
టాలీవుడ్ లో అంతకు ముందు ఎప్పుడూ రాని మేకింగ్ తో వచ్చిన ‘శివ సంచలనం సృష్టించింది. తెలుగు సినిమా స్థాయిని పెంచడంతో పాటు స్క్రీన్ ప్లే విషయంలో కొత్త పాఠాలు నేర్పించిన సినిమా 'శివ' అనడంలో ఎలాంటి సందేహం లేదు.తెరపై నాగార్జునగారిని దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ప్రెజెంట్ చేసిన తీరు అద్భుతం. భవానిగా నటుడు రఘువరన్ గారు ఆ
పాత్రలో జీవించారు. మొదటి సినిమానే అయినా రామ్ గోపాల్ వర్మ 'శివ' సినిమాను తెరకెక్కించిన తీరు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యింది. ఈ సినిమాతో చాలా మంది నటులు, సాంకేతిక నిపుణులు మంచి పేరు గడించారు. ఇలాంటి ప్రయోగాత్మక సినిమాను తెరకెక్కించిన రామ్ గోపాల్ వర్మ, నేటికీ ఎంతో మంది కొత్త దర్శకులకు మార్గదర్శకుడు.1989 అక్టోబర్ 5న విడుదలైన శివ సినిమా నేటికి విడుదలయ్యి 31 ఏళ్లు పూర్తి చేసుకుంది. మొదటి సినిమాతోనే టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ గా రామ్ గోపాల్ వర్మ మారిపోయారు. కేవలం 55 రోజుల్లో చిత్రీకరణ పూర్తి అయిన ఈ సినిమా 22 కేంద్రాల్లో వంద రోజులను ఐదు కేంద్రాల్లో 175 రోజులు ఆడింది. నంది అవార్డుతో పాటు ఫిల్మ్ ఫేర్ అవార్డులను సైతం దక్కించుకున్న ఈ సినిమా ఇప్పటికి ఎప్పటికి ఎవర్ గ్రీన్ అనడంలో సందేహం లేదు. ఇళయరాజా సంగీతాన్ని అందించి,
తనదైన శైలిలో నేపధ్య సంగీతాన్ని సమకూర్చి సినిమా విజయంలో తనదైన పాత్ర పోషించారు. 1990లో ఈ సినిమాను హిందీలో రీమేక్ చేశారు. అక్కడ కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. నేటికి 31 ఏళ్లు పూర్తి అయిన సందర్బంగా సోషల్ మీడియాలో 31 ఇయర్స్ ఫర్ సౌత్ ఇండియా సూపర్ హిట్ శివ అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతోంది.