రియల్ స్టార్ శ్రీహరి

రియల్ స్టార్ శ్రీహరి గారి రేంజ్ ఏంటో టాలీవుడ్ ప్రేక్షకులందరికి తెలుసు. ఆయన నటించిన అన్ని సినిమాల్లో పాత్ర చిన్నదైనా, పెద్దదైన తన నటనతో అందరి దృష్టిని ఆయన వైపు తిప్పుకోగలడు. ఆయన ఇంటికి కష్టాలతో వచ్చే వాళ్ళని అన్నం పెట్టి సహాయం చేసే రియల్ హీరో శ్రీహరి.నిర్మాతలని రెమ్యూనరేషన్ విషయంలో కూడా ఏనాడు ఇబ్బంది పెట్టని గొప్ప మనిషి శ్రీహరి.

1964 ఆగస్టు 15న తండ్రి సత్యన్నారాయణ, తల్లి సత్యవతి దంపతులకి శ్రీహరి జన్మించారు.శ్రీకాకుళం జిల్లా నుంచి కృష్ణా జిల్లా పెదపారుపూడి మండలం యలమర్రు గ్రామానికి శ్రీహరి కుటుంబం వలస వచ్చారు. . యలమర్రులో రోడ్డు పక్కన చిన్న పాక వేసుకొని సైకిలు షాపు, సోడాలు అమ్మి జీవనం సాగించారు. శ్రీహరికి శ్రీనివాసరావు, శ్రీధర్ అన్నదమ్ములు. 1977 లో యలమర్రు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శ్రీహరి ఏడవ తరగతి పాసయ్యారు. తరువాత గ్రామంలోని అరెకరం భూమిని అమ్ముకొని హైదరాబాదుకు మకాం మార్చారు. ఏటా యలమర్రు గంగానమ్మ జాతరకు శ్రీహరి తప్పనిసరిగా వెళ్ళేవాడు.

ఆయన యుక్త వయసు నుండే శారీరక ధారుడ్యంపై ఎంతో ఆసక్తి కలిగివుండేవాడు. ఉదయం చదువుకుంటూ, సాయంత్రం శోభన థియేటర్ ఎదురుగా ఉన్న అన్న శ్రీనివాసరావు షెడ్డులో మెకానిక్ గా పనిచేస్తూ ఖాళీ దొరికిన సమయంలో  శోభన థియేటర్ లో సినిమాలు చూసేవాడు.ఆయనకి ఆ థియేటర్ లో హీరోల కటౌట్స్ చూసి ఎప్పటికైనా తన కటౌట్ కూడా అలా ఉండాలి అని శ్రీహరి కోరుకునేవారు. హైదరాబాద్ లో నిర్వహించిన అనేక శారీరక ధారుడ్య పోటిల్లో పాల్లొని ‘మిస్టర్ హైదరాబాద్’గా ఏడుసార్లు అవార్డును సొంతం చేసుకున్నారు శ్రీహరి. ఆయన రెండుసార్లు జాతీయస్థాయి పోటీలలో పాల్గొని, బహుమతులు గెలుచుకున్నారు. ఏషియన్ గేమ్స్ లో భారతదేశం తరపున ఆడాలనే కోరిక ఉన్నా అది తీరలేదు.జిమ్నాస్టిక్స్‌లో రాష్ట్ర స్థాయి చాంపియన్ అయిన శ్రీహరి అథ్లెట్ అవ్వాలనుకున్నారు. జాతీయ స్థాయి జిమ్నాస్టిక్స్‌లో పాల్గొనాల్సి ఉన్నా....సినిమాలపై మక్కువతో ఈ రంగంవైపు అడుగులు వేసారు.

సినీ ప్రయాణం

ఇక ఆయనకి ఉన్న సినిమా ఆసక్తి తో ఒక చిన్న ఫోటో షూట్ చేపించుకొని రోజు సినిమా అవకాశాల కోసం తిరిగేవారు. 1986లో సినిమాలోకి స్టంట్ మాస్టర్‌గా కెరీర్ మొదలు పెట్టిన శ్రీహరి...అంచెలంచెలుగా నటుడిగా ఎదిగారు. పోలీస్ చిత్రంతో హీరోగా ఆయనకు మంచి పేరు లభించింది.

శ్రీహరి 1987లో దర్శకదిగ్గజం దాసరి నారాయణ రావు తెరకెక్కించిన ‘బ్రహ్మనాయుడు’  ద్వారా తెరకు పరిచయమయ్యారు. దాసరి శిష్యులుగా చెప్పుకునే వారిలో శ్రీహరి అగ్రగణ్యుడు. శ్రీహరి దాసరి నారాయణరావు దగ్గర 4 సంవత్సరాలు పని చేసారు. అయితే ఒక రోజు ఆర్ నారాయణ మూర్తి గారు దాసరి గారి ఇంటికి వచ్చి కలిశారు. అప్పుడు అక్కడే ఉన్న శ్రీహరి ని చూసి "మీరు బ్రహ్మనాయుడు లో ఫైట్స్ చేశారు కదా అని అడిగారు "  శ్రీహరి అవును సర్.. అంటే మరి ఇక్కడేం చేస్తున్నారు అని అడిగితే దాసరి గారు నన్ను హీరోగా పెట్టి సినిమా చేస్తాను అన్నారు అని శ్రీహరి చెప్పగా, దానికి చాలా సమయం పడుతుంది నువ్వు వేరే సినిమాలు కూడా చెయ్యి నీకు మంచి భవిష్యత్తు ఉంటుంది అని ఆయన అన్నారు. అది కూడా నిజమే అనుకోని శ్రీహరి మెల్లగా వేరే సినిమాలు చేయడం మొదలు పెట్టాడు. అలా 1989లో తమిళ సినిమా మా పిళ్ళై, తెలుగు 'ధర్మక్షేత్రం' చిత్రం ద్వారా చిన్న పాత్రాలైన చేయడం మొదలుపెట్టారు. అలా ఆయన విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, హీరోగా, నిర్మాతగా వివిధ రకాలుగా రాణించారు. కెరీర్ మొదట్లో చిన్న పాత్రలెన్నిటినో వేసి మెప్పించారు శ్రీహరి. అందులో భాగంగా అనేక చిత్రాల్లో ఆయన నటించారు.

