
తెలుగు సినీరంగంలో ఆంధ్ర అందగాడిగా, సోగ్గాడిగా పేరు తెచ్చుకున్న ప్రముఖ నటుడు, శోభన్ బాబు గారు. నిజానికి ఆయన అసలు పేరు శోభనా చలపతిరావు. తెలుగులో కుటుంబకథా చిత్రాలకి, ప్రేమకథా చిత్రాలకి ఆయన పెట్టింది పేరు. ప్రస్తుతం ఆయన మనతో పాటు లేనప్పటికీ తెలుగు ప్రేక్షకుల హృదయాలలో ఎప్పటికీ సోగ్గాడిగా నిలిచిపోతారు.
జననం - బాల్యం – నిద్యాభ్యాసం

శోభన్ బాబు గారు జనవరి 14, 1937న ఒక సామాన్య రైతు కుటుంబంలో జన్మించారు. కృష్ణా జిల్లా చిన నందిగామ ఆయన స్వగ్రామం. ఆయన తండ్రి పేరు ఉప్పు సూర్యనారాయణ రావు. మైలవరం ఉన్నత పాఠశాలలో చదివే రోజుల్లో శోభన్ బాబు గారు నాటకాల పైన ఆసక్తి పెంచుకున్నారు. అనతికాలంలో మంచి నటుడిగా పేరు పొందారు. గుంటూరు ఎ.సి.కాలేజిలో 'పునర్జన్మ' వంటి నాటకాలలో మంచి పేరు సంపాదించుకొన్నారు. ఉన్నత పాఠశాల చదువు పూర్తి అయిన తర్వాత విజయవాడలో ఇంటర్మీడియట్, డిగ్రీ పూర్తి చేసారు. చిన్నప్పటి నుండి సినిమాలంటే చాలా ఇష్టపడే వాడినని, తిరువూరులో కీలుగుర్రం తను చూసిన మొదటి సినిమా అని శోభన్ బాబు గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. పాతాళ భైరవి, మల్లీశ్వరి, దేవదాసు తను భాల్యంలో బాగా అభిమానించిన సినిమాలని, మల్లీశ్వరి సినిమాను 22 సార్లు చూశానని ఆయన చెప్పారు.
సినీ ప్రస్థానం

మద్రాసులో ‘లా’ కోర్సులో చేరినప్పటికీ నటన పైన ఆసక్తితో శోభన్ బాబు గారు సినిమా ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఉదయం కాలేజీకి వెళ్ళి, మధ్యాహ్నం నుండి స్టూడియోల వెంట తిరిగేవారు. అప్పుడే తన పేరును శోభన్ బాబు గా మార్చుకున్నారు. ఆయనకి పొన్నులూరి బ్రదర్స్ వారు ‘దైవబలం’ చిత్రంలో రామారావు సరసన ఒక పాత్ర ఇచ్చారు. ఆ సినిమా 17 సెప్టెంబర్ 1959న విడుదల అయ్యింది కాని విజయవంతం కాలేదు. ఆ సమయంలోనే చిత్రపు నారాయణరావు నిర్మించిన ‘భక్త శబరి’ చిత్రంలో ఒక ముని కుమారునిగా నటించారు. 1960 జూలై 15న విడుదలయిన ఆ సినిమా విజయవంతం అవ్వడంతో శోభన్ బాబు గారి పేరు సినీ రంగానికి పరిచయమయ్యింది. అప్పటికే పెళ్ళి జరిగి భార్య పిల్లలతో ఉన్న శోభన్ బాబు గారు ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటూ, వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ చిన్న చిన్న పాత్రలను కూడా పోషించేవారు. గూఢచారి 116, పరమానందయ్య శిష్యుల కథలో శివుని వేషాలకి రూ. 1500 పారితోషికం అందుకున్నారు. ప్రతిజ్ఞా పాలనలో నారదుని వేషానికి రూ.750 పారితోషికం అందుకున్నారు. కెరీర్ తొలినాళ్ళలో శోభన్ బాబు గారికి మంచి పేరు తెచ్చిన పాత్రలు నర్తనశాలలో అభిమన్యుడి పాత్ర, భీష్మలో అర్జునుడి పాత్ర, సీతారామకల్యాణంలో లక్ష్మణుడి పాత్ర, బుద్ధిమంతుడులో కృష్ణుడి పాత్రలు. ఈ సమయంలో సహాయ పాత్రలు లభించడంలో నందమూరి తారక రామారావు గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు తనకు ఎంతో సహాయం చేశారని శోభన్ బాబు గారు ఒకసారి చెప్పారు.
హీరోగా

