం. ఈ సినిమాలో నటించినందకు రజినీకాంత్ ఎలాంటి పారితోషకం తీసుకోలేదు. ముఖ్యంగా పెదరాయుడుగా మోహన్ బాబు తప్పించి మరో నటుడిని ఊహించుకోలేనంత రేంజ్‌లో నటించి మెప్పించారు నట ప్రపూర్ణ. ముఖ్యంగా పెదరాయుడు పాత్రకు మోహన్ బాబు జీవం పోసారు. ముఖ్యంగా రజినీకాంత్ పాత్రకు సాయి కుమార్ డబ్బింగ్ అచ్చు గుద్దినట్టు సరిపోయింది. ముఖ్యంగా ఈ సినిమా సక్సెస్‌లో రజినీకాంత్‌కు సాయి కుమార్ చెప్పిన డబ్బింగ్ కూడా కీ రోల్ పోషించింది. అప్పటి వరకు డబ్బింగ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులను పలకిస్తూ వచ్చిన రజినీకాంత్ చాలా ఏళ్ల తర్వాత తెలుగులో డైరెక్ట్‌గా నటించిన సినిమా పెదరాయుడు.

ఇక రజినీకాంత్ గారి ‘ముత్తు’ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఈ సినిమా తెలుగు తమిళ భాషల్లో సిల్వర్ జూబ్లీ హిట్ అవ్వడమే కాకుండా జపనీస్ భాషలో కూడా డబ్బింగ్ అయ్యి అక్కడ కూడా సంచలన విజయం సాధించింది. ఈ సినిమా అప్పట్లోనే 16 లక్షల వసూళ్లు సాధించింది. థిల్లానా థిల్లానా పాటకి జపాన్ లో యూత్ అంత థియేటర్స్ లో స్టెప్స్ వేసేవారు.

ఆ తర్వాత వచ్చిన అరుణాచలం కూడా సూపర్ హిట్ అయింది. ఈ సినిమాలో రజిని రెండు పాత్రల్లో మెప్పించారు. ఇక 1999లో వచ్చిన పడయప్ప సినిమా ఒక పెద్ద సంచలనం అని చెప్పాలి. అప్పట్లో ప్రపంచవ్యాప్తంగా 200 ప్రింట్స్ తో విడుదలైన మొదటి సినిమాగా నిలిచింది. ఈ సినిమాలో రమ్యకృష్ణ గారు చేసిన పాత్ర ఆమెకి విపరీతమైన క్రేజ్ ని తీసుకొచ్చింది. ఆమె ఈ సినిమాలో రజినికి ధీటుగా నటించి మెప్పించారు. మొదట్లో ఈ సినిమాకి రెండు ఇంట్రవెల్స్ పెట్టాలి అనుకున్నారు కానీ ఈ సినిమా డైరెక్టర్ కె ఎస్ రవికుమార్ కమల్ హాసన్ కి  సినిమాని చూపించగా ఆయన రెండు ఇంట్రావెల్స్ పెట్టకుండా సినిమాని ఎడిట్ చేయండి అని సలహా ఇస్తే దానినే పాటించారు. అయితే ఈ సినిమా తమిళంలోనే కాదు తెలుగులో కూడా సూపర్ హిట్ గా నిలిచింది. శివాజీ గణేషన్ గారు ముఖ్య పాత్రలో నటించిన చివరి చిత్రం ఇదే.

ఇక కొన్ని సంవత్సరాల విరామం తర్వాత రజినీకాంత్ గారు బాబా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమాకి ఆయన స్క్రీన్ ప్లే కూడా రాయడం విశేషం. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా మొదటిగా ఐశ్వర్యారాయ్ ని అనుకున్నారు, ఆమె డేట్స్ కుదరక మనీషా కొయిరాలాని ఎంపిక చేసారు. దాదాపుగా 17 కోట్ల ప్రిరిలీజ్ బిజినెస్ జరుపుకున్న ఈ సినిమా విడుదల తర్వాత ఘోర పరాజయన్ని చవి చూసింది. అయితే ఈ సినిమాతో నష్టపోయిన డిస్ట్రిబ్యూటర్స్ కి రజిని అండగా ఉండి ఆయన రెమ్యూనరేషన్ నుంచి వారికి డబ్బు ఇచ్చి ఆదుకున్నారు.