అయితే అప్పటిదకా శ్రీహరి చేసిన సినిమాలన్నీ అంత పెద్దగా ఆడలేదు. అయితే ఆయన మొదటి సూపర్ హిట్ సినిమా రౌడి ఇన్ స్పెక్టర్. ఈ సినిమా బాలయ్య కెరీర్‌లోనే కాదు.. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీస్‌లో ఒకటిగా నిలిచింది. అంతేకాదు పోలీస్ ఆఫీసర్ సినిమాల్లో ఈ మూవీ ట్రెండ్ సెట్టర్‌గా నిలిచింది. అప్పటి వరకు సినిమాల్లో పోలీస్ పాత్రలు నీతి, నిజాయితీలకు మారు పేరుగా ఉండేవి. ఈ సినిమాలో అన్యాయాన్ని అంతమొందించడానికి పోలీస్ రౌడీలాగా ప్రవర్తించక తప్పదు అనే కాన్సెప్ట్‌తో ఈ సినిమాను తెరకెక్కించారు. విజయలక్ష్మీ ఆర్ట్ మూవీస్ బ్యానర్‌పై టి త్రివిక్రమరావు నిర్మించిన ఈ సినిమా సంచలన వసూళ్లు సాధించింది. ఆ రోజుల్లోనే 35 సెంటర్లలో 100 రోజులు ఆడింది. విజయశాంతి ఈ చిత్రంలో ఆటో రాణి పాత్రలో రఫ్ఫాడించింది. తమిళ్‌లో ఈ సినిమాను అదే పేరుతో అనువదించారు. అక్కడ కూడా ఈ సినిమా బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. అంతేకాదు డబ్బింగ్ సినిమాల్లో సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది.‘రౌడీ ఇన్‌స్పెక్టర్’ హిందీలో అదే టైటిల్‌తో డబ్ చేస్తే.. అక్కడ కూడా ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని నమోదు చేసింది. అప్పటి వరకు హిందీ డబ్బింగ్ చిత్రాల్లో అత్యధిక కలెక్షన్స్ సాధించిన చిత్రంగా ముంబైలో రికార్డు క్రియేట్ చేసింది. ఈ చిత్రంలో బాలకృష్ణ ఇన్‌స్పెక్టర్ రామరాజు పాత్రలో నటిస్తే.. విజయశాంతి ‘ఆటో రాణిగా మెప్పించారు. ఇక బొబ్బర్ లంక రామబ్రహ్మంగా మోహన్ రాజ్ తనదైన విలనిజం పండించారు అలాగే శ్రీహరి పాత్రకి మంచి పేరు వచ్చింది.

ఆ తర్వాత ఆయన చేసిన  ‘ముఠామేస్త్రి’, ‘మేజర్ చంద్రకాంత్’, ‘అల్లరి ప్రియుడు’, ‘బావగారూ బావున్నారా’, ‘హలోబ్రదర్’ వంటి చిత్రాల్లో వేసింది చిన్న పాత్రలే అయినా ప్రేక్షకులకు గుర్తుండిపోయేలా నటించారు. వీటిలో ఎక్కువ శాతం కామెడీ విలనీ పండించి మంచి నటుడిగా పేరు సాధించారాయన. శ్రీహరి కి తాజ్ మహల్ చిత్రంతో పూర్తిస్థాయి విలన్ పాత్ర మంచి పేరు తెచ్చింది. ఈ సినిమాలో హీరోయిన్ కి అన్నయ్య ఆయన కారుడుకట్టిన విలనిజం చూపించాడు. ఈ సినిమాలో శ్రీహరి పాత్ర చివరికి చనిపోవడం అందరిని కన్నీరు పెట్టించేలా చేసింది.ఈ సినిమాలో ఆయన నటనకి అవార్డ్స్ కూడా వచ్చాయి. ఇక ఈ సినిమా విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అయితే ఈ సినిమాలో మొదటిగా బాలీవుడ్ విలన్ ని అనుకున్నరు కానీ డైరెక్టర్ మాత్రం నాకు శ్రీహరి కావాలి అని నిర్మాతలని ఒప్పించారు. శ్రీకాంత్, మందిర బేడీ హీరో హీరోయిన్స్ గా చేసిన ఈ సినిమాలో నటించిన అందరి కెరీర్ లలో చిరస్థాయిగా నిలిచిపోయే సినిమా అయింది.

