పవర్ స్టార్ పవన్ కళ్యాణ్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అనే పేరుకి పరిచయం అక్కర్లేదు. ఆయన సినిమాలకి అభిమానులు మొదటి రోజు టికెట్స్ కోసం ఎగబడిఉంటారు. ఆయనకి యూత్ లో ఉన్న క్రేజ్ అంత ఇంత కాదు. ఆయనకి ఇంత క్రేజ్ ఉన్నప్పటికీ బైట మాత్రం చాలా సాధారణంగా ఉంటారు కానీ సమయం వచ్చినప్పుడు మాత్రం సింహం లాగా గర్జిస్తాడు. ఈ విషయాన్ని మనం ఆయన ఇచ్చే రాజకీయ స్పీచ్ లని చూసి అర్థం చేసుకోవచ్చు. ఆయన కెరీర్ ఆకాశం ఎత్తులో ఉన్నప్పుడు రాజకీయల్లోకి అడుగుపెట్టి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. సినిమాల్లోనే కాదు ఆయన రాజకీయాల్లో కూడా తన రేంజ్ మార్క్ చూపించారు.

బాల్యం – విద్యాభ్యాసం

పవన్ కళ్యాణ్ 1971 సెప్టెంబరు 2న తల్లిదండ్రులు కొణిదెల వెంకటరావు, అంజనాదేవి గారికి బాపట్లలో జన్మించాడు. పవన్ కి ఇద్దరు అక్కలు, ఇద్దరు అన్నలు (చిరంజీవి, నాగేంద్ర బాబు). అన్నయ్య చిరంజీవిని చూసి పరిశ్రమ పట్ల ఆసక్తిని పెంచుకున్నారు పవన్ కళ్యాణ్. ఆయన ఇంటర్మీడియట్ నెల్లూరు లోని కళాశాలలో పూర్తి చేసి, పిమ్మట కంప్యూటర్స్ లో డిప్లోమా చేశాడు. ఆ తర్వాత తనకి ఉన్న ఆసక్తి తో మార్షల్ ఆర్ట్స్ కూడా నేర్చుకున్నారు. చిరంజీవి గారి భార్య సురేఖ గారు కళ్యాణ్ హీరో గా బాగుంటాడు అని చిరంజీవి గారికి చెప్పడంతో పవన్ కళ్యాణ్ కి సత్యానంద్ దగ్గర నటనలో మెళకువలు నేర్పించారు.

సినీ జీవితం

1996లో పవన్ కళ్యాణ్ టాలీవుడ్ లోకి ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ సినిమాతో ఎంట్రీ ఇచ్చారు. హిందీలో అమీర్ ఖాన్ నటించిన ‘ఖయామత్ సే ఖయామత్ తక్’ మూవీని దర్శకుడు ఇ.వి.వి సత్యనారాయణ తెలుగు నేటివిటీకి తగ్గట్టు స్టోరీలో కొన్ని మార్పులు చేసి తెరకెక్కించారు. ఈ సినిమాలో హీరోయిన్‌గా అక్కినేని వారసురాలు సుప్రియను తీసుకున్నారు. ఇదిలా ఉంటే అప్పట్లో ఈ సినిమా ప్రమోషన్స్ కూడా చాలా కొత్తగా నిర్వహించారు. ముందుగా పవన్ కళ్యాణ్ ఉన్న ఫోటోలతో ఈ అబ్బాయి ఎవరు అంటూ వాల్ పోస్టర్స్ అంటించి, సినిమా విడుదలకు ముందు ఇతడే మన కళ్యాణ్ అంటూ మరో పోస్టర్స్ విడుదల చేసారు. దాంతో ప్రేక్షకుల్లో కూడా క్యూరియాసిటీ పెరిగిపోయింది. దానికి తోడు చిరంజీవి తమ్ముడు అంటూ అంచనాలు కూడా పెరిగిపోయాయి. ఇలా ప్రతీ విషయంలోనూ పవన్‌ను ఈ.వి.వి సత్యనారాయణ గారు అద్భుతంగా ప్రమోట్ చేసారు. ఇక ఇందులో పవన్ చేసిన రియల్ ఫీట్స్ కూడా సినిమాకు అదనపు ఆకర్షణ. ఈ సినిమాలో అప్పటి స్టార్ హీరోయిన్ రంభ ఓ ఐటం సాంగ్ చేసింది. ఇండస్ట్రీలోని ప్రముఖ నటులు, కమెడియన్స్ అంతా ఈ సినిమాలో నటించారు. ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ యావరేజ్ అయినా కూడా పవన్ ఈ సినిమాతో మంచి గుర్తింపు పొందారు.

పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన రెండో సినిమా ‘గోకులంలో సీత’. ఈ మూవీ తమిళంలో కార్తిక్ హీరోగా యాక్ట్ చేసిన ‘గోకులతిల్ సీతై’ కు రీమేక్. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర మంచి ఫలితాన్నే అందుకుంది.ఈ చిత్రానికి పోసాని కృష్ణమురళి మాటలు అందించారు. ఈ సినిమా విడుదల సందర్భంగా పోసాని కృష్ణమురళి విలేకరుల సమావేశంలో తొలిసారిగా పవన్ కల్యాణ్‌ని ఉద్దేశిస్తూ పవన్ స్టార్ అని పిలిచారు. ఆ తర్వాత చాలా పత్రికలు పవన్ కళ్యాణ్ ను పవర్ స్టార్ అని సంబోధించడం మొదలుపెట్టాయి. గోకులంలో సీత సినిమా నుంచి కళ్యాణ్ కుమార్ కాస్త పవన్ కళ్యాణ్ అయ్యాడు.

