'రామబాణం' కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్: గోపీచంద్!!

* కాంబినేషన్ ని కాదు.. కథని నమ్మి చేసిన సినిమా 'రామబాణం'.

'లక్ష్యం', 'లౌక్యం' వంటి సూపర్ హిట్ సినిమాల తర్వాత మాచో స్టార్ గోపీచంద్, డైరెక్టర్ శ్రీవాస్‌ కలయికలో వస్తున్న హ్యాట్రిక్ ఫిల్మ్ 'రామబాణం'. వరుస విజయాలతో దూసుకుపోతున్న అగ్ర నిర్మాణ సంస్థ
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల సంయుక్తంగా భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాలో గోపీచంద్ సరసన నాయికగా డింపుల్ హయతి నటించగా, జగపతి బాబు, కుష్బూ ప్రధాన పాత్రలు పోషించారు. ఇప్పటికే విడుదలైన ప్రచారం చిత్రాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. రేపు(మే 5) ఈ చిత్రం భారీ స్థాయిలో థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా విలేఖర్లతో ముచ్చటించిన కథానాయకుడు గోపీచంద్ సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

రామబాణం ఎలా మొదలైంది?
ఇది కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. నేను కొన్నేళ్లుగా ఎక్కువగా యాక్షన్ సినిమాలు చేస్తున్నాను. ఫ్యామిలీ సినిమా చేసి చాలా రోజులైంది. వాసు(దర్శకుడు శ్రీవాస్) ముందు యాక్షన్ ఫిల్మ్ చేద్దామన్నారు. వద్దు మొత్తం యాక్షన్ అయిపోతుంది. మనం చేసిన లక్ష్యం, లౌక్యం సినిమాలలో యాక్షన్ తో పాటు ఫ్యామిలీ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయి. అలాంటి సినిమా చేద్దామని అన్నాను. ఆ సమయంలో భూపతిరాజా గారు ఈ కథ చెప్పడం, అది మాకు నచ్చడం.. అలా రామబాణం మొదలైంది.

లక్ష్యం సినిమాకి దీనికి ఏమైనా సంబంధం ఉందా? దీనికి లక్ష్యం-2 అనే టైటిల్ పరిశీలించారా?
లేదు.. లక్ష్యం కి, రామబాణం కి అసలు సంబంధం లేదు. రెండు వేరు వేరు కథలు. లక్ష్యం, లౌక్యం సెంటిమెంట్ ని కొనసాగిస్తూ అలాంటి టైటిల్ పెడితే బాగుంటుందని వాసు భావించారు. అయితే అనుకోకుండా అన్ స్టాపబుల్ షోకి వెళ్ళడం, అక్కడ బాలకృష్ణ గారు రామబాణం అనే అద్భుతమైన టైటిల్ పెట్టడం అలా జరిగిపోయాయి.

జగపతిబాబు గారితో నటించడం ఎలా ఉంది? ఆయన పాత్ర ఎలా ఉంటుంది?
జగపతిబాబు గారితో నాకిది రెండో సినిమా. ఆయనను కలిస్తే సొంత అన్నయ్యను కలిసినట్టే ఉంటుంది. నేను ఆయనను అన్నయ్య అనే పిలుస్తుంటాను. ఆయనతో నటిస్తుంటే ఒక యాక్టర్ తో చేసినట్టు ఉండదు, అన్నయ్యతో చేసినట్టే ఉంటుంది. అందుకే మా మధ్య సన్నివేశాలు అంతలా పండాయి. ఈ సినిమా అన్నదమ్ముల కథ. ఇద్దరి స్వభావం ఒకటే. కానీ ఎంచుకున్న దారులు వేరు. మంచి ఫ్యామిలీ ఎమోషన్స్ ఉంటాయి. భూపతి రాజా గారు ఈ కథ చెప్పినప్పుడు ఒక ప్రేక్షకుడిగా నేను బాగా కనెక్ట్ అయ్యాను. ఓ కమర్షియల్ సినిమా లో మెసేజ్ ఇవ్వడం కష్టం. ఈ సినిమా కమర్షియల్ ఫార్మాట్ లో వెళ్తూనే.. ఒక మంచి సందేశం ఉంటుంది. ఇదేం కొత్త మెసేజ్ కాదు. మన చుట్టూ జరుగుతున్నదే. కానీ మనం దానిని పట్టించుకోకుండా ముందుకు వెళ్తున్నాం. అయితే కొన్నేళ్ల తర్వాత దాని ప్రభావం ఎలా ఉంటుందో ఇప్పుడు తెలీదు.. కానీ తర్వాత బాధ పడతాం. అదే విషయాన్ని ఇందులో చెప్పబోతున్నాం.