శ్రీహరి మంచి పేరు తెచ్చిన ఇంకొక సినిమా ‘బావగారూ.. బాగున్నారా!.జయంత్‌ ఈ సినిమాను పూర్తి కామెడీ రొమాంటిక్‌ డ్రామాగా తీర్చిదిద్దారు. న్యూజిలాండ్‌లో చిరు-రంభ-బ్రహ్మానందల మధ్య జరిగే సన్నివేశాలు కడుపుబ్బా నవ్విస్తాయి. ఆ తర్వాత భారత్‌కు వచ్చిన తర్వాత రంభ, చిరంజీవిల మధ్య సన్నివేశాలు కూడా కితకితలు పెడతాయి. ఇక కోట శ్రీనివాసరావు, ఆయన కొడుకు శ్రీహరి చేసే హంగామాతో సినిమా సరదాగా సాగిపోతుంది. చివరిలో గుర్రపు పందాలు మాస్‌ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.ఈ సినిమాను హిందీలో అల్లు అరవింద్.. గోవిందా హీరోగా ‘కువారా’ పేరుతో రీమేక్ చేసారు. బంగ్లాదేశ్‌లో ‘జమై షషూర్’ పేరుతో రీమేకైంది. ఒక సమయంలో విలన్ గా సినిమాలు ఆపేద్దాం అనుకుంటున్న శ్రీహరిని మెగాస్టార్ చిరంజీవి గారు పిలిచి "నేను మొదట్లో విలన్ గానే కెరీర్ మొదలుపెట్టాను , ఫస్ట్ ఇండస్ట్రీలో పరిచయాలు పెంచుకో ఆ తర్వాత సరైన సమయం చూసి హీరో అవ్వు " అని చెప్పారట.

అలా 1999వ సంవత్సరంలో వచ్చిన ‘పోలీస్' చిత్రం ద్వారా హీరోగా పరిచయం అయ్యారు. గణపతి, ఆయోధ్య రామయ్య, శ్రీశైలం, భద్రాచలం, హనుమంతు, విజయరామరాజు చిత్రాల్లో హీరోగా నటించారు.ఇక భద్రాచలం సినిమా ఆయన కెరీర్ బెస్ట్‌గా చెప్పొచ్చు. ఇందులో తనకెంతో ఇష్టమైన ఫైటర్ పాత్రలో గొప్పగా రాణించారు. కారణం ఆయన కెరీర్ ప్రారంభమైందే ఫైటర్‌గా. అందుకే ఆయన జీవితంలో భద్రాచలం సినిమా ప్రత్యేకమైందిగా చెబుతారు. 'ఒకటే జననం' పాటతో ఆయన ఎందరో యువకులకు స్ఫూర్తినిచ్చారు. ముఖ్యంగా క్రీడాకారులకు భద్రాచలంలో శ్రీహరిపాత్ర ఆదర్శప్రాయమైంది.ఇక హీరోగా చేస్తూనే క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా సినిమాలు చేసేవారు శ్రీహరి.

2004లో ఎమ్ ఎస్ రాజు గారు నువ్వొస్తానంటే నేనొద్దంటానా సినిమాలో మీరు అన్నయ్య పాత్ర చేస్తేనే సినిమా మొదలుపెడ్తాను అని శ్రీహరి ని అడిగారట. దానికి శ్రీహరి గారు కూడా ఒప్పుకొని ఆ సినిమా చేశారు.ఈ సినిమాలో ఆయన పాత్రకి విశేషమైన స్పందన వచ్చింది. అన్నయ్య అంటూ ఉంటే ఇలా ఉండాలి అని తెలుగు ఆడపిల్లలు అంత అనుకున్నారు.యమ్ ఎస్ రాజు గారు అనుకున్నట్టే ఈ సినిమాలో శ్రీహరి గారు అచ్చు గుద్దినట్టు సరిపోయారు.ఆయన నటించిన ఈ సినిమాకి ఇంకొక విశేషం కూడా ఉంది. అదేంటి అంటే టాలీవుడ్ లో సూపర్ హిట్ కొట్టిన సిద్దార్ద్, త్రిష సినిమా నువ్వేస్తానంటే నేనొద్దంటానా ఏకంగా తొమ్మిది భాషల్లో రీమేక్ అయ్యింది. అది కూడా 7 స్వదేశీ భాషలు, రెండు విదేశీ భాషల్లో రీమేక్ అయ్యింది. అయితే ఇక్కడ విశేషం ఏమిటంటే రీమేక్ అయిన ప్రతిచోటా ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది.

మరో విశేషం ఏమిటంటే.. హిందీలో సల్మాన్ ఖాన్ హీరోగా తెరకెక్కిన ‘మైనే ప్యార్ కియా’ సినిమాను రీమేక్ గా కొన్ని మార్పులు చేర్పులు చేసి నువ్వొస్తానంటే నేనొద్దంటానా పేరుతో ప్రభుదేవా తెరకెక్కించాడు. అదే సినిమాను మళ్లీ హిందీలో రామయ వస్తావయ పేరుతో రీమేక్ చేసి హిట్ కొట్టారు బాలీవుడ్ వాళ్ళు. దీంతో ఎక్కువ భాషల్లో రీమేక్ అయిన తెలుగు చిత్రంగా ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ రికార్డు సృష్టించింది. ఈ చిత్రానికి కలెక్షన్లు, ప్రశంసలతో పాటు అవార్డులు కూడా భారీగా వచ్చాయి. తెలుగులో ఆల్‌టైమ్ హిట్‌గా నిలిచిన ఈ సినిమాకు ఐదు నంది అవార్డులు, 9 ఫిలింఫేర్ అవార్డులు, రెండు సంతోషం అవార్డులు కూడా వచ్చాయి.