ఆ తర్వాత సూపర్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్‌లో వచ్చిన ‘సుస్వాగతం’ సినిమాలో తొలిసారిగా పవన్ కళ్యాన్ పేరుకు ముందు పవర్ స్టార్ బిరుదుతో టైటిల్ వేసారు. ఈ సినిమా తమిళంలో విజయ్ హీరోగా యాక్ట్ చేసిన ‘లవ్ టుడే’ సినిమాకి రిమేక్. ఈ చిత్రం పవన్ కళ్యాణ్ కెరీర్‌లో స్పెషల్‌గా నిలిచిపోయింది. ఈ సినిమాలో పాటలు కూడా మంచి హిట్ అయ్యాయి. ‘ఆలయాన హారతిలో’ పాటకి విపరీతమైన స్పందన వచ్చింది. అలాగే క్లైమాక్స్ లో పవన్ కళ్యాణ్ నటనకి అందరూ ఫిదా అయ్యారు.

ఇక పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన సూపర్ హిట్ చిత్రాల్లో ‘తొలిప్రేమ’ కు ప్రత్యేక స్థానం ఉంది. ఈ సినిమా సక్సెస్‌తో పవన్ కళ్యాణ్ టాలీవుడ్‌లో స్టార్ హీరోగా ఎదిగాడు. ఈ చిత్రం తర్వాత పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా వెనుదిరిగి చూసుకోలేదు. కరుణాకరన్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని జీ.వి.జీ రాజు నిర్మించారు. 1998లో సుస్వాగతం తర్వాత అదే యేడాది రిలీజైన సినిమా ‘తొలిప్రేమ’. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ సరసన కీర్తి రెడ్డి కథానాయికగా నటించింది. హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్‌లో ఏకధాటిగా రెండు వందల రోజులకు పైగా నడిచి తొలిప్రేమ రికార్డు క్రియేట్ చేసింది. తెలుగులో ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా జాతీయ అవార్డు కైవసం చేసుకుంది. ఉత్తమ చిత్రంగా అప్పటి ఉమ్మడి రాష్ట్రం నుండి ‘బంగారు నంది’ని కూడా అందుకుంది. 1998లో విడుదలైన బ్లాక్ బస్టర్ హిట్స్ లో తొలిప్రేమ ఒకటి. తొలిప్రేమ చిత్రానికి దేవా అద్భుతమైన సంగీతం అందించాడు. అంతేకాకుండా ఈ చిత్రం హిందీతో పాటు కన్నడలో కూడా రీమేక్ చేస్తే అక్కడ కూడా సూపర్ హిట్టైయింది. ఈ సినిమాలో హీరోయిన్ ఇంట్రడక్షన్ సీన్ అప్పట్లో ఒక ట్రెండ్ సెట్టర్. ఆ సీన్ కి ఇప్పటికీ అభిమానులు ఉన్నారు.

ఆ తర్వత విడుదలైన ‘తమ్ముడు’ చిత్రంతో మరో హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు పవన్ కళ్యాణ్. ఈ సినిమాలో చలాకీగా తిరిగే ఒక కుర్రోడు అన్నకు జరిగిన అవమానానికి ప్రతీకారం తీర్చుకోడానికి ఎలా బాక్సర్ అయ్యాడో అన్నది కథ. పవన్ కళ్యాణ్, అచ్యుత్, ప్రీతి జంగ్యానీ, చంద్రమోహన్ తదితరులు ముఖ్యపాత్రల్లో నటించిన ఈ సినిమాలోని కామెడి సన్నివేశాలు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తాయి. రమణ గోగుల సంగీతం అందించిన పాటలు అప్పట్లో సూపర్ హిట్స్. ట్రావెలింగ్ సోల్జర్, మేడ్ ఇన్ ఆంధ్రా  ఛాతీపై బరువైన రాతి పలకను సుత్తితో పగులగొట్టించుకోవటం, నీటితో నింపిన కుండల్ని కాలితో కొట్టటం, కొబ్బరి కాయని చేతులతో పగులగొట్టటం, చేతి వేళ్ళ పై కారు నడిపించుకోవటం వంటి స్టంట్ లను పవన్ ఇందులో నిజంగా చేసి అందరిని ఆశ్చర్యపరిచారు. ఈ చిత్రంతో పవన్ వరసగా ఐదవ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నారు.

ఆ తర్వాత చేసిన బద్రి సినిమా వెనుక ఒక చిన్న కథ ఉంది. అదేంటి అంటే రాంగోపాల్‌ వర్మ దగ్గర సహాయ దర్శకుడిగా పనిచేసిన పూరి జగన్నాథ్‌ ఒక కథను తయారు చేసుకున్నారు. పవన్ కళ్యాణ్‌తో సినిమా చేద్దామని ఆయన మేనేజర్‌ చుట్టూ తిరగడం మొదలు పెట్టారు. అయినా ఫలితం దక్కలేదు. దీంతో గతంలో దూరదర్శన్‌ ద్వారా పరిచయం ఉన్న శ్యామ్‌ కె.నాయుడిని కలిసి ‘పవన్‌కు కథ చెప్పే అవకాశం ఇప్పించండి’ అని కోరారు. శ్యామ్ ఈ విషయాన్ని ఛోటా కె.నాయుడుకి చెప్పారు. అప్పటికే ఛోటాకు పవన్‌ మంచి స్నేహితుడు. దీంతో పూరి వెళ్లి ఛోటాను కలిస్తే ‘పవన్‌కు మంచి కథ చెప్పకపోతే నా పరువు పోతుంది. ముందు ఆ కథ నాకు చెప్పు’ అని ఛోటా అనడంతో ‘బద్రి’ కథ ఛోటాకు నచ్చుతుందో లేదో అని తన దగ్గర ఉన్న ‘ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం’ కథ చెప్పారు పూరి. అది ఛోటాకు నచ్చడంతో ఇదే కథ చిన్న పాయింట్‌గా పవన్‌కు చెప్పి పూరిని కలిసేందుకు పవన్‌ను ఒప్పించారు. కథ చెప్పేందుకు పవన్‌కల్యాణ్‌ నుంచి పూరి జగన్నాథ్‌కు పిలుపు వచ్చింది. అది కూడా తెల్లవారుజామున 4 గంటలకు రమ్మన్నారు. అంతేకాదు, కేవలం అరగంట సమయం మాత్రమే ఇచ్చారు. తెల్లవారుజామున పవన్‌ ఇంటికి వెళ్లిన పూరి కథ చెప్పడం మొదలు పెట్టారు. అరగంట గడిచిపోయి గంట అయింది. గంట కాస్తా నాలుగు గంటలైంది. పవన్‌ కథ వింటూనే ఉన్నారు. పవన్‌కు చాలా నచ్చింది. కానీ, క్లైమాక్స్‌ నచ్చలేదు మార్చమని సలహా ఇచ్చారు. ‘హమ్మయ్యా.. ఎలాగో కథ అయితే ఒకే అయింది. క్లైమాక్స్‌ సంగతి చూద్దాం’ అంటూ పవన్‌కు ఒకే చెప్పి బయటకు వచ్చేశారు. క్లైమాక్స్‌ మార్చమని పవన్‌ కల్యాణ్‌ సూచించడంతో దానిపై కసరత్తు మొదలుపెట్టారు. ఒకరోజు.. రెండు రోజులు.. అలా వారం అయింది. అయినా క్లైమాక్స్‌ మాత్రం తనకు నచ్చినట్లు రావడం లేదు. వారం తర్వాత మళ్లీ వెళ్లి పవన్‌ను కలిశారు. “ఏమైంది క్లైమాక్స్‌ మార్చావా” అని పవన్‌ అడిగారు. “ప్రయత్నించాను. కానీ, కొత్త వెర్షన్‌ నాకే నచ్చలేదు” అని పూరి సమాధానం ఇచ్చారు. “నా గురించి నువ్వు క్లైమాక్స్‌ మారుస్తావా? లేదా చూద్దామని అలా అడిగాను. ఇదే బాగుంది” అని పవన్‌ అన్నారు. అలాగే “అన్నట్లు ఛోటాకు ఈ కథ కాదు కదా నువ్వు చెప్పింది. ఇప్పుడు నువ్వు చెప్పిన కథ పూర్తి భిన్నంగా ఉంది” అంటూ ప్రశ్నించడంతో “అవకాశం పోతుందని ఆయనకు ఆ కథ చెప్పా” అని పూరి నిజం చెప్పేశారు.