శోభన్ బాబు గారికి ‘వీరాభిమన్యు’ చిత్రంలో హీరోగా అవకాశం వచ్చింది. కానీ ఆ సినిమా మొదటి రోజు షూటింగ్ లో శోభన్ బాబు గారు చాలా భయపడ్డారు. ఆ భయంతో సరిగ్గా డైలాగ్స్ కూడా పలకలేకపోయారు ఈ సినిమాలు తనకి సరిపోవు అని మనేద్దాం అనుకోని తర్వాత రోజు దర్శకుడు వి. మధుసూదన్ రావు గారికి కలిసి చెప్పాలి అనుకున్నారు. కానీ ఆ రోజు షూటింగ్ లేకపోవడంతో శోభన్ బాబు గారు ఈ ఒక్క సినిమా చేసి మనేద్దాం అని ఈ సినిమా చేశారు. ఇక విరాభిమన్యు సినిమా విజయవంతం అవ్వడమే కాకుండా అభిమన్యుడి పాత్రలో ఆయన తన నటనతో విమర్శకులని మెప్పిస్తూనే ప్రేక్షకాభిమానాన్ని చూరగొన్నారు. వెంటనే ‘లోగుట్టు పెరుమాళ్ళకెరుక’ సినిమాలో సోలో హీరోగా నటించాడు. కానీ అది అంత విజయవంతం కాలేదు. ఆ తర్వాత ‘పొట్టి ప్లీడరు’ సినిమాలో నటించగా ఆ సినిమా విజయవంతమైంది. ‘పుణ్యవతి’ చిత్రం బాగా ఆడకపోయినా శోభన్ బాబు గారికి మంచి పేరు తెచ్చింది. బి.ఎన్.రెడ్డి తీసిన ‘బంగారు పంజరం’ విమర్శకుల మన్ననలను పొందింది.




1969లో అలనాటి మేటి నటి శారదకు జాతీయ స్థాయిలో ఉత్తమ నటిగా గుర్తింపునిచ్చిన మలయాళ చిత్రం ‘తులాభారం’. పేదరికం వల్ల పెంచే స్థోమత లేక కన్నపిల్లల్నే చంపుకున్న ఓ తల్లి కథే ఈ సినిమా. మలయాళంలో ఘనవిజయం సాధించిన ఈ చిత్రాన్ని తెలుగులో ‘మనుషులు మారాలి’ పేరుతో రీమేక్ చేశారు దర్శకుడు వి.మధుసూదనరావు. శోభన్‌బాబు గారు, శారద గారు జంటగా నటించిన ఈ సినిమాలో హరనాథ్, కాంచన, గుమ్మడి వెంకటేశ్వరరావు ముఖ్య భూమికలు పోషించారు. దిగ్గజ స్వరకర్త కె.వి మహదేవన్ సంగీత సారథ్యంలో సందర్భోచితంగా వచ్చే పాటలన్నీ ప్రేక్షకాదరణ పొందాయి. ముఖ్యంగా మారాలి మారాలి మనుషులు మారాలి, పాపాయి నవ్వాలి, తూరుపు సిందూరపు, చీకటిలో కారు చీకటిలో వంటి గీతాలు బాగా ప్రాచుర్యం పొందాయి. ఈ చిత్రాన్ని తమిళంలో ‘తులాభారం’ పేరుతోనూ, హిందీలో ‘సమాజ్ కో బదల్ డాలో’ పేరుతోనూ పునర్నిర్మించారు. నాలుగు వెర్షన్స్ లోనూ శారద గారే ప్రధాన పాత్రను పోషించడం విశేషం. అంతేకాదు ఈ చిత్రానికి అసోసియేట్ డైరెక్టర్స్‌గా పనిచేసిన కె.రాఘవేంద్రరావు, పి.సి.రెడ్డి, ఎ.కోదండరామిరెడ్డి తరువాతి కాలంలో అగ్ర దర్శకులుగా మంచి గుర్తింపు తెచ్చుకోవడం మరో విశేషం.


