రామ్ చరణ్

మెగాస్టార్ నట వారసుడిగా, ‘చిరుత’గా అడుగుపెట్టి కెరీర్ మొదట్లో ఒక మూసలో సినిమాలు చేసినా ఆ తర్వాత తన విభిన్న సినిమాల ఎంపికతో ఒక్కో మెట్టు ఎక్కుతూ నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు రామ్ చరణ్ తేజ్. తన నటన మీద విమర్శలు చేసిన వారితోనే చెప్పట్లు కొట్టించుకొని, మెగాస్టార్ కొడుకుగా కాకుండా తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానన్ని టాలీవుడ్ లో ఏర్పరుచుకున్నారు.

బాల్యం – విద్యాభ్యాసం

రామ్ చరణ్ మార్చి 27, 1985 న మెగాస్టార్ చిరంజీవి, సురేఖ దంపతులకు జన్మించాడు. ఆయనకి ఇద్దరు సొదరీమణులు శ్రీజ మరియూ సుష్మిత. రామ్ చరణ్ చిన్నప్పుడు తన తండ్రి మెగాస్టార్ చిరంజీవి ఎక్కువగా సినిమా షూటింగ్స్ లో ఉండటం వల్ల తన బాబాయ్ పవన్ కళ్యాణ్ దగ్గర ఎక్కువగా పెరిగారు. చెన్నైలోని పద్మ శేషాద్రి బాల భవన్ లో, లవ్డేల్ లోని ది లారెన్స్ స్కూల్లో మరియు బేగంపెట్ లోని ది హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో తన ప్రాధమిక, ఉన్నత విద్యలను పూర్తి చేసారు. సేంట్ మేరీస్ కాలేజ్ హైదరాబాద్ లో తన కాలేజి చదువును ముగించారు. చిన్నప్పటి నుంచి తన తండ్రిని చూసి రామ్ చరణ్ కి కూడా సినిమాల మీద ఆసక్తి పెరిగింది.

సినీ ప్రస్థానం

2007 లో ‘చిరుత’ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమయ్యారు రామ్ చరణ్. తొలి సినిమాను డ్యాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్‌తో చేశారు. సినిమా వంద రోజుల పాటు ఆడి బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచింది. ఇందులో నేహా శర్మ కథానాయికగా నటించారు. మణిశర్మ సంగీతం అందించగా వైజయంతి మూవీస్ బ్యానర్‌పై అశ్వినీ దత్ నిర్మాతగా వ్యవహరించారు. రూ.18 కోట్ల బడ్జెట్‌తో సినిమాను తెరకెక్కిస్తే బాక్సాఫీస్ వద్ద రూ.22.5 కోట్ల కలెక్షన్స్ వచ్చాయి. ప్రకాష్ రాజ్, ఆశిష్ విద్యార్థి, బ్రహ్మానందం, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, అలీ ఇతర ముఖ్యపాత్రలు పోషించారు. ఈ సినిమాకు వచ్చిన సక్సెస్ రేట్‌ను చూసి బెంగాలీలో ‘రంగ్‌బాజ్’ అనే టైటిల్‌తో రీమేక్ చేశారు. ఆ తర్వాత ఇదే టైటిల్‌తో హిందీలో డబ్బింగ్ కూడా చేశారు. సినిమా కాన్సెప్ట్ ఒక ఎత్తైతే, ఇందులో పాటలు మరో ఎత్తు. పాటలకు చాలా మంచి స్పందన వచ్చింది. పాటలకు సంబంధించిన క్యాసెట్లు, సీడీలు హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. ఇప్పుడు రామ్ చరణ్ మెగా పవర్‌స్టార్ ట్యాగ్‌తో కోట్లాది మంది అభిమానుల్ని సంపాదించుకున్నారు.

