స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు. సౌత్ ఇండియాలోనే కాదు ఆ మాటకొస్తే నేషనల్ వైడ్, ఇప్పుడు అంతర్జాతీయంగా కూడా గుర్తింపు తెచ్చుకున్నాడు అల్లు అర్జున్. మెగా ఫ్యామిలీ ఒకవైపు, అల్లు ఫ్యామిలీ ఒకవైపు. భారీ అంచనాల మధ్య ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు అల్లు అర్జున్.

బ్యాక్ గ్రౌండ్ తో ఇండస్ట్రీలోకి రావడం కష్టమేం కాదు. అయితే ఆ బ్యాక్ గ్రౌండ్ ను క్యారీ చేయడం అంత సులువైన విషయం కాదు. నేపోటిజం చర్చకు వచ్చిన ప్రతీసారి బ్యాక్ గ్రౌండ్ తో హీరోలుగా వచ్చిన వారి మీద ఫోకస్ ఉండడం మాములే. అయితే ఆ బ్యాక్ గ్రౌండ్ వల్ల వచ్చే ఒత్తిడిని హ్యాండిల్ చేయడం కూడా కష్టమే. కోట్లల్లో అభిమానుల అంచనాలను భుజాలపై మోయాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే అల్లు అర్జున్ కూడా భారీ ఒత్తిడి మధ్య ఇండస్ట్రీలోకి హీరోగా వచ్చాడు. ఒకవైపు మేనమామ మెగాస్టార్ చిరంజీవి, ఇంకోవైపు మెగా నిర్మాత అల్లు అరవింద్, తాత అల్లు రామలింగయ్య ప్రముఖ కమెడియన్. ఇలా ఫుల్ బ్యాక్ గ్రౌండ్ తో వచ్చిన అల్లు అర్జున్ ఎదిగిన తీరు నిజంగా అభినందనీయమే. ఒకసారి అల్లు అర్జున్ కెరీర్ ను తరచి చూస్తే...

బాల్యం:


ఏప్రిల్ 8, 1983 నాడు చెన్నై, తమిళనాడులో అల్లు అరవింద్, నిర్మల దంపతులకు జన్మించాడు అల్లు అర్జున్. అల్లు ఫ్యామిలీకి ఇండస్ట్రీలో చాలా పెద్ద పేరుంది. అల్లు రామలింగయ్య ఎంత పెద్ద కమెడియన్ అన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వెయ్యికి పైగా చిత్రాల్లో నటించారు అల్లు రామలింగయ్య. పద్మశ్రీ, రఘుపతి వెంకయ్య అవార్డులను కూడా గెలుచుకున్నారు అల్లు రామలింగయ్య.

అలాగే అల్లు రామలింగయ్య కుమారుడు అల్లు అరవింద్ ప్రముఖ నిర్మాతగా ఇండస్ట్రీలో అగ్ర నిర్మాతగా వెలుగొందుతున్నారు. గీతా ఆర్ట్స్ సంస్థను స్థాపించి 1974లో ‘బంట్రోతు భార్య’ సినిమాతో నిర్మాతగా ఇండస్ట్రీలో తన ప్రయాణాన్ని మొదలుపెట్టిన అల్లు అరవింద్ ఎన్నో విజయవంతమైన చిత్రాలను నిర్మిస్తూ, తన స్థానాన్ని సుస్థిరం చేసుకుని పరిశ్రమలో అగ్ర నిర్మాతగా కొనసాగుతున్నారు. అల్లు అరవింద్ కు ముగ్గురు కుమారులు, అల్లు వెంకటేష్, అల్లు అర్జున్, అల్లు శిరీష్. అల్లు వెంకటేష్ ప్రొడక్షన్ వ్యవహారాలు చూస్తుంటే అల్లు అర్జున్, అల్లు శిరీష్ లు హీరోలుగా తెలుగు సినీ ఇండస్ట్రీలో ప్రముఖ హీరోలుగా చలామణి అవుతున్నారు. ముఖ్యంగా అల్లు అర్జున్ టాప్ హీరోగా టాలీవుడ్ లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నాడు.

1985లో అంటే సరిగ్గా రెండేళ్ల వయసులోనే తన మావయ్య మెగాస్టార్ చిరంజీవి గారి ‘విజేత’ చిత్రంలో ఒక చిన్న సీన్ లో నటించాడు అల్లు అర్జున్. విజేత సినిమా షూటింగ్ కు వెళ్ళినప్పుడు అల్లు అర్జున్ ను చూసి దర్శకుడు కోదండరామి రెడ్డి ఈ సినిమాలో నటింపజేశాడు. అదే ఏడాది కమల్ హాసన్ నటించిన ‘స్వాతిముత్యం’ సినిమాలో కూడా అల్లు అర్జున్ నటించాడు. ఆ సినిమాలో కమల్ హాసన్ మనవడి పాత్రలో అల్లు అర్జున్ ఒక చిన్న సన్నివేశంలో కనిపిస్తాడు.