ఇక 1969 అక్టోబర్ 2న విడుదలైన ‘మనుషులు మారాలి’ సినిమా మొదటి రోజు నుంచి బ్లాక్ బస్టర్ టాక్ తో నడిచింది. యావత్ తెలుగు సినీ అభిమానులను ఉలిక్కిపడేలా చేసిన ఈ సినిమాలో కార్మిక నాయకుడిగా శోభన్ బాబు గారి నటన అద్వితీయం. జెమినీ స్టూడియోస్ నిర్మించిన ఈ మెసేజ్ ఓరియెంటెడ్ ఫిల్మ్ ఈ సినిమా అప్పట్లో 25 వారాలు ఆడి, సిల్వర్ జూబ్లీ వేడుకలు జరుపుకుంది. ఈ చిత్రం శోభన్ బాబు గారి నట జీవితంలో మైలురాయిగా నిలిచింది. ఆ చిత్రంతో హీరోగా శోభన్ బాబు గారు తనకంటూ ఒక స్థానాన్ని ఏర్పరచుకున్నారు. ఆ తర్వాత చెల్లెలి కాపురం, దేవాలయం, కళ్యాణ మంటపం, మల్లెపువ్వు లాంటి మొదలగు చిత్రాల ఘన విజయాలతో అగ్ర నటుడిగా ప్రేక్షకుల గుండెల్లో సుస్థిర స్థానాన్ని ఏర్పరుచుకొన్నాడు. ‘మానవుడు దానవుడు’ చిత్రం శోభన్ బాబు గారికి మాస్ ఇమేజిని తెచ్చిపెట్టింది. బాపు దర్శకత్వంలో వచ్చిన బుద్ధిమంతుడు సినిమాలో కృష్ణుడిగా, సంపూర్ణ రామాయణం సినిమాలో రాముడిగా నటించాడు. అప్పటికే ఈ పాత్రలలో ఎన్.టి.ఆర్ స్థిరమైన ముద్ర వేసుకొన్నా కూడా ఈ చిత్రాల విజయవంతమయ్యాయి.


1971వ సంవత్సరంలో వచ్చిన ‘చెల్లెలి కాపురం’ సినిమా సెంటిమెంట్‌ను పండించడంలో విజయవంతం అయ్యింది. అప్పటికే అందాల నటుడిగా ఆంధ్రలోకమంతా అభిమానులను సొంతం చేసుకున్న శోభన్ బాబు గారి నట జీవితంలో ఈ చిత్రం కలికితురాయి. అంద వికారుడయిన రచయితగా చెల్లెలి కోసం తాపత్రయపడే అన్నగా ఆయన నటన చిరస్మరణీయం. అందులో శోభన్ బాబు గారు తన చెల్లెలి కోసం తన కెరీర్‌ను కూడా త్యాగం చేస్తాడు. అన్నా చెల్లెళ్ళ సెంటిమెంట్‌తో వచ్చిన సినిమాల్లో ఎప్పటికీ ఈ చిత్రానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. అదే సంవత్సరంలో వచ్చిన ‘మానవుడు దానవుడు’ డ్రామా ఎంటర్టైనర్. ఇందులో శోభన్ బాబు గారు, శారధ, కృష్ణం రాజు, కృష్ణ కుమారి తదితరులు ముఖ్యపాత్రాల్లో నటించారు. ఈ సినిమాకి పి. చంద్రశేఖర్ రెడ్డి దర్శకత్వం వహించారు. నిర్మాత పి.చిన్నారెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించగా ఈ చిత్రానికి సంగీత దర్శకుడు అశ్వత్థామ స్వరాలు సమకుర్చారు. ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది.
ఇక శోభన్ బాబు గారు, శారద జంటగా తీసిన ‘ఇదాలోకం’ 1973లో విడుదలైంది. కె.ఎస్ ప్రకాశరావు దర్శకత్వంలో విడుదలైన సినిమాని ఆరు లక్షల పెట్టుబడితో నిర్మించారు. ఈ సినిమాకు కె. చక్రవర్తి అందించిన సంగీతం బాగా విజయవంతమై ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టింది. సినిమాలో జ్యోతిలక్ష్మి నృత్యంతో చిత్రీకరించిన ‘గుడి వెనక నా సామి గుర్రమెక్కి కూచున్నాడు’ పాట మంచి ప్రేక్షకాదరణ పొందింది. ఈ సినిమా నిర్మాణంలో తన తండ్రి వద్ద సహాయదర్శకుడిగా ప్రముఖ దర్శకుడు కె.రాఘవేంద్రరావు గారు పనిచేశారు. రాముడు, కృష్ణుడు, అభిమన్యుడు మొదలయిన పౌరాణికి పాత్రలే కాకుండా కొన్ని జానపద చిత్రాల్లో కూడా శోభన్ బాబు గారు నటించారు. అప్పటికే అగ్ర హీరోగా ఉన్నా శోభన్ బాబు గారు, సాటి హీరోల కాంబినేషన్ చిత్రాలలో ఎటువంటి భేషజాలు లేకుండా నటించేవారు. అలాగే ఎన్.టీ.ఆర్ గారితో కలిసి ఆడపడుచు, విచిత్ర కుటుంబం సినిమాలు, అక్కినేని నాగేశ్వరరావు గారితో పూలరంగడు, బుద్ధిమంతుడు సినిమాలు, కృష్ణ గారితో మంచి మిత్రులు, ఇద్దరు దొంగలు లాంటి మల్టి స్టారర్ సినిమాలలో కూడా నటించారు.



