సూపర్ స్టార్ మహేష్

టాలీవుడ్ లో అగ్ర కథనాయకుల్లో ఒకరైన  సూపర్ స్టార్ మహేష్ బాబు ఎంత కూల్ గా ఉంటాడో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. పెద్దగా వివాదాలకు వెళ్లకుండా చాలా ఈక్వల్ గా అటు ఫ్యామిలీ లైఫ్ ను, ప్రొఫెషన్ ను మేనేజ్ చేస్తుంటాడు. టాలీవుడ్ లో పోకిరి సినిమాతో ఇండస్ట్రీ హిట్ కొట్టాలన్న, వన్ నేనొక్కడినే లాంటి ప్రయోగాత్మక సినిమాలలో నటించాలన్నా అది మహేష్ బాబుకే సాధ్యం అయింది. సినిమాల్లో ఎలా ఉన్నా కూడా బయట మాత్రం మహేష్ ఎక్కువగా ఫ్యామిలీ మ్యాన్ గా ఉండడానికే ఇష్టపడతారు. ఆయనకి సమయం దొరికినప్పుడల్లా ఫామిలీ తో కలిసి హాయిగా ట్రిప్స్ కి వెళ్తూ ఉంటారు.

జననం

ఘట్టమనేని మహేష్ బాబు ఆగస్ట్ 9, 1974న సూపర్ స్టార్ కృష్ణ, శ్రీమతి ఇందిరా దేవి  గారికి మద్రాసులొ జన్మించారు. మహేష్ కు ఒక అన్నయ్య రమేశ్ బాబు, ఇద్దరు అక్కలు పద్మావతి, మంజుల, ఒక చెల్లెలు ప్రియదర్శిని ఉన్నారు. మహేష్ బాబు చిన్నతనంలో తన అమ్మమ్మ అయిన దుర్గమ్మ గారి దగ్గర పెరిగాడు. తండ్రి కృష్ణ తన సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ, తన పిల్లలకు తగిన సమయం కేటాయించేవాడు. మహేష్ బాబు తన చదువును మద్రాసు లో పూర్తిచేసారు. ప్రాధమిక విద్య సెయింట్ బెడె స్కూల్ లో పూర్తి చేయగా, లయోలా కాలేజీ నుండి కామర్స్ లో పట్టా పుచ్చుకున్నాడు.

సినీ ప్రస్థానం

మహేష్ బాబు తన సినీ ప్రస్థానాన్ని తన సోదరుడు రమేష్ బాబు నటించిన నీడ చిత్రంలో ఒక చిన్న పాత్రతో మొదలు పెట్టాడు. 1983లో ప్రముఖ దర్శకుడు కోడి రామకృష్ణ మనవి మేరకు పోరాటం సినిమాలో తన తండ్రి కృష్ణకు తమ్ముడిగా నటించాడు. ప్రముఖ దర్శక-నిర్మాత డూండీ ఆ చిత్రంలో మహేశ్ నటన చూసి అతను కృష్ణ గారి అబ్బాయి అని తెలుసుకుని ఆశ్చర్యపోయి ఆ అబ్బాయికి మంచి భవిష్యత్తు ఉంది అని కితాబు ఇచ్చాడు. అయన ఊహించిన విధంగానే బాల నటుడిగా తెలుగు ప్రేక్షకుల మెప్పు పొందినాడు. 1987లో తొలిసారిగా తన తండ్రి దర్శకత్వం వహించిన శంఖారావం చిత్రంలో నటించాడు. 1988 లో విడుదలైన, కోదండరామిరెడ్డి దర్శకత్వం వహించిన బజార్ రౌడీ చిత్రంలో అన్నయ్య రమేష్ తో కలిసి నటించాడు.1988లో మరల తన తండ్రి, అన్నయ్యలతో కలిసి ముగ్గురు కొడుకులు సినిమాలో నటించాడు. 1989 లో మరోసారి తన తొలి చిత్ర దర్శకుడు కోడిరామకృష్ణ తీసిన గూడచారి 117 చిత్రంలో నటించాడు. 1989 లో విడుదలైన కొడుకు దిద్దిన కాపురం చిత్రంలో మహేష్ తొలిసారి ద్విపాత్రభినయం చేసాడు.1990లో విడుదలైన బాలచంద్రుడు, అన్న - తమ్ముడు సినిమాతో బాలనటుడిగా తన తొలి ఇన్నింగ్స్ ని ముగించాడు.