ఈ సినిమాలో పవన్‌, అమీషా పటేల్‌, రేణు దేశాయ్‌, ప్రకాష్‌రాజ్‌... పాత్రలే కీలకం. బద్రిగా పవన్‌ నటన, స్టైల్‌, ఫైట్స్‌ అన్నీ మెప్పిస్తాయి. ముఖ్యంగా ప్రకాష్‌రాజ్‌ తన ఆఫీస్‌కు వచ్చి వార్నింగ్‌ ఇచ్చే సన్నివేశంలో తిరిగి పవన్‌ చెప్పే ‘బద్రి.. బద్రీనాథ్‌’ అనే డైలాగ్‌ ఎవర్‌గ్రీన్‌. ఇక కథానాయికలుగా అమీషా పటేల్‌, రేణుదేశాయ్‌ నటించారు. అమీషా పటేల్‌కు ఇదే తొలి తెలుగు చిత్రం. ఇక ఈ చిత్రంతోనే పరిచయమైన రేణు దేశాయ్‌ను ఆ తర్వాత పవన్‌ వివాహం చేసుకున్నారు. తొలి సినిమాతోనే దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు పూరి జగన్నాథ్‌. పవన్‌ను చూపించిన విధానం అభిమానులకు బాగా నచ్చింది. పవన్‌ నటించిన ‘తమ్ముడు’ చిత్రానికి పని చేసిన రమణ గోగుల గారినే ‘బద్రి’ సినిమాకు కూడా సంగీత దర్శకుడిగా తీసుకున్నారు. ఆయన ఇచ్చిన పాటలు యువతను ఓ ఊపు ఊపేశాయి. ‘బంగాళాఖాతంలో నీరంటే నువ్వేలే…’, ‘ఏయ్‌ చికిత… కొమస్తాస్‌’ తదితర పాటలు విశేషంగా ఆకట్టుకున్నాయి. వాటిని తెరకెక్కించిన విధానమూ కొత్తగా ఉంటుంది. ఇక ఈ చిత్రం 85 సెంటర్లలో 50 రోజులు, 47 సెంటర్లలో 100 రోజులు విజయవంతంగా ఆడింది. ఈ చిత్రంతో తెరకు కొత్త పవన్ ను పరిచయం చేసాడు పూరి.

ఇక పవన్ కళ్యాణ్ ఖుషి సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ సినిమా టాలీవుడ్ బాక్సాఫీస్‌ని షేక్ చేసింది. అప్పటి వరకూ ఆయ‌న కెరీర్‌లోనే అత్య‌ధిక వ‌సూళ్లు క‌లెక్ట్ చేసిన చిత్రంగా నిలిచింది. అప్ప‌ట్లోనే దాదాపు రూ. 20 కోట్లకు పైగా వసూలు చేసి బాక్స్ ఆఫీస్ దగ్గర కొత్త రికార్డుని సృష్టించింది. ఏప్రిల్ 27, 2001న విడుద‌లైన ఖుషి చిత్రంలో పవన్ వన్ మ్యాన్ షో ఈ చిత్రాన్ని మరో లెవల్‌కి తీసుకెళ్ళింది. పవన్ ఎక్స్‌ట్రార్డినరీ పర్ఫార్మెన్స్, మణిశర్మ మ్యూజికల్ మ్యాజిక్, పి.సి.శ్రీరామ్ ఫోటోగ్రఫీ సినిమాకి ప్లస్ అయ్యాయి. భూమిక నటనకు మంచి మార్కులు పడ్డాయి. విడుదలైన అన్ని సెంటర్స్‌ లోనూ అత్యధిక రోజులు ఆడింది ఖుషి.