ఇక తెలుగు సినిమా మార్కెట్‌ను, లెక్కలను మార్చేసిన చిత్రం ‘మగధీర’. అప్పటి వరకు ఉన్న లెక్కలు వేరు, ‘మగధీర’ వచ్చిన తరవాత లెక్కలు వేరు. చిరంజీవి సినీ వారసుడిగా ‘చిరుత’ చిత్రంతో తెరంగేట్రం చేసిన రామ్ చరణ్ ‘మగధీర’ సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నారు. స్టార్ హీరో హోదాను పొందారు. ఆయన కెరీర్‌లో చిరస్థాయిగా నిలిచిపోయే చిత్రం ‘మగధీర’ అంటే అతిశయోక్తికాదు. ఎస్.ఎస్.రాజమౌళి తన దర్శక ప్రతిభ ఏపాటిదో ఈ చిత్రంతో మరోసారి నిరూపించారు. 2009 జూలై 31న ‘మగధీర’ చిత్రం విడుదలైంది. కాళ భైరవుడిగా రామ్ చరణ్ తన విశ్వరూపాన్ని చూపించారు. ఈ సినిమాతో కాజల్ అగర్వాల్ స్టార్ హీరోయిన్‌గా మారిపోయింది. సుమారు రూ.40 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ.80 కోట్లకు పైగా షేర్ వసూలు చేసింది. ఈ చిత్రంతో తన స్టామినాను రాజమౌళి మరోసారి నిరూపించుకున్నారు. అంతేకాదు, తెలుగు సినిమా మార్కెట్‌ను మరో స్థాయికి తీసుకెళ్లారు. కీరవాణి సంగీతం, సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ, పీటర్ హెయిన్ ఫైట్స్, ప్రేమ్ రక్షిత్ కొరియోగ్రఫీ ఇలా ఈ సినిమాలో ప్రతి అంశం ఎంతో ప్రత్యేకం. ‘మగధీర’తో రెండో సినిమాకే ఇండస్ట్రీ హిట్ అందుకొని అందరినీ ఆశ్యర్యపరిచిన రామ్ చరణ్, ఆ చిత్రానికి ఉత్తమ నటుడిగా అప్పటి ఉమ్మడి ఏ.పీ ప్రభుత్వం నుంచి నంది స్పెషల్ జ్యూరీ అవార్డు అందుకున్నారు. ఈ చిత్రంలో రామ్ చరణ్ తన తండ్రి నటించిన ‘ఘరానా మొగుడు’ సినిమాలోని బంగారు కోడి పెట్ట సాంగ్‌ను రీమిక్స్ చేయగా అందులో మెగాస్టార్ స్పెషల్ అపియరెన్స్ ఇచ్చారు. ఈ చిత్రం జాతీయ స్థాయిలో ఉత్తమ కొరియోగ్రఫీతో పాటు స్పెషల్ ఎఫెక్ట్స్ విభాగంలో అవార్డులు అందుకోవడమే కాక, ఆ ఏడాది అప్పటి రాష్ట్ర ప్రభుత్వం తరుపున తొమ్మిది నంది అవార్డులు కైవసం చేసుకుంది. ఈ చిత్రం అన్ని భాషల్లో ‘మగధీర’ టైటిల్‌తోనే డబ్ అవ్వగా, బెంగాలీలో మాత్రం ‘యోధ..ది వారియర్’ పేరుతో రీమేక్ అయింది.

మగధీర లాంటి భారీ విజయం తర్వాత కొంత రిలీఫ్ పొందేందుకు, అదే సమయంలో అభిమానులని కూడా అలరించేందుకు రామ్ చరణ్ ‘ఆరెంజ్’ చిత్రాన్ని ఎంచుకున్నాడు. ప్రేమ కథ కాబట్టి పెద్దగా రిస్క్ ఉండదని అప్పట్లో ఫామ్ లో ఉన్న బొమ్మరిల్లు భాస్కర్ పై నమ్మకం ఉంచి ఈ చిత్రాన్ని అంగీకరించాడు. జెనీలియా కథానాయికగా నటించగా నాగబాబు, వెన్నెల కిషోర్, ప్రభు, బ్రహ్మానందం తదితరులు ముఖ్యపాత్రల్లో నటించారు. అంజన ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మాత నాగబాబు ఈ చిత్రాన్ని నిర్మించారు. మగధీర తర్వాత రామ్ చరణ్ మూవీపై విపరీతంగా అంచనాలు పెరిగిపోయాయి. కానీ ఆరెంజ్ మూవీ మాత్రం వైవిధ్యభరితమైన ప్రేమ కథా చిత్రం. దీనితో ప్రేక్షకులు డిజప్పాయింట్ అయ్యారు. అలాగే ఆరెంజ్ చిత్రానికి కూడా బడ్జెట్ ఎక్కువైపోవడంతో సినిమా ఫలితం డిజాస్టర్ గా నిలిచింది. కానీ ఆరెంజ్ అంత తేలికగా తీసిపడేసే చిత్రం కాదు. ఆరెంజ్ క్లాసిక్ అని అభివర్ణించే ఫ్యాన్స్ ఎంతోమంది ఉన్నారు. కొంతమంది అభిమానులైతే ఈ చిత్రాన్ని రిపీటెడ్ గా చూస్తుంటారు. హ్యారిస్ జైరాజ్ ఈ చిత్రానికి అందించిన సంగీతం అప్పట్లో ఒక సెన్సేషన్.