హీరోగా

మహేష్‌ బాబు హీరోగా నటించిన మొదటి చిత్రం ‘రాజకుమారుడు’ 1999 జూలై 30న విడుదలైన ఈ సినిమా బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ అవ్వడమే కాకుండా మహేష్‌కు మంచి పేరును తెచ్చిపెట్టింది. దర్శకేంద్రుడు కె.రాఘవేంద్ర రావు దర్శకత్వం వహించిన ఈ సినిమాను వైజయంతి బ్యానర్‌లో అశ్వినీదత్‌ నిర్మించారు. బాలీవుడ్ భామ ప్రీతి జింటా హీరోయిన్‌ గా నటించిన ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందించారు. ప్రకాష్ రాజ్ కీలక పాత్ర పోషించగా, సూపర్ స్టార్ కృష్ణ క్యామియో రోల్ చేయడం విశేషం. ఈ సినిమా తర్వాత మహేశ్ బాబు, సిమ్రాన్, సాక్షి శివానంద్ ప్రధాన పాత్రల్లో, బూరుగుపల్లి శివరామకృష్ణ నిర్మాణంలో వై.వి.ఎస్. చౌదరి దర్శకత్వంలో తెరకెక్కిన ‘యువరాజు’ మిలీనియం ఇయర్ 2000 ఏప్రిల్ 14న విడుదలైంది. మహేశ్ హీరోగా నటించిన రెండవ సినిమా ఇది. రమణ గోగుల సాంగ్స్ ఇప్పటికీ వినిపిస్తూనే ఉంటాయి.


ఇక అదే సంవత్సరంలో వచ్చిన వంశీ సినిమాలో తన సతీమణి నమ్రత శిరోద్కర్ తో కలిసి నటించారు. ఈ సినిమా తర్వాత వారిద్దరూ ప్రేమ వివాహం చేస్కున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకి దిగ్గజ దర్శకుడు బి.గోపాల్ దర్శకత్వం వహించారు. కాకపోతే ఈ సినిమా అనుకున్నంత విజయం సాధించలేదు. యువరాజు, వంశీ లాంటి ప్లాపుల తరవాత మహేష్ బాబుతో మురారి అనే సినిమాని తెరకెక్కించారు కృష్ణవంశీ. 2001 ఫిబ్రవరి 17న విడుదలైన ఈ సినిమా మహేష్ కెరీర్ కి టర్నింగ్ పాయింట్ గా నిలిచింది. ఈ చిత్రంతో తనలో ఉన్న మంచి నటుడు ప్రేక్షకులకు పరిచయమయ్యారు. 65 సంవత్సరాల వయసులో ప్రముఖ గాయని జిక్కీ గారితో మణిశర్మ పాడించిన అలనాటి రామచంద్రుడు సాంగ్ ఒక సెన్సేషన్. ఈ పాటని క్లైమాక్స్ కి ముందు షూట్ చేస్తానని కృష్ణవంశీ అంటే అందరు అడ్డు చెప్పారు. కానీ అందరిని ఒప్పించి అదే పాటను తెరకెక్కించారు కృష్ణవంశీ. ఇప్పటికి ఈ పాట ఎవర్ గ్రీన్. ప్రతి పెళ్లిలో ఈ పాట ఉండాల్సిందే. తమిళంలో ఈ సినిమాను ఇదే టైటిల్ తో కృష్ణవంశీ, ప్రకాష్ రాజ్ కలిసి డబ్ చేశారు. అక్కడ కూడా ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది.

2002 లో మళ్ళీ మహేష్ బాబుకు పరాజయాలు తప్పలేదు. ఆ సంవత్సరం విడుదలైన టక్కరి దొంగ , బాబీ సినిమాలు భారీ అంచనాలతో విడుదలై పరాజయం అందుకున్నాయి. ఒక మంచి విజయం కోసం ఎదురు చూస్తున్న మహేష్ బాబుకి 2003లో వచ్చిన ‘ఒక్కడు’ ఆయన కెరీర్‌లో మైలు రాయి లాంటి చిత్రం. గుణశేఖర్‌ దర్శకత్వంలో ఎమ్.ఎస్‌రాజు నిర్మించిన ఈ చిత్రం అప్పట్లో సూపర్‌ హిట్‌గా నిలిచింది. మహేష్‌ యాక్షన్‌, భూమిక నటన, ప్రకాష్‌ రాజ్‌ విలనిజం సినిమాకి హైలైట్‌గా నిలిచాయి. మాస్ హీరోగా మహేష్ క్రేజ్‌ను అమాంతం పెంచేసింది. అప్పటి వరకు ఏ సినిమాలోను లేని హీరో ఎలివేషన్ ఈ సినమలో ఉంటుంది. ఫస్ట్ ఫ్రేమ్ నుంచి లాస్ట్ ఫ్రేమ్ వరకూ చాలా కొత్తగా ఉంటుంది. ఇదే సినిమాను తమిళంలో విజయ్, త్రిష జంటగా ‘గిల్లి’ పేరుతో రీమేక్ చేస్తే అక్కడ కూడా భారీ విజయాన్ని అందుకుంది. కన్నడలో ‘అజయ్’, బెంగాలీలో ‘జోర్’, హిందీలో ‘తేవర్’ పేర్లతో రీమేక్ చేస్తే అక్కడా విజయం సాధించింది.

