యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్

ఎన్.టి.రామారావు గారి వారసత్వంతో తెలుగు పరిశ్రమలోకి అడుగుపెట్టిన జూనియర్ ఎన్టీఆర్. తన నటనతో, డ్యాన్సులతో తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకున్నాడు. సౌత్ ఇండియా హీరోల్లో డ్యాన్స్ మాట వస్తే మొదటగా ఎన్టీఆర్ పేరే గుర్తొస్తుంది. తన 19 సంవత్సరాల వయసులోనే టాలీవుడ్ రికార్డ్స్ బద్దలు కొట్టి సంచలనం సృష్టించిన ఎన్టీఆర్ ఇప్పటికీ అలాగే తన సినిమాలతో మాస్, క్లాస్ ఆడియెన్స్ ని అలరిస్తున్నాడు.

జననం

జూనియర్ ఎన్టీఆర్ మే 20, 1983 న నందమూరి హరికృష్ణ, షాలిని దంపతులకు జన్మించారు. ఆయన చిన్న వయసులోనే కూచిపూడి నాట్యం నేర్చుకొని సినిమాల్లోకి ప్రవేశించాడు. తన సన్నిహితులు అందరూ జూనియర్ ఎన్టీఆర్ ని తారక్ అని పిలుస్తారు. ఆయన హైదరాబాదులోని విద్యారణ్య పాఠశాలలో విద్యను పూర్తిచేశాడు. ఆ సమయంలో నట శిక్షకుడు ఎన్.జె. భిక్షు దగ్గర ఎన్టీఆర్ నటనలో మెళకువలు నేర్చుకున్నాడు.

సినీ జీవితం

నందమూరి తారకరామారావు గారి ‘బ్రహ్మర్షి విశ్వామిత్ర’ సినిమాలో బాలనటునిగా తారక్ టాలీవుడ్ కి పరిచయం అయ్యాడు.

ఆ తరువాత 1996 ఏప్రిల్ 14న ‘బాల రామాయణం’ సినిమాలో ఎన్టీఆర్ రాముడిగా నటించారు. గుణశేఖర్ తెరకెక్కించిన ఈ సినిమాకు అద్భుతమైన ప్రేక్షకాదరణ దక్కింది. అంతేకాదు అవార్డులు కూడా వచ్చాయి. ఈ  సినిమాకి జాతీయ అవార్డులు కూడా సొంతం చేసుకున్నాడు దర్శకుడు గుణశేఖర్.  నందమూరి అభిమానులు బుల్లి ఎన్టీఆర్ ను చూసి సంబరపడిపోయారు. రాముడి పాత్రకు తెలుగు ప్రేక్షకుల గుండెల్లో స్థిరపడిపోయిన నటుడు సీనియర్ ఎన్టీఆర్. అయితే ఆయన వారసుడిగా వచ్చి మరోసారి రాముడిగా తెలుగు ప్రేక్షకులను అలరించాడు జూనియర్ ఎన్టీఆర్. గుణశేఖర్ ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాడు. పిల్లలందర్నీ ఎంపిక చేసి.. వాళ్లకు శిక్షణ ఇచ్చి.. వాళ్ల అల్లరిని భరించి సినిమా చేసాడు. స్మితా మాధవ్ సీతగా, స్వాతి బాలినేని రావణుడిగా నటించారు.

ఇక 2001లో నిన్ను చూడాలని సినిమాతో సోలో హీరోగా పరిచయం అయ్యాడు జూనియర్ ఎన్టీఆర్. వి.ఆర్ ప్రతాప్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఫ్లాప్ అయింది. కానీ ఎన్టీఆర్ నటనకి మంచి గుర్తింపు మాత్రం వచ్చింది. ఈ సినిమాను ఉషా కిరణ్ మూవీస్ నిర్మించింది. ఈ సినిమాలో నటించినందుకు గానూ ఎన్టీఆర్‌కు 4 లక్షల రెమ్యూనరేషన్ ఇచ్చాడు నిర్మాత రామోజీ రావు. ఆ డబ్బులని తీసుకెళ్లి తన తల్లి షాలినికి బహుమతిగా ఇచ్చాడు తారక్.

ఎస్. ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన మొదటి సినిమా ‘స్టూడెంట్ నెంబర్ 1’. అనుకోని పరిస్థితుల కారణంగా జైలుపాలైన ఒక యువకుడికి ‘లా’ చేయాలని ఉన్న కోరికను గమనించిన అక్కడి జైలర్(తనికెళ్ళ భరణి) అతన్ని కాలేజికి పంపించి లాయర్ అవడంలో సహాయ పడతాడు. లాయర్ ఐన తర్వాత ఒక తప్పుడు కేసులో చిక్కుకున్న తన తండ్రిని ఎలా విడిపించడన్నదే ఈ చిత్ర కథ. నేను ఎవరినో తెలుసా... హాంతకుడ్ని అని ఎన్టీఆర్ చెప్పే డైలాగ్ కి అప్పట్లో థియేటర్స్ మారుమోగిపోయాయి. జూనియర్ ఎన్టీఆర్ కు తొలి విజయం ఈ చిత్రం. ఈ సినిమా 73 కేంద్రాల్లో 50 రోజులకు ప్రదర్శింపబడింది. అలాగే  42 కేంద్రాల్లో 100 రోజులకు ఆడింది. స్టూడెంట్ నెంబర్.1 సినిమాని అదే పేరుతో తమిళంలో రీమేక్ చేసారు. ఇందులో నటుడు సత్యరాజ్ తనయుడు శిబిరాజ్ హీరోగా నటించారు. ‘మాటే త లవ్ హేలరే’ పేరుతో ఒరియాలో అనుభవ మొహంతి హీరోగా రీమేక్ చేసారు. ఈ సినిమాని 1.85 కోట్లతో నిర్మించగా, 12 కోట్ల రూపాయలు వసూలు చేసి నిర్మాతలకు మంచి లాభాలు తెచ్చి పెట్టింది.