శ్రీహరి గారి కెరీర్ లో మరొక గుర్తుండిపోయే చిత్రం ఢీ . వినోదాత్మక చిత్రాలకు చిరునామాగా నిలిచిన దర్శకుల్లో శ్రీను వైట్ల ఒకరు. ఒక దశలో ఈ స్టార్ డైరెక్టర్ వరుస విజయాలు చూశారు. అలాంటి విజయవంతమైన చిత్రాల్లో 'ఢీ' ఒకటి. ఈ సినిమాతోనే కథానాయకుడు మంచు విష్ణు తన కెరీర్ లో ఫస్ట్ సక్సెస్ అందుకున్నారు. విష్ణుకి జోడీగా జెనీలియా నటించిన ఈ యాక్షన్ రొమాంటిక్ కామెడీ డ్రామాలో శ్రీహరి గారికి ప్రత్యేక పాత్ర లభించింది.ఈ సినిమాలో ఆయనది ముఖ్య పాత్ర అనడం కన్నా ఇంకొక  హీరో అనడం కరెక్ట్ . ఢీ లో శ్రీహరి మాట్లాడిన తెలంగాణ యాస , ఆయన నటన సినిమాని అంతటి విజయం అందుకునేల చేసింది.ఇక చక్రి సంగీత సారథ్యంలో రూపొందిన పాటల్లో "కనుపాపకు ఇది తెలుసా", "కొంచెం కొంచెం" ఆదరణ పొందాయి.శ్రీను వైట్ల - చక్రి కాంబినేషన్ లో వచ్చిన ఏకైక చిత్రమిదే కావడం విశేషం. తమిళంలో 'మిరట్టల్', బెంగాలీలో 'ఖోకాబాబు', ఒరియాలో 'తు మో గర్ల్ ఫ్రెండ్' పేర్లతో 'ఢీ'ని రీమేక్ చేశారు. 2007ఏప్రిల్ 13న విడుదలైన 'ఢీ' సినిమా మొదటి ఆట నుంచే సూపర్ హిట్ టాక్ తో మంచి విజయాన్ని అందుకుంది.ఇదిలా ఉంటే.. త్వరలోనే 'ఢీ'కి సీక్వెల్ గా 'డి అండ్ డి - డబుల్ డోస్' పేరుతో విష్ణు - శ్రీను వైట్ల కాంబినేషన్ లో మరో సినిమా రాబోతుండడం విశేషం.

ఇక శ్రీహరి గారి కెరీర్ ని మార్చిన సినిమా 2009 లో వచ్చిన మగధీర.  అప్పటి వరకు తెలుగు సినిమా మార్కెట్ అంటే 40 కోట్లే.. పోకిరి సినిమా వచ్చి 40 కోట్లు వసూలు చేస్తే అదో అద్భుతంలా చూసారంతా. కానీ అప్పుడే వచ్చింది ఓ అద్భుతం. అప్పటి వరకు తెలుగు సినిమా కలలో కూడా ఊహించని విధంగా దూసుకొచ్చింది ఆ సినిమా. అదే మగధీర.ఈ సినిమాలో శ్రీహరి  చేసిన షేర్ ఖాన్ పాత్ర అప్పట్లో పెద్ద సెన్సేషన్ .మగధీర సినిమా ఆ రేంజ్ హిట్ అవ్వడానికి షేర్ ఖాన్ పాత్ర చాలా ఉంది. ఇక  టాలీవుడ్ రూపు రేఖలు మార్చేసిన సినిమా ఇది. అది 2009.. జులై 31.. ఆ రోజే మ‌గ‌ధీర సినిమా విడుద‌లైంది. మగధీర షూటింగ్ దశలో ఉన్నపుడే విమర్శల పాలైంది. ఈ సినిమాకు 40 కోట్లు బ‌డ్జెట్ అవసరమా.. రెండో సినిమాకే రామ్ చ‌ర‌ణ్ కోసం ఇంత బ‌డ్జెట్ పెట్ట‌డం ఎందుకు అంటూ అప్పట్లో చాలా మంది విమ‌ర్శించారు కూడా. తేడా కొడితే రాజ‌మౌళికి అక్షింత‌లు త‌ప్ప‌వ‌ని.. ఆయన ఇంట్లోనే కూర్చోవాల్సి వస్తుందని అంతా ఫిక్స్ అయిపోయారు. కానీ అద్భుతం జ‌రిగింది.ఇక తెలుగు సినిమాకు కాజల్ రూపంలో స్టార్ హీరోయిన్ దొరికింది కూడా ఈ చిత్రంతోనే. అప్ప‌టి వ‌ర‌కు వ‌చ్చిన ఆరు సినిమాలు ఒకెత్తైతే.. ఏడో అద్భుతంగా మ‌గ‌ధీర‌ను సృష్టించాడు రాజ‌మౌళి. సెవెన్త్ వండర్ అన్నట్లు ఈ చిత్రం 2009లోనే 80 కోట్ల‌కు పైగా షేర్ వ‌సూలు చేసి రాజ‌మౌళి రేంజ్ ఏంటో చూపించింది. తెలుగు సినిమా రేంజ్ కూడా మగధీర మార్చేసింది.అప్పటి వరకు చూసిన సినిమాలకు మగధీర ప్రత్యేకంగా నిలిచింది. ఇప్పటికీ ఏ సినిమా తిరగరాయలేని రికార్డులెన్నింటినో సెట్ చేసి పెట్టాడు మగధీర. అప్పటికి ఇండస్ట్రీలో ఉన్న ప్రతీ రికార్డును త‌న పేర రాసుకున్నాడు మ‌గ‌ధీరుడు.రామ్ చ‌ర‌ణ్ రెండో సినిమాతోనే స్టార్ అయిపోయాడు. ఇప్ప‌టికీ కూడా మ‌గ‌ధీర సృష్టించిన కొన్ని రికార్డులు అలాగే ప‌దిలంగా ఉన్నాయి. బాహుబ‌లి సైతం వాటిని ట‌చ్ చేయలేక‌పోయింది. అప్ప‌ట్లో ఉన్న త‌క్కువ టికెట్ రేట్ల‌తోనే అద్భుతాలెన్నో చేసాడు మ‌గ‌ధీరుడు. 223 కేంద్రాల‌లో 100 రోజ‌లు, 299కేంద్రాల‌లో 50 రోజులు పూర్తి చేసుకుంది ఈ చిత్రం.