శివాజీ, అలీ, సుధాకర్, విజయ్ కుమార్ తదితరులు నటించగా, దర్శకుడు ఎస్.జె.సూర్య గెస్ట్ అప్పీరెన్స్ ఇచ్చాడు. ముంతాజ్ ఐటమ్ సాంగ్‌తో అలరించింది. ఖుషిలో అన్ని పాటలూ చాలా బాగుంటాయి. ‘ఏ మేరా జహా’, ‘అమ్మాయే సన్నగా’, ‘ఆడువారి మాటలకు అర్థాలే వేరులే’, ‘ప్రేమంటే సులువు కాదురా’, ‘చెలియ చెలియా’, ‘గజ్జె ఘల్లుమన్నాదిరో’ సాంగ్స్ అన్నీ సూపర్ హిట్ అయ్యాయి. పవన్ కళ్యాణ్ కెరీర్‌లో వన్ ఆఫ్ ది బెస్ట్ ఫిలింగా నిలిచిపోతుంది ఖుషి. ఈ చిత్రంలో ప‌వన్ తన డ్రెస్సింగ్ స్టైల్‌తో అప్పట్లో ఒక ట్రెండ్ క్రియేట్ చేసారు. అందులో ఆయ‌న ధ‌రించిన బ్యాగ్ మ‌రింత స్పెష‌ల్ అట్రాక్ష‌న్. సిద్దు అనే పాత్ర‌లో ప‌వ‌న్‌, మ‌ధు అనే పాత్ర‌లో భూమిక వీరిద్ద‌రి మ‌ధ్య సాగిన ప్రేమాయ‌ణంని అనేక మ‌లుపులు తిప్పుతూ వెండితెర‌పై ద‌ర్శ‌కుడు ఎస్‌.జె సూర్య చ‌క్క‌గా చూపించారు. బై బై యే బంగారు రమణమ్మ, రంగబోతి ఓ రంగబోతి వంటి జానపద గీతాలను ఈ చిత్రంలో పవన్ స్వయంగా ఆలపించటం విశేషం. ఈ చిత్రానికి కాస్ట్యూమ్స్ రేణు దేశాయ్ రూపొందించింది. యువ‌త‌ని ఎంత‌గానో ఆక‌ట్టుకున్న‌ ఖుషి చిత్రం ఇప్ప‌టికీ ఎవర్‌గ్రీన్.

వరుసగా 7 విజయాలు ఆయనకు విపరీతమైన క్రేజ్ ని తెచ్చిపెట్టాయి. అప్పట్లో మెగాస్టార్ తో సమానంగా ఫాలోయింగ్ ని సంపాదించుకున్నారు ఆయన. అప్పటి వరకు ఫ్లాప్ అంటూ ఎరుగని పవన్ కళ్యాణ్ విజయ పరంపరకు ‘జానీ’ సినిమా బ్రేక్ వేసింది. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై పవర్‌స్టార్ పవన్ కల్యాణ్‌తో రూపొందించిన ఈ చిత్రం. భారీ అంచనాలతో రిలీజై బాక్సాఫీస్‌ దగ్గర ఫ్లాప్ గా నిలిచింది. కానీ ఈ సినిమాకి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. పవన్ కల్యాణ్‌ స్వయంగా దర్శకత్వం వహించి నటించిన చిత్రం ‘జానీ’ కావడం విశేషం. ఈ సినిమాకు రచయితగా కూడా పవన్ కల్యాణ్ వ్యవహరించారు. ఈ చిత్రంలో పవన్ కల్యాణ్ కిక్ బాక్సర్‌గా నటించిన విషయం తెలిసిందే. క్యాన్సర్ బారిన పడిన భార్యను రక్షించుకొనేందుకు భర్త పడిన కష్టాలు, ప్రొఫెషనల్‌ కిక్ బాక్సర్‌గా ఆయన అభినయం సినిమాలో హైలెట్‌గా చెప్పుకోవచ్చు. జానీ చిత్రం రిలీజ్‌కు ముందు పలు రికార్డు క్రియేట్ చేసింది. టాలీవుడ్‌లో అత్యధిక ప్రీరిలీజ్ బిజినెస్‌ను కూడా ‘జానీ’ చేయడం విశేషం. సుమారు 24 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ చేయడం అప్పట్లో పెద్ద రికార్డ్. మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘ఇంద్ర’ సినిమా కంటే ‘జానీ’ చిత్రం ఎక్కువగా ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. అంతేకాకుండా ప్రపంచవ్యాప్తంగా 250 ప్రింట్లతో రిలీజైన తొలి టాలీవుడ్ మూవీగా ఓ రికార్డును సొంతం చేసుకొన్నది. అలాగే ఈ చిత్రానికి డైలాగ్స్ లైవ్ లో రికార్డ్ చేసారు. అప్పట్లో జానీ చిత్రంలో హైలెట్‌గా చెప్పుకోవాల్సిన విషయాల్లో రమణ గోగుల అందించిన సంగీతం. ఈ చిత్రానికి సంబంధించిన మ్యూజిక్ ఆల్బమ్ అత్యధిక అమ్మకాలతో ట్రెండ్ సృష్టించింది. లెట్స్ గో జానీ, నారాజ్ గాకురా అన్నయ్య, ఈ రేయి తియనిది, నువ్వు సారా తాగుతా, రావోయి మా కంట్రీకి లాంటి పాటలు ప్రేక్షకులకు కిక్కెక్కించాయి.

6 లక్షలకు పైగా ఆడియో క్యాసెట్లు అమ్ముడుపోవడం అప్పట్లో ఓ రికార్డు. ఏ చిత్రానికి రానటువంటి క్రేజ్ ‘జానీ’ సినిమాకు రిలీజ్‌కు ముందు వచ్చింది. ఈ సినిమా ఫ్లాప్ అయినప్పటికీ జానీ చిత్రం ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో స్క్రీనింగ్ కావడం విశేషం.

2004 లో వీరశంకర్ దర్శకత్వంలో వచ్చిన సినిమా గుడుంబా శంకర్. ఇందులో పవన్ కళ్యాణ్ కి జోడిగా మీరా జాస్మిన్ నటించింది. ఈ చిత్రాన్ని నాగేంద్రబాబు అంజనా ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మించాడు. మన్యం రమేష్ ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా వ్యవహరించాడు. మణిశర్మ సంగీత దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో పాటలు అన్ని మంచి మ్యూజికల్ హిట్స్. ఈ సినిమా యావరేజ్ హిట్ గా నిలిచింది.

