వరస ఫ్లాపులతో సతమతమైన అల్లరి నరేష్ గతేడాది సూపర్ స్టార్ మహేష్ బాబు చిత్రం మహర్షిలో కీలక పాత్రలో కనిపించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత తన పంథా మార్చి కామెడీ చిత్రాల నుండి కొంత దూరంగా జరిగి చేసిన చిత్రం ‘నాంది’. ఒక రియలిస్టిక్ అటెంప్ట్ తో అల్లరి నరేష్ చేస్తోన్న ఈ చిత్రాన్ని నూతన దర్శకుడు విజయ్ కనకమేడల తెరకెక్కిస్తున్నాడు. శతమానం భవతి వంటి చిత్రానికి దర్శకత్వం వహించిన సతీష్ వేగేశ్న నిర్మిస్తున్నాడు. టీజర్ తోనే ఆసక్తి రేకెత్తించిన ఈ చిత్రం ఇప్పుడు మరో కాన్సెప్ట్ వీడియోను విడుదల చేసారు. బ్రీత్ ఆఫ్ నాంది పేరుతో విడుదల చేసిన ఈ టీజర్ అల్లరి నరేష్ వాయిస్ ఓవర్ తో సాగింది. "15 లక్షల మంది ప్రాణత్యాగం చేసుకుంటే కానీ మన దేశానికి స్వతంత్రం రాలేదు. 1300 మంది బలిదానం చేసుకుంటే కానీ ఒక కొత్త రాష్ట్రం ఏర్పడలేదు. ప్రాణం పోకుండా న్యాయం జరిగిన సందర్భం చరిత్రలో ఒక్కటి కూడా లేదు. న్యాయం గెలవాలి. న్యాయమే గెలవాలి" అంటూ నరేష్ చెప్పిన డైలాగ్ ఎఫెక్టివ్ గా ఉంది. త్వరలోనే విడుదల కానున్న ఈ ఇంటెన్స్ చిత్రంతో నరేష్ ఎంతవరకూ సక్సెస్ అవుతాడో చూడాలి.