ఇక అదే జోష్ లో తేజ దర్శకత్వంలో  విడుదలైన నిజం సినిమా ఊహించని రేంజ్ లో అడకపోయిన ఈ సినిమాలో మహేష్ బాబు నటనకి మంచి పేరు వచ్చింది. ఆ తర్వాత 2004లో మహేష్ బాబు నటించిన  ఫాంటసీ కామెడీ సినిమా నాని. తెలుగులో కొత్త కాన్సెప్ట్ వచ్చిన ఈ సినిమా పరాజయాన్ని అందుకుంది. అలాగే ఒక్కడు మూవీ కాంబినేషన్ లో మహేష్ బాబు హీరోగా గుణ శేఖర్ గారి దర్శకత్వంలో వచ్చిన అర్జున్ దాదాపుగా 18 కోట్ల భారీ బడ్జెట్ తో విడుదలైన ఈ సినిమా ఒక మోస్తరు విజయం సాధించింది. ఈ సినిమా కోసం 4 కోట్ల తో మధుర మీనాక్షి గుడి సెట్ ని వెయ్యడం అప్పట్లో సంచలనం.

త్రివిక్రమ్ దర్శకత్వంలో చేసిన ‘అతడు’ సినిమా 2005 ఆగస్టు 10 న విడుదలై అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించి మంచి విజయాన్ని అందుకుంది. మహేష్ బాబు పెళ్లి తర్వాత విడుదలైన ఫస్ట్ సినిమా అతడు. ఇందులో నాజర్ పాత్రకి ముందుగా శోభన్ బాబు గారిని అనుకున్నారు మురళీమోహన్, త్రివిక్రమ్. అందగాడిగా అందరు మెచ్చుకునే తానూ ముసలి పాత్రలో నటించడం ఇష్టం లేకా ఈ సినిమాని ఒప్పుకోలేదట. అలా ఆ పాత్రలో నాజర్ గారు అద్భుతంగా నటించారు. ఎస్.పి బాలసుబ్రహ్మణ్యం గారు డబ్బింగ్ చెప్పి ఆ పాత్రకి ప్రాణం పోశారు. ఇందులో హీరోయిన్ పేరు పూరి. త్రివిక్రమ్ ఇంటిపక్కన ఉండే ఓ అమ్మాయి పేరు పూర్ణిమ. ఆమెను అందరూ పూరి అని పిలిచేవారట. అది బాగా నచ్చి ఇందులో హీరోయిన్ కి అదే పేరు పెట్టేశాడట త్రివిక్రమ్. ఈ సినిమా యాక్షన్ సన్నివేశాల కోసం టైమ్-ఫ్రీజ్ ఎఫెక్ట్ షాట్లను వాడారు. యాక్షన్ సన్నివేశాలను పీటర్ హెయిన్ పర్యవేక్షణలో తెరకెక్కించారు. త్రివిక్రమ్ కథ, మహేష్ నటన, మణిశర్మ మ్యూజిక్ ఈ చిత్రానికి కల్ట్ స్టేటస్ తెచ్చిపెట్టాయి.

అప్పట్లో ఎక్కువ డీ.వీ.డీలు అమ్ముడు పోయిన సినిమా కూడా ఈ సినిమానే అందుకు గాను ఉత్తమ డి.వి.డి అవార్డును అందుకుంది ఈ చిత్రం. మొత్తం ఈ సినిమా 205 కేంద్రాల్లో 50 రోజులు, 38 కేంద్రాలలో 100 రోజులు ఆడింది. ఇక హైదరాబాద్ లోని సుదర్శన్ 35 మిమీలో 175 రోజులు ఆడింది. ఈ సినిమా విడుదలైన ఏడు సంవత్సరాల తర్వాత మా టీ.వీ ఈ సినిమా శాటిలైట్ రెన్యువల్ కోసం ఏకంగా 3.5 కోట్లు చెల్లించింది. ఇది అప్పట్లో సెన్సేషన్. ఈ సినిమా తమిళంలో నందు అనే పేరుతో, మలయాళంలో టార్గెట్ అనే పేరుతో అనువాదం అయింది. హిందీలో ఏక్ అనే పేరుతోనూ, బెంగాలీలో వాంటెడ్ పేరుతో పునర్మించారు. పోలండ్ భాషలో విడుదలైన మొదటి తెలుగు సినిమా కూడా అతడు కావడం విశేషం. ఈ సినిమాకి ఉత్తమ నటుడుగా మహేష్ బాబు, ఉత్తమ మాటల రచయితగా త్రివిక్రమ్ నంది అవార్డులను అందుకున్నారు. వెండితెర పైనే కాకుండా బుల్లితెర పై కూడా ప్రభంజనం సృష్టించింది ఈ చిత్రం.

ఇక మహేష్ బాబు, డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కలయికలో వచ్చిన చిత్రం ‘పోకిరి’. ఈ చిత్రం అప్పటి వరకూ తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న అన్ని రికార్డులను తిరగరాసింది. సరిగ్గా 14 ఏళ్ల క్రితం 2006 ఏప్రిల్ 28న ఈ సినిమా విడుదలైంది. ఈ చిత్రంలో మహేష్ బాబులోని కొత్త యాంగిల్‌ను పూరీ జగన్నాథ్‌ ఆవిష్కరించాడు. ‘ఎవడు కొడితే దిమ్మ దిరిగి మైండ్ బ్లాంక్ అవుతుందో ఆడే పండుగాడు’.. డైలాగు ప్రేక్షకుల మదిలో ఇప్పటికి అలాగే ఉంది. ఈ చిత్రం ప్రిన్స్ మహేష్ బాబును సూపర్ స్టార్‌గా మార్చింది. మొత్తంగా మహేష్ బాబు కెరీర్‌లో ‘పోకిరి’ చిత్రానికి ప్రత్యేక స్థానం ఉంది. దాదాపు రూ.12 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం దాదాపు రూ. 40 కోట్లకు పైగా షేర్ సాధించింది. ఇంత షేర్ సాధించిన తొలి తెలుగు చిత్రంగా పోకిరి రికార్డులకు ఎక్కింది.