ఆరెంజ్ తర్వాత చేసిన ‘రచ్చ’ సినిమా యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రం. ఇందులో రామ్ చరణ్ తేజ్, తమన్నా, నాజర్‌, కోటశ్రీనివాసరావు, ముఖేష్‌ రిషి, పార్తీబన్‌, బ్రహ్మానందం, అలీ, గీత, ఝాన్సీ, ప్రగతి, సుధ, హేమ అజ్మల్ తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం వహించింది సంపత్ నంది కాగా ఈ సినిమాని ఎన్వీ ప్రసాద్, పరాస్ జైన్ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు మణిశర్మ స్వరాలు సమకుర్చారు. భారీ ఓపెనింగ్లను సాధించిన ఈ చిత్రం విజయాన్ని సాధించింది. దాదాపు 40 కోట్ల కలెక్షన్స్ సాధించి సూపర్ హిట్ గా నిలిచింది. ఆ తర్వాత 2013లో వి.వి. వినాయక్ దర్శకత్వంలో నాయక్ సినిమాలో రామ్ చరణ్ నటించాడు. ఈ సినిమాలో రామ్ చరణ్ ద్విపాత్రాభినయం చేసి అందరిని మెప్పించారు. ఈ సినిమా విడుదల నుంచి మంచి టాక్ తో సూపర్ హిట్ గా నిలిచి దాదాపుగా 50 కోట్ల వసూళ్ళని కొల్లగొట్టింది. తరువాత అపూర్వ లఖియా దర్శకత్వంలో ‘తుఫాన్’ చిత్రంలో నటించాడు. ఈ సినిమాతో హిందీలోకి కూడా రామ్ చరణ్  అడుగుపెట్టారు. ఈ చిత్రం ‘బిగ్ బి’ అమితాబ్ ‘జంజీర్’ కు రీమేక్. హిందీలో జంజీర్ పేరుతోనే విదిదలైంది. ఈ చిత్రంలో చరణ్ కు జోడిగా ప్రియాంక చోప్రా నటించారు. రియల్ స్టార్ శ్రీహరి తెలుగు సినిమాలో ముఖ్యపాత్రలో నటిస్తే, హిందీలో ఆ పాత్రను సంజయ్ దత్ పోషించారు. తనికెళ్ళ భరణి, అతుల్ కులకర్ణి లాంటి నటులు ఉండటంతో ఈ చిత్రంపై భారి అంచనాలు ఏర్పడ్డాయి కాకపోతే ఈ సినిమా పెద్దగా ప్రేక్షకాదరణకు నోచుకోలేదు. ఆయన కెరీర్ లో పెద్ద డిజాస్టర్ గా నిలిచింది.

ఇక జంజీర్ సినిమా ప్లాప్ తో డీలా పడిన రామ్ చరణ్ తర్వాత పైడిపల్లి వంశీ దర్శకత్వంలో మొదటిసారి అల్లు అర్జున్ తో కలిసి ‘ఎవడు’ చిత్రంలో నటించాడు. ఈ సినిమా కథ సత్య, చరణ్ అనే ఇద్దరి వ్యక్తుల చుట్టూ తిరుగుతుంది. ఒక ప్రమాదంలో ముఖం కాలిపోయి తీవ్రంగా గాయపడ్డ సత్య ఆ రోజు తన ప్రేయసి దీప్తిని చంపిన వాళ్ళపై పగ తీర్చుకోవాలనుకుంటాడు, అతనకి శైలజ అనే వైద్యురాలు ఒక కొత్త మొహాన్ని ఇస్తుంది. 10 నెలల తర్వాత కోమా నుంచి బయటపడ్డ సత్య తన పగ తీర్చుకుంటాడు కానీ ఆ తర్వాత తనపై కొందరు దాడి చేస్తారు. శైలజ ద్వారా తన కొత్త మొహం శైలజ కొడుకు చరణ్ ది అని తెలుస్తుంది. చరణ్ ఎవడు? చరణ్ గతం తెలుసుకున్న సత్య ఏం చేసాడు? అన్నది మిగిలిన కథ. ఈ సినిమా డిసెంబర్ 9, 2011న ప్రసాద్ ల్యాబ్స్ కార్యాలయంలో ప్రారంభమైంది. చిత్రీకరణ ఏప్రిల్ 27, 2012న మొదలయ్యింది. హైదరాబాదు, విశాఖపట్నం, విదేశాల్లో స్విట్జర్ల్యాండ్, జురిచ్, బ్యాంకాక్ ప్రాంతాల్లో చిత్రీకరణ జరుపుకున్న ఈ సినిమా దిల్ రాజు నిర్మించిన సినిమాల్లో అతి ఎక్కువకాలం చిత్రీకరింపబడిన సినిమాగా గుర్తింపు సాధించింది. చిత్రీకరణ జూలై 22, 2013న పూర్తయ్యింది. తెలంగాణా ఆంధ్రప్రదేశ్ విభజన కారణం చేత, మరిన్ని అనుకోని సంఘటనల తర్వాత వరుసగా ఎన్నోసార్లు వాయిదా పడి ఈ సినిమా మహేష్ బాబు నటించిన 1 - నేనొక్కడినే సినిమాకి పోటీగా ఈ సినిమా జనవరి 12, 2014న సంక్రాంతి కానుకగా విడుదలైంది. విమర్శకుల నుంచీ ప్రేక్షకుల నుంచీ సానుకూల స్పందన రాబట్టగలిగిన ఎవడు బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించింది. 45 కోట్లు పైచిలుకు కలెక్షన్లు సాధించిన ఈ సినిమా మలయాళంలో భయ్యా మై బ్రదర్ అన్న పేరుతో అనువదించబడింది. అక్కడ కూడా ఈ సినిమా భారీ విజయాన్ని సాధించింది. టాలీవుడ్ లో వచ్చిన కొత్త కాన్సెప్ట్ సినిమాల్లో ఇది ఒకటి. ఈ సినిమాలో అల్లు అర్జున్ చేసిన అతిథి పాత్రకి మంచి రెస్పాన్స్ వచ్చింది.