‘తొలిప్రేమ’తో పవన్ కళ్యాణ్ కి సూపర్ హిట్ అందించిన కరుణాకరన్ కాంబినేషన్ లో వచ్చిన రెండో సినిమా ‘బాలు’. ఈ సినిమా ఫలితం విషయం పక్కన పెడితే ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ వేసుకున్న లక్ష రూపాయల ప్యాంట్ కి ఎక్కువ క్రేజ్ వచ్చింది. విడుదలకి ముందు ఈ ప్యాంట్ తొనే ప్రమోషన్స్ చేశారు మూవీ టీం. పవన్ కు జోడిగా శ్రియ, నేహ ఓబెరాయ్ నటించగా, సీనియర్ నటులు జయసుధ, సుమన్ లు ముఖ్య పాత్రలు పోషించారు. ఈ సినిమాలో మంచి పాటలు, ఫైట్స్ ఉన్నప్పటికీ ఎందుకో అంత రేంజ్ లో సినిమా హిట్ కాలేదు. ఆ తర్వాత వచ్చిన బంగారం, అన్నవరం సినిమాలది కూడా ఇదే పరిస్థితి.

ఇక వరస ఫ్లాపుల్లో ఉన్న పవన్ కళ్యాణ్ కి మంచి హిట్ జల్సా సినిమాతో వచ్చింది. ఈ సినిమా భారీ అంచనాల మధ్య విడుదలైంది. అప్పటికే పాటలు అదిరిపోయే హిట్.. దేవీ శ్రీ ప్రసాద్ అందించిన పాటలు, ఎక్కడ విన్నా అవే. పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ కెరీర్‌లో బెస్ట్ మ్యూజికల్ ఆల్బమ్ జల్సా. ఖుషీ తర్వాత ఏడేళ్ల పాటు వేచి చూసిన పవన్ అభిమానులకు మాత్రం జల్సా మంచి సంతృప్తి ఇచ్చింది. ఈ సినిమా కమర్షియల్‌గా సూపర్ హిట్ అయింది. 2008లోనే 33 కోట్లకు పైగా షేర్ వసూలు చేసింది జల్సా. పవన్, త్రివిక్రమ్ కాంబినేషన్‌కు బీజం వేసింది ఈ చిత్రం. మహేష్ బాబు వాయిస్ ఓవర్ మరో బలం. సినిమాలో పవన్ నక్సలిజం ఫ్లాష్‌ బ్యాక్‌ కూడా అదనపు ఆకర్షణ. అయితే సినిమా ఎలా ఉన్నా కూడా ప్రతీ సీన్‌లోనూ త్రివిక్రమ్‌ తన మ్యాజిక్‌ చూపించాడు. మాటలతో మాయ చేసాడు.

ముఖ్యంగా ముఖేష్ రిషి చెప్పే డబ్బు నాకు అవసరం... ఇష్టం కాదబ్బ అనే డైలాగ్, మాఫియ బ్యాక్ గ్రౌండ్ ఉన్న లాలా అనే అతన్ని పారిపోయేలా చేసే సీన్ చూసేటప్పుడు టెరిఫిక్ గా అనిపిస్తాయి. ప్రతీ సీన్లో ముఖేష్ రిషి నటన అద్భుతం. పొట్ట చెక్కలయ్యేలా నవించే కామెడీతో పాటు ఆలోచింపజేసే మాటలు, డైలాగ్‌లకు జల్సా కేరాఫ్‌ అడ్రస్‌. విలన్‌ను రక్తపు చుక్క రాకుండా ఒక్కసారి కూడా ఆయన్ని కొట్టకుండా అంతమొందించే క్లైమాక్స్ కూడా చాలా బాగుంటుంది. యుద్ధంలో గెలవడం అంటే శత్రువును ఓడించడమే కానీ చంపడం కాదంటూ త్రివిక్రమ్ చెప్పిన ఫిలాసఫీ కూడా బాగా వర్కవుట్ అయింది. అన్నీ కలిపి అప్పటి వరకు తెలుగు సినిమాలో ఉన్న కమర్షియల్ రికార్డుల్లో చాలా వరకు జల్సా బద్దలు కొట్టింది.

జల్సాతో పవన్ తిరిగి తన జైత్రయాత్ర కొనసాగిస్తారని అందరూ అనుకున్నారు కానీ భారీ అంచనాలతో విడుదలైన కొమరం పులి, తీన్మార్, సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. కాకపోతే పంజా సినిమాలో మాత్రం పవన్ కళ్యాణ్ లుక్ కి విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా టీజర్ అప్పట్లో యూట్యూబ్ రికార్డ్స్ కొట్టడం విశేషం. భారీ అంచనాలతో విడుదలైన ఈ సినిమా యావరేజ్ హిట్ గా నిలిచింది.

మళ్ళీ వరసగా ఫ్లాప్స్ రావడంతో డీలా పడిన పవన్ కళ్యాణ్ అభిమానులకు గబ్బర్ సింగ్ సినిమా తిరిగి ఎనర్జీ ఇచ్చేలా చేసింది. మే 11, 2012న విడుదలైంది గబ్బర్ సింగ్. కంటెంట్ ఉన్నోడికి కటౌట్ చాలు.. మార్కెట్‌లో అతడి ఫాలోయింగ్ చూస్తే మెంటల్ వచ్చేస్తుంది లాంటి డైలాగ్స్ పవన్ కోసమే అన్నట్లుగా సరిపోయాయి. ఆ సినిమా విడుదలైనపుడు అందరూ సైడ్ ఇచ్చారు.. ఎక్కడ విన్నా గబ్బర్ సింగ్ గురించే టాపిక్. సినిమాలో పవన్ పేల్చిన బుల్లెట్స్‌ కు.. వచ్చిన కలెక్షన్స్‌ కు లెక్కే లేకుండా పోయింది. అప్ప‌ట్లోనే ఈ చిత్రం 69 కోట్ల షేర్ వ‌సూలు చేసింది. ప‌వ‌న్ ఇమేజ్‌తో పాటు హ‌రీష్ శంక‌ర్ టేకింగ్.. అంత్యాక్ష‌రి ఎపిసోడ్.. క‌బ‌డ్డి ఎపిసోడ్.. దేవీ శ్రీ ప్ర‌సాద్ పాట‌లు అన్నీ వర్కవుట్ అయ్యాయి. అప్ప‌టి వ‌ర‌కు వ‌ర‌స ప్లాపుల్లో ఉన్న ప‌వ‌న్ క‌ళ్యాణ్.. ఈ చిత్రంతో బాక్సాఫీస్‌పైకి త‌న పంజా విసిరాడు. గ‌బ్బ‌ర్ సింగ్ త‌ర్వాత ప‌వ‌న్ మార్కెట్ మ‌ళ్లీ పెరిగిపోయింది. ఆ సినిమాతో చాలా రోజుల తర్వాత కడుపులు చెక్కలయ్యేలా నవ్వించాడు కూడా.