ఆ సినిమా తర్వాత నటించిన సుబ్బు సినిమా అనుకున్నంత విజయం సాధించలేదు.  

స్టూడెంట్ నెం.1 సినిమా అప్పుడు ఎన్టీఆర్ ఆ సినిమా పాటలు వింటున్నాడు. ఎన్టిఆర్ ని కలవడానికి ఇద్దరు వ్యక్తులు వచ్చారు ఒకతను నా దెగ్గర ఒక మంచి కథ ఉంది అని చెప్పడం మొదలుపెట్టాడు ఎన్టీఆర్ కూడా కథ బావుంది ఒక 2 డేస్ లో ఏ విషయం చెప్తాను అని వారిని పంపించేసాడు. ఆ తర్వాత వ్యక్తిగత అభిప్రాయం కొసం అని తన ఆప్తుల్ని అడిగాడు. అది ‘లవ్ స్టోరి’ బావుంది కాని మాస్ సినిమా చేస్తే బెటర్ అని వారి సమాధానం. 2 రోజుల తర్వాత ఆ వ్యక్తి వచ్చాడు. బిజీగా ఉన్నానని చెప్పి పంపించేసాడు. అతను మరుసటి రోజు కూడా వచ్చాడు అలా ప్రతీ రోజూ రావడం వీళ్ళు పంపించేయడం జరుగుతోంది. ఒక రోజు ఆ వ్యక్తి ఎన్టీఆర్ ని పట్టుకుని అడిగేసాడు. ఎన్టీఆర్ కి ఎం చెప్పాలో అర్ధం కాలేదు “మాస్ సినిమా అయితే బాగుంటుంది అనుకుంటున్నాం అని చెప్పి వీలైతే మాస్ కథ ఏదైనా ఉంటే చెప్పండి అంటూ చెప్పాడు”. అలాగే వారంలో వస్తానని ఇంటికి వెళ్ళిపోయాడు ఆ వ్యక్తి. ఇంటికి వెళ్ళి తన స్క్రిప్ట్స్ అన్నీ వెతికాడు తను రాసుకున్న ఒక సీన్ గుర్తొచ్చింది. ఒక పదేళ్ళ పిల్లాడు రౌడీల మీదకు బాంబులు విసిరే సీన్. అది తీసుకుని రాయడం మొదలుపెట్టాడు. మోత్తానికి కథ పూర్తి చేసి ఎన్టీఆర్ దెగ్గరకు వెళ్ళాడు. ముందుగా అతను లవ్ స్టోరీ చెప్పడంతో మాస్ సినిమా తీయగాలడో లేదో అని డౌట్ పడ్డ ఎన్టీఆర్ కథ విని బాలేదు అని చెప్పి పంపేద్దాం అనుకున్నాడు. కథ చెప్పడం మొదలుపెట్టాడు ఆ వ్యక్తి. కాని ఎన్టీఆర్ అనుకున్నట్టు జరగలేదు కథ విని ఈ చిత్రం మనం చేస్తున్నాం అని అతన్ని గట్టిగా హాగ్ చేస్కున్నాడు. ఆ వ్యక్తే ఎన్టీఆర్ ఎంతో ప్రేమగా ‘వినయన్నా’ అని పిలుచుకునే వి.వి. వినాయక్, ఆ కథే సంచలనం సృష్టించిన ‘ఆది’. ఆది సినిమా గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఎన్నో రికార్డులకు తన పేరు మీద తిరగరాసింది ఆ సినిమా. ఫ్యాక్షనిజం బ్యాక్‌డ్రాప్‌లో అప్పటికే చిరంజీవి, బాలయ్య లాంటి హీరోలు సినిమాలు చేసారు.. మళ్లీ అలాంటి నేపథ్యంలో ఓ కొత్త దర్శకుడు.. 19 ఏళ్ల కుర్రాడు కలిసి చేసిన సినిమా ఆది. బెల్లంకొండ సురేష్ నిర్మించిన ఈ చిత్రం విడుదలై అప్పట్లో సంచలన విజయం సాధించింది. 2002, మార్చ్ 28న పెద్దగా అంచనాలు లేకుండా విడుదలైంది ఆది. అప్పటికి స్టూడెంట్ నెం 1 సినిమాతో ఎన్టీఆర్ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. పైగా నందమూరి ఇమేజ్ కూడా ఉంది. ఓ కొత్త దర్శకుడు తెరకెక్కించడంతో ఆది సినిమాపై అంచనాలు మామూలుగానే ఉన్నాయి. ముఖ్యంగా ఈ చిత్రంలో కాలేజ్ ఎపిసోడ్స్‌లో ఎల్బీ శ్రీరామ్ గుడ్ మార్నింగ్ కామెడీ సీక్వెన్స్.. సెకండాఫ్ ఎమ్మెస్ నారాయణ అస్సాం ఎపిసోడ్స్ చాలా బాగా అలరించాయి. ఆది విడుదలైన రోజు టాక్ ఓ సంచలనం. మార్నింగ్ షో నుంచి బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం చూస్తుండగానే 50, 100, 150, 175 రోజుల పండగ చేసుకుంది. ఆది సినిమా ఆ రోజుల్లోనే 106 కేంద్రాల్లో 50 రోజులు.. 96 కేంద్రాల్లో 100 రోజులు, 3 కేంద్రాల్లో డైరెక్టుగా 175 రోజులు ఆడేసింది. 3 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం దాదాపు 19 కోట్లకు పైగా షేర్ వసూలు చేసింది. ఈ సినిమా సృష్టించిన రికార్డులు ఇంకా కొన్ని అలాగే ఉండిపోయాయి. మణిశర్మ పాటలు.. పరుచూరి బ్రదర్స్ డైలాగ్స్.. జూనియర్ ఎన్టీఆర్ డైలాగ్ డెలవరీ.. ఫ్యాక్షనిజం బ్యాక్ డ్రాప్ అన్నీ కలిసి ఆది సినిమాను మరో స్థాయిలో నిలబెట్టాయి. అపట్లో ఎన్నో శీర్షికల్లో ఎన్టీఆర్ ను ఉద్దేశిస్తూ అమ్మ తోడు రికార్డ్లన్నీ అడ్డంగా నరికేసాడు అని ప్రచూరించారు.