ఇక 1975లో విడుదలైన ఒక ‘సోగ్గాడు’ సినిమాతో ఆయన రేంజ్ మారిపోయింది. పల్లెటూరు నేపథ్యంలో శోభన్ బాబు గారు హీరోగా వచ్చిన ఈ సినిమా గొప్ప విజయం సాధించి అనేక రికార్డులను సొంతం చేసుకొంది. ఈ సినిమా తరువాత శోభన్ బాబు గారిని అందరూ ‘సోగ్గాడు శోభన్ బాబు’ అని పిలవడం మొదలుపెట్టారు. చాలా సామాన్యమైన కథతో వచ్చిన ఈ సినిమా అన్ని వర్గాల వారినీ అలరించింది. 17 సెంటర్లలో ఈ సినిమా స్ట్రెయిట్‌గా వందరోజులు ఆడింది. బాక్సాఫీసు కలెక్షన్లలో అనేక రికార్డులు సొంతం చేసుకొంది. శోభన్ బాబు గారు అన్ని కుటుంబకథా చిత్రాలలో బాధ్యత గల కుటుంబ పెద్దగా, భార్యను ప్రేమించి, గౌరవించే వ్యక్తిగా గౌరవప్రధమయిన పాత్రలు పోషించారు. అప్పట్లో అమ్మాయిలు తమకు కాబోయే భర్త శోభన్ బాబు గారిలా అందగాడిలా, ఆయన పోషించే పాత్రల వ్యక్తిత్వం కలిగి ఉండాలని కోరుకొనేవారు.




అదే సంవత్సరం విడుదలైన ‘జీవన జ్యోతి’ శోభన్ బాబు గారి కెరీర్ లో కల్ట్ స్టేటస్ సంపాదించుకున్న చిత్రం. కళా తపస్వి కె. విశ్వనాథ్ గారి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం మంచి విజయం సాధించింది. వాణిశ్రీ ద్విపాత్రాభినయం చేసి రెండు పాత్రల్లోనూ తన వైవిధ్యతను చాటుకున్నారు. ఈ చిత్రం అప్పట్లో 12 కేంద్రాల్లో 100 రోజులు ఆడింది. అందులోని సిన్ని ఓ సిన్ని, ముద్దుల మా బాబు పాటలు అందరి నోటా నానుతుండేవి. ఉత్తమ తెలుగు చిత్రంగా ఫిల్మ్ ఫేర్ అవార్డ్ సొంతం చేస్కోవడమే కాకుండా ఉత్తమ దర్శకుడిగా కె. విశ్వనాథ్ గారికి, ఉత్తమ నటుడిగా శోభన్ బాబు గారికి, ఉత్తమ నటిగా వాణిశ్రీ గారికి ఫిల్మ్ ఫేర్ అవార్డులు లభించాయి.