లక్ష్యం, లౌక్యం హిట్ అయ్యాయి కాబట్టి.. హిట్ కాంబినేషన్ ని నమ్మి శ్రీవాస్ గారితో ఈ సినిమా చేశారా?
అలా ఏం లేదండి. హిట్ కాంబినేషన్ ని నమ్మి ఉంటే ఇంత సమయం ఎందుకు తీసుకుంటాం. లక్ష్యం కి, లౌక్యం కి ఏడేళ్లు గ్యాప్. అలాగే ఇప్పుడు రామబాణం కి ఏడేళ్లు గ్యాప్. మధ్యలో ఒకసారి వాసు చేద్దామన్నారు కానీ నేనే వద్దు అన్నాను. మన కాంబోలో రెండు హిట్లు వచ్చాయి. మూడో సినిమా వాటిని మించే సినిమా కావాలి అన్నాను. అలాంటి సినిమానే రామబాణం. ఇందులో ఫ్యామిలీ, యాక్షన్ ఇలా అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి.

ఇప్పుడు ప్రేక్షకులు సినిమాలు చూసే కోణం మారింది.. ఈ సమయంలో ఇలాంటి కథ చేశారు కదా.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు?
ఇప్పుడు అమ్మని మమ్మీ అంటున్నారు. అన్నయ్యని బ్రో అంటున్నారు. పిలుపులే మారాయి. ఎమోషన్స్ మారలేదు. ఎన్నేళ్ళు అయినా ఎమోషన్స్ అలాగే ఉంటాయి. మంచి సినిమా తీస్తే ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారు. వాళ్ళు ఆదరించ లేదంటే వాళ్ళని మెప్పించే సినిమా మనం తీయలేదని అర్థం. ఏ సినిమా అయినా ప్రేక్షకులను కథలో లీనమయ్యేలా చేయగలగాలి. బోర్ కొట్టకుండా సినిమాలో ఇన్వాల్వ్ అయ్యేలా చేయగలిగితే.. ఏ సినిమా అయినా ఖచ్చితంగా ఆడుతుంది. కరెక్ట్ కంటెంట్ ఇస్తే ఆడియన్స్ ఏ సినిమా అయినా చూస్తున్నారు. ఆడియన్స్ టేస్ట్ మారలేదు. వాళ్ళకి కనెక్ట్ అయ్యేలా తీస్తే, ఏ జోనర్ సినిమాని అయినా ఆదరిస్తారు.

ఈమధ్య ఫ్యామిలీ ఆడియెన్స్ పెద్దగా థియేటర్లకు రావడం లేదు కదా.. ఫ్యామిలీ సినిమాగా తెరకెక్కిన రామబాణం వారిని థియేటర్లకు రప్పిస్తుందా?
ఏ సినిమా అయినా లాంగ్ రన్ ఉండాలంటే ఫ్యామిలీ ఆడియెన్స్ చూడాలి. రెండో రోజు నుంచి సినిమాని నడిపించేది కుటుంబ ప్రేక్షకులే. సినిమా బాగుందని టాక్ వస్తే.. వాళ్ళు విడుదల రోజు సాయంత్రం నుంచే థియేటర్లకు కదులుతారు. మనం మంచి సినిమా అందిస్తే, వాళ్ళు థియేటర్లలో ఖచ్చితంగా ఆదరిస్తారు.