ఆది సినిమా సంచలనం తర్వాత ఒక్కసారిగా టాలివుడ్ లో ఎన్టీఆర్ పేరు మారుమోగిపోయింది. విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ వచ్చేసింది. ఆది తర్వాత విడుదలైన చిత్రం ‘అల్లరి రాముడు’. భారి అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం ఫ్లాప్ అయింది. కళా తపస్వి కె. విశ్వనాథ్ గారు, సీనియర్ నతులు నగ్మా, నరేష్ లు ముఖ్య పాత్రలు పోషించగా, ఆర్తి అగర్వాల్ ఎన్టీఆర్ కు జోడిగా నటించింది. ఈ చిత్రంలోని “రెండు వేల రెండు వరకూ” పాట, శ్రోతలను ఆకట్టుకుంది. అందులో ఎన్టీఆర్ అచ్చంగా సీనియర్ ఎన్టీఆర్ కు మల్లె డ్యాన్స్ చెయ్యడం అభిమానులకు బాగా నచ్చింది.

ఆ తర్వాత విడుదలైన ‘నాగ’ చిత్రానికి కూడా ఆశించినంత సక్సెస్ రాలేదు. విలక్షణ నటుడు రఘువరన్, ప్రిథ్వి, నాజర్, పరుచూరి గోపాలకృష్ణ లాంటి నటులు నటించారు. ఈ చిత్రంలోని పాటలు శ్రోతలను ఆకట్టుకున్నాయి.