2014 లో పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై బండ్ల గణేష్ నిర్మాణంలో కృష్ణవంశీ దర్శకత్వంలో విడుదలైన కుటుంబకథా చిత్రం ‘గోవిందుడు అందరివాడేలే’. ఈ సినిమాలో రామ్ చరణ్, శ్రీకాంత్, కాజల్ అగర్వాల్, కమల్నీ ముఖర్జీ నాయక-నాయికలుగా నటించారు. కోటా శ్రీనివాసరావు, ప్రకాష్ రాజ్, జయసుధ, రావు రమేష్, వెన్నెల కిషోర్, రహమాన్, ఆదర్శ్ బాలకృష్ణ ముఖ్యపాత్రల్లో నటించారు. ఈ చిత్రకథను పరుచూరి వెంకటేశ్వరరావు, పరుచూరి గోపాలకృష్ణ రచించారు. యువన్ శంకర్ రాజా సంగీతాన్ని అందించారు. సమీర్ రెడ్డి ఛాయాగ్రాహకునిగా, నవీన్ నూలి ఎడిటరుగా పనిచేసారు. ఈ సినిమా కథకు పాక్షికంగా అక్కినేని నాగేశ్వరరావు, మీనా కలిసి నటించిన సీతారామయ్య గారి మనవరాలు స్ఫూర్తి. ఈ సినిమా ఆశించిన విజయాన్ని మాత్రం అందుకోలేకపోయింది.

2015 లో శ్రీనువైట్ల దర్శకత్వంలో బ్రూస్ లీ లో నటించాడు ఈ సినిమా కూడా ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి గారు అతిథి పాత్రలో నటించారు. అయితే రామ్ చరణ్ మాత్రం నటనలో, డైలాగ్ డెలివరీలోనూ అదరకొట్టారు అని చెప్పటంలో సందేహం లేదు. ముఖ్యంగా డ్యాన్స్ లకు అతను వేసే స్టెప్స్ చాలా బాగున్నాయి. అలాగే సినిమా చివరలో సినిమాని సేవ్ చేయటానికా అన్నట్లు చిరంజీవి ఎంట్రీ...ఆయన చెప్పే...జస్ట్ టైం గ్యాప్ మాత్రమే..టైమింగ్ లో మాత్రం కాదు అనే డైలాగు హైలెట్.

కీలక మలుపు

మగధీర తర్వాత ఎన్ని సినిమాలు చేసిన అంతటి విజయాన్ని ఏవి సొంతం చేస్కోలేదు. ఆరెంజ్, ఎవడు సినిమాలు మినహాయిస్తే హిట్ అయిన సినిమాలు కూడా రామ్ చరణ్ ఇమేజ్ ని పెంచటంలో అంతగా ఉపయోగపడలేదు. అటువంటి సమయంలో తమిళంలో సూపర్ హిట్ అయిన తని ఒరువన్ సినిమాని తెలుగులోకి సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ధ్రువ పేరుతో రీమేక్ చేశారు. ఈ సినిమాలో రామ్ చరణ్ తన నటనతో అందరినీ మెప్పించారు. తెలుగులో వచ్చిన రీమేక్ చిత్రాల్లో బెస్ట్ రీమేక్ చిత్రంగా ఈ సినిమాని అభివర్ణిస్తారు. తమిళంలో విలన్ గా చేసిన అరవింద స్వామి తెలుగులో కూడా నటించి మెప్పించారు. నటన విషయంలో గాని, ఫిజిక్ విషయంలో గాని చాలా జాగ్రత్తలు తీసుకుని, పోలీస్ క్యారెక్టర్ కోసమై తనని తాను అద్భుత శిల్పంలా మలచుకున్నారు. రామ్ చరణ్ నటన, సురేందర్ రెడ్డి టేకింగ్ కలిసి సినిమా సంచలన విజయంలో కీలక పాత్రలు పోషించాయి. స్టైలి ష్ డైరెక్టర్ గా పేరున్న సురేందర్ రెడ్డి ఈ చిత్రాన్ని మరింత స్టైల్ గా మలిచారు. హిప్-హాప్ తమిళ సంగీత ద్వయం అందించిన సంగీతం ఈ చిత్రానికి మరో ప్రధానాకర్షణ. 50 కోట్లతో నిర్మించబడిన ఈ చిత్రం బాక్స్ దెగ్గర ప్రభంజనం సృష్టించి దాదాపుగా 90 కోట్లు రాబట్టింది.