చిన్నప్పుడే అల్లు అర్జున్ కు పేరు పెట్టలేదు. దాదాపు మూడేళ్ళ వయసు వరకూ తనను ఇంట్లో బన్నీ అనే పిలిచేవారు. పెద్దబ్బాయిని బాబీ అని పిలిచేవారు, దీంతో రెండో అబ్బాయిని బన్నీ అని ముద్దుగా పిలిచేవారు. బన్నీకి నాలుగేళ్లు ఉన్నప్పుడు అల్లు అర్జున్ ను స్కూల్ లో జాయిన్ చేసారు. ముందు నుండీ చదువులో అల్లు అర్జున్ చాలా వీక్. ఎంత కష్టపడి చదివినా కానీ అల్లు అర్జున్ కు అరకొర మార్కులే వచ్చేవి. చదువు కాకుండా అల్లు అర్జున్ కు ఎక్స్ట్రా-కరిక్యులర్ యాక్టివిటీస్ అంటే అమితమైన ఆసక్తి ఉండేది. డ్యాన్స్ లు అంటే చెవి కోసుకునేవాడు బన్నీ. ఇంట్లో చిరంజీవి అండ్ అల్లు ఫ్యామిలీ కలిసినప్పుడు ఎక్కువగా డ్యాన్స్ లు చేసేవారు. చిరంజీవికి పిల్లలు అంటే అమితమైన ఇష్టం. అందుకే షూటింగులు లేకపోతే ఇంట్లో పిల్లలను చేర్చి డ్యాన్స్ కార్యక్రమాలు చేయించేవారు. ఆ మీట్ లో అల్లు అర్జున్ చాలా ఆసక్తిగా డ్యాన్స్ లు చేసేవాడు. అక్కడి నుండి బన్నీకి డ్యాన్స్ పై ఉన్న ఇష్టాన్ని గమనిస్తూ వచ్చిన మెగాస్టార్ చిరంజీవి, 2001లో డాడీ సినిమాలో ఒక యువకుడి పాత్రను బన్నీ చేత చేయించాడు. ఆ పాత్రతో అల్లు అర్జున్ చిరంజీవి మేనల్లుడు అని ఇండస్ట్రీలో మార్మోగిపోయింది. అలాగే తన డ్యాన్స్ కు చాలా మంచి పేరొచ్చింది. ఇండస్ట్రీకి ఒక హీరో రాబోతున్నాడని తొలి సంకేతాల్ని ఈ సినిమా తీసుకొచ్చింది. డాడీ సినిమానే అల్లు అర్జున్ కు హీరో కావాలన్న సంకల్పాన్ని కల్పించింది. చిన్నప్పటి నుండి అల్లు అర్జున్ జిమ్నాస్టిక్స్, మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ పొందాడు. ఆయా రంగాల్లో చాలా ఆసక్తిని ప్రదర్శించేవాడు. అల్లు అర్జున్ కు యానిమేషన్ అంటే కూడా చాలా ఆసక్తి ఉండేది. అందుకే అల్లు అర్జున్ ను విదేశాలకు పంపి యానిమేషన్ రంగంలో నిపుణుడిని చేయాలని భావించాడు అల్లు అరవింద్. అయితే అల్లు అర్జున్ మాత్రం తాను ఏది ఏమైనా యానిమేషన్ రంగంలోకి వెళ్లనని సినిమాల్లో నటిస్తానని, హీరో అవుతానని చాలా క్లియర్ గా చెప్పుకొచ్చాడు.

సినిమా అరంగేట్రం:

అల్లు అర్జున్ హీరో అవుతానని అన్నప్పుడు అతని తల్లి నిర్మలకు ఆ నిర్ణయం అస్సలు నచ్చలేదు. హీరో అవ్వడానికి ఒప్పుకోలేదు. ఆ రంగం బయటకు కనిపించే అంత అందంగా ఉండదని, చాలా ఒత్తిళ్లు ఉంటాయని, నెగ్గుకురావడం అంత సులువైన విషయం కాదని ఆమె అభిప్రాయపడ్డారు. అయితే అల్లు అర్జున్ మాత్రం ఈ విషయంలో పట్టుబట్టాడు. తాను కచ్చితంగా హీరో కావాల్సిందే అని అన్నాడు. ఆ విషయం అల్లు అరవింద్ నుండి చిరంజీవి చేవిన పడింది. చిరంజీవి సలహా మేరకు అల్లు అర్జున్ ను యాక్టింగ్ స్కూల్ కు పంపారు. ముంబైలోని కిషోర్ కుమార్ స్కూల్ లో బన్నీని జాయిన్ చేసారు. ఒకవైపు బన్నీ యాక్టింగ్ స్కూల్ లో తర్ఫీదు పొందుతుండగా అల్లు అరవింద్ తన కొడుకును లాంచ్ చేయడానికి దర్శకుల వేటలో పడ్డాడు. ఎంతో మందిని సంప్రదించిన తర్వాత ఎంతో మంది హీరోలను ఇండస్ట్రీకి పరిచయం చేసిన దిగ్గజ దర్శకుడు కె రాఘవేంద్రరావు అయితే బాగుంటుందని భావించి ఆయనను సంప్రదించడం జరిగింది. దానికి రాఘవేంద్రరావు కొంచెం మొహమాటంగానే నేను చిరంజీవితో నా 100వ చిత్రాన్ని చేయాలనుకుంటున్నాను అని అరవింద్ కు చెప్పడం జరిగింది. అప్పటికి రాఘవేంద్ర రావు 99 సినిమాలు చేసాడు. ఆయన శతాధిక చిత్రం తనతో ఎన్నో బ్లాక్ బస్టర్ విజయాలు అందుకున్న చిరంజీవితో అయితే బాగుంటుందని రాఘవేంద్ర రావు భావించారు. అయితే అల్లు అరవింద్ ఈ విషయంలో పట్టు విడవలేదు. మీరు అల్లు అర్జున్ ను లాంచ్ చేయాల్సిందే, మీ ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైతే ఆ కెరీర్ గ్రాఫ్ వేరుగా ఉంటుంది అని తెలిపారు. ఇక చిరంజీవి రంగంలోకి దిగి రాఘవేంద్ర రావుతో మాట్లాడడంతో ఆయన కూడా ఒప్పుకున్నారు. ఇక నిర్మాతగా వేరే ఆప్షన్ కూడా అనుకోలేదు. అశ్వినీదత్ ను అనుకున్నారు. ఎందరో స్టార్ కిడ్స్ ను లాంచ్ చేసిన అనుభవం అశ్వినీదత్ కు ఉంది.  