‘ఆది’ లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత రెండు ఫ్లాప్స్ రావడంతో ఎన్టీఆర్ కొద్దిగా ఆలోచించి నిర్ణయం తీసుకున్నాడు. స్టూడెంట్ నెం.1 తర్వాత అప్పటికీ రాజమౌళి వేరే చిత్రాలను కమిట్ అవ్వలేదు. తదుపరి చిత్రాల కోసం ఎన్టీఆర్ కూడా కథలను వింటున్నాడు. రాజమౌళి తన దెగ్గర ఉన్న కథను ఎన్టీఆర్ కి చెప్పడానికి వెళ్ళాడు. అప్పుడే రాజమౌళితో సినిమా చేస్తే బాగుంటుందని ఎన్టీఆర్ కూడా అనుకున్నాడు. కథ విన్న తర్వాత ఎన్టీఆర్ లో ఫుల్ ఎక్సైట్మెంట్ అలా సింహాద్రి పట్టాలెక్కింది. జులై 9న విడుదలైన ఈ చిత్రం బ్లాక్ బాస్టర్ హిట్‌గా నిలవడంతో పాటు ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసింది. గోదావరి పుష్కరాల ప్రారంభానికి కొద్ది రోజుల ముందు విడుదలైన ఈ సినిమాను చూసేందుకు జనాలు పోటెత్తారు. ఈ చిత్రంతో రాజమౌళి రేంజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఎన్టీఆర్ కెరీర్లోనే బిగెస్ట్ హిట్ గా సింహాద్రి నిలిచింది. 247 స్క్రీన్లలో విడుదలైన ఈ చిత్రం 167 సెంటర్లలో 50 రోజులు పూర్తి చేసుకుంది. 150 సెంటర్లలో 100 రోజులు ఆడింది. 52 సెంటర్లలో 175 రోజులు ఆడి టాలీవుడ్ రికార్డులను తిరగరాసింది. దీన్ని బట్టే ‘సింహాద్రి’ స్టామినా ఏంటో అర్థం చేసుకోవచ్చు. ‘సింగమళై’గా ఎన్టీఆర్ నటనకు తెలుగు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. ముందుగా రాజమౌళి ‘సింహాద్రి’ సినిమాను బాలకృష్ణతో చేయాలనుకున్నారు. కానీ ఎందుకో వర్కౌట్ కాలేదు. దాంతో తన మొదటి హీరో ఎన్టీఆర్‌తో తెరకెక్కించాడు రాజమౌళి. ఎన్టీఆర్ హీరోగా నటించిన ఏడో చిత్రం ‘సింహాద్రి’. ఈ చిత్రంలో తారక్ సరసన భూమిక, అంకిత హీరోయిన్స్‌గా నటించారు.20 ఏళ్ల వయసులోనే భారీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఎన్టీఆర్. ‘సింహాద్రి’ చిత్రాన్ని విజయ మారుతి క్రియేషన్స్ బ్యానర్ పై వి.దొరస్వామి రాజు నిర్మించారు. ఈ చిత్రానికి ఎం.ఎం.కీరవాణి అందించిన సంగీతం ప్రధానాకర్షణ. ఈ చిత్రంలో ఎన్టీఆర్‌ చేతిలోని గొడ్డలిని రాజమౌళి స్పెషల్‌గా డిజైన్ చేయించాడు. అప్పటి వరకూ ఎన్టీఆర్ కెరీర్ లో ఆయన చేసిన ది బెస్ట్ పెర్ఫార్మెన్స్ సింహాద్రి అనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. అందులో రాజమౌళి మార్క్ తో పాటుగా ఎన్టీఆర్ మార్క్ కూడా ఉంటుంది. హ్యూమన్ ఎమోషన్ ని ఎలివేట్ చేస్తూ సినిమా తీయడం చాలా రిస్క్, కాని రాజమౌళి ఎటువంటి తడబాటు లేకుండా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్ డ్యాన్సులు, ఆయన డైలాగ్ డెలివరీ అంత కొత్తగా ఉంటుంది. అప్పటివరకూ కేవలం నందమూరి అభిమానులు మాత్రమె ఎక్కువగా ఉన్న ఎన్టీఆర్ కు ఈ చిత్రం మాస్ ఆడియెన్స్ తో పాటు ఫ్యామిలి ఆడియెన్స్ ను కూడా దెగ్గర చేసింది.

సింహాద్రి తర్వాత వచ్చిన ఆంధ్రావాలా, సాంబ, నా అల్లుడు లాంటి సినిమాలు పెద్ద బ్రేక్ వేసాయి.

పురి జగన్నాధ్ దర్శకత్వంలో వచ్చిన ఆంధ్రావాలా భారి అంచనాల మధ్య విడుదలై నిరాశపరిచింది. ఈ చిత్రంలో ఆయన మొదటిసారి ద్విపాత్రాభినయం చేసారు. పూరి అప్పటికి ఇడియట్, అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి, శివమణి లాంటి ఇండస్ట్రీ హిట్స్ తో స్టార్ డైరెక్టర్ స్టేటస్ తెచ్చుకున్నాడు. ఎన్టీఆర్ కూడా మంచి హై లో ఉన్నాడు. వీళ్ళిద్దరి కాంబినేషన్ లో సినిమా అనేసరికి అంచనాలు భారిగా పెరిగిపోయాయి. సినిమాలో ఎక్కడ చూసిన నాజర్, షాయాజీ షిండే, జీవా ఇలా అంతా మంచి నటులే, ఇక చక్రి ఇచ్చిన మ్యూజిక్ రిలీజ్ కు ముందే సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ సినిమాలు ఫ్లాప్ అవ్వడంతో ఎన్టీఆర్ అభిమానులు డీలా పడిపోయారు.

ఆ తర్వాత వినాయక్ దర్శకత్వంలో వచ్చిన ‘సాంబ’ కూడా నిరాశపరిచింది. ఆ వెంటనే నా అల్లుడు, నరసింహుడు చిత్రాలు కూడా ఫ్లాప్స్ గా నిలిచాయి.

అప్పుడే ‘అతనొక్కడే’ చిత్రంతో హిట్ కొట్టిన సురేందర్ రెడ్డితో ‘అశోక్’ సినిమా చేసాడు. ముందుగా అతనొక్కడే చిత్రాన్ని ఎన్టీఆర్ తోనే తీయాలనుకున్నాడు సురేందర్ రెడ్డి. కాని డేట్స్ కుదరక ఆ చిత్రాన్ని కళ్యాణ్ రామ్ తో చేసాడు. వక్కంతం వంశి ఇచ్చిన కథను తనదైన మార్క్ తో తెరకెక్కించాడు సురేందర్ రెడ్డి. లావుగా ఉన్నా కూడా ఈ చిత్రంలో ఎన్టీఆర్ బాడి లాంగ్వేజ్ చాలా కొత్తగా ఉంటాయి. కోపాన్ని అదుపులో పెట్టుకోలేని ఒక యువకుడు ఎలాంటి పరిణామాలు ఎదురుకున్నాడు అనేది కథ. మణిశర్మ మ్యుజిక్ ఈ చిత్రానికి మరో ఆకర్షణ. భారి అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం ఆశించినంతగా ఆడలేదు.

యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ కెరీర్ లో గుర్తుండిపోయే సినిమా ‘రాఖీ’. 2006 లో వచ్చిన ఈ చిత్రం ఎన్టీఆర్‌ను మరో మెట్టు ఎక్కించింది. ఈ సినిమా ద్వారా జూనియర్ తన నటనతో విమర్శకుల ప్రశంసలు సైతం అందుకున్నారు. మహిళలపై జరుగుతున్న పాశవిక దాడులను ఈ సినిమాలో దర్శకుడు కళ్లకు కట్టినట్లు చూపించారు. సినిమాలో ఎన్టీఆర్ తనదైన డైలాగ్‌ డెలివరీతో ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేశారు. కేఎల్ నారాయ‌ణ నిర్మించిన ఈ చిత్రానికి దేవీ శ్రీ ప్ర‌సాద్ మ్యూజిక్ డైరెక్ట‌ర్. డీఎస్పీ కంపోజ్ చేసిన అన్నీ పాట‌లు బాక్సాపీస్ వ‌ద్ద వ్యూస్ పంట పండించాయి. ఛార్మి, ఇలియానా అందం, అభిన‌యం సినిమాకు ప్ల‌స్ అయ్యాయి. పోలీస్ఉన్న‌తాధికారిణిగా సుహాసిని పోషించిన పాత్ర తెలుగు ప్రేక్ష‌కుల‌కు చిర‌స్థాయిగా గుర్తుండిపోతుంది. ఈ సినిమా ఫలితం అంతగా సంతృప్తి ఇవ్వకపోయినా రాఖీ సినిమా ఎన్టీఆర్ కెరీర్ లో గుర్తుండిపోయే సినిమా.

ఆ తర్వాత  జూనియర్ ఎన్టీఆర్‌ మంచి సూపర్ హిట్ తో ఫామ్ లోకి వచ్చారు. ఆయన ప్రియ‌మ‌ణి జంట‌గా న‌టించిన ‘య‌మ‌దొంగ‌’ సినిమా ఆగష్టు 15వ తేదీన రిలీజయ్యింది. ఎస్‌.ఎస్‌. రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వం వచించిన ఈ సినిమా అప్పట్లో రికార్డులు సృష్టించింది. సోషియో ఫాంటసీ సబ్జెక్ట్ గా తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫిస్ వ‌ద్ద 30.1కోట్ల షేర్‌ను ద‌క్కించుకుంది. నిజానికి యమ దొంగ సినిమాకి ముందు ఎన్టీఆర్ చాలా లావుగా ఉండేవాడు. రాఖీ, యమదొంగ సినిమాల్లో ఎన్టీఆర్ ని చూస్తే ఈ విషయం అర్ధం అవుతుంది. యమదొంగ సినిమాకి మరీ ఒక్కసారిగా బక్కచిక్కిపోయి కనిపించాడు. అప్పట్లో యమదొంగ కథ చెప్పడానికి వెళ్ళిన రాజమౌళి, ఇలా చూడలేకపోతున్నామండీ. ఇంత లావుగా ఉంటే అమ్మాయిలు థియేటర్లకి రారన్నాడట, దాంతో లైపోసెక్షన్ చేయించుకుని మరీ బరువు తగ్గాడు జూనియర్. అప్పటి నుండి కెరీర్ కాస్త గాడిలో పడింది. ఈ సినిమాలో ఎన్టీఆర్ లుక్ కూడా ఆయన మునుపటి సినిమాలతో పోల్చుకుంటే కొంచెం కొత్తగా ఉంటది. ఈ సినిమాలో యుముడిగా నటించిన మోహన్ బాబు గారికి కూడా మంచి పేరు వచ్చింది. ఈ సినిమాలోని యమలోకం సీన్స్ లలో మోహన్ బాబు గారు , ఎన్టీఆర్ మధ్య సీన్స్ ఒక రేంజ్ లో అలరించాయి. రబ్బరు గాజులు పాట ఈ సినిమాకి ఇంకో హైలైట్.

ఆ తర్వాత వచ్చిన కంత్రి సినిమాలో ఎన్టీఆర్ మొత్తం లుక్ నే మార్చేశాడు. ఈ సినిమాలో ఎన్టీఆర్ 1 , 2 ,3 నేనొక కంత్రి అనే పాటని కూడా పడటం విశేషం. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది.

ఆ తర్వాత వి.వి.వినాయక్ దర్శకత్వంలో వచ్చిన సినిమా ‘అదుర్స్’. జూనియర్ ఎన్టీఆర్ మరోసారి ద్విపాత్రాభినయం చేసిన చిత్రం ఇది. ఈ సినిమాలో నయనతార, షీలా ప్రధాన పాత్రల్లో నటించారు. వల్లభనేని వంశీమోహన్ ఈ చిత్ర నిర్మాత. దేవి శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందించారు 2010 జనవరి 13న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. అలాగే 155 కేంద్రాల్లో 50 రోజులు ఆడింది. ఈ సినిమాను మలయాళంలో కవచం అనే పేరుతో అనువాదం చేశారు. ఈ సినిమాలో బ్రహ్మానందం, ఎన్టీఆర్ కలిసి చేసిన కామెడీకి అందరూ పొట్ట చెక్కలయ్యేలా నవ్వుకున్నారు.