అయితే బాబా సినిమా తర్వాత రజినీకాంత్ గారి మీద రాజకీయా పార్టీల వాళ్ళు విమర్శలు చేయడం మొదలుపెట్టారు. ఆయన యువతరానికి సిగరేట్స్ తాగడం తప్ప ఏమీ నేర్పించారు అని విమర్శలు చేసారు. ఈ విమర్శలకు రజిని చెక్ పెడుతూ ఇక మీదట సినిమాలు చేయను అని నిర్ణయం తీసుకున్నారు. అయితే ఆయన అభిమానులు రజిని మీద సినిమాలు చేయాల్సిందే అంటూ ఒత్తిడి తీసుకొని రావడం మొదలుపెట్టారు.

ఇక అలా రజినీకాంత్ గారు 2సంవత్సరాల సమయం తీసుకొని పి వాసు దర్శకత్వంలో చంద్రముఖి సినిమాని ఒప్పుకున్నారు. చంద్రముఖి సినిమా కథ విషయానికి వస్తే వెంకటపతి అనే ఒక రాజుకి తను కోరుకున్నది దక్కి తీరాల్సిందే అనే స్వభావం కలవాడు. ఈ నేపధ్యంలో తన రాజ్యంలో నాట్యం చేసేందుకు వచ్చిన చంద్రముఖిని తన ప్రియుడు గుణశేఖర్ ని చంపేస్తాడు ఆ వెంకటపతి రాజు. దీనితో ఆ వెంకటపతి రాజుపై పగ పెంచుకున్న చంద్రముఖి అతన్ని ఎలాగైనా అంతం చేయాలనీ ఓ ఆత్మ రూపంలో ఆ ఇంట్లోనే ఉంటుంది. మరి ఆమె పగ ఎలా తీరింది. అందులో రజినీ పాత్ర ఏంటి అన్నది ఇతివృత్తం. ఈ సినిమాని హర్రర్, కామెడీతో చాలా బాగా హండిల్ చేశాడు వాసు. చంద్రముఖి సినిమా ఎంత పెద్ద హిట్టయిందో పెద్దగా చెప్పాల్సిన పని లేదు.. హర్రర్ మూవీగా తెరకెక్కిన ఈ సినిమాకి ప్రేక్షకులు బ్రహ్మారధం పట్టారు. తమిళ్, తెలుగు అని తేడా లేకుండా అన్ని చోట్ల బాగా ఆడింది ఈ సినిమా. ఇక తమిళనాడులోని శాంతి థియేటర్‌లో 890 రోజులపాటు ఆడి రికార్డును నెలకోల్పింది. ఈ సినిమా రికార్డ్స్ కొన్ని ఇంకా చెక్కు చదరలేదు.

ఇక 2007లో వచ్చిన  శివాజీ సినిమా ఇండియా అంత సంచలనం అయింది. ఈ సినిమాకి రజిని రెమ్యూనరేషన్ 27 కోట్లు తీసుకొని ఆసియాలోనే జకీ జాన్ తర్వాత అంతా ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకున్న నటుడుగా రికార్డ్స్ కి ఎక్కారు. అలాగే ఈ సినిమా కూడా తమిళంలో మొదటిగా 100 కోట్లు కొల్లగొట్టిన సినిమాగా రికార్డ్ సృష్టించింది. శివాజీ సినిమా సౌత్ సినిమాలు బాలీవుడ్ సినిమాలకి ఏ మాత్రం తక్కువ కావు అని నిరూపించింది. ఈ సినిమాలో యాక్షన్, కామెడీ, మేసేజ్ ఇలా అన్నిటికీ సమపాళ్లలో పెట్టి డైరెక్టర్ శంకర్ ఈ సినిమాని తీశారు. ఈ సినిమా ఒక్క తమిళనాడులోనే కాదు ఆంధ్ర, ముంబై ఇలా ఇండియా అంత విపరీతంగా ఆడింది. అలాగే ఇంటర్నేషనల్ మార్కెట్ లో కూడా ఈ సినిమా సత్తా చాటింది. యూ.ఎస్, యూ.కె లాంటి దేశాలలో ఈ సినిమా డాలర్స్ వర్షం కురిపించింది. ఈ సినిమాని 2012 లో త్రీడి లో కూడా విడుదల చేసారు.