తోలి చిత్రం :

అల్లు అర్జున్ హీరోగా నటించిన తొలి చిత్రం గంగోత్రి. వైజయంతి మూవీస్ బ్యానర్ పై అల్లు అర్జున్ హీరోగా పరిచయమయ్యాడు. భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మించారు. ఒక బలమైన కథాంశంతో ఈ సినిమా తెరకెక్కింది. అల్లు అర్జున్ కు జోడిగా ఆర్తి అగర్వాల్ చెల్లెలు అదితి అగర్వాల్ హీరోయిన్ గా అరంగేట్రం చేసింది. ఇక గంగోత్రి సినిమాకు బాగానే కసరత్తులు జరిగాయి. సూపర్ ఫామ్ లో ఉన్న రైటర్ చిన్ని కృష్ణను పిలిచి అన్ని మసాలాలు దట్టించి ఒక మంచి కథను సిద్ధం చేసారు. దానికి డివోషనల్ టచ్ ను యాడ్ చేసారు. ఫలితంగా గంగోత్రి సినిమా కార్యరూపం దాల్చింది. హీరోగా తొలి సినిమా అల్లు అర్జున్ కు మంచి అనుభవాన్ని మిగిల్చింది. లుక్స్ పరంగా కొన్ని కామెంట్స్ వినిపించినా కానీ గంగోత్రి అనుభవం తర్వాత బన్నీకి చాలా ఉపయోగపడింది. 2003, మార్చ్ 28న విడుదలైంది గంగోత్రి. ఈ సినిమా ఓ మోస్తారుగా విజయం సాధించిందనే చెప్పాలి.

అయితే అల్లు అర్జున్ లో అంతర్మథనం మొదలైంది తొలి చిత్రం తర్వాతనే. గంగోత్రి సినిమా విజయం సాధించినా అల్లు అర్జున్ పై వచ్చిన కామెంట్స్ కు కసితో రగిలిపోయాడు. తనను తాను ప్రూవ్ చేసుకోవాలన్న తపనతో ఉన్నాడు. తన లుక్స్ పై కాన్సన్ట్రేట్ చేసాడు. అలాగే జిమ్నాస్టిక్స్ పై మరోసారి దృష్టి పెట్టాడు. డ్యాన్స్ ను మరింత బాగా నేర్చుకోవడానికి శిక్షణ తీసుకున్నాడు. అల్లు అర్జున్ తన రెండో సినిమాకు సిద్ధమయ్యాడు. ఈసారి ఎలాంటి కథతో వెళ్ళాలి? అనుభవమున్న దర్శకుడితోనా లేక యువ దర్శకుడితోనా అన్న ఆలోచనలు జరుగుతున్నాయి అల్లు క్యాంపులో. అల్లు అరవింద్ కథలను వడపోస్తున్నాడు.

సరిగ్గా అలాంటి సమయంలోనే దిల్ రాజు, ఒక కొత్త కుర్రాడ్ని వెంటబెట్టుకుని అరవింద్ వద్దకు వెళ్లాడు. ఆ కుర్రాడు లెక్కల మాస్టారు అని తెలిసి అరవింద్ కు కూడా ఆసక్తి కలిగింది. దిల్ రాజు క్యాంపులో రెండు, మూడు సినిమాలకు పనిచేసిన ఆ వ్యక్తి పేరే సుకుమార్. ‘ఆర్య’ స్టోరీతో అల్లు అరవింద్ వద్దకు వెళ్లి నెరేట్ చేయగా అది ఆయనకు చాలా నచ్చింది. నెక్స్ట్ ఆ స్టోరీ చిరంజీవి వద్దకు వెళ్ళింది. అయితే చిరంజీవి ఈ స్టోరీ విషయంలో కొంత డౌట్ పడ్డాడు. వన్ సైడ్ లవ్ స్టోరీ, అందులోనూ కొత్త దర్శకుడు, నిర్మాతకు కూడా పెద్ద అనుభవం లేదు అని సంశయించాడు. కానీ దిల్ రాజు తనను నమ్మమని కచ్చితంగా ఈ సినిమాతో సూపర్ హిట్ కొడతామని చెప్పడంతో చిరు కూడా సరే అన్నారు.

2003 చివర్లో లాంచ్ అయింది ఆర్య. మ్యూజిక్ డైరెక్టర్ గా దేవిశ్రీ ని తీస్కున్నారు. అప్పటికే అయన యూత్ లో మంచి ఫాలోయింగ్ ను ఏర్పరచుకున్నారు. 2004 మే7న విడుదలైంది ఆర్య. ఊహించినట్లుగానే సినిమాకు మొదట డివైడ్ రెస్పాన్స్ వచ్చింది. సినిమాలో పాటలు మాత్రం బ్లాక్ బస్టర్, ఎవర్ గ్రీన్. వన్ సైడ్ లవ్ గురించి యూత్ లో చర్చ మొదలైంది. నెమ్మదిగా యువత సినిమాకు బ్రహ్మరథం పట్టడం మొదలుపెట్టారు. మెల్లగా సినిమాకు టాక్ కూడా పాజిటివ్ గా మారింది. ఇక ‘ఆర్య’ ఇచ్చిన కిక్ మామూలుది కాదు. ఆర్య చాలా విషయాల్లో ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది. అల్లు అర్జున్ కూడా తన విమర్శలకు సరైన రీతిలో ఈ చిత్రం ద్వారా సమాధానమిచ్చాడు. ఈ సినిమా అప్పట్లో ఓ రేంజ్ లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఆర్యకు సంబంధించిన మరో విశేషం ఏమిటంటే ఈ చిత్రాన్ని మలయాళంలో ఆర్య పేరుతోనే డబ్బింగ్ చేసి విడుదల చేసారు. అక్కడ కూడా ఈ సినిమా మంచి విజయం సాధించింది. మలయాళంలో మార్కెట్ క్రియేట్ అయింది అల్లు అర్జున్ కు. అయితే అక్కడ తన పేరు మారిపోయింది. అల్లు అర్జున్ కాస్తా మల్లు అర్జున్ అయ్యాడు. క్రమంగా ఒక్కో సినిమాతో మలయాళంలో కూడా తనకంటూ ఇమేజ్ ను, భారీ మార్కెట్ ను సృష్టించుకోగలిగాడు. మలయాళంలో స్టార్ స్టేటస్ దక్కించుకున్న తొలి తెలుగు హీరోగా అల్లు అర్జున్ నిలిచాడు.