‘పోకిరి’ చిత్రం 200 కేంద్రాల్లో 100 రోజులు పైగా నడిచి ఆల్ టైమ్ ఇండస్ట్రీ రికార్డు క్రియేట్ చేసింది. అప్పటి వరకు ఒకే మూసలో ఉన్న మహేష్ బాబులోని కొత్త కోణాన్ని ఆవిష్కరించింది పోకిరి చిత్రం. ఈ సినిమాలో మహేష్ బాబు చెప్పిన డైలాగులు, ఇలియానా గ్లామర్, బ్రహ్మానందం కామెడీ, యాక్షన్ సీక్వెన్స్ ఈ చిత్ర విజయంలో కీలక పాత్ర పోషించాయి.ఈ చిత్రంలో మహేష్ బాబు పక్కా హైదరాబాదీ పోకిరిగా తనదైన శైలిలో నటించిన మెప్పించాడు. చాలా చోట్ల ‘పోకిరి’ చిత్రం సంవత్సరానికి పైగా నడిచి కొత్త రికార్డులు క్రియేట్ చేసింది. ఈ చిత్రం తమిళంతో పాటు హిందీ, బెంగాలీ, కన్నడ వంటి పలు భాషల్లో రీమేక్ అయింది. అంతేకాదు ఆయా భాషల్లో ఈ చిత్రం సంచలన విజయాలు నమోదు చేయడం మరో విశేషం. ‘పోకిరి’ చిత్రంతో తొలిసారి ఓవర్సీస్ మార్కెట్‌లో తెలుగు చిత్రాల ప్రభంజనం మొదలైంది.

పోకిరి తర్వాత భారీ అంచనాలతో వచ్చిన సైనికుడు సినిమా అంతగా విజయం సాదించకలేకపోయింది. కానీ ఈ సినిమాలో వి.ఎఫ్.ఎక్స్ కి మాత్రం నేషనల్ అవార్డ్ రావడం విశేషం. అలాగే 2007 లో వచ్చిన అతిధి సినిమా తొలినాళ్ళలో మంచి వసూళ్ళు రాబట్టినప్పటికీ ఈ చిత్రం ఒక మోస్తరు విజయాన్ని మాత్రమే నమోదు చేసింది. అనంతరం 3 సంవత్సరాల గ్యాప్ తర్వాత భారీ అంచనాలతో సూపర్‌ స్టార్‌ మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వచ్చిన సినిమా ఖలేజా. మహేష్ లో ఓ కొత్త కోణాన్ని చూపించింది. ఈ సినిమాలో మహేష్ యాక్టింగ్, డైలాగ్ డెలివరీ చాలా కొత్తగా ఉంటాయి. మహేష్‌కు జోడిగా అనుష్క నటించింది. అప్పటి వరకూ సీరియస్ రోల్స్ మాత్రమె చేసిన మహేష్ బాబు ఈ చిత్రంతో ఎన్నడూ లేనంత కామెడి పండించాడు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర పెద్దగా అలరించలేకపోయినా, టీవీలో మాత్రం హైయ్యేస్ట్ టీ.ఆర్.పీ రేటింగ్స్’తో అదరగొట్టింది. ఖలేజాలోని రామజోగయ్య రాసిన ‘సదా శివా సన్యాసి...’ పాట, ఇప్పటికీ పర్వదినాల సమయంలో వినబడుతూనే ఉంటుంది.