ఈ సినిమాలో జగపతిబాబు గారికి పాత్రకి ప్రాధాన్యత ఉండటం, అలాగే పోస్టర్స్ లో ఆయన ఫోటోలు వేయడంపై మీ అభిప్రాయం ఏంటి?
అంతకుముందు చేసిన లక్ష్యంలో కూడా ఆయన పాత్రకి ఎంతో ప్రాధాన్యం ఉంది. ముందు మనం కథని చూడాలి. రామబాణంలో జగపతి బాబు గారిది కీలక పాత్ర. ఆయన పాత్రకు ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఇస్తేనే సినిమా నిలబడుతుంది. ఆ క్యారెక్టర్ తగ్గించి, నా క్యారెక్టర్ ని పెంచండి అంటే సినిమా నిలబడదు. సినిమాకి కథే హీరో. కథే సినిమాని నడిపించాలి.

సీటిమార్ మంచి సినిమా.. కానీ ఆశించిన స్థాయిలో ఆడలేదు. అలాంటప్పుడు అసలు ఎలాంటి సినిమా చేయాలనే డైలమా మీకు కలగలేదా?
సీటిమార్ ఆడింది. సూపర్ డూపర్ హిట్ అని చెప్పను. కానీ విజయం సాధించింది. అయితే ఏవో కారణాల వల్ల కొన్నిసార్లు ఆశించినంత ఫలితం రాకపోవచ్చు. ఏ సమయంలో విడుదలైంది మొదలుకొని దానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. ఏ సినిమా బాగా ఆడుతుంది, ఏ సినిమా ఆడదు అని మనం చెప్పలేం. మన మంచి సినిమా చేసి కూడా ఆశించిన స్థాయి విజయం దక్కలేదంటే.. దానిని ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లడంలో ఎక్కడ తప్పు చేశామని ఆలోచించాలి.

పక్కా కమర్షియల్ ఫలితం గురించి?
ఆడుతుందని భావించాం. కానీ ఆడలేదు. అందులో కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి. అవి కరెక్ట్ చేసుకొని ఉంటే బాగుండేది. అది కేవలం ఏ ఒక్కరి తప్పో కాదు. అందరం కలిసి టీమ్ వర్క్ చేశాం. మేం దానిని నమ్మాం.. కానీ ఆశించిన సక్సెస్ రాలేదు.

కుష్బూ గారితో కలిసి నటించడం ఎలా ఉంది?
కుష్బూ గారితో కలిసి మొదటిసారి పని చేశాను. కాలేజ్ రోజుల్లో ఆమె సినిమాలు చూసి, ఇప్పుడు ఆమెతో కలిసి సినిమా చేయడం ఆనందాన్ని ఇచ్చింది. ఆమె సెట్స్ లో సీనియర్ లా ప్రవర్తించలేదు. అందరితో చాలా సరదాగా ఉన్నారు. అదే సమయంలో ఆమె చాలా ప్రొఫెషనల్ యాక్ట్రెస్. కొన్ని సన్నివేశాల్లో ఆమె నటన చూసి సర్ ప్రైజ్ అయ్యాను. సినిమాకి ఆమె చాలా ప్లస్.

జగపతి బాబు గారు ఒక మాట అన్నారు. హీరోగా ఉన్నప్పుడు ఒత్తిడి ఉండేది.. ఇప్పుడు ఎలాంటి ఒత్తిడి లేకుండా నటిస్తున్నానని చెప్పారు. హీరోగా మీకు అలాంటి ఒత్తిడి ఏమైనా ఉందా?
ప్రతి హీరోకి ఒత్తిడి ఉంటుంది. ఈ సినిమా విషయంలో జగపతి బాబు గారికి కూడా ఎంతో కొంత ఒత్తిడి ఉంటుంది. సినిమా ఫలితం మీద ఎన్నో కుటుంబాలు ఆధారపడి ఉంటాయి. కాబట్టి విజయవంతమైన సినిమా అందించాలనే ఒత్తిడి అందరిలోనూ ఉంటుంది.

ఇందులో లౌక్యం సినిమా స్థాయి కామెడీని ఆశించవచ్చా?
ఇందులో కూడా మంచి కామెడీ ఉంటుంది. కానీ మరీ లౌక్యం స్థాయిలో ఉండదు. రామబాణం లో కామెడీ, ఎమోషన్, యాక్షన్ ఇలా అన్నీ సమపాళ్లలో ఉంటాయి.