మళ్ళీ వీరి కాంబినేషన్ లోనే 2010 లో రజనీకాంత్‌ కథానాయకుడిగా శంకర్‌ దర్శకత్వంలో వచ్చిన బ్లాక్‌బస్టర్‌ చిత్రం ‘రోబో’. శంకర్‌ టేకింగ్‌, రోబోగా రజనీ నటన, ఐశ్వర్యరాయ్‌ అందం సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాయి. ఇక చిట్టిగా రోబో పాత్రలో రజనీ నటన అందరినీ అలరించింది. ఇక క్లైమాక్స్‌ సీక్వెన్స్‌ ఒళ్లుగగురుపొడిచేలా చేశాయి. ఈ సినిమా దాదాపుగా 150 కోట్ల బడ్జెట్ తో అప్పట్లో ఇండియాలోనే హైయెస్ట్ బడ్జెట్ సినిమాగా రికార్డ్ సృష్టించింది.ఈ సినిమా విడుదల తర్వాత భారీ లాభలని సంపాదించుకుంది. రోబో సినిమా విజువల్ ఎఫెక్ట్స్ చూసి అప్పుడు ఇండియా అంత ఆశ్చర్యపోయింది. ఈ సినిమా ఇప్పటికి రజినీకాంత్ ఎక్కువ వసూలు చేసిన సినిమాల్లో ఒకటి. ఈ సినిమాకి ముందుగా కమల్ హాసన్ గారిని అనుకున్నారు. ఆయన మీద ఫోటో షూట్ కూడా జరిగింది. ఈ సినిమా దాదాపుగా 290 కోట్లకి పైగా వసూలు సాధించింది. అలాగే తెలుగులో రోబోగా డబ్బింగ్ అయ్యే ఇక్కడ కూడా 70 కోట్ల కలెక్షన్స్ కొల్లగొట్టింది.

రోబో సినిమా తర్వాత వెంటనే తన కూతురు సౌందర్య రజినీకాంత్ డైరెక్షన్ లో రానా అనే సినిమాలో రజిని నటించాలి కానీ అప్పట్లో రజినీకాంత్ కి అనారోగ్యంతో ఈ సినిమా సెట్స్ మీదకి వెళ్ళలేదు. అయితే రజినీకాంత్ గారి యానిమేషన్ పాత్రలో సౌందర్య కొచ్చడయాన్ అనే లైవ్ యానిమేషన్ సినిమాని తీశారు. కానీ ఈ సినిమా అనుకున్నంత రేంజ్ లో ఆడలేదు. ఆ తర్వాత వచ్చిన  లింగ సినిమా సరిగ్గా ఆడలేదు.