ఆర్య చాలా పెద్ద విజయం సాధించింది. అల్లు అర్జున్ గురించి తెలుగు రాష్ట్రాల్లోనే కాక కేరళలో కూడా తెలిసింది. మరి ఇంత పెద్ద హిట్ వచ్చిన తర్వాత ఎలాంటి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావాలి? మళ్ళీ అల్లు అరవింద్ తన బుర్రకు పదును పెట్టాడు. లవ్ స్టోరీతో అల్లు అర్జున్ హిట్ కొట్టాడు కాబట్టి ఈసారి మాస్ సినిమా అటెంప్ట్ చేస్తే బెటర్ అనుకున్నాడు. మాస్ సినిమా అంటే అనుభవజ్ఞుడు అయితేనే వర్కౌట్ అవుతుందని భావించాడు అల్లు అరవింద్. ఇందు కోసం వి.వి వినాయక్ అయితే బాగుంటుందని అనుకున్నాడు. ఎందుకంటే వినాయక్ అప్పటికే వరస హిట్స్ తో దూసుకుపోతున్నాడు.

ఠాగూర్, సాంబల తర్వాత తన నెక్స్ట్ సినిమా కథపై వర్కౌట్ చేస్తున్నాడు. అలాంటి సమయంలో అరవింద్ వెళ్లి వినాయక్ ను కలిసాడు. అల్లు అర్జున్ తో సినిమా చేయాలని కోరాడు. తాను స్వయంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తాను అన్నాడు. ఎందుకంటే సొంత కొడుకైనా రెండు సినిమాల దాకా అల్లు అర్జున్ తో సినిమా తీయడం కుదర్లేదు. మూడో సినిమాను తాను తీయాలని అరవింద్ భావించాడు. కానీ వినాయక్ కు అప్పటికే ఎమ్.సత్యనారాయణ రెడ్డితో కమిట్మెంట్ ఉంది. నెక్స్ట్ సినిమా ఆయన బ్యానర్ లోనే చేయాలి. దీంతో అల్లు అరవింద్ మనసు మార్చుకున్నాడు. సరే అయితే ఆయనతోనే సినిమా చేయి కానీ బన్నీ హీరోగా సినిమా చేయమని కోరాడు. దీనికి వి.వి వినాయక్ ఎస్ చెప్పడంతో ‘బన్నీ’ సినిమాకు పునాదులు పడ్డాయి. మాస్ స్టోరీకు యూత్ ఫుల్ కాలేజీ బ్యాక్ డ్రాప్ ను జత చేసి వినాయక్ ఈ సినిమాను రూపొందించాడు. బన్నీ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇలా తొలి మూడు సినిమాలతో అల్లు అర్జున్ సక్సెస్ ను అందుకుని హ్యాట్రిక్ కంప్లీట్ చేసాడు. అల్లు అర్జున్ కు కూడా తెలుగు రాష్ట్రాల్లో ఫ్యాన్స్ అసోసియేషన్ ఏర్పడింది. మరిన్ని పెద్ద అడుగులు వైపు అల్లు అర్జున్ ప్రయాణం మొదలైంది.

మెగా ఫ్యామిలీ నుండి వచ్చినా కానీ అల్లు అర్జున్ తన కెరీర్ ను ఏనాడూ లైట్ తీసుకోలేదు. స్టార్ స్టేటస్ సంపాదించుకోవడానికి చాలా కష్టపడ్డాడు. తనకంటూ ఏదో ఒక ప్రత్యేకత ఉండాలని పరితపించాడు. అందుకే డ్యాన్స్ లపై ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేసాడు. చాలా కష్టతరమైన డ్యాన్స్ లను అటెంప్ట్ చేయడం ప్రారంభించాడు. చిన్నప్పటి నుండి డ్యాన్స్ లు అంటే ఉండే మక్కువ కూడా దీనికి ఉపయోగపడింది. జిమ్నాస్టిక్స్ నేర్చుకోవడం కూడా సహాయపడింది. అలాగే కెరీర్ స్టార్టింగ్ నుండే స్టైల్ స్టేట్మెంట్ ను పాస్ చేసాడు బన్నీ. తన స్టైలిష్ యాక్టింగ్, డ్యాన్స్, ఫ్యాషన్ సెన్స్ తో చాలా త్వరగానే స్టైలిష్ స్టార్ గా ఎదిగాడు. మెగా ఫ్యామిలీలో ఒకడిగా ఉండిపోకుండా తనకంటూ ఒక స్థాయిని క్రియేట్ చేసుకోవడంలో సక్సెస్ అయ్యాడు అల్లు అర్జున్.

ముందే చెప్పుకున్నట్లు అల్లు అర్జున్ తన కెరీర్ లో వెరైటీ సినిమాలను ఎంపిక చేసుకుంటూ ముందుకు వెళ్ళాడు. చేసిన జోనర్ లో మళ్ళీ చేయలేదు బన్నీ. ‘బన్నీ’ వంటి మాస్ హిట్ తర్వాత అల్లు అర్జున్ ఈసారి కామెడీ రొమాంటిక్ ఎంటర్టైనర్ ను సెలక్ట్ చేసుకున్నాడు. అప్పట్లో ఆ జోనర్ లో కరుణాకరన్ సిద్ధహస్తుడు. మొదటి మూడు సినిమాలకు అల్లు అర్జున్ తో సినిమా నిర్మించాలన్న అల్లు అరవింద్ కోరిక తీరలేదు. అందుకే ఈసారి అల్లు అరవింద్ ఎలాగైనా తనే నిర్మించాలని అనుకున్నాడు. కరుణాకరన్ చెప్పిన లైన్ అందరికీ నచ్చింది. అందరికీ ఇన్స్టంట్ గా కనెక్ట్ అయ్యే ‘హ్యాపీ’ టైటిల్ గా ఫిక్స్ చేసారు. అయితే సినిమా అంతా సరదాగా గడిచిపోయినా కానీ క్లైమాక్స్ దెబ్బ తీయడంతో హ్యాపీ యావరేజ్ గానే నిలిచిపోయింది. అయితే అల్లు అర్జున్ కు ఫ్లాప్ లేని రికార్డ్ ఈ సినిమాతో కూడా మైంటైన్ అయింది. అలాగే హ్యాపీ సినిమాతో బన్నీ స్టైలిష్ స్టార్ గా మారిపోయాడు.