2018లో సుకుమార్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో తెరకెక్కిన ‘రంగస్థలం’ మూవీతో నటన పరంగా విమర్శకుల ప్రశంసలతో పాటు, కమర్షియల్‌గా మంచి విజయాన్ని అందుకున్నాడు. సమంత హీరోయిన్‌గా నటించిన ఈ మూవీకి దేవీశ్రీ ప్రసాద్ ఇచ్చిన సంగీతం బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. ఇన్నేళ్ల కెరీర్‌లో నటనపరంగా రాని పేరు ‘రంగస్థలం’ సినిమాతో సంపాదించుకున్నాడు రామ్ చరణ్. మరోవైపు అతని నుంచి నటన రాబట్టుకోవడంలో దర్శకుడిగా సుకుమార్ సఫలమయ్యాడు. ఇక డిజిటల్ యుగంలో 1980 నాటి స్టోరీతో గ్రామీణ రాజకీయాల నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా ఇప్పటి జనరేషన్‌కు కొత్తగా అనిపించింది. అందుకే ఈ సినిమాను ప్రజలు ఆదరించారు. మరోవైపు ఈ చిత్రంలో ఇతర పాత్రల్లో నటించిన ఆది పినిశెట్టి, అనసూయ, జగపతిబాబు, ప్రకాష్ రాజ్‌, నరేష్ ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి పాత్రకు ఇంపార్టెన్స్ ఇచ్చారు. ‘రంగస్థలం’ చిత్రం బాక్సాఫీస్ ను కొల్లగొడుతూ రూ.200 కోట్ల గ్రాస్ కలెక్షన్స్‌ తో పాటు రూ.115 కోట్ల షేర్ రాబట్టినట్టు టాలీవుడ్ ట్రేడ్ వర్గాలు విశ్లేషించాయి. ఒక్క ఓవర్సీస్‌ మార్కెట్‌లో ఈ మూవీ మూడున్నర మిలియన్ డాలర్ల వసూళ్లు రాబట్టి 2018 టాలీవుడ్ బిగ్గెస్ట్ బాక్సాఫీస్ హిట్‌గా నిలిచింది. ఇప్పటికే ‘రంగస్థలం’ తమిళం, మలయాళంలో డబ్ చేసారు. తాజాగా రంగస్థలం సినిమాను కన్నడలో ‘రంగస్థల’ పేరుతో డబ్ చేసి రిలీజ్ చేస్తున్నారు.

రంగస్థలం లాంటి గొప్ప చిత్రం తర్వాత భారి అంచనాల మధ్య విడుదలైన చిత్రం ‘వినయ విధేయ రామ’. బోయపాటి శ్రీను తెరకెక్కించిన ఈ చిత్రం 2019 సంక్రాంతికి విడుదలై ఫ్లాప్ అయింది. మరీ రొటీన్ ఫార్ములాతో వచ్చిందని తేల్చేసారు విమర్శకులు. ఫ్యాన్స్ కూడా దీనిపై పెదవి విరిచారు. నిర్మాతలకు నష్టాలు తప్పవు అనుకున్నా ఈ చిత్రం మంచి వసూళ్ళను రాబట్టి నిర్మాతలను గట్టేక్కించింది. దీనికి ప్రధాన కారణం రామ్ చరణ్ మాస్ ఇమేజ్ అనడంలో ఎటువంటి సందేహం లేదు. దీన్నిబట్టి చరణ్ మాస్ ఇమేజ్ ఏ రేంజ్ లో ఉందో అర్థమవుతుంది. ఈ సినిమా ప్రేక్షకుల్ని మాత్రం తీవ్ర నిరాశకు గురిచేయడంతో రామ్ చరణ్ అభిమానులను ఉద్దేశించి ఓ ప్రెస్ నోట్‌ను రిలీజ్ చేశారు. వినయ విధేయ రామ చిత్రం చాలా కష్టపడి చేశామని అయితే అభిమానులు ఆశించిన స్థాయిలో వినోదాన్ని అందించలేకపోయామంటూ ఎమోషనల్ లెటర్‌ను మీడియాకి విడుదల చేశారు. “మా ‘వినయ విధేయ రామ’ సినిమా కోసం రేయింబవళ్లు కష్టించిన సాంకేతిక నిపుణులు అందరికీ నా ధన్యవాదాలు. నిర్మాత దానయ్య గారు అందించిన సహకారం మాటల్లో వర్ణించలేనిది. మా చిత్ర పంపిణీదారులు, ప్రదర్శనదారులకు కృత‌జ్ఞుడనై ఉంటాను. మీ అందరికీ నచ్చి, మిమ్మల్ని వినోదింపచేసే సినిమా అందించటానికి మేమంతా ఎంతగానో శ్రమించాం. దురదృష్టవశాత్తూ మేము అనుకున్న విధంగా ఒక మంచి సినిమాని అందించలేక మీ అంచనాలని అందుకోలేకపోయాం. మీరు చూపించే ఈ ఆదరణ, అభిమానాన్ని ప్రేరణగా తీసుకుని భవిష్యత్తులో మీకు నచ్చే, మీరు మెచ్చే సినిమాలు చేయడానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తాను. అన్ని వేళల మాకు తమ మద్దతునందించిన మీడియా మిత్రులకు నా ప్రత్యేక కృత‌జ్ఞతలు. మీరు ఎల్లప్పుడూ చూపించే ఈ ప్రేమ, అభిమానానికి ధన్యవాదాలు”. అని రామ్ చరణ్ లెటర్ రాసి అందరి చేత శభాష్ అనిపించుకున్నారు.