అదుర్స్ సినిమా సూపర్ హిట్ తర్వాత వచ్చిన సినిమా ‘బృందావనం’. ఈ సినిమా ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. అలాగే ఈ సినిమాలో “సిటీ నుంచొచ్చాడు సాఫ్ట్‌ గా లవర్ బోయ్‌లా కనిపిస్తున్నాడు అనుకుంటున్నావేమో. క్యారెక్టర్ కొత్తగా ఉందని ట్రై చేశా, లోపల ఒరిజినల్ అలాగే ఉంది. దాన్ని బయటకు తెచ్చానుకో.. రచ్చరచ్చే’’.. ఈ డైలాగు అప్పట్లో ఓ సెన్సేషన్. ఈ డైలాగ్ మాత్రమే కాదు.. సినిమా కూడా. ‘మున్నా’ సినిమాతో తెలుగు సినీ పరిశ్రమలో దర్శకుడిగా పరిచయమైన వంశీ పైడిపల్లి రెండో సినిమాగా ‘బృందావనం’ సినిమాను రూపొందించారు. తన తొలి సినిమాకు అవకాశం ఇచ్చిన ప్రముఖ నిర్మాత దిల్ రాజు మరోసారి వంశీకి అవకాశం ఇచ్చారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్, కాజల్ అగర్వాల్, సమంత హీరోహీరోయిన్లుగా 2010 అక్టోబర్ 14న విడుదలైన ‘బృందావనం’ సినిమా ఘన విజయం సాధించింది. కమర్షియల్ అంశాలతో కూడిన మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఈ సినిమాతో దర్శకుడు వంశీ పైడిపల్లి కి వరసగా అవకాశాలు వచ్చాయి.  అలాగే, సంగీత దర్శకుడు తమన్ సైతం ఈ సినిమాతో మ్యూజికల్ హిట్ అందుకున్నారు. ప్రకాష్ రాజ్, శ్రీహరి, కోట శ్రీనివాసరావు, ముఖేశ్ రుషి, తనికెళ్ల భరణి, వేణు మాధవ్, బ్రహ్మాజీ, ప్రగతి, హేమ, ఆహుతి ప్రసాద్, రఘుబాబు, సన, సురేఖ వాణి.. ఇలా భారీ తారాగణంతో ఈ సినిమా తెరకెక్కించారు.

ఈ సినిమాల తర్వాత  ఎన్టీఆర్ కెరీర్ లో బిగ్గెట్ డిజాస్టర్ 2011 లో వచ్చిన శక్తి సినిమా. దాదాపుగా 40కోట్ల బడ్జెట్ తో మెహర్ రమేష్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తాపడింది. ఈ సినిమా పరాజయం నిర్మాత అశ్వినిదత్ గారికి బాగా దెబ్బతీసింది.

ఆ తర్వాత వచ్చిన ‘ఊసరవెల్లి’ భారి అంచనాల మధ్య విడుదలై ఫ్లాప్ అయింది. అశోక్ తర్వాత సురేందర్ రెడి, ఎన్టీఆర్ కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమలో ఎన్టీఆర్ మునుపెన్నడూ లేనంత స్టైలిష్ గా కనిపించారు. డీఎస్పీ మ్యూజిక్ అయితే సెన్సేషన్ క్రియేట్ చేసింది.

ఆ తర్వాత వచ్చిన బాద్ షా, రామయ్య వస్తావయ్యా, రభస సినిమాలు వరసగా నిరాశపరిచాయి. అయితే ఎన్టీఆర్ ఈ సినిమాలకి కొంచెం గ్యాప్ ఇచ్చారు.

ఇక ఆ గ్యాప్ తర్వాత పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన ‘టెంపర్’ సినిమా ఎన్టీఆర్ కెరీర్‌లోనే డిఫరెంట్‌గా నిలిచింది. తారక్‌లోని నటుడ్ని ఈ సినిమాతో వెలికితీసాడు దర్శకుడు పూరీ జగన్నాథ్. అంతేకాదు ఎన్టీఆర్‌ నెగిటివ్ షేడ్స్‌ ని కూడా అద్భుతంగా చేయగలడని ఈ చిత్రం ఆవిష్కరిచంది. కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్నే అందుకుంది. నటుడిగా ఎన్టీఆర్‌ను మరో మెట్టు పైకెక్కించింది ‘టెంపర్’ మూవీ . ‘ఆంధ్రావాలా’ తర్వాత పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో చేసిన ఈ సినిమా ఎన్టీఆర్ కెరీర్‌లోనే బెస్ట్ మూవీగా నిలిచిపోయింది. ‘టెంపర్’ మూవీలో ఎన్టీఆర్ ఇన్‌స్పెక్టర్ దయా పాత్రలో అద్భుతంగా ఒదిగిపోయాడు.ఈ చిత్రాన్ని తమిళంలో విశాల్ హీరోగా ‘అయోగ్య’ పేరుతోతెరకెక్కింది. హిందీలో రోహిత్ శెట్టి దర్శకత్వంలో రణ్‌వీర్ సింగ్ హీరోగా ‘సింబా’ టైటిల్‌తో తెరకెక్కింది. అక్కడ కూడా ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్ సాధించింది. ఈ సినిమా కోసం ఎన్టీఆర్ బాడీ బిల్డింగ్ కూడా చేసి అందరిని ఆశ్చర్య పరిచాడు."నా పేరు దయ నాకు లేనిదే అది" అనే డైలాగ్ సినిమా మీద విపరీతమైన క్రేజ్ ని తీసుకొచ్చింది.