మీకు ఎలాంటి ఎమోషన్స్ నచ్చుతాయి?
ఈ సినిమాలో నాకు బ్రదర్ ఎమోషన్ కనెక్ట్ అయ్యింది. ఈ కథ మొదటిసారి విన్నప్పుడే ఒక ఆడియన్ గా ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యాను. భూపతి రాజా గారు కథ చెప్తుంటే అందులో లీనమైపోయి నాన్ స్టాప్ గా విన్నాను. వాసు కూడా ఈ కథకి బాగా కనెక్ట్ అయ్యాడు.

జగపతి బాబు గారి నటన గురించి?
ఆయన చాలా ఇంటెన్స్ యాక్టర్. మొదట్లో ఫ్యామిలీ సినిమాలు ఎక్కువ చేయడం వల్ల ఆయనకు ఫ్యామిలీ ఇమేజ్ ఎక్కువ వచ్చింది కానీ.. ఆయన ఇంటెన్స్ యాక్టర్. ఆయనను సరిగ్గా వాడుకోవాలి. ఆయనకు సరైన పాత్రలు పడితే.. ఇప్పుడున్న స్థాయి కంటే ఇంకా ఉన్నత స్థాయికి వెళ్తారు.

సాహసం సినిమా ఈ టైం లో అయితే బాగా ఆడేదేమో కదా? ఇప్పుడు అలాంటి సినిమాలు చేసే ఆలోచన ఉందా?
అవును. సాహసం, అలాగే ఒక్కడున్నాడు.. ఈ రెండు సినిమాలు ఈ టైంలో చేస్తే చాలా పెద్ద హిట్లు అవుతాయి. అలాంటి కథలు నా దగ్గరకు వస్తే నేనెప్పుడూ చేయడానికి సిద్ధంగానే ఉంటాను.

ఈ 20 ఏళ్ల కెరీర్ లో చేతి దాకా వచ్చి మిస్ అయిన మంచి రోల్స్ ఏమైనా ఉన్నాయా?
అలా ఎప్పుడూ జరగలేదు. కానీ ఏదైనా మంచి రోల్ చూసినప్పుడు ఇది మనకు వచ్చి ఉంటే బాగుండేది అనిపిస్తుంది.

ఈమధ్య కొత్త దర్శకులు మంచి కంటెంట్ ఉన్న సినిమాలు చేస్తున్నారు.. మీరు ఎవరైనా కొత్త దర్శకుడికి అవకాశం ఇస్తున్నారా?
నా కెరీర్ లో ఎక్కువగా కొత్త దర్శకులతోనే చేశాను. ఇప్పుడు కథలు వింటూనే ఉంటాను. కథ నచ్చితే కొత్త దర్శకులతో కచ్చితంగా చేస్తాను.

శ్రీను వైట్ల గారితో సినిమా ఉంటుందా?
స్క్రిప్ట్ వర్క్ జరుగుతుంది. కొంచెం టైం పడుతుంది. హర్ష గారి సినిమా తర్వాత ఉంటుంది.

ప్రభాస్ సినిమాలో విలన్ రోల్ చేసే అవకాశం వస్తే చేస్తారా?
కచ్చితంగా చేస్తాను. నన్ను నిలబెట్టింది స్టార్టింగ్ లో చేసిన విలన్ పాత్రలే. అంతటి పవర్ ఫుల్ రోల్స్ వస్తే ఎవరి సినిమాలో అయినా నటించడానికి సిద్దంగా ఉన్నాను.

నిర్మాత విశ్వప్రసాద్ గారి గురించి?
ఆయన చాలా మంచి వ్యక్తి. నేనే ఆయనతో చెప్పాను.. మరీ ఇంత మంచితనం ఉండకూడదని. అలాంటి నిర్మాత ఉంటే ఇండస్ట్రీ బాగుపడుతుంది. కొన్ని వందల కుటుంబాలు బాగుపడతాయి. చాలా చాలా మంచి వ్యక్తులు.

- Advertisement -

You might also like

You've successfully subscribed to Tollywood Latest News | Celebrities Profiles | Media9 Tollywood
Great! Next, complete checkout to get full access to all premium content.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.