మహేష్ కెరీర్ లో అతిపెద్ద బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా నిలిచింది దూకుడు. సెప్టెంబర్ 23, 2011వ సంవత్సరంలో విదులైన ఈ చిత్రం అన్ని సెంటర్ల ప్రేక్షకుల్ని అలరించింది. దర్శకుడు శ్రీను వైట్ల తెరకెక్కించిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ తో మహేష్ భారీ హిట్ అందుకున్నారు. మహేష్ పోలీస్ గా నటించిన ఈ చిత్రంలో ఆయన బాడీ లాంగ్వేజ్ మరియు తెలంగాణా ఎసెంట్ ఫ్యాన్స్ కి కొత్త అనుభూతిని పంచాయి. 2011వ సంవత్సరంలో టాలీవుడ్ హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచిన దూకుడు విడుదలై 9 ఏళ్ళు అవుతుంది. 2005లో పోకిరితో ఇండస్ట్రీ హిట్ అందుకున్న మహేష్ వరుసగా మూడు పరాజయాలు చవిచూశారు. సైనికుడు, అతిథి, ఖలేజా చిత్రాలు ఆశించిన విజయం సాధించలేకపోయాయి. దీనితో దర్శకుడు శ్రీను వైట్ల కథను మహేష్ ఒకే చేయడం జరిగింది. మహేష్ యాక్షన్, సమంత గ్లామర్ ఈ మూవీకి విజయంలో దోహదం చేశాయి. దూకుడు మూవీ భారీ విజయంలో క్రెడిట్ బ్రహ్మానందం, ఎమ్మెస్ నారాయణలకు కూడా ఇవ్వాల్సిందే. ముఖ్యంగా బ్రహ్మానందం మరియు మహేష్ కాంబినేషన్ లో వచ్చే కామెడీ ఎపిసోడ్స్ థియేటర్స్ లో ఓ రేంజ్ లో పేలాయి. ఇక ముసలి వయసులో ఎమ్మెస్ నారాయణ హీరో వేషాలు కడుపుబ్బా నవ్వించాయి. యాక్షన్ కి మించి కామెడీ బాగా క్లిక్ కావడంతో మూవీకి భారీ విజయం దక్కింది. థమన్ సాంగ్స్ కూడా దూకుడు చిత్ర విజయంలో కీలక పాత్ర పోషించాయి. మొత్తంగా కామెడీ, రొమాన్స్, యాక్షన్ అన్నీ కలగలిపి ఓ పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ని తెరకెక్కించారు. మహేష్ ని ఫుల్ ఫార్మ్ లోకి తెచ్చిన చిత్రంగా దూకుడు నిలిచింది.

ఇక 2012 సంక్రాంతికి విడుదలైన ‘బిజినెస్మేన్’ సినిమాతో మహేష్ బాబు ఇంకో సూపర్ హిట్ సినిమాని తన ఖాతాలో వేసుకున్నారు. పూరి జగన్నాథ్, మహేష్ బాబు కాంబినేషన్ లో వచ్చిన పోకిరి సినిమాని మించి ఈ సినిమా కలెక్షన్స్ సాధించింది. మహేష్ బాబు వన్ మ్యాన్ షో, పూరి మార్క్ డైలాగ్స్, కాజల్ అగర్వాల్ గ్లామర్ఈ సినిమాకి పెద్ద హైలైట్. మనిషి థాట్ ప్రాసెస్ ని ఈ చిత్రం క్వషన్ చేస్తుంది.

కుటుంబ కథా చిత్రాలను మన తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తూనే ఉంటారు. మంచి కుటుంబ కథతో థియేటర్లలో ప్రేక్షకులను కూర్చోబెడితే చాలు సినిమా పక్కా హిట్ అయినట్టే. అలాంటి సినిమాల్లో 2013 లో వచ్చిన ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమా ఒకటి. రొటీన్ కు భిన్నంగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఎంత హిట్ అయిందో తెలుసు. ఇక కుటుంబ కథా చిత్రాలు తీయడానికి ఎప్పుడూ ముందుండే దిల్ రాజు ఈ సినిమాకు నిర్మాత కావడం, వెంకటేష్, మహేష్ బాబు లాంటి స్టార్ హీరోలు, వర్సటైల్ యాక్టర్ ప్రకాశ్ రాజ్, సహజనటి జయసుధ, హీరోయిన్స్ సమంత, అంజలి ప్లస్ పాయింట్స్ అయ్యాయి. అంతేకాదు వెంకటేష్-మహేశ్ బాబు కలిసి నటించిన తరువాతే మల్టీస్టారర్ సినిమాలు ఎక్కువయ్యాయి. దాదాపు 20 యేళ్ళ తర్వాత నిర్మించబడిన మల్టీస్టారర్ చిత్రం కావడంతో భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం సంచలనాత్మక విజయం సాధించడమే కాక ప్రపంచవ్యాప్తంగా 54.75 కోట్ల కలెక్షన్లను సాధించింది.

సుకుమార్ దర్శకత్వంలో లో 2014 లో వచ్చిన మహేష్ బాబు సినిమా వన్ నేనొక్కడినే. ఈ సినిమాని 14రీల్స్ సంస్థ భారీ బడ్జెట్ తో నిర్మించింది. సంక్రాంతికి విడుదలైన ఈ సినిమా ఆశించిన విజయం సాదించలేకపోయినా కూడా సినిమాకి మాత్రం చాలా మంచి పేరు వచ్చింది. ఈ సినిమాలో మహేష్ బాబు నటన గురించి ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. ఇలాంటి పాత్రలు ఇతని కోసమే రాస్తారేమో అన్నట్టు అయన వన్ లో నటించారు. కథలో ఉన్న ఇంటెన్సిటీని చివరి వరకు అయన నటనతో ఎక్కడ మిస్ అవ్వకుండా చేసారు. కరక్ట్ గా చెప్పాలంటే గౌతం పాత్రలో జీవించారు. కథ విషయంలో సుకుమార్ వినూత్న పాయింట్ ని ఎంచుకున్నారు. కొన్ని సన్నివేశాలను చిత్రీకరించిన వైనం అప్పటి వరకూ తెలుగు తెర మీద ఎప్పుడూ చూడలేదు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇంత గొప్ప స్క్రీన్ ప్లే మరియు టేకింగ్ ఇది వరకు ఎప్పుడూ తెలుగు ప్రేక్షకుల ముందుకు రాలేదు. ఈ చిత్ర ఫలితం ఎలా ఉన్నా మహేష్ బాబు కెరీర్ లో ఈ చిత్రానికి ప్రత్యేకమైన స్థానం ఉంటుందని చెప్పొచ్చు.