అయితే 2016 లో వచ్చిన కబాలి సినిమా సృష్టించిన సెన్సేషన్ అంత ఇంత కాదు. అప్పట్లో ఈ సినిమా టీజర్ కి విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇండియాలోనే ఎక్కువగా మంది చూసిన టీజర్ గా చరిత్ర సృష్టించింది కబాలి. అలాగే ఈ సినిమా విడుదల కి ముందు కొన్ని సాఫ్టువెర్ కంపెనీలు హాలిడేస్ ప్రకటించడం కూడా జరిగాయి. అలాగే తమిళ సినిమాల్లో మొదటిసారి మలేషియా భాషలో డబ్బింగ్ అయిన సినిమా కబాలి. ఎయిర్ ఆసియా కంపెనీ మొదటిసారుగా వారి స్పెషల్ జెట్ కి కబాలి పోస్టర్ ని అతికించి ప్రమోషన్ చేశారు. ఇలా ఏరో ప్లేన్స్ కి పోస్టర్స్ పెట్టి ప్రమోట్ చేయడం ఇండియాలో ఇదే మొదటిసారి.అయితే ఈ సినిమా విడుదల తర్వాత అంత రేంజ్ లో రివ్యూస్ రాకపోయినా కూడా మొదటి రోజు కబాలి సినిమా 104 కోట్ల కలెక్షన్స్ కొల్లగొట్టి రజినీకాంత్ తన పాత రోబో సినిమా రికార్డ్ తనే బద్దలు కొట్టారు. ఈ సినిమా టోటల్ కలెక్షన్స్ లో రోబో సినిమా కలెక్షన్స్ ని క్రాస్ చేసింది. ఆ తర్వాత వచ్చిన కాలా కూడా మంచి ఆదరణను సొంతం చేసుకుంది

అయితే 2018లో వచ్చిన రోబోకి పార్ట్ 2 గా వచ్చిన 2.0 మరియు 2019లో వచ్చిన పెట్ట సినిమాలు రజినీకాంత్ గారి క్రేజ్ ఇంకా తగ్గలేదు అని నిరూపించాయి. 2.0 సినిమా ఆవేరేజ్ టాక్ తోనే 500 కోట్లు కొల్లగొట్టింది. ఈ సినిమా తర్వాత చేసిన దర్బార్ అనుకున్నంతగా ఆడలేదు. ప్రస్తుతం రజిని డైరెక్టర్ శివ దర్శకత్వంలో అన్నతే సినిమాలో నటిస్తున్నారు.

వ్యక్తిగత జీవితం

రజినీకాంత్  గారు తనని ఇంటర్వ్యూ చేయడానికి వచ్చిన లత రంగచారి గారిని 1981 ఫిబ్రవరి 26న వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకి ఐశ్వర్య రజినీకాంత్ మరియు సౌందర్య రజినీకాంత్ అని ఇద్దరు కూతుర్లు ఉన్నారు.

లత గారు ఆశ్రం అనే స్కూల్ ని నడుపుతున్నారు. ఆయన కూతురు ఐశ్వర్య రజినీకాంత్ 2004లో తమిళ ప్రముఖ నటుడు ధనుష్ ని పెళ్లి చేసుకుంది. వీరికి ఇద్దరు ఇద్దరు కొడుకులు . ఇక ఆయన ఇంకొక కూతురు సౌందర్య రజినీకాంత్ సినిమా పరిశ్రమ లోనే డైరెక్టర్ గా కొన్ని సినిమాలు కూడా చేసింది. ఆమె 2010లో అశ్విన్ రామ్ కుమార్ అనే ఇండస్ట్రీలిస్ట్ ని పెళ్లి చేసుకుంది. వీరికి వేద్ కృష్ణ అనే కొడుకు ఉన్నారు. 2017 లో సౌందర్య గారు రామ్ కుమార్ తో విడాకులు తీసుకొని 2019 లో విషగాన్ వేనంగముడి అనే యాక్టర్ ని పెళ్లి చేసుకున్నారు. తమిళ సంగీత దర్శకుడు అనిరుద్ రవిచంద్రన్ రజినీకాంత్ గారి భార్య లత గారికి మేనల్లాడు అవుతారు.