గబ్బర్ సింగ్ సరికొత్త ట్రెండ్‌కే తెరతీసింది. నిర్మాత బండ్ల గ‌ణేష్ కూడా ఈ చిత్రంతో బ్లాక్‌బ‌స్ట‌ర్ గ‌ణేష్ అయిపోయాడు. దబాంగ్ సినిమా రీమేక్‌గా గబ్బర్ సింగ్‌ను మలిచారు. తెలుగు నేటివిటికి తగినట్టుగా కథ, కథనాలు మార్చి.. డైలాగ్స్‌ ను తూటాల్లా పేల్చారు. పాటలు కూడా ప్రేక్షకులను విశేషంగా ఆకర్షించడంతో గబ్బర్ సింగ్ బ్లాక్ బస్టర్ టాక్‌ను సొంతం చేసుకొన్నది. 2012లో ఇది బాక్సాఫీస్ వద్ద అత్యధిక వసూళ్లను సాధించిన చిత్రంగా నిలిచింది. నిర్మాత బండ్ల గణేష్ తన సొంత బ్యానర్ పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్‌ పై రూ.30 కోట్ల బడ్జెట్‌తో రూపొందించారు. ఇక అదే సంవత్సరం బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీ ‘బ‌ద్రి’(2000) త‌రువాత పూరీ జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో ప‌వ‌న్ న‌టించిన చిత్రం కెమెరామెన్ గంగతో రాంబాబు.  కెమెరామెన్ `గంగ‌` పాత్ర‌ను తమన్నా పోషించింది. గాబ్రియాలా బెర్టాంటే, కోట శ్రీనివాసరావు, ప్రకాష్ రాజ్, నాజర్, సూర్య, బ్రహ్మానందం, అలీ, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, ఎం.ఎస్.నారాయణ, తనికెళ్ళ భరణి, శ్రుతి తదితరులు ఇతర ముఖ్య‌ పాత్రలు పోషించారు. ఈ సినిమాకి తెలంగాణ రాష్టంలో చాలా గొడవలు జరిగాయి. తెలుగు తల్లిని అవమానించారని గొడవలు జరిగాయి కానీ అవి లేకుండా ఉంటే ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచేది.

`ఇక 2013 లో విడుదలైన ‘అత్తారింటికి దారేది’ సినిమాకి పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కెరీర్లో ప్రత్యేక స్థానం ఉంది. సగం సినిమా ల్యాబ్ నుంచే లీకైపోయిన పరిస్థితుల్లో రిలీజై కూడా ఇండస్ట్రీ హిట్ సాధించింది. లీకులు చాలా సినిమాలకు జరిగాయి కానీ.. ఏ సినిమాకు కూడా ఈ స్థాయి విజయం మాత్రం సాధ్యం కాలేదు. అంతా.. పవన్ కల్యాణ్ కు ఉన్న క్రేజ్ కారణమని చెప్పాల్సిందే. పవన్ సినిమా లీకైంది అనే మాటే.. సినిమాపై క్రేజ్ పెంచేసింది. అసలే అంచనాలు ఉన్న సినిమాకు లీకైన సగం సినిమా అప్పటికే కిక్ ఇచ్చేసింది. ఈ పరిస్థితుల్లో విడుదలైన ‘అత్తారింటికి దారేది’ సంచలనాలు నమోదు చేసింది. ఈ సినిమా విడుదలయ్యే సమయానికి తెలంగాణ ప్రాంతంలో ప్రత్యేక రాష్ట్రం కోసం, ఆంధ్ర ప్రాంతంలో సమైక్యాంధ్రప్రదేశ్ కోసం జరుగుతున్న ఉద్యమాలతో రెండు ప్రాంతాల్లో పరిస్థితులు ఉద్రిక్తంగా ఉన్నాయి. ‘అత్తారింటికి దారేది’ ఎప్పుడు విడుదలవుతుందో తెలీని పరిస్థితి. సెప్టెంబర్ 24న ఎడిటింగ్ రూమ్ నుంచే సినిమా బయటకు వచ్చేసింది. ఆందోళనతోనే సెప్టెంబర్ 27న సినిమా విడుదల అని ప్రకటించేశారు నిర్మాత భోగవల్లి ప్రసాద్. కానీ.. నిర్మాత, దర్శకుడు త్రివిక్రమ్, హీరో పవన్ లో ఆందోళనలో ఉన్నారు. ఈ పరిస్థితుల్లో సెప్టెంబర్ 27న షోలు పడిపోయాయి. పవన్ ఫ్యాన్స్ హంగామా షరా మామూలే. ఆందోళన, ఆనందం కలగలిపిన భావోద్వేగాలతో సినిమా చూసిన ఫ్యాన్స్ కు దిమ్మ తిరిగిపోయింది. సినిమా అద్భుతంగా ఉండటంతో సూపర్ హిట్ టాక్ వచ్చేసింది. అక్కడ మొదలైన ప్రభంజనం ఏకంగా ఇండస్ట్రీ హిట్ వరకూ వెళ్లిపోయింది. 2009లో మగధీర సృష్టించిన రికార్డులను తుడిచిపెట్టేసి, దాని తర్వాత 100 కోట్ల మైలురాయి అందుకున్న సినిమాగా నిలిచింది.