హీరోస్ ని కొత్త కోణంలో చూపించే దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటించిన ‘నాన్నకు ప్రేమతో’ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో “నాన్నకు ప్రేమతో’’ పాటకి జనాల నుంచి బాగా స్పందన వచ్చింది. అలాగే ఈ సినిమాలో ఎన్టీఆర్ లుక్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంది. చనిపోతున్న నాన్న కోసం కొడుకు తీర్చుకునే ప్రతీకారం ఈ సినిమా కథ. ఈ సినిమాలో ఎన్టీఆర్ పాడిన ఫాలో ఫాలో పాట సూపర్ హిట్ అయింది.

ఇక 2016 లో వచ్చిన ‘జనతా గ్యారేజ్’ ఎన్టీఆర్ కెరీర్ లో మరో బ్లాక్ బస్టర్. ‘సింహాద్రి’ తర్వాత అలాంటి హిట్ ఆయనకు రాలేదు సరిగ్గా పుష్కర కాలం వెయిట్ చేసాడు ఆయన. ఈ సినిమాలో ఎన్టీఆర్ తో కలిసి మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ కలిసి నటించారు. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ సినిమా విడుదల అయినప్పటి నుంచి మంచి కలెక్షన్స్ ని సంపాదించింది. అలాగే ఈ సినిమాలో కాజల్ చేసిన ఐటమ్ సాంగ్ ‘పక్క లోకల్’ పాట సినిమాకే పెద్ద హైలైట్. అలాగే ఈ సినిమాలో రాజీవ్ కనకాల పాత్ర చిన్నది అయినప్పటికీ ఆయన పాత్రకి మంచి స్పందన వచ్చింది. జనతా గ్యారేజ్ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర దాదాపుగా 135 కోట్లు కలెక్ట్ చేసింది.

ఇక ఆ తర్వాత వచ్చిన ఇంకొక విభిన్నమైన చిత్రం ‘జై లవ కుశ’. ఈ సినిమాలో ఎన్టీఆర్ ఏకంగా 3 పాత్రలు చేయడం విశేషం. బాబీ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో జై పాత్ర కి ఒక రేంజ్ లో రెస్పాన్స్ వచ్చింది. అలాగే రావణ పాటని ఎన్టీఆర్ అభిమానులు విపరీతంగా ఎంజాయ్ చేశారు. ఈ సినిమాలో రాశి ఖన్నా, నివేద థామస్ హీరోయిన్స్ గా నటించగా, సాయి కుమార్, పోసాని ముఖ్య పాత్రలలో కనిపించారు. ఎన్టీఆర్ అన్నయ్య కళ్యాణ్ రామ్ నిర్మించిన ఈ చిత్రం కూడా 100 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది. తన తోటి నటులలో ఇలా 3 పాత్రలు ఒకటే సినిమాలో చేసిన ఘనత ఎన్టీఆర్ కే దక్కింది.

ఇక మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ , ఎన్టీఆర్ కాంబినేషన్ లో వచ్చిన చిత్రం అరవింద సమేత. రాయలసీమలోని ఫ్యాక్షన్ ని ఈ సినిమా ఇంకో కోణంలో చూపించింది. ఈ సినిమాలో పాత్రలు కూడా సీమ భాషలో మాట్లాడి ఈ సినిమాకి ఇంకాస్త అందం తెచ్చారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ చెప్పిన ఒక్కక్క డైలాగ్స్ కి థియేటర్స్ లో చప్పట్లు పడ్డాయి. అలాగే ఈ సినిమాలో జగపతి బాబు గారు చేసిన విలన్ పాత్రకి కూడా మంచి పేరు వచ్చింది. వాయిస్ లో బేస్ కోసం జగపతి బాబు గారు ఈ పాత్ర డబ్బింగ్ లో బాగా కష్టపడ్డారట. ఈ సినిమా ఫ‌స్ట్ డే ప్ర‌పంచ వ్యాప్తంగా చాలా 36.80 కోట్ల షేర్ అందుకొని సంచలనం సృష్టించాడు ఎన్టీఆర్.

ఎన్టీఆర్, ఎస్.ఎస్ రాజమౌళి కలిసి నాలుగోసారి చేస్తున్న చిత్రం ఆర్.ఆర్.ఆర్. ఈ సినిమాలో ఎన్టీఆర్ తో పాటు రామ్ చరణ్ కూడా కలిసి నటిస్తున్నారు. 400 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటుంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమరం భీమ్ గా నటిస్తున్నారు.

బుల్లి తెరపై

ఎన్టీఆర్ తెలుగులో వచ్చిన బిగ్ బాస్ షో సీసన్ 1 కి కూడా హోస్ట్ గా తనదైన శైలి లో అలరించారు. తాను చేసిన ఈ షో కి అప్పట్లో భారీ టిఆర్పి రేటింగ్స్ వచ్చాయి.