రజనీకాంత్‌ అంటే అమితాబ్‌కు చాలా ఇష్టం. రజనీ స్టార్‌ హోదా అనుభవిస్తున్న సమయంలో చెడు అలవాట్లకు బానిస అయ్యారు. మనశ్శాంతిని కోల్పోయారు. అప్పుడే అమితాబ్‌ ఆయనకు ఓ సలహా ఇచ్చారు. ‘స్వామి సచ్చిదానంద ఆశ్రమంలో కొద్దిరోజులు ఉండి చూడండి. మీరు కోరుకున్న ప్రశాంతత దొరుకుతుందేమో’ అన్నారు. ఆయన మాటతో రజనీ తొలిసారి హిమాలయాలకు వెళ్లారు. ఇప్పటికీ వెళ్తూనే ఉన్నారు. అక్కడ రోజుల తరబడి తపస్సు చేస్తూ ఉంటారు. రజినీకాంత్ గారికి రాఘవేంద్ర కల్యాణ మండపం అని ఒక మ్యారేజ్ హాల్ ఉంది. రజినీకాంత్ గారు 2010లో అత్యంత ప్రభావంతమైన వ్యక్తుల్లో ఒకరిగా ఫోర్బ్స్ ఇండియా గుర్తించింది.

ఇక రజినీకాంత్ గారి ఆప్తమిత్రులలో ప్రముఖ నటుడు మోహన్ బాబుగారు ముఖ్యమైన వ్యక్తి. సినిమా ఇండస్ట్రీలో చాలా తక్కువగా ఉండే బలమైన స్నేహం వీరిది. ఒకరిని ఒకరు వాడు వీడు అనుకునే అంత చనువు ఇద్దరి మధ్య ఉంది. ఈ విషయాన్ని చాలా సార్లు మోహన్ బాబు గారు అలాగే రజినీకాంత్ గారు పబ్లిక్ వేదికలో కూడా చెప్పారు. అలానే మోహన్ బాబు గారు రజిని స్నేహం గురించి చెప్తూ " పెద్ద రాయుడు సినిమా షూటింగ్ అప్పుడు ఆయన దగ్గర డబ్బు చాలా కష్టంగా ఉంటే రజిని ప్రత్యేకంగా రాజమండ్రి వచ్చి తనకి45 లక్షలు ఇచ్చి సినిమా సూపర్ హిట్ అవుతుంది రా" అని ధైర్యం చెప్పారని అని మోహన్ బాబు గారు అన్నారు. ఇలా వీరి మధ్య ఉన్న బంధం ఇండస్ట్రీలో అందరికి తెలుసు. మోహన్ బాబు గారు ఆయనని కర్ణుడుతో రజినీకాంత్ గారిని దుర్యోధనుడు తో పోల్చారు.

రజినీకాంత్ గారు తన ఆస్తిని తన తదనంతరం ప్రభుత్వ ట్రస్ట్ లకి రాసేసారు. ఇక ఆయనని సినిమాల్లోకి రావడానికి ఎంతో సహాయం చేసిన రాజ్ బహదూర్ గారికి రజిని ఎన్నో రకాలుగా సహాయం చేయాలని చూసిన ఆయన ఏ సహాయం తీసుకోలేదు. రజిని మారువేషంలో బెంగుళూరు లోని ఫ్లాట్ లో రాజ్ బహదూర్ గారిని కలుస్తారు. రజినీకాంత్ గారితో కలిసి నాటకాలలో పాల్గొన్న తన మిత్రుల కోసం వల్లి అనే సినిమా చేసి ఆ సినిమా విజయంతో వచ్చిన డబ్బులని ఆయన స్నేహితుల పిల్లలకి ఫిక్సడ్ డిపాజిట్ చేయింది నెల నెలా వారికి డబ్బులు వచ్చేలా చేశారు.

రజినీకాంత్ గారు వెండితెర మీదనే కాదు బుల్లితెర మీద కూడా సూపర్ స్టార్ గా సత్తా ఏంటో చూపించారు. ఆయన అమెరికన్ డిస్కవరీ ఛానల్ లో ఇంటూ ద వైల్డ్ విత్ బేర్ గ్రిల్స్ అనే షో లో పాల్గొన్నారు. ఈ షో ఆ ఏడాదిలో ఎక్కువగా రేటింగ్ వచ్చిన షో గా పేరు తెచ్చుకుంది. ఈ షో డిస్కవరీ ఛానల్ లో వచ్చినప్పుడు దాదాపుగా కోటి 20 లక్షలమంది చూసారు అని లెక్కలు చెప్తున్నాయి.