హ్యాపీ పూర్తవుతున్న సమయంలోనే అల్లు అర్జున్ కు స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ చెప్పిన కథ పిచ్చపిచ్చగా నచ్చేసింది. పూరి జగన్నాథ్ తో సినిమా చేస్తే ఆ హీరోకు కచ్చితంగా ఆ సినిమా మైల్ స్టోన్ గా నిలిచిపోతుంది. అందుకే అల్లు అర్జున్ పూరితో సినిమా కోసం ఎంతైనా కష్టపడాలని నిర్ణయించుకున్నాడు. ముఖ్యంగా తన బాడీపై కాన్సన్ట్రేట్ చేసాడు. ముంబైకు వెళ్లి కొన్ని నెలల పాటు శిక్షణ తీసుకున్నాడు. అక్కడ సల్మాన్ ఖాన్ కు ట్రైనింగ్ ఇచ్చే ట్రైనర్ వద్ద శిక్షణ పొంది సిక్స్ ప్యాక్ ను సైతం సాధించాడు. సౌత్ ఇండియా నుండి ఫస్ట్ టైమ్ సిక్స్ ప్యాక్ సాధించిన హీరోగా నిలిచాడు బన్నీ. ఇక పూరి జగన్నాథ్ దర్శకత్వంలో దేశముదురు తెరకెక్కింది. ఈ సినిమాలో పొడవైన జుట్టుతో బన్నీ హెయిర్ స్టైల్ అప్పట్లో యూత్ లో చాలా ఫేమస్ అయింది. ఇక డైలాగ్ మోడ్యులేషన్ పరంగా కూడా అల్లు అర్జున్ చూపించిన భిన్నమైన శైలి అందరినీ ఆకట్టుకుంది. 2007 సంక్రాంతికి విడుదలైన దేశముదురు కాసుల సునామీ సృష్టించింది. ఈ సినిమా ఏకంగా 40 కోట్ల గ్రాస్ ను వసూలు చేసి అల్లు అర్జున్ మార్కెట్ ను అమాంతం పెంచేసింది దేశముదురు. ఈ సినిమా ద్వారానే హన్సిక హీరోయిన్ గా పరిచయమైంది. అంతే కాకుండా చేసిన ఐదు సినిమాల్లో ముగ్గురు హీరోయిన్లను టాలీవుడ్ కు పరిచయం చేసాడు. ఈ ఘనత బహుశా అల్లు అర్జున్ కే సొంతమైందేమో.

ఇక 2007లోనే మెగాస్టార్ చిరంజీవి నటించిన శంకర్ దాదా జిందాబాద్ లో ఒక పాటలో తళుక్కున మెరిశాడు అల్లు అర్జున్. ఇది మెగా ఫ్యాన్స్ ను ఎంతగానో మెప్పించింది. దేశముదురు తర్వాత బన్నీ మరోసారి తన స్టైల్ ను పూర్తిగా మార్చేసుకున్నాడు. దేశముదురు సినిమాలో ఫుల్ స్టైలిష్ గా కనిపించిన బన్నీ తన నెక్స్ట్ సినిమాకు వచ్చేసరికి చాలా సింపుల్ గా మారిపోయాడు. దేశముదురు ఫుల్ మాస్ సినిమా అవ్వడంతో తర్వాతి సినిమా క్లాసీగా ప్లాన్ చేసుకున్నాడు. బొమ్మరిల్లు సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేసిన భాస్కర్ దర్శకత్వంలో అల్లు అర్జున్ సినిమా చేయడానికి ఒప్పుకున్నాడు. ఆర్య తర్వాత మరోసారి దిల్ రాజు అల్లు అర్జున్ తో సినిమా తీయడానికి ముందుకు వచ్చాడు. బొమ్మరిల్లు అంత కాకపోయినా పరుగు కూడా ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది.

పరుగు సినిమాలో అల్లు అర్జున్ ఎక్కువగా ఒక డ్రెస్ లోనే కనిపించడం విశేషం. అదే జనాలకు చాలా కొత్తగా అనిపించింది. మనం సరిగ్గా గమనిస్తే అల్లు అర్జున్ తన స్థాయిని సినిమా సినిమాకూ పెంచుకుంటూ వచ్చాడు. పరుగు సినిమాతో సొంతంగా అభిమాన గణాన్ని కూడా ఏర్పరుచుకున్నాడు అల్లు అర్జున్. ఈ సినిమా తర్వాత నుండి అల్లు అర్జున్ మెగా హీరోలా మాత్రమే కాకుండా ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది ప్రామిసింగ్ హీరోగా నిలిచాడు.

ఆర్యతో అల్లు అర్జున్-సుకుమార్-దేవి శ్రీ ప్రసాద్ కాంబినేషన్ ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలుసు. ఈ ముగ్గురూ కలిసి మరోసారి సినిమా చేసారు. అదే ‘ఆర్య2’. ఈ సినిమా మ్యూజికల్ గా అప్పటి యూత్ ను ఒక ఊపు ఊపేసింది. అన్ని పాటలూ సూపర్ డూపర్ హిట్టే. బ్రేకప్ సాంగ్, లవ్ సాంగ్, ఐటెం సాంగ్ ఇలా ఒక్కటని కాకుండా ఆర్య 2లో చేసిన అన్ని పాటలూ మంచి కిక్కిచ్చాయి. ఈ సినిమాలో బన్నీ అల్ట్రా స్టైలిష్ గా కనిపించాడు. అయితే ఆర్య 2 బన్నీకి మొదటి ప్లాప్ గా చెప్పుకోవచ్చు. భారీ అంచనాల మధ్య రూపొందిన ఈ చిత్రం వాటిని అందుకోవడంలో మాత్రం విఫలమైంది. అయితే హీరోగా బన్నీ మరో మెట్టు ఎక్కాడనే చెప్పాలి. ఎందుకంటే ఈ సినిమాలో బన్నీ వేసిన స్టెప్స్ అనిర్వచనీయం. మై లవ్ ఈజ్ గోన్ షూటింగ్ టైమ్ లో దాదాపు 103 జ్వరం ఉన్నా కానీ మోకాళ్ళ చిప్పలు విరక్కొట్టుకునేలా బన్నీ వేసిన స్టెప్స్ అతని డెడికేషన్, హార్డ్ వర్క్, పట్టుదలను తెలియజేస్తాయి. బన్ని నటనే ఈ చిత్రానికి హైలైట్ అని చెప్పడం అతిశయోక్తి కాదేమో.