శోభన్‌బాబు నటించిన పలు కుటుంబ కథా చిత్రాలు ఫ్యామిలీ ఆడియన్స్ ను అలరించాయి. వాటిలో ‘కార్తీకదీపం’ ఒకటి. శోభన్‌బాబు, శ్రీదేవి, శారద నాయకా నాయికలుగా నటించిన ఈ చిత్రానికి లక్ష్మీ దీపక్ దర్శకత్వం వహించారు. గీత కీలక పాత్రలో నటించగా గుమ్మడి, ప్రభాకర రెడ్డి, అల్లు రామలింగయ్య, సూర్యకాంతం, రమాప్రభ తదితరులు ఇతర ముఖ్య భూమికలను పోషించారు. సత్యం స్వర సారథ్యంలో రూపొందిన పాటలన్నీ విశేషాదరణ పొందాయి. ముఖ్యంగా ఆరనీకుమా ఈ దీపం, చిలకమ్మ పలికింది, నీ కౌగిలిలో తలదాచి వంటి పాటలు ఎవర్ గ్రీన్ సాంగ్స్ గా నిలిచాయి. శోభన్‌బాబు గారు, శ్రీదేవి గారు జంటగా నటించిన తొలి చిత్రమిదే కావడం విశేషం. అంతకు ముందు శోభన్ బాబు గారు నటించిన పలు చిత్రాల్లో బాలనటిగా అలరించిన శ్రీదేవి, కార్తీకదీపం సినిమా కంటే రెండు నెలలు ముందు విడుదలైన బంగారు చెల్లెలు సినిమాలో శోభన్ బాబు గారికి చెల్లెలుగా నటించింది. బంగారు చెల్లెలు, కార్తీకదీపం రెండూ కూడా విజయం సాధించడం విశేషం. శోభన్‌బాబుకు ఉత్తమ నటుడిగా నాలుగో సారి ఫిలింఫేర్ అవార్డును అందించిన చిత్రమిది. ఈ చిత్రాన్ని హిందీలో ‘మాంగ్ భరో సజనా’ పేరుతోనూ కన్నడంలో ‘సౌభాగ్యలక్ష్మి’ పేరుతోనూ రీమేక్ చేసారు. అన్ని భాషల్లోనూ ఈ సినిమాలో సంగీతానికి పెద్ద పీట వేయడం విశేషం.

అదే సంవత్సరం శోభన్ బాబు గారు, సావిత్రి, సుజాత ప్రధాన తారాగణంగా నటించిన చిత్రం 'గోరింటాకు'. యువ చిత్ర బ్యానర్‌పై దర్శకరత్న దాసరి నారాయణరావు దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం 19 అక్టోబర్, 1979న విడుదలై ఘన విజయాన్ని అందుకుంది. కె.వి. మహాదేవన్ సంగీతం సారథ్యంలో వచ్చిన ఈ చిత్ర పాటలు ఇప్పటికీ వినబడుతూనే ఉంటాయి. ముఖ్యంగా కొమ్మ కొమ్మకో సన్నాయి, గోరింట పూచింది కొమ్మ లేకుండా పాటలు ఎంత పెద్ద హిట్ అయ్యాయో అందరికీ తెలిసిందే. అప్పట్లో ఈ చిత్రం సంచలన విజయం సాధించింది. కె. నరసింహం నాయుడు సమర్పించిన ఈ చిత్రానికి నిర్మాత కె. మురారి గారు.




ఇక 1981లో జనవరి 1న విడుదలైన ‘పండంటి జీవితం’ సినిమాలో తండ్రి కొడుకులుగా శోభన్ బాబు గారు ద్విపాత్రాభినయం చేశారు. ఈ సినిమాలో ఆయన గొప్ప నటనను కనబరిచారు. ఈ సినిమా కూడా సూపర్ హిట్ గా నిలిచింది. ఇదే సంవత్సరంలో విడుదలైన చిత్రం ‘ఇల్లాలు’. బాబూ ఆర్ట్స్ పతాకం పై జి.బాబు నిర్మించిన ఈ సినిమాకు తానినేని రామారావు దర్శకత్వం వహించారు. శోభన్ బాబు గారు, జయసుధ, శ్రీదేవి ప్రధాన తారాగణంగా రూపొందిన ఈ సినిమా ఘన విజయం సాధించింది. ఈ సినిమాకి కె.చక్రవర్తి గారు సంగీతం అందించారు. 1983వ సంవత్సరంలో కె.రాఘవేంద్రరావు గారి దర్శకత్వంలో శోభన్ బాబు గారు, శ్రీదేవి గారు కలిసి నటించిన ‘దేవత’ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాలోని ‘వెల్లువొచ్చే గోదారమ్మ’ పాట ఇప్పటికీ చాలా చోట్ల వినిపిస్తూనే ఉంటుంది. ఇక 1986 లో హిందీలో సూపర్ హిట్ అయిన ‘ఖుద్ దార్’ సినిమాకి రీమేక్ గా వచ్చిన ‘డ్రైవర్ బాబు’ సినిమా తెలుగులో కూడా అదే స్థాయి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో శోభన్ బాబు గారికి జోడిగా రాధ గారు నటించారు. డైరెక్టర్ బోయిన సుబ్బా రావు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో పాటలు కూడా మంచి హిట్ అయ్యాయి.