ఇక శ్రీను వైట్ల దర్శకత్వంలో అదే సంవత్సరం వచ్చిన ‘ఆగడు’ సినిమా కూడా భారీ పరాజయం అందుకుంది. వన్ నేనొక్కడినే, ఆగడు సినిమాల పరాజయలతో డీలా పడిన మహేష్ బాబుని శ్రీమంతుడు సినిమా హిట్ ఒక రేంజ్ లో నిలబెట్టింది. ఒక సినిమాని అందరూ ఆదరిస్తే దాన్ని హిట్ సినిమా అని అంటారు. అదే సినిమా అందరినీ ఆలోచింపజేస్తే దాన్ని గొప్ప సినిమా అంటారు. అలాంటి సినిమాలు ఇండస్ట్రీలో చాలా తక్కువేనని చెప్పాలి. అలాంటి చిత్రమే మహేష్ బాబు, దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్ లో వచ్చిన సినిమా ‘శ్రీమంతుడు’. పల్లెమీద కోపంతో పట్టణానికి వలసొచ్చి  శ్రీమంతుడిగా ఎదిగిన ఓ తండ్రి.. పల్లెలో తన మూలాలు వెతుక్కునేందుకు పట్టణం వదిలిపెట్టిన కొడుకు...ఈ రెండు జీవితాల మధ్య ఓ ఊరు దత్తత కథాశంతో తెరకెక్కిన శ్రీమంతుడు చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. బహుబలి మొదటి పార్ట్ వచ్చిన నెల రోజులకి శ్రీమంతుడు చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఒకేసారి 2500 స్క్రీన్లలో శ్రీమంతుడు చిత్రాన్ని విడుదల చేశారు. శ్రీమంతుడు రెండు తెలుగు రాష్ట్రాలలో 60 కోట్లు, వరల్డ్ వైడ్ గా 85 కోట్లను కొల్లగొట్టింది. 57 కోట్లతో ప్రీ రిలీజ్ బిజినెస్ చేస్తే దాదాపుగా 30 కోట్ల లాభాన్ని తెచ్చిపెట్టింది. ఈ సినిమా 185 సెంటర్లలో 50 రోజులు, తొమ్మిది సెంటర్లలో వంద రోజులను పూర్తి చేసుకుంది. ఈ సినిమాకి గాను మహేష్ బాబుకి ఫిలిం ఫేర్ అవార్డు లభించింది.ఈ సినిమా కథాశంకి స్వయంగా ప్రధాని మోడీ కూడా ఫిదా అయిపోయారు. ఇక యూట్యూబ్ లో కూడా వంద మిలియన్లు వ్యూస్ ని అందుకుంది ఈ చిత్రం.

ఆ తరువాత ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమాతో మంచి విజయాన్ని అందించిన శ్రీకాంత్ అడ్డాల గారి దర్శకత్వంలో ‘బ్రహ్మోత్సవం’ చిత్రంలో నటించారు. మహేష్, సత్య రాజ్, జయసుధ, రేవతి, రావు రమేష్ లాంటి అద్భుతమైన తారాగణంతో భారి అంచనాల మధ్య విదుదలైన ఈ చిత్రం అపజయాన్ని మూట గట్టుకుంది. ఆ తరువాత మురుగదాస్ గారి దర్శకత్వంలో చేసిన ‘స్పైడర్’ చిత్రం 2017 సెప్టెంబరు 27న విడుదలైంది. ప్రముఖ దర్శకుడు, నటుడు అయిన ఎస్.జే సూర్య ఈ చిత్రంలో విలన్ పాత్రలో బ్రహ్మాండంగా నటించారు. ఆయన తమ్ముడి పాత్రలో ‘ప్రేమిస్తే’ భరత్ ఒక ముఖ్య పాత్రలో నటించాడు. మంచి మెసేజ్ ఓరియెంటెడ్ చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమా కూడా భారి అంచనాల మధ్య విడుదలైనా ఆశించినంత విజయాన్ని అందుకోలేదు.

తరువాత 2018 లో కొరటాల శివ గారి దర్శకత్వంలో వచ్చిన ‘భరత్ అనే నేను’ చిత్రం మంచి విజయం సాధించింది. అందులో మహేష్ బాబు గారు ముఖ్యమంత్రిగా నటించారు. ఏప్రిల్ 20న విడుదలైన ‘భరత్ అనే నేను’ మూవీ. తొలిరోజు నుండి రికార్డ్ కలెక్షన్లతో దూసుకుపోయి, కేవలం మూడు వారాల్లో రూ. 205 కోట్ల గ్రాస్ కలెక్షన్లను కొల్లగొట్టింది. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు నిర్మాతలు.  