రాజకీయ జీవితం

ఎన్టీఆర్ తాతగారు నందమూరి తారకరామారావు గారు పెట్టిన తెలుగుదేశం పార్టీ కి 2009 ఎన్నిక‌ల్లో జూనియ‌ర్ ఎన్టీఆర్ ప్ర‌చారం చేశారు. ఆ స‌మ‌యంలోనే రాజ‌కీయాల‌కు తాను స‌మ‌ర్ధ‌వంతంగా స‌రిపోతాన‌నే అభిప్రాయాన్ని అంద‌రిలో క‌లిగేలా ఒక ముద్ర వేశారు జూనియ‌ర్ ఎన్టీఆర్. ఆయన స్పీచెస్ అప్పట్లో పెద్ద సంచలనం. భవిషత్తులో  తెలుగుదేశం పార్టీలో ఆయన  పూర్తి స్థాయి రాజకీయాల్లోకి వస్తారు అని అందరూ అనుకున్నారు. అయితే ఆ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ పరాజయం పాలయ్యింది. ఈ ఎన్నికల సమయంలోనే ఎన్టీఆర్ కి భారీ ఆక్సిడెంట్ జరిగింది. ఈ ప్రమాదం నుంచి ఆయన మెల్లగా కొలుకున్నారు. ఇక ఎన్టీఆర్ ఇప్ప‌టి వ‌ర‌కు పార్టీ వ్య‌వ‌హారాల్లో మ‌ళ్లీ ఎక్క‌డ క‌నిపించ‌డ‌లేదు. అడ‌ప‌ద‌డ‌ప జూనియ‌ర్ పొలిటిక‌ల్ ఎంట్రీపై ఇంకా చ‌ర్చ‌లు జ‌రుగుతూనే ఉన్నాయి.

వ్యక్తిగత జీవితం

జూనియర్ ఎన్టీఆర్ మే 5, 2011 న లక్ష్మీ ప్రణతితో వివాహం అత్యంత వైభవంగా జరిగింది. వారికి భార్గవ్ రామ్, అభయ్ రామ్ అని ఇద్దరి కొడుకులు. ఎన్టీఆర్ తండ్రి  హరికృష్ణ 2018 ఆగష్టు 29న రోడ్డు ప్రమాదంలో కన్నుమూశారు. ఇక తారక్ తాతగారు సీనియర్ ఎన్టీఆర్ గారుతో ఆయనకి ప్రత్యేకమైన అనుబంధం ఉంది. అది మనం అప్పుడప్పుడు తారక్ సినిమాల్లో కూడా చూస్తాం. అలాగే తారక్  అన్నయ్య కళ్యాణ్ రామ్ కూడా మంచి పేరు ఉన్న నటుడు. అతనొక్కడే , పటాస్ లాంటి సినిమాలతో ఆయన మంచి పేరు సంపాదించుకున్నారు. ఎన్టీఆర్ బాబాయ్ నందమూరి బాలకృష్ణ తెలుగులో ప్రముఖ నటుడు.అలాగే ఎన్టీఆర్ తండ్రి హరికృష్ణ కూడా నటుడుగా కొన్ని సినిమాల్లో నటించారు. ఇక 2014లో ప్రజలని అతలాకుతలం చేసిన హుద్ హుద్ తూఫాన్ వల్ల నష్టపోయిన ప్రజలకి ఎన్టీఆర్ 20 లక్షల సాయాన్ని సీఎం రిలీఫ్ ఫండ్ కి అందచేసి ఆయన పెద్ద మనసు చాటుకున్నారు.

అవార్డ్స్

ఎన్టీఆర్ కి తన జనరేషన్ ఇతర నటులతో పోల్చుకుంటే చాలా ఎక్కువ అవార్డ్స్ వచ్చాయి. ఆయనకి హీరోగా  మొదటి అవార్డ్ ఏపీ సినీ గోయర్స్ బెస్ట్ న్యూ యాక్టర్ అవార్డ్ స్టూడెంట్ నెంబర్ 1(2001) సినిమాకి వచ్చింది. ఇక 2002 లో ఆది సినిమాకి ఉత్తమ నటుడుగా నంది అవార్డ్ , సినిమా అవార్డ్ మరియు ఫిలింఫేర్ అవార్డ్ వచ్చాయి. ఆ తర్వాత సంవత్సరం వచ్చిన సింహాద్రి కి బెస్ట్ యాక్టర్ గా ఫిలింఫేర్ అవార్డ్ మరియు సంతోషం అవార్డ్ లభించింది. కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన రాఖీ సినిమాకి గాను ఎన్టీఆర్ కి ఉత్తమ నటుడుగా ఫిలింఫేర్ అవార్డ్ మరియు సినిమా అవార్డ్ వచ్చాయి. అలాగే యమదొంగ , కంత్రి , అదుర్స్ , బృందావనం , టెంపర్ , నాన్నకు ప్రేమతో , జనతా గ్యారేజ్ , జై లవ కుశ , అరవింద సమేత సినిమాలకి గాను ఎన్టీఆర్ కి ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ లభించాయి.

- Advertisement -

You've successfully subscribed to Tollywood Latest News | Celebrities Profiles | Media9 Tollywood
Great! Next, complete checkout to get full access to all premium content.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.