‘మున్నా’ సినిమాతో తెలుగు సినీ పరిశ్రమలో దర్శకుడిగా పరిచయమైన వంశీ పైడిపల్లి.. రెండో ప్రయత్నంగా ‘బృందావనం’ సినిమాను రూపొందించారు. తన తొలి సినిమాకు అవకాశం ఇచ్చిన ప్రముఖ నిర్మాత దిల్ రాజు మరోసారి వంశీకి అవకాశం ఇచ్చారు. ఆ సినిమానే ‘బృందావనం’. ఈ సినిమాలో శ్రీహరి గారికి మంచి పాత్ర లభించింది. ముఖ్యంగా ఎమోషనల్ సీన్స్ లో ఆయన నటనకి మంచి స్పందన వచ్చింది.శ్రీహరి ప్రకాష్ రాజ్ మధ్య అన్న తమ్ముళ్ల బంధం కూడా చాలా బాగా పండింది. అలాగే ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయింది.‘‘సిటీ నుంచొచ్చాడు సాఫ్ట్‌గా లవర్ బోయ్‌లా కనిపిస్తున్నాడు అనుకుంటున్నావేమో. క్యారెక్టర్ కొత్తగా ఉందని ట్రై చేశా, లోపల ఒరిజినల్ అలాగే ఉంది. దాన్ని బయటకు తెచ్చానుకో.. రచ్చరచ్చే’’ అనే డైలాగ్ ఈ సినిమాలో బాగా క్లిక్ అయింది. యంగ్ టైగర్ ఎన్టీఆర్, కాజల్ అగర్వాల్, సమంత హీరోహీరోయిన్లుగా విడుదలైన ‘బృందావనం’ సినిమా ఘన విజయం సాధించింది. కమర్షియల్ అంశాలతో కూడిన మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఈ సినిమాతో దర్శకుడు వంశీ పైడిపల్లి మరో మెట్టు పైకెక్కారు. అలాగే, సంగీత దర్శకుడు తమన్ సైతం ఈ సినిమాతో మ్యూజికల్ హిట్ అందుకున్నారు. మంచి ఆల్బమ్ ఇచ్చారు. ఆ తర్వాత శ్రీహరి ఆహా నా పెళ్ళంటా , తూఫాన్ లాంటి సినిమాల్లో నటించి మెప్పించారు.

హీరోగా చేసిన మొదటి చిత్రం 'పోలీస్' అయితే.. హీరోగా చేసిన చివరి చిత్రం 'పోలీస్ గేమ్' కావడం విశేషం. క్యారెక్టర్ ఆర్టిస్టుగా చివరి చిత్రం తుఫాన్. ఇప్పటి వరకు 28 చిత్రాల్లో హీరోగా నటించారు. రియల్ స్టార్‌గా ఖ్యాతి గడించారు. ఇప్పటి వరకు ఆయన దాదాపు వంద చిత్రాల్లో నటించారు.

వ్యక్తిగత జీవితం

శ్రీహరి ప్రముఖ నటి డిస్కో శాంతిని ప్రేమించి వివాహం చేసుకున్నారు. డిస్కో శాంతి తండ్రి ఆనందన్ మలయాళంలో మంచి పేరున్న నటుడు. ఆయన అచ్చన్ అనే సినిమాతో పరిచయం అయ్యారు ఆ తర్వాత తమిళ్, మలయాళ భాషల్లో చాలా సినిమాలు చేశారు. హీరో, విలన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ లా కూడా తను నటించాడు. అయితే ఆయన లక్ష్మి అనే ఆవిడని పెళ్లి చేసుకున్నారు. వీళ్లకు నలుగురు పిల్లలు కాగా లలిత కుమారి, డిస్కోశాంతి లు మన అందరికీ పరిచయస్తులు. ఆనందన్ 1989లో జాండీస్ వ్యాధితో చనిపోయారు. అప్పుడు శాంతి తన కుటుంబ బరువు అంత తన భుజాల మీదనే మోసేది. ఇక డిస్కో శాంతి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు ఎందుకంటే అప్పట్లో వచ్చిన ఐటెం సాంగ్స్ లో అన్నింటిలో తనే ఆడి పాడేది చిరంజీవితో రౌడీ అల్లుడు సినిమాలో ఒక సాంగ్ లో స్టెప్పులు వేసింది. అలాగే ఘరానా మొగుడు సినిమా లో బంగారు కోడిపెట్ట సాంగ్ లో కూడా చిరంజీవి పక్కన తనే చేసింది ఆ సాంగ్ చాలా పెద్ద హిట్ అయింది.అందుకే మళ్ళీ అదే సాంగ్ ని రాజమౌళి దర్శకత్వంలో చిరంజీవి కొడుకు అయిన రామ్ చరణ్ హీరోగా వచ్చిన మగధీర సినిమాలో రీమిక్స్ చేశారు అది కూడా చాలా పెద్ద హిట్ అయింది.