ఇక వెంకటేష్, పవన్ కళ్యాణ్ కలిసి నటించిన గోపాల గోపాల సినిమా చాలా మంచి విజయం సాధించింది. ఈ సినిమా సురేష్ ప్రొడక్షన్స్, నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్స్ ప్రెవేట్ లిమిటెడ్ బ్యానర్ల పై దగ్గుబాటి సురేష్ బాబు, శరత్ మరార్ సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమాకి కిషొర్ కుమార్ పార్ధసాని (డాలి) దర్శకుడు. ఇతర పాత్రల్లో శ్రియ శరణ్, మిథున్ చక్రవర్తి, కృష్ణుడు, ఆశిష్ విద్యార్థి, మురళీ శర్మ, పోసాని కృష్ణ మురళి నటించారు. ఈ చిత్రం 2012 లో విడుదల అయిన హిందీ చిత్రం ఓహ్ మై గాడ్! (OMG) కి రీమేక్ గా తెరకెక్కింది. 2015 జనవరి 10 న సంక్రాంతి కనుకగా ప్రపంచవ్యాప్తంగా ‘గోపాల గోపాల’ విడుదలైంది. విడుదలైన మొదటి నుంచి మంచి కలెక్షన్స్ తో దూసుకెళ్లింది. దేవుడి పేరుతో జనాన్ని మోసం చేసే వారిని విమర్శిస్తూ తీసిన ఈ చిత్రం ప్రేక్షకాదరణతో పాటు విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది.

2012లో విడుదలైన గబ్బర్ సింగ్ చిత్రానికి సీక్వెల్ గా వచ్చిన ‘సర్దార్ గబ్బర్ సింగ్’ తెలుగు, హిందీ లో కూడా విడుదల చేసారు. ఈ సినిమాకి పవన్ కళ్యాణ్ సహ నిర్మాతగా కూడా వ్యవహరించాడు. భారీ అంచనాలతో విడుదలైన ఈ సినిమా పరాజయం పాలైంది.

ఇక 2017లో వచ్చిన ‘కాటమరాయుడు’ మూవీ  తమిళంలో అజిత్ హీరోగా నటించిన సూపర్ హిట్ ‘వీరం’ సినిమాకు రీమేక్. ఈ సినిమా మంచి కలెక్షన్స్ సంపాదించిన కూడా అంత విజయం సాధించలేకపోయింది.

ఇక్ పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో వచ్చిన మూడవ చిత్రం ‘అజ్ఞాతవాసి’. ఈ సినిమా సంక్రాంతి పండుగకు విడుదలై ప్లాప్ గా నిలిచింది. ఈ సినిమాతో పవన్ కళ్యాణ్ సినిమాలకి గాప్ ఇచ్చారు.

ఇక ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హిందీ పింక్ సినిమా రీమేక్ వకీల్ సాబ్ సినిమాలో, మలయాళ చిత్రం ఏ.కె రీమేక్ లతో పాటుగా క్రిష్ దర్శకత్వంలో ఒక సినిమాలో నటిస్తున్నారు.

రాజకీయ జీవితం

పవన్ కళ్యాణ్ 2009 అసెంబ్లీ ఎన్నికల ముందు అన్న చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీకి భారీ ఎత్తున ప్రచారం చేశాడు. అయితే ప్రజారాజ్యం పార్టీ ఓడిపోవడం ఆ తర్వాత కాంగ్రెస్ లో కలపడం లాంటివి జరిగి ఆయన రాజకీయాలకి బ్రేక్ తీసుకున్నారు. ఇక అత్తరింటికి దారేది సినిమాతో టాలీవుడ్ లో సంచలనం సృష్టించిన పవన్ కళ్యాణ్ గారు అప్పటికే టాప్ హీరోగా కొనసాగుతున్నారు. ఆ టైం లోనే ఆయన రాజకీయాల్లోకి వచ్చారు. 2014 మార్చి 14 న జనసేన రాజకీయ పార్టీ ఆవిర్భావ సభలో పవన్ మాట్లాడిన మాటలు తెలుగునాట రాజకీయాల్లో అలజడి సృష్టించాయి. కుల, మత, ప్రాంతీయ పక్షపాతాలు లేకుండా భారతీయునిగా జాతి సమైక్యతకు సమగ్రతకు పాటుపడడానికి పార్టీ స్థాపించినట్లు పవర్‌స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ తెలిపాడు. రాష్ట్రాన్ని విభజించినతీరుకు కాంగ్రెస్ ను దోషిగా నిందిస్తూ, కాంగ్రెస్ ఎన్నికలలో గెలవకుండా పోరాడాలని తన అభిమానులకు పిలుపునిచ్చాడు. జనసేనపార్టీతో రాజకీయాల్లోకి వచ్చిన పవన్‌ కల్యాణ్ 2014 సాధారణ ఎన్నికల్లో మోడీకి మద్దతు పలికాడు. తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో మోడీకి మద్దతుగా టీడీపీ-బీజేపీ కూటమికి ప్రచారం చేశాడు. కాంగ్రెస్ హటావ్- దేశ్ బచావ్ అన్న ఆయన నినాదాన్ని అందుకున్న అభిమానులు, ప్రజలు ఏపీలో ఒక్కసీటుకూడా కాంగ్రెసుకు దక్కనివ్వలేదు. ఈ సమయంలో గూగుల్లో అత్యంత ఎక్కువ శోధించబదడిన రాజకీయవేత్తగా పవన్ నిలిచాడు. ప్రజానాయకుడిగా ఉద్దానం, డ్రెడ్జింగ్ కార్పోరేషన్ ప్రైవేటీకరణ వంటి ఎన్నో సమస్యల పరిష్కారం కోసం ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాడాడు. 2019 లో జరిగిన ఎన్నికలలో జనసేన పార్టీని పోటీకి నిలిపాడు. తాను స్వయంగా భీమవరం, గాజువాకలలో రెండు చోట్ల పోటీ చేసాడు. ఈ ఎన్నికలలో తాను రెండు స్థానాలలోనూ పరాజయం పాలవ్వగా జనసేన పార్టీ కేవలం ఒక్క స్థానంలో గెలుపొందగలిగింది. తెలంగాణాలోనూ పోటీ చేసిన అన్ని స్థానాలలోనూ పార్టీ అభ్యర్థులు ఓడిపోయారు.