ప్రస్తుతం రాజ‌మౌళి క్రేజీ మ‌ల్టీస్టార‌ర్ ఆర్.ఆర్.ఆర్ సినిమాతో రామ్ చరణ్ బిజీగా ఉన్నాడు. ఈ సినిమాలో ఎన్టీఆర్‌తో కలిసి నటిస్తున్నాడు. ఉగాది సందర్భంగా విడుదలైన ఈ చిత్రం మోషన్ పోస్టర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రంలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తుండగా, ఎన్.టి.ఆర్ కొమరం భీమ్ పాత్రలో నటిస్తున్నారు. రామ్ చరణ్, ఎన్టీఆర్ కలిసి నటిస్తోన్న ఆర్.ఆర్.ఆర్ ప్యాన్ ఇండియా లెవల్లో రిలీజ్ కాబోతోంది. దాదాపు రూ.400 కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమా తెరకెక్కనుంది. ఇప్పటికే ఎన్టీఆర్‌, రామ్ చరణ్ పాత్రలను పరిచయం చేస్తూ విడుదల చేసిన టీజర్‌లు నెట్టింట్లో సంచనలం సృష్టించాయి. భారతదేశంలోని దాదాపు అన్ని భాషల్లో విడుదల చేయడానికి ప్లాన్‌ చేస్తోన్న ఈ సినిమాలో ఆలియాభట్‌, అజయ్‌ దేవగణ్‌ వంటి బాలీవుడ్ స్టార్స్‌తో పాటు హాలీవుడ్‌ స్టార్స్‌ ఒలివియా మోరిస్‌, అలిసన్‌ డూడి, రే స్టీవెన్‌ సన్‌ నటిస్తున్నారు.

నిర్మాతగా

నటుడిగానే కాకుండా నిర్మాతగా మారి 2016 లో సొంతంగా కొణిదెల ప్రొడక్షన్ స్థాపించి మెగాస్టార్ చిరంజీవి గారితో తొమ్మిదేళ్ళ తర్వాత 'ఖైదీ నంబర్ 150'  సినిమా తీసి అభిమానులకు సంబరాలను తెచ్చిపెట్టాడు. సంక్రాంతి కానుకగా విడుదలైన ఆయన రీ ఎంట్రీ సినిమా బాక్సాఫీస్ వద్ద వసూళ్ళ వర్షం కురిపిస్తూ దూసుకుపోయింది. తెలుగు సినీ పరిశ్రమలో అతి త్వరగా 100 కోట్ల గ్రాస్ వసూళ్ళు రాబట్టిన సినిమాగా 'ఖైదీ నంబర్ 150' నిలిచిందని ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ స్పష్టం చేశారు. ఈ సినిమాకు పెట్టిన ఖర్చు రూ.50 కోట్లు కాగా ప్రపంచ వ్యాప్తంగా 150 కోట్లకు పైగా వసూళ్లను కొల్లగొట్టింది. ఈ చిత్రాన్ని విజయపథంలో నడిపించడానికి తన వంతు కృషి చేసి నిర్మాతగా తోలి చిత్రంతోనే విజయాన్ని అందుకున్నాడు.