ఇక శ్రీహరి డిస్కో శాంతిల ప్రేమకథ ఒక హిందీ సినిమాతో మొదలైంది. ఆ సినిమాలో రౌడీలలో ఒకరిగా శ్రీహరి నటించారు. అయితే డిస్కో శాంతి ఆ సినిమాలో ఐటమ్ సాంగ్ చేస్తుంది. ఆ ఐటమ్ పాటలో శ్రీహరిని వీపు మీద టచ్ చెయ్యాలి కానీ శాంతి గట్టిగా రక్కేసింది. అప్పుడు శ్రీహరి అక్కడేం మాట్లాడలేదు. కానీ షూటింగ్ అయిపోయాక దెబ్బలని గమనించిన శాంతి శ్రీహరి దగ్గరికి వచ్చి క్షమాపణ అడిగింది. ఇక ఇక్కడ మొదలైన వీరి పరిచయం శాంతి గారు షూటింగ్ అంత ముగించుకొని ట్రైన్ లో వెళ్తున్నారని తెలిసి శ్రీహరి వెంటనే రైల్వే స్టేషన్ కి వెళ్లి అక్కడ శాంతి గారికి "మీరు సరే అంటే మిమ్మల్ని నేను పెళ్లి చేసుకుంట అని అన్నారట". అయితే అక్కడ శాంతి ఏమి మాట్లాడకుండా వెళ్లిపోయారు. ఇక ఆ తర్వాత నుంచి శాంతి గారి ఇంటికి శ్రీహరి ఫోన్ చేసి మాట్లాడేవాళ్ళు అని అంటారు. అలా వారి మధ్య పరిచయం కాస్త ప్రేమగా మారింది. శ్రీహరి గారికి ఎప్పుడు సమయం దొరికినా కూడా శాంతి గారి షూటింగ్స్ కి వెళ్లేవారట. ఇక వీరి ప్రేమని ఇంట్లో చెప్తే ఇంట్లో వాళ్ళు శ్రీహరిని పిలిపించి మాట్లాడారు.

అయితే వీరి పెళ్లి కూడా చాలా విచిత్రంగా జరిగింది. శ్రీహరి, డిస్కో శాంతి ఇద్దరు ఏదో పెద్ద గుడికి వెళ్తే అక్కడ పూజారి మీరు ఇప్పుడు పెళ్లి చేసుకోకపోతే మీకు ఎప్పటికి పెళ్లి కాదు అని అన్నారట. అలా వాళ్ళు ఎవరికి తెలియకుండా అక్కడే పెళ్లి చేసుకున్నారు. వీరు 1993 న్యూమరాలజీ ప్రకారం మొదటిసారి పెళ్లి చేసుకున్నారు. అలాగే 1996లో మళ్ళీ తిరుపతిలో సంప్రదాయబద్దంగా పెళ్లి చేసుకున్నారు. ఈ పెళ్లి తర్వాత డిస్కో శాంతి శ్రీహరి కొనిచ్చిన బట్టలు, బంగారంతోనే ఆయన ఇంటికి వచిందంట. ఇక వీరికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె అక్షర. నాలుగు నెలలకే కుమార్తె అకాల మరణం చెందగా, తన కూతురు అక్షర పేరుతో ఫౌండేషన్ నెలకొల్పి, మేడ్చల్ పరిధిలోని నాలుగు గ్రామాలను దత్తత తీసుకొని అక్కడి ప్రజలకు మినరల్ వాటర్ ను అందించడంతో పాటు గ్రామంలో అనేక మౌలిక సదుపాయాల సాదనకు కృషిచేశారు.

ఇక  శ్రీహ‌రి కుమారుడు మేఘాంశ్‌ను హీరోగా పరిచయం చేస్తూ రూపొందించిన చిత్రం 'రాజ్‌దూత్'. లక్ష్య ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సత్తి బాబు నిర్మించిన ఈ చిత్రానికి కార్తీక్, అర్జున్ అనే ఇద్దరు యంగ్ న్యూ డైరెక్టర్స్ దర్శకత్వం వహించారు. ఇప్పటి వరకు మనం రకరకాల అంశాలపై సినిమాలు తీయడం చూశాం. కానీ ఒక బైక్‌ను మెయిన్ పాయింటుగా పెట్టి దానిచుట్టూ కథ నడింపించడం అనేది కొత్త ఆలోచనే అని చెప్పొచ్చు.మేఘాంశ్ పెర్ఫార్మెన్స్ పరంగా ఓకే అనిపించాడు. సంజయ్ పాత్రలో బాగా సూటయ్యాడు. డైలాగ్ డెలివరీతో పాటు అందుకు తగిన విధంగా హావభావాలు పలికించడంలో ఫర్వాలేదనిపించాడు. అయితే ఈ కథ ద్వారా మేఘాంశ్ తనలోని నటనను పూర్తిగా ప్రదర్శించే అవకాశం అయితే రాలేదనే చెప్పాలి. తొలి సినిమా కాబట్టి దానికి తగిన విధంగానే సరళంగా స్క్రీన్ ప్లే నడిపించే ప్రయత్నం చేశారు. లుక్ పరంగా బావున్నాడు... నటన పరంగా ఇంకాస్త రాటుదేలితే మంచి భవిష్యత్ ఉంటుంది.ఈ సినిమా తర్వాత మేఘంశ్ కోతి కొమ్మచి సినిమా చేస్తున్నాడు. నేషనల్ అవార్డు విన్నింగ్ డైరెక్టర్ సతీష్ వేగేశ్న చాలా రోజుల తర్వాత మళ్లీ కామెడీ బాట పడ్డాడు. ప్రస్తుతం ఈయన తెరకెక్కిస్తున్న కోతి కొమ్మచ్చి షూటింగ్ జరుగుతుంది. ఇక లవర్ ఫేమ్ రిద్ది కుమార్.. అర్జున్ రెడ్డి తమిళ రీమేక్ వర్మ ఫేమ్ మేఘ చౌదరి హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. లక్ష్య ప్రొడక్షన్స్ సంస్థపై ఎం.ఎల్.వి సత్యనారాయణ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు.