ఇదే సంవత్సరం వచ్చిన ‘ధర్మపీఠం దద్దరిల్లింది’ సినిమాలో తన కన్న కొడుకులు ముగ్గురూ అవినీతికి పాల్పడుతుంటే చూసి సహించలేక ముగ్గురినీ అంతం చేసే తండ్రిగా శోభన్ బాబు గారు ప్రదర్శించిన నటన అసామాన్యం. ఈ సినిమాలో ఆయన నటనే సినిమాని సూపర్ హిట్ గా నిలబెట్టింది. 1988 లో శోభన్ బాబు గారు, శారద గారు నటించిన ‘సంసారం’ సినిమాలో ఒక సాధారణ సగటు కుటుంబం ఉన్న వ్యక్తి గా నటించి మెప్పించారు. ఈ సినిమా సూపర్ హిట్ గా 100 రోజులు ఆడింది. ఇక 1990 వ దశకంలో శోభన్ బాబు గారు మెల్లగా సినిమాలని తగ్గించారు. ఈ సమయంలో వచ్చిన ‘ఏవండి ఆవిడ వచ్చింది’ సినిమా ఘన విజయం సాధించింది. ఈ సినిమాలో ఇద్దరి భార్యలతో శోభన్ బాబు గారు పడే పాట్లు చాలా బాగుంటాయి ఈ చిత్రంలో ఆయన ఎన్నడూ లేనంతగా కామెడీ పండించారు.
ఇక 1995లో వచ్చిన ‘ఆస్తి మూరెడు ఆశ బారెడు’ సినిమా ఆయన నటించిన చివరి చిత్రాల్లో మంచి పేరు తెచ్చుకున్న సినిమా. ఈ సినిమాలో మధ్యతరగతి జీవితాలు ఎలా ఉంటాయో బాగా చూపించారు. అలాగే బాబు మోహన్, కోవై సరళ కామెడీ ఈ సినిమాకి హైలైట్. అలాగే జయసుధ గారి క్యారెక్టర్ కూడా చాలా బాగుంటుంది. శోభన్ బాబు గారు నటజీవితంలో ఎన్నో చిత్రాలు ఘనవిజయం సాధించి ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. అందులో కొన్ని తెలుగు సినీ చరిత్రలో ఆణిముత్యాలుగా నిలిచిపోయాయి. అలాగే శోభన్ బాబు, శారద గార్లది క్రేజీ కాంబినేషన్. ‘శారద’ సినిమా నుంచి ‘ఏవండీ ఆవిడొచ్చింది’ సినిమా వరకు వీరి జోడీ జేజేలు కొట్టించుకుంది. ఆ తర్వాత శ్రీదేవి, జయప్రద, జయసుధ, విజయశాంతి, సుహాసినీ వంటి హీరోయిన్లతో కలసి ఎన్నో సూపర్ హిట్లిచ్చారు శోభన్ బాబు గారు. ‘కార్తీక దీపం’ వంటి సినిమాలు మహిళా ప్రేక్షకులను ఇప్పటికీ ఆకట్టుకుంటాయి. 1996 లో జయసుధ గారితో కలిసి నటించిన హలో గురు సినిమా ఆయన చివరి చిత్రం.

ఈ సినిమా తర్వాత ఆయన ఇంకా సినిమాలలో కనిపించలేదు. అలీ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ శోభన్ బాబు గారు సినిమాలు ఆపడానికి గల కారణాన్ని చెప్పాడు. “నాకు 8 ఏళ్ళు ఉన్నపటినుంచి నేను చైల్డ్ ఆర్టిస్ట్ గా చాలా సినిమాలు చేసాను శోభన్ బాబు గారు సినిమాల్లో కూడా నటించాను, అప్పట్లో శోభన్ బాబు గారు నాకు చాలా ఇష్టమైన నటుడు. తర్వాత చాలా సంవత్సరాలకు హీరోగా ఆయనతో పాటు నటించే అవకాశం వచ్చింది. శోభన్ బాబు గారితో యాక్టింగ్ అంటే భయపడుతున్న నన్ను తన మాటలతో మోటివేట్ చేసి నాలో ధైర్యం నింపారు. ఆయన కొన్నేళ్ల తర్వాత సినిమాలు చేయడం మానేశాడు. దానికి కారణం స్వయంగా ఆయనే నాతో చెప్పారు. కొంత వయస్సు వరకు సినిమాలు చేసి సోగ్గాడు అనే పేరు తెచ్చుకున్నాను. ఎన్ని సంవత్సరాలు అయినా నా రూపం నా అభిమానుల మనసుల్లో, ఫొటోలపై అందంగానే ఉండాలి. ఇప్పుడు వయసు పెరిగిపోతుంది, ముసలివాడు అయ్యాక నా ఫేస్ ప్రజలకు చూపించడం ఇష్టం లేదు”. ఈ మాట తర్వాత అతనికి కొన్ని వొందల సినిమాలు వచ్చినా చేయలేదు. ఆశ్చర్యం ఏంటంటే తన తర్వాత తన వారసులను కూడా సినీ ఇండస్ట్రీ వైపు తీసుకురాలేదు.
వ్యక్తిగత జీవితం