రజినీకాంత్ గారు  కమల్‌హాసన్‌ నటనను చూస్తూ తాను నటుడిగా ఎదిగాను అని చాలా సార్లు అన్నారు. ఒకప్పుడు ‘అవరగళ్‌’ సినిమా షూటింగ్‌ జరుగుతున్నప్పుడు రజనీ బయట ఎక్కడో కూర్చుని ఉన్నారు. ఈ విషయం తెలిసి బాలచందర్‌కు విపరీతమైన కోపం వచ్చింది. వెంటనే రజనీకాంత్‌ని సెట్‌ లోపలకి రమ్మన్నారు. ‘సిగరెట్‌ తాగడానికి బయటకు వెళ్లావా? కమల్‌ నటిస్తున్నాడు జాగ్రత్తగా గమనించు. అలా గమనిస్తే నీ నటన మెరుగుపడుతుంది’ అని మందలించారు. దీంతో అప్పటి నుంచి కమల్‌ నటనను దగ్గరుండి చూసేవారు రజనీ. అయితే కమల్‌ ఉన్న పరిశ్రమలో తానూ రాణించాలంటే ఇంకేదో భిన్నంగా చేయాలి అని ఆయన నిర్ణయించుకున్నారు.

ఒకసారి  రజనీకాంత్ గారు తన స్నేహితులు అయిన రఘునందన్‌, బహదూర్‌ తో సరదాగా మాట్లాడుకుంటూ బెంగళూరులో రోడ్ల వెంట తిరుగుతున్నారు. అప్పుడు రజిని జేబులో ఐదు వేల రూపాయల కట్ట తీసి రఘుకి ఇచ్చారు. గుడ్డనహళ్లి నుంచి చామరాజ్‌పేట వెళ్లేలోపు ఖర్చుచేయాలి లేకపోతే పదివేలు తిరిగి ఇవ్వాలి.. ఇదీ పందెం. రఘుకి శివాజీ మనసు తెలుసు. మొదట బజ్జీలమ్మే చోటుకు వెళ్లి పక్కనే వాళ్ల చిన్నారి ఆడుకుంటుంటే రూ.500 ఇచ్చారు. వారు రఘుకి నమస్కరిస్తుంటే దూరం నుంచి రజనీ, బహదూర్‌ నవ్వుతూ చూశారు. అలా తోపుడు బండితో అవస్థపడే వృద్ధుడు, కాగితాలు ఏరుకునే కుర్రాడు, దీనావస్థలో ఉన్న వృద్ధ దంపతులు, అనాథ పిల్లలు ఇలా చాలా మందికి డబ్బు పంచేశారు. డబ్బు కాగితాల కన్నా నిస్సహాయుల కళ్లలో ఆనందాన్ని విలువ కట్టే ఇలాంటి సాయంత్రాలు, పందేలు ఆ స్నేహితులు చేస్తూనే ఉన్నారు. శివాజీలా ఇబ్బందులు పడుతున్న ఎంతో మందికి రజనీ సాయం చేసేవారు.

