రానా దగ్గుబాటి, సాయి పల్లవి జంటగా వేణు ఉడుగుల దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘విరాటపర్వం’. ఎమర్జెన్సి నాటి కాలంలో జరిగిన కథతో విప్లవ బాట పట్టిన యువకుడి పయనంలో అతను నమ్మిన సిద్ధాంతాలు, విలువల కోసం అతను చేసిన పోరాటమే ఈ విరాటపర్వం. ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుదల చేసిన టీజర్ కు విశేష స్పందన వచ్చింది. ఇటీవలే విడుదలైన ‘కోలు కోలు’ పాత కూడా 6 మిలియన్ వ్యూస్ తో మంచి స్పందన తెచ్చుకుంటోంది. ఇక మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ చిత్రంలోని తమ అస్తిత్వాన్ని చాటి చెప్పిన మహిళా పాత్రలను పరిచయం చేస్తూ ఒక మోషన్ పోస్టర్ ను విడుదల చేసారు. రానా వాయిస్ వోవర్ తో సాగే ఈ వీడియోలో “చరిత్రలో దాగిన కథలకు తెరలేపిన ప్రేమ తనది... ప్రేమ కూడా మానవ స్వేఛ్చలో భాగమే అని నమ్మిన వ్యక్తిత్వం ఈమెది... మహా సంక్షోభమే ఒక గొప్ప శాంతికి దారి తీస్తుందని నమ్మిన విప్లవం తనది... అడవి బాట పట్టిన అనేకమంది వీరుల తల్లులకు వీరు ప్రతిరూపాలు. వీళ్ళ మార్గం అనన్యం, అసామాన్యం, రెడ్ సెల్యూట్ టు ఆల్ ది గ్లోరియస్ విమెన్”. అంటూ ముగుస్తుంది. రానా మరోసారి తన గంభీరమైన స్వరంతో మాయ చేసాడు. వీరు పరిచయం చేసిన పాత్రల్లో సాయి పల్లవి, ప్రియమణి, నందిత దాస్, ఈశ్వరీ రావు, జరీనా వహాబ్ నటించారు. ఈ చిత్రం ఏప్రిల్ 30న విడుదలకానుంది.