ఆర్య 2 తర్వాత బన్నీ మరోసారి పూర్తి క్లాస్ కథకు ఓటు వేసాడు. తనకు ఎంతో ఇష్టమైన దర్శకుడు గుణశేఖర్ చెప్పిన ‘వరుడు’ కథకు ఓటేశాడు బన్నీ. ఈ సినిమాలో చూపించిన ఐదు రోజుల పెళ్లి కాన్సెప్ట్ కొత్తగా ఉంది. అలాగే వరుడు సినిమా అప్పుడు ప్రమోషన్స్ కోసం హీరోయిన్ ను అసలు రిలీజ్ కు ముందు చూపించకపోవడం అనేది చాలా కొత్తగా అనిపించింది. అప్పట్లో అది ప్రమోషన్ కు బాగా ఉపయోగపడింది. ఈ సినిమాలో తమిళ హీరో ఆర్య విలన్ గా నటించాడు. దురదృష్టవశాత్తూ వరుడు అల్లు అర్జున్ కెరీర్ లో మరో ప్లాప్ గా నిలిచింది. తన కెరీర్ లో బ్యాడ్ ఫిల్మ్ గా వరుడు మిగిలిపోయింది.

వరుడు ప్లాప్ తర్వాత బన్నీ తనను తాను కొత్తగా ఆవిష్కరించుకోవాలనుకున్నాడు. దర్శకుడు క్రిష్ తనకు మంచి ఫ్రెండ్. ఒకరోజు సరదా మీటింగ్ లో నెక్స్ట్ సినిమా గురించి చర్చ జరిగినప్పుడు ‘వేదం’ స్టోరీ చెప్పడం అందులో కేబుల్ రాజు పాత్రపై బన్నీ మనసు పారేసుకోవడం జరిగింది. అయితే అది నేను చిన్న ఆర్టిస్ట్ లతో తీయాలనుకుంటున్నాను అని క్రిష్ చెప్పాడు. కానీ అల్లు అర్జున్ మాత్రం వెనక్కి తగ్గలేదు. ఈ రోల్ తాను చేయాల్సిందే అని అన్నాడు. అల్లు అర్జున్ వేదంలోకి రావడంతో ఆ మూవీ చాలా పెద్దది అయింది. మరో పాత్ర కోసం మంచు మనోజ్ ను సంప్రదించారు. అనుష్క కూడా ఈ సినిమాలో మరో మెయిన్ పాత్రను పోషించింది. క్లైమాక్స్ సీన్ ప్రతీ ఒక్కరి చేత కన్నీళ్లు పెట్టించింది. వేదం ఒక గొప్ప సినిమాగా నిలిచింది. నటుడిగా ఒకేసారి కొన్ని మెట్లు పైకి ఎక్కేసాడు అల్లు అర్జున్. ఎవరికీ చెప్పకుండా బన్నీ చేసిన మొదటి సినిమా ఇదే.

వేదం తర్వాత పూర్తిగా కమర్షియల్ మోడ్ లోకి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. భారీ బడ్జెట్ తో వినాయక్ దర్శకత్వంలో చేసిన ‘బద్రీనాథ్’ తీవ్రంగా నిరాశపరిచింది. బన్నీకి కెరీర్ లో భారీ హిట్ వచ్చి చాలా కాలమైంది. ఈ గ్యాప్ ను పూడ్చాలంటే కచ్చితంగా ఒక బ్లాక్ బస్టర్ కావాలి. అలాంటి పరిస్థితుల్లో అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో జత కట్టాడు. అల్లు అర్జున్ కెరీర్ లో ‘జులాయి’ చాలా ప్రత్యేకమైన చిత్రంగా చెప్పుకోవచ్చు. ఆర్య తర్వాత బన్నీ కెరీర్ లో భారీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది జులాయి. ఈ సినిమాలోని డైలాగ్స్ తూటాల్లా పేలాయి. స్టైలిష్ స్టార్ మేకోవర్ కూడా అందరికీ చాలా నచ్చింది. ఈ సినిమా తర్వాతి నుండి అల్లు అర్జున్ కెరీర్ అలా పైపైకి వెళుతూనే ఉంది. జులాయి సక్సెస్ తర్వాతే బన్నీని టాప్ హీరోల లిస్ట్ లో యాడ్ చేయడం మొదలుపెట్టారు విశ్లేషకులు.

జులాయి తర్వాత పూరి జగన్నాథ్ తో మరోసారి టీమప్ అయ్యాడు అల్లు అర్జున్. బండ్ల గణేష్ నిర్మాణంలో ‘ఇద్దరమ్మాయిలతో’ సినిమాను చేసాడు. మరో స్టైలిష్ అటెంప్ట్ గా ఈ సినిమా నిలిచింది. ముఖ్యంగా ఈ సినిమాలో వచ్చే ఇంటర్వెల్ ఫైట్ అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. 2014లో అల్లు అర్జున్ ఐ యామ్ ది ఛేంజ్ అనే షార్ట్ ఫిల్మ్ లో నటించాడు. ఈ షార్ట్ ఫిల్మ్ ను తానే నిర్మించడం విశేషం. తనవల్ల సమాజంలో కొంత మంది మారినా తనకు సంతోషమే అని ఆ సందర్భంగా చెప్పుకొచ్చాడు. ఈ షార్ట్ ఫిల్మ్ ను సుకుమార్ డైరెక్ట్ చేయడం విశేషం. అలాగే అదే సంవత్సరం అల్లు అర్జున్, రామ్ చరణ్ హీరోగా రూపొందిన ‘ఎవడు’ సినిమాలో కామియో రోల్ లో కనిపించాడు. మెగా హీరోలకు ఇది బానే కిక్కిచ్చింది. ఒక ఫ్రేమ్ లో కొన్ని సెకన్ల పాటు రామ్ చరణ్, అల్లు అర్జున్ కలిసి కనిపించడం ఫ్యాన్స్ కు బాగా నచ్చింది. ఈ సినిమాలో అల్లు అర్జున్ ఉన్నాడన్న కారణంతో మలయాళంలో విడుదల చేస్తే అక్కడ కూడా సూపర్ హిట్ అయింది.