రాజకీయ ప్రవేశం

1991 నవంబర్ 5న దళపతి సినిమా రిలీజ్. అప్పటికే రజినీకాంత్ తమిళనాడు ప్రజలకు దేవుడైపోయాడు. మమ్ముట్టి, రజినీకాంత్ కాంబినేషన్, మణిరత్నం డైరెక్షన్ అంటే క్రేజ్ మామూలుగా లేదు. దీంతో ఆ సినిమా విడుదలకు ఐదు రోజుల ముందు అంటే, 1991 నవంబర్ 1న తమిళనాడులోని తిరుచ్చిలో ‘తిరైయులగ రాజా మక్కల్ నాయగన్ రజినీ మంద్రం’ అనే అభిమాన సంఘం వాళ్లు కొన్ని పోస్టర్లు ముద్రించారు. ఆ పోస్టర్‌లో ముగ్గురి ఫొటోలు ఉన్నాయి. ఒకరు కరుణానిధి, మరొకరు జయలలిత, మూడో వ్యక్తి రజినీకాంత్. వారి పేర్ల కింద కరుణానిధి, (మాజీ సీఎం), జయలలిత (ప్రస్తుత సీఎం), రజినీకాంత్ (కాబోయే సీఎం) అని ప్రింట్ కొట్టారు. సుమారు 100 పోస్టర్లు ప్రింట్లు కొట్టారు. అందులో 70 పోస్టర్లను తిరుచ్చిలో కొన్ని చోట్ల అంటించారు. ఈ విషయం గమనించిన ఓ లోకల్ పేపర్ వెంటనే దాన్ని ఫొటో తీసి ఓ సంచలన కథనం రాసింది. అదేంటంటే, ‘రజినీకాంత్‌ను రాజకీయాల్లోకి రావాలని కోరుతున్న అభిమానులు’ అనేది ఆ స్టోరీ సారాంశం. ఈ విషయం ఆ నోటా, ఈ నోటా పెద్ద సంచలనంగా మారింది. దీంతో వెంటనే పోలీసులు అలర్ట్ అయ్యారు. ఆ పోస్టర్లు ప్రింట్ చేయించిన అభిమాన సంఘాన్ని పిలిచారు. మొత్తం ఎన్ని పోస్టర్లు ప్రింట్ చేశారు? ఎన్ని అంటించారని అడిగారు? దీంతో తాము 100 ప్రింట్ చేయించామని, ఇప్పటి వరకు 70 అంటించామని, మరో 30 వరకు ఉంటాయని చెప్పారు. వెంటనే ఆ అంటించని వాటిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇంకోసారి ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేస్తే కేసు పెట్టి లోపల వేయాల్సి వస్తుందని హెచ్చరించారు. అదే సమయంలో రజినీకాంత్ ఫ్యాన్స్‌ను పోలీసులు వేధిస్తున్నారంటూ పుకారు లేవడంతో జిల్లా అభిమానం సంఘం నాయకులు వెళ్లి పోలీసులతో మాట్లాడారు. మొత్తానికి అక్కడ వివాదం సద్దుమణిగింది. ఫ్యాన్స్ పోస్టర్లు ప్రింట్ చేయడం, దానికి పోలీసులు యాక్షన్, అందుకు అభిమానుల రియాక్షన్ మొత్తం అంతా అన్ని పేపర్లు, టీవీలు జాతీయ స్థాయిలో కూడా పేపర్లలో వచ్చింది. అప్పటి నుంచి రజినీకాంత్ రాజకీయ ఆరంగేట్రం మీద చర్చ మొదలైంది. ఆ తర్వాత కూడా కొన్ని అభిమాన సంఘాలు ఇలా రజినీ పొలిటికల్ ఎంట్రీ మీద పోస్టర్లు ముద్రించాయి.