శ్రీహరి భార్య డిస్కో శాంతి.. ప్రకాష్ రాజ్ మొదటి భార్య లలిత కుమారి.. ఇద్దరు అక్కా చెల్లెలు .ఈ రకంగా శ్రీహరి, ప్రకాష్ రాజ్ ఇద్దరు తోడల్లుళ్లు అయ్యారు. ఈ రకంగా వీళ్లిద్దరి మధ్య బంధుత్వం ఏర్పడింది. వీళ్లిద్దరు పలు సినిమాల్లో కలిసి నటించారు. బృందావనం సినిమాలో అన్నదమ్ములుగా నటించడం విశేషం. ప్రభుదేవా దర్శకత్వంలో తెరకెక్కుతున్న రాంబో రాజ్‌కుమార్ సినిమా షూటింగ్ నిమిత్తం ముంబై వెళ్లిన శ్రీహరి అక్కడ తీవ్ర అస్వస్థతకు గురవడంతో వెంటనే అతన్ని లీలావతి ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో అక్టోబరు 9, 2013 న కాలేయ సంబంధ వ్యాధివలన ముంబై లో కన్నుమూసారు.

ఓ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న శ్రీహరి భార్య డిస్కో శాంతి ఆ రోజు ముంబైలో ఏం జరిగిందనే విషయం వెల్లడించారు.'ఆర్.. రాజ కుమార్' మూవీ షూటింగ్ కోసం ముంబై వెళ్లిన సమయంలో శ్రీహరి అస్వస్థతకు గురవ్వడంతో వెంటనే ఆయన్ను లీలావతి ఆసుపత్రికి తరలించారు. లివర్‌కు సంబంధించిన సమస్యతో ఆయన చికిత్స పొందుతూ మరణించారు. శ్రీహరి మరణంపై డిస్కోశాంతి ఈ విధంగా వివరించింది. “ఆ రోజు బావ షూటింగ్ పూర్తి చేసుకుని హోటల్‌కు వచ్చారు. అప్పుడే తిని టీవీ చూస్తున్నారు. సడెన్‌గా చెమటలు పడుతున్నాయి, అదోలా ఉందని చెప్పడంతో వెంటనే రిసెప్షన్‌కు ఫోన్ చేసి డాక్టర్‌ను పిలిపించాం. డాక్టర్ కాస్త లేటుగా వచ్చారు. చూసి ఏమీ లేదు ఒక ఇంజక్షన్ ఇస్తే సరిపోతుంది అన్నారు. ఆ లోపు మేకప్ మ్యాన్, స్టాఫ్ మొత్తం వచ్చారు. అప్పుడు నేను నైటీలో ఉన్నాను. లోనికి వెళ్లి బట్టలు మార్చుకుని కిందకు వెళ్లేలోపు బావను తీసుకుని బండి ఆసుపత్రికి వెళ్లిపోయింది. నేను ఆసుపత్రికి వెళ్లగానే ... బావను ఐసీయూలో పెట్టి సెలైన్ ఎక్కిస్తున్నట్లు చెప్పారు. ఐసీయూ కాబట్టి నన్ను బయటకు పంపారు. నన్ను లోనికి పంపక పోవడంతో దొంగతనంగా దూరిపోయాను. బావ మొత్తం రక్తంతో నిండిపోయి ఉన్నారు. భయం వేసి వెంటనే అరిచాను. నాకేమో హిందీ రాదు... అంతా కలిసి నన్ను బయటకు తోశారు. బయటకు వచ్చి వెంటనే చెన్నైలో ఉన్న మా వాళ్లకు ఫోన్ చేశాను. నాకు భయంగా ఉందని చెప్పాను. వెంటనే మా చెల్లి లలితా, ప్రకాష్ రాజ్, నా తమ్ముడు అరుణ్ అంతా వచ్చారు. అందరూ వెళ్లి చూసి వస్తున్నారు. నన్ను మాత్రం లోనికి పంపించడం లేదు. చివరకు రాత్రి 9 గంటలకు పంపారు. వెళ్లి చూస్తే బావ పూర్తిగా బ్లడ్‌తో ఉన్నారు. తట్టుకోవడం నా వల్ల కాలేదు. నన్ను మళ్లీ లాక్కుని బయటకు తీసుకొచ్చారు. అక్కడి వారికి బావ ఎవరో తెలియదు. కొంత మంది డాక్టర్లు వచ్చి ఏదో తప్పు జరిగిందని బ్రతిమిలాడుతున్నారు. నాకు తెలిసినంత వరకు ఆయనకు నోట్లో నుంచి ట్యూబ్ వేశారు. అది వెళ్లి లివర్లో గుచ్చేసింది. దీంతో మొత్తం బ్లడ్ బయటకు వచ్చింది. రూమ్ మొత్తం రక్తమే. హార్ట్ ఎటాక్ వస్తే అంత బ్లడ్ వచ్చే అవకాశమేలేదు. నేను వెంటనే బావ పర్సనల్ డాక్టర్లను పిలిపించాను. వాళ్లు నాకు ఈ విషయం చెప్పారు. పైపు వేసినపుడు ఈయన కదిలారో? వాళ్లు తప్పుగా పైపు వేశారో తెలియదు... నా బావ నాకు దూరమైపోయాడు'' అంటూ డిస్కోశాంతి కన్నీటి పర్యంతం అయ్యారు.