అల్లు అర్జున్ కెరీర్ కు మరో బిగ్ బ్రేక్ అంటే ‘రేసు గుర్రం’ గురించి చెప్పుకోవచ్చు. సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా అంత పెద్ద విజయం సాధిస్తుంది అని ఎవరూ పెద్దగా ఊహించలేదు. అప్పటికే సురేందర్ రెడ్డి ఎన్.టి.ఆర్ తో తీసిన ఊసరవెల్లి చిత్రం అనుకున్నంతగా సక్సెస్ కాలేదు కాని మేకింగ్ పరంగా టేకింగ్ పరంగా ఆ చిత్రం కొత్త ఓరవడినే సృష్టించింది. మామూలు కథనైనా ఒక స్టైల్ తో ఒక రిథంతో తెరకెక్కించడంలో ఆయన దిట్ట. అందుకే సురేందర్ రెడ్డిని స్టైలిష్ డైరెక్టర్ అని అంటుంటారు. అన్నదమ్ముల ఎమోషన్ మీద తెరకెక్కిన ‘రేసు గుర్రం’ కమర్షియల్ గా అల్లు అర్జున్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. బన్ని మార్క్ పెర్ఫార్మెన్స్, సురేందర్ రెడ్డి టేకింగ్ ఈ చిత్రాన్ని అంతటి విజయం సాధించేలా చేసాయి.రేసు గుర్రం తర్వాత త్రివిక్రమ్ తో మరోసారి కలిసి పనిచేయాలని డిసైడ్ అయ్యాడు అల్లు అర్జున్.

సన్నాఫ్ సత్యమూర్తి సినిమా అల్లు అర్జున్ కెరీర్ లో మరో మీనింగ్ ఫుల్ సినిమాగా నిలిచింది. కలెక్షన్స్ పరంగానూ సంతృప్తినిచ్చింది ఈ సినిమా. సన్నాఫ్ సత్యమూర్తిలో చాలా మెచ్యూర్డ్ పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నాడు బన్నీ.

ఇక అదే సంవత్సరం ‘రుద్రమదేవి’ సినిమాలో గోన గన్నారెడ్డి పాత్రలో మెరిశాడు అల్లు అర్జున్. గుణశేఖర్ భారీ బడ్జెట్ హిస్టారికల్ మూవీ అటెంప్ట్ చేస్తున్నాడు. అందులో సెకండ్ హాఫ్ లో కీలకంగా వచ్చే గోన గన్నారెడ్డి పాత్ర కోసం స్టార్ హీరోలను సంప్రదిస్తున్నాడు గుణశేఖర్.

ఈ క్రమంలో బన్నీకి ఈ విషయం తెలిసి నటించడానికి ముందుకు వచ్చాడు. ఈ సినిమా కోసం ఒక్క రూపాయి కూడా ముందు ఇవ్వాల్సిన అవసరం లేదని అల్లు అర్జున్ గుణశేఖర్ తో అన్నాడు. తాను అల్లు అర్జున్ కు వరుడు రూపంలో పెద్ద ఫ్లాప్ ఇచ్చినా కూడా తన కోసం బన్నీ ఇంతలా చేయడం గుణశేఖర్ ను కదిలించింది. ఈ సినిమాకు వచ్చిన కలెక్షన్స్ లో మేజర్ క్రెడిట్ కచ్చితంగా బన్నీకి ఇవ్వాలి. అల్లు అర్జున్ గోన గన్నారెడ్డి పాత్రలో ఇరగదీశాడనే చెప్పవచ్చు. ఆ పాత్రతో మర్చిపోలేని మార్క్ వేసాడు అల్లు అర్జున్.

అప్పటికి అల్లు అర్జున్ నుండి పూర్తి స్థాయి మాస్ సినిమా వచ్చి చాలా కాలమైంది. మాస్ సినిమాలకు కేరాఫ్ అడ్రెస్ గా నిలిచిన బోయపాటి శ్రీను దర్శకత్వంలో ‘సరైనోడు’ చిత్రాన్ని చేసాడు అల్లు అర్జున్. ఈ సినిమా మాస్ ప్రేక్షకులకు బన్నీని మరింత దగ్గర చేసింది. దాదాపు 100 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ను ఈ సినిమా ద్వారా సాధించాడు అల్లు అర్జున్. మాస్, క్లాస్ ను బ్యాలెన్స్ చేయడం అల్లు అర్జున్ కు తెలిసినంతగా ఎవరికీ తెలీదేమో.

అందుకే సరైనోడు తర్వాత హరీష్ శంకర్ దర్శకత్వంలో దువ్వాడ జగన్నాథం సినిమాను చేసాడు అల్లు అర్జున్. ఈ సినిమాలో బ్రాహ్మణ యువకుడిగా అల్లు అర్జున్ నటించిన తీరుకి హ్యాట్సాఫ్ చెప్పకుండా ఉండలేం. ఈ సినిమా యావరేజ్ హిట్ గా నిలిచింది.