ఇక 2019 లో  వంశీ పైడిపల్లి గారి దర్శకత్వంలో మహేష్ బాబు మహర్షి చిత్రంలో నటించారు. హీరోగా మహేష్ బాబు గారికి ఇది 25వ చిత్రం. ఈ చిత్రం 100 కోట్ల‌కు పైగా షేర్ వ‌సూలు చేసంది. ఇందులో మహేష్ బాబు, నటుడు అల్లరి నరేష్ స్నేహితులుగా నటించి మెప్పించారు. రైతులకు కావాల్సింది జాలి కాదు గౌరవం అనే కాన్సెప్ట్ మీద వచ్చిన ఈ సినిమా మహేష్ బాబు కెరీర్ లో పెద్ద బ్లాక్ బస్టర్స్ లో ఒకటి.

ఇక మహేష్ బాబు 2020 సంక్రాంతి సెన్సేషన్ ‘సరిలేరు నీకెవ్వరు’ బాక్సాఫీస్ రేసులో ఏ విధంగా దూసుకుపోయిందో అందరికీ తెలుసు. యాక్షన్ ఎంటర్టైనర్ గా ఆడియెన్స్ ముందుకొచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది. మహేష్ బాబు ఈ సినిమాలో అజయ్ అనే ఆర్మీ మేజర్ పాత్రలో నటించగా కన్నడ బ్యూటీ రష్మిక మండన్న మహేష్ బాబు సరసన జంటగా నటించింది. చాలా ఏళ్ల తర్వాత సీనియర్ హీరోయిన్ విజయశాంతి ఈ సినిమాతో మళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చారు. కడుపుబ్బా నవ్వించే కామెడీ సన్నివేశాలు, మాస్ ఆడియెన్స్‌ ని ఆకట్టుకునే యాక్షన్ ఎలిమెంట్స్, ఫ్యామిలీ ఆడియెన్స్‌ ని కట్టిపడేసే సెంటిమెంట్ సీన్స్ ఆడియెన్స్‌ చేత సరిలేరు నీకెవ్వరు అనిపించాయి. ఈ సినిమా మహేష్ బాబు గత సినిమాల రికార్డులన్నింటినీ తిరగరాసింది. అనిల్ రావిపూడి డైరెక్ట్ చేసిన ఈ సినిమాకు ప్రముఖ సంగీత దర్శకుడు దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజ్ చేయగా దిల్ రాజు, అనిలు సుంకర, మహేష్ బాబు సంయుక్తంగా నిర్మించారు.

వ్యక్తిగత జీవితం

వంశీ సినిమాలో తనతో కలసి నటించిన నటి, మాజీ మిస్ ఇండియా నమ్రతా శిరోద్కర్ని 2005లో వివాహం చేసుకున్నాడు. మహేష్‌ను పెళ్లి చేసుకున్న తరువాత సినిమాలకు గుడ్‌బై చెప్పేసింది నమ్రత. ఇంకొక విశేషం ఏంటి అంటే నమ్రత, మహేష్ బాబు కన్నా నాలుగేళ్ల పెద్దది. అయితే వయసు తారతమ్యం వారి ప్రేమకు, పెళ్లికి అడ్డు రాలేదు. మహేష్ నమ్రతలకు 2006లో గౌతమ్‌, 2012లో సితారలు జన్మించారు.

ఇక మహేష్ బాబు గారి తండ్రి సూపర్ స్టార్ కృష్ణ గారు నాలుగు దశాబ్దాలకు పైగా కెరీర్‌ కొనసాగిస్తూ 340 పై చిలుకు సినిమాల్లో ప్రధాన పాత్రలో ఆయన అభినయించారు. 1983లో ప్రభుత్వ సహకారంతో పద్మాలయా స్టూడియోను హైదరాబాద్‌లో ఏర్పాటు చేసి పలు విజయవంతమైన సినిమాలు రూపొందించారు. నిర్మాతగా కూడా సక్సెస్ అయ్యారు. ఆ తర్వాత దర్శకుడి గానూ 16 సినిమాలు తీసిన ఘనత సూపర్ స్టార్ కృష్ణ గారి సొంతం. తెలుగు సినీ ప్రేక్షకులకు మొట్టమొదటి కౌబాయ్, జేమ్స్ బాండ్ హీరో కూడా కృష్ణ గారే. ఆ రోజుల్లోనే ముందుచూపుతో టెక్నికల్‌గా తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి చాటే గొప్ప ప్రయత్నాలు చేశారాయన. అలా ఎన్నో సినిమాలతో సంచలనాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తూ సాంఘిక, జానపద, పౌరాణిక, జేమ్స్‌ బాండ్, కౌబాయ్ వంటి డిఫరెంట్ చిత్రాల్లో మెప్పించి అశేష అభిమాన వర్గాన్ని కూడగట్టుకున్నారు సూపర్ స్టార్ కృష్ణ.