హాస్పిటల్ వాళ్ళు మొదట బాడీని ఇవ్వమని అడిగిన ఇవ్వం అని బ్లాక్ మెయిల్ చేశారట. ఆ తర్వాత మెల్లగా శ్రీహరి గారి అభిమానులు అంత అక్కడికి చేరుకోవడంతో భయపడి హాస్పిటల్ వాళ్ళు డెడ్ బాడీ ని ఇచ్చారు. అక్టోబర్ 10న జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45జనసంద్రంతో మునిగిపోయింది. శ్రీ‌హ‌రి ఉన్నపుడు చాలా మందికి సాయం చేసాడు. ఓ ఊరినే ద‌త్తత తీసుకుని న‌డిపించాడు. అలాంటి వ్య‌క్తి చ‌నిపోయిన త‌ర్వాత శ్రీ‌హ‌రి భార్య డిస్కో శాంతి ప‌డిన వేద‌న గురించి మాట‌ల్లో చెప్ప‌డం క‌ష్ట‌మే. అయితే ఆయ‌న మ‌ర‌ణించిన త‌ర్వాత మీడియాలో వ‌చ్చిన కొన్ని క‌థ‌నాలు త‌న‌కు మ‌న‌శ్శాంతి లేకుండా చేసాయంటుంది డిస్కో శాంతి. త‌న భ‌ర్త ఏకంగా 500 కోట్లు సంపాదించి పెట్టి వెళ్లిపోయాడు అంటూ కొన్ని మీడియా సంస్థ‌లు రాసిన స్టోరీస్ చూసి బాధ ప‌డ్డాన‌ని చెప్పింది ఈమె. నిజంగానే శ్రీ‌హ‌రి తనకు 500 కోట్ల ఆస్తులను ఇచ్చాడ‌ని నిరూపిస్తే.. అందులో 300కోట్లు వాళ్ల‌కే ఇచ్చేస్తానంటూ ఓపెన్ ఆఫ‌ర్ ఇచ్చింది ఈమె. త‌న భ‌ర్త చ‌నిపోయిన త‌ర్వాత తమ కుటుంబం ఎలాంటి లోటు లేకుండా బ‌త‌క‌డానికి కార‌ణం తన ఆస్తులను తాకట్టు పెట్ట‌డ‌మే అని సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌పెట్టింది డిస్కో శాంతి. కానీ ఆ విష‌యం తెలియ‌కుండా ఇష్ట‌మొచ్చిన‌ట్లు మాట్లాడుకుంటున్నారంటూ ఆమె ఆవేద‌న వ్య‌క్తం చేసింది. శ్రీ‌హ‌రి కొడుకు మేఘాంష్ రాజ్ దూత్ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. కొడుకు బాగా సెటిలై.. మంచి హీరోగా స్థిర‌ప‌డితే తాను సుఖ‌ప‌డాల‌నుకుంటున్న‌ట్లు చెప్పారు డిస్కో శాంతి. బాగున్న‌పుడు మాత్ర‌మే అంతా ఇక్క‌డ బంధువులని.. ప‌రిస్థితులు బాలేన‌పుడు ఇండస్ట్రీలో ఎవరు ఎవర్నీ పట్టించుకోరనీ చెప్పింది శాంతి.

శ్రీహరి చనిపోయిన త‌ర్వాత కూడా త‌న పిల్ల‌లు ఎలాంటి లోటు లేకుండా ఉండాల‌ని.. త‌ను కొన్ని పొలాల‌ను కూడా అమ్మేసిన విష‌యాన్ని చెప్పింది డిస్కో శాంతి. ముందు నుంచి శ్రీ‌హ‌రి అనుకున్న‌ట్లుగానే త‌న చిన్న కొడుకు మేఘాంశ్‌ను హీరోగా.. పెద్ద కొడుకు శశాంక్‌ను దర్శకుడుగా సెటిల్ చేస్తానంటుంది శాంతి.

రోడ్ నెం.45లో ఉన్న శ్రీహరి గారి ఇంటి ముందుకు ఎవరైనా సహాయం కోసం వెళ్తే.. రాళ్లకు డబ్బులు చుట్టి.. దానికి గుడ్డ కట్టి బయటకు విసిరేసేవాడుట. వాటిని తీసుకున్న వాళ్లు ఆయనకు రెండు చేతులు ఎత్తి దండం పెట్టేవారని. ఈ విధంగా శ్రీహరి ఏదో ఒక రూపంలో కొన్ని వేల మందికి సహాయం చేశారు అంటూ ఉంటారు.

అవార్డ్స్

ఆయనకి మొదటిగా అవార్డ్ తాజ్ మహల్ సినిమాలో అద్భుతమైన నటనని కనపరచినందుకు శ్రీహరి గారికి ఉత్తమ విలన్ గా నంది అవార్డ్ లభించింది. ఈ సినిమాతో శ్రీహరి గారికి మెల్లగా అభిమానులు కూడా పెరిగారు. ఇక మోహన్ బాబు నటించిన శ్రీ రాములయ్యా సినిమాలో శ్రీహరి గారి నటనకి స్పెషల్ జ్యూరీ నంది అవార్డ్ వచ్చింది. అలాగే శ్రీహరి కి ఈ నంది జ్యూరీ అవార్డ్స్ పోలీస్, రామసక్కనోడు, విజయ రామ రాజు సినిమాలకి వచ్చాయి.

నువ్వొస్తానంటే నేనొద్దంటానా సినిమాలో నటనకి గాను శ్రీహరి గారికి ఉత్తమ సహాయ నటుడు అవార్డ్ లభించింది.

ఆయన మగధీర, ఢీ, లాంటి సినిమాల్లో హీరోలతో పోటీగా నటించి విలన్ క్యారెక్టర్స్ మరియు సహాయ పాత్రలకి కొత్త అందాన్ని తెచ్చారు.

- Advertisement -

You've successfully subscribed to Tollywood Latest News | Celebrities Profiles | Media9 Tollywood
Great! Next, complete checkout to get full access to all premium content.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.