ఇక స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా ‘సైరా’ చిత్రం నిర్మించి, తన తండ్రి మెగాస్టార్‌ చిరంజీవి కలను నిజం చేశారు రామ్‌ చరణ్‌. ఈ చిత్రంలో చిరంజీవి తొలిసారి చారిత్రక యోధుడైన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పాత్రలో నటించారు. హీరోగా చిరంజీవి తొలి ప్యాన్ ఇండియా మూవీ. ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఏక కాలంలో రిలీజ్ చేసారు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో కొణిదెల ప్రొడక్షన్ పతాపంపై రామ్ చరణ్ భారీ ఎత్తున ఈ చిత్రాన్ని నిర్మించాడు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గురువు అయిన గోసాయి వెంకన్న పాత్రలో బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ నటించడం విశేషం. తెలుగు రాష్ట్రాల్లో 106 కోట్ల మార్క్ షేర్‌ను అందుకుంది సైరా నరసింహారెడ్డి. పెరిగిన దసరా సెలవులు నైజాంలో ఈ సినిమాకు బాగానే ఉపయోగపడ్డాయి. మొత్తంగా 240 కోట్ల గ్రాస్, రూ. 143 కోట్లు షేర్ ప్రపంచ వ్యాప్తంగా వసూలు చేసింది సైరా. ఇక మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఆచార్య’. ఈ సినిమాని నిరంజన్‌ రెడ్డి, రామ్‌చరణ్‌ లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో కాజల్‌ అగర్వాల్‌ కథానాయిక. ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం హైదరాబాద్‌లో ప్రత్యేకంగా వేసిన భారీ సెట్‌లో జరుగుతోంది.

వ్యక్తిగత జీవితం

రామ్ చరణ్ జూన్ 14 , 2012 న అపోలో హాస్పిటల్స్ చైర్మన్ ప్రతాప్ సి. రెడ్డి మనవరాలు అయిన ఉపాసనని పెళ్లి చేసుకున్నారు. ఇక రామ్ చరణ్ భార్యగా ఉపాసన మెగా ఫ్యామిలీతో మమేకైపోయింది. అంతేకాదు అపోలో హెల్త్ కేర్ బాధ్యతలు నిర్వహిస్తూ తనదైన శైలిలో సెలబ్రిటీల డైట్స్ గురించి ఇంటర్వ్యూలు చేయడమే కాదు, తనకు హెల్త్ విషయంలో తెలిసిన చిట్కాలను సోషల్ మీడియా ద్వారా మాములు ప్రజలకు అవగాహన కల్పిస్తోంది. తాను నిర్వహిస్తోన్న పత్రికల కోసం సెలబ్రిటీల ఇంటర్వ్యూలు కూడా చేస్తూ వార్తల్లో నిలిచింది. నిరుద్యోగులకు తన అపోలో హెల్త్ గ్రూప్‌‌లో ఏమైనా ఖాళీలు ఉంటే అప్లై చేసుకోమంటూ పోస్ట్ చేస్తూ నిరుద్యోగులుకు ఉద్యోగాలు కల్పిస్తూ బిజీగా ఉంటుంది. ఇప్పటికే రైతు అవతారం ఎత్తి తన ఫామ్‌హౌస్‌లో సేంద్రియా వ్యవసాయం చేస్తూ వార్తల్లో నిలిచింది. అంతేకాకుండా ఎప్పుటికప్పుడు సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది మెగా కోడలు. రామ్ చరణ్ ప్రముఖ నటుడు అల్లు రామలింగయ్య గారి మనవడు. అలాగే ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ఆయనకి మేనమామ వరస అవుతారు. ఇక టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్, రామ్ చరణ్ బావ వరస అవుతారు.

రామ్ చరణ్ అక్క సుష్మిత రంగస్థలం, ఖైదీ నెంబర్ 150, సైరా సినిమాలకు క్యాస్టూమ్ డిజైనర్‌గా పని చేసింది. అలాగే మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన నిర్మాతల్లో ఒకరిగా సుష్మిత కూడా స్థానాన్ని సంపాదించుకుంది. ఓ.టీ.టీలో ఓ సినిమాను సుష్మిత నిర్మించారు. శ్రీకాంత్, ప్రకాష్ రాజ్ వంటి నటులతో షూట్ ‘అవుట్ ఎట్ ఆలేర్’ సినిమా నిర్మించింది.

ఇక రామ్ చరణ్ బాబాయ్ పవన్ కళ్యాణ్ నటుడుగా మరియు రాజకీయాల్లో కూడా అసలు పరిచయం అవసరం లేని పేరు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ప్రభావం రామ్ చరణ్ మీద చాలా ఉంది అని ఆయన చాలా సార్లు ఇంటర్వ్యూలలో కూడా తెలిపారు. సిని పరిశ్రమలో ఆయనొక ప్రభంజనం అని ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు.

పెద్ద బాబాయి నాగబాబు గారు కుడా అందరికీ సుపరిచితుడే. నటుడిగా, నిర్మాతగా పరిశ్రమలో తనదైన ముద్ర వేశారు. 1988 లో అంజన ప్రొడక్షన్స్ స్థాపించి చిరంజీవి గారితో పలు విజయవంతమైన చిత్రాలతో పాటు, ఆయన కెరీర్ లో నిలిచిపోయే చిత్రాలను అందించారు. రామ్ చరణ్ తో కూడా ‘ఆరెంజ్’ చిత్రాన్ని నిర్మించారు. ఆ చిత్రం ఆశించినంత విజయం సాధించక పోయినా చరణ్ కెరీర్ లో మంచి చిత్రంగా నిలిచింది. ఆయన తనయుడు వరుణ్ తేజ్ కూడా పరిశ్రమలోకి అడుగుపెట్టి మంచి పేరు తెచ్చుకున్నారు. అలాగే సాయి ధరమ్ తేజ్ బావ మరిది వరస అవుతారు.