శోభన్ బాబు గారి భార్య కుటుంబసభ్యుల ఫొటో మనకు ఎక్కడ దొరకదు దానికి కారణం ఆయన వ్యక్తిగత జీవితాన్ని అంత రహస్యంగా ఉంచుకుంటారు. శోభన్ బాబు గారికి మే 15, 1958న శాంత కుమారితో వివాహం జరిగింది. కరుణ శేషు, మృదుల, ప్రశాంతి, నివేదితలు వారి పిల్లలు. శోభన్ బాబు గారిది క్రమశిక్షణతో కూడిన జీవితానికి ఉదాహరణగా చెప్పుకుంటారు. ఆయన ఎన్నడూ ఎటువంటి వ్యసనాలకు లోను కాలేదు. ప్రతిరోజు సాయంత్రం షూటింగ్ అయిన వెంటనే ఇంటికి చేరుకొని కుటుంబ సభ్యులతో సమయం గడిపేవారు. వృత్తితో పాటు కుటుంబంతో గడపడానికి కూడా ప్రాధాన్యతనిస్తూ అదే విషయాన్ని తోటినటులకు చెప్పేవారు. శోభన్ బాబు గారు తన సంతానాన్ని ఎన్నడూ సినీరంగంలోకి తీసుకొని రాలేదు. వయసు పై బడుతున్నపుడు కూడా హీరోగా నటించాడే తప్ప చిన్న పాత్రలు పోషించలేదు. వ్యక్తిగా శోభన్ బాబు గారు చాలా నిరాడంబరుడు. ఎంతో డబ్బు సంపాదించినా ఎన్నడూ ఆడంబర జీవితం గడపలేదు. డబ్బును పొదుపు చేయడంలో ఎందరికో ఆదర్శంగా నిలిచాడు. ఎందరికో సహాయాలు, దానాలు చేసినా, ఎందరికో ఇళ్ళు కట్టించినా ప్రచారం చేయించుకోలేదు. చెన్నైలో ఆయనకి విగ్రహాలు కూడా ఉన్నాయి. ఎన్నటికీ ప్రేక్షకులు మనసులో అందాల హీరోగా ఉండిపోవాలని భావించిన శోభన్ బాబు గారు తన 59వ ఏట నటజీవితానికి స్వస్తి చెప్పారు. 220 పైగా చిత్రాలలో నటించి 1996లో విడులయిన హలో...గురూ చిత్రంతో తన 30 ఏళ్ళ నటజీవితానికి స్వస్తి చెప్పి చెన్నైలో తన కుటుంబ సభ్యులతో ఆనందంగా కాలం గడిపేవారు.

అంతటి మహా నటుడు గొప్ప వ్యక్తి అయిన శోభన్ బాబు గారు 2008, మార్చి 20 ఉదయం గం.10:50ని.లకు చెన్నైలో మరణించారు. శోభన్ బాబు గారు మరణ సందర్భంగా తెలుగు చలన చిత్రరంగానికి చెందినవారు ఘనంగా నివాళులు అర్పించారు. అక్కినేని నాగేశ్వరరావు గారు, దాసరి నారాయణ రావు గారు, నిర్మాత రామానాయుడు గారు, రాఘవేంద్రరావు గారు, చిరంజీవి గారు, చంద్రమోహన్ గారు, మురళీమోహన్ గారు, మోహన్ బాబు గారు, వాణిశ్రీ గారు, శారదగారు, రాజేంద్రప్రసాద్ గారు, ఇంకా ఎందరో సినిమా కళాకారులు ఆ నటభూషణుడి అంత్య క్రియలకు హాజరయ్యారు.