వ్యక్తిగత జీవితం

పవన్ కళ్యాణ్ మొదటి వివాహం 1997లో నందినితో జరిగింది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ ఆమె దగ్గర్నుంచి విడాకులు కోరాడు. తాత్కాలిక భరణంగా నెలకు ఐదు లక్షలు ఇప్పించాలన్న ఆమె దాఖలు చేసిన పిటిషన్ను కూడా కోర్టు కొట్టివేయగా, ఈ తీర్పుపై కూడా నందిని ఉన్నత న్యాయస్థానం నుండి స్టే పొందింది. ఐదు కోట్ల రూపాయలకు రాజీ కుదరగా నందిని అన్ని కేసులను ఉపసంహరించుకొన్నట్లుగా తెలుస్తుంది. 2008 ఆగస్టు 12లో విశాఖపట్నం లోని ఫ్యామిలీ కోర్టు వీరిద్దరకి విడాకులు మంజూరు చేసింది.

ఆ తర్వాత నటి రేణు దేశాయ్ తో బద్రి సినిమా నుంచి ప్రేమలో ఉన్నారు. ఈ సినిమా తర్వాత వారు ఇద్దరు జానీ సినిమాలో కూడా నటించారు. 2009 జనవరి 28 న రేణు దేశాయ్ ని పవన్ కళ్యాణ్ వివాహం చేసుకున్నాడు. వీరికి కలిగిన కుమారుని పేరు అకీరా నందన్. ప్రఖ్యాత జపనీస్ దర్శకుడు అకీరా కురొసావాపై అభిమానంతో వారు తమ కొడుకు ఆ పేరు పెట్టుకున్నారు. అలాగే వారికి కూతురు ఆద్య కూడా ఉంది. 2012లో రేణు దేశాయ్ తో విడాకులు తీసుకొన్నారు.

ఆ తర్వాత 2013 సెప్టెంబరు 30న రష్యా నటి అన్నా లెజ్‌నేవాను వివాహం చేస్కున్నారు. వీరి ఇద్దరు కలిసి తీన్మార్ సినిమాలో నటించారు. హైదరాబాదలోని ఎర్రగడ్డ సబ్ రిజిస్టార్ కార్యాలయంలో వీరిద్దరి వివాహం జరిగింది. వీరికి కలిగిన కుమారుని పేరు మార్క్ శంకర్ పవనోవిచ్.

పవన్ కళ్యాణ్ అన్న మెగాస్టార్ చిరంజీవి గారి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన చిన్నన్న నాగేంద్ర బాబు టీవీ హోస్ట్ గా చాలా బిజీగా ఉన్నారు. అలాగే ఆయన అన్న కొడుకు రామ్ చరణ్ తో పవన్ కళ్యాణ్ కి ప్రత్యేకమైన అనుబంధం ఉంది. రామ్ చరణ్ ని తన చిన్న తమ్ముడుగా పవన్ కళ్యాణ్ ‘రంగస్థలం’ సినిమా ఫంక్షన్ లో అన్నారు. అలాగే తన అక్క కొడుకు సాయి ధరమ్ తేజ్, నాగేంద్ర బాబు గారి కొడుకు వరుణ్ తేజ్ లతో కూడా పవన్ కళ్యాణ్ కి మంచి అనుబంధం ఉంది. పవన్ కళ్యాణ్ సినిమాల్లో, రాజకీయాల్లో ఎంత బిజీగా ఉన్నా కూడా తన పిల్లలకి మాత్రం ఎప్పుడూ సమయం కేటాయిస్తారు.

రేణు దేశాయ్ తో విడాకులు అయినప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ తన పిల్లలకి ఎప్పుడు దూరం కాలేదు. సమయం దొరికినప్పుడల్లా ఆయన వాళ్ళతోనే ఉంటారు. ఇక పవన్ కళ్యాణ్ కి కొత్త భాషలను నేర్చుకోవడంలో చాలా ఆసక్తి ఉంది. ఆయనకి తెలుగు, హిందీ, తమిళంతో పాటు బెంగాలీ, రష్యన్ భాషలు కూడా పవన్ కళ్యాణ్ కి రావడం విశేషం. ఇక పవన్ కళ్యాణ్ తన కెరియర్ మొదట్లో పెప్సీ కంపెనీ యాడ్స్ లో చేసినా తర్వాత మాత్రం వేరే యాడ్స్ లో చేయలేదు. అలాగే పవన్ కళ్యాణ్ ఒక నటుడుగానే కాకుండా స్టోరీ రైటర్ గా ఫైట్ మాస్టర్ గా, డైరెక్టర్ గా కూడా చేయడం విశేషం.

అవార్డ్స్

2012 లో వచ్చిన గబ్బర్ సింగ్ సినిమాకి గాను పవన్ కళ్యాణ్ కి ఉత్తమ నటుడుగా ఫిలింఫేర్ అవార్డ్ వచ్చింది. అలాగే పవన్ కళ్యాణ్ నవంబరు 2017 లో ఇండో-యూరపియన్ బిజినెస్ ఫోరమ్ నుండి గ్లోబల్ ఎక్సెలెన్స్ పురస్కారం అందుకొన్నాడు. నటుడిగా, రాజకీయవేత్తగా, సామాజిక సేవకుడిగా ఆయనను గుర్తించి ఈ అవార్డు ఇచ్చారు.

- Advertisement -

You might also like

You've successfully subscribed to Tollywood Latest News | Celebrities Profiles | Media9 Tollywood
Great! Next, complete checkout to get full access to all premium content.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.