ఈ సినిమా తర్వాత రైటర్ వక్కంతం వంశీకి దర్శకుడిగా అవకాశమిచ్చాడు అల్లు అర్జున్. దేశ భక్తి నేపథ్యంలో రూపొందిన ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ సినిమా మంచి ఓపెనింగ్స్ తెచ్చుకున్నా కానీ కమర్షియల్ గా విజయం సాధించడంలో విఫలమైంది. కాని ఆ చిత్రంలో అల్లు అర్జున్ నటన గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ చిత్రం కోసం ఆయన మిలిటరీ ట్రైనింగ్ తీస్కోవడంతో పాటు వారి మానసిక స్థితిగతులను కూడా పూర్తిగా అవగాహన చేస్కున్నాడు. ఒక పాటలో క్యాప్ డ్యాన్స్ కోసం విదేశాలకు వెళ్ళి అక్కడ శిక్షణ తీస్కున్నారు. నా పేరు సూర్య ఫ్లాప్ తర్వాత అల్లు అర్జున్ లో మరోసారి అంతర్మథనం మొదలైంది. తన కెరీర్ లో ఎక్కడో ఏదో తేడా జరుగుతోంది అని భావించిన అల్లు అర్జున్ కొన్ని నెలల పాటు బ్రేక్ తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు. మొదట ఆరు నెలల బ్రేక్ అనుకున్నది కాస్తా తర్వాత ఏడాది అయింది.

బ్రేక్ తర్వాత బన్నీ పూర్తిగా రిఫ్రెష్ అయ్యి త్రివిక్రమ్ తో ముచ్చటగా మూడోసారి కలిసి పనిచేసాడు. 2020 సంక్రాంతికి విడుదలైన ‘అల వైకుంఠపురములో’ అల్లు అర్జున్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్. అంతే కాకుండా ఈ సినిమా నాన్ బాహుబలి రికార్డులను తుడిచిపెట్టేసింది. ఒకవైపు సూపర్ స్టార్ మహేష్ బాబు నుండి డైరెక్ట్ పోటీ ఉన్నా కానీ అల వైకుంఠపురములో దాన్ని తట్టుకుని నిలబడి సంక్రాంతి విజేతగా నిలిచింది. ఈ సినిమాలోని పాటలు ఎంత పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేశాయో మనందరం చూసాం. సామజవరగమన, రాములో రాముల, బుట్ట బొమ్మ సాంగ్స్ చార్ట్ బస్టర్స్ గా నిలిచాయి. బుట్ట బొమ్మ సాంగ్ అంతర్జాతీయంగా ఫేమ్ సంపాదించుకోవడమే కాకుండా యూట్యూబ్ లో 500 మిలియన్ వ్యూస్ ను సాధించింది. ఈ ఫీట్ అందుకున్న తొలి తెలుగు హీరోగా నిలిచాడు అల్లు అర్జున్.

వ్యక్తిగత జీవితం:


తన కెరీర్ ను విజయవంతంగా నడుపుతూనే అల్లు అర్జున్ 2011లో స్నేహా రెడ్డిని వివాహం చేసుకున్నాడు. వీరికి ఒక బాబు, ఒక పాప. వారి పేర్లు అల్లు అయాన్, అల్లు అర్హ. వీరిద్దరూ, వీరికిద్దరూ అన్నట్లుగా అల్లు అర్జున్ పర్సనల్ లైఫ్ కూడా హ్యాపీగా సాగిపోతోంది.

అవార్డులు:

  1. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తన కెరీర్ లో మూడు సార్లు నంది అవార్డులను గెలుచుకున్నాడు. ఆర్య, పరుగు చిత్రాలకు గాను స్పెషల్ జ్యురీ అవార్డును సొంతం చేసుకున్న అల్లు అర్జున్, రుద్రమదేవి చిత్రంలో ఇచ్చిన పెర్ఫార్మన్స్ కు బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ గా నంది పురస్కారాన్ని సొంతం చేసుకున్నాడు.
  2. అలాగే తన కెరీర్ లో మొత్తం ఐదు ఫిల్మ్ ఫేర్ అవార్డులను కైవసం చేసుకున్నాడు అల్లు అర్జున్. పరుగు, వేదం, రేసు గుర్రం సినిమాలకు గాను అల్లు అర్జున్ కు ఫిల్మ్ ఫేర్ పురస్కారం దక్కింది. మరోసారి రుద్రమదేవి చిత్రానికి బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ గా ఫిల్మ్ ఫేర్ ను అందుకున్న బన్నీ,
  3. ఇక అల్లు అర్జున్ కు సైమా, ఐఫా, సినీ'మా', సంతోషం అవార్డ్స్ కూడా వరించాయి.
    ఒక వ్యక్తి ఎలా ఎదిగాడు అన్న దానికి బెస్ట్ ఉదాహరణగా అల్లు అర్జున్ ను చూపించవచ్చు. బ్యాక్ గ్రౌండ్ ఉంటే చాలు ఇండస్ట్రీలో నెగ్గుకురావొచ్చు అన్న వారి నోర్లు మూయించేలా ఇండస్ట్రీ బ్యాక్ గ్రౌండ్ నుండి వచ్చినా కూడా ఎంతలా కష్టపడాలో తనే ఉదాహరణగా నిలిచి నిరూపించాడు బన్నీ. తాను ఎదగడమే కాకుండా తన చుట్టూ ఉన్నవాళ్లను కూడా ఎదిగేలా చేయడం అల్లు అర్జున్ కు బాగా తెలుసు. బన్నీ వాసు, ఎస్ కె ఎన్ లను నిర్మాతలుగా బాగా ప్రోత్సహించాడు బన్నీ. అలాగే దర్శకుడు మారుతికి పర్సనల్ గా ఎంతో సపోర్ట్ ను ఇచ్చాడు. గంగోత్రి సినిమాతో మొదలైన అల్లు అర్జున్ ప్రయాణం ఇప్పుడు టాలీవుడ్ టాప్ 5లో ఒకడిగా నిలిచేదాకా వచ్చింది. ప్రస్తుతం అల్లు అర్జున్ చేస్తోన్న ‘పుష్ప’ సినిమాతో ప్యాన్ ఇండియా లెవెల్ ను టార్గెట్ చేస్తున్నాడు. మరి బన్నీ తన స్థాయిని మరింత పెంచుకుని, మరిన్ని సంవత్సరాలు మంచి మంచి సినిమాలు చేయాలని, మరింత ఎత్తుకి ఎదిగి టాలీవుడ్ స్థాయిని మరింతగా పెంచాలని కోరుకుందాం.
- Advertisement -

You've successfully subscribed to Tollywood Latest News | Celebrities Profiles | Media9 Tollywood
Great! Next, complete checkout to get full access to all premium content.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.