నటుడు నిర్మాత మురళి మోహన్ గారు శోభన్ బాబు గారి గురించి చెప్తూ మద్రాసులో ఆయన స్టార్ హీరోగా ఉన్నపుడు కొన్ని వేల ఎకరాలు కొన్నాడని, అవన్నీ ఇప్పుడు లెక్కలేస్తే కొన్ని వేల కోట్లు అవుతాయని చెప్పాడాయన. ఇంకా చెప్పాలంటే ఆయన చనిపోయే నాటికి ఆస్తి దాదాపు 80 వేల కోట్లు ఉంటుందని అంచనా అంటున్నారు విశ్లేషకులు. 1976లోనే కొన్ని మేజర్ కంపెనీలలో షేర్స్ తీసుకున్నాడని, అప్పట్లో షేర్ అనే మాట కూడా ఎవరికీ తెలియదని అలాంటి సమయంలోనే శోభన్ బాబు గారు బిజినెస్ చేసేవాడని మురళీ మోహన్ గారు చెప్పారు. ఈ రోజుకు కూడా చెన్నై శివార్లలో శోభన్ బాబు గారికి సంబంధించిన స్థలాలు కొన్ని వేల ఎకరాలని చెప్పుకొచ్చారు మురళీ మోహన్. ఆయన స్పూర్థితోనే తాను కూడా రియల్ ఎస్టేట్ చేయడం మొదలుపెట్టినట్లు చెప్పారు. భూమిపై పెట్టిన డబ్బు ఎక్కడికీ పోదని తన సన్నిహితులకు చెప్పేవాడని అలా తనకు కూడా చెప్పాడని గుర్తు చేసుకున్నారు నటుడు మురళీ మోహన్. షేర్స్, బిజినెస్ అలా ఎన్నో చేసాడని మద్రాసులో ఆయన టైమ్ పాస్ కోసం పొద్దున్నే తన బిల్డింగులు అన్నీ చూడ్డానికి వెళ్తే సాయంత్రానికి ఇంటికి వచ్చేవారని దాన్ని బట్టి ఆయన ఆస్తులు లెక్కలేసుకోండి అంటూ ఓ సినీ విశ్లేషకుడు తెలిపారు. అంత ఆస్తి ఉన్నప్పటికీ ఆయన ఎంతో సాదాసీదాగా ఉండేవారే కాని ఎంటువంటి హంగులు ఆర్భాటాలకు వెళ్ళేవారు కాదు.
అవార్డ్స్

- శోభన్ బాబు గారికి బంగారు పంజరం సినిమాకు 1970లో నేషనల్ లెవల్ క్లాసికల్ నటుడిగా అవార్డొచ్చింది.
- అలాగే ఐదుసార్లు నంది అవార్డులు, వరుసగా మూడు ఫిలింఫేర్లు అందుకుని రికార్డు క్రియేట్ చేశారు. దిలీప్ కుమార్ తర్వాత ఫిలింఫేర్ హాట్రిక్ సాధించింది శోభన్ బాబు గారే.
- ‘ఖైదీ బాబాయ్’ (1974), ‘జీవనజ్యోతి’ (1975), ‘సోగ్గాడు’(1976) ఉత్తమ నటుడిగా సౌత్ కేటగిరిలో ఫిల్మ్ ఫేర్ అవార్డ్లను అందుకున్నారు.
- కార్తీక దీపం (1979) చిత్రాలకు ఉత్తమ నటుడిగా ఫిలింఫేర్‌లను సొంతం చేసుకున్నాడు శోభన్‌బాబు.
- అలాగే సినీగోయెర్స్ అవార్డు ఉత్తమ నటుడు అవార్డ్ 1970 నుంచి 1975 వరకు ప్రతి సంవత్సరం అందుకున్నారు.
- సుమారు 200కు పైగా చిత్రాల్లో నటించి, తెలుగు ప్రేక్షకుల సోగ్గాడిగా, ఆంధ్రా అందగాడిగా తనదైన ముద్ర వేసి ఎంతో మందికి స్ఫూర్తి దాయకంగా నిలిచిన ఆయన లేని లోటు తీర్చలేనిది. ఆయన ఆత్మకు శాంతి కలగాలని మనస్పూర్తిగా కోరుకుందాం.