పీవీ నరసింహారావు ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో రజినీకాంత్ ఆయన్ను కలిశారు. అప్పుడు మరోసారి రజినీ రాజకీయ ఆరంగేట్రం మీద చర్చ జరిగింది. ఆ సమయంలో కాంగ్రెస్ పార్టీని, అన్నాడీఎంకేతో పొత్తు వదిలి పెట్టాలని సూచించారు. కావాలంటే, కాంగ్రెస్ పార్టీకి తాను మద్దతిస్తానన్నారు. కానీ, పీవీ నరసింహారావు రజినీ ప్రతిపాదనను తోసి పుచ్చారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో రజినీకాంత్ బహిరంగంగానే డీఎంకేకు మద్దతు పలికారు. ఆ ఎన్నికల్లో డీఎంకే ఘన విజయం సాధించింది. కరుణానిధి సీఎం అయ్యారు. ఆ తర్వాత కూడా పలుమార్లు రజినీకాంత్ ఇదిగో వచ్చేస్తున్నాడు.. 2017లో మాత్రం తాను రాజకీయాల్లోకి వస్తానని, తమిళనాట ఎప్పుడు అసెంబ్లీ ఎన్నికలు జరిగితే అప్పుడు పోటీ చేస్తానని చెప్పాడు రజినీ. చూచాయగా పార్టీ పెడతానని ప్రకటించాడు. డిసెంబర్ 3న పార్టీ పెడతానని అధికారికంగా ప్రకటించాడు. అయితే, తాజాగా హైదరాబాద్‌లో అన్నాత్తై సినిమా షూటింగ్‌లో ఉండగా కొందరికి కరోనా రావడం, ఆ తర్వాత హై బీపీతో రజినీ అపోలో ఆస్పత్రిలో రెండు రోజులు చికిత్స పొందారు. తాను ప్రత్యక్ష రాజకీయాల్లోకి రానని, పార్టీ పెట్టడం లేదని స్పష్టం చేశారు.

అవార్డ్స్

రజినీకాంత్ గారికి తమిళ పరిశ్రమలో చాలా అవార్డ్స్ వచ్చాయి. ఆయనకి మొదటి ఫిల్మ్ ఫేర్ అవార్డ్ 1984 లో నల్లవనుకు నల్లవన్ అనే సినిమాకి వచ్చింది. అలాగే రజిని కి వివిధ సినిమాలకి గాను 6 తమిళనాడు స్టేట్ అవార్డ్స్ వచ్చాయి.

తమిళనాడు ప్రభుత్వం నుంచి రజినికాంత్ గారికి 1984 లో కలైమామని, 1989 లో యమ్. జి . ఆర్ అవార్డ్స్ లభించాయి. ఇక భారత ప్రభుత్వం 2000 సంవత్సరం పద్మ భూషణ్ , 2016 లో పద్మవిభూషణ్ అవార్డ్స్ తో సత్కరించింది. మహారాష్ట్ర ప్రభుత్వం రజినీకాంత్ గారిని రాజ్ కపూర్ అవార్డ్ తో కూడా సత్కరించారు.

సూపర్ స్టార్ రజినీకాంత్ గారిని 51వ దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు తో ప్రభుత్వం సత్కరించింది.

46 ఏళ్ళ సినీ ప్రస్థానంలో ఎన్నో అవార్డులు అందుకున్న రజినీ.. ఫాల్కే అవార్డు కూడా పొందడంతో ఆయన అభిమానుల ఆనందానికి అవధులు లేవు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఈ అవార్డును ఇప్పుడు తన స్నేహితుడు రాజ్ బహదూర్ గారికి అంకితం ఇచ్చాడు సూపర్ స్టార్ రజినీకాంత్.  తనలోని నటుడిని అందరికంటే ముందు గుర్తించింది ఈయనే. అందుకే అతన్ని గుర్తు పెట్టుకుని ఇప్పుడు తనకు వచ్చిన దాదా సాహెబ్ ఫాల్కే అవార్డును అంకితం ఇచ్చాడు రజినీకాంత్. తనకు ఫాల్కే అవార్డు రావడంతో పేరుపేరునా ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపిన తలైవా.. అప్పట్లో తాను బస్‌ కండక్టర్‌గా పని చేస్తున్న సమయంలో తనలోని నటుడిని తన బస్‌ డ్రైవర్‌ రాజ్‌ బహదూర్‌ గుర్తించాడని.. నువ్వు ఎప్పటికైనా గొప్పవాడికి అవుతావ్ అంటూ తనకు చెప్పేవాడని గుర్తు చేసుకున్నాడు. ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా ఆయనకి చేసిన మేలు మర్చిపోని గొప్పతనం రజినీకాంత్ గారికి సొంతం.

- Advertisement -

You've successfully subscribed to Tollywood Latest News | Celebrities Profiles | Media9 Tollywood
Great! Next, complete checkout to get full access to all premium content.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.