కేవలం నటుడిగా, నిర్మాతగానే కాకుండా వివిధ రంగాల్లో తన విశిష్ఠతను చాటుకున్నారు రామ్ చరణ్. ఆయన హైదరాబాద్ పోలో రైడింగ్ క్లబ్ యొక్క ఓనరు మరియూ మా టీ.వీ. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లలో ఒకరు. టర్బో మేఘా ఎయిర్వేస్ కి అనుసంధాన సంస్థగా కల్నల్ ఎల్.ఎస్.ఎన్ మూర్తి గారితో కలిసి ట్రూజెట్ ఎయిర్వేస్ ను స్థాపించాడు. కేవలం సిని రంగంలోనే కాకుండా వివిధ రంగాల్లో ఉంటూ అన్నిటిని సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు. ఇక 2013లో ఫోర్బ్స్ ఇండియా 100 సెలెబ్రిటీస్ లో రామ్ చరణ్ పేరు కూడా ఉండటం విశేషం.

వీరిద్దరూ కలిసి మగధీర, బ్రూస్లీ, ఖైది నెం 150 చిత్రాల్లో స్క్రీన్ షేర్ చేసుకున్నప్పటికీ పూర్తి నిడివిగల పాత్రల్లో ఎప్పుడూ నటించలేదు. కాని ఇప్పుడు చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఆచార్య’లో పూర్తి నిడివిగల పాత్రలో ఆయన నటిస్తుండడంతో ఇప్పుడు అభిమానుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. రామ్‌చరణ్‌ తన పెద్ద మనసును చాలా సార్లు చాటుకున్నారు. కష్టాల్లో ఉన్న ఓ ‘మెగా’ అభిమాని కుటుంబాన్ని ఆదుకొని నిజమైన హీరో అనిపించుకున్నాడు. 2019 డిసెంబర్‌ 8న మెగాస్టార్‌ చిరంజీవి ఫ్యాన్స్‌ అసోసియేషన్‌ గ్రేటర్‌ హైదరాబాద్‌ అధ్యక్షుడు నూర్‌ అహ్మద్‌(55) మృతి చెందారు. తమను ఎంతగానో ఆరాధించే అభిమాని చనిపోయిన వార్త తెలుసుకున్న మెగాస్టార్ చిరంజీవి హుటాహుటిన నూర్‌ అహ్మద్‌ ఇంటికి వెళ్ళి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అంతేకాదు వారిని ఆర్ధికంగా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. ఆ తర్వాత మెగా పవన్ స్టార్ రామ్ చరణ్ ఆ కుటుంబానికి రూ.10 లక్షల ఆర్ధిక సాయం అప్పట్లో ప్రకటించాడు. ఇచ్చిన మాటను చెర్రీ నిలబెట్టుకున్నాడు. ఆయన కుటుంబసభ్యులను తన ఇంటికి పిలిపించుకున్న చరణ్ రూ.10 లక్షల చెక్కుని వారికి అందజేశారు. వారితో మాట్లాడి యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నాడు.

అవార్డ్స్

  1. చిరుత, మగధీర సినిమాల్లో నటనకి నంది అవార్డ్ స్పెషల్ జ్యూరీ అందుకున్నారు.
  2. అలాగే ఫిల్మ్ ఫేర్ బెస్ట్ డెబ్యూ యాక్టర్ గా చిరుత సినిమాకి, బెస్ట్ యాక్టర్ గా మగధీర సినిమాకి మరియు రంగస్థలం సినిమాకి రామ్ చరణ్ ఫిలింఫేర్ అవార్డ్స్ గెలుచుకున్నారు.
  3. ఇక రంగస్థలం(2018) సినిమాలో నటనకి సైమ ఇంటర్నేషనల్ బెస్ట్ యాక్టర్ అవార్డ్ అందుకున్నారు.
  4. అలాగే సంతోషం ఫిల్మ్ అవార్డ్స్ లో బెస్ట్ యాక్టర్ గా మగధీర, గోవిందుడు అందరివాడేలే సినిమాలకి రామ్ చరణ్ అవార్డ్స్ అందుకున్నారు.
  5. 2009 లో మగధీర సినిమాలో నటనకి గాను రామ్ చరణ్ కి సిని మా బెస్ట్ యాక్టర్ అవార్డ్ కూడా వచ్చింది.
- Advertisement -

You might also like

You've successfully subscribed to Tollywood Latest News | Celebrities Profiles | Media9 Tollywood
Great! Next, complete checkout to get full access to all premium content.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.