ఇక మహేష్ బాబు అన్నయ్య రమేష్ బాబు గారు కూడా హీరోగా నటించారు. తండ్రి సూపర్ స్టార్ కృష్ణ హీరోగా నటించిన ‘అల్లూరి సీతారామరాజు’ సినిమాలో బాల నటుడుగా పరిచయం అయిన రమేష్ బాబు. ఆ తర్వాత కృష్ణ నటించిన పలు సినిమాల్లో హీరో చిన్ననాటి వేషాల్లో నటించాడు రమేష్ బాబు. ముఖ్యంగా ‘మనుషులు చేసిన దొంగలు, దొంగలకు దొంగ, అన్నాదమ్ముల సవాల్ వంటి చిత్రాల్లో చిన్పప్పటి హీరో పాత్రల్లో నటించాడు రమేష్ బాబు. ఆ తర్వాత దాసరి నారాయణ రావు దర్శకత్వంలో వచ్చిన ‘నీడ’, ‘పాలు నీళ్లు’ చిత్రాల్లో నటించిన రమేష్ బాబు.. వి.మధుసూదనరావు దర్శకత్వంలో తెరకెక్కిన ‘సామ్రాట్’తో హీరోగా పరిచయం అయ్యారు. తొలి చిత్రం ‘సామ్రాట్’తో మంచి విజయాన్ని అందుకున్న రమేష్ బాబు ఆ తర్వాత చిన్ని కృష్ణుడు, బజార్ రౌడీ, కలియుగ కర్ణుడు, బ్లాక్ టైగర్, ముగ్గురు కొడుకులు, కృష్ణ గారి అబ్బాయి, కలియుగ అభిమన్యుడు, ఆయుధం వంటి పలు చిత్రాల్లో నటించిన రమేష్ బాబు చివరగా 1997లో ఎన్.శంకర్ దర్శకత్వంలో ‘ఎన్‌కౌంటర్’ చిత్రంలో చివరసారిగా కనిపించారు. ఆ తర్వాత రమేష్ బాబు ఏ చిత్రంలో నటించలేదు. హీరోగా కెరీర్ ముగిసాక రమేష్ బాబు గారు, కృష్ణ ప్రొడక్షన్స్ హౌస్ స్థాపించి, మహేష్ బాబు హీరోగా అర్జున్, అతిథి చిత్రాలను తెరకెక్కించాడు. అంతేకాకుండా దూకుడు, ఆగడు వంటి చిత్రాలకు సమర్పకుడిగా వ్యవహరించాడు. తండ్రి సూపర్ స్టార్ కృష్ణ, తమ్ముడు మహేష్ బాబుతో కలిసి ‘ముగ్గురు కొడుకులు’ చిత్రంలో కలిసి నటించారు రమేష్ బాబు. కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్‌గా నిలిచింది.

మహేష్ బాబు సిస్టర్ మంజుల ప్రస్తుతం సినిమా నిర్మాణ రంగంలో ఉన్నారు. ఇందిరా ప్రొడక్షన్ సంస్థను స్థాపించి గతంలో కొన్ని చిత్రాలను నిర్మించారు. నటిగాను పలు సినిమాల్లో నటించిన ఆమె ఇటీవల దర్శకురాలిగా కూడా మారారు. సందీప్ కిషన్ తో మనసుకు నచ్చింది సినిమా చేశారు.

సౌత్ ఇండియాలో మహేష్ బాబు చేసిన అన్ని యాడ్స్ ఎవరూ చేసి ఉండరు. ఓ వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు యాడ్స్ కూడా చేస్తూ దూసుకుపోతున్నాడు సూపర్ స్టార్. ఇటీవలే ప్రముఖ శీతల పానీయాల సంస్థ యాడ్లో ఆయన ప్రముఖ హిందీ నటుడు రణ్వీర్ సింగ్ తో కలిసి నటించారు. మహేష్ ఫాలోయింగ్ చూసి కార్పోరేట్ కంపెనీలు కూడా క్యూ కడుతున్నాయి.

మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో మైనపు విగ్రహాన్ని కలిగి ఉన్న తెలుగు నటుల్లో ఆయన కూడా ఒకరు.

అవార్డ్స్

  1. మొదటి సినిమా రాజకుమారుడు తోనే నంది ఉత్తమ నూతన నటుడి గా మహేష్ బాబు పురస్కారం అందుకున్నాడు.
  2. 2003 లో వచ్చిన నిజం సినిమాకు మొదటి సారిగా నంది ఉత్తమ నటుడు పురస్కారం అందుకున్నాడు.
  3. తర్వాత 2005 లో వచ్చిన అతడు, 2011 లో వచ్చిన దూకుడు, 2015 లో వచ్చిన శ్రీమంతుడు చిత్రాలకు కూడా ఉత్తమ నటుడిగా నంది పురస్కారాలు గెలుచుకున్నాడు.
  4. ఇక ఫిల్మ్ ఫేర్ ఉత్తమ తెలుగు నటుడుగా ఒక్కడు (2002) , అతడు (2005) , పోకిరి (2006) , దూకుడు (2011) , సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు ( 2013 ) సినిమాలకి అవార్డ్స్ అందుకున్నారు.
- Advertisement -

You've successfully subscribed to Tollywood Latest News | Celebrities Profiles | Media9 Tollywood
Great! Next, complete checkout to get full access to all premium content.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.