
సంజయ్ దత్ అభిమానులకు సంజయ్ దత్ శుభవార్త తెలిపారు. ఊపిరితిత్తుల క్యాన్సర్ తో బాధపడుతూ,చికిత్సను ప్రారంభించి కొంత కాలం గడిచింది. ఈ వార్త లక్షలాది మంది అభిమానుల హృదయాలను బద్దలు చేసింది.అందరూ ఆయన శ్రేయస్సు కోసం ప్రార్థిస్తూ వస్తున్నారు. ఆ ప్రార్థనలు ఫలించాయి. మున్నాభాయ్ క్యాన్సర్‌ను జయించారు. క్యాన్సర్ తో జరిపిన పోరాటంలో సంజయ్ దత్ విజయం సాధించారు. బుధవారం తన పిల్లలు షహ్రాన్, ఇక్రా పదో బర్త్ డే సందర్భంగా ఈ శుభవార్తను ఆయన అభిమానులతో పంచుకున్నారు. ఇది తను వారికిస్తున్న బెస్ట్ గిఫ్ట్‌గా పేర్కొన్నారు. తన అభిమానులకు కృతజ్ఞతా పూర్వకంగా ఓ నోట్‌ను షేర్ చేశారు సంజయ్. "గడచిన కొన్ని వారాలు నా ఫ్యామిలీకి, నాకు చాలా గడ్డు కాలం.
పెద్దలు చెప్పినట్లుగా దేవుడు తన బలమైన సైనికులకే కష్టతరమైన యుద్ధాలనిస్తాడు. ఈ యుద్ధం నుంచి విజేతగా బయటపడి, నా కుటుంబానికి ఆరోగ్యాన్నీ, శ్రేయస్సునూ ఇవ్వగలిగినందుక సంతోషంగా ఉంది. అదే వాళ్ళకు నేనివ్వగల బెస్ట్ గిఫ్ట్. మీ అందరి అమోఘమైన విశ్వాసం, సపోర్ట్ లేకుండా ఇది సాధ్యమయ్యేది కాదు. ఈ క్లిష్ట సమయంలో నాకు అండగా నిలిచిన నా కుటుంబం, స్నేహితులు,అభిమానులందరికీ మనసారా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. నాకు మీరు పంపిన ప్రేమ, దయ, లెక్కలేనన్ని ఆశీర్వాదాలకు ధన్యవాదాలు. నన్ను బాగా చూసుకున్నందుకు డాక్టర్లకు కూడా ధన్యవాదాలు. నేడు ఈ న్యూస్‌ను పంచుకుంటుంటే నా హృదయం మీపై కృతజ్ఞతా భావంతో నిండిపోతోంది. థాంక్యూ” అని సంజయ్ దత్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలియజేశారు.